నా మొబైల్ రింగవుతోంది. స్క్రీన్ మీద ‘రాధాకృష్ణ’అని డిస్ప్లే అవుతోంది. కాల్ కట్ చేసాను. మరల రింగ్ అయ్యింది. ఇగ్నోర్ నొక్కాను. రెండు నిమిషాల తరువాత మరల రింగ్ అయ్యింది. ఈ మాటు ‘అనూహ్య’ పేరు డిస్ప్లే అవుతోంది. ఇక భరించలేక ఫోన్ ఎత్తి రాష్ గా ‘హలో’ అన్నాను.
“నా ఫోన్ లో చార్జ్ అయిపోయింది ఆందుకే అమ్మాయి ఫోన్ నుండి…..” అవతల ఫోన్ లో రాధాకృష్ణ గారు, నా మామ గారు.
“అసలు విషయమేమిటో చెప్పండి” ఆయనని కట్ చేస్తూ విసురుగా అడిగాను.
“పాపకు జాండిస్ వచ్చింది. పరిస్థితి ఏమీ బాగోలేదు. ఫరవాలేదు, తగ్గుతుంది అంటున్నారు డాక్టర్స్.కాని మాకేదో భయంగా ఉంది. మీరొకసారి వచ్చి చూస్తే బాగుంటుంది” మొహమాట పడుతూ చెపుతున్నాడు.
“ఆ పిల్ల సంగతి నా దగ్గర ఎత్తొద్దు”.
“అలా అంటే ఎలా?.
“ఇంకెలా అనాలి? ఇంకొకసారి నాకు ఫోన్ చెయ్యొద్దు” అంటూ ఫోన్ కట్ చేసాను.
ఆఫీసునుండి బయటపడి బైకు మీద వీధులన్నీ తిరిగాను. చివరకు ఓ వైన్ షాప్ ముందాగి రెండు బాటిల్స్ వైన్ కొనుక్కున్నాను.జీవితం లో డ్రింక్ చేస్తానని అనుకోలేదు. అలాంటిది గత పది రోజుల్లో ఇది నాలుగోసారి.
ఇంటికొచ్చి రెండు పెగ్గులు వేసుకున్నాను. అది జ్ఞాపకాలని తీసేయ్యలేకోపోయినా కనీసం ముసుగు వేస్తుందని ఆశ.
***
‘కాఫీ, అభీ” తియ్యని గొంతుకకు కళ్ళు విప్పాను. ఎదురుగా అనూహ్య లేదు. అంతా నా భ్రమ.గతంలో అలా అనూహ్య కమ్మని పిలుపుతో ఎన్నిఉషోదయాలు ఉదయించాయో| ఆలాంటి ఉషోదయాలు కొన్ని వేలు చూస్తాననుకున్నాను. కాని జరిగింది ఏమిటి?
లేచి కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకుని మగ్ లో పోసుకున్నాను. మగ్ మీద తన ఫోటో, దాని క్రింద ‘ఐ లవ్ యు’ అని కాప్షన్ . ‘నీ డే కాఫీ త్రాగుతూ కాదు నా లవ్ ని ఆస్వాదిస్తూ మొదలవ్వాలి’ అంది ఓ రోజు ఆ మగ్ తో కాఫీ అందిస్తూ. ఇహ త్రాగ బుద్ధవ్వల. మగ్ సింక్ లో పడేశాను.బయట డాబా మీద కొచ్చాను. కుండీలలో గులాబీలు , మందారాలు, మరువం.. రకరకాల క్రోటన్స్. ఓ చిన్న వనమే ఉంది. చిన్న టెడ్డీ బేర్ లాగా గుండ్రంగా పెరిగిన ఆ మరువపు మొక్కని, ఏదో చిన్న పిల్ల బుగ్గని తట్టినట్లు అలా సున్నితంగా తట్టేది అనూహ్య. ఆ చిన్న తాకిడికే అది గుప్పున వాసనలను విరచిమ్మేది. ‘అబ్బా ,చూడు యెంత మంచివాసనో ’ అని చిన్న పిల్ల లాగ మురిసి పోయేది. మొక్కలంటే తనకెంతో ఇష్టం.
మా పెంట్ హౌస్ ముందు డాబాని ని పూల కుండీలతో, క్రోటన్ మొక్కలతో అందంగా తీర్చి దిద్దింది.ఇంటినీ ఎంతో కళాత్మకంగా అమర్చింది. అలా ఆలోచిస్తూ,మొక్కల మధ్య తిరుగుతూ ఆ కుండీ కేసి చూశాను. దానిలో కూర్చున్న పావురం ‘అనూహ్య ఏది? ఎప్పుడు వస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నట్లు ఉంది. దాని పొట్ట అడుగునుండి చిన్న పిల్లలు కనపడుతున్నాయి. పిట్ట గోడ కేసి చూశాను. దాని మీద వీటి కేసి చూస్తూ ఇంకో పావురం కూర్చునుంది. ఈ పావురాల గురించి ప్రతి రోజూ మా మధ్య మాటలు ఉండేవి.అవన్నీ ఒక్కసారి కళ్ళముందు కదలాడాయి.
