కథ

మొగలిపొద

ఏప్రిల్ 2015

“జిస్ గలీమే తెరా ఘర్ న హో బాలమా ఉస్ గలి సే హమే తో గుజరానా నహి,” సెల్ లో వస్తున్నముకేష్ పాటతో పాటు తాతయ్య కూనిరాగం తీసుకుంటూ తోటలో కలుపు మొక్కలు తీస్తున్నాడు. క్యాట్ మోడల్ పరీక్ష రాసి, కాస్త చిరాగ్గా వున్నఅర్నవ్ బండి పెట్టేసి నేరుగా తాతయ్య దగ్గరకు వెళ్ళాడు.

“ఎలా రాశావు కన్నా.. ?” తాతయ్య అడిగాడు.

“బాగా రాశా తాతయ్యా ఈ పాట అర్థం ఏమిటి? మీరు ఎక్కువ వింటుంటారు . ”

” ఏ వీధిలో అయితే నీకు ఇల్లు లేదో ఆ వీధిలో నేను ప్రవేశించను,నీ ఇంటికి చేర్చని దారిలో నేను నా పాదం మోపను”

“చాలా బాగుంది తాతయ్యా…మీకు హిందీ పాటల మీద అంత ఇష్టం కలగ డానికి కారణమేంటి ?”

“మేము చదువుకునే రోజుల్లో మీలాగే సినిమాలు చూసేవాళ్ళం ..టీవీ, క్రికెట్ , సెల్ ఫోన్లు,ఇంటర్నెట్ లేవు , పుస్తకాలు కూడా కాలేజి లైబ్రరి లోనో లేకుంటే తాలూకా గ్రంధాలయం వెళ్లి తెచ్చి చదువు కోవాల్సిందే. సినిమా చూశాక రేడియోలో పాట వస్తే రాసుకుని పాడుకునే వాళ్ళం …ఒక్కసారికి రాసుకోలేక పోయే వాళ్లము…ఆ పాట మళ్ళీ వచ్చినప్పుడే రాసుకోవాలి ..రేడియోలో కేవలం రెండు సార్లే పాటలు వచ్చేవి. హిందీ పాటలు ఇక్కడ స్టేషన్లలో వచ్చేవి కాదు. రేడియో సిలోన్ లో మాత్రమే వచ్చేవి, నేను ఎమ్మే చేసింది పూనా లో కాబట్టి హిందీ, మరాఠి పాటలు అక్కడ వినేవాళ్ళం, ఇంటికొస్తే శ్రీశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, దేవులపల్లి పాటలు,పద్యాలు పాడుకోవడం మా ఆనందం.. కానీ అర్నవ్ మేము చాలా సంతోషంగా వుండేవాళ్ళం …చిన్న చిన్న ఆనందాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి …మీకిప్పుడు అన్నీ అమరుతున్నాయి …కానీ సంతోషం లేదు, కోరుకోకముందే అన్నీవస్తుంటే వాటి విలువ తెలియడం లేదు…. జీవితం వడ్డించిన విస్తరి కాకూడదు …” తాతయ్య చెప్పుకు పోతున్నాడు.. .

