కథన కుతూహలం

మందులేని వైరస్ “జెలసీ”

ఆగస్ట్ 2013

పొసెసివ్నెస్ , నిజానికి ఈ మాటకు సరైన తెలుగు మాట లేదు. మనది అనుకున్న దాన్ని ఇంకెవరూ తాకి ఉండకూడదు , మనకే సొంతం కావలనే ఫీలింగ్. ఇది ప్రేమలో కొంత వరకు బాపు రమణ చెప్పినట్టు “ అసూయ ప్రేమకు ఘాటైన ధర్మామీటర్” అంటే ఒప్పుకోవచ్చు కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇది జెలసీ గా రూపాంతరం చెందిందా చచ్చామన్న మాటే . పాపం ఇలా ఒకరి జెలసీ కి బలై పోయిన వ్యక్తులెందరో . అలాంటి ఒక కధ చలం “జెలసీ” . ఇందులో చలపతి రావు చాలా ఆదర్శవంతుడు. పెళ్ళయి మొగుడు పోయిన విధవనే పెళ్ళాడుతానని తలంచి అలాగే తన అభీష్టం నెరవేర్చుకున్నాడు , ఇంతవరకు బాగానే ఉంది.

ఇది రచయిత తన మిత్రుడు గురించి చెప్పే కథ . తన ముందు ఎంతో ఆదర్శంగా నటించిన మిత్రుడు అసలు రూపం తెలుసుకున్న మరో మిత్రుని వ్యధ. రైల్ బండి అందక తిరిగి వఃచ్చి భార్యాభర్తలని ఎందుకులే డిస్టర్బ్ చేయడమని వరండా లో పడుకున్న మిత్రుడికి లోనుండి తన ఆదర్శవంతుడైన మిత్రుని అసలు రూపం ఎలా తెలుస్తుందంటే . ఆమె వేడికోలు గా మాటాడుతోంది ఏడుపు గొంతుతో , ఎందుకు అంటారా సదరు భర్త గారు వేస్తోన్న అద్భుతమైన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక. ఇంతకీ అంత సమాధానం చెప్పలేనంత గొప్ప ప్రశ్నలేమనగా , ఆమె మొదటి భర్త తొలి రాత్రి ఆమెను ముందుగా ఏమి చేసేడు ?, అతనితో ఆమె స్వర్గ సౌఖ్యం అనుభవించిందా ? మరి ఇప్పుడు తనతో ఉంటున్నప్పుడు ఆయనతోని అనుభవం గుర్తొస్తోందా? ఇంటికి వచ్చిన తన మిత్రుడి పట్ల కూడా ఆమెకు ఆకర్షణ కలిగిందా ?ఆయన పోతే తనని చేసుకున్నట్టు మళ్ళీ మరో వ్యక్తిని చేసుకుంటుందా ? ఆహా !!! మగ వాడా నీకు జోహార్లు !! ఈ అద్భుతమైన ప్రశ్నలకు సమాధానం ఆమె చెప్పి తీరాలి చెప్పక పోతే ఊరుకోక హింశిస్తాడు.

ఇదండీ లోపల జరుగుతోన్న ఆదర్శ దాంపత్య భాగోతం .

అతి చిన్న కథ లో చలం ఇమిడ్చిన అతి భయంకరమైన ఎయిడ్స్ కంటే భయంకరమైన మనుష్య జాతికి ఆదిలోనే సోకిన మందులేని వైరస్ ఈర్ష్య గురించి ఎంత బాగా చెప్పేడు అనిపిస్తుంది. కొందరు అంతే బయటికి వెళ్ళి వచ్చాక తల పాగాలు తీసి వంకీలకి తగిలించినట్టు మర్యాదలు తీసేసి అసలు రంగులు బయట పెదతారు అంటాడు చలం.

అసలు ఈ జెలసీ అనేదే లేకుంటే లోకమిలా ఉండేదా ? అణువు నుండి బ్రహ్మాండం వరకు ఈ జెలసీ స్వరూపాలు మనం చూస్తూనే ఉన్నాం. వైయుక్తికమైన విషయాలనుండి ప్రాపంచిక యుద్ధాలవరకు ఏమి జరిగినా ఈ జెలసీ వలననే కదా .