***
ఓ ఆదివారం సాయంత్రం డాబా మీద కూర్చుని టీ తాగుతున్నాము. ఓ చిన్న టేబుల్ , రెండు కుర్చీలు అనూహ్యే ఏర్పాటు చేసింది. టీ త్రాగుతున్నదల్లా టక్కున లేచి ఓ మందార కుండీ కేసి నడిచింది.
‘అభీ, ఇలా రా’ అని కేక పెట్టింది. లేచి గబా గబా వెళ్లాను.
“అటు చూడు” అంది వేలు పెట్టి చూపిస్తూ. కుండీ లో ఓ పావురం దాని అడుగున కాళ్ళ మధ్యనుండి కనపడుతున్న గుడ్లు.
“రోజూ అది పుల్లలు పెట్టటం, నేను తీసి పారెయ్యటం…..చివరకు పాపం ఓర్చుకోలేక ఆ మట్టి లోనే గుడ్లు పెట్టేసినట్లు ఉంది. ఏదో గూడు పెట్టి చెత్త చేస్తోందనుకున్నానే కాని దాని బాధ అర్ధంచేసుకోలేక పోయాను” అంది బాధగా.
“నీకు తెలిసి చెయ్యలేదుగా. ఇట్స్ ఓ.కే.” అన్నాను సముదాయిస్తూ. అప్పటినుండి మా జీవితాల్లో ఆ పావురం ఒక భాగమయిపోయింది.
“పాపం ఆ గుడ్ల మీద నుండి అది అస్సలు లేవటం లేదు. దానికి ఫుడ్ ఎలాగో ఏమో “ అని ఓ రోజు ప్రొద్దున్నే విచారం వ్యక్తం చేసింది అనూహ్య.
“దాని ఫ్రెండ్సో లేదా భర్తో పెడతారులే” అన్నాను నవ్వుతూ.
“మీకంతా ఎగతాళీనే. ఏ మాత్రం జాలి లేదు” అంటూ ఓ కప్ లో కాసిని బియ్యం, మగ్ లో నీళ్ళు పెట్టింది.
మరో రోజు ముచ్చట్లాడుకుంటూ డాబా మీద తిరుగుతున్నప్పుడు “మన మనుష్యులకి లాగా వాటికి పుట్టేది ఆడపిల్లా, మొగ పిల్లా అని బాధ లేదు కదూ “ అంది హటాత్తుగా.
“ఈ రోజుల్లో ఎవరూ పట్టించుకోవటం లేదు” అన్నాను అది పెద్ద విషయం కాదన్నట్లు.
“’మొగపిల్లాడు పుట్టాలి, వంశం నిలవాలి’ అని మీ అమ్మగారు ఎప్పుడూ అంటుంటారుగా|” అంది కాస్త అలుకగా.
“ఏదో అమ్మ చాదస్తం.పట్టించుకోకు”.
“మీకెవరు ఇష్టమో చెప్పు”.
“ఇలా నువ్వు, మీరు కలిపి మాట్లాడే నీ భాష అంటే ఇష్టం”.
“అబ్బా, మీ భాషాభిమానం గురించి అడగటం లేదు. అబ్బాయా, అమ్మాయా ఎవరంటే ఇష్టం?చెప్పు”.
“టు బి ఫ్రాంక్ నాకు మొగ పిల్లవాడంటేనే ఇష్టం”.
“నీకు కూడా మీ అమ్మ బుద్ధులే”.
“అలా అని కాదు కాని….” అమ్మ నుండి ఫోన్ రావటంతో ఆ సంభాషణ అక్కడ ఆగిపోయింది.
***
నేను ఆఫీసులో ఉండగా అనూహ్య నుండి ఫోన్ “అభీ, గుడ్ల నుండి పిల్లలు వచ్చేసాయి. ఇప్పుడే చూశాను” అంటూ చివరా మొదలూ లేకుండా ఏదో ప్రపంచ వింత జరిగినట్లు చెప్పింది.
ఇంటికి వెళ్ళగానే నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి “చూడు, బుజ్జిగా ఎలా ఉన్నాయో” అంది నాకు చూపిస్తూ మురిపెంగా.
పావురం పొట్ట అడుగునుండి రెండు పిల్లలు సగం సగం కనపడుతున్నాయి. రక్తం ముద్దల్లాగా ఉన్న వాటిని చూస్తే నాకేంటోగా అనిపించింది.
రెండు రోజుల తరువాత ఇంటికి వెళ్లేసరికి మరో న్యూస్ .”అభీ, నీకో వింత చెప్పాలి. ఈ పిల్లలను రెండు పావురాలు కలసి డ్యూటీలు వేసుకుని పెంచుతున్నాయి తెలుసా? బహుశా అవి తల్లీ, తండ్రీ అయ్యుంటాయి.” అంది తను ఏదో గొప్ప సత్యం కనిపెట్టినట్లు.
“తల్లీ తండ్రి…..ఆడా , మగా అవన్నీ నీకెలా తెలుసు?” ఉత్సుకతతో అడిగాను.
“ఆ రోజు యెంత తోలినా కదలకుండా మొండిగా కూర్చుని గుడ్లు పెట్టిందే అదే ఆడ పావురం.దాని కంటి దగ్గర చిన్న బుడిపి ఉంది. అదే గుర్తు. ఇంకోటి మొగ పావురం. అయినా ఏది ఆడ, ఏది మగా… అవన్నీ అనవసరం. రెండూ కలసి పెంచుతున్నాయి. ఇది నిజం. రేపు మీరు కూడా అలా డ్యూటిఫుల్ గా ఉంటేనే నేను బ్యూటిఫుల్ గా బిడ్డను పెంచగలను“ చాల స్థిరంగా చెప్పింది.
“ఓ , అందుకా ఈ కధ అల్లి చెపుతున్నావు. లేకపోతె పావురాలేంటి డ్యూటీలేంటి?” అనుమానంగా అన్నాను.
“నిజం అభీ. రెండు రోజులుగా ఆఫీసుకి వెళ్లటం లేదుగా అందుకుని వాటిని చాల దీక్షగా పరిశీలిస్తున్నాను. నాకు చాల ఆశ్చ్యర్యం అనిపించింది. సాయంత్రం ఐదు గంటలల నుండి తెల్లారి ఏడు గంటల దాకా తల్లి పావురం వాటి మీద కూర్చుంటుంది. ఆ తరువాత ఇంకొక పావురం ఏడు నుండి సాయంత్రం యైదు దాక కూర్చుంటుంది. దాని డ్యూటీ టైము లో తల్లి పావురాన్నిదగ్గరకు రానివ్వదు. తల్లి పావురం అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. సాయంత్రం ఐదు అయిపోగానే అది ఎటో ఎగిరి పోతుంది. మరల తల్లి పావురం కూర్చుంటుంది. చాల వింతగా ఉంది” కళ్ళు తిప్పుతూ చెపుతోంది.
“మరీ కధ చెపుతున్నావు”.
“నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ప్రామిస్ “అంది.
“చిన్నదానికి ప్రామిస్లు ఎందుకులే కాని నీకు కావలసింది భవిష్యత్తు లో నా హెల్ప్. అంతే కదా| తప్పక చేస్తాను. అలా చెయ్యటానికి నాకు నీ మీద ప్రేముంటే చాలు. దానికి పావురాలు…వాటి జీవిత చరిత్ర అక్కర్లేదేమో” అన్నాను భుజం మీద చెయ్యేసి దగ్గరగా తీసుకుంటూ.
“నా మీదే కాదు పుట్టే బిడ్డ మీద కూడా ఉండాలి. అప్పుడే అది సాధ్యం”.
“ఎందుకుండదూ? నీకసలు ఆ అనుమానం ఎందుకొచ్చింది?”.
“ఈ మధ్య మీరు, అత్తయ్య గారు తెగ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు.’ఆడపిల్ల పుడితే పుట్టింటి లోనే ఉంచెయ్యి.వెనక్కి రానియ్యొద్దు’ అని చెపుతున్నారేమోనని భయం” అంది నవ్వుతూ.
“అబ్బా, ఆవిడేదో అన్నదని దాని గురించే ఆలోచిస్తావే? మా తాత గారికి మా నాన్న ఒక్కరే సంతానం. నాన్న తో ఆగి పోకూడదని బామ్మ, తాతయ్య ఒత్తిడి పెట్టటంతో అమ్మా,నాన్న ముగ్గురు ఆడ పిల్లల తరువాత నేను పుట్టేదాకా ఆగారు.ఈ రోజుల్లో కనేది ఒక్కళ్ళనే కదా, ఆ ఒక్కడు మొగ పిల్లవాడైతే వంశం నిలపడుతుందని ఆశ.ఆ తరం ఆలోచనలు ఆవిడలో ఇంకా ఉండి ఉండవచ్చు” అన్నాను.
“మరి మీరు కూడా మొన్నమగ పిల్లాడే కావాలన్నారు” వదలకుండా ఆరాగా అడిగింది.
“నాకు అందరూ అక్కలే. నీ వైపు నువ్వు, నీ చెల్లెలు.ఇంతమంది ఆడ వాళ్ళ మధ్య నాకు తోడుగా నా ప్రక్కన నిలబడటానికి ఓ మగ పిల్లవాడు పుడితే బాగుండుననిపిస్తోంది. అంతే కాని ఆడపిల్లంటే ఇష్టం లేకపోవటమేమి లేదు” .
“నమ్మొచ్చా?లేక కధ చెపుతున్నావా?.
“అది నీ ఇష్టం. అయినా నీ లాగా పావురాల మీద , పిచ్చుకల మీద కధలు చెప్పటం రాదు తల్లీ” అంటూ ముగించాను.
