కథ

రాజా వచ్చేసాడు

ఫిబ్రవరి 2013

“నాకు సిల్కు చొక్కా ఉంది,నీకుందా?” అడిగాడు రామస్వామి.తెలివైన ప్రశ్న.చెల్లయ్యకు ఆ ప్రశ్నకు ఏమని బదులివ్వాలో తెలియక అలా రామస్వామిని చూస్తూ ఉండిపోయాడు.తంబయ్య ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూస్తున్నాడు.మంగమ్మ ముక్కుమీద వేలుంచుకుని,కళ్ళు సగం మూసుకుని అలోచిస్తూ ఉంది.ఈముగ్గురూ ఏమి సమాధానం చెపుతారా అని మిగిలిన పిల్లలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

ఆరోజు బడిలోరామస్వామి,చెల్లయ్యలమధ్య బొమ్మలపోటీ జరిగింది.రామస్వామి తన అయిదో తరగతి చరిత్ర పుస్తకం తీసాడు.చెల్లయ్య దగ్గరేమో ఆపుస్తకం లేదు.దాంతో పౌరశాస్త్ర్రం పుస్తకం తెరిచాడు.ఒకరు ఒకబొమ్మ చూయిస్తే రెండోవాడు దానికి తగ్గబొమ్మను తనపుస్తకంలో చూయించాలి.ఎవరు ఎక్కువ బొమ్మలు చూయిస్తే వారు గెలిచినట్లు.

 

పోటీ సగంలో ఉండగా లెక్కలమాస్టరు క్లాసులోకి వచ్చాడు.ఆయన కోపిష్టి.కాబట్టి ఆయన ఉన్నంతసేపు ఆటలు సాగవు.పైగా పెన్సిల్ తోకూడికలూ,తీసివేతలూ చెయ్యాలి.ఇకపోటీ ఎక్కడ?సాయంత్రం బడివదలగానే బయట ఉన్న చెట్టుకిందపోటీ మొదలయ్యింది.ఈపోటీ సగంలో ఉండగా చెల్లయ్య పుస్తకంలో బొమ్మలతోపాటు పేజీలు కూడా అయిపోయాయి.చెల్లయ్య ఓడిపోయాడు.తోటిపిల్లలు చెల్లయ్యను ఆట పట్టించారు.తమ తోడబుట్టిన వాడికి జరిగిన అవమానానికి తంబయ్య,మంగమ్మ ఉడుక్కున్నారు.అలాగే ఇంటిదారిపట్టారు.

 

దారిలో బొమ్మలపోటీ మరొకమలుపు తిరిగింది.‘నాకు ఇంటిదగ్గర ఫలానాది ఉంది,నీకు ఉందా’అని ఒకరినొకరు అడగటం మొదలయ్యింది.కొత్తపోటీ చివరిలో రామస్వామి అడిగాడు‘నాకు సిల్కు చొక్కా ఉంది నీకు ఉందా? అని.

 

బడి నుంచి దాదాపు అరఫర్లాంగుదూరం వచ్చారు అంటే దాదాపు పార్వతి గుడి దగ్గరగా. చెల్లయ్య,తంబయ్య దగ్గరసమాధానమేమీ సిద్ధంగా లేదు.ఉండుండి మంగమ్మ అందరినీ తోసుకుని రామస్వామి ముందు నిలబడింది.పిల్లలంతా మంగమ్మనే గమనిస్తున్నారు.మంగమ్మ చేతులు విచిత్రంగా తిప్పుకుంటూ,‘ అబ్బానీ సిల్కు చొక్కా అంటే పెద్దగొప్పే,పలచగా ఎండిపోయిన ఆకులాగుంటుంది,ఊరికే చిరిగిపోతుంది’ అంది.చెల్లయ్య చొక్కా వంక చూయిస్తూ ‘ఇది చూడు ఎంతగట్టిగా ఉందో,అస్సలు చినగదు’ అంటూ చెల్లయ్యపక్కకు వచ్చి నిలబడింది.

రామస్వామి బిత్తరపోయాడు.ఒకటో తరగతి చదివే మంగమ్మ అయిదోతరగతిలో ఉన్న తనను వెక్కిరించటంతో అవమానం తట్టుకోలేకపోయాడు.పైగా మిగిలిన పిల్లలు ‘ ఓడిపోయావ్,ఓడిపోయావ్’అనటం మొదలుపెట్టారు.మంగమ్మ చెల్లయ్య చొక్కా గట్టిగా పట్టుకుని,పక్కనే నిలబడింది.తను చేసినపనికి మంగమ్మకు గర్వంగా కూడా ఉంది.

‘మాకు ఇంట్లో ఆరు ఆవులు ఉన్నాయ్.మీకున్నాయా’ అని అడిగాడు రామస్వామి.చెల్లయ్యకు,మంగమ్మకు ఏమిచెప్పాలో తెలియదు,కానీ,తంబయ్యమాత్రం’నీకెంత డబ్బుందో మాకు తెలుసులేవోయ్..బడాయి పిందా’అన్నాడు.

‘మాకు తొమ్మిది కోళ్ళున్నాయ్,మీకున్నాయా?’ అడిగాడు చెల్లయ్య.రామస్వామి ఎలాంటి మొహమాటమూ లేకుండా,‘మీకు లాగా మేము కోడిమాంసం తినం,మాకెందుకు కోళ్ళ’అంటూ బదులిచ్చాడు. ‘అది సరే,అసలు మీకు కోళ్ళున్నాయా లేదా అది చెప్పు’అన్నాడు మొండిగా చెల్లయ్య.ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనందుకు రామస్వామికి భయమేమీ లేదు,కానీ పిల్లలందరూ జట్టుకట్టి తనను చూసి నవ్వటం మాత్రం తట్టుకోలేకపోతున్నాడు.ఏడుపు వచ్చేట్టుంది.దాంతో గబగబా నడవటం మొదలుపెట్టాడు.మిగిలినవారు కూడా వేగం పెంచారు.మంగమ్మవాళ్ళతో నడవలేక పరుగులు తీస్తుంది.ఇళ్ళు దగ్గరకు రాగానే గుంపులో కొంతమంది వెళ్ళిపోయారు.పిల్లలసంఖ్యతోపాటు రామస్వామి బాధ కూడా మెల్లగా నిదానిస్తుంది.పడమరవీధికిరాగానే రామస్వామి తనశత్రువులతో మిగిలాడు.ఆ చిన్నఊరిలోని బడికి వెళ్ళే పిల్లల్లో వాళ్ళు నలుగురే ఆవీధివాళ్ళు.ముందు రామస్వామి ఇల్లు,ఉస్సూరని నిట్టూరుస్తూ ఇంట్లోకి ఒక్కదూకు దూకాడు.ముగ్గురూ అతని యింటి ముందు నిలబడి “పారిపో కుక్కపిల్లా,పారిపో”అంటూ కేకలు పెట్టారు.

సరిగ్గా అప్పుడే మీసాలు,తలపాగాతో ఉన్న పనిమనిషి ఒకడు బయటకు వచ్చాడు.తమచిన్నబాబును ఏడిపిస్తున్న చింపిరిమొఖాలను చూసి,‘పోండి గాడిదల్లారా,మర్యాదగా పోతారా,లేదా…. అరిచాడు.‘అడుక్కుతినే వెధవలు,పిల్లగాడిదలు’అని తిట్టుకుంటూ ఇంట్లోకి పోయాడు.ముగ్గురూ ఇంటివైపు పరుగులు తీసారు.

‘అమ్మా’ అంటూ మంగమ్మ వెనుకనుంచి వాళ్ళమ్మ మెడచుట్టూ చేతులు వేసింది.

‘ అమ్మో ! ఎవరై ఉంటారబ్బా?!’అంటూ ఆమె ఆశ్చర్యం నటించింది.దాంతో మంగమ్మ పగలబడి నవ్వింది.

‘అమ్మా,నాన్న ఇంకా రాలేదా?’అడిగాడు తంబయ్య.

‘ఇంకా రాలేదు’అంది ఎగతాళిగా

‘నిజంగా’

‘ని- ఝ్ఝం-గా’అంది తంబయ్యలాగా,నవ్వాపుకోలేకపోతూ.

మంగమ్మ వాళ్ళమ్మ ముందుకు వచ్చి నిలబడి,పుస్తకాలు ఎడమచేతినుండి కుడి చేతికి మార్చుకుంటూ,వేలు చూయిస్తూ ‘అమ్మా,నువ్వు అబద్ధం చెప్తున్నావ్,నాన్న వచ్చాడు’ అంది.

మంగమ్మ మాటలతో వాళ్ళమ్మ పట్టరాని సంతోషంతో,బుగ్గలు నిమురుతూ‘అల్లరిపిల్లా’అంది.

అయినా చెల్లయ్య ‘అమ్మా,నాన్న నిజంగా రాలేదా’అంటూ కొంచెం నిరుత్సాహంగా అడిగాడు.

తాయమ్మ ఇంట్లోకి నడిచి మూలనున్న చెక్కపెట్టెను చూయించి ‘అది తెరిచి చూడండి’ అని చెప్పింది.ముగ్గురూ ఆత్రంగా పరుగెట్టి పెట్టె తెరిచి,అందులో ఉన్న ఒక పొట్లం బయటకు తీసారు.

పొట్లాం విప్పి,అందులోనుంచి కొత్తబట్టలు బయటకు తీసారు.తెల్లారితే దీపావళి.కానీ పిల్లలు ముగ్గురికి సంబంధించినంతవరకూ దీపావళి అప్పుడే మొదలయ్యింది.వాళ్ళకు గొప్ప సంబరమనిపించి,బట్టలు చూస్తూ‘ఎవరు తెచ్చారబ్బా?’ అన్నారు.అందులో రెండు ధోవతులు,రెండు చొక్కాలు,ఒకలంగా,ఒక జాకెట్టు,ఒక పైపంచా ఉన్నాయి.అవి ఎవరెవరికో వాళ్ళకు తెలుసు.కానీ పైపంచ సంగతి అర్ధం కాలేదు.

‘అమ్మా ఇది ఎవరికి’అడిగాడు చెల్లయ్య

‘అది  మీనాన్నకి’ చెప్పింది తాయమ్మ

‘మరినీకు?’ ఆరా తీసింది మంగమ్మ

‘ఎందుకూ,నాకు ఇప్పటికే రెండు చీరలున్నాయిగా,లేవా?’ అంది తాయమ్మ నవ్వుతూ.‘అందరికీ కొత్తబట్టలు ఎక్కడ్నుంచి వస్తాయి,మనమేమీ ఉన్నవాళ్లం కాదు’వివరించింది.

‘అలాంటప్పుడు  నాన్నకుమాత్రం ఎందు’కంటూ మూతి ముడిచింది మంగమ్మ.‘ఓసి వాగుడుకాయ్’అంటూ మంగమ్మను దగ్గరకు తీసుకుని వళ్ళో కూర్చొబెట్టుకుంటూ‘మీ నాన్నకు ఒక్క పైపంచకూడా లేదు,పైన ఎన్నాళ్ళని ఆ పీలికలు కప్పుకు తిరుగుతాడు?’అంది.

 

చీకటి పడుతుంది.దీపం వెలిగించేందుకు పైకి లేచింది తాయమ్మ.

దీపం వెలిగించి పిల్లలకు వేడి నీటి స్నానం చేయించింది.నవంబరు నెల రోజూ వానలే,నేలలో పొడి ఆరిపోయి చల్లగా ఉంది.చల్లగాలి వీస్తుంది.వేడి నీటితో స్నానం చేసాక చలిమరింత పెరిగింది.ఉహ్హుహూ అని వణుక్కుంటూ ఇంట్లోకి దౌడు తీసారు.దగ్గర చుట్టం అకస్మాత్తుగా చనిపోయేసరికి నాన్న పక్క ఊరు వెళ్ళాడని చెప్పింది తాయమ్మ అన్నంవడ్డిస్తూ.రేపుమధ్యాహ్నానికి

వస్తానని,తనకోసం ఎదురుచూడక పండగ బాగా చేసుకొమ్మని వాళ్ళ నాన్న అన్నసంగతి కూడా చెప్పింది.అన్నాలు తినేసి ముగ్గురూ పుస్తకాలు పట్టుకుని దీపం ముందు కూర్చున్నారు.తాయమ్మ కూడా భోంచేసి ఎంగిలిపళ్ళాలు కడిగేందుకు ఇంటిపెరడులోకి పోయింది.కొంచెం దూరంలోని ములగచెట్టుకింద నల్లటిఆకారం ఒకటి కనిపించింది.పక్కింటివాళ్ళ కుక్కపిల్ల అనుకుని తాయమ్మ పనిముగించుకుని ఇంట్లోకి వచ్చింది.చీరచెంగు చల్లటినేల మీద పరుచుకు పడుకుని పిల్లలు పైకి చదువుతున్న పాఠాలు వింటూ ఉంది.”నేల చల్లగా ఉంది నిద్రపోయే దారేది?అంటూ తనలో తాను మాట్లాడుకోసాగింది.

చెల్లయ్య వంక చూసి తంబయ్య”బయటకు వస్తావా?” అన్నాడు.ఒక్కడే పోయిరావటానికి వాడికి భయం.ఇద్దరూ ములగచెట్టుకింద ఉన్న ఆకారాన్ని చూసారు.అప్పుడే రామస్వామి ఇంటివైపు జనం పెట్రోమాక్సు లైట్లు తీసుకువెళుతున్నారు.వెలుతురు,జనం అలికిడికి కొద్దిగా ధైర్యం తెచ్చుకుని,ఆనల్లటిఆకారం వైపు తేరిపారచూసారు.అది కుక్కపిల్ల కాదు వాళ్లంత ఉన్న ఎవరో పిల్లాడు.బాగా దగ్గరికి వెళ్ళారు.మళ్ళీ వర్షపుజల్లు మొదలయ్యింది.వాడికి ఎనిమిది,తొమ్మిదేళ్ళు అంటాయేమో!,చిన్న తుండుగుడ్డ తప్ప వాడి వంటిమీద మరోపీలికలేదు.

