ప్రత్యేకం

అబద్ధాలలో ఎంత సృజన…!

16-ఆగస్ట్-2013

ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ   ‘ఆత్మకథాంశాల  ఉత్తరాలు’  పుస్తకం ఇటీవల విడుదలయింది.    దీనిలోని  ఓ వ్యాసం ‘రచన’ మాసపత్రికలో  రావటం-  దానిలోని ఓ ప్రస్తావనకు   ‘జ్యోతి’ మాసపత్రిక ఎడిటర్  లీలావతి  అభ్యంతరం చెపుతూ లేఖ రాయటం-  చర్చ ముగిస్తున్నామంటూ  ‘రచన’ పత్రిక   ప్రకటన … ఇదీ ఈ  వ్యాసం నేపథ్యం!  


(నా ఆత్మకధలో ఒక పేజీ ) 

ది, 1972 లో జరిగి, 40 ఏళ్ళకు పైగా మరుగున వుండిపోయి, 2013 ఏప్రిల్ లో బట్టబయలై, నా మీద అబద్దాల వర్షం కురిపించిన సంఘటన!

 

నేను, 1972 నాటికి, కొన్ని కధలూ, నవలలూ, రాసి వున్న దాన్నే. అప్పటికి, “కృష్ణవేణి, పల్లెటూరు, ఆండాళమ్మ, పేక మేడలు, బలిపీఠం, కూలిన గోడలు, ఇదే నా న్యాయం” వగైరా నవలలన్నీ రాసేసి వున్నాను. రచనా వ్యాసంగం అలా వుండగా, ఇంకో పక్క సంసార కూపంలో తల మునకలుగా మునిగిపోయి వున్నాను.

 

ఆ దశలో, అప్పటి వరకూ బతికిన కొంపని వదిలేసి, వైజాగ్ లోనే కృష్ణాబాయి గారి ఇంట్లో కొంత కాలం ఆశ్రయం తీసుకున్నాను. అప్పుడు నా దగ్గిర ఒక్క పైసా కూడా లేదు. అలాంటి దశలో మద్రాసు నించి, ‘జ్యోతి’ మాస పత్రిక నడుపుతూ వున్న లీలావతి గారు (అప్పటికే జ్యోతి రాఘవయ్య గారు లేరు) నాకు ఉత్తరాలు రాశారు. ఆవిడితో అంతకు ముందే చిన్న పరిచయం వుండడం వల్లే నాకు రాశారు. మద్రాసులో కొల్లి సత్యం గారు సినిమా తియ్యాలనుకుంటున్నారనీ, నాతో డైలాగ్స్ రాయించాలనుకుంటున్నారనీ, కాబట్టి నన్ను మద్రాసు రమ్మనీ, రాశారు లీలావతి గారు. నేను మొదట ఒప్పుకోలేదు. అక్కడికి వస్తే హోటల్లో వుండననీ, కాబట్టి రాలేననీ, జవాబు రాశాను. దానికి ఆవిడ, “మా ఇంట్లోనే వుందురుగాని, నేనూ పిల్లలే వుంటాము. మీ పని అయ్యేదాకా ఇక్కడే వుందురు గాని. కొల్లి సత్యం గారు మాకు స్నేహితులు. చాలా మంచివారు. మీరు తప్పక రావాలి” అని మళ్ళీ మళ్ళీ రాశారు.

 

నాకు కోర్టు కేసుల కోసం అయినా కొంచెం డబ్బుతో అవసరం వుంది. హోటళ్ళలో వుండడం కాదు గదా అని బైల్దేరి మద్రాసు వెళ్ళాను.

 

లీలావతి గారి ఇంట్లో అంతా మంచిగానే జరిగింది. ఆవిడికి ముగ్గురు కొడుకులూ, ఒక కూతురూ. అందరూ బాగానే వున్నారు నాతో.

 

నేను రాయడం మొదలుపెట్టిన సినిమా పేరు “ఇంటింటి కధ”. సత్యం గారు ఒక కధ ఇస్తే, ఆయనతో డిస్కస్ చేస్తూ నేను సంభాషణలు రాస్తూ వుండేదాన్ని.

 

అలా జరుగుతూ వుండగా, ఒక సాయంత్రం లీలావతి గారు నా దగ్గిరికి వచ్చి, “మీరు వెళ్ళిపోతే బాగుంటుందండీ. మా అమ్మాయి అంటోందండీ” అన్నారు.

 

నాకు అర్ధమే కాలేదు. “అదేవిటి? పని అయ్యేదాకా మీ దగ్గిరే వుండొచ్చు అన్నారు కదా? మీరు నాతో అలా చెప్తేనే నేను వచ్చానని మీ అమ్మాయికి చెప్పలేదా మీరు?” అని అడిగాను.

 

“పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదండీ? వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి కదండీ?” అన్నారు.

 

నేను ఇంకో రెండు మూడు మాటలు అడిగినా ఆవిడ మళ్ళీ మళ్ళీ, “పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదండీ” అన్నమాటే!

 

“పిల్లలు, ఈ నెల్లాళ్ళకే పెద్దవాళ్ళయ్యారా? పిల్లల ఆజ్ఞల ప్రకారమే నడుస్తారా మీరు?” అని ఒక్క మాట అడిగి, నా బట్టలు సర్దేసుకుని “సరే, సత్యం గార్ని రమ్మని వెంటనే ఫోన్ చేసి చెప్పండి” అని నా సామానుతో మేడ దిగి గేటు బైటకి పోయి అక్కడ కూర్చుని వున్నాను.

 

సత్యం గారికి ఫోను అందగానే ఆయన, భార్య గిరిజ గారితో సహా వచ్చారు.

 

“నేను హైదరాబాదు వెళ్ళిపోతాను. టిక్కెట్టు  కొని నన్ను పంపించెయ్యండి” అంటే,

 

“అయ్యో, అప్పుడే కాదమ్మా. మన పని పూర్తి అవలేదు కదా? మా ఇంట్లోనే వుందురు గాని” అని ఆ భార్యాభర్తలిద్దరూ చాలా చెప్తే, ‘సరే’ అని ఒప్పుకుని అక్కడికి మారాను. వాళ్ళు మంచివాళ్ళు. అక్కడ కొన్నాళ్ళు వున్నా, పని పూర్తి అవలేదు. హైదరాబాదు వచ్చేశాను. – ఇంత వరకూ జరిగింది, 40 ఏళ్ళ కిందట, 1972లో.

 

ఇప్పుడు, 2013లో జరిగింది ఏమిటంటే:  కృష్ణాబాయి గారి భర్త వేణు గారు పోయిన తర్వాత, ఆయన మీద ప్రేమతో, గౌరవంతో ఒక వ్యాసం రాశాను, “నన్ను ఆదుకున్నవారిని నేను మరిచిపోను” అని. ఆ వ్యాసాన్ని హైదరాబాదులోనే వున్న రచన మాస పత్రికలో ప్రచురణకు ఇచ్చాను. ఆ వ్యాసం, ఏప్రిల్ నెల (2013) సంచికలో వచ్చింది. ఆ వ్యాసంలో ఒక వాక్యం ఇలా వుంది:

 

మద్రాసులో లీలావతిగారు చేసినట్టు, కొన్ని రోజులు పోయాక, మీరు వెళ్ళండిఅనలేదు నన్ను, కృష్ణాబాయిగారింట్లో ఎవ్వరూ.

 

లీలావతి చేసిన పనికీ, కృష్ణాబాయి గారు చేసిన సహాయానికీ, ఎంత తేడా! ఆ తేడా చూపించడానికే ఆ వాక్యం అలా రాశాను.

 

నా వ్యాసం పడ్డ ‘రచన’ సంచికని లీలావతి చదివింది. అందులో తన మీద, 40 సంవత్సరాల తర్వాత బైటికి వచ్చిన ఆ విషయం చూసింది. అప్పుడు ఆవిడేం చెయ్య దల్చిందంటే, ‘రంగనాయకమ్మ పచ్చి అబద్దాల కోరు’ అని చెప్పదల్చింది. ‘రచన’ పత్రికలోనే, మే నెల సంచికలో ఒక పెద్ద ఉత్తరం రాసింది. ‘రంగనాయకమ్మని నేను పిలవలేదు. ఆమె వేరే పని మీద వచ్చింది. నాతో పోట్లాడి మా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నేను వెళ్ళమని అనలేదు’ అని చెప్పదల్చింది.