అర్నవ్ నెమ్మదిగా అక్కడినుండి జారుకోవడానికి మార్గం చూస్తున్నాడు. తాతయ్య చెప్పేది వినకుండా వెళ్లినట్టు తాతయ్య గ్రహించడం అతనికి ఇష్టంలేదు. చుట్టూ ఉన్నమొక్కల్ని చూస్తూన్న అర్నవ్ ఖాళీగా ఉన్న ఎదిరింట్లోకి దిగుతున్న కుటుంబాన్ని చూశాడు. రాత్రేమో సామాన్లు దించిన శబ్దాలు వినపడ్డాయి. కారులోంచి తెల్లగా పొడుగ్గా అందంగా వున్న45 ఏళ్ళ వ్యక్తి , ఇటు ప్రక్కనుండి తెల్లగా పొట్టిగా లావుగా వున్నఒకావిడ, గుజరాతినో ,రాజస్తానీనో మరి చీర అదోరకంగా కట్టుకుంది . వెనకనుండి తళుకు మనే తారలా ఒక అమ్మాయి దిగారు. అర్నవ్ గుండె లయ తప్పింది …క్షణంలో వెయ్యోవంతులోనే ప్రేమలో పడిపోయాడు. బస్తా మైదా పిండిలో అయిదు లీటర్ల తేనె,ఓ అయిదు కేజీల పసుపు కలిపి బొమ్మను చేస్తే ఎలావుంటుందో అలావుంది ఆ అమ్మాయి. నల్లటి స్లీవ్ లెస్ టాప్ ..నల్లటి షార్ట్…నడుము వరకు వున్న వత్తైన జుట్టు …బాప్ రే … ఏ రాం గోపాల వర్మ ,ఏ రాజమౌళి కళ్ళలో పడివుంటే ఇంకేమైనా ఉందా! వద్దు ఎవరి కళ్ళలో కూడా పడకూడదు … అనుకుంటుండగానే వాళ్ళు లోపలి పోవడం, పనివాళ్ళు గేటు వేయడం జరిగి పోయింది .అర్నవ్ కు ఒక్కసారి ప్రపంచమంతా చీకటి క్రమ్మి నట్లైంది. గీతలో విష్ణువు యొక్క తేజోవంతమైన విశ్వరూపం చూశాక కళ్ళు బైర్లు క్రమ్మిన అర్జునినిలాగా అయిపోయాడు.

అది మొదలు అర్నవ్ కు ప్రపంచంలో జరిగేవీ తెలియడం లేదు, ఫేస్ బుక్ సంగతి మర్చిపోయాడు , స్నేహితుల్ని కలవడం మానేశాడు, సినిమాలు ఆకర్షించడం లేదు , షటిల్ ఆడడానికి వెళ్ళడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన తన జీవిత ద్యేయం, క్యాట్ పరీక్ష కు చదవడం కూడా లేదు , ఏకాగ్రత కుదరడం లేదు . మనసంతా ఎదురింటి అమ్మాయి పైనే వుంది, మనసును మళ్ళించు కోవడానికి ప్రయత్నించినా, ఉహూ.. అది వినడం లేదు. మెరుపులా కన్పించి మాయమయే ఆ అమ్మాయి కోసం అర్నవ్ తనకు తెలియకుండానే వెతుకుతున్నాడు.

మామూలుగా అర్నవ్ గది దాటి వచ్చేది తినడానికి, అతని గదిలోనే టీవీ, కంప్యూటరు , పుస్తకాలు వుంటాయి, అప్పుడప్పుడు తాతయ్య అతని గదిలో చొరబడి పుస్తకాలు, బట్టలు, సర్ది అతని పడక పైనున్నచెత్త చెదారం తీసి, దుప్పటి మార్చి పని మనిషి తో దగ్గరుండి శుభ్రం చేయిస్తారు. అలాంటిది ఈ మధ్య గది కిటికీలు తీసిపెడుతున్నాడు. హాలులో, వరండాలో, బయట లాన్ లో కుర్చీ వేసుకుని కూడా చదవడం మొదలు పెట్టేప్పటికి తేడాగా అనిపించినా …మంచి గాలి, వెలుతురు వున్న చోట చదివితే మంచిదని చెప్పడం వలన అలా చేస్తున్నానని అర్నవ్ చెబితే, అలాగా అనుకున్నారు. ప్రేమ గుణం ఏమిటంటే అది తన మత్తులో ఉన్నవారిని ఏమైనా చేయించగలదు , అసత్యవాదుల్ని సత్యహరిశ్చంద్రులు గాను, సత్య ప్రేమికులకు అసత్యాలు చెప్పడం నేర్పగలదు. అర్నవ్ దీనికి మినహాయింపేమి కాదు .

