హేమంతంలో ఒక సాయంకాలం. దారికి అటూ ఇటూ పసుపు పొలాలు,అరటితోటలు,వాటి పరాగం.అద్దాలు దించి ఆ గాలిని గుండెనిండుగా తీసుకుంటే శక్తి వచ్చినట్లనిపించింది అతనికి.ఈ ప్రయాణం బొత్తిగా కొత్తవూరికయితే కాదు ,కాని ఎన్నేళ్లో అయిపొయింది వచ్చి.చదువంతా మహానగరాలలో, పరదేశంలో. తర్వాత వుద్యోగం ఢిల్లీలో. ఏవో కొన్ని ఉన్నభూములనీ చూస్తూవస్తున్న బాబాయి కాలం చేశాక రాక తప్పలేదు ఇప్పుడు. వచ్చే ముందు ఫోన్లలో పరిస్థితులు కనుక్కున్నాడు,ఆ వ్యవహారమంతా ఒక కొలిక్కి వచ్చేటప్పటికి ఆరేడు నెలలు పట్టేటట్లుంది.
ఒక పెద్ద పట్టణానికి దగ్గ్రగా వున్న ఈ పల్లెటూళ్లో ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం వుందనీ,అక్కడ కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ అధ్యాపకుడిగా కావాలనీ విన్నప్పుడు యథాలాపంగా పెట్టిన దరఖాస్తుకి వాళ్లు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పేశారు.ఒక సంవత్సరం చేసి చూద్దామని నిర్ణయించుకుని ఈ ప్రయాణం.
ఊరిమొదట్లోనే యూనివర్సిటీ..పెద్ద గ్రంథాలయపు భవనం.తన క్వార్టర్స్ కి ఎలావెళ్లాలో కనుక్కునేందుకు ఆగాడు అతను.అప్పటికి పొద్దు వాలిపోతూ వుంది.ఆ మసక వెన్నెలలో ఆమెని చూశాడు.. కలువపూవులమాల వంటి ఆమెని. ఆంగ్ల కవిత్వం పడచదివిన అతను పలవరించాడు ..’ షి వాక్స్ ఇన్ బ్యూటీ ‘ .నిజానికి బైరన్ పద్యాన్ని దాటిన అలౌకికత అక్కడ అతని మనసుకి తట్టింది .
చిన్నపిల్లవాడా తనేమయినా!ముప్ఫయి రెండు నిండాయి, నవ్వుకున్నాడు.
త్వరగానే స్థిరపడిపోయాడు కొత్త వుద్యోగంలో.
ఆమెగురించి తెలుసుకోవాలని..ఎట్లా,ఎవరిని అడగాలో ..
మరొక రోజున కాంటీన్లో.అక్కడ అప్పటిదాకా మిలమిలలాడుతున్న విద్యార్థినులంతా తేలిపోయారు ఆమె లోపలికి రాగానే.ఏమి ధరించిందీ ఎట్లా అలంకరించుకుందీ అనే విషయమే పట్టినట్లు లేదు ఆమెకి,చూస్తూ వున్న ఇతనికి కూడా. ఆ ఉనికి ఒకప్రీ రాఫెలయిట్ చిత్రంలాగా వుంది. చూపులు ఇక్కడయితే లేవు.
ఇంకొక నాలుగు రోజులు అలాగే గడిచాక గమనిస్తున్న సహోద్యోగీ,కొత్త స్నేహితుడూ అయిన ఆనంద్ అడిగాడు-’పరిచయం చేయనా ‘ అని.చటుక్కున అనేశాడు ..’అంతకన్నానా’..
‘ఇతను రాహుల్.కంప్యూటర్ సైన్స్ హెడ్ .కార్నీజి మెల్లాన్ లో చదివారు,ఢిల్లీ యూనివర్సిటీనుంచి వచ్చారు ‘ ‘తను శ్వేత .ఈ పక్కనే రెసిడెన్ షియల్ కాలేజ్ వుందికదా..అక్కడ సంస్కృతం చెప్తారు ‘.
ఆమె వైఖరి లో చిన్న గమనింపు .తనలోని దేనికో తెలియకపోయినా అతనికి సంతోషం.
