గణపతి నవరాత్రుల్లో మూడో రోజు రాత్రి. గోదావరి నది వశిష్ట పాయ కు దిగువున ఉన్న లంక. పిల్లా పాప – ముసలీ ముతకా అంతా సిల్లో పోల్లోమంటూ గోను సంచులూ, చెక్క పీటలు పట్టుకొని కాకినాడ ‘గంగాధర్ మ్యూజికల్ నైట్’ చూడడానికి ఒడ్డున, సెంటర్లో కి వచ్చేసారు. ఇసుక బట్టీ పనికి వెళ్ళిన కొందరు మొగాళ్ళు, సుబ్బరావు సారా కొట్టు దగ్గర ఒక మూడు ఔన్సులు పుచ్చుకొని, వలీ కొట్టు దగ్గర మాంసం పకోడీలు తింటూ సైకిల్ స్టాండు వేసి దాని మీద కూర్చున్నారు.
వోణీలేసుకున్న అమ్మాయిలను , లుంగీలు కట్టుకొన్న అబ్బాయిలు ఫాలో అయిపోతున్నారు. మునసబు గారింట్లో భోజనాలు ముగించుకొని ఆర్కేస్టా వారు స్టేజి మీదకు వస్తున్నారు .సౌదామిని , అబ్బులూ కూడా అందరితో పాటే వచ్చారు. గంగాధరం గారు ఘంటసాల పాట తో మొదలు పెట్టారు. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది అందర్లో. పాటలకి ఈలలూ , కేకలు అరుపులతో సందడి సందడిగా ఉంది ఆ గోదారి ప్రాంతమంతా.
“ఏమే సౌదా, ఆ కనక రత్నం వుంది సూడూ, కోడల్ని అదేనే మంగని కొయిటా పంపితుందంటా ” అంది చెవిల జయ.
” ఏంటీ ,నిజమేనా? ” ఆశ్చర్యం గా చూసింది సౌదామిని.
” నిజమేనే , పొదున్న రంగరాజు గారి కి కలుపు తియ్యడానికి వెళ్తే , చే లో సెప్పుకుంటున్నారు అమ్మలక్కలు. ”
” ఏమే ! డబ్బులు బాగా వత్తాయేమోనే . ఓ పాలి మనం కూడా ఎల్దామేంటే…ఎన్నాళ్ళిలాగ ..
ఓరం రోజులు ఇద్దరం కూలి కెల్లినా సోమారపు సంతకే సరి. మన బతుకులు ఇల్లాగే ఆ గోదాట్లో కలిసిపోవాలా? ” సౌదామినికి పురుగు తొలచడం మొదలైంది.
“ఏంటీ ..దేసం కాని దేసంలో…బాస రాకుండా ..పిల్లల్ని ,మొగుడ్ని వదిలేసి ..నా వల్లకాదే సౌదా. ఐనా మీ అన్నయ్య లేకపొతే నేనుండలేనే ” అంది సిగ్గుపడుతూ జయ.
“అయ్యో నీ సిగ్గు …ఎలా ఉందిరో సూడండ్రా మొకం ..సీకేసిన తాటికాయ లాగ”
” అయినా వోలె ! అక్కడ శేటులకి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు , ఓ పది మంది పిల్లలూ ఉంటారంట. ఆళ్ళకి నానా శాకిరీ చెయ్యాలంటా… మన పని నచ్చక పోతే ఎడారి లోని వొంటెల దగ్గర పేడ తియ్యాలంట..తెలుసా నీకు ”
“ఇయన్నీ నీకేలా తెలుసే”
” మా ఊళ్ళో ఒకర్త అలాగే ఎల్లొచ్చింది. కొన్నాళ్ళకి జబ్బు చేసి చచ్చి పోయింది ”
” అలాగే ఎందుకనుకోవాలి . ఏమో మనకి మంచి జరిగి బాగా డబ్బులు సంపాదిత్తామేమో ”
” ఒసే నా సైతుల్లరా ! పాటలు ఇననియ్యిండే ” అని ముసలి నరసమ్మ ఇద్దరి కేసీ చూసి , నోట్లో చుట్ట పెట్టుకొని మళ్లీ అటు తిరిగి పోయింది.
“ఓ లమ్మో ఇది మొదలెట్టిందే సౌదా , మనం రేపు మాటాడుకొందాం ” అంది జయ నవ్వుతూ.
‘రగులుతోంది మొగలి పొదా’ పాటని… చింత క్రింద రాజు గారు పది రూపాయలు చదివించి పాడించుకొంటున్నారు. ఎవరో ఓ జంట లాంచీల రేవు దగ్గరున్న పాక లోకి వెళ్ళారు.
ఆ రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత , అబ్బులు మడత మంచం మీద పడుకొంటే , పిల్లలు పడుకొన్నారో లేదో చూసుకొని ఇలాయిబుడ్డి ఒత్తి తగ్గించి , అబ్బులు పక్కలోకి చేరింది సౌదమిని. వెళ్ళగానే కోడిపిల్లను పాము పట్టుకొన్నట్టు చుట్టేశాడు అబ్బులు.