 

ఇప్పుడు, లీలావతి ఉత్తరంలో వాక్యాలు వరసగా చూడండి:

 

లీలావతి: “2013 సం. ఏప్రిల్ ‘రచన’ పత్రిక చదివాను. దానిలో, రంగనాయకమ్మగారి ప్రత్యేక రచన ‘నన్ను ఆదుకున్నవారిని నేను మరిచిపోను’ అన్న వ్యాసం కూడా ఒకటికి రెండు సార్లు చదివాను. ఈ వ్యాసంలో రంగనాయకమ్మ గారు ఒక అమూల్యమైన వాక్యమును కూడా వెల్లడించారు. అది, ‘మద్రాసులో లీలావతి గారు చేసినట్లు కొన్ని రోజులు పోయాక, మీరిక వెళ్ళండి అని కృష్ణ గారింట్లో అనలేదు’. ఈ వాక్యమునకు పూర్వాపరములు తెలియచెప్పక, ఒక అసత్యాన్ని సత్యముగ రంగనాయకమ్మ చెప్పడం జరిగింది. కాబట్టి, దీనికి వివరణ ఇవ్వవలసిన బాధ్యత, ధర్మము, నాకు ఉన్నది.”

 

(రంగనాయకమ్మ, అసలు సంగతి చెప్పకుండా అసత్యాన్నే చెప్పిందట! కాబట్టి, లీలావతి ధర్మంగా, బాధ్యతగా చెబుతోంది, వినండి!)

 

లీలావతి: “అసలు రంగనాయకమ్మగారు ఆ విషయం వ్రాయటానికి జరిగిన సందర్భంలోకి వద్దాం. …. సినిమా రంగమునకు సంబంధించిన ఒక యువకుడు సునీల్ చౌదరి, సినిమాను తీయవలెను అనే కోరికతో వున్నాడు. ….. అదే సమయంలో మా అన్నగారికి కూడా సినిమా తీయాలనే ఆలోచన ఉండడంతో, వీరిద్దరిని మా సన్నిహిత మిత్రులు కలిపి…. రంగనాయకమ్మ గారి బలిపీఠం తీయడానికి  నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకమ్మగారితో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా రంగనాయకమ్మగారు ఆమోదించడం జరిగింది……. డైలాగ్స్ కూడా రంగనాయకమ్మగారే రాస్తే బాగుండును కదా అని ఆమెను సంప్రదించడం కూడా జరిగింది…… ఆమె మద్రాసు వస్తే ఒంటరిగా హోటల్ లో ఉంచితే అనుచితంగా ఉంటుంది గనక… ‘ఆమెను మీ ఇంటిలో ఉంచుకోవడానికి మీకు అభ్యంతరము లేదు కదా’ అని నన్ను అడిగారు…. ‘నాకు అభ్యంతరము లేదు’ అని చెప్పాను. ఆమె మా ఇంటికి రావడం జరిగింది.”

 

( అంటే, మొత్తం ఉత్తరంలో, కొల్లి సత్యంగారి పేరు లేదు! నేను బలిపీఠం సినిమాకి డైలాగ్స్ రాయడానికే అక్కడికి వచ్చాననీ, నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు బలిపీఠం సినిమా వాళ్ళ ద్వారా జరిగాయనీ; వాళ్ళు అడిగారు కాబట్టి నన్ను ఇంట్లో పెట్టుకోవడానికి తను ఒప్పుకున్నాననీ – ఇదీ ఇప్పటి దాకా జరిగిన లీల! తర్వాత చూడండి.)

 

లీలావతి: “ఆ తర్వాత ఆమె కార్యక్రమం ఆమె, నా పనులు నేను చేసుకుంటూ, ఒకరికి ఒకరం సఖ్యంగా, స్నేహంగా, ఉన్నాము. ఎన్నో విషయాలను మాట్లాడుకునే వారం. ఇలా జరుగుతూ వుండగా, ఒక రోజు స్నేహితురాలు సుగుణాదేవి ఒక రాత ప్రతిని తీసుకుని వచ్చారు. అది  చలం గారి జీవిత చరిత్ర అనీ, మీ పత్రికని ప్రింటు చేసే ప్రెస్ లో బుక్ తయారు చేయించాలని తీసుకువచ్చాననీ, చెప్పారు… అలా చలం గారి రచన నా దగ్గిరికి రావడం జరిగింది. దానిని నేను శ్రీ ధనికొండ హనుమంతరావు గారికి ఇవ్వడం జరిగింది………… ఈ సమయంలో రంగనాయకమ్మగారు మా యింటిలోనే వున్నారు కాబట్టి ఆమెకు కూడా ఈ విషయం తెలిసింది.  ఆ తరువాత రంగనాయకమ్మగారు చాలా తామసముతో ‘ఈ పుస్తకము అచ్చు వేయడానికి నాకు తప్ప ఎవరికి హక్కు లేదు. దానిని తెప్పించండి. దానికి అధికారికత్వం నాకు తప్ప ఎవరికి లేదు’ అని ఘంటాపదంగా చెప్పారు. తరువాత పురాణం సుబ్రహ్మణ్యశర్మగారికి ‘ఈ విధంగా ఇక్కడ చలం గారి రచన  ఉన్నది. మీరు దానిని సీరియల్ గా వేయవలెను’ అని ఉత్తరము వ్రాశారు. దానికి వారు స్పందించి, ‘వ్రాతప్రతిని పంపితే చూసి చెప్పుతాను’ అని తిరుగు సమాధానం వ్రాశారు. ఇప్పుడు ఆమె ఆలోచన నేను ఆ ప్రతిని తీసుకుని వచ్చి ఆమెకు ఇవ్వలేదు అనే బాధ ఆమెకు చాలా ఎక్కువ కలిగింది.”

 

(నేను లీలావతితో పోట్లాట పెట్టుకున్నానని చెప్పడానికి, ఆమెకి ఒక కారణం కావాలి. ఆ కారణం ఇదీ! ‘చలం రచనల మీద అధికారం అంతా నాదీ, దాన్ని నాకివ్వండీ అన్నానట! నేను ఒక్క పైసా ఆదాయం లేక, నా పిల్లల బట్టలకైనా నాలుగు డబ్బులు వస్తాయని సినిమాల వాళ్ళ దగ్గిరికి వెళ్ళినదాన్ని అప్పుడు. అలాంటి నేను, ‘చలం రచనని అచ్చు వేయించడానికి నాకు తప్ప ఎవరికీ హక్కు లేదు’ అన్నానట! నేను

పురాణం గారికి చలం గారు రాసినదాన్ని సీరియల్ గా వేస్తారా అని రాశాననే అనుకుందాం. అలా జరిగి వుంటే, అందులో నేరం ఏమిటి? నేను, తామసంతో, ఘంటాపదంగా, హక్కుల గురించి మాట్లాడా ననీ, ఆ రచన కోసం లీలావతి గారితో పోట్లాడాననీ, చెప్పడానికి ఇదంతా!

 

ఆవిడ నన్ను వెళ్ళమని చెప్పిన సాయంత్రం నేను ఆశ్చర్యపోయి, ఇదేమిటి, పని అయ్యేదాకా మీ ఇంట్లో వుండొచ్చన్నారు కదా? అని,  అడగవలసిన రెండు మాటలు అడిగి, సరే, సత్యం గారికి చెప్పండి అంటే, ఆవిడే ఆయనకి ఫోను చేశారు. అప్పుడు నాకు ఆయన నంబరు తెలీదు. ఫోనులు వాడడం తెలీదు. నేను మేడ దిగి నా సామానుతో  కిందకి వెళ్ళిపోయి కూర్చున్నాను. జరిగింది ఇది అయితే, నేను ఎలా బైటికి వెళ్ళానో ఆవిడ చక్కగా వర్ణించింది. తర్వాత చూడండి.)

 

లీలావతి: “ఇక్కడ నా చేతికి వచ్చిన నాది కాని వస్తువును నేను రంగనాయకమ్మగారికి ఎలా ఇవ్వగలను? అలా చేయలేదన్న విషయాన్ని ఆమె భరించలేక ఆ రోజుకు తను చాలా బాధపడి ఆ రాత్రికి నా ద్వారా తనకు పరిచయమున్న స్నేహితుల కుటుంబానికి ఫోను చేసి ‘నన్ను అర్జంటుగా మీ ఇంటికి తీసుకువెళ్ళండి’ అని ఒకటికి, రెండుసార్లు ఒత్తిడి చేస్తూ ఫోన్లు చేశారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆటో తీసుకుని వచ్చారు. వారు పైకి రాగానే వారితో కలసి లగేజీ తీసుకుని కిందికి వెళ్ళారు రంగనాయకమ్మగారు.”

 

(ఆ భార్యాభర్తలు ఎవరు? ఆ పేర్లు  చెప్పమంటే, కొల్లి సత్యం, గిరిజా అని చెపుతుందా లీలావతి? నా కోసం వచ్చిన ఆయన ఇంటింటి కధ సినిమా డైరెక్టరే. అప్పటికే నేను కిందకి పోయి వీధిలో కూర్చుని వున్నాను. సత్యం గారూ గిరిజ గారూ వచ్చాకే మేడ దిగడం కాదు!)

 

లీలావతి: “ఆమె (రంగనాయకమ్మ) సంస్కారవంతురాలే గనక అయితే, నా స్నేహితులైన వాళ్ళను పిలిచి వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళడం ఏమిటి?”

 

(తను వెళ్ళిపొమ్మంటే నేను వెళ్ళినట్టు కాదు. నేనే పోట్లాడి వెళ్ళిపోయానని! మళ్ళీ మళ్ళీ అదే అబద్దం! ఎవరి సినిమా కోసం రాయడానికి వచ్చానో ఆ సత్యం గారింటికి వెళ్ళినట్టు చెప్పదు. ఎవరింటికో వెళ్ళినట్టు!)

 

లీలావతి: “నేను ఆ రచనను (చలం రచనను) ఆమెకు ఇవ్వకపోవడము అనేది ఆమెకు చేసిన అన్యాయము, ద్రోహము అని తెలిస్తే, ‘ఇలాంటి వారి మధ్య వుండలేను. ఎక్కడికైనా పంపించండి’ అని నన్ను అడిగి వుంటే బాగుండేది. ‘ఇక మీరు వెళ్ళండి’ అని నేను అన్నానని పత్రికాముఖంగా చెప్పగలిగినందుకు ఆవిడ విజ్ఞతకే వదిలివేస్తున్నాను!”

 

(లీలావతి లీలల సారాంశం ఏమిటి? రంగనాయకమ్మ, చలం పుస్తకం కోసం, నాతో పోట్లాడి తనే వెళ్ళిపోయింది; పైగా నేనే వెళ్ళమన్నానని పత్రికాముఖంగా చెప్పింది చూడండి అని. – ఈ లీలలు ఒకటో రెండో కాదు. ఇంకా చూస్తూ వుండండి!)

 

లీలావతి: “చిన్న మెరుపు – అప్పట్లో కొందరు స్నేహితులు నన్ను జోక్ చేశారు. రంగనాయకమ్మగారిని ఇంటిలో వుంచుకొన్నందుకు మీకు పద్మభూషణ్ ఇవ్వాలి- అని అంటూ వుండేవారు.” -లీలావతి, లీలలే గాక, మెరుపులు కూడా చూపించగలదు.

 

(అప్పడు ఈవిడ ఆ స్నేహితులకు ఏం చెప్పింది? రంగనాయకమ్మగారూ, నేనూ సఖ్యంగా, స్నేహంగా, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం – అని చెప్పిందా? అలా తన ఉత్తరంలోనే రాసింది కదా?)

 

లీలావతి: “……. నా పైన వేసినది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము లాగ ఒక అభాండము లాంటిది.” – లీలావతి రాసిన ఉత్తరం, ఇక్కడితో ముగిసింది.

 

(అభాండము ఎవరు ఎవరి మీద వేశారో తెలిసి వున్న లీలావతి, రచన పత్రిక్కి ఆ ఉత్తరం రాయడంలో చాలా మితిమీరిన సాహసం ప్రదర్శించింది! తర్వాత జరిగిన సంఘటనలు కూడా చూస్తే, నిజా నిజాలు బైట పడతాయి.)

 

ఆ ‘రచన’ పత్రికలోనే, లీలావతి వుత్తరం ముగిసిన తర్వాత, దాని కింద, ఇలా ఒక లైను వుంది : ఈ చర్చ ఇక కొనసాగించలేము. -సం.

 

అంటే, లీలావతి చెప్పిందే పరమ సత్యము; ఇక దాని మీద ఎవరూ చెప్పడానికి ఏమీ లేదు! అసలు అది చర్చా?

 

‘రచన’ మే సంచికలో లీలావతి ఉత్తరం చదివిన తర్వాత నేను ఏం చేశాను? ‘రచన’ పత్రిక ఎడిటరైన శాయి గారికి, మే 3న, ఒక ఉత్తరం రాశాను.

 

ఆ ఎడిటరు గారికి, 1972 నాటి పాత సంగతులన్నీ రాశాను. ఆ నాటి నా పాత ఉత్తరాలతో వచ్చిన “ఆత్మ కధాంశాల ఉత్తరాలు” అనే పుస్తకాన్ని ఆయనకి పంపించాను. ఆ ఉత్తరాల్లో వెనకటి సమాచారం అంతా వుంది. ‘బలిపీఠం’ సినిమా తీసిన సునీల్ చౌదరి గారి ఫోన్ నంబరు కూడా రాసి, “బలిపీఠానికి డైలాగ్స్ ఎవరు రాశారో సునీల్ గార్ని అడగండి” అని రాశాను. కొల్లి సత్యం గారి ఇంటి నంబరు కూడా ఇచ్చి, “ఇప్పుడు సత్యం గారు లేరు గానీ, గిరిజ గార్ని అడగండి, ‘ఇంటింటి కధ’ కి డైలాగ్స్ ఎవరు రాశారో” – అని రాశాను. ఇంకా,

 

“నా ‘ఉత్తరాల’ పుస్తకం త్వరలో రీ ప్రింటుకి వచ్చినప్పుడు, ఈ లీలావతి సంగతి అంతా అందులో పెడతాను” అని కూడా రాశాను. అంతే కాదు, ‘బలిపీఠం’  పాటల పుస్తకం నించీ, ‘ఇంటింటి కధ’ పాటల పుస్తకం నించీ, టైటిల్స్ పేజీల్ని కూడా నెట్ ద్వారా పంపించాను. ‘బలిపీఠం’ పుస్తకంలో,  ‘‘మాటలు : దాసరి నారాయణరావు’’ అనీ,  ‘ఇంటింటి కథ’ పుస్తకంలో  ‘‘మాటలు:  రంగనాయకమ్మ ’’ అనీ,  40 ఏళ్ళ కిందటే అచ్చయి  వుంది.  ఆ సమాచారం అంతా  ఆ పత్రిక ఎడిటర్ కి  పంపుతూ , ‘‘మీరు ప్రచురించిన ఉత్తరానికి సంబంధించిన నిజా నిజాలు మీరు ఇప్పుడు తెలుసుకోండి’’ అని రాశాను.

 

తర్వాత, వారం రోజులకి నాకు లీలావతి నించి ఫోను! “అసలు జరిగిందంతా మరిచిపోయానమ్మా! మీరు రచన ఎడిటరు గారికి పంపినవన్నీ ఆయన నాకు పంపారు. అవన్నీ చూస్తే ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా మర్చిపోయానండీ, మర్చిపోయానండీ, మర్చిపోయానండీ” – ఇదీ చెప్పడం!

 

నేను అందులో ఒక్క ముక్క కూడా నమ్మలేదు. చెప్పింది విన్నాను. అసలు ఆవిడ నాకు అప్పుడు ఫోను ఎందుకు చేసింది? తన అబద్దాల్నీ కట్టు కధల్నీ, బైట పెట్టగలిగే నా పాత ‘ఉత్తరాల’ పుస్తకమూ, సినిమాల పుస్తకాలూ, అన్నీ సాక్ష్యాలుగా వున్నాయి. జరిగిందంతా నా రీ ప్రింటు పుస్తకంలో పెడతానని చెప్పాను కూడా.

 

అనేక ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి, ఇక ఇందులో నించి బైట పడాలంటే, “మర్చిపోయాను – అంటే సరిపోతుంది. రంగనాయకమ్మని నమ్మించగలను” అనుకుని, అలా మాట్లాడింది.

 

ఆ మాటలు విన్న తర్వాత  నేను, “సరే, ‘రచన’ పత్రికలో మళ్ళీ ఒక ఉత్తరం రాయండి. రంగనాయకమ్మ అబద్దాలాడిందని మొదటి ఉత్తరంలో రాశారు కదా? దాన్ని సరిదిద్దుకోండి” అన్నాను.