లాన్ లో కూర్చుని చదువు నటిస్తున్న అర్నవ్ ఎదురింటి గేట్ శబ్దం కాగానే తలెత్తి చూశాడు. ఎర్రటి టి షర్ట్ ,నీలం రంగు జీన్స్ లో ఆ అమ్మాయి తమ ఇంటి వైపు వస్తోంది … తాను కలగంటున్నాడో లేక నిజమో అర్థం కాలేదు
“ఎక్స్క్యూజ్ మి నా పేరు టీనా , మేం ఎదురింట్లో దిగాం, హిందూ పేపర్ లేక టైమ్స్ అఫ్ ఇండియా కానీ వస్తుందా మీకు, మాకూ వేయమని చెబుతారా ! ” హిందీలో అడిగింది.

ఆమె సెల్ లో తాతయ్య ఎప్పుడూ వినే పాత హిందీపాట,” ఆ లౌట్ కె ఆజా మేరే మీత్ తుజే మెరే గీత్ బులాతే హై ” వస్తోంది.

“ష్యూర్… ష్యూర్.. ఐ యాం అర్నవ్ ” అన్నాడు. తానెంతో మంది అమ్మాయిల్ని చూశాడు ,ఇంజనీరింగ్ చదివేప్పుడు క్లాస్మేట్స్ ని,స్నేహితుల చెల్లెళ్ళ ని, బందువుల అమ్మాయిల్ని, ఎంతోమంది కనిపించేవారు కానీ వాళ్ళు అమ్మాయిలనే ధ్యాస కూడా కలిగేది కాదు, ఉహూ … ఎవ్వరూ ఇలా మత్తు జల్లలా … ఏమి అందం ! అర్నవ్ గాలిలో తేలిపోతూ అనుకున్నాడు. ఆ అమ్మాయి థాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయింది.

పేపర్ వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు డబ్బులు తీసుకుంటాడో అర్నవ్ కు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు. ఎదురింటి టీనా కు హిందూ పేపర్, టైమ్స్అఫ్ ఇండియా పేపర్ వస్తున్నాయి. ఏపని చేస్తున్నా టీనా రూపం తప్ప మరేమీ కనపడ్డం లేదు, ఆమె మాటలు తప్ప మరింకేమీ వినపడలేదు రెండురోజులు.

నెమ్మదిగా మామూలు అవుతున్న సమయంలో ఉదయాన్నే అర్నవ్ నాన్నని రైల్వే స్టేషన్ లో దింపి నిద్రకళ్ళతో మళ్ళీ ముసుగు తన్నేసి పడుకుందామని లోపలికి పోతుండగా టీనా ఎదురయింది. ఇంకా పూర్తిగా తెల్లారనే లేదు.వాకింగ్ కి వెళుతూ ఉన్నట్టుంది. ట్రాక్ సూట్, షూస్ లో వుంది. మొత్తం వీధి అంతా నిర్మానుష్యంగా వుంది .

“హాయ్.. గుడ్మానింగ్ ” అంది తనే.

“హాయ్ గుడ్మానింగ్ ” నిద్ర మత్తు వదిలించుకుని అన్నాడు .

ఆమె సెల్ లోంచి లతా మంగేష్కర్ పాత హిందీ పాట..”ఆయెగా ఆనేవాలా “ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా వుండడం వలన చిన్నగా విన్పిస్తోంది. ఆమె ఏదో హిందీలో అంది, అర్థం కాలేదు.

“నాకు హిందీ రాదు పెద్దగా, ఇంగ్లీషులో చెప్పండి ” అన్నాడు.

“హిందీ రాదా.. హైదరాబాద్ లో వుండి కూడా, హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కూడా కదా!” అంది ఇంగ్లీషులో

ఛ ఛా.. హిందీ అర్జంటుగా నేర్చుకోవాలి.. దృఢoగా అనుకున్నాడు.

“వాకింగ్ వెళుతున్నాను ఇక్కడ ఎవరూ తోడు లేరు” అంది

నేను వస్తాలే అనబోయి ఇవాళ నాన్నను డ్రాప్ చేయడానికి నానమ్మ గంట ముందు మొదలు పెట్టి ఎలా లేపిందో గుర్తొచ్చి ఆగిపోయాడు.

