కథ

యామిని

డిసెంబర్ 2013

ఆకాశం కాస్త మబ్బుపట్టి మిట్ట మధ్యాహ్నమే సాయంత్రంలా అనిపిస్తోంది. చల్లగాలి వీస్తూ ఉండటంతో వాతావరణం తేలిగ్గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఆ రోజు ఇంటిలోనే ఉన్నాను. నేను పని చేసుకుంటూ ఉండటంతో నా భార్య మధు పక్క ఫ్లాట్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి వెళ్ళింది. లాప్‌టాప్ పక్కనపెట్టి కిటికీలో నుండి బయట మెల్లగా కదులుతున్న చెట్లను, ఆ చలికి వణుకుతున్న పక్షులనూ చూస్తూ నిలుచున్నా. ఇంతలో నా సెల్ మ్రోగింది.

“సార్ కూకట్‌పల్లిలో 2 బి.హెచ్.కె. అడిగారు. మీరే కదా.”

“అవును. మీరు శ్రీనివాస్ గారా?”

“అవునండీ. కె.పి.హెచ్.బి.లో ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్, రెడీ టూ ఆక్యుపై. నేను అడ్రెస్ మెసేజ్ పెడతాను. ఆ అపార్ట్‌మెంట్‌లో 302 వెళ్ళి చూడండి. 301 లో యామిని అనే మేడం ఉంటారు. ఆమె మీకు తాళాలు ఇస్తారు. నేను సాయంత్రం మిమ్మల్ని కలుస్తా” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే మెసేజ్ వచ్చింది.

నేను, మధుని తీసుకుని కారులో బయలుదేరాను. మధు ఇల్లు ఎలా ఉండాలని తను కోరుకుంటుందో నాకు వర్ణిస్తూ ఉంది. మధ్యమధ్యలో తనకి తెల్సిన వాస్తు విజ్ఞానం ప్రదర్శిస్తూ ఉంది. తనని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కాలేజుల్లో ఈ అమ్మాయిలు పోటాపోటీగా చదువుతూ వేరే విషయాలే పట్టించుకోరు. కెరీర్,  మార్కులు , రాంకులు  తప్ప వేరే విషయాలే మాట్లాడరు. అలాంటిది ఒక్కసారి  పెళ్ళయ్యాక కానీ తెలీదు వీళ్ళకు ఎన్నేసి విషయాల మీద అవగాహన ఉంటుందో   !!

మధుకి, నాకు పెళ్ళై 6 నెలలు కావొస్తుంది. మేమిద్దరం ప్రేమించి పెళ్ళిచేసుకున్నాం. ఇద్దరం క్లాస్‌మేట్స్. కానీ కాలేజ్‌లో ఉండగా నేను క్లాసులో తక్కువ, మిగిలిన విషయాల్లో ఎక్కువగా ఉండేవాడ్ని. మధు పూర్తిగా సిన్సియర్ స్టూడెంట్. అలాంటిది నన్నెలా ప్రేమించిందో తెలియదు. కాలేజు వదిలి వెళ్ళిపోయిన రెండేళ్ళకి ఒకరోజు ఫోన్ చేసి నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది. నిజానికి ఈ రెండేళ్ళలో తనెక్కడుందో నాకు,  నేనెక్కడున్నానో తనకి తెలియనే తెలియదు. తనకి ఆ రోజు ఇంట్లో పెళ్ళిచూపులు. ఎదురుగా పరిచయంలేని ఒకబ్బాయిని చూస్తూ, తనని పెళ్ళిచేసుకోవాలి అనే ఆలోచన రాగానే తనకి నేను గుర్తొచ్చానంట. ఆ రోజే నా నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేసింది. జరిగిన విషయాలు తను అలా చెప్పేసరికి నాకోసమే పుట్టిన తోడనిపించింది. వెంటనే ఒప్పేసుకున్నా.

“చిన్నా, ఆవిడ పేరేంటి?.. చిన్నా ఏం ఆలోచిస్తున్నావ్?” మధు గట్టిగా అరిచింది.

నేను కార్ పార్క్ చేస్తూ ఈ లోకంలోకి వచ్చాను

“ఏం లేదులే. ఏంటి అడిగావ్”

“ఆవిడ పేరేంటి?”

“యామిని”

301 దగ్గరకి వెళ్ళి మధు బెల్ కొట్టింది. నేను బయట నేమ్ బోర్డ్ చూసాను. యామిని ఇలాంటి పేరెందుకు పెట్టుకుంటారో అనిపించింది. పూర్తి పేరు “యామిని నిష్టల”. తలుపు తెరుచుకుంది. ఆమే అనుకుంటా ఏం కావాలి అన్నట్టు చూసింది. మధు విషయం చెప్పింది. ఆమె లోపలికి వెళ్ళి తాళాలు తెచ్చి ఇచ్చింది. మధు, నేను 302 వైపు నడిచాం. మధు ఇళ్ళంతా తిరిగి చూస్తూ ఉంది. నేను బాల్కనీ లోకి వచ్చి అశ్విన్‌కి ఫోన్ చేసాను.

“హ్మ్ చెప్పరా”

“రేయ్ అశ్విన్ యామిని, ఈ పేరు ఎక్కడన్నా విన్నావా?”

“మాంచి అమ్మాయి కనిపించిందా?  ఐ మాక్స్ లోనా?, రెస్టరెంట్లోనా?”

“అడిగిన దానికి సరిగ్గా చెప్పుబే”

“ఏమోరా నా గర్ల్‌ఫ్రెండ్స్ లిస్టులో ఆ పేరు లేదు”

“యామిని నిష్టల”

“యామిని నిష్టల.. రేయ్ మన శరత్‌గాడి వైఫ్ పేరు యామిని అనుకుంటా. ఏం ఎందుకు?”

“ఏం లేదు తర్వాత చెప్తా”

నాకు రెండేళ్ళ క్రితం ఎదురైన ఒక చేదు అనుభవం గుర్తొచ్చింది. కొన్నాళ్ళు షికాగోలో ఆన్‌సైట్‌లో గడిపి అప్పుడే ఇండియా వచ్చాను. దాదాపుగా అయిదు సంవత్సరాలుగా కలవని నా ఫ్రెండ్స్ సాగర్,అశ్విన్ ఆ రోజు కలుద్దామని ప్లాన్ చేసారు.

“ఇంకేంటి కబుర్లు. ఎలా ఉన్నాయి బర్గర్ బ్రతుకులు?” అని అడిగాడు అశ్విన్.

“బానే ఉందిరా చీజ్‌లా రిచ్‌గా, జిడ్డుగా రుచి పచి లేకుండా”

“అర్ధమవుతుందిరా నీ బాడీ చూస్తుంటే. అమెరికాలో చీజ్‌కి ఎక్కడ కరువొస్తుందో అని నిన్ను సెలవుల పేరుతో ఇండియా తగిలేసారా?”

“నువ్వసలేం మారలేదురా. ఏంటి ఇంతకీ ప్రోగ్రామ్?”

“ఈ రోజుకయితే నా కొంపకి పోదాం. తర్వాత సంగతి అక్కడ చూద్దాం.”

బయటకి వచ్చి కారెక్కుతుంటే దూరంగా ఎవరో శరత్‌గాడిలా అనిపించి “రేయ్ వాడు మన శరత్‌గాడిలా లేడూ?” అన్నాను.

సాగర్ నా వైపు క్వశ్చన్‌మార్క్ చూపు చూసి “ఏంటిరా నీకు తెలియదా? శరత్ చనిపోయాడుగా.” అన్నాడు.

“ఏ శరత్‌రా, నేను చెబుతున్నది మన క్లాస్‌మేట్ శరత్ గురించి. వాడు నాకు టచ్‌లో ఉన్నాడు  నెల క్రితం కూడా నాతో చాట్  చేసాడు. ఇండియా వచ్చాక కలుస్తా అన్నాడు”

” అరె,అవునా? నీకెలా చెప్పలేదు మేమెవరమూ? వాడు చనిపోయి ఇరవై రోజులవుతోంది . సూసైడ్”

“వ్వాట్? “నిర్ఘాంత పోయాను

“ఆర్ యూ సీరియస్? నాతో ఈమధ్యే మట్లాడాడురా.”

“నెల రోజులయ్యింది అంటున్నావుగా. ఇది జరిగి ఇరవై రోజులే అయ్యింది”

“నమ్మలేకపోతున్నా. అయినా సూసైడ్ ఏంటిరా? ఏమయ్యింది వాడికి?” ఇంకా నమ్మలేక పోతున్నాను

“సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటో తెలియటం లేదు. మంచి జాబ్ ఉంది. డూప్లెక్స్ హౌస్ కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు. అందమైన భార్య ..పెళ్ళయ్యి కనీసం రెండేళ్ళు కూడా కాలేదు”

మనసంతా భారంగా అయిపోయింది. అవే ఆలోచనలతో  అశ్విన్ ఇంటికి చేరాం. డిన్నర్ అయ్యాక ముగ్గురం బాల్కనీలో నిల్చున్నాం. ఆలోచనల మధ్యలో నాకొక విషయం గుర్తొచ్చింది. శరత్‌కి కాలేజులో ఉండగా నేనే మెయిల్ ఐడి క్రియేట్ చేసాను. నా పేరే పాస్వర్డ్‌గా పెట్టాను. ఇప్పటికే అదే పాస్వర్డ్ ఉంటుందని గ్యారంటీ లేదు. కానీ ఒకసారి ట్రై చేస్తే అనిపించింది.

“నాకు శరత్ జీమెయిల్ పాస్వర్డ్ తెలుసురా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా?”

“బ్రతికున్న మనుషుల విషయంలో ఎలాగూ లేదు. కనీసం చనిపోయినవాళ్ళ విషయంలో అయినా కాస్త మర్యాద పాటిద్దాం రా. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకు!  అయినా అయిందేదో అయ్యింది ..ఇవన్నీ ఎందుకిప్పుడు” అన్నాడు సాగర్.

“నాకూ తెలుసుకోవాలని ఉందిరా.  ఈ మధ్యవి మెయిల్స్ చూస్తే, ఏదైనా క్లూ దొరుకుతుందేమో!  కారణం తెలియొచ్చేమో” అన్నాడు అశ్విన్.

మెయిల్ ఓపెన్ చేసాం. పాస్వర్డ్ మార్చలేదు. రిసెంట్ మెయిల్స్, చాట్స్, ట్రాష్ ఫోల్డర్స్ వెతికినా ఉపయోగపడేలా ఏం కనిపించలేదు. కానీ డ్రాఫ్ట్స్‌లో రెండు మెయిల్స్ ఉన్నాయి. అందులో ఒక మెయిల్‌లో టూ నా మెయిల్ఐడికే ఉంది. ఆతృతగా ముగ్గురం చదవటం మొదలుపెట్టాం.

హాయ్ క్రిష్ణా,

ఎలా ఉన్నావురా? నిన్ను చూసి చాలాకాలమయ్యింది. ఇకముందు చూడనేమో కూడా. అర్ధంకాలేదా?  రేపో, ఎల్లుండో తెలుస్తుందేమోలే  !!ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. కానీ మాట్లాడితే నా మనసులో ఉన్న విషయాలు చెప్పలేను. అందుకే ఈ మెయిల్ వ్రాస్తున్నా.