స్త్రీ తన సొంత మైన ఆస్తి అని భావించిన క్షణం నుండి మగాడు ఆమెను మానసికంగా దైహికంగా ఎంత హింసకు గురి చేస్తున్నాడు. ఇంత ఆదర్శంగా పెళ్లాడిన భర్త అలా రోజూ హింసిస్తోంటే ఏమి సమాధానం ఇవ్వగలదు ఆ భార్య . ఆర్ధికంగా , అన్నీ విధాలా భర్త మీదే ఆధార పడిన ఒక స్త్రీ ఏమని ఎదిరించగలదు ? అతని నోరు ఎలా మూయించగలదు?

జాలేస్తుంది కదూ కానీ మనమందరము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ జెలసీ కి గురయిన వాళ్లమే, ఏదో వైపున మనము ఉన్నాం ఇందులో.

ఏ తాత్వికుడు చెప్పినా , ఏ అధ్యాత్మిక గురువు చెప్పినా ముందు వదిలెయ్యమనేది జెలసీనే. ఆయనని కాదని మరో గురువు దగ్గరికి నువ్వెళ్ళావాని తెలిసిందో ఈ గురువు గారు జెలసీ బారిన పడతారు . నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్తితి ఇది . ఈ జెలసీ కి తన పర బేధా భావం లేదు . ఎవరి పట్ల అయినా కలగవచ్చు. ఈ వైరస్ కి టీకా మందులేవీ కనిపెట్టబడలేదు . కనిపెట్టలేరు కూడా . ఇది చదవడానికి ఒక మామూలు చిన్న కధ లాగే అనిపించినా ఇందులో ఉన్న విషయం మాత్రం ప్రపంచాన్ని కుదిపేసే రోగం . ఇది పోనీ అంటు రోగం కూడా కాదు స్వతహాగా మనం ఊపిరి పీల్చుకున్నంత సహజంగా మనలో ఉన్న ఇమిడి పోయిన దరిద్రపు జబ్బు .

ఒకే సమయం లో ఇరువురు మనుషులు ఒక మనిషి మనసు లో ఉండకూడదా? అన్న ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పగలమ్. అది ఒక స్త్రీ అయితే , అసలు ఆమెని, అయితే దేవతని లేదా బానిసని చేసి పడేశామేమే తప్ప , ఆమెలో లైంగికత ఉంటుందని ,దాన్ని గౌరవించాలని ఎప్పుడైనా మధ్య తరగతి మనస్తత్వం ఉన్న మనిషి ఆలోచించాడా ? ఇన్ని విషయాలను ప్రశ్నిస్తుందీ చిన్ని కథ .

నాటి చలం నుండి 70ల్లో ఓషో చెపుతోన్న విషయం స్త్రీ కి కూడా లైంగికత ఇష్టా ఇష్టాలు కామ ప్రకోపాలు, వ్యక్తిత్వం ఉంటాయని వాటిని మన్నించాలని. అబ్బే ఇలాంటివి ఎవరికీ పట్టినట్టుండవు . తనకి దక్కని ఆడది మరొకడికి దక్కకూడదని ఏదో చేస్తాడు ఒకడు .
ఈ కథ కేవలం స్త్రీ దృక్పధం నుండి రాసినప్పటికి ఈ జెలసీ కి లింగ బేధం ఉండదు సుమండీ. ఇదే మునిపల్లె రాజు గారి ఒక కధలో ఎన్నేళ్ళకో తిరిగి వచ్చిన చెల్లెలుని తాను ఇష్టపడే బావ ఇష్టపడుతున్నాడని గ్రహించి , కొలనులో ఈత కొడుతుండగా ఆమెను చివరికి లోతుకీ తీసుకెళ్లి ముంచేస్తుంది . ఎంత మంది స్త్రీలలో, పురుషులలో మనమీ ఈసు అసూయ ని చూస్తున్నామో కదా . ఒక్కసారి మనల్ని మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలనిపించే కధ జెలసీ. నేనొక చిన్ని రెండు మాటల్లో ముగిస్తాను “ అణువంత అసూయే కదా అణిగి పోతుంది లెమ్మనుకున్నాను , అణ్వాస్త్రమై కూచుంది” ఎప్పుడో రాసుకున్న నా చిరు కవిత ఇది . జెలసీ చిన్న అణువు లో బ్రహ్మాండాన్ని ఇమిడ్చి నంత పెద్ద కధ . అందుకే ఈ కధను ఇలా పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను .