కథ

పునీత

సెప్టెంబర్ 2014

ఎన్ని రోజులైందో గుర్తుకు రావట్లేదుగాని చాలా రోజులైనట్లే ఉంది. నెలదాటిందా అంటే!  ఉండు ఒక్కసారి సరిగ్గా గుర్తుకు తెచ్చుకోనీ.  ఆ..  ఆరోజు రమావాళ్ళింట్లో ముక్కోటి ఏకాదశి, విష్ణుసహస్రనామ పారాయణానికి వెళ్ళామా అక్కడే కదా అయ్యింది! ఎక్కడ తెలిసిపోతుందో అనుకుని హడావిడిపడుతూ వచ్చేసాను కానీ నా మొహం, ఎలా తెలుస్తుంది? అయినా ఏం పూజలో ఏం పాడో, భక్తి మీద ధ్యాస కన్నా బయటవుతామేమో అన్న భయం ఎక్కువ కదా. ఇంతకీ పారాయణం ఏ రోజు జరిగింది? పోయిన నెల ఏకాదశి అంటే, ఏది తెలుగు కాలెండరు? జూలై ఎనిమిదిన. ఈ రోజేంటి? ఓరి దేముడోయ్ సెప్టెంబరు ఇరవైమూడు! ఇంకా అవకపోవడమేంటి?! దడ పుట్టేస్తుంది.

నా మొహం గానీ ముప్ఫయితొమ్మిది నిండాక ఇంకా ఇలాంటి విశేషాలేంటి. ఇంకో రెండేళ్ళలో ముట్లుడుగుతాయి.ఒకవేళ అందువల్లేనేమో. ఇలాంటప్పుడు అడ్డదిడ్డంగా వస్తాయిట. మా అత్తగారిని చూసాగా. బాబోయి కూర్చున్న చోటినుంచి లేవడానికి భయపడిపోయేది. చుట్టాలిళ్ళకి వెళ్ళడానికి కూడా సిగ్గే.ఎప్పుడవుతుందో తెలీదు.ఎంతవుతుందో తెలీదు. బట్టలన్నీ ఖరాబు. ఒకటే వాసన! ఏంటీ ఇంకా అవకపోవడమేంటి?

****

వాడు ఫోన్ చేసాడు, ఈ రోజొస్తానని. ఒద్దన్నాను. మాధవరావుగారొస్తున్నారు. రాత్రికి భోజనం ఇక్కడే. ఏంటో..ఇరవయ్యేళ్ళ క్రితం మావారి స్నేహితుడనుకున్నా. కాస్త ఆప్యాయంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మావారికి, నా మీద కాదులెండి. అంటే కాస్త చిరాకయితే పడతారు. మరి ఇంటికొచ్చినాయన్ని ఏమనలేరు కదా. ఏమండీ ఇంటికొచ్చిన మనిషికి భోజనం పెట్టేటప్పుడు కాస్త చనువుగా కోప్పడి వడ్డించకపోతే ఎలాగండి? మళ్ళీ అలా వదిలేస్తేను ఈయనికి కోపమే. గయ్యిమని ఇంత ఎత్తున లేస్తారు. పొట్టిమనిషేగాని తక్కువేమీగాదు.

ఒకపక్క వాడిని రావద్దన్నానా. ఫోన్ ఎవరిదని మావారడిగారు. చెప్తే ఏం పోతుందిలెమ్మని మురళి వస్తానంటే రావొద్దని చెప్పానన్నా. అదుగో అప్పట్నించి, ఆ మధుగాడొస్తున్నాడనేనా అని. ఏమంటాము? నిజం చెప్పినా ఇంకోలా అర్థమవుతుందే! “నీకెప్పుడూ ఇంతే మావాళ్ళంటేనే పడదు. హాస్టల్లో పిల్లాడున్నాడు కాస్త కనిపెట్టుకోవాలని తెలీదూ”అంటూ. చెప్పొద్దూ..”సరే, సరే రమ్మంటాలెండి” అని నవ్వు ఆపుకోలేక చచ్చాను. మళ్ళీ ఏమనుకున్నాడో వద్దులెమ్మన్నాడు. ఏంటో ఈయన గోల. వట్టి రెటమతం మనిషి!