“ఆగాగు….ఇందుకు కాదు వచ్చింది. నీతో ఓ మాట సెప్పాల” అంది గెడ్డం దగ్గర తల పెట్టి.
“ఏందే ?” అన్నాడు తల నిమురుతూ…
” అదీ ..అదీ ….”
“అనుగుదెల కోడిపెట్టలా ఆ కూతలేంటే ? సెప్పు ” అన్నాడు మెడ దగ్గర నిమురుతూ.
“కొయిటా ఎల్తే ఎలా ఉంటాదయ్యా. పిల్లల్ని బాగా సదివించు కోవచ్చు. ఓ ఎకరం సేను కొనుక్కుని …”
“ఆపుతావా ..నీ సనుగుడూ..ఎవర్త యెక్కించిందే నీకు యీ ఆలోసన. తంతే పెంటలో పడతావ్ .నోరుమూసుకొని తొంగో..” అన్నాడు పక్కకి తిరిగిపోతూ.
“ఆ.. తొంగో పోతే .. గోదాట్లో దూకుతానను కున్నవా..? బుర్ర పెట్టి ఆలోచించు , ఒక్క రెండు సంవచరాలు యేలాగోలా సర్దుకొన్నామంటే బతుకు ఎల్లాగుంటాదో అని ఆలోసించ మంటున్నాను. యే నీనొక్కదాన్నే బావుకుంటానా? పిల్లల గురించేకదా యీ తాపత్రాయం…” అంది సౌదా మంచం మీద నుంచి దిగిపోతూ.
అబ్బులు ఏం మట్లాడలేదు. ఆ రోజే కాదు…ఒక వారం రోజుల దాకా.
సౌదామిని కి ముప్పై లోపే వుంటుంది వయసు . కొంచెం చామన చాయ గా ఉన్నా , ఎత్తైన విగ్రహం. పొడుగైన జడ, గుండ్రటి మొహం, చూడగానే టక్కున ఆకర్శించే రూపం తనది. గోపీ రంగు చీర కట్టి , కళ్ళకి కాటుక పెట్టి , తలలో మల్లిపూవులు గాని , సన్నజాజులు గాని తురిమి అలా బయటకు వచ్చిందంటే …అబ్బులు తో సహా చాలా మంది కుర్రోళ్ళకి పండగే ఆ రోజు .ఊళ్ళో చాలా మంది కళ్ళు సౌదా పై పడుతున్నాయని పెళ్ళైన కొత్తల్లో నే అబ్బులు కి తెలిసింది. అందుకే రసికులైన రాజు గారి చేలల్లోకి , వయసులో ఉన్న కాపు గారి ఇళ్ళల్లోకి పనికి పంపించలేదేప్పుడూ. కారణం సౌదా కీ తెలుసు. ఊళ్ళో జనాలకీ తెలుసు. అపూరూపంగా చూసుకుంటాడు అబ్బులు. ఆడికి అదంటే పేణాలు.
‘నువ్వులేకుండా నేను బతకలేను’ అని చెప్పడానికి అబ్బులు కి మాత్రం ఎక్కడలేని మొహమాటం పెళ్లై పది సంవత్సరాలు కావస్తున్నా.
ఆ రోజు సోమారపు సంత. రెండు కొయ్యింగ పరిగలూ, పిల్లలకి మిక్చరు పొట్లాలూ ,సౌద కి ఇష్టమని అల్లం పకోడి కట్టించుకొని సందేలకి ఇంటికొచ్చాడు అబ్బులు. సౌదా పొయ్యి దగ్గర అన్నం వార్పు తీస్తూంది. ఇద్దరు పిల్లలూ ఇలాయి బుడ్డుదగ్గర పెట్టుకొని పేపర్లలో సినిమా బొమ్మలు చూసుకుంటున్నారు. మిక్చరు పొట్లాలు వాళ్ళకిచ్చాడు.
సౌదా వైపు చూసాడు. మూతి బిగపట్టుకొని కూర్చుంది ఉల్లిపాయలు కోస్తూ. తన హాఫ్ నిక్కరు లోంచి పకోడీ పొట్లాన్ని తీసి పొయ్యి దగ్గర కూర్చున్న సౌదా దగ్గరికి విసిరాడు . సౌదా ఏమీ మాటాడలేదు . కొంచెం సేపు అలాగే వాకిట్లో కూర్చున్నాడు . ఇంక చిరాకు వచ్చి, సుబ్బరావు సారా కొట్టు దగ్గరకు వెళ్ళిపొయ్యేడు.
ఇంటికి తిరుగొచ్చేసరికి , పిల్లలు తినేసి పడుకున్నారు. సౌదా ఒక్కర్తే ఇంటి ముందున్న నిమ్మ చెట్టు దగ్గర కూర్చుంది.
“అన్నం తిన్నావా?” అడిగాడు అబ్బులు చాలా రోజుల తర్వాత.
“_____”
“నిన్నేనే… నేనేమి అన్నాననే ..యీ ఉలుకు…సరే. నువ్వనుకున్నదే సెయ్యి. కానీ నాతో మాత్రం మాటాడ్డం మానేకే…పేణాలు యెట్టుకున్నానే నీ మీద”
సౌదా ఆ మాటకి దగ్గరకొచ్చింది.