మెల్ల మెల్లగా పరిచయం పెరిగింది. ఇద్దరికీ సంగీతం ఇష్టం,కవిత్వం ఇష్టం. ‘ ఇద్దరికిద్దరూ ఏకాలంలోనో ఆగిపోయారు ‘ వెక్కిరించేవాడు ఇద్దరికీ స్నేహితుడయిన ఆనంద్.అయితే ఆ అభిరుచులలో వారి ప్రాధాన్యతలు వేరు వేరు.ఆమె అప్పుడే ఒక విషాద స్వప్నం లోనుంచి మేల్కొన్నట్లుండేది.అతను సౌందర్యాన్ని సమీపించి హత్తుకునేవాడు. ఉత్తరాది లో పెరిగిన అతను భూప్ వింటూ వుంటే
‘ ఇది మోహన కదా ‘ అని పెదవి విరిచేది ఆమె.ఇంత ఉల్లాసం అవసరమా అంటున్నట్లుండేది అతనికి.ఆమెకి పంతువరాళి ఇష్టం.అంత ఆర్తిని అతను తట్టుకోలేకపోతే స్వరవర్జితం చేసి హిందోళంలో ఆగేది ఆమె.’ అమ్మయ్య, ‘మాల్ కౌన్స్ ‘ అనుకునేవాడు అతను.
ఆమె ‘ లేడీ ఆఫ్ షాలట్ ‘ ని తడిసిపోయిన గొంతుతో చదువుతూ వుంటే భరించటం కష్టమయేది అతనికి.విలియం వాటర్ హౌస్ ఆ నాయికని చిత్రించిన తీరు స్ఫురించి వణికిపోయే వాడు .ఆమె కరుణించి ‘టు ఎ స్కై లార్క్ ‘ చదివి ఓదార్చేది.
ఇదంతా కల్పించి ‘ శృతి చేసిన ఉన్మత్తత ‘ లో వాళ్లు ఒకరిని ఒకరు ఆస్వాదించారు,దగ్గరయారు.
ఆమె గాంభీర్యం తగ్గుతూ వస్తోంది అతని దగ్గర.ఒకసారి అడిగింది..’మీ పేరుకి అర్థం ఏమిటి? ‘అతనికెక్కడ తెలుస్తుంది!సంస్కృతాంధ్రాలలో అతను సున్నా.
నేనే చెప్తాలెండి.’ .దుఃఖాలని జయించినవాడని అర్థం.బాంధవుడని కూడా.. ‘
అతను వుడుకుమోతుతనం తో..’ మీ పేరుకి అసలు ఏమి అర్థముంది?తెల్లనిది అంతే కదా! ‘
‘ నా పూర్తిపేరు మహాశ్వేత కదా ‘
‘ అయితే ఇంకా బుర్ర తక్కువ పేరులా వుంది.’ బాగా తెల్లనిది ‘ అని ఎవరయినా పేరు పెట్టుకుంటారా? ‘
ఆమెకి విపరీతంగా నవ్వు వచ్చింది.నవ్వి నవ్వి అన్నది’ శ్వేత అంటే స్వచ్చమైనదని కూడా అర్థం వుందండీ.
..’ కాదంబరి ‘కావ్యం లోది ఆ పేరు.’ ఇంకేమీ అడగకుండా వెళ్లిపోయి వైకీపీడియా వెతికాడు.బాణభట్టు అనే కవి రాసిన సంస్కృత కావ్యం అది.కాదంబరి,మహాశ్వేత అందులో నాయికలు.మహాశ్వేతది సుదీర్ఘ విరహం.ప్రేమించినవాడికి దూరమయి యేళ్లకి యేళ్లు గడిపిన స్త్రీ.ఆమె ఎదురుచూపు ఫలించి చివరికి అతను తిరిగి వస్తాడు, మధ్యలో మరొక జన్మ యెత్తి,ముగించి. ఆ కథ తెలుసుకుంటూ వుంటే అతనికితను చదివిన రైడర్ హగ్గార్డ్ నవల ‘ షీ ‘ గుర్తొచ్చింది.
ఆ రోజు పొద్దుటినుంచీ పెద్ద వాన.ఆమె గొడుగు విప్పబోతూంటే అతను వద్దని ఆమె ఇంటిదాకా దిగబెట్టాడు .చుట్టూ తోట,గిలక బావి.కాలయంత్రంలో వెనక్కి వెళ్లినట్లుంది అతనికి.వాళ్ల నాన్నగారిని పరిచయం చేసింది.అలిసిపొయిన అగ్నిశిఖలాగా వున్నాడు ఆయన.పెద్ద హాల్ లో చుట్టూ పుస్తకాలు.ఒక మూలగా రాత బల్ల,కాయితాలూ,నోట్ పుస్తకాలు.’ అంధ్ర మహా భారతానికి నిఘంటువు రాస్తున్నారు .ముఖ్యంగా తిక్కనగారు ఎన్ని పదాలు వాడారో అన్నిటినీ వాడుక తో సహా వివరించాలని ‘.