“ఏబ్బే,మురికి”అంటూ తంబయ్య నేలమీద ఊశాడు.

వాడు ఒకసారి కళ్ళెత్తి వెంటనే తలదించుకున్నాడు.

ఏయ్,మాయింటిముందు ఎందుకు కూచ్చున్నావ్? ఫో”అన్నాడు చెల్లయ్య.

వాడు కదల్లేదు గానీ,భయపడినట్టు కనిపించాడు.ఒకచేత్తో బుర్రగోక్కుంటూ,ఇంకొక చేత్తో ఎంగిలి ఆకుల్లో మెతుకులు ఏరుతున్నాడు.

‘మీ యింటికి పోవచ్చుగా?’ అడిగాడు తంబయ్య.జల్లు జడివాన అవుతుంది.వాన పెద్దదయ్యేలోపు వాడిని పంపేసి యింట్లోకి  వెళ్ళిపోవాలని వాళ్ళ ఆలోచన.

‘ఫో,లేకపోతే నీ మీద ఉమ్మూస్తా’బెదిరించాడు తంబయ్య.వాడు కదల్లేదు.తంబయ్య వాడిని కాలితో తందామనుకున్నాడు.వాన పెద్దదౌవుతుంది,పిల్లలు బయటకు వచ్చి ఏం చేస్తునారో అనుకుంటూ తాయమ్మ బయటకు వచ్చి ‘చెల్లయ్యా’అంటూ పిలిచింది.బదులుగా ఏదో గొణుగుడు వినిపించింది.

‘ఒరేయ్ చీకట్లో ఏం చేస్తున్నార్రా?’ అడిగింది వాళ్ళ దగ్గరకు వెళుతూ.చెట్టు దగ్గరకు వచ్చాక ఆమెకు అర్ధమయ్యింది, అది మాట్లాడేందుకూ,ఆలోచించేందుకూ సమయం కాదని,దాంతో ముగ్గురినీ యింట్లోకి తీసుకుపోయింది.

దీపం  వెలుగులో వాడిని స్పష్టంగా చూసారు.వళ్ళంతా గజ్జి,తలనిండా పుళ్ళు,ఒకటే వాసన..ఇదీవాడి వాలకం.‘ ఎవరమ్మా వీడు’భయంగా అడిగింది మంగమ్మ.‘మనకేం తెలుసు,ఎవరి పిల్లాడో’అంటూ పొడిగుడ్డ తెచ్చేందుకు వెళ్ళింది.ఆమె అటుతిరగ్గానే,వాళ్ళమ్మ వినకుండా ‘ఫో’అన్నాడు తమ్మయ్య.‘ ఇప్పుడే వెళ్ళి పోవాలి’గట్టిగా నెడుతూ చెప్పాడు చెల్లయ్య.అన్నలను అనుకరిస్తూ‘పోవే’అని మంగమ్మ కూడా అంది.

దాంతో వాడు ఏడుపుకు దిగాడు.ఏమయ్యిందో అర్ధం కాక తాయమ్మ  వచ్చి,‘ఏమయ్యింది.ఊరుకో,ఏడవబాకు.ఊరుకో’అంటూ ‘రేయ్,ఏం చేసార్రా’ అని కోప్పడింది.

‘మేము పొమ్మన్నాము,కానీ..వాడు పోవట్లేదు’ ఫిర్యాదు చేసింది మంగమ్మ.

‘తప్పు,పొమ్మనకూడదు,ఊరుకో’ అనునయంగా అంది తాయమ్మ.వాడు ఏడుపు ఆపాడు ఒక్కసారి,కానీ వెక్కిళ్ళుమాత్రం ఆగలేదు.

‘ఊరుకో, ఊరుకో ఏడవద్దు’అంటూ మరింతగా అనునయించింది తాయమ్మ.తంబయ్య,చెల్లయ్య తలలు తుడుకున్నాక ‘పాపం వాడికి కూడా కండువా ఇమ్మం’ది  మంగమ్మ.తంబయ్య కండువా ఇచ్చాడు.‘అన్నం తిన్నావా’అడిగింది తాయమ్మ.

‘రామస్వామి వాళ్ళ ఎంగిలి విస్తర్లు తింటున్నాడు,మురికోడు’ముఖం వికారంగా పెట్టి చెప్పాడు తంబయ్య.ముగ్గురు పిల్లలు ఘొల్లుమన్నారు.

‘తంబయ్యా,ఏం మాటలవి,చెప్పు,ఎవర్నువ్వు?ఎక్కడ్నుంచి వస్తున్నావు’ప్రశ్నించింది తాయమ్మ.

‘విల్లాట్టికులం నుంచి’

‘అమ్మానాన్న లేరా’

“లేరు’

‘లేరా”

‘లేరు చచ్చిపోయారు’

‘ఎప్పుడు?’

‘మమ్మేమో పోయినేడు, నా చిన్నప్పుడు మా నాన్న’

‘అక్కచెల్లెళ్ళు’

‘లేరు’

‘అన్నదమ్ములు’

‘లేరు’

‘ఛీ’ అన్నాడు తంబయ్య.

‘ఇక్కడకు  ఎందుకొచ్చావ్’

‘కలుగుమలై పోతున్నా’

‘ఎవరున్నారు’

‘మా చిన్నమ్మ’

విలాట్టికులం నుంచి వాడు కాలినడకన వచ్చాడు.ఇరవైమైళ్ళు నడవటానికి నాలుగురోజులు పట్టింది.నాలుగోరోజు వాడు ఆ ఊరు చేరాడు.తెల్లారి ఎనిమిది మైళ్ళు నడిచి,పిన్ని దగ్గరకు చేరతాడో,లేదో వాడికి తెలియదు.చేరినా పిన్ని వాడిని రానిస్తుందో,వీధిలోకి నెడుతుందో?ఆమెను ఎప్పుడూ చూడలేదు.ఎవరో చెప్పారు కలుగుమలైలో వాళ్ళ పిన్ని ఉందని,వాళ్ళమాటలు విని బయలుదేరాడు.ఇవన్నీ వాడు తాయమ్మకు చెప్పిన వివరాలు.

‘ఏంపేరు”

‘రాజా’

వాడికి అన్నం పెట్టి, పిల్లలకు

పక్కలు పరిచింది.నేలంతా చల్లగా ఉండటంతో ఉత్తచాపమీద పడుకోలేరు.దాంతో మూడుగోతాం పట్టాలు నేలమీద వేసి వాటిపైన రెండుచాపలు వాల్చింది.దక్షిణం మూల రాజా,వాడిపక్క చెల్లయ్య,తంబయ్య పడుకున్నారు.రెండో చాపమీద తాయమ్మ,మంగమ్మ నిద్రకుపక్రమించారు.

దగ్గర్నుంచి టపాకాయ పేలిన శబ్దం వినిపించింది.తెల్లారితే దీపావళి అయినా,ఆత్రం పట్టలేని పిల్లకాయ ఎవరో బాణాసంచా కాల్చటం మొదలుపెట్టాడు.ఆమోత వినగానే‘నాకు దీపావళి సామాను కావాలం’ది మంగమ్మ.

‘నాక్కూడా’అన్నాడు తంబయ్య

‘మనకెక్కడ్నుంచి వస్తాయ్? రామస్వామంటే డబ్బున్నవాళ్ళబ్బాయి,వాడికి అన్నీ వస్తాయి,ఏది కావాలనుకుంటే అది కాలుస్తాడం’టూ వివరించింది తాయమ్మ.

‘అదేం కుదరదు,నాక్కావాల్సిందే’ వాదించింది మంగమ్మ.

‘ఏం మాట్లాడుతున్నావ్? నేను చెప్పేది విను,టపాసులు కడుపు నింపుతాయా?నీకోసం పొద్దున్నే దోశలు పోస్తాను,కావాల్సినన్ని తిను,నీకెందుకు టపాసులు?’చెప్పుకొచ్చింది తాయమ్మ.

 

మంగమ్మ వినలేదు,ఏడుపు మొదలుపెట్టింది.చెల్లయ్యమాత్రం నిద్రలోకి జారుకున్నాడు,రోడ్డుమీద నుంచి జనం అలికిడి వినిపిస్తోంది.జమీందారు అల్లుడు పటాలంతో వచ్చినట్టున్నాడు అనుకుంది తాయమ్మ.మంగమ్మ వైపు తిరిగి ‘ మా అమ్మవుకదూ!? పట్టుపట్టొద్దు,వచ్చే యేడు నీకు కావాల్సినన్ని

కొంటాను,ఈ యేడు మనరోజులు బాగాలేవు తెలుసుగా’ అంది.కానీ ఇక మాట్లాడలేకపోయింది.గొంతు పెగలటం కష్టమైపోతుంది.మంగమ్మతో మాట్లాడుతుంది కానీ,తనతల్లితో మాట్లాడుతూ బాధలనీ వెల్లబుచ్చుకున్నట్టుంది.

నిట్టూరుస్తూ,‘మంగమ్మా…అన్నం తినకుండా ఒకరోజు బడికిపోయావు గుర్తుందా? ఒక్కముద్ద కూడా పెట్టలేకపోయాను నీకు’ అంటుంటే తాయమ్మ కళ్లల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.‘నాలుగుమెతుకులు దొరకటమే కష్టమవుతుంటే,దీపావళి సామానులు నువ్వు అడుగుతున్నావ్?’చెపుతూ జోకొడుతుంది.