నీకు ఎప్పుడు తెలియలేదేమో కానీ నువ్వు నా జీవితంలో చాలా స్పెషల్‌రా. నీకెప్పుడూ చెప్పలేదు కానీ నిన్ను నేను చాలా ఆరాధించే వాడిని!   . జీవితంలో కొన్ని ముఖ్యమైన మలుపుల్లో కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా మనం తలుచుకోవాల్సిన అవసరం లేకుండానే గుర్తొస్తారు. అందుకేనేమో ఈ రోజు నువ్వు గుర్తొచ్చావ్. చిన్నప్పుడు నేనెప్పుడూ నీలా ఉండాలనుకునేవాడ్ని. వచ్చే జన్మంటూ ఉంటే నీలా పుట్టాలనుకునేవాడ్ని. ఎందుకో నిన్ను చూసిన ప్రతిసారి నా జీవితం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించేది. నీ లైఫ్‌స్టైల్‌లో  కనిపించేది. ఒక అందమైన నిర్లక్ష్యం కనిపించేది ! అది నాకెంతో నచ్చేది ! కాని నిజానికి నీకే లైఫ్ విలువ బాగా తెలుసు.

మేమంతా క్లాసులు, పుస్తకాలు అని చచ్చిపోతుంటే నువ్వు హ్యాప్పీగా సినిమా, క్రికెట్ అని తిరిగేవాడివి. ఎగ్జామ్స్ ముందు మాత్రమే చదివేవాడివి. టాప్‌లిస్టులో వచ్చేసేవాడివి. అందుకే ఫ్రెండ్సంతా నీ చుట్టూ తిరిగేవారు. అందరిలానే నేను కూడా నీతోనే ఉండాలనుకునేవాడ్ని. కానీ నా షోడాబుడ్డి కళ్ళద్దాలు, పొట్టి పొట్టి పాంటులు మీకు నచ్చేవి కావు. నేను ఎందుకలా ఉండేవాడినో మీకు తెలియదు. తెలుసుకోవాలి అనేంత మెచ్యురిటీ ఆ వయస్సులో ఎవరికీ ఉండదులే.

నా మీద చాలా జోకులేసుకునేవాళ్ళు కదా. దిస్ డంబో కాంట్ అండర్‌స్టాండ్ అనుకునే వాళ్ళు. అర్ధమయ్యేవిరా, కానీ నాకు అర్ధమవుతుంది అని మీకు తెలిస్తే నేను మీకింకా లోకువైపోతాను. అందుకే ఏం అర్ధంకానట్టు నటించేవాడ్ని. ఐయామ్ గ్లాడ్ ఐ హేడ్ సమ్ ఇగో. మీ ప్రపంచం అమ్మాయిలు, లవ్, గ్రీటింగ్ కార్డ్స్… చాలా  అందంగా, రంగుల ప్రపంచం లా ఉండేది. నేను మాత్రం ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని ఏదో ఆలోచిస్తూ… ఎందుకిలా? నేనే ఎందుకిలా? ఇంతవరకూ ఎవరూ అడగలేదు. కానీ నాకు చెప్పాలని ఉంది. ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావ్.

చిల్లులు పడి, జల్లెడలా కనిపించే ఒక పూరి గుడిసెలో పుట్టాను నేను. పండగకో, పుట్టినరోజుకో బట్టలు తియ్యమని అడిగితే కలిసొస్తుందని స్కూల్ యూనిఫామే కొత్త బట్టలుగా  తీసేవాడు మా నాన్న, పాపం చిన్న గుమస్తా. కడుపు నిండా తినటం ఎలాగూ లేదు జీవితంలో కనీసం ఒక్కసారైనా కుండ నిండా వండటానికి కూడా నోచుకోలేదు మా అమ్మ.

స్కూల్లో ఉండగా అనుకుంటా ఒకరోజు ఆడుకుని అలసిపోయి ఇంటికి వచ్చాను. అమ్మ అన్నం పెట్టింది. ఆకలితో త్వరగా తినేసి ఇంకొంచెం పెడుతుందేమో అని చూస్తున్నా. అమ్మ నా వైపు చూడలేదు. ఎదురుగా కుండలో అడుగంటిపోయిన అన్నం. ఆకలికి ఇంకొంచెం అన్నం పెట్టమ్మా అని అడగాలనిపించినా అడగలేకపోయాను. అదే చివరిసారి నేను ఆటలకి వెళ్ళటం. ఆకలిని గెలవటానికి మొదట ఆటలు మానేసాను.

అప్పటి నుండి జీవితాన్ని సీరియస్ గా తీసుకోవటం మొదలుపెట్టాను. అందుకేనేమో నా జీవితం చివరి వరకూ సీరియస్ గానే మిగిలిపోయింది. ఎంత ఆలోచించినా బాగా చదవటం తప్ప నా జీవితంలో ఎదగటానికి మరో మార్గం కనిపించలేదు. అందుకే కష్టపడి చదవటం మొదలుపెట్టాను. క్రికెట్, సినిమా, గర్ల్స్..వీటిని ఇష్టపడే స్థోమత నాకు లేదు. వాటికి బదులుగా చదువుని మరింత ప్రేమించాను.

