“అక్కా..నీళ్లోసుకున్నానే !!” చెల్లెలు, తను అంట్లు తోమే బామ్మగారింటికి ఫోన్ చేసి చెప్పిన మాటకి సావిత్రి ఎంతో సంబరపడిపోయింది. షావుకారు కొట్టుకి వెళ్లి ఇన్ని సగ్గుబియ్యం, కాస్త పంచదార తెచ్చి కొంచెం పాయసం చేసి మొగుడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
తమ్ముడు పుట్టిన కొద్ది రోజులకే సావిత్రి తల్లి అదేదో నోరు తిరగని పేరున్న రోగం తో చచ్చిపోయింది . మందులు కూడా కొనలేని తమ బీదతనం వల్ల తల్లి చివర్రోజుల్లో నరకాన్ని అనుభవించడం సావిత్రి కి తెలుసు. తల్లి పోయిన రెండు నెలలకే బాగా తాగేసి తిరుగుతున్న తండ్రి ని లారీ గుద్దేసింది. అప్పట్నుంచి తాము ముగ్గురు అక్కడా ఇక్కడా ఉంటూ పాచి పనులు చేసుకుంటూ పెద్దవాళ్ళయ్యారు.దూరం చుట్టాలంతా కలిసి ఈ తాగుబోతాడికి తనని కట్టబెట్టారు.
అందుకే చెల్లెలికి ఏరి కోరి రాజమండ్రి సంబంధం చేసింది. చెల్లెలి మొగుడు అక్కడ ఒక అపార్టుమెంటు లో వాచ్మాను. కానీ దాని అదృష్టం ఏమిటో…తన మొగుడు తాగొచ్చి తంతాడు. దాని మొగుడు తాగకుండానే తంతాడు. ఆ అపార్టుమెంటు లో ఇళ్ళల్లో పని చేస్తూ కాలక్షేపం చేస్తోంది పాపం అది. తమ ఇద్దరి బతుకులు ఒకలాగే తెల్లారి పోతాయని చాలా బాధగా ఉండేది సావిత్రికి.
తమ్ముడు ఉంటే ఎంతో కొంత ధైర్యంగా ఉండేది.ఎవరో పిల్ల వెనక పడి, అది కాదందని కాలవగట్టు మీద పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. పెళ్ళయి పదేళ్ళయి తనకి పిల్లల్లేరు. నాలుగేళ్ళుగా చెల్లెలికి లేరు. అప్పుడు నూకాలు చెప్పింది, “పక్కూళ్లో .ఎవరో పిల్లని అమ్ముతున్నారంట. ముగ్గురు పిల్లల్ని సాకలేక కడదాన్ని అమ్మేస్తారంట.”
సావిత్రి మొగుడితో చెప్పింది “మనం ఆ పిల్లని కొని చెల్లికిద్దామయ్యా …అది పిల్లల్లేరని బెంగెట్టేసుకుంది.ఆడపిల్ల అయితే ఏటి? అది తిన్నాదే పిల్లకీ ఎడతాది .అంతగా కష్టమైతే మనం లేమా?” మొగుడు ముందు ఒప్పుకోలేదు.
కానీ సావిత్రి పట్టుపట్టి వెయ్యి రూపాయలు పెట్టి ఆ పిల్లని కొనేసి చెల్లెలి చేతిలో పెట్టింది.
“ఇది మన ఇంటి మహా లచ్చిమే.. దీన్ని లచ్చిమీ అని పిలుచుకో ” అని చెల్లెలికి చెప్పింది. చామనఛాయగా ఎంతో చురుగ్గా ఉంటుంది లక్ష్మి. మరీ నెలల పసి కందుని తెచ్చేసుకున్నారేమో…తననీ, చెల్లినీ ఇద్దరినీ అమ్మా అని పిలుస్తుంది. లక్ష్మి ని తెచ్చుకుని ఇంకా ఏడాది కూడా అవలేదు ,చెల్లెలు కడుపుతో ఉంది అని తెలిసేసరికి సావిత్రి ఆనందానికి హద్దుల్లేవు.”ఎంతయినా లచ్చిమి వచ్చిన ఏలా ఇసేసం “అనుకుంది.
పేరుకి చెల్లికిచ్చింది గానీ లక్ష్మి ఎక్కువ సావిత్రి దగ్గిరే ఉంటుంది. సావిత్రి మొగుడికి కూడా పంచ ప్రాణాలు లక్ష్మంటే. ” ఏటి నాన్నా…తాగొచ్చి అమ్మనెందుకు కొరతావు ” అని వచ్చీ రాని మాటలతో లక్ష్మి అదిలిస్తుంటే నవ్వుకుంటాడు. ఇంకెప్పుడు అలా చెయ్యనులే తల్లీ అంటాడు. మల్లా మర్నాడు మామూలే.
