కవిత్వం

నిండు దరహాసపు మందారాలు

17-మే-2013

చిమ్మని చీకట్లు కమ్ముకున్న రాత్రి
కనురెప్పలపై వాలుతున్న నల్లని మేఘాల్ని
చీల్చుతూ నిర్ధాక్షిణ్యంగా సుధీర్ఘ గ్రీష్మపు పగలు
తెల్లని మంచు ముత్యాల వాన కురిసే రాత్రి జాముల్లో సైతం
ఎర్రని చింత నిప్పుల్లా మండుతూ కన్నులు
చిక్కని నిదుర
ఎండిన చేదబావిలొ జారిన బొక్కెన
దప్పిగొన్న దేహాన్ని గిరగిరా తిప్పి
పగిలిన కలను గోడకేసి విసురుతాను
బురదమట్టిలొ చిందులేసిన
గీతమెదైనా విందామని
గాయపడినదైనా ఓ మువ్వ తగిలితే
రెప్పలపై చల్లగా అద్దుకుందామని
కనుచెలిమల్లోని ఆగాధ నిధిని తవ్వుకుంటానా
ఏదీ ….?
ఏ ఒక్క మంచు తునకా దొరకదు
ప్రాణవాయువును మింగిన కృష్ణ భిలం నిశిరాతిరి
గదినిండా ఇనుప కంచెల్ని నాటి
ఊపిరినీ బంధిస్తుంది
ఓ సుధీర్ఘ శ్వాసకై ఆశతో ..
చేతులు బార్లాసాచి
సీతాకోక చిలుకల రెక్కలకై గాలిస్తానా
ఏదీ…?
ఎక్కడా రెక్కల రెపరెపల రెమ్మల రాగం వినపడదు
మూతపడుతున్న రెప్పల తూములను తోసుకుంటూ
ధుఖం చెరువు తెగిపోతుంది

అక్షరాల జల్లు ఏదైనా
వెన్నెల కిరణాలను చల్లిపోవునులే అని
నెలవంకల పాత సందూక తెరుస్తానా
నా గూటి అక్షరాలన్నీ ఆత్మీయంగా చీకట్లనే రాలుస్తాయి
పుడమి ఒడిలో నెత్తుటి చాల్లల్లో
చల్లిన విత్తులుకదా! అక్షరాలు
రక్తమోడుతున్నా వెన్నెలనే వాగ్దానం చేస్తాయి
నడచివచ్చే మెరుపుకలల
అలల సంద్రాన్ని పూయిస్తా యి
చూద్దును కదా !
రెమ్మలపై సూర్యోదయాల్ని
రెపరెపలాడిస్తూ నిండు దరహాసంతో మందారాలు…