ఆ మర్నాడే అనూహ్య పుట్టింటికి వెళ్ళింది. రోజూ మా మధ్య నడిచే ఫోన్లల్లో, పావురం గురించే సగం సంభాషణ ఉండేది.
ఒకరోజు ఒళ్ళుమండి ‘ఎవరన్నా మొగుడి మీద బెంగ పడతారు. నువ్వేంటి పావురాల మీద బెంగ పడ్డట్లున్నావు’ అన్నాను.
“పాపం , నోరు లేని పక్షులు. వాటితో మీకు పోలికేంటి….ఆ, వాటికి నీళ్ళు, బియ్యం పెట్టటం మర్చిపోకండి” అంది.
“అవి నోరులేనివైతే నేను నోరున్న రాక్షసుడినా” కచ్చగా అరిచాను.
కిల కిలా నవ్వుతూ ఫోను పెట్టేసింది.
***
పావురాల కువ కువలకి ఈ లోకం లోకి వచ్చాను. వాటి మీద కూర్చున్న పావురం లేచి ఎగరటం వలన అనుకుంట ఆ పిల్లలు చిన్న గొంతులతో అరుస్తున్నాయి. అమూల్య చెప్పింది వినటమే తప్పితే నేను అబ్జెర్వ్ చేసింది లేదు. మొదటిసారి పరిశీలనగా చూస్తున్నాను. రాత్రి అంతా కూర్చున్న పావురం ఎగిరిన తరువాత అప్పటి దాక పిట్ట గోడ మీద కూర్చున్న పావురం యెగిరి వచ్చి ఆ పిల్లల మీద కూర్చుంది. నాకు ఎంతో ఆశ్చ్యర్యం అనిపించింది. ప్రక్కన బియ్యం లేని బౌల్, నీరు లేని మగ్ దీనంగా చూస్తున్నట్లు అనిపించి బియ్యం పోసి , నీళ్ళు నింపి పెట్టాను. జేబు లోని మొబైల్ మ్రోగింది. అనాలోచితంగా ఎత్తాను.
“పాపకి బాలేదు. ఆదివారం. ఈ రోజన్నా మీరు వస్తారని ఆశపడుతున్నాను. వస్తే బాగుంటుంది” ఫోన్ లో నా మామగారి రిక్వెస్ట్. ఏమి సమాధానం చెప్పకుండా కట్ చేసాను. నేను పట్టించుకోదలచుకోలేదు.వాళ్ళ తిప్పలు వాళ్ళవి. వాళ్ళ బాధేదో వాళ్ళు పడతారు. ఏదో కసి. ఈ ప్రపంచం మీదే కోపం. ఆ పాప మీద ద్వేషం…
***
సాయంత్రం టీ కలుపుకుని డాబా మీదకు వెళ్లాను. మరల నా దృష్టి ఆ పావురం పిల్లల మీద పడింది. ఎంతో కమిటెడ్ గా ఓ బొమ్మ లాగ పావురం ఆ పిల్లల మీద కూర్చునుంది.
“అంత ఓపిగ్గా ఎలా కూర్చుందో? విసుగు పుట్టదా…అంత అనుబంధం (ఎటాచ్మెంట్) ఉంటుందా? ‘ రెక్కలు వచ్చిన తరువాత వాటి దోవన అవి ఎగిరిపోతాయి’ అని వాటికి తెలియదా? తెలియకే ఇంత ఇదిగా పెంచుతాయా?!……”
నా ఆలోచనలో నేను ఉండగానే బహుశా డ్యూటీలు మారే టైం అయ్యిందనుకుంటా కంటి క్రింద బుడిపి ఉన్న పావురం అంటే అమూల్య చెప్పిన ప్రకారం తల్లి పావురం వచ్చింది. అప్పటి దాక ఉన్న పావురం తప్పుకుంది. తల్లి పావురం వచ్చి కూర్చుంది.
‘సర్లే, వాటి బ్రతుకు అవి బ్రతుకుతున్నాయి. నా పనేదో నేను చూసుకోవాలి’ అనుకుంటూ లోపలి నడిచాను.
నాలుగు రోజుల్లో ఇల్లు మారాలి. ఇప్పటినుండీ సర్దితే కాని అవ్వదు. సర్దటం మొదలు పెట్టాను. అమూల్యకు సంబందించిన ఏ జ్ఞాపకం నేను ఉంచదలచుకోలేదు. అవన్నీ ఓ పెద్ద అట్ట పెట్టెలో పడేసాను. అలా సర్దుతూ సర్దుతూ అలసిపోయి అడ్డదిడ్డంగా పడి నిద్రపోయాను.
అర్ధరాత్రి ఏదో చప్పుడు.ఉలిక్కిపడి లేచాను. రెక్కలు కొట్టుకుంటున్న శబ్దం. పావురాల అరుపులు. గబుక్కున లేచి డాబా మీదకు పరుగెత్తాను. ఎదురుకుండా దృశ్యానికి నాకు గుండె దడ వచ్చింది. నోట మాట రాలేదు.
ఆ పిల్లల మీద ఉన్న తల్లి పావురాన్నినోట కరచుకుని ఉంది పిల్లి.పావురం కొట్టుకుంటోంది. తుది శ్వాస విడుస్తోంది. నన్ను చూసిన పిల్లి ఒక్కసారిగా మెట్ల కేసి ఉరికి పారిపోయింది.
నేను తేరుకుని పిల్లలకేసి చూశాను. అప్పటిదాకా తల్లి రెక్కల మధ్య వెచ్చగా తమదైన ఆనంద ప్రపంచంలో ఉన్న ఆ పిల్లలు ఒక్కసారిగా తల్లి రక్షణ తొలగిపోవటంతో భయంతో ముడుచుకుపోతూ అల్లల్లాడుతున్నాయి. నాకు ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. ఏదో బాధ. వాటిని చూడ లేక లోపలికి వచ్చేసాను. అంతలోనే ఉండబట్టలేక మరల డాబా మీదకు వెళ్లి చూశాను. అలా ఇంట్లోకి బయటకు తిరుగుతూనే ఉన్నాను.
బాగ తెల్లారిన తరువాత రెండో పావురం వచ్చింది. పిట్టగోడ మీద కూర్చునుంది. దాని డ్యూటీ టైము అయినట్లుంది. ‘అమ్మయ్య. ఇది వచ్చింది. ఇహ అదే దాని పిల్లలను చూసుకుంటుంది’ అని ఊపిరి పీల్చుకున్నాను. కాని అరగంటైనా అది అక్కడనుండి కదలకుండా శిలా విగ్రహంలాగా కూర్చునుంది. అక్కడనుండే ఆ పిల్లల కేసి చూస్తోంది. దగ్గరకు రావటం లేదు.
‘’రన్నింగ్ రేస్ కాంపిటీషన్స్ అప్పుడు రన్నర్స్ ఒకరినుండి ఒకరికి స్టిక్ ని పాస్ చేసుకుంటూ పరిగెత్తుతారు.అలాగే ఈ పావురాలు కూడా సిగ్నల్స్ పాస్ చేసుకుని డ్యూటినీ చేస్తాయా?ఆ తల్లి పావురం లేక సిగ్నల్ అందక ఇది డ్యూటి ఎక్కటం లేదా?!” అన్నీ ఆలోచనలే.
‘అయ్యో ఆ పిల్లలు దిక్కులేనివి అయిపోతాయా?’ ఒకటే టెన్షన్. ఆఫీసు సంగతి కూడా ప్రక్కకు పెట్టి హాలులో కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని దానికేసి చూస్తూ కూర్చున్నాను. ఇంకో గంట గడచిపోయింది. అది కదలలేదు.
‘ఇహ లాభం లేదు. వాచ్ మాన్ ని పిలిచి కుండీ ఎత్తుకెళ్ళి క్రింద అతనింటి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోమని చెపుతాను’ అనుకుంటూ లేచాను.
ఇంతలో ఆ పావురం యెగిరి కుండీ ముందు వాలింది. అటూ ఇటూ నడిచింది. నేల మీద చనిపోయిన పావురం ఈకలు.దానికేదో అర్ధమయ్యిందనుకుంట లేచి వెళ్లి పిట్ట గోడ మీద కూర్చుంది. చేదు అనుభవాన్ని మ్రింగే ప్రయత్నం చేస్తున్నట్లుంది. పది నిమిషాల తరువాత యెగిరి వచ్చి ఆ పిల్లల మీద కూర్చుంది. అవి కువ కువ లాడాయి. నా మనసులో ఏదో రిలీఫ్. మెల్లగా వెళ్లి కాసిని బియ్యం గింజలు , నీళ్ళు పెట్టాను. హడావిడిగా తయారయ్యి ఆఫీసుకు వెళ్లాను.
***
నేను తిరిగి వచ్చేసరికి రాత్రి పది దాటింది. ఆత్రుతగా ఆ కుండీ కేసి వెళ్లి చూశాను. పిల్లల మీద పెద్ద పావురం లేదు. ‘ఏమయ్యింది ఆ పావురం?మళ్ళా పిల్లి వచ్చి దానిని కూడా తినేసిందా| నేను వాచ్ మాన్ కి చెప్పి వెళ్లానే , బిల్డింగ్ లోకి పిల్లి రాకుండా చూసుకోమని. మరి ఏమయ్యింది?’ ఆలోచన తెగటం లేదు. ఆ టైములో ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. పిల్లి వచ్చి ఆ పిల్లలిని తినేస్తుందేమో అని భయమేసింది. కుర్చీ తెచ్చుకుని కుండీ ప్రక్కన వేసుకుని కూర్చున్నాను.
***
తెల్లగా తెల్లారి పోయి వెలుగు మీద పడటంతో మెలకువ వచ్చింది. లేచి ఆత్రుతగా పిల్లల కేసి చూశాను. అవి క్షేమంగానే ఉన్నాయి. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాను. అంతలోనే తండ్రి పావురం వచ్చి మెల్లగా ఆ పిల్లలపై కూర్చుంది.అంటే టైముకి మరల తన డ్యూటి ఎక్కింది. తన వంతు మాత్రమె తల కెత్తుకుంది. ‘మిగతాది దైవానికి వదిలేసిందా లేక వాటికే అర్ధమయ్యి బ్రతకాలనుకుంటోందా?’. ఏమో?! నా ఆలోచలనలను చెదరగొడుతూ నా మొబైల్ మ్రోగింది. తీశాను.