‘ శ్వేత చాలా సాయం చేస్తోంది. నేనుండగా పూర్తి అవుతుందో లేదో ‘దిగులుగా అన్నాడు ఆయన.
‘ లేదు లెండి..అయిపోతుంది ‘..అప్రయత్నంగా అన్నాడు రాహుల్.సంతోష పడ్డాడు ఆయన.ఇల్లంతా చూపించింది.పాతకాలపు అమరిక,అలంకరణ.ఒక గదిలో పెద్ద చాయాచిత్రం, ఆమె తల్లిది .ఇంకో పదేళ్లకి శ్వేత అలా వుంటుందేమో.
నువ్వు,మీరుల మధ్యలో ఆగుతూన్న సంభాషణలో..
‘ అచ్చు మీ అమ్మగారి పోలిక ‘
‘ అది అదృష్టం కాదు కదా ‘
‘ నమ్ముతారా అలాంటివి?’
‘ ఏమో.వెనక్కి చూసుకుంటే అలాగే అనిపిస్తుంది ‘.
విదేశంలో వున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు,తిరిగి వచ్చాక చేసేవాళ్లు లేకుండాపోయారు.మాట్రిమొనీ వెబ్ సైట్ లలో తనని తను ప్రమోట్ చేసుకోవటం మొహమాటంగా అనిపించేది.
సంవత్సరం గడిచిపోయింది అతను వచ్చి.ఇంకొక నాలుగు రోజుల తర్వాత ..
శీతాకాలపు అపరాహ్నం.జూకా మల్లె,మాలతి,కలిసిపొయి అల్లుకున్న పందిరికింద వాళ్లిద్దరూ .చుట్టూ చిన్న చిన్న పింగాణీ కుండీలలో చిట్టి రోజా పూలు.
పువ్వులు కోయాలని లేదు అంటూ అతను ఒక చిన్న కుండీని పైకి ఎత్తి ఆమెకి ఇస్తూ అనేశాడు..’నన్ను పెళ్లి చేసుకో శ్వేతా ‘.చేసుకుంటావా అని ఛాయిస్ ఇవ్వాలనిపించలేదు అతనికి.శ్వేత కళ్లలో ఆశ్చర్యం,ఆహ్లాదం..అవిమాయమయి ఎప్పటి దిగులు . మళ్లీ ఆశ, కాంతి..!
పరీక్ష రాసి పాస్ అవుతానని తెలిసి ఫలితం కోసం ఎదురుచూసేవాడిలాగా గడిపాడు ఆ రాత్రిని..తీయటి .ఆలోచనలతో.
అతని ఊహ నిజం కాలేదు.ఏడ్చి ఏడ్చి వాచిపోయిన కళ్లతో కనపడింది.
‘ ఎందుకు ‘?
‘ నువ్వంటే ఇష్టం,చాలా ఇష్టం.’
‘మరి? ‘
నీకు ఎట్లా చెప్పాలో తెలియటం లేదు..నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నా..పన్నెండేళ్లుగా! ‘
‘అయితే?’
‘అతను రాడు ‘
ఆమె ఆ క్షణంలో ఎదిగీ ఎదగని అమ్మాయిలా కనిపించి అతనికి నవ్వొచ్చేసింది,కోపం పోయి.
ఆమెకి అర్థమయి రోషమొచ్చింది.’ నీకేం తెలుసు?ఏం తెలుసని? ఆ?’మండిపోతున్నాయి మాటలు.
‘ లేదు లేదు..చెప్పు..వింటాను ‘
‘నేను ఇంటర్మీడియట్ లో వున్నాను .ఇక్కడ ఈ కాలేజ్ మాత్రమే వుండేది అప్పుడు.
కొత్తగా బిల్డింగ్స్ కడుతున్నారు యూనివర్సిటీ కోసం.ఆ పనులలో సూపర్ వైజర్ అ త ను .’
ఆ మూడు అక్షరాలూ పలకటానికి చాలా కష్టపడింది.