‘అయితే ఒక్కటపాసు కొను’బతిమాలిడింది మంగమ్మ.

నవ్వుతూ,కన్నీళ్ళు ఆపుకుంటూ,‘ చూడు ఎంత మొండిదానివో,ఆ రాజాను చూడు,వాడు టపాసులు అడుగుతున్నాడా?ఎంగిలాకులు ఏరుకుతింటున్నాడు,ఆఖరికి అన్నం కూడా అడగట్లేదు,నువ్వేమో టపాసుల కోసం ఏడుస్తున్నావ్?’

ఆమాటలతో రాజామీద మంగమ్మకు కోపమొచ్చింది.తనను కాదని పైగా వాడిని మెచ్చుకుంటుంది అమ్మ..

‘వాడు మురికోడు,వాడి వళ్ళంతా గజ్జి,ఛీ’

‘అమ్మా,నాన్న ఉంటే వాడు మురిగ్గా ఎందుకుంటాడు? తల్లిలేనివాడిని ఎవరుసాకుతారు?వాళ్ళమ్మ ఉన్నప్పుడు దీపావళికి కొత్తబట్టలు,టపాసులు కొనేఉండేది,ఇప్పుడు అవన్నీ ఆలోచించి వాడు ఏడవాలా?’

‘వాడు నిద్రపోయాడు,పొద్దునలేవగానే అడుగుతాడు’మంగమ్మ మాటలకు నవ్వొచ్చి,‘పిల్ల దెయ్యమా’ అంటూ బుగ్గలు గిల్లింది.

టపాసులమోత మళ్ళీ మొదలయ్యింది.

‘చలేస్తుందమ్మ’తంబయ్య నిద్రలో కలవరిస్తున్నాడు.

‘ఏంచెయ్యాలి,పిల్లలు ఏం కప్పాలి?’ఆలోచిస్తూ ఉదయం కట్టుకోవటానికి ఉతికి,ఆరేసిన చీరతెచ్చి బిడ్డలకన్నా చీర ఎక్కువా?అనుకుంటూ రాజాతో సహా ముగ్గురికీ కప్పింది.

‘సరే,ఇకనిద్రపో’,మంగమ్మకు చెప్పింది,‘ఏదో విధంగా ఉదయానికల్లా నీకు టపాసులు తెచ్చేపూచీనాదంటూ’మంగమ్మను నిద్రపుచ్చింది.

 

ఆరాత్రిమూడోసారి అప్పటికి.‘ఆయింట్లో ఈపూట ఎవరూ పడుకోరేమో.డబ్బున్నమారాజుల పనులు అంతేఉంటాయి.రోజంతా జనం రావటం,పోవటం,చివరికి రామస్వామి కూడా నిద్రపోకుండా టపాసులు కాలుస్తున్నాడ’నుకుంది.

రామస్వామి అక్కను పెళ్ళాడింది ఒక జమీందారు కొడుకు.ఆదీపావళికి అల్లుడు మొదటిసారిగా అత్తగారింటికి  వస్తున్నాడు.రామస్వామి నాన్న స్వయంగా వెళ్ళి మరీ అల్లుడిని ఆహ్వానించి వచ్చాడు.అతను,ఆ ఒక్కఊరికే కాక చుట్టుపక్కల పరగణాల్లో కూడా పెద్ద భూస్వామి.కాబోయే జమీందారు కోసం ఎన్నో రోజుల నుంచి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు ఇద్దరి హోదాకు తగ్గట్టు.పది,పదిహేను రోజులముందు నుంచే రామస్వామి నాన్న నిమిషానికి తొమ్మిదిసార్లు ‘రాజా వస్తున్నాడు,పెద్ద పండగ’అంటూనే ఉన్నాడు.అల్లుడి కోసం నిజంగా రాచమర్యాదలు

ఎదురుచూస్తున్నాయి.

‘మంగమ్మా!’

సమాధానం లేదు.ఎప్పుడో నిద్రపోయింది.దీపం ఊదేసి తాయమ్మ మెల్లగా తను కూడా నిద్ర లోకి జారుకుంది.

———–    ————— ———–

తొలికోడి కూయగానే తాయమ్మ మేల్కొంది.ఇంకానాలుగు గంటలు కూడా కాలేదు.కానీ,వర్షం ఆగిపోయి,సన్నటిజల్లు పడుతుంది.పక్కమీద నుంచి లేచి దీపం వెలిగిస్తూ మళ్ళీ వర్షం వస్తుందేమోనని భయపడింది.దానితో పిల్లలను నిద్రలేపి త్వరత్వరగా తలస్నానాలు చేయించి తర్వాతే ఇంటిపనులు చూసుకోవాలనుకుంది.కానీ,అంత సులభంగా పైకి లేస్తారా పిల్లలు!?ఎలాగో లేచారు.తలస్నానాలు చేయాలంది.రాజా మాత్రం నాకొద్దంటూ మూలకు జరిగాడు.