”పాపకు జాండిస్ ఎక్కువయ్యి హాస్పిటల్ లో చేర్పించాము. డేంజర్ నుండి బయట పడింది. మీకు చెప్పటం మా బాధ్యత కనుక చెపుతున్నాను. ఆ పైన మీ ఇష్టం. మీలాగా ఇంత నిర్దయగా ప్రవర్తించే కన్నతండ్రి ఎవరూ ఉండరేమో” అని అవతల నా మామ గారు, అమూల్య తండ్రి ఫోన్ పెట్టేసారు. ఆయన అన్న మాటే ఎదురుగా ఉన్న ఆ పావురం కూడా అంటున్నట్లు ఉంది.
“ఓ పక్షిని. నేనే నా డ్యూటీని చేస్తున్నాను.జ్ఞానమున్న మనిషివి, కన్న తండ్రివి. నువ్వు చేస్తున్న పని ఏమిటి?” అని ఆ పావురం నిలదీస్తున్నట్లుంది.
“అవును. నాలాంటి కన్నతండ్రి ఎవరూ ఉండరు. ‘కొన్ని కష్టాలు మనిషిని అంధకారంలోకే కాదు అజ్ఞానంలోకీ కూడా నెడతాయేమో’| లేకపోతె చావు పుట్టుకలకు తేడా తెలీని నా కన్నబిడ్డను, పది రోజుల పసి పాపను అనూహ్య మరణానికి కారణాభూతురాలిని చెయ్యటం యెంత మూర్ఖత్వం? పుడుతూనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లను, ఆ లోటు తెలీకుండా చూడాల్సిన భాద్యత నాది.అది లేక పోగా కనీసం తండ్రిగా ప్రవర్తించాల్సింది కూడా విస్మరించాను.యెంత హీనం”.
ఆత్మ పరిశీలనతో అజ్ఞానం తొలగింది. ‘ప్రకృతి ధర్మం’ గురించి ఆ పావురం బోధించిన ‘పాఠం’ అర్ధమయ్యింది. జీవిత సత్యం తెలిసింది. అర్ధగంటలో స్థానిక హాస్పటల్లో ఉన్న పాప దగ్గరకి చేరాను. అమాయకంగా నిద్రపోతున్న పాపను తీసుకుని గుండెలకు హత్తుకున్నాను.
***** (*) *****
(కథాగ్రూపు, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో బహుమతి పొందిన కథ)
సి. యమున:
పూర్తి పేరు చింతపల్లి యమున. తొలి కథ “రెక్కలొచ్చాయి’ 2011లో నవ్యవీక్లీలో ప్రచురితమైంది. తెలుగు కథ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెట్టిన పోటీల్లో ఈ కథకు విశేష బహుమతి లభించింది. ఇప్పటిదాక పాతిక కథలు రాశాను. కవితలకు కూడా వివిధచోట్ల బహుమతులువచ్చాయి. పుట్టిపెరిగింది విజయవాడ. ప్రస్తుతం ఉంటోంది హైదరాబాద్. ఫేస్ బుక్ లో కథల పోటీ పెట్టిన కథాగ్రూపు, సాయిఅఖిలేష్ ప్రొడక్షన్స్ మరియు కథను ప్రచురిస్తున్న వాకిలి సంపాదకులకు కృతజ్ఞతలు.
మంచి కథ! బావుంది యమున గారూ!! అభినందనలు!!
ధన్యవాదాలు రాజేష్ గారు
కధ బాగు౦ది యమున గారూ పక్షుల సాపత్య౦ తో కధ నడిపారు. కానీ మానవుల్లో పెళ్ళా౦ చచ్చిపోతే పిల్ల పేరు మీద రె౦డో పెళ్ళి కి సిధ్ధపడతారు.లేక క్౦త మ౦ది ఇలా పిల్ల మీద ద్వేష౦ పె౦చుకు౦టారు. ఈ కధ చదువుతు౦టే ఒక పాత సినిమా హి౦దీ లో ది జ్ఞాపక౦ వచ్చి౦ది. హీరోయిన్ షర్మిలా అనుకు౦టాను. ఆమె త౦డ్రి (జ్ఞాపక౦ ఉన్న౦త వరకు రెహమాన్ అనుకు౦టాను) తన భార్య మరణానికి ఆమె కారణమని చివరి దాకా తన కూతుర్ని ద్వేషిస్తాడు. త౦డ్రి ప్రేమ కోస౦ ఆమె తపన చాలా బాగు౦టు౦ది.