అబ్బులు భుజం మీదున్న కాశీ తువ్వాలు తీసి కాళ్ళు కడుక్కో అన్నం తిందూగాని” అంది.ఇద్దరూ ఆ రోజు చేపల కూర ఖాళీ చేసేసి , రాత్రంత జాగారమే చేశారు. పొద్దున్నకల్లా సౌదామిని అనుకున్నది సాధించేసింది.
” మరి పాస్పోర్టూ , మెడికల్ కీ మరే అదేటందె…ఈసా..ఎంతౌతుందండీ …మొత్తం కలిపీ” అడిగాడు అబ్బులు రాజోలు నుంచి వచ్చిన ఏజెంటు తాతారావుని.
“పదిహేను వరకూ లెక్క తేలతాది అబ్బులు”
” జీతం ఎంతొత్తాదండి బాబు?”
“అదీ యిప్పుడు తెలీదు అబ్బులూ, ఎల్లే ఇల్లుని బట్టి , యజమాని ని బట్టీ ఉంటుంది. మీ సౌదామిని పని బట్టీ కూడా ఉంటుంది మరి ” అన్నాడు సౌదామినిని అదోలా చూసి.
సౌదామిని పమిట భుజం మీద సర్దుకొంది.
ఆ రోజు డబ్బు గురించి చాలా అలోచించారు ఇద్దరూ.
” సరే మరి . కమతం దగ్గర తీసుకొంటాను. నీ బంగారం తాకట్టు పెడదాం. ఏమంటావ్?”
” మా అన్నయ్యని ఒక ఐదు వేలు అడుగుతాను. తర్వాత ఇచ్చేద్దరి”
” ఈ పిల్లల్ని ఏం సెయ్యాలే? బెంగెట్టుకుంటరేమోనే! ”
“నువ్వలా గాభరా పడకయ్య. పెద్దోడికి తొమ్మిది సంవచ్చరాలు. ఆడు బెంగెట్టు కోడు. ఆడు మీ అమ్మ దగ్గర అలవాటేలే. లోవతల్లి ని కొంచెం జాగర్త గా సూసుకోవాలి. అది పెద్దది అవ్వడానికి ఇంకో యేడెనిమిది యేళ్ళు పడుతుంది. మీ చెల్లెలువుంది గా. ఆ పిల్లని సూసుకొంటుంది. కళ్ళూ మూసి తెరసే లోగా మూడు సంవచ్చరాలు అయిపోతాయ్.
మీ కే గాని నాకుండదా బెంగా. పుట్టినప్పటినుంచీ ఊళ్ళూ తిరిగానా… పూళ్ళు తిరిగానా ? మీరిక్కడ యెలా వున్నారో అని నాకు మాత్రం వుండదా ” అంటూ చెంగు నోటికి అడ్డం పెట్టుకొని ఏడ్చింది.
ఆ ఏజెంట్ తాతారావు వారానికోసారొచ్చి విషయాలు చెప్పి పోతున్నాడు.అప్పులు చేసి ,ఏలాగైతేనే… సౌదామిని కువైట్ కెళ్ళే రోజు రానే వచ్చింది.
“అబ్బులూ , ముందుగా బొంబాయి యెల్లి మెడికల్ చేయించాలి. ఓ రెండు రోజుల తర్వాత విమానం ఎక్కించి నేనొచ్చెస్తాను. మీ కాపు గారి ఇంటి నంబరు ఇచ్చావు కదా ,దానికి ఫోను చేస్తాను. నువ్వు కంగారేం పడక్కర్లేదు. ఎంతమంది ని పంపిచాను ఈ చేతుల్తో.
“సౌదామిని.. అమ్మా.. తెముల్చు” అన్నాడు టీ తాగుతూ.
సౌదామిని ఏడుస్తూనే బయలు దేరింది. పిల్లల్లిద్దరూ తల్లిని పట్టుకొని ఏడుస్తుంటే అక్కడున్న వాళ్ళందరి కళ్ళూ చెమర్చాయి.
“మీ అమ్మ మీకు బోలెడన్ని బట్టలూ, బొమ్మలూ తెస్తుందిరా. ఏడవకండి ” అని వాళ్ళా నాన్నమ్మా,అత్తయ్యా, చుట్టు పక్కల వరసయ్యే వాళ్ళందరూ పిల్లల్ని సముదాయిస్తున్నారు. అబ్బులు కొబ్బరి చెట్టు కి జేరబడి ముమ్మిడోరపు బాలయోగి బాబులా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు సౌదామిని వంక.
ఊళ్ళో సెంటర్ దగ్గరికి ఓ ఇరవై ముప్పై మంది జనాలు పోగడిపోయారు. బస్సొచ్చింది. పిల్లల ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది. ఆబ్బులు ఏం మట్లాడ లేదు. సౌదామిని బస్సెక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచీ అబ్బులు ‘కొయిటా అబ్బులు ‘అయిపొయాడు ఊరోళ్ళకి. మొట్ట మొదటి సారి అబ్బులకి పండు వెన్నెల పెద్ద మంటలా ఒళ్ళాంతా కాలింది.