 

ఆవిడ వెంటనే నిరసనగా, “మీరు అబద్దాలాడారని నేను అనలేదే!” అంది. సరిగ్గా ఇదే వాక్యం!

 

“అనలేదా? పత్రికలో మీరు రాసిన ఉత్తరం ఇప్పుడు చదవండి ఒక సారి. ‘అసత్యాన్ని సత్యంగా చెప్పింది’ అని రాశారు. చలంగారి రచనని నాకే  ఇవ్వమని మీతో పోట్లాడాననీ, నేనే బైటికి వెళ్ళిపోయాననీ, రాశారు. మీరు వెళ్ళమన్నారా, నేను వెళ్ళానా? మీరు పిలిస్తే నేను మద్రాసు వచ్చానా, బలిపీఠం వాళ్ళు పిలిస్తే వచ్చానా? నేను ‘ఇంటింటి కధ’ కోసం వచ్చానా, బలిపీఠం కోసం వచ్చానా? – అదే కదా అసలు  చెప్పవలసిన విషయం? అసలు జరిగిందేమిటో చెపుతూ ఇంకో ఉత్తరం రాయండి” అన్నాను.

 

“ఆ( …. రాస్తాను. ఒక సారి మీ దగ్గిరికి వస్తానండీ.”

 

“అది ఇప్పుడు కాదు” అని ఫోను పెట్టేశాను.

 

లీలావతి, ‘రచన’ పత్రికలో మళ్ళీ రాస్తే, ఆ ఎడిటరు గారు దాన్ని వేస్తారా? “చర్చని కొనసాగించలేము” అన్న “భీకర ప్రకటన” ఏమవుతుంది? ఆ ఉత్తరాన్ని వెయ్యకపోతే, లీలావతి ఆ ఉత్తరాన్ని నాకే పంపిస్తుందా? నేను దాన్ని నా రీ ప్రింటు పుస్తకంలో పెట్టుకోవాలా? సరే, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను.

 

ఆవిడ మళ్ళీ రాయబోయే దాంట్లో అనేక ఆరోపణలకు జవాబులు చెప్పుకోవాలి. అసలు ‘జరగని’ విషయాల్ని ఎందుకు చెప్పిందో, దానికి జవాబులు చెప్పుకోవాలి.

 

“మద్రాసులో లీలావతి గారు చేసినట్టుగా, నన్ను కృష్ణాబాయి గారు ఇంట్లో నించి వెళ్ళమనలేదు” అని నేను రాసినదాన్ని నా వ్యాసంలో చదివినప్పుడు లీలావతి ఏం చెయ్యాలి? – అలా జరగడం నిజమే కాబట్టి, తను తప్పు చేసింది కాబట్టి, ఆ నిజాన్ని అంగీకరించి, మౌనంగా వుండిపోతే సరిపోయేది. కానీ ఆవిడ పెద్ద వీరత్వంతో బైల్దేరింది. అబద్ధాల, కట్టు కధల సృష్టి చేసింది. అవతల ‘బలిపీఠం’ సినిమా వివరాలూ, ‘ఇంటింటి కధ’ సినిమా వివరాలూ, బట్టబయలుగా వుంటాయనే భయం అయినా లేకపోయింది. కల్పనల ఉత్తరం తయారుచేసింది. అది పత్రికలో వచ్చేసింది.

 

బూర్జువా కోర్టుల్లో కూడా, ఒక కేసుని మూసేసిన తర్వాత కూడా, నిజం బైటపడితే, కేసుని మళ్ళీ తెరుస్తారు. ‘చర్చ’ కాని దానికి చర్చగా పేరు పెట్టి, ఒక అబద్దాల ఉత్తరాన్ని ప్రచురించి, నేను జవాబు చెప్పడానికి అవకాశం లేకుండా చేసి, లీలావతి ఉత్తరం ఎంత అబద్దమో ఆధారాలన్నీ బైట పడ్డాక అయినా, ఆ ఎడిటరు గారు తన బాధ్యతతో పత్రికలో ఒక వాక్యం రాయవచ్చు కదా? “మాకు ఈ నిజాలన్నీ తెలియక, లీలావతి గారు రాసిన వుత్తరాన్ని ప్రచురించాము. చింతిస్తున్నాము” అని ఒక్క వాక్యం ప్రచురించాలనే వివేకం లేకపోయిందా ఎడిటరు గారికి? మరి, ఇక నీతి అంటే, నిజాయితీ అంటే ఏమిటి?

 

ఒక వేళ, లీలావతి మళ్ళీ రాస్తే, “రంగనాయకమ్మగారు ఏ పని మీద వచ్చారో నేను మర్చిపోయాను, మర్చిపోయాను, మర్చిపోయాను, మర్చిపోయాను” అనే మాటలతోనే  ఆ ఉత్తరం నిండుతుందని ఊహించాను.

 

తర్వాత, జూన్ నెల ‘రచన’ మాస పత్రిక కూడా వచ్చింది. అందులో, లీలావతి ఉత్తరం ఏదీ లేదు. ఎందుకు లేదో ఆ కారణాన్ని ఊహించుకోవలిసిందే.

 

లీలావతే రాసి వుండదా? లేదా, పత్రిక వారు “చర్చని కొనసాగించము” అన్నారు కాబట్టి, లీలావతి ఉత్తరాన్ని తీసుకోలేదా? తీసుకోకపోతే , ఆ ఉత్తరాన్ని లీలావతి నాకు పంపాలి కదా? నాకు ఫోన్ చేసి,  “నేను రాశానండీ, పత్రిక వాళ్ళు వెయ్యలేదండీ” అని నాకు చెప్పాలి కదా? చెప్పలేదేం? అంటే, లీలావతే, ఉత్తరం రాయలేదన్నమాట! ఎలా రాస్తుంది? జరగని కల్పనలు సృష్టించింది కదా? వాటికి ఏం కారణాలు చెప్పుకుంటుంది? సాధ్యం కాదు గదా? అందుకే రాసి వుండదు.

 

ఈ ప్రశ్నలు అనవసరం. మొత్తానికి లీలావతి ఉత్తరం పత్రికలో లేదు. లీలావతి మళ్ళీ నాకు ఫోన్ చెయ్యలేదు, ఏ మాటా  చెప్పలేదు.

 

ఆమె, రెండో ఉత్తరం నిజంగా రాసినా ఏం రాసేది? “రంగనాయకమ్మగారు, సత్యం గారి సినిమాకి రాయడానికే వచ్చారని మర్చేపోయాను” అని మాత్రమే రాసేది. “ఆమెను నేనే పిలిచాను” అని మాత్రం రాసేది కాదు.

 

సరే,  జరిగినదాన్ని మర్చిపోయావు. జరగని సంగతులెన్నో నీ ఉత్తరంలోకి ఎలా వచ్చాయి? రంగనాయకమ్మ, బలిపీఠానికి రాయడానికే వచ్చిందని ఎలా చెప్పగలిగావు? చలం గారి పుస్తకం మీద పెత్తనం తనకే కావాలని నీతో గొడవ పెట్టుకుందనీ, తనే ఎవరెవరికో ఫోన్లు చేసి వెళ్ళిపోయిందనీ, అవన్నీ ఎలా చెప్పగలిగావు?  జరగని విషయాల్ని ఎలా తెచ్చిపెట్టావు? అన్ని అబద్దాలు దేని కోసం సృష్టించవలసి వచ్చింది? నీ వల్ల నిజంగా జరిగిన తప్పుల్ని దాచి పెట్టడానికి పట్టిన దారి అది! ఇప్పుడు జరిగింది అదే. అసలు ఉత్తరమే లేదు!

 

“సినిమా పని పూర్తి అయ్యే దాకా మీరు మా ఇంట్లో నిశ్చింతగా వుండండి. సత్యంగారు మా స్నేహితులు. వారి పని కోసం మీరు మా దగ్గిరే వుండాలి” అని చెప్పి చెప్పి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, “మీరిక వెళ్ళండి, నా కూతురు అలా అంటోంది” అనడం, ఇవన్నీ అసలు నిజాలు. వాటిని కప్పి పెట్టడానికి ఎంత కల్పన అల్లవలసి వచ్చింది లీలావతికి! ఎంత సత్యసంధత! రంగనాయకమ్మ, అసత్యాన్ని సత్యము లాగ చెప్పిందట! ‘తామసముగ’ పోట్లాడిందట! ఇంత అధోగతికి దిగాలా మనిషిగా పుట్టిన మనిషి!

