కరచాలనం

మారే క్షణాలతో మారే యుద్ధమే రచన!

ఫిబ్రవరి 2013

నీరు పల్లమెరుగు,నిజము దేవుడెరుగు-అన్నది సామెత. మానవ జీవన మనే ప్రవాహం ఏ గతిలో సాగుతున్నదో  తెలుసుకోవాలనుకుంటాడు రచయిత. ప్రవాహదశలోని ఒక దశను -ఒక చిన్న మార్పును -ఆ మార్పు చెందుతున్న క్షణాన్ని తన రచన ద్వారా పట్టుకోడానికి పోరాటం చేస్తాడు. రచయితగా తనకుండే సాహిత్య సాధనాల్తో మార్పు చెందుతున్న క్ష ణాన్ని  సాహసంతో పట్టుకుంటాడు.

అయితే ఈపని జరుగుతున్న స్వల్పకాలంలోనే మానవ జీవితవాహిని మలుపుకు తిరిగేసి , మరో దిశకు మారి, ఇప్పుడేమంటావంటూ రచయితను సవాలు చేస్తుంది.మళ్ళీ రచయిత అప్పుడు తయారైన మార్పును అర్థం చెసుకునే పనికి సమాయత్తం అవుతాడు.ఇలా సాహిత్యానికీ,మానవజీవితానికీ మధ్యలో నిరంతరంగా జరుగుతున్న ఈ పోటీలో , వ్యక్తిగా జీవితపరిణామాలకు మారుతూ, రచయితగా ఆ పరిణామాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఇంత దూరం సాగి వచ్చాక ,ఈరెండు ప్రపంచాలనుంచీ వేర్పడి, రెండిటి మధ్య ఉండే గట్టు పైన (ఊహా మాత్రంగానైనా) నిలబడి, వెనుదిరిగి, తన రచనానేపధ్యాన్ని పునరాలోచించుకోవడం గూడా ఒక తమాషా క్రీడలాగే కనిపిస్తోంది నాకిప్పుడు.

జీవితంలో నడివయస్సును చేరుకున్నాక , ఇప్పుడు తిరిగిచూస్తే నా జీవితాన్నంతా పూర్తిగా సాహిత్యమే ఆవరించినట్టుగా తెలుస్తోంది నాకు.యెప్పుడో చిన్నతనంలో మానాన్న చేయి పట్టుకుని సాహిత్యలోకంలోకి అడుగు పెట్టిన వాణ్ణి నేను.ఆయన కొద్ది రోజుల్లోనే నాదైన నడకను నేను నేర్చుకునే అవకాశాన్ని కల్పించి,ప్రేక్షకుడిగా నిల్చుని , నాకేసి ముచ్చటగా చూస్తూవుండేవారు. కాలం ఆయనను నానుంచీ దూరం చేసినా ఆయన సాన్నిధ్యం మాత్రం మానసికంగా నాతోనే ఉంటూ,నన్నలాగే గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.అయితే జీవనయానం నన్ను యెన్నో మలుపులు తిప్పనే తిప్పింది.

మామూలు బడిపంతులు కొడుకునే అయినా పదిహేనేళ్ళ క్రితం వరకూ దుఃఖమన్నదే సుఖంగా-ఓ రకం బుద్దుడి జీవితంలా-గడచింది. తొలిసారిగా జీవిత వాస్తవం గురించిన పాఠం నేర్పిన వాడు మా తమ్ముడు. వాడు అర్ధాంతరంగా జీవితంలొంచీ విరమించి ,మానవ జీవితమెంతటి క్షణికమో , అది యెంత అర్ధరహితంగా తయారవగలదో , పిడుగు పడి శరీరాన్నీ మనస్సునూ రెండుగా చీల్చి  పారేసినంత నిర్దయగా నా అనుభవ పరిధిలోకి తీసుకొచ్చాడు. అప్పటినుంచీ నా చూపూ,నా అంతరంగమూ నా జీవనయానమూ పూర్తిగా మారిపోయాయి. గతాన్నీ, ఆగతాన్నీ పట్టించుకోకుండా ,ప్రస్తుతంలోనే బతకమన్న జిడ్డు కృష్ణమూర్తి మాట మాత్రమే అప్పుడు నన్ను ఓదార్చి సత్యాన్ని చూపెట్టింది. సరిగ్గా అదే సమయంలో భారతదేశపు సామాజిక చిత్రపటంలో పెనుమార్పులు వచ్చాయి.

