మోహన రాగం

ఒక బృందావని

ఫిబ్రవరి-2014

ప్రపంచంలో మూడొంతులు నీళ్ళయితే తన పరిచయంలోనూ ఒక వంతే పూలు

 

చేమంతులు చిలకరించి

మల్లెల మూట విప్పి పరిచినట్టు

అక్కడక్కడా గులాబీ రేకులు అద్ది

మరువాన్ని మాత్రం

రహస్యంగా దాచినట్టు

గుల్మొహర్ గుత్తులతో గిరి గీయగా

జాజులజావళితో నక్షత్రాలొచ్చినట్టు

బుగ్గలకింద చేతులెట్టుకుని

రేయంతా వెన్నెలై ఎదురుచూస్తే

జారిపడ్డ మంచుబిందువుల్ని పోగేసుకుని

కిలా కిలా నవ్వింది ఒక బృందావని

నాకు నీకంటే నీ మెయిల్ తోనే ఎక్కువ పరిచయం. ఇన్ బాక్స్ లో ఇలా ఇంకా పూర్తిగా వికసించని ముద్ద మందారంలా కనబడుతుందా, లోపల రాయబారమేమిటా అని మనసు ఉరకలేస్తూనే వున్నా, కాసేపు ఆ ఉత్తరాన్ని తెరవకుండా అలా ఓ క్షణం పరికిస్తుంటా ఎదలోని నవ్వు నువ్వవుతుండగా. ఇక ఆ మందారం తెరుచుకోగానే, పసుపు పుప్పొడిని అద్దుకున్న అక్షరాల తీగ ఒక వరసో, రెండు వరసలో సాగుతుందా….వాటెమ్మటే కళ్ళు పరిగెత్తే వేగాన్ని నువ్వయితే కొలవలేవు. చెబితే విని ఊరుకుంటావో! నవ్వి చురకేస్తావో! కొన్ని నీకు చెప్పకుంటేనే అందము. నువు రాసిన మాటలు మనసు దాకా చేరతాయి, అయినా అర్ధం కానట్టే. అంటే మళ్ళీ చదవమనే కదా.అదీ అవుతుంది. ఈసారి ఏదో అర్ధమయినట్టు కాస్త సర్దుక్కూచుంటుంది. అయినా ఇంకోసారి చదువుతాను. ఇంకోసారి….ఇంకోసారి…ఇప్పుడు పూర్తిగా ఓ చిన్నపాటి హాయి భావం. మెల్లిగా పని చేయడం మొదలెడతానా, మధ్య మధ్యలో నువు పిలుస్తూనే వుంటావు. చదివిన మెయిలే అని మనసూరుకుంటుందా, వెళ్ళెళ్ళి ఆ మెయిల్ ముందే కుదేలవుతుంది. నీ పదాల మీదుగా పయినిస్తూ నీదాకా చేరుతుంది. కిటికీలో నుండి ఆ క్షణమెలాగుందా అని చూస్తాను. అది ఎండో, వానో, మంచుజల్లో, ఏదయినా కానీ  నువ్వు కనబడతావు. అది పిచ్చనిపించే ఓ స్వచ్చమైన క్షణమనుకో, మనసు నాటుకున్న మల్లి అంటనుకో. తల తిప్పి చూస్తునా, ఇక పని పిలుస్తుంటే ఇంకోసారి ఆ మెయిల్ చదివి ఓ పక్కకు నెడతాను. ఇదే తంతు ఇంకో మెయిల్ నీ నుండి తొంగిచూసేవరకు. కొత్త మెయిల్ వచ్చిందా ఇదే వరస.

 

నాలుగు పదాలో, నాలుగు వాక్యాలో

అవి నీ నుండి అని తెలిసాకా

కళ్ళు కొలవడం మానేస్తాయి

వసంతగాలికి ఊగే

పూలతీగవుతుందీ గుండె

 