 

(‘చినుకు’ మాసపత్రిక సౌజన్యంతో)


disclaimer: ఈ వివాదంలోని అంశాలతో ‘వాకిలి’ పత్రికకు ఎలాంటి సంబంధమూ లేదు.



23 Responses to అబద్ధాలలో ఎంత సృజన…!

  1. కోడీహళ్లి మురళీమోహన్
    August 17, 2013 at 7:35 am

    నాకనిపిస్తుంది ఇద్దరివీ సగం నిజాలూ సగం అబద్ధాలూ అని. రంగనాయకమ్మ రచయిత్రి కాబట్టి ఆవిడ అబద్ధాలలోనే ‘సృజన’ పాలు ఎక్కువ వుండొచ్చు.

  2. August 17, 2013 at 8:52 am

    @ మురళీమోహన్: ఇద్దిరివీ సగం నిజాలూ, సగం అబద్ధాలా? నిజాల సంగతి సరే, అబద్ధాలని ఏవైతే మీరు అనుకుంటున్నారో- వాటికి ప్రాతిపదిక ఏమిటో నిర్దిష్టంగా చెప్పండి.

    >> రంగనాయకమ్మ రచయిత్రి కాబట్టి ఆవిడ అబద్ధాలలోనే ‘సృజన’ పాలు ఎక్కువ వుండొచ్చు. >> మీ స్వీపింగ్ కామెంట్ రచయితలందరినీ అవమానించేదని గుర్తించండి.

    అబద్ధాలలో సృజన పాళ్ళ సంగతి తర్వాత; ఈ వివాదంలో ఆమె అబద్ధాలేమిటో (మీరు అనుకుంటున్నవి) చెప్పండి ముందు!

  3. radhadevi
    August 17, 2013 at 10:57 am

    సాధారణంగా ఏదైనా ఒక సంఘటనని వ్యక్తులు తమతమ ఉద్దేశ్యంతో సమీకరిస్తారు… ఒక సాధారణ వ్యక్తి ఏ విషయాలనూ, తమని గురించి అయితే తప్ప, సీరియస్ గా తీసుకోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది అని నాకనిపిస్తుంది..,, రంగనాయకమ్మగారి వ్యక్తిత్వం దేనినైన పొల్లుపోకుండా అక్షరాలా పాటించే వ్యక్తిత్వం, అదే సమయంలో, లీలావతిగారు తను రంగనాయకమ్మగారికి సహాయం చేస్తున్నట్లు భావించి ఉంటారు అప్పుడు….. కానీ, ఇప్పుడు రంగనాయకమ్మగారు తన మీద అభియోగం చేసారని వెంటనే సమాధానం ఇచ్చేసారు… ఆవిడ రచనకి ఉత్తరం ప్రచురణకి ఇవ్వక మాట్లాడక ఊరకుంటేనో , రంగనాయకమ్మగారితో ముఖాముఖి మాట్లాడివుంటేనో బాగుండేది …రచనకి ఉత్తరం ప్రచురణకి ఇవ్వకుండ వుంటేనో, రచన శాయిగారు కూడా లీలావతిగారి ఉత్తరం ప్రచురించకపోవటమో, ఒకరికొకరు తమతమ జ్ఞాపకాలు, వుద్దేశ్యాలు వెలిబుచ్చుకుని, ఒక అవగాహనకి వచ్చాక నిలపటమో బాగుండేది.
    నేను రంగనాయకమ్మగారి ఒక అభిమానిని…నా అభిప్రాయం వెలిబుచ్చడంలో అపార్థం రావటానికి ఏమైనా అవకాశముంటే అది కేవలం నా భాషా పరిజ్ఞాన లోపంగా అర్థం చేసుకోమని మనవి.

  4. kurmanath
    August 17, 2013 at 3:50 pm

    ఎడిటర్ గారికి,
    ఇందులో సాహిత్యం ఏముంది?

  5. కోడీహళ్లి మురళీమోహన్
    August 17, 2013 at 3:52 pm

    @వేణు: రంగనాయకమ్మగారు లీలావతిగారి ఇంట్లో బస చేయడం వాస్తవం. తరువాత కొన్ని రోజులకు ఈవిడ ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇది కూడా యదార్థమే. అయితే ఆవిడ ఆహ్వానం మేరకే తను అక్కడికి వెళ్ళానని ఈవిడా, కాదని ఆవిడా అంటున్నారు. అంటే ఒకరు నిజం చెబుతున్నారంటే మరొకరు అబద్ధం చెబుతున్నారనే కదా అర్థం. అట్లాగే ఆవిడ తనని వెళ్ళిపొమ్మందని ఈవిడా, తనే గొడవపడి వెళ్ళిపోయిందని ఆవిడా అంటున్నారు. ఇక్కడ కూడా రెండింటిలో ఒకటి నిజం మరొకటి అబద్ధం కావాలి కదా? లేకపోతే ఒక ఏనుగును నలుగురు గుడ్డివాళ్ళు నాలుగు రకాలుగా వర్ణించినట్లుగా ఇద్దరూ అర్ధసత్యాలే చెబుతున్నారంటారా? కొంచెం సేపు రంగనాయకమ్మ గారి వాదనే నిజమనుకుందాం. నెలరోజులు ఆతిథ్యమిచ్చి బాగా చూసుకున్న వాళ్ళు వెళ్ళిపొండి అన్నారంటే దానికి దారి తీసిన పరిస్థితులు ఏవో వుండి వుంటాయి కదా? అవి రంగనాయకమ్మ గారికి తెలియవా? వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చలంగారి రచన విషయమై లీలావతిగారు చేసిన ఆరోపణను రంగనాయకమ్మగారు నిర్ద్వంద్వంగా ఎందుకు త్రోసిపుచ్చలేదు? దీన్ని బట్టి ఏమి అర్థమవుతుంది? కోర్టు కేసుల కోసం అయినా కొంచెం డబ్బుతో అవసరం వున్న వ్యక్తి, పిల్లల బట్టలకైనా నాలుగు డబ్బులు వస్తాయని సినిమాల వాళ్ళ దగ్గిరికి వెళ్ళిన వ్యక్తి చలం పుస్తకంపై హక్కుల పేరుతో సొమ్ము చేసుకునే ప్లాన్ వేయలేదంటే ఎలా నమ్మగలం? తన పాచిక పారలేదు కాబట్టి గొడవపడి వెళ్ళిపోయింది అనుకోవచ్చు కదా? < >

  6. August 17, 2013 at 4:05 pm

    @ మురళీమోహన్: మీరు రాసిన చివరి వాక్యం చాలా అభ్యంతరకరంగా, ద్వేష పూరితంగా ఉంది. దాన్ని మీరు సవరించుకుంటే/ ఉపసంహరించుకుంటేనే మీతో చర్చ చేయటం సాధ్యమవుతుంది!

  7. కోడీహళ్లి మురళీమోహన్
    August 17, 2013 at 4:07 pm

    @వేణు: సరే! పైన సమాధానంలోని ఆఖరు వాక్యాన్ని వాపస్ తీసుకుంటున్నాను.

  8. August 17, 2013 at 5:27 pm

    @ మురళీమోహన్: మీరు వాపస్ తీసుకున్నానంటున్న అభ్యంతరకరమైన, ద్వేపఫూరితమైన వాక్యం ఇంకా మీ వ్యాఖ్యలో కనపడుతూనే ఉంది. పాఠకులు దాన్ని చదువుతూనే ఉంటారు కదా? ఇక మీరు దాన్ని వాపస్ తీసుకున్నానని ప్రకటించీ ఏం ప్రయోజనం? ఆ వాక్యాన్ని తొలగించి మళ్ళీ వ్యాఖ్య రాస్తేనే మీ ఉపసంహరణకు విలువ!

    • కోడీహళ్లి మురళీమోహన్
      August 17, 2013 at 5:44 pm

      @వేణు:వాకిలి ఎడిటర్లే ఈ వ్యాఖ్యను ఎడిట్/డిలిట్ చేయగలరనుకుంటా! ప్రస్తుతం నా చేతుల్లో ఏమీ లేదు :)

      • కోడీహళ్లి మురళీమోహన్
        August 17, 2013 at 5:48 pm

        అయినా ఆ వ్యాసంలో వున్న వాక్యాల కంటే ద్వేష పూరితమైనవీ, అభ్యంతరకరమైనవీనా నా మాటలు?