వాడొకడు! ఎప్పుడు సందు దొరికినా ఉగ్గబట్టుకున్నట్టు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఒక పక్కేమో పాప! వాడు తనకోసమే వస్తున్నాడనుకుంటుంది. వాడి దృష్టి తన మీదకు మళ్ళించుకోవడానికి దాని తిప్పలు. దానిని వదిలి నా పక్క చేరడానికి వాడి చిరాకులు. అయినా ఆయన మేలుకుని ఉంటే ఇవేమీ సాగవు. పైకి పెద్ద బుద్ధిమంతుడిలా పోజు.

రాత్రి మాధవరావుగారు వెళ్ళాక వంటగది కాస్త సర్దుతుంటే వాడు చేతులుకడిగుతూ “ఎదురుచూస్తుంటా” అని గొణిగాడు. ఆయన ఎప్పటిలాగే ఓ నాలుగు పుచ్చుకుని వంటిమీద సోయలేకుండా పడున్నారు. పొద్దున్న పనమ్మాయి రాదు. నా కూతురికేమో వచ్చిన బావకి దాని అన్ని విద్యలూ ప్రదర్శించాలి. వాడూ ఓపిగ్గా వింటున్నాడు. ఆ సమయాల్లో పిలుస్తారేంటీయనా. “లచుమమ్మా ఒసే లచ్చుమమ్మా” అంటూ అరుపులు! ‘వస్తున్నా వస్తున్నానండీ’ అనే లోపలే.. సరయు గది దాటుకుని గబగబా వెళ్లేసరికి ఈయన “ఏవిటే రంకేడి” ఇంకాస్తాపితే బూతుల పురాణం మొదలవుతుంది. లుంగీ జారిపోతూ, ఛీ కుళ్ళు మనిషి. ఒకటే తాగుడు వాసనా! పెళ్ళయ్యి ఇన్నేళ్ళయినా నాకీ వాసన అలవాటుపడలేదు. “ఒంటిమీద లుంగీ సర్ది కాస్త చూసుకుని పడుకోవచ్చుకదండీ, అవతల ఈడొచ్చిన పిల్లుంది.కాస్త..”.  “కాళ్ళు పట్టు” అన్నారు ఒళ్లో కాళ్ళు విసురుతూ. ఇంకేం చెప్పినా వినరు. వీడి నోట్లోనుంచి వచ్చే మాటలు భరించడం కన్నా చావడం మేలు.

పక్క గదిలో సరయు మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి నవ్వులు. “సరయు ఇక పడుకోండి”, గట్టిగా అన్నాను. “ఏంటమ్మా నువ్వూ ఇంకా పదిన్నరేగా అయ్యింది” విసుగ్గా వినిపించింది. “పదిన్నరెక్కడా, పదకొండవుతుంది. మురళీ పడుకోమ్మా. మళ్ళీ అది పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి.” వాడు లేచినట్లున్నాడు.

“తలుపెయ్యి” దేనికైతే దడిచానో అదే అన్నారు. ఇప్పుడింకో సర్కసు మొదలు. “ఊరుకోండి. మీరలసిపోయారు.” నెమ్మదిగా చెప్పాను. ఇంతే.. “నాకు మగతనం లేదనుకున్నావే?ఎయ్యి తలుపులు” ఆగకపోతే ఇంక పాపదాక వెళ్తుంది వ్యవహారం. దానితో మా సంసారం గొడవలు చెప్పబోతారు. ఛీ ఈ సిగ్గులేని మనిషితో ఏం చెప్పలేం బాబూ..

తలుపేసివచ్చాను. అయినా నాకు తెలుసు ఏమి ప్రయోజనం ఉండదని. చేతనయ్యి చస్తుందా పాడా ఏదోదో చేసేద్దామనే ఆవేశమే కానీ. ఇక చాలండి అంటూనే ఉన్నాను. “చీ నోరుముయ్యి ఎదవకానా ఏమి చేతకాదు.” నాకు చేతనైంది చెప్తే చచ్చిపోతావ్రా మగడా. కావాలంటే మురళిని అడుగు. నెలకు మూడుసార్లు ఇంత దూరం ఎందుకొస్తాడో తెలుస్తుంది.