పిల్లలు బెంగెట్టుకొని అన్నాలు తినకపొతే అదీ ఇదీ చెప్పి వాళ్ళని బుజ్జగించాడు. అబ్బులు వాళ్ళమ్మ,చెల్లీ అందరూ ఇంటిదగ్గరే ఉండి ఆలనా పాలనా చూశారు. రెండు రోజుల్లయ్యింది. ఫోను రాలేదు. చీకటి పడే వరకూ కాపు గారిఇంటి దగ్గరేవుండి వస్తున్నాడు. ‘ఫోన్ వొస్తే నీ కబురు పెడతాలేరా’ అన్నా వినకుండా అక్కడే కాపు గాస్తున్నాడు.
మూడు రోజులైంది. ఫోను రాలేదు. ఊళ్ళో కూడా అందరూ ‘ ఏమైందీ ? ‘అని ఆరాలు తీయడం మొదలెట్టారు కొయిటా అబ్బుల్ని.
వారం రోజులైందీ కాని యే ఊసూ లేదు. అబ్బులు కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.మనసు మనసులో లేదు. ఎలాగైతే ఆ రాజోలు తాతారావు అడ్రసు కనుక్కొని రాజోలు వెళ్ళీ వాకబు చెస్తే ‘బొంబాయి వెళ్ళాడు …ఇంకా రాలేదు అని ‘చెప్పారు.
ఊసూరంటూ ఇంటికి తిరిగొచ్చాడు. పిల్లలు అడిగితే’ మీ అమ్మ బాగానే ఉందంట. మిమ్మల్ని అడిగిందంట. మిమ్మల్ని బాగా తిని సక్కగా స్కూలు కెళ్ళి సదువుకోమన్నదంట’ అని చెప్తూనే కళ్ళ నీరు కక్కుకున్నాడు. అది చూసి పిల్లలూఏడ్చేసారు. అబ్బులు అమ్మొచ్చి ” రేయ్ , అబ్బులూ అలా ఏడకరా…పిల్లల్ని సూడు యెలా వున్నారో..ఇప్పుడు యే మైందీ..ఫోన్ సేత్తాడులే..” అంటూ పిల్లల్ని గదిలోకి తీసుకెళ్ళి పోయింది.
నెల రోజులు గడచి పోయాయ్. ఏ సంగతీ తెలీలేదు. అందరూ కొయిటా అబ్బుల్ని చూసి జాలి పడ్డారు.
మూడు నెలలైంది. చచ్చి పోయిందనీ, ఆ తాతారావుతో లేచి పోయిందని పుకార్లు మొదలాయ్యా య్. అవి ఆ చెవినా ఈ చెవినా పడి కొయిటా అబ్బులు చెవిలో కూడా పడ్డాయ్. కొయిటా అబ్బులు రోజూ తాగడం మొదలు పెట్టాడు.
ఒక రోజు కూతురు లోవతల్లికి పెద్ద జ్వరం వచ్చింది. ఆ టైం కి అందరూ పనుల్లోకి వెళ్లి పోయారు, అబ్బులు కూడా . ఆ చుట్టు పక్క ఊళ్ళల్లో ఒకే ఒక ఆర్ యెం పీ డాక్టరు . ఆయన పేరు శర్మ. రేవు అవతల అగ్రహారం లో వుంటాడు . అబ్బులుకొడుకు వాళ్ళ నాన్న పని చేసే కమతం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, డాక్టరు గారిని తీసుకు రమ్మని చెప్పడానికి.
” నాన్నా ! నాన్నా! చెల్లికి పుల్లుగా జొరం వచ్చేసింది. రా ఇంటికి” అన్నాడు. వెంటనే అబ్బులు ఇంటికొచ్చి చూస్తే వొళ్ళు కాలిపోతుంది పిల్లకి.
“రేయ్, నువ్వెళ్ళి నాన్నమ్మ ని తీసుకురా. కాపు గారి చేలో ఉంది. ఇప్పడికిప్పుడే ఎలా వచ్చింది రా” అన్నడు కంగారు పడిపోతూ.
“రాత్రి నుంచే వుంది ” అన్నాడు కొడుకు.
“మరి నాకెందుకు చెప్పలేదు”
“నువ్వు కొంపకి వత్తున్నవా అసలు…రాత్రి ఆ సారా కొట్టు దగ్గర తాగి పడిపోతే మాయ్య తీసుకొచ్చడు నిన్ను” అంటూ వాడు ఏడుస్తూ వెళ్ళిపొయ్యేడు. అబ్బులు వాళ్ళమ్మ వచ్చిం తర్వాత శర్మ గారి కోసం అగ్రహారం పరిగెత్తాడు . కూతురువారం రోజులు లంఖనాలు చేసింది . అబ్బుల్ని ఎవరో చెప్పు తీసుకొని కొట్టినట్టు అనిపించింది. ఆ రోజు నుంచీ తాగడం మానేసాడు…తిరగడం మానేసాడు…అసలు తన కోసం తను బతకడమే మానేసాడు.