  9. August 17, 2013 at 6:54 pm

    మీ వ్యాఖ్యలపై విచారమే లేనపుడు, వాటిని సమర్థించుకునే ఉద్దేశం కూడా ఉన్నపుడు ‘వాపస్ తీసుకున్నానం’టూ ఎందుకూ ప్రకటించటం?

    ఈ వ్యాసం, మీ వ్యాఖ్య రెండూ ఇక్కడే ఉన్నాయి. వీటిలో ఏది ద్వేషపూరితంగా, అభ్యంతరకర పదజాలంతో ఉందో వీటిని చదివిన పాఠకులే నిర్ణయించుకుంటారు.

    డబ్బుల అవసరంలో ఉన్నవాళ్ళు సొమ్ము చేసుకునే ప్లాన్ వేస్తారనీ, పాచికలు వేస్తారనీ సూత్రీకరించటం – ఆధారాలేమీ లేకుండా అలాంటి అనుమానాలను వ్యక్తం చేయటం వక్రీకరణ విన్యాసం తప్ప మరోటి కాదు!

    • కోడీహళ్లి మురళీమోహన్
      August 17, 2013 at 8:02 pm

      >>మీ వ్యాఖ్యలపై విచారమే లేనపుడు, వాటిని సమర్థించుకునే ఉద్దేశం కూడా ఉన్నపుడు ‘వాపస్ తీసుకున్నానం’టూ ఎందుకూ ప్రకటించటం?>> ఏదో మీరు ఆ వ్యాఖ్య ఉపసంహరించుకుంటేనే కానీ చర్చకు సాధ్యపడదు అన్నారు కాబట్టి.

      >>ఈ వ్యాసం, మీ వ్యాఖ్య రెండూ ఇక్కడే ఉన్నాయి. వీటిలో ఏది ద్వేషపూరితంగా, అభ్యంతరకర పదజాలంతో ఉందో వీటిని చదివిన పాఠకులే నిర్ణయించుకుంటారు.>> నిజమే.

      >>డబ్బుల అవసరంలో ఉన్నవాళ్ళు సొమ్ము చేసుకునే ప్లాన్ వేస్తారనీ, పాచికలు వేస్తారనీ సూత్రీకరించటం – ఆధారాలేమీ లేకుండా అలాంటి అనుమానాలను వ్యక్తం చేయటం వక్రీకరణ విన్యాసం తప్ప మరోటి కాదు!>> నలభై ఏళ్ళ క్రితం ఏమి జరిగిందో మీకూ తెలియదు. నాకూ తెలియదు. ఆ వ్యాసంలోని రాతల ఆధారంగా ఏమి జరిగి ఉండొచ్చో ఊహించడం వినా సూత్రీకరణలు, అనుమానాలు కాదు.

      అయినా ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు వివాదంపై మనమెందుకు పోట్లాడుకోవడం? దీన్ని ఇక్కడితో ముగింపు పలికితే బాగుంటుంది.

      • Thirupalu
        August 17, 2013 at 10:08 pm

        ‘అయినా ఇద్దరి మధ్య జరిగిన ప్రయివేటు వివాదంపై మనమెందుకు పోట్లాడుకోవడం? దీన్ని ఇక్కడితో ముగింపు పలికితే బాగుంటుంది.’-మంచి మాటన్నారు, వివాదాన్ని మొదలు పెట్టింది మీరే! మీ తోనే ముగింపు పలకటం బాగుంటుంది!
        ఎందుకంటున్నానంటే, రంగనాయకమ్మ గారు ఒక పాపులర్‌ రచయిత్రి. వారి జీవిత విశేషాల మీద ఆమె అభిమాన పాఠకులకు ఆసక్తి ఉండడం లో తప్పులేదు. వాటికి పాఠకులనుండి జడ్జిమెంట్లు రావటమే బాగలేదు.

  10. Thirupalu
    August 17, 2013 at 7:48 pm

    మీ చేతుల్లో ఏమీ లేకపోయినా మీ అంతరంగాన్ని మేమంతా చూశామండి మురలి మోహన్‌ గారు! ఇప్పుడు డెలిట్‌ చేసినా చెయ్యకపోయినా ఒకటే!

  11. Ramesh babu Sduam
    August 19, 2013 at 6:48 pm

    ఒక సంఘటన 40 ఏళ్ల కింద జరిగినా, ఎన్ని ఏళ్ల కింద జరిగినా అది చెప్పే తీరులోనే తెలిసిపోతుంది వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్దం చెప్తున్నారో. అయినా లీలావతి గారే ఫోన్ చేసి
    “అసలు జరిగిందంతా మరిచిపోయానమ్మా! మీరు రచన ఎడిటరు గారికి పంపినవన్నీ ఆయన నాకు పంపారు. అవన్నీ చూస్తే ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా మర్చిపోయానండీ, మర్చిపోయానండీ, మర్చిపోయానండీ” అని చెప్పిన తరువాత నిజమేంటనేది తెలిసిపోతుంది కదా. ఏది నిజం ఏది అబద్దం అని కొట్టుకోడానికి ఇంకా ఆస్కారం ఎక్కడిది .

  12. August 19, 2013 at 6:51 pm

    ఆత్మ కధల్లోని విషయాలను సాహిత్యంగా పరిగణించొచ్చా అన్నది ఒక ప్రశ్న. సూటిగా చెప్పాలంటే, సాహిత్య కారుల ఆత్మ కధల్ని సాహిత్యం గానే పరిగణించాలి. వాటి ద్వారా, వారు చెప్పేవి వారు తమ జీవితాల్లో పాటిస్తున్నారో, లేదో తెలుస్తుంది. వాటి ద్వారా, వారి సాహిత్య సృజనకి దారి తీసిన పరిస్థితులు అర్థం అవుతాయి. వాటి ద్వారా, వారి సాహిత్య ధోరణి ఎలా మారిందో కూడా అర్థం అవుతుంది. కల్పిత విషయాలు మాత్రమే సాహిత్యం అనుకుంటారు. ఆ కల్పిత విషయాల కధలు కూడా నిజ జీవితాల్లోని విషయాలను ప్రతిబింబించడం వల్లనే, ఆ కధలను మనుషులు చదువుతున్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి ఆత్మ కధ సాహిత్యం కాదా? శ్రీశ్రీ రాసిన “అనంతం” ఆత్మ కధ సాహిత్యం కాదా? ఈ మధ్య కాలంలో, కొండపల్లి కోటేశ్వరమ్మ గారు రాసిన, “నిర్జన వారధి” ఆత్మ కధ, సాహిత్యం కాదా?
    సాహిత్యం అనగానే మనుషుల నిజ జీవితాల తోనూ, వాటి లోని వారి నిజ ప్రవర్తనల తోనూ సంబంధం లేని విషయంగా కొంత మందికి తోస్తున్నట్టుంది. వ్యక్తి గత మానసిక వికాసానికీ , వారి నిజ జీవిత ప్రవర్తనకీ తోడ్పడని సాహిత్యం ఉత్త దండగే. సాహిత్యం ఎప్పుడూ సమాజం కోసమే. అంటే మనుషుల కోసమే, మనుషుల గురించే.

    - జె. యు. బి. వి. ప్రసాద్

  13. August 23, 2013 at 7:12 am

    ఇలాంటి వ్యాసం చదవడంవల్ల నాలాంటి వారికి కలిగే ప్రయోజనము ఏమిటి అని మొదటిసారి చినుకులో చదివినప్పుడు అనిపించింది.

    ఇప్పుడూ అదే భావం

    • Thirupalu
      August 23, 2013 at 11:16 pm

      చూసే కళ్లుండాలి కానీ ఏదోజీవిత సత్యం కనిపించక పోదు! కావాలిసిన వాల్లకి. ‘ అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితకనర్‌ హం ‘ …… కల్లుంటే చూసి, వాక్కుంటే రాసి అన్నట్లు. ఏమీ లేక పోతే మీరు ఏమి రాసి వుండరు. మీ రు ఏమీ రాయక పోతే ఇక్కడ ఏమీ ఉండకపోను. ఇక్కడ ఏమీ ఉండకపోతే నేను ఏమీ రాసి ఉండక పోదును.