‘ అతనే పలకరించాడు..ఆ తర్వాత రోజూ మాట్లాడుకునే వాళ్లం.అతను చాలా బాగా పాడేవాడు తెలుసా!నేను రాసేదాన్ని అప్పుడు.రోజూ..రోజూ ఒక కవిత..అతని గురించి,అతని కోసం.నా రాత్రీ నా పగలూ నా ప్రతి నిమిషం అతని కోసం ‘
వింటున్నాడు.ఆమె గొంతు,ఆమె కన్నీళ్లు ఆ ముఖం..ప్రేమా దుఃఖమూ కలిపి మలచిన ప్రతిమ లాగ ఆమె.
‘ అతను పాలిటెక్నిక్ చదివాడు.ఎన్ని ఊహించుకునేవాళ్లమో ..కాస్త వెసులుబాటు రాగానే అతను ఇంకా చదువుకుంటాదు ,నా చదువు అయిపోయాక పెళ్లి.ఎప్పటికీ అతనితోనే వుండే కాలం కోసం ఎదురు చూస్తూ వున్నప్పుడు
నాన్నగారికి తెలిసింది.ఒప్పుకోలేదు.ఏవేవో అభ్యంతరాలు,అర్థం లేని వాదనలు.
అతను వెళ్లిపోదాం రమ్మన్నాడు.నేనూ సిద్ధపడిపోయాను.కాని.. ఏడుస్తోంది ఆమె.’ అమ్మకి అప్పుడే చాలా జబ్బు చేసింది.నేను ఒక్కదాన్నే వీళ్లకి.ఆ స్థితిలో వదిలేసి వెళ్లలేకపోయాను.
అతను ఆర్ధికంగా స్థిరపడాలని గల్ఫ్ వెళ్లాడు.ఉత్తరాలు రాసేవాడు నా స్నేహితురాలి అడ్రస్ కి.కాయిన్ బాక్స్ నుంచి వాళ్ల కంపెనీ ఆఫీస్ కి మాట్లాడేదాన్ని.ఒక యేడాది అయిపోయింది.
అతను పనిచేస్తున్న రిఫైనరీ లో అగ్నిప్రమాదం.అతను..ఇంక లేడు.’
చాలా మెలిపెట్టే నిమిషాల తర్వాత..
‘నాకూ చచ్చిపోవాలనిపించేది.అమ్మ కోసం ఆగిపోయాను.ఆ తర్వాత అమ్మ కూడా లేకుండా పోయింది.
ఎందుకో తెలియదు..అప్పటికి ఆత్మహత్య కోరిక తగ్గింది.ఏదో చదువుకున్నాను,వుద్యోగంలో చేరాను.నాన్నగారికి నన్ను పలకరించటానికే భయం వేసేది.కొన్నాళ్లకి ఆయన మీద కోపమూ తగ్గింది.చాలా రోజుల తర్వాత ఆయన పెళ్లి ప్రస్తావన తెస్తే చాలా పొట్లాడాను,బెదిరించాను.వుండిపోయాను.పది సంవత్సరాలు నిఘంటువు పనిలో మునిగిపోయాను.
ఎవ్వరూ,ఇంక ఎవ్వరూ నన్ను కదిలించలేరు.అతని చోటులో ఎవరినీ వుంచలేను. ‘
కరుగుతున్న కాంచనం లాగా కాగిపోతోంది ఆమె.ఆ తపస్సు కి అర్థం తపించటమే,ఇంకేమీ లేదు.
ఎప్పుడు చీకటి పడిందో గమనించలేదు వాళ్లు.దీపాలన్నీ వెలిగాయి.
అప్పుడు అంది ఆమె..’ నీతో వుంటే నాకు చాలా బావుంటుంది.ఎంతో హాయిగా వుంటుంది.చాలా రోజులక్రితమే అర్థమయింది నాకు.
పెళ్లి చేసుకోమని కదా అడిగావు..చేసుకుంటాను.అతన్ని మర్చిపోవటం మాత్రం అడగద్దు. అలా అయితే నీతో వుండగలను! ‘
‘నువ్వు..నువ్వు అతని తర్వాతే!ఒక్క ఉదుటున ఆ మాటలు అనేసింది.
అతను గాయపడ్డాడు ,ఉక్రోషపడ్డాడు,ఖేదపడ్డాడు..అర్థ గంటలో అన్నిసార్లు చచ్చి బతికాడు.చివరికి తెలుసుకున్నాడు.
‘నాకు ఇష్టమే శ్వేతా..నువ్వు ఎలావున్నా నాకు కావలసిందే.అంతే.’