చెల్లెలికి ఆడపిల్ల పుట్టింది. దాని సంతోషం అంతా ఇంతా కాదు.మళ్ళీ ఏడాది మళ్ళీ ఇంకో పిల్ల పుట్టింది. చెల్లెలికి లక్ష్మిని ఇవ్వడం ఇష్టం లేదు గానీ, ముగ్గురు పిల్లల్నీ చూడలేదని సావిత్రి తన దగ్గిరకి తెచ్చేసుకుంది. ఎంతో అపురూపంగా చూసుకుంటుంది ఆ పిల్లని. సావిత్రి పనికెళ్తే వెంట పడుతుంది లక్ష్మి. అక్కడ ఏ మేడమెట్లెక్కి పడిపోతుందో అని భయం ఆమెకి.
ఓ రోజు లక్ష్మి కొత్త పాట మొదలుపెట్టింది.”అమ్మా.. అద్దం,పగుడరు కొనియ్యవే,ముస్తాబయ్యి కాన్వెంటుకెల్తాను” అని. “ఓలమ్మో,ఎంత సోకో దీనికి! అద్దం
కావాలంట ,ఇంతోటి అందం సూసుకోడానికి! ఎంతైనా దీనికి దాని అసలు కులపోల్ల బుద్ధులే వచ్చాయి, ఏం తెలివి!” అని మురిసిపోయింది సావిత్రి. అప్పటికి సరేలే అని మాట దాటించింది. లక్ష్మి మాత్రం వదలకుండా రోజూ అడుగుతూనే ఉంది.”అమ్మా అద్దం కొనియ్యవే” అని.
అద్దమయితే ఎలాగోలా కొంటుంది.కాన్వెంటులో ఎక్కడ వెయ్యగలదు. బోల్డు డబ్బులు కట్టాలి.” గవర్నమెంటు స్కూల్లో యేసుకుంటారేమో అడగాలి” అనుకుంది. పైకి మాత్రం లక్ష్మిని నోర్మూసుకో అని కసిరింది. లక్ష్మి తన పంతం వదలడం లేదు.
ఆ రోజు సావిత్రికి ఆలస్యమయిపోయింది. పని పూర్తి చేసుకుని గబ గబా అడుగులు వేస్తూ నడుస్తోంది. దార్లో పెద్ద నుయ్యి దగ్గిర జనం మూగి ఉన్నారు.ముందు మనకెందుకులే,లక్ష్మి ఒక్కత్తే ఇంటిదగ్గిర ఉంది వెళ్లి పోదాం అనుకుంది. కానీ మళ్ళీ మనసొప్పలేదు.నూతి దగ్గరికి వెళ్ళింది. “చెక్క ముందు పడింది కాబట్టి తేలుతోంది, లేకపోతే ఈ పాటికి ప్రాణం పొయ్యేది” అనుకుంటున్నారు అమ్మలక్కలు. తనని చూడగానే మాటలు ఆపేసారు.”ఏటయ్యింది ?” అంది. “ఏటీ లేదులే.ఎవరో పిల్ల నూతిలో అడిపోయింది .బానే ఉన్నాదిలే,కంగారడకు” అంది కాంతం.”
ఎవరో పిల్ల నూతిలో అడిపోతే నన్ను కంగారడద్దు అంటదేటి? లచ్చిమి కానీ ఇలా రాలేదు కదా ” ఏదో అనుమానం సావిత్రి మనసులో ప్రవేశించింది. గుండెలు చిక్కబట్టుకుని మెల్లిగా నూతి అంచు కెళ్ళి తొంగి చూసింది. నూతిలో అడ్డంగా పడి ఇరుక్కున్న చెక్కముక్క పట్టుకుని వేళ్ళాడుతోంది ఆ పిల్ల. మొహం ఒకటే బయటకి ఉంది. అదే ఎర్ర గౌను. పొద్దున్న లక్ష్మికి వేసింది కదా తను. అమ్మా అమ్మా అని ఏడుస్తోంది లక్ష్మే కదా…
చటుక్కున పైకెక్కి దూకెయ్యబోయింది. అప్పటికే ఆమెని గమనిస్తున్న చుట్టు పక్కల వాళ్ళు బలవంతం గా ఆపి దూరంగా లాక్కొచ్చారు.