సాధించిన మార్కులు జీవితంలో ఆనందంగా ఎలా బ్రతకాలో నేర్పించకపోయినా ఒక ఉద్యోగాన్నయితే సంపాదించిపెట్టాయి. ఉద్యోగం వచ్చేసాక నేను ఆనందానికి ఇంక ఒకే ఒక్కఅడుగు దూరంలో ఉన్నా అనుకున్నా. అందుకే రిలాక్స్ అవ్వలేదు. తిండి,నిద్ర మానేసి పనిచేసాను. కారు కొన్నాను, ఇల్లు కొన్నాను. పొట్టి ఫేంట్లుపోయి, బ్రాండేడ్ బట్టలొచ్చాయి. షోడాబుడ్డి కళ్ళద్దాలు పోయి కాంటాక్ట్ లెన్స్ వచ్చాయి. చాలా అందమైన చదువుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. నా జీవితం ఒక్కసారిగా రంగులమయం అయిపోయింది. నేను నా జీవితాన్ని మార్చేసుకున్నాను అనుకున్నా, కానీ ఇది పై వాడు  వ్రాసిన జీవితం కదా. మారటానికి ఆయన ఒప్పుకోలేదు.

తల తిప్పాను

“మెయిల్‌లో ఇంతవరకే ఉందిరా”

“వాడు ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడురా. కానీ ఏదో కారణంతో ఆగిపోయాడు”

“డ్రాఫ్టులో ఇంకో మెయిల్ ఉన్నట్టుంది ఎవరో యామిని కి పర్సనలేమో. చదవటం మంచిదికాదేమోరా” అన్నాను

సాగర్ లాప్‌టాప్ నా చేతి నుండి లాక్కొని చదవటం మొదలుపెట్టాడు.

యామిని,

నేను మీకు చేస్తున్నది న్యాయమో, అన్యాయమో నాకు తెలియదు. నేను బాగా అలసి పోయాను. జీవితంతో ఇక యుద్ధం చేసే ఓపిక లేదు నాకు !! కానీ ఇంతకు మించి నేనేమీ చెయ్యలేకపోతున్నా.  .ఆనందమనేది నేను సాధించుకునేది అనుకున్నా ఇంతకాలం. కానీ డెస్టినీ డిసైడ్ చేస్తుందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అండ్ దిసీజ్ వాట్ డెస్టిని డిసైడెడ్ ఫర్ మి. నాకు తెలుసు ఇందులో మీ తప్పేమీ లేదు. మిమ్మల్ని కాకుండా మరొకర్ని చేసుకుంటే నా జీవితం బాగుండేదేమో అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది నా జీవితం! పుట్టటమే దురదృష్ట వంతుడిగా పుట్టానేమో నేను!  మన పెళ్ళిలో అందరూ నా అంత అదృష్టవంతుడు లేరని అన్నారు. ఆ రోజు జనాల కళ్ళల్లో అసూయ చూసాను. ఇన్నాళ్ళ నా ప్రార్ధనలకు ఫలంగా ఆ దేవుడు నాజీవితానికిచ్చిన కొత్త వెలుగు మీరే అనుకున్నాను. కానీ నేను మీ జీవితంలో చీకటి నింపుతున్నానని తెలుసుకోలేకపోయాను. మీరు మరొకరిని ప్రేమించారని, మీ ఇష్టం లేకుండా మన పెళ్ళి జరిగిందని నాకు ముందే తెలుసుంటే మీ ఆనందాన్ని దూరం చేసేవాడ్ని కాదు. అప్పటికీ మీరు కోరుకున్నవాడితో మీ పెళ్ళి చేద్దామని మనస్పూర్తిగానే అనుకున్నాను. కానీ మీరే మీ ఫ్యామిలీ పరువుపోతుందని ఆపేసారు.

మీరు కోల్పోయిన ప్రేమకి బదులుగా ప్రపంచమంతా నిండి ఉన్న ప్రేమని మీ కాళ్ళ దగ్గర పెట్టాలనుకున్నాను. మీరు దూరమైందనుకుంటున్న ఆనందాన్ని తెచ్చి మన వాకిట పువ్వులుగా నింపేద్దామనుకున్నాను. కానీ అందుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. ఈ ప్రేమలేమితో నేను బ్రతకలేకపోతున్నాను.. తాళి కట్టిన భార్యకి కూడా సొంతంకాలేని ఒంటరి దరిద్రుడ్ని నేను. పెళ్ళికి ముందే మీ మనసు మరొకరి సొంతమైందని తెలిసిన క్షణాన్నే నేను మనసు రాయి చేసుకుని ఉండాల్సిందేమో!

నా జీవితంలో ఆనందానికి ఆస్కారం లేదు. ఎంతకాలం బ్రతికినా పోరాడినా మిగిలేది నిరాశే. ఒంటరిగా పోరాడలేకే మీ చేతుల ఆసరా కావాలని, జీవితాన్ని ఆనందంతో నింపుకోవాలని  నా జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించాను. కానీ ఇప్పటికీ నేను ఒంటరినే. ఇక పోరాడటం నావల్ల కాదు. కనీసం మీ జీవితమైనా మార్చలనుకున్నాను. అదీ కుదరలేదు. ఏం చెయ్యలేని నిస్సహాయతతో వెళ్ళిపోతున్నా. మీకు చివరగా ఒకే ఒక్క సహాయం చెయ్యగలుగుతున్నా. మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తే, మీకు ఇబ్బంది కలగకుండా మొత్తం నా ఆస్తులన్నీ  అన్నీ మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసాను.

ఇది ఎవరినో ద్వేషిస్తూ కాదు. నన్ను నేను ద్వేషిస్తూ, నాకు నేను వేసుకుంటున్న శిక్ష.