ఇంకే స్త్రీకి అయినా ప్రథముడిగా వుండటం కంటే ఈమెకి ద్వితీయుడుగా వుండటంఎక్కువ అనిపించింది అతనికి.కాదు,ఇందులో ఎక్కువ తక్కువల ప్రసక్తి ఏమీ లేదు..ఆమె తనకి అంత అవసరం అంతే. అనుదినమూ ఆ గతించిన మనిషి నీడతో జీవించగలడా..ఏమో..ఎవరు చెప్పగలరు..తన లాలనతో లాలస తో ఆమె పూర్తిగా తనది అవుతుందేమో!ఇంక కొన్నాళ్లకి ఒక పాప..ఇద్దరికీ సర్వస్వం అయిపోదా!జీవితం శుభంగా ,శోభగా గడవకూడదా!
అంతా స్థిరపడింది ఇంచుమించు..పెళ్లి రోజూ తర్వాతి అందమయిన ప్రయాణం. అన్నింటి తేదీలూ.శ్వేత ఉత్సాహంగా వుంది, అతను ఆహ్లాద లోకాలలో వున్నాడు .
.ఆ ముందు ఒక రోజున సిటీకి వెళ్లాడు అతను.కార్ సర్వీస్ కోసం. ఒక రెండు గంటలు పడుతుందని సౌకర్యంగా కూర్చోబెట్టారు.అతను తీరికగా కలలు కంటున్నాడు.ఒక్కసారిగా పెద్ద కలకలం అక్కడ.భార్యాభర్తలేమో ,తన వయసు మనుషులిద్దరూ ,ధగ ధగమనే దుస్తులలో,నగలతో బహుశా వాళ్ల పిల్లలూ.ఆ కొత్త మనిషి తిట్టేస్తున్నాడు అక్కడున్న అందరినీ.’ ఎప్పుడనంగా ఇచ్చాను..ఇంకా కాలేదంటారేం ..పిచ్చి పిచ్చి గా వుందా ? ‘ స్పేర్ పార్ట్ లు రాకపోతే మేమేం చేస్తాం..’ అన్నాడు ఒక వర్కర్ రోషంగా.ఆగంతకుడు ఒక్క దెబ్బ కొట్టాడు ఆ కుర్రాడిని.పెద్ద గొడవయిపోయింది.మానేజర్ వల్ల ఒక పట్టాన కాలేదు సర్ది చెప్పటం.ఈ హడావిడి అంతట్లోనూ అతని భార్య టీవీ సీరియల్ చూస్తూనే వుంది.పిల్లలు ఈలోగా ఆ గదిలో వస్తువులని సగం నేల మీద పరిచి ఇంకో సగాన్ని చింపి పోగులు పెట్టారు.చిరాకేసి రాహుల్ బయటికి వచ్చి కూర్చున్నాడు.వెనకాలే దిగబడిన
ఆగంతకుడు మాటలు మొదలెట్టాడు ఒక తీరూ తెన్నూ లేకుండా.’ఏ కారండి మనది?’ రాహుల్ చెప్పాడు.’అరే..అదెందుక్కొన్నారండీ..అసలు మైలేజీ రాదంట కదా ‘ .రాహుల్ కాదని ఓపిగ్గా జవాబు చెప్పాడు.’ మేవిప్పుడు తిరపతి దాకా ఎ ళ్లాలండీ..ముహూర్తం ఎమ్మెల్ల్యే గారబ్బాయిది.ఈళ్లేవో ఇట్టా జేశారు .మనదేవూరండీ? ‘చెప్పాడు రాహుల్.’ అట్టాగా.తిరుగు ప్రయాణంలో అక్కడ ఆగుదామనుకుంటున్నా లెండి.మాదసలు ఆ వూరే. ”నాకిరవై యేళ్లొచ్చేదాకా అక్కడే వున్నా.తర్వాత మస్కట్ ఎళ్లాలెండి ‘.