‘దీపావళి రోజు తలకుపోసుకోకపోతే మంచిది కాదు’అంది తాయమ్మ,కానీ,వాడు వినలేదు.

‘వద్దు,సీకాయ పొడితో రుద్దితే నాపుళ్ళు మంటలుపుడతాయ్,నాకొద్దన్నాడు’రాజా.

‘సరే,కుంకుడుకాయ రసంతో పోస్తా,మంట పుట్టదు’

‘వద్దు’

‘చూడు,నేనేమీ అమ్మననుకో,నీపుళ్ళు మంటపుట్టేట్టు చేస్తానా?రా,తలకుపోసుకో,దాంతో నీకు పట్టిన దరిద్రం అంతా ఈ దీపావళికి పొతుంది’.ఈవిధంగా ఎంతోసేపు బతిమిలాడినమీదట కానీ వాడు దారికి రాలేదు.వచ్చిముందు తలకు,వంటికి నూనె రాయించుకున్నాడు.

‘అదీ,మంచిపిల్లాడు,నిన్ను ఒక్కడ్నే స్నానం చేయించకుండా వదులుతానా?నాపిల్లలు పైకిరావద్దూ? అలా తనలో తాను మాట్లాడుకుంటూ నూనె పట్టిస్తుంది.‘తల్లులు లేని పిల్లల గతి ఇంతే పాపం.మూడేళ్ళ క్రితం వచ్చిన జ్వరంతో నేను చచ్చిపోయుంటే నాపిల్లలు కూడా దిక్కులేని వాళ్ళయ్యేవాళ్ళేగా?’

తాయమ్మ మనసునిండా ఇవేఆలోచనలతో పిల్లలకు తలస్నానాలు చేయించింది.ఎంతజాగ్రత్తగా ఉన్నా రాజా మధ్యమధ్యలో మంట,మంట అంటూ అరుస్తూనే ఉన్నాడు.‘ఊరుకో,ఆమంటతో నీ గజ్జి   మొత్తం పోతుందిలే’అంటూ ఊరడించింది.

‘వానకు తడిసి ఇంట్లోకి వచ్చాడు,వచ్చాడు,పొమ్మనలేముగా,పైగా దీపావళి,పిల్లల మధ్య తేడా చూయించలేము,చూసేవాళ్ళు నన్ను పిచ్చిదనుకోవచ్చు,నవ్వితే నవ్వనీ,నాకు,నాపిల్లలకూ దేవుడే తోడు!’

దోశెలుపోసి పిల్లలకు పెట్టింది.కొత్తబట్టలు తొడగాలనే తొందరలో గబగబా తినేసారు.తంబయ్య ఇంకా రెండు,మూడు తినేవాడేగానీ,ఆత్రంలో తింటుంది కూడా సగం వదిలాడు.జనం అప్పటికే వీధుల్లోకి వచ్చారు.వానపూర్తిగా ఆగిపోయింది.తెల్లవారి వెలుగులు ఊరిమీద కమ్మాయి.ముగ్గురు పిల్లలూ బట్టలకు పసుపు అంటించి తొడుక్కున్నారు.

రాజా…

వాడు వంటిమీదున్న తుండుగుడ్డతో ఒకమూల నిలబడ్డాడు.తాయమ్మ వాడిని దిగులుగా చూసింది.మిగిలిన పిల్లలతో వాడిని కూడా కలపాలని అమె చేసినప్రయత్నాలు వృధా అయిపోతాయేమో అనిపించింది.ఈ సమస్య ఆమె ముందు ఊహించలేదు.భర్తకోసం ఉన్న పైపంచ వాడికి  ఇవ్వాలా?వద్దా?అనే ఆలోచనలో పడింది తాయమ్మ.ఎన్నో నెలలు తనభర్త వట్టి లుంగీతో పైపంచకూడా లేకుండా లోలోనకుమిలిపోతూ తిరిగాడు.కారణం అది కొనేందుకు కూడా డబ్బులులేకపోవడం.ఎన్నిసార్లు తనదరిద్రాన్ని,తలరాతను తిట్టుకున్నాడో తాయమ్మకు గుర్తుకొచ్చింది.ఆజ్ఞాపకాలమధ్య,రాజా మౌనంగా నించుని

ఉన్నాడు.ఓడిపోయాననుకుంది నిరాశతో.రాజా ముఖంలోకి తదేకంగా చూసింది.వాడు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.

’నన్ను పరీక్షించటానికి వచ్చావు కదూ?’ అంది.కానీ అమె మనసులో వాడిమీద అయిష్టం ఏమీలేదు.ఆమాట అనేస్తే తప్ప తాయమ్మ మనసు ఊరుకోదు.అందుకే అనేసింది.