బై ఫరెవర్

ముగ్గురి కళ్ళలో నీళ్ళు నిండాయి. ” ఆమెను వదల కూడదురా. ఈ మెయిల్ చాలు ఆమె చేసిన అన్యాయం ప్రూవ్ చెయ్యటానికి. పదండిరా  అంతు చూద్దాం!!  ఇష్టం లేనప్పుడు ఎందుకురా చేసుకుంది?” అన్నాడు సాగర్ ఆవేశంగా.

“వాడు ఈ  రెండు మెయిల్స్ రాసి కూడా …పంపలేదు అంటే వాడుపోయాక వాడి వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదు అనుకున్నాడు. అదే వాడి చివరి కోరిక. పోయినవాడు ఎలాగూ తిరిగి రాడు. ఇప్పుడు మనం అల్లరిచేస్తే, అల్లరిపాలయ్యేది ఆ అమ్మాయి మాత్రమే కాదు, పదిమందిలో శరత్‌గాడి చావే నవ్వులపాలవుతుంది. అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. చనిపోయిన తర్వాత వాడికిలాంటి అవమానం అవసరమా? ఇక్కడితో వదిలేద్దాం” అని అప్పటికి చెప్పాను కానీ చాలాకాలం ఆ ఆలోచనలు నన్ను వదల్లేదు.

వెనుక తలుపుకొట్టిన చప్పుడికి వెనక్కితిరిగి చూసాను. తలుపు దగ్గర నిల్చుని పలకరింపుగా నవ్విందామె. మధు వెళ్ళి మాట కలిపింది. వాటర్ సప్లై గురించి, పనివాళ్ళ గురించి వాకాబు చేసింది. “కాఫీ త్రాగుతూ మాట్లాడొచ్చు రండి” అని వాళ్ళింటికి పిలిచింది. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం వెళ్ళాను. ఇంటిలో దండ వేసిన పెద్ద ఫోటో ఫ్రేమ్‌లో శరత్ నా వైపే చూస్తున్నట్టుగా అనిపించింది.

“మిమ్మల్ని ఎక్కడో చూసినట్టనిపిస్తుంది. మీది ఏ ఊరు?” అని అడిగిందామె. మధు మా వివరాలు చెప్పింది.

“శరత్ కాలేజ్ ఫోటోల్లో చూసుంటారు నన్ను” కావాలనే చెప్పాను. శరత్ ఫోటో చూసాక ఎందుకో కంట్రోల్ కోల్పోయాను నేను.

“శరత్ మీకు తెలుసా?”

ఆమె అప్పటికే నా ప్రవర్తనలోనూ, బాడిలాంగ్వేజ్‌లోనూ తిరస్కార భావాన్ని గ్రహించిందని తెలుస్తూనే ఉంది. నాకు కావాల్సింది కూడా అదే. ఆమె చేసిన తప్పులకి ఏ దేవుడూ వెయ్యని శిక్ష నేనే వేసెయ్యాలన్నంత ఆవేశం నా ఆలోచనల్లో పరిగెడుతుంది. ఆ నిమిషానికి చాలా రెస్ట్‌లెస్ ఫీలింగ్ నన్ను తొందరపెడుతుంటే మర్యాద అనే ముసుగుని తీసి పక్కన పడేసాను.

“వాడు ఎందుకు చనిపోయాడో కూడా తెలుసు”

నన్నెప్పుడూ అలా చూడని మధు కంగారుగా “క్రిష్ణా, దేవుడిగది చూడలేదు వెళ్దామా?” అని లేచింది.

“యామిని అంటే రాత్రి  కదా.  రాత్రిని ప్రేమించి జీవితాన్ని చీకటి చేసుకున్న పిచ్చోడు వాడు” అని కసిగా అనేసి నేను కూడా లేచాను. ముక్కూ మొహం తెలీని ఒక వ్యక్తి తో అలా మాట్లాడవచ్చో లేదో ఆ క్షణాన ఆలోచించలేదు. ప్లెయిన్ గా ప్రశాంతంగా అమాయకంగా ఉండే శరత్ మరిక లేడనే వాస్తవం మాత్రమే నా మనసు నిండా, మెదడు నిండా ఆక్రమించింది !

 

ఆమెకు నా ఆవేశం అర్ధంకావటానికి, అర్ధమయ్యాక అందులో నుండి తేరుకోవటానికి కొంత సమయం పట్టింది. ఈలోగానే నేను,మధు గడప దాటి బయటకి వచ్చేసాం.

“ఒక్క నిమిషం” అని   ఆమె పిలిచింది. ఆగాలనిపించకపోయినా ఆగాను. మధుకి కంగారు ఎక్కువయ్యింది.

“మీకేం తెలుసో ఎలా తెలుసో నాకు తెలియదు. మీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ శరత్‌కి అన్యాయం జరిగిందని మీరు బాధపడుతున్నారంటే ఆయన మీకు ఎంత మంచి ఫ్రెండో అర్ధమవుతుంది. నావల్లే ఇది జరిగింది అని చెప్పగలిగారంటే మీకేం తెలుసో నాకర్ధమయ్యింది” అని మధు వైపు చూసింది. నేను దూరంగా నిలబడి చూస్తున్నాను.

“శరత్ ఈయనతో  ఎప్పుడూ ఏం చెప్పలేదు” అని మెల్లగా చెప్పింది మధు.

“చెప్పటానికి తనకి మాత్రం ఏం తెలుసు” అని నిర్లిప్తంగా నవ్విందామె.