 

1991 లో రష్యాలో కమూనిస్టు ప్రభుత్వం పతనం గావడంతో భారతదేశంలోని ప్రభుత్వాలు సామ్యవాదం నుంచీ దూరమవుతూ వచ్చి ,ఆ శతాభ్దపు ఆఖరికల్లా ధనస్వామ్యనికి చేరి ప్రపంచీకరణకు జేజేలు పలకసాగింది. అప్పటి వరకూ కొంతవరకైనా చలామణిలో వుండిన మానవీయ దృక్పదమూ , విధానాలూ క్రమంగా మృగ్యమై మళ్ళీ ఒక ఆటవిక సమాజం చొచ్చుకొచ్చేసింది. చిత్రమేమిటంటే అప్పటికైనా భారతదేశపు ఆలోచనాపరులు కమ్యూనిజమనే గొప్ప రాజకీయ విధానపు అవసరాన్ని గుర్తించలేక పోయారు . తిరిగీ కమ్యూనిజాన్ని బలంగా తయారు చేసుకోలేక పోయారు.ఒక గొప్ప ఆదర్శం వైపుకు నడుస్తోన్న భారతదేశపు ప్రయాణం అర్ధాంతంలో ఆగిపోయి తిరోగమనం పాలవడం ఒక పెద్ద ట్రాజెడీ. ఆ నిరాశా నిశృహలు అప్పతి నా రచనలకు నేపధ్యమయినట్టుగా ఇప్పుడు నాకు తోస్తోంది. ఆ అలజడే నాకు సార్వజననీయమైన సత్యమన్నదేదీ ఉండదనీ,ప్రతి సత్యానికీ లెక్కలేనన్ని పార్శ్వాలుంటాయనీ బోధ పరచింది. ఆ సమ్యంలో నేను సత్యానికుండే అన్ని పార్శ్వాలనూ పట్టుకొవదం కోసం -ఒక ఇంక్లూసివ్ అకౌంటును ఆవిష్కరించడం కోసం -అన్ని కోణాలనూ తనలో ఆవిష్కరించగల జీవిత శకలాల్ని పట్టుకొవడం కోసం ప్రయత్నం చేసాను.

క్రమంగా మానవీయ ఆదర్శాలు అంతరించిపోవడం నన్ను దిగులుకు గురి చేసింది. అస్తిత్వాల అన్వేషణలో తమ సుఖశాంతుల్ని కోల్పోతున్న మనుషులు జాలిగా కనిపించారు. ఒకే విషయానికి భిన్న రీతుల్లొ స్పందించే జీవితాలున్న వ్యక్తుల మద్య ఘర్షణలు పెరగ సాగాయి. మతమన్నది లేకుండా మనిషి జీవించలేడని తెలిసిపొయిన తర్వాతనైనా , మానవత్వమే భూమికగా ఒక ఆధునిక మతాన్ని తయారు చేసుకోలేకపోతున్న మానవజాతి యాతన వికృత రూపంలో తాండవం చేస్తూ అన్నిచోట్లా యెదురయ్యింది. భిన్న వైరుధ్ధ్యాల మధ్య నిత్యమూ డోలనం చేస్తున్న ప్రపంచాన్ని చూస్తుంటే బయమూ, విరక్తీ కలగసాగింది.నిన్నటికీ,రేపటికీ మధ్య , ఆ రెండిటికీ భూమికగా ఈనాటిని గుర్తించి ,దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలన్న అవగాహన కరువైన లోకరీతి పైన కోపమొచ్చింది. ఇన్ని అలజడుల మధ్యలో , భౌతిక శ్రమతో జీవించే సదా సీదా బడుగుజీవుల్లో నాకు గొప్ప మానవీయ లక్షణాలు కనిపించాయి.వాళ్ళ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న శక్తుల్లో నాకు సార్వజననీయమైన జీవన చలనసూత్రాలు స్పష్టంగా కనిపించాయి.

 

రోజంతా శరీరమనే పనిముట్టుతో పనిచేసి,బౌతికశ్రమతో అలసిపోయి, కలోగంజో తాగి,రేపంటే దిగుల్లేకుండా, ఒళ్ళు మరచి నిద్రపోయే శ్రామికజనంపైన గౌరవమూ ,ఆరాధనా పెరిగింది.సులభంగా వచ్చే మార్గాల్లో ధన్నన్ని దోచుకుని,అవినీతి సామ్రాజ్యాలో ఇరుక్కుపోయిన దుర్మార్గులు పోగొట్టుకుంటున్నదెమిటో ఆ కస్టజీవుల్ని చూసాకే నాకు అర్ధమయ్యింది. వడ్రంగులు, చాకలివాళ్ళు, మంగళ్ళు, హరిజనులు,ఇంకామిగిలిన చేతివృత్తులవాళ్ళు తమతమ ఆశానిరాశలతో బాటుగా నా రచనల్లొకి రావడంతో నా సాహితీజీవితంలోకి గొప్ప వెలుతురులు తరలివచ్చయని నేను నమ్ముతున్నాను. వారి కష్ట నష్టాల్నీ , యోగాయోగాల్ని పట్టుకోవడం మానసికంగా యాతనే అయినా , ఆపని ముగిసాక తెరుచుకునే వెలుతురు ద్వారాలు నన్ను అక్కున చేర్చుకుంటున్నాయి. రచన ముగిసాక నాలో వెలిగె దీప్తులే అంతకుముందు పడవలసిన యాతనలకు నన్ను సమాయిత్త పరుస్తున్నాయి. ఈ సాహితీయానాన్ని మరింతగా కొనసాగించడానికి కావల్సిన స్ఫూర్తిని కలిగిస్తున్నయి.