ఒక ఆరు నెలలు గడిచాయ్. సౌదామిని ఏమైందో తెలీలేదు. ఆ తాతారావు ఆ రాజోల్లో కనిపించనూ లేదు. సౌదామిని వాళ్ళన్నయ్య, ఆ కాపు గారు పోలీసు కేసు పెట్టించారు. ఐనా ఏ ప్రయోజనం లేదు.
అబ్బులు పూర్తిగా మారిపోయాడు. ఎంతో హుషారుగా పొద్దస్తమాను పని చేసి , పిల్లలకి వాళ్ళమ్మ లేని లోటు లేకుండా పెంచడం చూసి ఆ లంకలోనే కాదు. చుట్టు పక్కల ఊళ్ళలోకూడా కొయిటా అబ్బులు పేరు తెలిసి పోయింది జనాలకి.
పిల్లలకి వాళ్ళమ్మ అసలు గుర్తుకే రావడం మానేసింది ఒక సంవత్సరం పొయ్యేక.
కొడుక్కీ, కూతిరికీ ‘ అమ్మ ఇంక రాదు.. మనమే ఉండాల ‘ అని నూరు పోసాడు . వస్తే మన అదృష్టం అనుకున్నాడు మనసులో . చుట్టు పక్కల ఊళ్ళల్లో కొయిటా వెళ్ళిన జనాలు ఉంటే వెళ్లి వాకబు చేస్తూ ఉన్నాడు. రెండు మూడు సార్లుఎవ్వరికీ తెలీకుండా రాజోలు వెళ్ళొచ్చాడు. అక్కడ కూడా తాతారావు గురించి ఏ సంగతీ తెలీలేదు. ఇద్దరూ ఏమై పొయ్యారో ఆలోచిస్తుంటే ఒక్కోసారి పిచ్చి పట్టినట్లు అయిపోతుంది అబ్బులు కి . ‘లేచి పోయింది ‘ అనుకోకుండా ‘చచ్చిపోయింది’అనుకొని మనసుని సమాధానపరచుకోవడం మొదలెట్టాడు కొయిటా అబ్బులు.
కాలం అలా గోదారిలా పరిగెడుతూనే ఉంది. అది ఎప్పుడూ మనకిష్టమైన క్షణాల దగ్గర నిలవదు , మనసు కి గుండె కోత పెట్టే క్షణాల దగ్గర ఆగిపోదు.
కొయిటా అబ్బుల్ని పెళ్లి చేసుకోమని చాలామంది సలహా ఇచ్చారు . ఎప్పుడూ ఆ ఊహని కూడా మనసులోకి రానివ్వలేదు . పిల్లలు ..పిల్లలు ..పిల్లలు ..అదే వాడి లోకం అయిపోయింది.
ఒక రోజు పొద్దున్న ‘ అమ్మా ! ఇదిగో టీ తాగు ‘ అని కూతుర్ని పిలిచాడు పొయ్యి దగ్గర నుంచి . గది లోంచి ఏడుపు వినపడింది . “ఏమైంది తల్లి ” అనుకుంటూ లోపలికెళ్ళాడు.
పిల్ల లంగా అంతా రక్తం అయిపోయింది . “అదేంటదీ ” అని దగ్గరికి వెళ్ళ బోయి ఒక్క క్షణం ఆగి, “అమ్మా, ఏడకే అలా మంచం మీద కుచ్చో.. బంగారం కదూ, యిప్పుడే వొత్తాను ” అని వాళ్ళమ్మ ఇంటికి పరిగెత్తాడు.
“ఓ లమ్మా ,లమ్మా ! పిల్ల సవర్తాడినట్టు వుందే, నా కంగారు గా వుంది. ఓ పాలి రా” అంటూ ఆ ముసలిదాన్నీ, చెల్లెల్నీ లాక్కొచ్చాడు. ఇద్దరూ లోపలికెళ్ళి చూసి , పిల్లని ఊరుకో బెట్టి బయటకి వచ్చి ” నిజమేరా ” అంది అబ్బులు ఆల్లమ్మ. “ఇప్పుడు ఏం చేద్ధారే ” అన్నాడు కంగారుగా.
“నువ్వలా వుండన్నయా ” అని , “అమ్మా ! నేనెల్లి పాత గుడ్డలట్టు కొత్తాను” ఒక పరుగు లంఘిచుకొంది అబ్బులు చెల్లెలు.
ఇరుగు పొరుగు వచ్చి చూసి , నవ్వి ” అబ్బులూ ! కూతురు పెద్దదైపోయింది . ఇక సంబందాలు మొదలెట్టుకో మరి ” అని వేళాకోళం ఆడారు. ఎవరో కొబ్బరి చాప అల్లమంటే , గభ గభా లేత ఆకులు కొట్టి , పది నిమిషాల్లో చాప అల్లేసాడు. తెలగపిండి , గానుగ నూనె తెచ్చి ఇంట్లో పెట్టాడు . పిల్ల ఒక్కర్తే చాప మీద కూర్చుంటే , తడక కన్నాల లోనుంచి చూసి మురిసి పొయ్యే వాడు. ఎవ్వరికీ కనబడకుండా వెక్కి వెక్కి ఏడ్చే వాడు . కుర్రోడి స్నేహితులని ఇంటికి రావొద్దని చెప్పేసాడు .ఏడోరోజున , లంకంతా పిలిచి మా గొప్పగా భోజనాలు పెట్టాడు.