“అమ్మా, నా లచ్చిమీ …నా తల్లీ… నన్ను ఎల్లనివ్వండర్రో” అని శోకాలు పెట్టింది. దుఖం పొంగుకొస్తుంటే గుండె పగిలేలా ఏడ్చింది. బాధ తట్టుకోలేక నేల మీద పడి పొర్లడం మొదలు పెట్టింది. మెల్లగా మైకం కమ్మేసింది.
“అమ్మా,లెగవే …నేను బానే ఉన్నాను సూడు” అంటూ లక్ష్మి పట్టి కుదుపుతుంటే స్పృహ లోకొచ్చింది పూర్తిగా తడిసిపోయి వణుకుతున్న లక్ష్మిని పొదివి పట్టుకుని ఒళ్ళంతా తడిమి చూసింది. ముద్దులు పెట్టుకుంది కళ్ళవెంట నీళ్ళు కాలవలు కడుతుంటే.
అప్పటివరకు అమ్మకి ఏమయ్యిందో అని భయపడిన లక్ష్మి, సావిత్రి లేచేసరికి ఏడవసాగింది.”అమ్మా..కాన్వెంటు పిల్లలు ఎల్తా ఉంటే ఆళ్ళ ఎనకాలే ఇలా వచ్చానమ్మా.నీటుగా లేకపోతే కాన్వెంటు లోకి రానియ్యరని గౌరి చెప్పింది. మనింట్లో అద్దం లేదు కదా,నువ్వు కొనియ్యలేదు. ఎలాగున్నానో సూసుకుందామని నూతి కాడకొచ్చి పైకెక్కి తొంగి సూసాను.పడిపోయానే” ఈసారి గట్టిగా ఏడుస్తోంది.
లక్ష్మిని మరింతగా గుండెలకి హత్తుకున్న సావిత్రి వెంటనే ఒక నిర్ణయం తీసేసుకుంది.”రేపే రాజమడ్రి ఎల్లి నీకు అద్దం కొనిపెడతాను.తల తాకట్టు పెట్టీనా సరే నిన్ను కాన్వెంటులో ఏస్తానమ్మా ” వాళ్ళిద్దరినీ అలా చూసిన అమ్మలక్కలందరూ కళ్ళు తుడుచుకున్నారు. ఆ మాటలు విన్న లక్ష్మి మొహం మాత్రం పున్నమి నాటి చంద్రుడిలా వెలిగిపోయింది.
chala bagundi
బావుంది ! ఎమోషన్ వుంది,అలాగే పాజిటివ్ గా కూడా వుంది.కధ చివరవరకు పట్టుగా చదివించింది. All the best Bhavani.
ధన్యవాదాలు మణి వడ్లమాని గారు , మీ వంటి వారి అభినందనలు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి
చాలా బావుందండీ కథ. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది..
చాలా బాగుంది భవాని గారు..
అద్దం..ఛిద్రమైన బతుకుల కి అద్దం..చితికిన మనుసుల కి అద్దం..చిగురించిన ఆశల కి అద్దం..
వాళ్ళ జీవితాలు నూతి లో పడ్డ చంటి పాప ప్రాణం..స్త్రీ మూర్తి కొనే అద్దం మారబోయే భవిష్యత్తు కి ప్రాణ ప్రతిష్ఠ కి ముహూర్తం..
అద్బుతమైన భావోద్వేగాన్ని అలవోక గా చెప్పేశారు..చంటి పాప దత్తత నుండి చివర వరకు పట్టు సడలకుండా సావిత్రి, లక్ష్మి లా మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించారు.
అమ్మా
భవానీ ఫణి గారు,
మీ కథ అద్దం బాగున్నది. కథా వస్తువు, కథన శైలి సంభాషణలు బాగుండి రచన ను చదివింఓ చేసేయి..
అభినందనలు.
మీరు మంచి రచనలు చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.
జోగారావు,
బెంగుళూరు
శైలజ , అను గారు , ముజాహిద్ గారు , నంద కిశోర్ గారు , జోగారావు గారు అందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు
Very nice..
పేదవాళ బతుకులకు అద్దం పట్టింది. పాచి పని బ్రతుకులకు పట్టెడన్నం పాచిది దొరకడమే కష్టం. అట్లాంటిది అద్దం ఎక్కడనుండి వస్తుంది.అయిన పిల్ల తెలివి చుడండి నిలల్లో ప్రతిబింబం చూసుకోవాలనే.
మీ అలోచన సరళి బాగుంది. ఇట్లాంటివి మరికొన్ని బ్రతుకు చిత్రములు అవిస్కరించండి. ఫ్యాషన్ సాహిత్యం కంటె బతుకు గురిచి చెప్పే వాళ్ళు తకువైనారు.