వెంటనే కాకపోయినా అవసరమో,పరిస్థితులో, ఒంటరితనం భరించలేని బలహీనతో ……రెండో పెళ్లి చేసుకోవటం ఒక రకం.పిల్లల మీద ద్వేషం పెంచుకోవటం భరించలేనిది ,కూడనిది. హిందీ సినిమా ఐడియా లేదు. నిజ జీవతం లో చూసినది ఉన్నది.
అభిప్రాయం తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
కథ చాలా బాగుంది యమునా. ఏమిటో నేను కూడా పావురాల డ్యూటీలతో ఏకమైపోయాను. చివరి వరకూ ఉత్కంఠతతో సాగించి చివరికి కళ్లల్లో నీళ్లు తెప్పించావు.
ఎవరైనా నేను రాసిన కథ చదివి కామెంట్ లేక కాంప్లిమెంట్ (+ve or -veఅభిప్రాయం) తెలియచేస్తే చాల ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా మీలాంటి సీనియర్ , నాలెడ్జ్ ఉన్న రచయిత్రి నుండి అభినందనలు అందుకోవటం మరవలేని అనుభూతి…..మిమ్మల్ని నా కథ అంత కదిలించినిదంటే నాకు మరొక బహుమతి లభించినట్లే భావిస్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ కథ చాలా బాగుంది యమునగారు. తండ్రి బాధ్యతను పావురాళ్ళ ద్వారా బాగా గుర్తు చేశారు .అభినందనలు. తెలుగులో కూడా భార్య చావుకి కారణమైందని కూతుర్ని అసహ్యించుకునే తండ్రి పాత్ర ఉన్న ఓ సినిమా వచ్చినట్లు గుర్తు . సినిమా పేరు వసుంధర అనుకుంటా . ఏది ఏమైనా మీ కథ సందేశాత్మకం గా ఉంది. కీప్ ఇట్ అప్ .
అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు భాగ్యశ్రీ గారు. సీనియర్ రైటర్స్ నుండి అభినందనలు అందుకోవటం చాల ఆనందం గా ఉంటుంది. ఈ లింక్ మీ ద్వారానే తెలిసి తరువాత పోటీలు పంపటం జరిగింది. సొ స్పెషల్ థాంక్స్.
ఒక సందేశాన్ని పావురాల ద్వారా ఇప్పించి మంచి కథని ఇచ్చారు Yamuna అభినందనలు
ధన్యవాదాలు లక్ష్మి రాఘవ గారు.
మంచి కథ! బావుంది యమున గారూ!! అభినందనలు!!
ధన్యవాదాలు వీరా రెడ్డి గారు
చాలా బావుంది యమున గారూ మీ కథ.. ఆకట్టుకునేలా రాశారు. చదువుతున్నంతసేపూ ఏదో తెలియని అనుభూతి! చివరి వరకూ దాన్ని ఎక్కడా పోనివ్వకుండా తీసుకొచ్చారు. కథ అంతా కళ్ల ముందు కదిలిందంటే నమ్ముతారా?! ఇంకా ఏదో చెప్పాలనిపిస్తోంది.. కానీ మాటలు రావడం లేదు. అంతగా మనసుకు హత్తుకుంది. చాలా థాంక్స్.. ఒక మంచి కథను అందించినందుకు..!
అంతలా కదిలించింది అంటే నేను మరొక బహుమతి పొందినట్లే. ధన్యవాదాలు అను గారు.
Kada bavundandi. Vupamaanam pavuraallato. ..neeti bodhinchaaru. Nice
మంచి కథ! హార్ట్ టచింగ్ గా చాలా బావుంది యమున గారూ!! అభినందనలు!! పక్షుల సాపత్య౦ తో కధలో “అభినయం” కూడా చాలా బావుంది….!!
మంచి కథ! హార్ట్ టచింగ్ గా చాలా బావుంది యమున గారూ!! అభినందనలు!! పక్షుల సాపత్య౦ తో కధలో “అభినయం” కూడా చాలా బావుంది….!! ఈ రోజు మల్లి చదివాను ఇంకోసారి మల్లి మొదటి సారి చదివిననట్లుంది…!!!
‘మరల చదివించింది….హార్ట్ టచింగ్ గా ఉంది’ ఆ అభినందన నాకు హార్ట్ టచింగ్ గా ఉంది. ధన్యవాదాలు వీర రెడ్డి గారు.
ధన్యవాదాలండీ ఇందు రమణ గారు
మంచి కథ రాసారు యమున!
కథను కడ దాకా చాలా ఆసక్తి గా చదివించారు. మనమో సారి ఇలానే బహుమతి ప్రదానోత్సవ సభ లో కలుసుకున్నాం కదూ?
ఇమ్తకుముందు మీ కథ మీద ఓ సమీక్ష కూడా రాసాను, ఫేస్ బుక్ లో!
శుభాభినందనలతో..
దమయంతి గారు నేను ప్రస్తుతం బెంగుళూరు లో ఉన్నాను. ఇప్పుడే మీ ఫీడ్ బ్యాక్ చూసాను. ధన్యవాదాలు. మనం కలుసుకున్నాము.అస్సలు మరచిపోలేదు. మీరు నా ఏ కథ మీద సమీక్ష రాసారు? వీలయితే తెలియచెయ్యండి…..అభిమానంతో యమున.