రాహుల్ కి విసుగు పుట్టబోతుండగా అతను ఇంకా చెప్తున్నాడు. ‘కొన్నాళ్లు పనిజేశా ..మిగిలింది లేదు.ఆనాక అదృష్టం తిరిగింది..’ గొంతు తగ్గించి అన్నాడు..’ ఇప్పుడు మీకు చెప్పినా చేటేమీ లేదుగా.. కంపెనీ డబ్బు చాలా వుండిపోయింది మన దగ్గర..ఆలోగానేమో అక్కడ మంటలు లేచాయి. ‘
ఉలిక్కిపడ్డాడు రాహుల్.’ మొత్తం మాడి మసయిపోయారు అక్కడున్నవాళ్లంతా. నేనూ వుండిపోయాననే అంతా అనుకున్నారు.మంచిదేగా! ‘ ‘ ఒక్కోసారి అట్టా కలిసొస్తుంది మారుపేరుతో వీసా పుట్టించి ఆ డబ్బు తోటి సరాసరి బొంబాయి లో దిగాను.పట్టిందల్లా బంగారమయింది.ఇంక మనకి తిరుగు లేదు.
ఆ వదిలేసొచ్చిన వూళ్లో ఎవరూ లేరులెండి..కాకపోతే..’అతను మాట్లాడటం ఆ పేస్తాడేమోనని భయపడ్డాడు రాహుల్. అతను కొనసాగించాడు..’ అక్కడ సంస్కృతం మేష్టా రొకాయన వుండాలి.వాళ్లమ్మాయి..మేవిద్దరం చాలా ఇదిగా వుండే వాళ్లం.పెళ్లీ చేసుకుందామనే!వాళ్ల నాన్న ఒప్పు కోలా.అప్పుడే దేశం వదిలేశాను.ఆ తర్వాత అట్టా జరిగిపోయింది.అంతా మన మంచికేగదా..లేకపోతే ఇంత సంపాదించి వుండే వాణ్ణా..!నేను బతికే వున్నా అని ఆ పిల్లకి ఎట్టా చెప్తానూ,గొంతుకి చుట్టుకోదూ!రెండుమూడేళ్లాగి చెబుదామనే అనుకున్నా. ఈలోగానేవో నాతో పాటు వ్యాపారం జేసే ఆయన నా కూతురిని చేసుకోమన్నాడు అప్పుడాలోచించా ..ఆ పిల్ల నన్నెప్పుడో మర్చేపోయుండాలి,తండ్రికిష్టంలేదుగదా.’
ఘటన ,రాసిపెట్టుంది మనకి.ఎందుకూ కాదనేదీ, దేవుడి దయ!ఆ పెళ్లి అయిన సంవత్సరానికి మావగారు పోయాడు అంతా నాకే రాసి..’తను ఎంత గొప్ప .అదృష్టవంతుడో అతను వివరించటం ఆగింది.లోపలి నుంచి అమ్మాయి వచ్చింది మమ్మీ పిలుస్తోందని.అతను లేస్తూ వుండగా చాలా చాలా జంకుతూ అతని పేరు అడిగాడు రాహుల్.చెప్పాడు.సరిపోయింది..అంతా సరిపోయింది!
ఇతనా శ్వేత ప్రేమించిన వాడు..అసలు ఇతను ఒకప్పుడు ఆ మాత్రం సున్నితంగా వున్నాడా?ఎంతో కొంత వున్నాడేమో ..అతను ఆ తర్వాత బ్రతికిన వాతావరణం,ఊరికే వచ్చి పడిన డబ్బు ఇంతలా మార్చేశాయా ..శ్వేత ఇతన్ని పెళ్లాడే వుంటే ఎలా వుండేవాడో వూహించుకోలేకపోయాడు రాహుల్.కాని
ఒక్కసారిగా ఉపశాంతిగా అనిపించింది.వెళ్లనీ,ఇతన్ని వెళ్లి శ్వేతని చూడనీ.ఇక తనకి శతృశేషం వుండదు జీవితాంతం.ఆమె తన సొంతం-తనఒక్కడికే సొంతం!ఇన్నాళ్లూ ఈ మనిషి కోసం ఎంత తెలివి తక్కువగా క్షోభ పడిందో తెలిసివస్తేగాని..
.రాహుల్ ఆలోచన ఆగిపోయింది.ఆమె ఎంత అఘాతానికి గురి అవుతుంది!ఇన్ని సంవత్సరాల వ్యర్ధవేదన ఎంత బాధ పెడుతుంది…
ఏ ప్రేమ,ఏ తపసు,ఏ గర్వం తాను ఇన్నేళ్లూ తనవి అని నిలబడిందో అదంతా అసలేమీ కాదని,లేదని తెలిస్తే ఆమె సమతౌల్యం ఎంత మిగులుతుందో ..కోలుకోవటంలో ఎంతగా వడలి పోతుందో.. ముందే పగిలివున్న ఆమెని అతుకుపెడుతుందా ఈ సంగతి..ముక్కలు చేస్తే?