కొడుకు పదో తరగతి పాసై తే, అందర్నీ సలహాలు అడిగి పాలిటెక్నిక్ పరీక్ష రాయించి ,కాకినాడ గవర్నమెంటు కాలేజీలో జాయిన్ చేసాడు .ఆడపిల్లకి అసలు పనేమి చెప్పకుండా అన్నీ అబ్బులే చక్క పెట్టేస్తున్నాడు. కొయిటా పంపించడానికి చేసిన అన్నీ అప్పులూ తీర్చేసాడు . చెల్లెలికి గోదావరి అవతలున్న ఊళ్ళో కుర్రాడికి పాతిక వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేసాడు . పెళ్లి చేసి పంపించిన తర్వాత ముసలిదాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు.
కొన్నాళ్ళకి వాళ్ళమ్మ చచ్చి పోయింది.
ఇప్పుడింక మరింత ఒంటరైనా, ఏ మాత్రం హుషారు తగ్గ కుండా , పిల్లలకి ఆ లోటేమీ తెలీకుండా చేస్తున్నాడు .కుర్రాడు నెలకో సారి వచ్చి చూసి వెళ్లి పోతున్నాడు కాకినాడ హాస్టల్ కి.
రోజూ కూతురికి లాంచీల రేవు దగ్గర నుంచి పప్పల పొట్లాలు తీసు కొచ్చి , కూర వండి కూతురికి ముద్దలు పెట్టి తినిపించి , తను తిని పడుకుంటాడు . ప్రతీ రోజూ పడుకొన్న తర్వాత ఓ గంట సౌదా గురించి ఆలోచిస్తాడు.
నిద్దర్లోనే ఏడుస్తాడు.
నిద్దర్లోనే కుమిలి పోతాడు.
నిద్దర్లోనే మర్చిపోయి, మల్లి పూవులా… తెల్లారి నవ్వుతూ పనికి పోతాడు.
అలా సంవత్సరాలు గడిచి పోయాయ్.
కొయిటా అబ్బులు కి నడి వయసు దాటి పోతోంది . కొడుకు డిప్లొమా అయ్యాక హైదరాబాదు వెళ్లి వుద్యోగం చేసి , నెల నెలా ఇంతని చెల్లి పెళ్ళికి డబ్బులు పంపుతున్నాడు. కూతురు దగ్గరలోనే ఉన్న గవర్నమెంటు కాలేజీలో డిగ్రీ చదివి ,ఉద్యోగ పరీక్షలు రాస్తూ ఉంది.
అలా ఓ పద్నాలుగు సంవత్సరాల తర్వాత…
వారం రోజుల నుంచీ ముసురు పట్టడంతో , జనాలు ఎవ్వరూ ఇళ్ళలోనుంచి బయటకి రావడం లేదు. ఇళ్ళ లోనుంచి వచ్చే పొగ మబ్బుల్లో కనబడడం లేదు. గోదావరి అల్లకల్లోలంగా వుంది. ఆ దరి నుంచి ఈ దరి కి గోదారి వంతెన మీదఎవ్వరూ కనబడడం లేదు. మసలడం లేదు . రేవు దగ్గర మాత్రం ఇద్దరు ముగ్గురు మరకాళ్ళూ వలలేస్తున్నారు. ఆ సాయింత్రానికి కొంచెం తెరాబు ఇవ్వడంతో , జనం అటూ ఇటూ తిరగడం మొదలెట్టారు.
” అమ్మా ! అలా సెంటర్ కి ఎల్లోత్తాను ” అని అబ్బులు బయటకి వచ్చాడు. సెంటర్లో శెట్టి గారి కొట్టు దగ్గర కూర్చుని ఆయనతో మాటాడుతుంటే , ఎవరో వచ్చి ” రేయ్ కొయిటా అబ్బులూ ! సౌదామిని వచ్చిందిరా ” అన్నారు.