  14. తిరునగరి సత్యనారాయణ
    August 31, 2013 at 2:23 am

    నిజమే! సాహిత్యకారుల ఇటువంటి ఆత్మకథా రచనల వల్ల వారి జీవితమూ , వారు పాటించిన విలువలు, వారి సాహిత్యంలో చెప్పినవీ వారి జీవితం లో ఆచరించినవీ మనకు కొంత అవగతమౌతాయి! అయితే వారు ఆత్మకథా రచనల్లో అబద్దాలు చెపితే మనం చేసేదేమీ లేదు. ఇక్కడ యెవరు అబద్దం చెప్తున్నారో యెవరు నిజం చెప్తున్నారో అనే చర్చ శుష్క్యమైనది, యెందుకంటే అది యెప్పటికీ తేలదు. కానీ రెండు విలువలు మాత్రం మనం గమనించవచ్చు – 1. మనం యెవరైనా వొకరి యింట్లో వొక నెల పాటు ఆతిథ్యం తీసుకుని, యే కారణాల వల్లనైనా సరే వారి యింటి నుండి బయట పడాల్సి వస్తే (అది యెవరి తప్పైనా కావచ్చు) ఆతిథ్యం తీసుకున్న వారి మీద తర్వాత నిందలు మోపి, తిట్టి పోసి, చర్చలు లేవనెత్తి, ‘సిద్దాంతీకరించి’ రాయడం సరైన విలువేనా! ఒక బాధ్యతాయుతమైన రచయిత గా ఆ పని చేయవచ్చా! నా అభిప్రాయం లో మనకు కష్త కాలంలో ఆతిథ్యం ఇచ్చి ఆదుకున్న వారి మీద (వారు ఆ పని యే కారణాల వల్ల చేసినా సరే) తర్వాత కాలంలో నిందలు వేసి అభాండాలు మోపడం సరైంది కాదని నా అభిప్రాయం.
    2. ఇంక అన్నింటి కన్నా ముఖ్యం – రంగనాయకమ్మ గారు రాసిన దానిలో ఈ రెండు వాక్యాలు నా దృష్టి ని ఆకర్షించాయి . “పిల్లలు, ఈ నెల్లాళ్ళకే పెద్దవాళ్ళయ్యారా? పిల్లల ఆజ్ఞల ప్రకారమే నడుస్తారా మీరు?” – స్త్రీల గురించి, పిల్లల పెంపకం గురించి బోలెడంత సాహిత్యం రాసిన రంగనాయకమ్మ గారి నుండి ఈ మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసాయి . ఒక స్త్రీగా ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేక పోయిందా? వ్యక్తిగతంగా యెందరో మందికి మా యింట్లో ఆతిథ్యమిచ్చిన నాకు పిల్లలెట్లా, (ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు) యింట్లో ‘అతిథు’ ల పట్ల యెట్లా స్పందిస్తారో చాలా బాగా తెలుసు. I very well know how stifled and claustrophobic they feel. మరి దాన్ని వ్యక్తం చేస్తే అది తప్పా! పిల్లల అభిప్రాయాలను గౌరవించడం తప్పా! రంగనాయకమ్మ గారి లాంటి వ్యక్తి తమ యిట్లో ఉంటే పిల్లలు యెట్లా స్పందిస్తారో నేనూహించుకోగలను. అటువంటప్పుడు అదే విషయాన్ని ఆమెకు చెప్పి ‘దయ చేసి గౌరవించండి’ అని అడిగితే తాము అప్పటిదాకా ఇచ్చిన ఆతిథ్యమూ దాని విలువా అన్నీ గంగ లో కొట్టుకుపోయి పైగా ఇన్ని అభాండాలూ యింత అవమానమూనా? పిల్లల పరిస్థితిని, వారి అభిప్రాయాలను పట్టించుకోని, ఆధిపత్యమూ, ఆజమాయిషీ చెలాయించే ఒక అప్రజాస్వామిక వాతావరణం యింట్లో ఉండాలని రంగనాయకమ్మ గారు కోరుకుంటున్నారా? పై వాక్యాలు చదివితే అవుననే అనిపిస్తుంది.

  15. Thirupalu
    September 1, 2013 at 10:39 am

    @ రంగనాయకమ్మ గారి లాంటి వ్యక్తి @
    తిరునగరి గారు,
    వ్యక్తిత్వాలకు ప్రామానికత అంటూ ఎమైనా ఉందా? మీ దృష్టికోణం నుండి ఇంప్రెస్సుడ్‌ గా చూస్తున్నారు. ఇది ఎలా సమతూకమైన దృష్టి అవుతుంది? పాఠకులు ఎవరి కి వున్న దృష్టికోణం నుండి వారు రచయి(త్రి) తల రచనలు గానీ, వారి వ్యక్తిత్వాలు గానీ, వారు పాటించిన విలువలు గానీ అవగాహన చేసు కుంటారు.

  16. జె. యు. బి. వి. ప్రసాద్
    September 2, 2013 at 12:08 am

    తిరునగరి సత్యనారాయణ గారి వ్యాఖ్యానం ఘోరంగా వుంది.

    1. రంగనాయకమ్మ గారికి లీలావతి ఆతిధ్యం ఇచ్చిందన్నారు సత్యనారాయణ గారు. “ఆతిధ్యం, ఆతిధ్యం” అన్నారు. అదసలు ఆతిధ్యం కానే కాదు. తన స్నేహితుల వ్యాపారార్థం, “వద్దూ, నేను హోటళ్ళలో వుండ లేనూ” అని రంగనాయకమ్మ గారు అంటున్నా, “రమ్మని” మరీ మరీ ఉత్తరాలు రాసి, పిలిచి, పని చేయించు కోవడానికి తనింట్లో వుంచుకున్నారు లీలావతి గారు. అది ఆతిధ్యం కాదు. తన మిత్రుల వ్యాపారం కోసం లీలావతి గారు చేసిన ఏర్పాటు అది.

    2. రంగనాయకమ్మ గారు లీలావతి గారిని “నిందించారూ, నిందించారూ” అన్నారు. ఎవరు ఎవర్ని నిందించారు నిజానికి? నిజంగా ఆతిధ్యం ఇచ్చిన కృష్ణాభాయి గారి కుటుంబం గురించి రంగనాయకమ్మ గారు ఒక వ్యాసం రాస్తూ, అందులో పోలిక కోసం, “లీలావతి గారు వెళ్ళి పొమ్మన్నట్టు కృష్ణాభాయి గారు వెళ్ళిపొమ్మన లేదు” అని ఒక మాట అన్నారు. అప్పుడు, తన నిందా పత్రాన్ని ‘రచన’ మాస పత్రికలో ప్రచురించింది లీలావతి గారు. తనపై వచ్చిన నిందలకి రంగనాయకమ్మ గారు జవాబు చెప్పు కోవడానికి వీలు లేకుండా, “చర్చ ముగించేశామని” ‘భీకర ప్రకటన’ చేసింది రచన వాళ్ళు. లీలావతి రాసిన ఆ పత్రం నిండా నిందలే, అబద్ధాలే. నిజానికి, లీలావతి గారే రంగనాయకమ్మ గారి మీద నిందలు వేశారు.

    3. “పిల్లల అభిప్రాయాలను గౌరవించడం” అంటే, తల్లి ఒకరిని ఇంటికి పిలిచి, తన స్నేహితుల కోసం పని చేయించుకుంటుంటే, ఆ తల్లి మాటని ఖాతరు చెయ్యకుండా, అహంకారాలతో పిల్లలు ప్రవర్తిస్తే, దాన్ని ‘ప్రజాస్వామ్యం’గా తీసుకోవాలా? ఆ తల్లికీ, ఆ తల్లి మాటకీ విలువే లేదా? పిలిచింది లీలావతి గారు. “వెళ్ళి పొమ్మని” అన్నదీ లీలావతి గారే. తల్లి వాగ్ధానం పట్టించుకోని పిల్లలు ప్రజాస్వామ్యంగా ప్రవర్తించినట్టేనా? ఇంట్లో వున్న ‘అతిధుల’ వల్ల, ఆ ఇంటి పిల్లలు ‘ఇరుకు’గా ఫీలయితే, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి నేర్పినవి అన్నీ ‘ఇరుకు’ భావాలే నన్న మాట! సాధారణంగా, ఏ ఇంట్లోనూ, ఏ పిల్లలూ తల్లిదండ్రులకి వ్యతిరేకంగా, అందులోనూ పెరుగుతున్న పిల్లలు, ఇంటికి వచ్చిన వారిపై ఇరుకు భావాలతో వుండరు. అలా వున్నారంటే, ఆ లోపం అంతా ఆ తల్లిదండ్రులదే.