అలాంటి పరిస్థితిని తాను ఆమెకి ఎందుకు కోరుకోవాలి!
ఆమెని ఆమెగానే వుండనీ..ఎంత వుంటే అంతే చాలు అతనికి!
ఆగంతకుడు అంతలో బయటకి వచ్చేశాడు.
ఈ సారి ఆమె పేరూ తండ్రి పేరూ చెప్పి అడిగాడు..’ఏవండీ వాళ్లున్నారా అక్కడ ఇంకా ? ‘
రాహుల్ చెప్పేశాడు ..’ లేరండీ.అలాంటివాళ్లెవరూ అక్కడ లేరు. ‘
కధ బాగుంది .. క్లుప్తంగా , గాధంగా .. చాలా ప్రేమలకి తపన అనేది తప్ప ఇంకేమీ ఉండదు అనే విషయాన్ని చెప్పటం చాలా కన్విన్సింగ్ గా ఉంది . కానీ, ప్రేమలో నిజం లేకపోవటం , ఒక అబద్ధపు మేడ ని పోషించాల్సి రావటం .. రాహుల్ భరించాల్సిన తపన… మీ మార్క్ భావుకత్వంలోంచి .. ప్రాక్టికల్ భావుకత్వంలోకి పడేసారు మైధిలి గారూ ..
ప్రేమ అనే భావనని ప్రేమించటం ,ఆ ప్రేమ కి ఉందనుకుంటున్న ఆలంబన గురించిన విచక్షణ లేకపోవటం చెప్పాలనే ప్రయత్నం సాయి పద్మ గారూ..ధన్యవాదాలు
నాకు తెలిసిన ఒకరిద్దరిని మీ కథలో చూసుకొన్నాను.
Liked it.
thank you..
వేగం, క్లుప్తత కట్టిపడేస్తున్నాయి. బాగుందండి!
thank you
thank you very much…
nacchindandi baagundi
thank you andii..
మైథిలి గారు
మీ కథలో నాయకుడు ఆమె పట్ల చూపిన అక్కర బాగుంది కాని, అంత మంచితనం ఉండదేమో లోకంలో! మీదిమంచికల.
thank you.. కామేశ్వరి గారూ..కలలు ఇవ్వటమూ అవసరమే కదా …
బాగుంది మైధిలీ కథ .ఇది కథ కాదు వాస్తవం. నిజం గా వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నా పన్నెండు సంవత్సరాల తరువాత ఆమె లో అతని పట్ల అంత గొప్ప ఫీలింగ్స్ వుండకపోవచ్చు .ఎప్పుడు కూడా వాత్సవం కంటే వూహే బాగుంటుంది .
అవును రాధా..నిజం.ఎన్నో కలిసి రావాలి ఆనందంగా జీవించగలగటానికి.
మనిషికి కాలంతోబాటు మరచిపోగల విద్య వున్నందుకు సంతోషంగా సగాగలడు.
thank you chakrapani gaaroo
మైథిలి గారు కథ బావుంది. రాహుల్ పాత్ర నచ్చింది.
thank you vanaja gaaroo..రాహుల్ నాకూ ఇష్టం
నిజంగానే ఇది ఓ మంచికల
కొన్ని సార్లు.. కొందరిని తిరిగి కలవక పోవడమూ
కొన్ని జరగక పోవడమూ.. అది మంచికా చెడుకా అన్న మీమాంసలూ..
అందమైన మిక్స్డ్ షేడ్స్ అవుతాయి జీవితానికి
thank you jayashree gaaroo..very true.
‘అలాంటి పరిస్థితిని తాను ఆమెకి ఎందుకు కోరుకోవాలి!
ఆమెని ఆమెగానే వుండనీ..ఎంత వుంటే అంతే చాలు అతనికి!’ నిర్మలమైన అనుకంపన!
ఆహ్లాదకరమైన కథ, మంచి ముగింపు.. బాగా రాసారు మైథిలి గారూ..
ఆ నైర్మల్యాన్నే చెప్పాలని అనుకున్నానండీ ..మీ మాటలకి సంతోషంగా ఉంది
నా కథలోనూ మీ కథలోనూ కారు రిపేరు గరాజి దృశ్యం ఉండడం మంచి కోఇన్సిడెన్స్!