మళ్ళీ సర్కసు మొదలు. ఆయనేవో తిప్పలు పడుతూ నన్ను ప్రయత్నించమంటారు. అయినా ఒంటిమీదా బుద్ధిమీదా స్వాధీనం లేని మనిషి ఏం చెయ్యగలడు. ఆఖరున గుర్రుపెట్టి నిద్రపొయ్యాడు. చేసిందేమీ లేదు. కామేశ్వరరావు అన్న పేరే కాని ఏది ఏమీ చెయ్యలేందే. పాపం తాపత్రయపడిపోతాడు. ఎన్నేళ్ళైనా ఇదే వ్యవహారం.

రేప్పొద్దున్న నాకు మళ్ళీ ఇది ఓర్చుకోవడానికి ఆయనతో రామభజన తప్పదు. చేసే ప్రతీపనిని వేలెత్తి చూపించడమే! నన్ను భయపెట్టపోతే ఆయనకు ధైర్యం రాదేమో!

అంట్లన్ని తోమి, వంటగది సర్ది, ఇల్లొకసారి పూర్తిగా ఒక కొలిక్కి తెచ్చేసరికి ఇంకో గంటయ్యింది. మురళి ఎదురు చూస్తుంటాడని తెలుసు. నా కంగారు చెప్పాలావద్దా. డాక్టరు చదివే పిల్లాడికి ఆ మాత్రం జ్ఞానం ఉండదా?చెపితే ఆలోచిస్తాడేమో. చూద్దాం!

స్నానం చేసి నైటీ వేసుకుని హల్లోకొచ్చాను. లేడు! వెళ్ళిపోయాడా ఏంటి? కొంపదీసి సరయు గదిలో ఉన్నాడా? ఉన్నాడు. చీకట్లో దాని కంప్యూటర్లో facebook చూసుకుంటున్నాడు. సరయు గాఢనిద్రలో ఉంది. దాని నైటి కాస్త చెదిరి…“మురళీ” గట్టిగా పిలిచేసరికి సరయు కూడా నిద్రలో కదలింది. మురళి కంగారుగా బయటకు వచ్చాడు.

“ఏమయింది?” కాసేపు మాట్లాడలేకపోయాను. “దాని గదిలోకి ఊరికే వెళ్ళకు.” వాడేమి మాట్లాడలేదు. కాసేపటికి నేనే తేరుకున్నాను. “బెడ్ షీట్ ఏమన్నా కావాలా?” అని నేనే వెళ్లి సరయు గదిలో నుంచి ఒక బెడ్ షీట్ తెచ్చా.”పడుకో!”

లైట్ ఆపి వాడిపక్కనే కూర్చున్నా. రెండు నెలలుగా అలవాటైన స్పర్శ. ఒళ్ళు దానిపని అది చేసుకుపోతుంది. నేనే సరిగ్గాలేను. ఏవో పిచ్చి ఆలోచనలు. ఇందాక సరయు గదిలో వాడు, ఊరికే గుర్తొస్తుంది. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

”ఏమైంది?” అసహనంగా అడిగాడు. అర్థం కాలేదు. “తోసేస్తావేంటి?”

“ఈ రోజొద్దు”

“ఎందుకు, ఓ లేడీస్ ప్రోబ్లెమా?”

“ఏమో ఇప్పటివరకు రాలేదు?”

“రాలేదా? అంటే” గాభరాగా జరిగాడు.

“నెలన్నర అయింది” వాడి కంగారు చూస్తుంటే ఎందుకో సరదాగా ఉంది.

“చెప్పలేదే” తమాషాగా పెదవి విరిచాను. కాస్త నవ్వుకూడా వచ్చింది. కంగారుననుచుకుంటూ కాళ్ళు బార్లాజాపి ఒళ్ళు విరుచుకున్నాడు.
“చెప్పవలసింది” ఏంచేసేవాడివి పెదనాన్నా? ఈ మేనమామ భార్య ఎక్కువ చదువుకోలేదని నీకు తెలుసుగా! ఇంకా నయం వాంతులూ గట్రా లేవు. లేకపోతే పాతసినిమాల్లోలా పెద్ద డ్రామా నడిచేది. చెప్పవలసింది అంటాడు. చెప్తే ఏంచేస్తాడో?