అబ్బులు కంగారై పోయి, గోదారి లాగ అల్ల కల్లోలమై పోయాడు ఒక్క నిమిషం . తువాలు తల మీద నుంచి తీసి, మెళ్ళో వేసుకొని అప్పటి వరకూ మానేసిన పొగాకు చుట్టను శెట్టి గారిని అడిగి, వెలిగించి ఇంటికి కదిలాడు. ఇల్లు త్వరగావచ్చేస్తుందన్న బాధ ఎక్కువై పోయింది. ఇల్లు ఇంకా కొంచెం దూరం ఉంటే బాగుణ్ణు అనుకున్నాడు మొట్ట మొదటి సారిగా. ‘నన్ను, నా పిల్లల్ని వదిలి ఎక్కడికో వెళ్లి పోయింది ..చచ్చి పోయింది’ అన్న ఆలోచన తోనే సమాధానపడి, నమ్మి, ఆ ఊహతోనే ఇన్నాళ్ళు బతకడం వల్ల ‘ ఆ ఆలోచన ఇచ్చిన ఆనందం ..సౌదామిని ని చూడాలన్న కోరిక ను చాలా వరకూ చంపేసింది. అందుకే ఇల్లు దూరమైతే బాగుణ్ణు అనుకున్నాడు . బలంగా మాన్పుకొన్న గాయాల మీద , కొత్త గాకట్టుకొన్న జీవితపు ఆశల మీద ఇలా కొన్ని బలహీన క్షణాలు మళ్ళీ గాయం చేయడం భరించలేకపోతున్నాడు అబ్బులు . అందుకే ఇళ్ళు ఇంకా దూరమైతే బావుణ్ణు అనుకొంటున్నాడు . సౌదామిని ఎలా వస్తుందో ఊహించగలడు . ఆ ఊహనుభరించే సత్తా లేకపోవడం తో ‘చచ్చింది’ అన్న అబద్ధాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు . నిజానికి సౌదామిని ఏమయ్యిందో ఓ నాలుగేళ్ల ముందే సూచాయిగా తెలుసు అబ్బులు కి. బేరీజు వేసుకోడానికి , బాధ పడడానికి ఏ ఆధారము లేదు ఇప్పటివరకూ. ఒక్క క్షణం ముందు వరకూ.
అడుగులు అయిపోయాయ్.
చుట్టు పక్కల ఇళ్ళల్లో వాళ్ళంతా సౌదామిని ని చూడ్డానికి పోగై పొయ్యేరు . ఇల్లు ఖాళీ లేదు. అబ్బుల్ని చూసి ఎవ్వరూ మాటాడ్డం లేదు. బయట నిలబడి ఉన్నాడు. గుమ్మం లో ఇనప కుర్చీ మీద తెల్లని చొక్కా వేసుకున్న ఒకతనుఎవరితోనూ మాట్లాడ కుండా కూర్చొన్నాడు . అబ్బులకి ఆ మొకం బాగా పరిచయం.చూసాడు .అతనూ చూసాడు .అంతే . ఏ మాటలూ లేవు.లోపలికి వెళ్ళాడు. సౌదామిని కూతుర్ని పట్టుకొని ఉంది . బాగా నాజూగ్గా తయారైంది. గోళ్ళకి రంగేసింది. మెళ్ళో గొలుసులు వేసింది. మెరుపుల చీర కట్టింది.మొఖానికి ఒత్తుగా పౌడరు రాసింది.
అబ్బుల్ని చూసింది. “ఎలా ఉన్నావ్?” అంది.
” నా బతుకు బంగారం లా ఉంది . బంగారాలు దిగేసుకున్న నీ బతుకంత అసయ్యం గా ఐతే లేదు ” అని ఇంట్లోంచి బయటకు వచ్చి అలా గోదారి ఒడ్డుకు వెళ్లి పొయ్యేడు.
సౌదామిని ఇన్నాళ్ళు ఏమై పోయిందో తెలియని వాళ్ళకి ఒక సమాధానం దొరికింది. ఆ సమాధానంతో లోకం అబ్బుల్ని చిత్రవధ చెయ్యబోతోంది.
సౌదామిని కూతురికి గొలుసులు యిచ్చింది. పది వేల రూపాయిలు చేతిలో పెట్టి ” జాగ్రత్తమ్మా..” అని ఒక ముద్దు పెట్టుకొని ఏడుస్తూ వెళ్లి పోయింది. కొడుక్కి తెలిసింది వాళ్ళమ్మ తిరిగొచ్చిందని – ఎక్కడో కలుక్కుమన్నా… ఖాతరుచెయ్యలేదు.
ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. అప్పుడప్పుడూ వచ్చి పిల్లల్ని చూసి వెళ్లి పోతాది . పిల్లలు కూడా “మా అమ్మ” అని అంత ప్రేమగానూ ఉండరు. ఏదో చుట్టాన్ని చూసినట్టే చూస్తారు . అబ్బులు కూడా పెద్దగా పట్టించుకోడు.
కొయిటా అబ్బులు జీవితంలో ఏ మార్పూ రాలేదు. అప్పుడప్పుడూ పది కళ్ళ ఎకిలి చూపులూ, పది నోళ్ళ ఎదవ సకిలింపులు తప్ప. ఇంకేమీ కొత్తగా లేదు.
జీవితపు బరువేమిటో, జీవుడి వేదనేమిటో, దానిని ఎలా మొయ్యాలో, ఎన్నెల్లా ఎలా మార్చు కోవాలో ఆ గోదారీ చెప్తుంది. ఆ కొయిటా అబ్బులూ చెప్తాడు మనకు.
(కథా గ్రూపు, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహించినపోటీల్లో ప్రత్యేక ప్రశంస పొందిన కథ)
**** (*) ****
రచయిత పరిచయం.