    4. “ఈ రచన చదివితే, ఎవరు అబద్ధం ఆడారో తేలదని” సత్యనారాయణ గారు అన్నారు. ఈయనకి అర్థం అయింది ఇదీ! లీలావతి గారి ఉత్తరం లోని విషయాలని, సినిమా కాయితాల సాక్ష్యాలతో అబద్ధాలు అని రుజువు చేస్తే, ఎవరు అబద్ధం ఆడారో తెలియ లేదంటారేవిటీ ఈయన? రంగనాయకమ్మ గారు రచన ఎడిటరుకి సాక్ష్యాలతో రాసిన ఉత్తరం అందుకున్న లీలావతి గారు రంగనాయకమ్మ గారికి చేసిన ఫోను సంగతేమిటీ? అదీ అబద్ధమేనా? ఫోను రికార్డులు వుండవా రుజువులకి?

    5. రంగనాయకమ్మ గార్ని బతిమాలి బామాలి రమ్మని పిలిచింది లీలావతి. తన కూతురి వల్ల ఏదైనా అభ్యంతరం వచ్చినా, “ఆమెకి నేను మాట ఇచ్చి రమ్మన్నాను. మన స్నేహితుల కోసమే ఆమె చేసి పెడుతోంది. ఇప్పుడు వెళ్ళమనడం ఎంత తప్పు! నా మాట ఏం కావాలి? రంగనాయకమ్మ గారు ఎంతో మంచిగా మనతో వుంటూ తన పని తను చేసుకుంటోంది. అమెని వెళ్ళమని చెప్పలేను” అని తల్లి, కూతురికి చెప్పుకోవాలి. అది చెయ్యకపోగా, లీలావతి హఠాత్తుగా ఆమెని వెళ్ళిపొమ్మని చెప్పింది. రంగనాయకమ్మ గారు 40 యేళ్ళ తర్వాత, కృష్ణాభాయితో పోలికగా ఒక్క మాట రాస్తే, దానికి లీలావతి మౌనంగా వుండాలి. అబద్ధాలు గుప్పించడమా లీలావతి చెయ్యాల్సిన పని?

    - జె. యు. బి. వి. ప్రసాద్

    • కోడీహళ్లి మురళీమోహన్
      September 6, 2013 at 10:56 pm

      @జె.యు.బి.వి.ప్రసాద్:1.>>కృష్ణాబాయి గారి కుటుంబం గురించి రంగనాయకమ్మ గారు ఒక వ్యాసం రాస్తూ, అందులో పోలిక కోసం, “లీలావతి గారు వెళ్ళి పొమ్మన్నట్టు కృష్ణాబాయి గారు వెళ్ళిపొమ్మన లేదు” అని ఒక మాట అన్నారు.>> ఇక్కడ లీలావతి గారి ప్రస్తావన తీసుకురావలసిన అవసరం ఏముంది? ఒకరిని పొగడడానికి మరొకరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలా? మద్రాసులో లీలావతిగారు చేసినట్టు అని కాకుండా మద్రాసులో ఒకరు చేసినట్టు అని వ్రాసివుంటే లీలావతిగారు (నిజంగా రంగనాయకమ్మగారు వ్రాసిందంతా నిజాలే అయితే)చదివినా కిమ్మనకుండా వుండేవారు కదా? అలా చేస్తే ఆవిడ రంగనాయకమ్మగారు ఎలా అవుతారు?
      2.>>“చర్చ ముగించేశామని” ‘భీకర ప్రకటన’ చేసింది రచన వాళ్ళు>> ఒక చర్చను ఎప్పుడు కొనసాగించాలో ఎక్కడ ముగించాలో ఒక పత్రికా సంపాదకుడిగా శాయి గారికి పూర్తి స్వాతంత్ర్యం లేదా? దాన్ని ప్రశ్నించే హక్కు రంగనాయకమ్మ గారికి ఎక్కడిది? పైగా ఆమె ఉత్తరాన్ని ప్రచురించనందుకు “వివేకం లేకపోయిందా ఎడిటరు గారికి?” అని దబాయింపు.
      3.>> లీలావతి రాసిన ఆ పత్రం నిండా నిందలే, అబద్ధాలే>> మీరీ విధంగా ఎలా నిర్ధారణకు రాగలిగారు? నిన్న మొన్నటి సంగతులే సరిగ్గా గుర్తుండవు. అలాంటిది ఎప్పుడో 40 యేళ్ల క్రితం జరిగిందటున్న ఈ సంఘటన గురించి లీలావతి గారికి జ్ఞాపకం వుండి తీరాలని రౌల్ ఏముంది? ఇంటింటికథకు బదులు బలిపీఠం సినిమా అని పొరపడ్డారు లీలావతి గారు. అదేమన్నా ఘోరమైన తప్పిదమా? అంతమాత్రానికే ‘మితిమీరిన సాహసం ప్రదర్శించింది!’,'పెద్ద వీరత్వంతో బైల్దేరింది’,'భయం అయినా లేకపోయింది’ అంటూ వీరంగం చేయాలా? ఈ విషయం తప్పించి రంగనాయకమ్మగారు లీలావతిగారు చేసిన మిగిలిన ఆరోపణల్ని (ముఖ్యంగా చలం రచన విషయమై చేసిన ఆరోపణ గురించి) ఎందుకు నిర్ద్వంద్వంగా ఖండించడంలేదు? రంగనాయకమ్మగారికి మాత్రం అన్నీ గుర్తుంటుందా యేమిటి? తన నవల ‘కళ ఎందుకు?’కు ముందు మాట వ్రాసింది ఎవరో కూడా ఆవిడగారికి గుర్తులేదు.
      4.కారణాలు ఏమైతేనేం లీలావతిగారు రంగనాయకమ్మగారిని ఇంటినుండి వెళ్ళిపొమ్మన్నారు అనే అనుకుందాం. అదీ మర్యాదగానే సౌమ్యంగానే చెప్పారని వ్యాసంలోని వ్రాతల్ని బట్టి అర్థమవుతోందికదా. ఆవిడగారి ఇబ్బందుల్ని ఈవిడగారు సహృదయంతో అర్థంచేసుకుని ‘అలాగే తొందరలోనే వెళ్లిపోతాను’ అని అనవలసింది పోయి అప్పటికప్పుడు బట్టలు సర్దేసుకుని సామాన్లు తీసుకుని మేడ దిగి గేటు బయటకు పోయి అక్కడ కూర్చుని ‘సీన్’ క్రియేట్ చేయాలా?

      ఇదంతా చూస్తుంటే రంగనాయకమ్మ గారి మాటల్నే ఆవిడకు అప్పజెప్పాల్సి వుంటుంది.

      ఇంత అధోగతికి దిగాలా మనిషిగా పుట్టిన మనిషి!

  17. Thirupalu
    September 7, 2013 at 8:32 pm

    వీళ్లు చెపుతున్నది పరమసత్యమని మనంతా నమ్మాలి కాబోలు?
    అబద్దాలు చెప్పటానికి రంగనాయకమ్మ గారు ఆత్మకధ రాసుకోవాలా?
    శ్రీ శ్రీ గారు ‘్తన అనంతం ‘ లో తనకున్న అన్నీ బలహీనతలు ( అని మనం అనుకుంటున్నవి) చెప్పుకున్నారు. నచ్చని వారు తాగుబోతు, తిరుగుబోతు అనుకున్నారు. ఆయన అభిమానులు అది ఆయనలో ఉన్న నిజాయితీ అనుకున్నారు. అనంతం లో ఆయనకున్న బలహీనతలకు కాస్త ముసుగేసుకొని ఉంటే మనమే కాదు రానున్న తరాలు వారుకూడా ఆయన్ని మహా కవి మాత్రమే కాక మహా మనిషి కూడా అనుకొని ఉండేవారు కాదా?

    @ ఒకరిని పొగడడానికి మరొకరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలా? @ పనిగట్టుకుని రంగనాయకమ్మ గారు అబద్దాలు చెప్పాలనుకుంటే నలబై సంవత్సరాలు ఆగాలా?

Leave a Reply to కోడీహళ్లి మురళీమోహన్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)