” ఆరోరా లో ఇంజనీరింగ్ అయిపొయింది .. క్యాట్ కు ప్రిపేర్ అవుతున్నా మీరు అర్నవ్?”

” జే ఎన్ టీ యూ లో ఇంజనీరింగ్ అయింది, నేను క్యాట్ కి ప్రిపేర్ అవుతున్నా ”

” వాట్ ఏ లక్ .. జే ఎన్ టీ యూ లో అంటే మంచి ఇంటెలిజెంట్ అన్నమాట… ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు ?”

” లేదు …ఏ కోచింగ్ వెళ్ళను, టైం వాళ్ళు పెట్టె టెస్ట్ లు మాత్రమే రాస్తాను .”

“ఏమైనా డవుట్స్ వస్తే అడగొచ్చునా ?”

“ష్యూర్… ష్యూర్ ” అన్నాడు ఉత్సాహంగా … !

మెల్లిగా అర్నవ్ అలవాట్లన్నీ మారిపోయాయి, హిందీ అంటేనే చెడ్డ చిరాగ్గా వుండేది, టెన్త్ వరకు ఎలాగో నెట్టుకొచ్చాడు. హిందీ సినిమాలు చూసినా పూర్తిగా అర్థం కావు, మాట్లాడ్డం కూడా రాదు. హిందీ డిక్షనరీ తీసాడు, హిందీ చానల్సు , న్యూస్ చూడ్డం, స్నేహితులతో హిందీలో మాట్లాడ్డం మొదలెట్టాడు. పాత హిందీ పాటలు మాత్రం కష్టంగా ఉన్నాయి .అంత నెమ్మదిగా వున్న పాటలు అతనికి అసలు నచ్చలేదు. అవి ఎవరు పాడారో,ఏ సినిమాలోనో తెలియడం లేదు. డౌన్ లోడ్ చేసి విందామంటే. ఇంక తాతయ్యను అడుగుదామంటే ఇంత వరకు అసలు ఆసక్తి చూపకుండా ఇప్పుడు ఎలా అడిగేది? అనుకున్నాడు.

తాతయ్య యోగా చేసుకుంటూ పాటలు వింటున్నాడు.అయేదాకా చూస్తూ కూర్చున్నాడు .

“ఏంటి కన్నా ఇలా వచ్చావు ?”

నవ్వి ఊర్కున్నాడు “కోయీ జబ్ తుమ్హారా హృదయ్ తోడ్ దే తడప్ తా హువా కోయీ చోడ్ దే , తబ్ తుమ్ మేరేపాస్ ఆనా ప్రియే….” కొంచం కొంచం ఆ పాట అర్థం అయినా పూర్తి గా అర్థం కాలా! కానీ ఎంతో శ్రావ్యంగా హృద్యంగా అనిపించింది.

“తాతయ్యా ఈ పాట ఎంత బావుందో! అర్థం ఏంటి ?”

“ఇది మనోజ్ కుమార్ గారి “పూరబ్ అవుర్ పశ్చిం” సినిమాలోది, ముకేష్ పాడారు,” నీ హృదయాన్ని ఎవరైనా గాయ పర్చారా ? నిన్ను బాధించి ఎవరైనా వదిలి పెడితే,నా దగ్గరికి వచ్చేయ్, నా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పటికి తెరిచే వుంటాయి.” తాతయ్య పాట అర్థం అంతా వివరించాడు.

“పాత హిందీ పాటల్లో వేదాంతం గొప్పగా వుంటుంది నాన్నా! ఆంధ్రజ్యోతిలో సోమవారం బమ్మెర అనే రచయిత “జీవన గీతం” అనే శీర్షికతో పాత హిందీ పాటల గురించి రాస్తారు, ఇదిగో అన్నీ కట్ చేసి పెట్టా, చదువు.”
అవన్నీ చదివాక మొట్టమొదటి సారిగా అర్నవ్ కు పాత సినిమా పాటల్లో గొప్పసాహిత్యం వుందని వాటిని అర్థం చేసుకుంటేనే వాటిని అభినందించగలనని అనుకున్నాడు. ఆ పాటల్లోని అద్భుతమైన వేదాంతధోరణి అర్థం చేసుకోవడానికి ఎంతో హృదయ సంస్కారం కావాలని తాతయ్య అనడం అతనికి గుర్తొచ్చింది.