నేను ఒక ఏరోస్పేస్ కంపెనీ లో సీనియర్ డిజైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నా కథలు ఈనాడు, స్వాతి , కౌముది పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం సినిమాలలో కథకుడిగా , మాటల రచయత గా పనిచేయాలని ప్రయత్నిస్తున్నాను. నాకు చుట్టూ జరిగే కథలంటే ఇష్టం. వాటిని రికార్డు చేసి విశ్లేషించే పుస్తకాలంటే ఇష్టం . “వేదనలో కాగిపోయేవాడు పాషాణం కాలేడు- వాడు నిలువెల్లా నవనీతం ” అని కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు. ఎదో తెలియని బాధ, వేదన కమ్ముకొన్నప్పుడు పుస్తకం నన్ను ఆదుకొంది, దీవించింది, ఊగించింది. రాయించింది. కథలపోటీ నిర్వాహకులు, వాకిలి పత్రికా సంపాదకులకు ధన్యవాదాలు.
Nice – Well written story !
థాంక్స్ విజయ గారు.
బాగా రాసారు నాగేంద్ర కాశి గారు. మొత్తం చదివాక చాల బాదేసింది కోయిటా అబ్బులు గురించి…. పాపం
Thanks Chandra Sekhar gaaru….monna Lamakhan lo matladadaniki veelu kudaraledu..manam malli kaluddam sir…
కథ చెప్పిన తీరు చాలా నచ్చింది. సౌదామిని ఎందుకలా మారిందో చెప్పకుండా ఎండ్ చేయడం బాగుంది.
థాంక్స్ రామకృష్ణ గారు.
“జీవితపు బరువేమిటో, జీవుడి వేదనేమిటో, దానిని ఎలా మొయ్యాలో, ఎన్నెల్లా ఎలా మార్చు కోవాలో ఆ గోదారీ చెప్తుంది. ఆ కొయిటా అబ్బులూ చెప్తాడు .”—మనకు.మంచి కథను చదివాను.
ఎప్పుడు ఆఫీసులో మిమ్మల్ని గమనిస్తూ వుంటానంది, సీరియస్ లుక్ – ఏదో దీర్గాలోచనలో వున్నట్టు కనిపించే మీ కళ్ళు – సాదా సీదా వస్త్రధారణ.
అనిపిస్తూ వుంటుందండి మీలో ఏదో గొప్పగా సాదించే లక్షణాలు వున్నాయని.
కాని మీ రెండు కథలు – “ఫాదర్స్ డే” ఇంకా పై కథ “కోయిటా అబ్బులు”, నాకు బాగా క్లారిటీ ఇచ్చయండి మీరేంటో అని.
ఫాదర్స్ డే కథలో, “మనసు అనే కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే” అనే ప్యార బాగా హతుకునేల రాసారండి.
పై కథ “కోవిట అబ్బులు” లో సౌదమిని ఎందుకు అలా మారింది అని చెప్పకుండానే సన్నివేశాలని పేర్చిన తీరు క్లాసిక్ అండి. ఇంకా అబ్బులు సౌదమిని తిరిగి వచేసింది అని తెలియగానే నడుచుకుంటూ వెళ్తుండగా తన మది లో కలిగే ఆలోచనులు “జీవితం అంటే ఇదేనా?”, ఎంతంగానో ప్రేమించిన, ప్రాణానికి ప్రానమనుకున్నఆలు మల్లి తిరిగి వచిందన్న ఆనందం ఏమాత్రం లేకుండా తను పడే యథానను కథ చదివే పాటాకుల్లో కూడా కలిగించడమే ఈ కథ గొప్పతనం అండి.
మీరు రాసిన కథలన్నింటిని చదివి, మిమ్మల్ని ఇంకా మీ ఆలోచనల్ని బాగా చదవాలని ఆశిస్తూ,
మీరు త్వరలో మీరనుకున్న ఎత్తుకు ఎదగాలని ప్రార్థిస్తూ,
మీ కొత్త అభిమాని,
-అశోక్!
నాగేంద్ర కాశీ గారికి,
చాలా మంచి కథ.
మీ గురించి అశోక్ నేను మాట్లాడుకుంటూ ఉంటాం.
మిమల్ని నేను గమనిస్తూ ఉంటాను, “అన్నీ ఉన్నమ్మ అణిగిమని ఉంటుంది” అన్నట్లు ఉంటారు మీరు.
కథ చదివినట్లు లేదు. “అబ్బులు” పడే వ్యధ, మానసిక సంగర్షణ ఏంటో నా కళ్ళకు కట్టినట్లు కనిపించాయి.
ఏదో కృత్రిమంగా రాశిన కథలా లేదు. ఒక సామాన్య వ్యక్తి గాధ ఎన్నో ఏళ్లగా, ఎంతో లోతుగా పరిశిలించి రాసినట్లు ఉంది.
మీరు మంచి రచయితగా, కథకుడిగా ఎదగాలని ఆసిస్తూ.
మీ శ్రేయోభిలాషి,
శ్రీనివాస్.
గోదావరి తీరం లో అమాయకులు వలస బాట పట్టి బ్రతుకుల్ని ఎలా చిధ్రం చేసుకుంటున్నారో ..కళ్ళకు కట్టినట్లు చూపించారు .నేను చూసిన ఒకరి జీవితం ఇలాగే నాశినం అయిపోయింది.. మన గోదావరి మాండలికం బాగుంది అండీ…!