ఆ కథ ఏమో గుర్తు లేదు యమునా. కానీ ఈ కథను సాహిత్యం లో పోస్ట్ చేస్తూ రెండు ముక్కలు రాసాను. చూడండి!
శుభాకాంక్షలతో..
https://www.facebook.com/groups/186953831400882/
చాలా ఆత్రుతగా చదివేలా రాసారు..
ఓ, ధన్యవాదాలు ప్రవీణ్ గారు
చక్కని కధాంశం. బావుంది.
ధన్యవాదాలు రాజకుమారి గారు.
ధన్యవాదాలు యమున గారు, ఒక మంచి సందేశమిచ్చినందుకు.
చాలా కాలం తరువాత, ఒక మంచి కథ చదివేను.
కథ చదివేను అనడం కన్న, కథ నన్ను చదివించింది.
కథనము, కథా శిల్పము బాగున్నవి.
వాతావరణమును పక్షుల ద్వారా సృజించి కథను మలుపు తిప్పి కొలిక్కి తెచ్చి, అనూహ్య మరణమును పావురము మరణమునకు జోడించి, అక్కడ భగవంతుడు ( లేద కర్మ ) ఇక్కడ పిల్లి జంట విడిపోవడానికి కారణమని సూచిస్తూ, చదివిన వారికి, అమ్మయ్య కథని కంచికి, అభిని తన కుమార్తె వద్దకు చేర్చేరు.
రచయిత్రి యమున గారికి అభినందనలు, నమస్సులు
చాలా బావుంది మేడం ఈ కధ.. పావురాలతో పోలిక చాలా బాగా కుదిరింది..
ఎప్పటినుంచో…పక్షులు మానవులకి ‘సందేశాలు’ఇస్తూనే ఉన్నాయి. అలాగే ‘అతని’కి యోచించి౦చే శక్తి లేకా కాదు, ఇష్ట౦లేకా కాదు. కాని ‘ఆడపిల్ల’అనే తేలికభావాన్ని, అతని పెద్దవాళ్ళు పె౦పొ౦ది౦చిన మూర్ఖమనస్తత్వాల్ని కాదనలేని బలహీనత…అన్నిట్లనీ- అధిగమి౦పజేసి ‘యమున’గారు కధని ‘చక్కగా’ పరిష్కరి౦చారు.
చాలామ౦ది…పూర్వమ౦త (ఆడపిల్లల౦టే) భేద భావ౦ చూపి౦చట౦లేదు. ఇ౦కా మారాల్సినది ఉ౦దిగాని…కొ౦త మారగలగట౦కూడా…మేలైన మార్పే కదా?!
యమున గారికి హృదయపూర్వక అభిన౦దనలు!
యమున గారికి,
మీ పావురం కథ చదివాక పావురాలు నేర్పిన మరో పాఠం గుర్తుకు వచ్చి ఈ సందర్భంగా తెలియచేయాలనుకున్నాను.
మా బాల్కని లో పావురం ఇలాగే పిల్లల్ని పెంచుతోంది. ఒక రోజు ఒక పిల్ల కింద పడి వుంది. పెద్దదవటం వల్ల స్థలం సరిపోక పడిపోయిన్దనుకున్నాను. మళ్ళీ పైన పెట్టాను. కాసేపట్లో మళ్ళీ కింద పడి వుంది. ఏం జరుగుతుందో చూద్దామని అలాగే వదిలేసాను. సాయంత్రానికి ఆ పిల్ల మెల్లిగా నడవడం, ఆ తరువాత ఎగరటం మొదలుపెట్టింది.
అప్పుడు అర్ధమైంది … పిల్లలకి ఒక వయసు వచ్చాక వాళ్ళంతట వాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతకటం నేర్చుకోవాలంటే మనం కూడా ఇలాగే వాళ్ళని మన నుండి దూరం గా ఉంచాలి. వాళ్ళ మీద అతిగా మన ప్రభావం వుండకూడదు.
మా అమ్మాయిని చదువు కోసం దూరం గా పంపేటప్పుడు ఈ పావురాన్నే దృష్టిలో పెట్టుకుని ప్రశాంతం గా వున్నాను.
‘పాఠం’ గురించి అభిప్రాయము,అభినందనలు తెలియచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.
కదా బావుంది యమునగారు….అభి మనస్సులోని భావ సంచలనాన్ని యింకాస్త చిత్రిస్తే బావుమ్డుననిపిమ్చిమ్ది
యమున గారు మీకు శుభాకాంక్షలు. మీ FB Profile నిన్న రాత్రి accidental గా చూడటం జరిగింది. అప్పుడు తెలిసింది మీరు మా schoolmet at AKTPMHSchool, vijayawada అని. మీ కధలు అద్దం, పాఠం రెండు చదివాను ఇప్పటి వరకు, బాగున్నవి. Best wishes.