కవిత్వం

జెండాగా ఎగిరిన అచ్చరం

అక్టోబర్ 2013

తెల్లార గట్లల్ల తలుపు గొట్టి లేపి
మా తలపులల్ల
కొత్త పొద్దు పొడిపించిన సూర్యుడు– గాయ్న

కంటికి మింటికి ఏక ధారగా
మన మట్టి ముచ్చట్లను కై కట్టి చెప్పిన
తాళ పత్ర పురాణం — గాయ్న

నైజాము సర్కరోని గుండెల మీన
అచ్చరాల కచ్చురాలు ఉర్కిచ్చిన
సచ్చా ఆద్మీ — గాయ్న

దోపిడీ దారుల మెడల మీన
పిడి చాకు అసొంటి కైతల్ని దించిన
సాదా సీదా ఇన్సాన్ — గాయ్న

గీ నేల కోసం
గీ మట్టి బిడ్డల కోసం
ఎంతటోనికైన ఎదురు తిర్గిన
గీ జమీన్ కీ షాన్ — గాయ్న

గీ మోసగాళ్ళ రాజ్జం ల
గిది గోసలు చెప్పుకునే కాలం గాదని
‘గొడవ’లతోనే భడవా గాండ్లకు బుద్ధి చెప్పాల్నని
ఇకమతు చెప్పిన పెద్ద మనిషి — గాయ్న

తెలంగాణ యెతలను
తీరొక్క ముచ్చట్లను ఒడ్వకుంట సెప్పి
మనందరిని ములు గర్ర లెక్క పొడ్సి పొడ్సి లేపిన
నియ్యత్ మనిషి — గాయ్న

కన్ను తెరిత్తె బతుకు
కన్ను మూత్తే సావు
కంటి సూపు సూపంత తెలంగాణే అని సెప్పి
తెలంగాణనే కంటి పాప లెక్క సూసుకున్న ఫౌజీ — గాయ్న

గాయ్న సెప్పిన మాటే
మా గుండెల్ని మండిచ్చింది
గాయ్న రాసిన కైతే
మా చేతుల్ని కత్తుల లెక్క మార్చింది
గాయ్న సూపిచ్చిన తొవ్వే
ఈ మట్టికి విముక్తి బాట యేసింది

గాయ్న చేతి కట్టె
గిప్డు మాకందరికీ రిలే పరుగు లెక్క అయింది
1969 నుంచి 2001 పైకెళ్ళి
ఇప్పటి దాకా
ఆపకుంట, ఆగకుంట
లగాయించి బగాయించినం
గాయ్నను మతిల పెట్టుకొనే ఉర్కినం
కొసాకి
గవాన్ని పురాగ ఓడిచ్చినం

కాళోజీ .. కాళోజీ
నీ యాది తెలంగాణ
నీ మనాది తెలంగాణ
నీ పునాది తెలంగాణా
నీ వందేళ్ళ కల తెలంగాణ
గిప్డు
జెండా యై నిలిచింది
నీకు వందనం చేత్తాంది



6 Responses to జెండాగా ఎగిరిన అచ్చరం

  1. Sarala Ravi
    October 1, 2013 at 8:27 pm

    Okka safari maa ooriki vellinartundi.. Telangana base baasa.. Super poem bro..

  2. R KUMAR
    October 1, 2013 at 10:56 pm

    Nice one.. A great tribute to KALOJI..

  3. Sundar
    October 2, 2013 at 12:42 am

    True.. A wonderful tribute to the great poet of NAA GODAVA… Congrats to Mamidi harikrishna

  4. buchireddy gangula
    October 2, 2013 at 10:08 am

    mamidi garu
    baagundhi sir

  5. Shreelaxmi
    October 2, 2013 at 6:56 pm

    కన్ను తెరిత్తె బతుకు
    కన్ను మూత్తే సావు
    కంటి సూపు సూపంత తెలంగాణే అని సెప్పి
    తెలంగాణనే కంటి పాప లెక్క సూసుకున్న ఫౌజీ — గాయ్న
    Excellent expression.. These lines hav manifested the essence of KALOJI.. Kudos to Mamidi

  6. October 3, 2013 at 11:34 am

    కవితను చాలా వరకు శిష్ట వ్యవహారిక పదాలతో నింపి, అక్కడక్కడా మాత్రమే మాండలిక పదాల్ని వేసే రచనా రీతికి భిన్నంగా మొత్తం కవితను యిలా మాండలికంలో రాయటమే ఉత్తమం, సమంజసం అనిపిస్తుంది నాకు. హరికృష్ణ గారూ! అందుకు మీకు అభినందనలు. కాళోజీని – ‘కంటికి మంటికి ఏకధారగా/మట్టి ముచ్చట్లను కై కట్టి చెప్పిన/తాళపత్ర పురాణం’గా అభివర్ణించటం కూడా బాగుంది.

Leave a Reply to Sundar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)