ఉన్నట్టుండి లేచాడు వాడు. “ఇక వెళ్తాను” పూర్తిగా బెదిరిపోయాడు పిల్లాడు. ఇదే ‘చెప్పవలసింది’ అంటే అన్నమాట. వచ్చేవాడు కాదు. అయినా ఇరవైయేళ్ళు నిండని వెధవ ఇంతకన్నా ఎలా మాట్లాడతాడు. వాడికి తలంటుకోవడమే సరిగ్గా రాదు.

వాడి భుజాలు పట్టుని కుర్చీలో కుదేసాను. “భయపడకు. అదేమీ అయ్యుండదులే. ఇదివరకు కూడా ఇలానే అయింది. మెనోపాజ్ అనుకుంటా.” “అంతేలే!” కాస్త సర్దుకున్నట్టున్నాడు.

“సరే నేను పడుకుంటున్నా” లైట్ ఆపేసి వెళ్ళి సరయు గదిలో పడుకున్నా.

***

గోలగోలగా అందరూ మాట్లాడుతున్నారు. నా కూతురు ఖాండ్రించి ఉమ్మేస్తోంది. దాని మొహం క్రూరంగా ఉంది. మా అమ్మ రోడ్డు మీదే నుంచుని నాజీవితంలో వినని బూతులు తిడుతోంది. గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి. కత్తి పట్టుకుని గుంపుగా ఉన్న మగవాళ్ళు ఆవేశంగా ఏదోదో అరుస్తున్నారు. పక్కనే ఏదో మహిళా సమాజపు బోర్డు పెట్టి కొంతమంది ఆడవాళ్ళు కూర్చున్న ఫోటో..ఆ పక్కనే రోడ్డుకు దగ్గరగా, రోడ్డు మీద పడుకొని ఉన్న మనిషి ఎవరూ? నేనే! కాళ్ళ మధ్య తడిగా,మెత్తగా, ముద్దలా కదులుతూ.  రాత్రి వంటగది గట్టు తుడుస్తూ తడిగుడ్డ మర్చిపోయానా? నెమ్మదిగా తీయనీ. చేతితో అలాగే తీశాను. బొడ్డుకోయని పసిపాప! చప్పుడురాకుండా ఏడుస్తోంది. మొఖం చూడాలి,కనిపించడం లేదు. బలవంతంగా తిప్పాను. అది మొహం వీపు వైపుకి తిప్పేసుకుంది. కత్తిపట్టుకున్న వాళ్లలో భర్తను గట్టిగా అరిచాను ‘ఇదిగోండి వీడే, బొడ్డుకోయడానికి వస్తావా?’. దూరంగా ఉన్నాడు. ఎందుకో అతని మొహం కూడా దీనంగా ఉంది. మురళి ఏడి? అదిగో, అక్కడ, వెనకున్నాడు కదా! ”అరేయ్!” వెళ్లిపోయాడేమిటి? పిచ్చి వెధవ, అందరిలో పిలుస్తానా? మా అమ్మ తిడుతూ దగ్గరికొచ్చింది. ఉన్నట్టుండి వెక్కిళ్ళుపెడుతూ తెగించి పేగు గట్టిగా లాగేసింది. మూలుగు లాంటి అరుపుతో నిద్ర లేచాను. కల చివరలో చంటిబిడ్డ తోడేలు చూపు. కలని అర్థమవుతూ ఉంది కానీ ఇంకా చెవులలో రక్తం కారుతున్న చప్పుడు వస్తుంది. పేగు పెరికిన భావన రాగానే ఒక్కసారి పొత్తికడుపులో గట్టిగా గుచ్చినట్లుంది.

***

ఆయన గురక ఇంకా గట్టిగా వినిపిస్తుంది. సరయు చెయ్యి పక్కకు తీసిపెట్టి నెమ్మదిగా బాత్రూం లోకి వెళ్ళాను. నా నైటీ కింద వేసుకున్న లంగాలో నెత్తుటి చారికలాంటి మరక! ఒక్కసారి నీరసం కమ్మింది. హాల్లోకి చూసాను. వాడు లేడు. తలుపు తీసిఉంది. ఇక ఎప్పటికీ రాడేమో కూడా.