“ఒకరోజు ఉదయం కాలేజికి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేసరికి. ఇంట్లో ఎవరో తెలియని ఒకబ్బాయి సోఫాలో కూర్చుని ఉన్నాడు. కొనుక్కోబోయే ప్రాపర్టీని తనిఖీ చేస్తున్నట్టుగా, పట్టి పట్టి నన్నే చూస్తున్న ఒక కుటుంబం, మా ఇంటిలో నేనే అపరిచితురాలిలా అనిపించింది ఆ క్షణం.  ఏంటనడిగితే పెళ్ళి చూపులన్నారు. ఒక పది నిమిషల తర్వాత నా గదిలోకి వెళ్ళిపొమ్మన్నారు. బయట ఏవో మాట్లాడుకున్నారు. అబ్బాయికి పెద్ద ఉద్యోగం,లంకంత ఇల్లు,కారు,పైసా కట్నంలేదు. అంతే పెళ్ళి నిశ్చయించేసి ఉదయానికి ముహుర్తాలు కూడా ఖాయం చేసారు. పెళ్ళి హడావుడి మొదలయిపోయింది. అందరూ పెళ్ళి పనిలో బిజీ. నాతో ఎవరూ ఏం మాట్లాడలేదు.

 

 

నా మనసులో ఉన్న వ్యక్తి గురించి , కనీసం అమ్మకైనా చెప్పాలనుకున్నాను

“ఛీ నోర్ముయ్యి” అని తన నోరు నొక్కుకుని, నా గొంతు నొక్కేసింది అమ్మ.

“మంచబ్బాయమ్మా నీ అదృష్టం” అని చెబుతున్న నాన్నతో, “కాపురం మంచిగా ఉండాలంటే ఇద్దరు మనుషులూ మంచోళ్ళయితే సరిపోదు నాన్నా” అని చెప్పాలనుకున్నా, కానీ నేనేమి మాట్లాడకుండా అమ్మ జాగ్రత్తపడింది.

మధుగారూ, మీకు తెలియంది కాదు. ఆడపిల్లలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టే కనిపిస్తారు కానీ కళ్ళకు కనిపించని గొలుసేదో మన మెడకు చుట్టుకుని మనల్ని నియంత్రిస్తూనే ఉంటుంది. ప్రేమగా పెంచుకునే కుక్కపిల్లకి మనకి ఆ గొలుసొక్కటే తేడా. అది గొలుసు కాదు పరువు, నియంత్రణ కాదు బాధ్యత అని నమ్మించటమే ఆడపిల్లను పద్దతిగా పెంచటం. పద్దతిగా పెరిగిన నేను తలొంచాను. అసలు అంతకంటే ఏమి చేయాలో నాకు తెలియలేదు. ఆలోచించే శక్తిని నా మెదడు ఈ హటాత్పరిణామం తో పూర్తిగా కోల్పోయింది

నేనొచ్చి కలుస్తా అని ఒకడు కాలేజి గార్డెన్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉంటే, వాడితో ఒక్కమాట చెప్పే అవకాశం కూడా లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది. నా కోసం, నేను కలలుకన్న జీవితం కోసం ఏడ్చే ప్రివిలేజ్ ఎలానూ లేదు. కానీ నిర్ధాక్షిణ్యంగా నేను ఒకడ్ని మోసం చేసాను. వాడి గురించి ఏడ్వాలి కదా. నా చేతులతో నేను నాశనం చేసిన వాడి జీవితం గురించి ఏడ్వాలి కదా. కానీ నాకు ఆ అవకాశం కూడా లేకపోయింది.

పెళ్ళయిన మరుక్షణం నుండీ శరత్ నామీద విపరీతమైన ప్రేమ చూపించారు. ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. నా దగ్గర నుండి కూడా అంతే ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేసారు. ముందురోజు వరకూ ఒకర్ని ప్రేమించి తనే జీవితం అనుకుంటున్న మనసుని ఒక్కసారిగా మార్చటం ఎలా? అలా అని నటించలేను. మోసం చేస్తున్నానేమో అని బాధ మరో పక్క. నరకం అనుభవించాను. దానికంటే చావు చాలా చిన్నది.

యామినిగా చచ్చి శరత్ భార్యగా నేను బ్రతకాలంటే నాకు కొంత టైమ్ కావాలి. కానీ శరత్ నాకు ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. జరిగింది ఒక యాక్సిండెట్ అనుకుని మరిచిపోదామనుకున్నా. యాక్సిడెంట్‌లో చెయ్యో, కాలో పోతే ఆ విషయం డైజెస్ట్ చేసుకోవటానికి, అలవాటు చేసుకోవటానికి కొంత టైమ్ పడుతుందిగా. నేను అలాంటి హీలింగ్‌లో ఉండగా శరత్‌కి నా ప్రేమ గురించి తెలిసింది. ఆయన ఒక్కసారిగా కృంగిపోయారు. రోజుల తరబడి తన గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ గడిపారు.

ఒకరోజు నువ్వు ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి చేసేస్తా అని చెప్పారు. నాకు విరక్తిగా అనిపించింది. రెక్కలు కత్తిరించేసిన పక్షికి పంజరమే రక్ష, పంజరం నుండి వదిలేస్తా అంటే ఏమనగలుగుతుంది? ఆయన ధోరణి చూసి మనసు విప్పి మాట్లాడాలనుకున్నా. “ఫలానా వ్యక్తితోనే వ్రాసిపెట్టి ఉందని తెలిస్తే ఏ ఆడపిల్ల మరో వ్యక్తిని ప్రేమించదు. ఆ తెలియనితనమే నాది కూడా. ఈ సమస్య నుండి బయటపడటానికి నాకు కావల్సిందల్లా కాస్త టైమ్, అర్ధంచేసుకునే తోడు” అని చెప్పాలనుకున్నాను. కానీ మాటల్లో నా ప్రేమ పస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన దెబ్బతిన్న పక్షిలా అయిపోయేవారు. లోకమంతా కలిసి తననే మోసంచేసిందన్నట్టుగా డిప్రెస్ అయ్యేవారు. నేనేమనుకుంటున్నానో తెలుసుకునే ప్రయత్నం తనెప్పుడూ చెయ్యలేదు. అందుకే ముభావంగా ఉండటం అలవాటు చేసుకున్నాను.  రోజూ కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపించేవారు. ఏం మాట్లాడాలన్నా తనని బాధ పెడుతున్నానేమోనని భయం, గిల్టీ. తన నిశ్శబ్ధం నిరాశ అనుకున్నానే కానీ, ఇలాంటి నిర్ణయానికి సన్నద్దం చేసుకుంటున్నారనుకోలేదు. ఈలోపే అంతా జరిగిపోయింది.