అందమైన వ్యాకరణాన్ని అల్లుకున్న ఓచిన్న సందేశానికి అంతేసి బలముందాని అచ్చెరువొందిన సందర్భాలెన్నో నీ ఖాతాలో రాసాను. చంద్రుడి లాలి పాట  సూర్యునికి సుప్రభాతమవుతుండగా నా మదితో సంప్రదింపులు మొదలెడతావు. ఎప్పుడో అనుకున్నాను, నా ఉదయాల్ని నువు పలరించలేకపోతున్నావనీ, నా నిద్రమోముని నిమరలేకపోతున్నావని. నీకు తెలుసో లేదో, కవిత్వం కూడా కలలు కంటుందని, అప్పుడప్పుడూ అవీ నిజమవగలవనీ. అవన్నీ కూడబలుక్కుని నిన్ను కమ్ముకుంటున్నట్టున్నాయి. మెల్లి మెల్లిగా నువు నా ఉదయమవడం మొదలెడుతున్నావు. ఇక పగలంతా పదాలు మోసుకొస్తావు. నీ మెయిళ్ళ ప్రవాహమెక్కువయినరోజయితే పల్లెటూళ్ళో పంటచేల్లో  తిరిగినట్టే వుంటుంది . అదిగో…అప్పుడే… టక్కున పుట్టేసిన ఓ మబ్బుతునకలా, నిను తాకాలనిపించే చిరుకోరికవవుతావు. ఆ క్షణమే వెళ్ళి  బాల్కనీలో నిలుచుంటా. నను తాకెళ్ళిన గాలి నిను ఆనుకుంటైనా వెళ్ళకపోతుందాని. ఎదురుగా వాహనాలన్నీ మెలికలు తిరుగుతూ, మలుపులు తిరుగుతూ ఎటేటో పోతుంటాయా. ఆ దృశ్యం కేవలం కళ్ళ వరకే. మస్తిష్కం వాటినన్నిటిని తప్పించుకుంటూ నీ వైపుగా పరుగులు తీస్తుంది. అప్పుడు నువ్వెక్కడున్నావన్నది ….ఊహు..నాకేమీ పట్టదు..ఓసారలా నీ చుట్టూ తిరిగిరావాల్సిందే! మెల్లిగా జారే చినుకుపూసలల్లే నీ పైజేబు వెనుకగా జేరి మెరవాల్సిందే!

 

అవునూ, వెళ్తూ వెళ్తూ నా సందేశాల సంపుటి మొత్తాన్ని ఒక్క ‘డిలీట్’ బటన్ తో చెరిపేస్తావా యేరోజుకారోజు. అబ్బ! గుండె కలుక్కుమంటుంది తలచుకుంటేను. ఎన్నేసి భావమేఘాల్ని ఒకటీ అరా వాక్యాల్లో అతిజాగ్రత్తగా నింపి, నా ప్రాణాన్ని జత చేసి పంపిస్తాను. అటువంటిది అరక్షణంలో కర్కశంగా వాటిని కాలంతో కలిపేస్తావా. అది నువు చెప్పినప్పుడల్లా, నింపాదిగా రాలుతున్న పారిజాతాలే కనిపిస్తాయి వాలే నా కళ్ళల్లో. కనీసం ఒకటీ, రెండూ మనసుకి హత్తుకున్నవేమైనా, ఏదొక మూల నీ హృదయం పరిచిన చోట దాచుకున్నావేమో అని చిన్ని ఆశ. నేనంటూ పక్కకి తప్పకున్నాకా, నీకంటూ మిగిలేవి ఇవే. వెనక్కి తిరిగి చూస్తే ఒక తీయనైన అధ్యాయంలోకి వేలు పట్టుకు నడిపిస్తూ, నీకు మాత్రమే గులాం అయిన క్షణాలను గర్వంగా తిరిగి పరిచయం చేసేవీ అవే. అన్నీ మెదడులోనో, గుండెల్లోనో దాచేసుకుని, కళ్ళతో మాత్రమే ఫొటో లు తీసేసుకుంటే చాలదు. కొన్నైనా వస్తువులుగా మార్చి సాక్ష్యాలుగా మిగుల్చుకోవాలి. వాటి మధ్యగా నువు పయనిస్తున్నప్పుడు అవి ప్రాణం పోసుకోవాలి, అప్పుడు మరోసారి నేను నీ నిజమవ్వాలి.  కాసేపు ఈవాక్యాల మధ్య కూర్చో. ఈ పదాలు నీలో సృష్టిస్తున్న భావాలతో, బృందావనిలోని పూలసౌరభాలు పోటీ పడితే నీకు నా ఊసులర్ధమయినట్టే.

 

ప్రేమంటో ఏదో నిర్వచించలేని భావమనుకోను. నువ్వన్నా, నీ ఊహన్నా, నీ తాలూకు ఏదయినా నాకో కల్తీ లేని కవితలా చేరాలి, పరిశుద్ధమైన పాటలా రావాలి. మాటలా బయటకు రాలేకపోయినా, అవన్నీ మనసు గ్రహించుకోగలదు. ఈ మధ్యనే, ఈ కింది పదాలకు అర్ధాన్ని అన్వేషించడం మొదలెట్టావు, ఒక అద్భుతభావాన్ని పూరించే ప్రయత్నంలో. ఆ జీవితకాల క్షణమేదో నీకు పరిచయం చేసినందుకు గర్వంగా వుంది!

 

తెలిమంచు తెరల్లో సాగే తెరచాప పడవలో

నాతో ఓసారి పయనించి చూడు!

నది లేత పరవళ్ళలో

కాలమాగిన ఒక జీవితకాల క్షణముంటుంది

అదే నీదీ – నాదీ!

అప్పుడికెళ్ళిపోవొచ్చు నువ్వు ….

నీ తడికళ్ళ మీద

నా జ్ఞాపకాల ముత్యాలు జారుతుండగా!

~~~~~~~~A page from many diaries~~~~~~~~

 

Painting: Ramasastry Venkata Sankisa