కవిత్వం

నన్ను నేను వెతుక్కున్నప్పుడు…

జనవరి 2014

నాకు ఆ గది అంటే చాలా ఇష్టం.

దాని తాళం చెవి
రోజూ ఎక్కడో ఒక చోట
పారేసుకుంటూనే ఉంటాను.

పోగొట్టుకోవడం చాలా తేలిక
తిరిగి పొందాలంటేనే
మరో జీవితకాలం తపస్సు చేయాలి.

బాల్యంలో నా చిరునామా ఆ గదే
ఒంటరి తీగనైనప్పుడు నన్ను
నన్నుగా ఆదరించిన పొదరిల్లు అది
జీవనదశలు మారుతూ
బాంధవ్యాల బంధనాల
వూబిలో చిక్కుపడిపోయినప్పుడు
బేలతనంతో జాలిగా నావైపు
చూసిన చూపు రామబాణంలా
గుండెల్లో దిగబడిపోయేది.

మోహాలు, వయసు దాహాలు,
ఆకర్షణలు, అప్యాయతలు,
అనుభవాలు, అనుభూతులు… అన్నింటిని
సమయపు సందు దొరికినప్పుడల్లా
తనలోనే దాచుకునేవాడిని.
అశాంతి అగ్నిగుండంలో
కొట్టుమిట్టాడుతున్నప్పుడు
ఆ గదే నా అమ్మవొడి.

బాధ్యతలన్నీ దూదిపింజలై విడివడ్డాకా
నా అన్వేషణ సూదంటు రాయిలా
ఇంకా ఆ తాళంచెవికోసమే…

జీవన మలిసంధ్యలో
వెనక్కు తిరిగిచూసుకుంటే
మనసులో
ఓ మారుమూల
లోకమంతా వెతుక్కున్నా దొరకని
నా గది తాళం చెవి

ఒడిసి పట్టుకున్నాను.