ఆమె గొంతు కాసేపు మూగబోయింది. మధు కళ్ళు చెలమలయ్యాయి. నేను నిస్సహాయంగా నిలబడిపోయాను.

“తనకి జరిగిన  అన్యాయానికి కారణంగా నన్ను నిందిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయానికి ఎవరిని నిందించాలి? తొందరపడి నన్ను బెదిరించి పెళ్ళి చేసి ఇప్పుడు నిస్సహాయంగా చూస్తున్న  అమ్మా నాన్నలనా?? ప్రేమ కావాలి కావాలి అని తపించి నాకు ఏ తోడుని ప్రేమని మిగల్చకుండా వదిలేసి వెళ్ళిపోయిన శరత్‌నా?”

యామిని తన కంటనీరు కళ్ళుదాటి బయటకు వస్తుందని గుర్తించగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధు, నేను ప్రాణంలేని శిలల్లా నిలబడిపోయాం.

అనంతమైన సాగరఘోషకు అలలు, అంతులేని ఆమె దుఃఖానికి కన్నీళ్ళే సాక్ష్యం !!

*** * ***



38 Responses to యామిని

  1. sasikala
    December 1, 2013 at 9:44 pm

    హ్మ్…..మనసు విప్పి మాట్లాడుకుంటే ఎన్నో అపార్ధాలు తొలగిపోతాయి .
    కనీసం పెద్దలకు అయినా చెప్పి ఉండాల్సింది . మనసులో మాట చెప్పుకొనే
    తోడు లేక పోవడమే ఈ రోజుల్లో మనిషిని వేదిస్తున్న దురదృష్టం .
    చాలా బాగా వ్రాసారు మురళి గారు

    • December 3, 2013 at 3:31 am

      ఒకే ఇంటిలో బ్రతికే మనుషుల మధ్య కూడా అడ్డుగోడలు వచ్చేస్తున్నాయి. దురదృష్టం. చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్యూ.

  2. దినకర్
    December 2, 2013 at 12:21 am

    ఒకవేళ ఇది వాస్తవంగా జరిగిన విషయం అయితే, మారుతున్న కాలానికి పెద్దరికం ఎంత అవసరమో తెలుస్తుంది. పెద్ద సంపాదన వస్తే పెద్ద బుద్ధి వస్తుంది అనుకోటం, తల్లిదండ్రులు పిల్లల మధ్య maturity పేరుతో అఖాతం ఏర్పడటం, పిల్లలు పెద్దలకి ఎం చెప్పక పోవటం, పెద్దలు ఏమి పట్టించుకోకపోవటం, ఇవన్ని కచ్చితమైన కారణాలు.

    రెండు సంవత్సరాలు చిన్న వ్యవధి కాదు.. రాజి పడితేనే బంధాలు, బాంధవ్యాలు నిలబడేవి, ఒకరినొకరు నొప్పించుకుంటూ పోతుంటే దూరం పెరుగుతుందే కానీ తగ్గదు.

    • December 3, 2013 at 3:32 am

      ఒక వాస్తవ సంఘటనే దినకర్‌గారూ. కానీ అమ్మాయి, అబ్బాయిల వెర్షన్స్ మనకు తెలియవు కాబట్టి వాటిని నేను వ్రాసుకున్నాను.

  3. ennela
    December 2, 2013 at 9:26 am

    ప్చ్ ప్చ్…

    • December 3, 2013 at 3:35 am

      ప్చ్ అంతకంటే ఏమనగలం ఎన్నెలగారూ

  4. Rajkumar
    December 2, 2013 at 10:05 am

    ఎప్పటిలాగానే ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసేలా రాశావ్ మురళీ.

  5. December 2, 2013 at 10:39 am

    కావలసినది ఈ కాస్త సహనం, బ్రతికి చూడాలన్న సహనం. ఇప్పుడందరికీ, జీవితంలోని ప్రతీ ఫేజ్‌లోనూ కావల్సింది ఇదే.

    ” this too shall pass” అని అనుకోవడంలో గొప్ప ఊరడింపు ఉంటుందని కాదు, కానీ ఓపిగ్గా ఎదురు చూస్తే కాలం మాన్పేగాయాలు మాత్రం చాలానే ఉంటాయ్. మానిందో లేదో చూసుకోవడానికి మనిషి ఉండాలంతే.
    “రెక్కలు కత్తిరించేసిన పక్షికి పంజరమే రక్ష” — చక్కటి మాట. కథలో అందంగా, అర్థవంతంగా ఒదిగింది.

    • December 3, 2013 at 11:26 am

      తరానికి తరానికి సహనం తగ్గిపోతూ ఉంది మానసగారూ. రాబోయే రోజుల్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాం.