కథ బావుంది. కథ నిర్మాణ పరంగా నాకు ఒకట్రెండు అభ్యంతరాలున్నాయి కనీ కథని ఆస్వాదించడానికి అవి అడ్డురాలేదు. ఈ వేసవి మధ్యాన్నం వట్టివేళ్ళ తడికలోనించి వీచే పిల్ల తెమ్మెర అనుభూతినిచ్చారు.
Thank you
thank you sir..
Hmm.. Couldn’t connect to this one. Felt like it was straight out of 70s.
Its ok yaaji gaaroo…[.i wrote this in my 13 th yr..:)]
Beautiful narration though slightly overwritten! Ending is tasteful.
thank you teresa gaaroo..
Mee main point of prema ane bhavanni preminchatam … Agree avuthanu. You have a very poetic way of describing places and conversations. Rahul teleekunda athanu thana jeevitha(nera) charitra cheppadam asahajam ga undi.
manushulu maratharu ….nijame mugimpu bagundi
thank you siva nageswara rao gaaroo
thank you..nijameaneamoenandii
వారి వివాదాస్పద [నేర] చరిత్ర ని ఒక అచీవ్ మెంట్ గా చెప్పుకునేవారిని చూశానండీ నేను.ఇటీవలి కాలంలో దేన్నయినా సమర్ధించుకోగల ధోరణి పెరిగింది..అది అసహజంగా అనిపించవచ్చు కానీ అసాధ్యం కాదు.అక్కడే అప్పుడే ఎందుకు జరిగిందీ అంటే అది కథ.సృష్టిలోనూ వైచిత్రి ఉంటుంది.
‘ ఇది మోహన కదా ‘ అని పెదవి విరిచేది ఆమె.ఇంత ఉల్లాసం అవసరమా అంటున్నట్లుండేది అతనికి…………‘టు ఎ స్కై లార్క్ ‘ చదివి ఓదార్చేది.ఇదంతా కల్పించి ‘ శృతి చేసిన ఉన్మత్తత ‘ లో వాళ్లు ఒకరిని ఒకరు ఆస్వాదించారు,దగ్గరయారు.——- భలే రాశారు ! చమత్కారమున్న కథాంశం , కథనం హాయిగా సాగింది.కథ మొత్తంగా చూస్తే ఎత్తుగడ మోనే తైలవర్ణ చిత్రంలా గాఢం గానూ ,ముగింపు తేలికైన రేఖాచిత్రం లానూ అనిపించింది.
మీ స్పందనకి చాలా సంతోషం నాగలక్ష్మి గారూ.ఇంక కొన్ని కథలు రాసి పుస్తకం వేసే పరిస్థితి వస్తే రెండు భాగాలకీ విడివిడిగా పేర్లు పెడతానండీ.:)
కథ బాగుంది మైథిలీ, అభినందనలు.
thank you radhikaa
నా కథని ప్రశంసించిన,అర్థవంతంగా విమర్శించిన అందరికీ ధన్యవాదాలు.లోపాలని నాకు చేతనయినట్లు సవరించాలనిపించి రెండో భాగాన్ని తిరగరాశాను.ఆ వెర్షన్ ని నా బ్లాగ్ లో ఉంచాను.వీలయితే చూడమని ప్రార్థన.
http://nimagna.blogspot.in/
వైద్యవిద్యాపారంగతురాలిగానేగాక సహితీ సౌరభాలనందిచగల ధీశాలిననిపించుకున్నారు
.మీ ఎకధా సంవిధానంలో నూత్న మర్యాద కనబడుతున్నది. అభినందనలు.మన కధలు కంచిలో తలదాచుకోనక్కరలేదనీ అవసరంకూడారాదనీ ౠజువు పరిచారు.
ధన్యవాదాలండీ.మీ మాటలని అశీర్వచనాలుగా గ్రహిస్తున్నాను
చాలా కథల్లాగనే కథ కంటే కథనమే చదివించింది…మీ కథలెప్పుడూ కవితలే మైథిలీ గారు. చదవాల్సీనదె.
ధన్యవాదాలు వాసుదేవ్ గారూ.సంతోషం .
కథ బాగా రాసారు. అభినందనలు.
-ఆర్.దమయంతి.
ధన్యవాదాలు దమయంతి గారూ.
వాస్తవానికి భావుకతను జోడించిన మీ కథలు చదవడం ఓ చక్కని అనుభూతి మైధిలి గారు.
మీకు ఎన్ని ధన్యవాదాలో జ్యోతిర్మయి గారూ !
Great work. Keep writing
thank you Praveen garu