అప్పుడు మంగమ్మ  తల్లి దగ్గరకు వచ్చి చెవిలో రహస్యం చెప్తున్నట్టు,’అమ్మా,వాడికి ఆపైపంచ ఇచ్చేయమ్మా’అంది.మంగమ్మ మాటల తర్వాత అక్కడ కొంతసేపు మౌనం.ఆకాసేపట్లో తాయమ్మ ముఖంలో రకరకాల హావభావాలు కనిపించాయి.చీరచెంగులో తలదాచుకుని కుమిలికుమిలి ఏడ్చింది.

ఆచిన్న పాక అంతా ఆమె రోదన,వెక్కిళ్ళతో నిండిపోయింది.పిల్లలకేమీ అర్ధంకాలేదు.తనమాటలు తల్లినేడిపించాయా అని మంగమ్మ భయపడింది.తాయమ్మ మానవాతీత ప్రయత్నంతో ఏడుపు అపుకుని,బొంగురుగొంతుతో మంగమ్మను పిలిచి,ఆ కొత్తపైపంచను రాజాకు ఇమ్మంది.

ఇంటిముందు ఉదయభానుడు ధగధగా మెరిసిపోతున్నాడు.ఆబంగారుకాంతిలో మంగమ్మనిల్చుంది.ఆమె ముఖం వెలిగిపోతుంది,ఆమె కన్నులు ఎటో చూస్తున్నాయి.సరిగ్గా ఆరని జుట్టు చెంపలమీదుగా పడి,చెంపలను సగం కప్పేస్తుంది.గాలివీచినప్పుడల్లా జుట్టు ఎగిరెగిరిపడుతూ ఆమెకు చక్కిలిగిలి పెడుతుండటంతో మంగమ్మ విరగబడి నవ్వసాగింది.చాలాసేపటి నుంచి కూతురినే తదేకంగా చూస్తున్న తాయమ్మ,’బంగారుతల్లి,అచ్చం మా లక్ష్మి లాగుంది’అనుకుంది.వెంటనే ఇంట్లోకి పోయి కాటుకతెచ్చి మంగమ్మకు దిష్టి చుక్కపెట్టింది.తర్వాత మంగమ్మ ఆడుకోవటానికి వెళ్ళింది.

రామస్వామి ఇంటి బయట ఎంగిలాకుల కుప్ప లోపలజరుగుతున్న విందుకు సాక్ష్యంగా పడిఉంది.నలుగురుదైగురు మగవాళ్ళు ఆకూవక్క నములుతూ నిల్చున్నారు.రామస్వామి కొత్తప్యాంటు.షర్టు తొడుక్కుని అక్కడేఉన్నాడు.మంగమ్మను చూసి ఆమె దగ్గరకు పరుగెత్తాడు.’రాజా మాయింటికి వచ్చాడు’అన్నాడు.ఊర్లో అందరూ అన్నట్టు అతనుకూడా బావను రాజా అంటాడు.పాపం అక్కమొగుడు వచ్చాడన్న ఆనందంతో చెప్పాడు,కానీ అందులో బడాయి ఏమీలేదు.మంగమ్మ వేరేవిధంగా అర్ధం చేసుకుంది.అంతకుముందు రోజు బడిలో వీళ్ళమధ్య జరిగిన పోటీ గుర్తుకొచ్చింది.సరైన సమాధానం చెప్పి,రామస్వామి నోరు మూయించాలని,ఒక్క అడుగు ముందుకు వేసి,గంటుపెట్టుకున్న ముఖంతో వాడిని చూస్తూ,రోషంగా,పెద్దగా,’అయితే,ఏంటిపెద్ద?మీ యింటికేనా రాజా వచ్చింది?మాయింటికి కూడా రాజా వచ్చాడు తెలుసా?? కావాలంటే వచ్చి చూడు’అంది.

 

తమిళమూలం: అళగిరి స్వామి.

తెలుగు అనువాదం:రాజేంద్ర కుమార్ దేవరపల్లి.



5 Responses to రాజా వచ్చేసాడు

  1. Raghu Mandaati
    January 27, 2013 at 4:15 am

    మనసును కదిలించింది..

  2. lucky
    January 28, 2013 at 6:53 am

    really very good story. full of human relations and humanity. really simply superb.

  3. శ్రీవల్లీరాధిక
    February 8, 2013 at 4:25 am

    చాలా బాగుంది ఈ కథ.

  4. January 29, 2016 at 1:30 am

    బాధలున్నవాళ్ళకే పక్కవాడి బాధలు తెలుస్తాయేమొ! బాగుంది కథ. అనువాదం చక్కగా వుంది, అనువాదం అని తెలియనంతగా!

Leave a Reply to lucky Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)