      కథ చదివి బదులిచ్చినందుకు థాంక్యూ

  6. December 2, 2013 at 10:49 am

    అబ్బా మీ కథల్లో ఆ చివర్లో పించింగ్ ఉండకుండా ఉండదు కదా ! Very nice narration

    • December 3, 2013 at 11:27 am

      థాంక్యూ శ్రావ్య. మీతో ఇలా అనిపించుకోవాలి కదా మరి :)

  7. December 2, 2013 at 4:37 pm

    కథ, కథనం రెండూ బావున్నాయండి. రెండు మనసులతో ముడిపడిన బంధాల్లో… కొన్ని అపశృతులు, సంవాదాలు చినికి చినికి గాలివానై చివరకు ఆ బంధమే చిక్కుముడిగా మారడమో, తెగతెంపులు అయిపోవడమో ఇటీవలికాలంలో ఎక్కువగానే చూస్తున్నాం. నిజానికవి పరిష్కారం లేనివిగానో, జీవితాన్నే పణంగా పెట్టాల్సినంత జటిల సమస్యలుగానో కూడా కనిపించవు. మానవ సంబంధాలు మరీ పెళుసుగా మారిపోతున్నాయేమో! ఇక, బాల్యం నుండి లెక్కలేనన్ని డక్కామొక్కీలు తిని, స్థిరపడ్డ శరత్ కూడా చివరకు అలాంటి నిర్ణయంతో జీవితానికి ముగింపు పలకడం చూస్తే హృదయం బరువెక్కుతుంది. ఇక్కడ, అన్నిరకాలుగా అసహాయతకు గురైన యామినీ వెర్షన్ ను చక్కగా ఎస్టాబ్లిష్ చేసి కథకు ముగింపు పలకడం బావుంది.

    • December 3, 2013 at 11:39 am

      నాగరాజ్‌గారూ, తన కష్టాలన్నీ తీరిపోవాలని వీలైనంత వేగంగా పరిగెట్టిన శరత్‌కి ఎదురుగా ఎక్కాల్సిన మరో కొండ కనిపించే సరికి జీవితమంతా ఇంతే అని నిరాశకులోనయిపోయాడు. అందులోనూ యామిని ప్రవర్తన అతనిలో ఏ ఆశనూ రగిలించి ఉండకపోవచ్చు. చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్యూ.

  8. sri
    December 2, 2013 at 9:19 pm

    ఈ సరి మర్చిపోకుండా టిష్యూ బాక్స్ పక్కనే పెట్టుకున్నా..ప్రేమ కథలు రాయటం లో మీకు మీరే సాటి.బావుందండి మురళి గారు.

  9. December 2, 2013 at 10:12 pm

    చాలా బాగుంది మురళి, ముఖ్యంగా యామిని వర్షన్ స్పష్టంగా చెప్పడం నాకు బాగా నచ్చింది.

  10. pavan
    December 3, 2013 at 12:16 am

    చాల బాగుంది

  11. శ్రీ
    December 3, 2013 at 6:59 am

    బాగుంది, మంచి కథ.

  12. December 3, 2013 at 11:30 am

    చాలా బాగుంది .యామిని చెప్పిన మాటలు చాలా నచ్చాయి .బాగుందండి

    • December 3, 2013 at 11:48 am

      చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్యూ

  13. December 3, 2013 at 11:38 am

    జీవితంలో కొన్ని మలుపులు మన ప్రమేయం లేకుండానే తిరిగిపోతుంటాయి. ఎవరినీ తప్పు పట్టలేం, ఎవరి పరిధిలో వారు కరక్టే.
    “రెక్కలు కత్తిరించేసిన పక్షికి పంజరమే రక్ష”, కొన్ని వ్యాక్యలు ఆలోచనలో పడేశాయి.
    మంచి కధ.

  14. Ramakrishna
    December 3, 2013 at 1:18 pm

    చాలా బాగుంది మురళి.

  15. చందు శైలజ
    December 3, 2013 at 9:46 pm

    కథ చదవడం లేటైందండీ. చాలా బాగా రాశారు.

  16. జాన్ హైడ్ కనుమూరి
    December 4, 2013 at 2:16 pm

    కథ చాలా బాగా రాశారు.
    కథను బాగా నడిపించారు

    అభినందనలు అభినందనలు

  17. December 4, 2013 at 5:15 pm

    ఈ కథలో నాయకుడు జీవిత౦తో యుద్ధం చేశాడు. అనుకున్నది సాధించాడు. ఆ విజయం సాధించడానికి సహకరించిన ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కడ పోగొట్టుకున్నాడో మరి. రెండో సారి కనీసం ప్రయత్నించకుండానే లొంగిపోయాడు …కథనం బావుంది మురళి గారు.

    • December 24, 2013 at 3:23 am

      జ్యోతిర్మయి గారూ,

      పోరాటాన్ని అలవాటు చేసుకున్నవాడు మారధాన్‌లు పరిగెడుతూనే ఉంటాడు. కానీ కళ్ళెదురుగా కనిపిస్తున్న గమ్యం వరకే ఈ పరుగు అని ఆశపడుతున్న వాడు స్ప్రింట్స్ మాత్రమే పరిగెట్టగలడు. మారథాన్లు సాధ్యం కాదు. అదే జరిగింది శరత్ విషయంలో

  18. December 4, 2013 at 10:37 pm

    కధా, కామెంట్లు అర్ధవంతంగా , నిజమే కదా అనిపించేట్టు ఉన్నాయి.

  19. ravikanth
    December 5, 2013 at 11:17 am

    టచ్ చేసావ్ మురళి….నీ కథలు చదువుతుంటే లైవ్ లో ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా చూస్తున్నట్టు ఉంటుంది… హాట్స్ ఆఫ్ ….

Leave a Reply to జ్యోతిర్మయి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)