పలుగురాళ్ళల్లో నలగాల్సిన నా బాల్యపు పూలచెండును
ఒడుపుగా బడిగంటకు ముడివేస్తివి.
దారపుకండెలకు చుట్టుకోవాల్సిన నా కంటిచూపును
పుస్తకాల పేజీలకు అతికిస్తివి.
టైఫాయిడ్ కొలిమిలో తల్లడిల్లిన నా తనువును
తట్టుబొంతల్లో చుట్టి నిండు మట్టి కుండవై
నా గుండెలపై చల్లగా పగిలిపోతివి.
అర్ధరాతిరి అక్షరాలపై వాలిపోయిన నా రెప్పలపై
వెచ్చని పట్టు దుప్పటివై పరుచుకుంటివి.
అలుకు పిడచగా.. గాలింపు గిన్నెగా..
ఇంటి గడపలపై ఎర్రని జాజువై..
ఇడుపులపై తెగిపడ్డ సీతాకోకచిలుకల రెక్కవై..
పొట్టుపొయ్యికాడ నల్లని పేలికల మసిబట్టవై
జొన్నరొట్టెలబుట్టవై.. కందిలికి అంటిన మరకవై..
మా చూపు కాయని కన్నులముందు
ఎన్నెన్ని మట్టివాసనల రాసులు పోస్తివి
నాయినా..
ఐదుపదుల్లో అచ్చం అమ్మవై మొలకెత్తావు
మాతృత్వపు మూలాలేవో నీకు బువ్వతో కలిపి పేట్టిందేమో అమ్మ!
నీ అడుగులను వాగుల తడిపిన చెరువు కదా అమ్మ!
నీ మాటలకు పత్రహరితం అద్దిన చెలక కదా అమ్మ!
మా జ్ఞానేంద్రియాలు ఎండిపోకుండా
రోజూ నీ గుండెను తడుపుకుంటివి
ఎప్పుడూ నీ గుండె చెరువుకట్ట తెగిన ఎరుకే లేదు!
నా గుండెల్లో రేగిన అలజడి సర్కారు తుమ్మలను నరికి
బంతిపూల నారు చల్లితివి
నా గాయాలపై మెత్తటి తంగేడుపూల కాపడమైతివి
ఎంత అనురాగం రంగరించి తవుడు ఉడికించావో
పాదంలో దిగపడ్డ ముల్లు.. పిండి పువ్వులా రాలిపోయే
నాయినా..
నెమలీకల్లాంటి నీ చేతుల్ని రెండురోజులు మోసామో లేదో
భారమౌతున్నావని మా భుజాలనే నరుక్కుంటిమి
ఏం మిగిలిస్తివో
ఏం తీస్కపోతివో?
లెక్క తప్పిన మాకు
లెక్క దొరకడం లేదు నాయినా.
హార్ట్ టచింగ్ పోయెమ్! Very well written.
చాలా బాగుంది శ్రీధర్! కదిలించావు!! కొత్తగా కూడా ఉంది మనదైన నుడికారం తో. అభినందనలు..