“తాతయ్యా, అమేజింగ్! నేనెప్పుడూ అంత ఏకాగ్రతతో పాటలు వినలేదు, నాకు ఈ పాటలు చాలా నచ్చాయి ఆ సీడీ ఇవ్వరూ…”

తాతయ్య ముందుగా ఆశ్చర్యపోయాడు,తర్వాత పొంగి పోయాడు. మనవడు వినే కొత్త పాటలలో సాహిత్యం, సంగీతం లేదని, పాట కూడా ఒక బాష లో లేకుండా తెలుగు ఇంగ్లీషు తమిళం కలిపేసి జుగుప్సాకరంగా వుండే అర్థాలు వున్నాయని, ఇలాంటివి ఎందుకు వింటావు అని చెప్పాలనిపించేది. కానీ తరాల అంతరాలు తెలిసిన మేధావి కాబట్టి వూరికే ఉండిపోయాడు. తన దగ్గరున్న పాత తెలుగు, హిందీ పాటల సీడీలిచ్చాడు.
“ముందు హిందీవన్నీ విన్నాక తెలుగు తీసుకుంటా తాతయ్యా” అన్నాడు.

అర్నవ్ టీనా స్నేహం కంటే ముందు, హిందీ బాష పై పట్టు కోసం పట్టు పట్టాడు. భాష రానిదే టీనా తో మాట్లాడాలంటే బెరుకుగా వుంది.ఆమె హిందీలోనే మాట్లాడుతుంది. హుషారుగా వుంది జీవితం. టీనా అప్పుడప్పుడు ఒక చిరునవ్వు విసురుతుంది ఆమె గదిలో నుండి కనపడితే. తోటలో తిరుగుతూ వుంటే సెల్ లో పాత హిందీపాటలు ఎడతెగకుండా వస్తూ వుంటాయి. లత పాటల సందడి ఒక రోజు, కిషోర్ ఖవ్వాలి ఒకరోజు, రఫీ కచేరి మరో రోజు,ముకేష్ ములాఖాత్ ఇంకో రోజు వుంటుంది. టీనా నిద్రపోయినప్పుడు తప్ప ఎప్పుడూ పాటలు వినపడుతూనే వుంటాయి.

టీనా స్కూటి మీద పోవడం చూశాడు ఉదయమే. అర్నవ్ బయటికి వస్తూంటే ఎదురయ్యింది స్కూటి ఆపి పలకరించింది .

“ఎలా వుంది ప్రిపరేషన్ ?”

నవ్వాడు బదులుగా .

“మొన్న టెస్ట్ లో పెర్సంటైల్ ఎలా వచ్చింది?”

“సెంట్ ”

“ఓ గాడ్… నాకు 95 దాటడం లేదు …మాత్స్ నాకు ప్రాబ్లం, హెల్ప్ చేయరూ ”

“ష్యూర్ ”

“ఇవాళ మీ ఇంటికి రానా! లేక మీరు వస్తారా? ”

అర్నవ్ గుండె వేగంగా కొట్టుకుంది ” నేనే వస్తాలెండి “అన్నాడు

“మీరు హిందీ బాగా మాట్లాడుతున్నారు…” మెచ్చుకుంది టీనా

అర్నవ్ గుండె పొంగిపోయింది. యాహూ అనుకున్నాడు మనసులో .

రోజూ టీనా ఇంటికి వెళ్లి టీనాకు లెక్కలు చేయడం లోని మెళకువలు చెబుతున్నాడు అర్నవ్. టీనా తొందరగానే గ్రహిస్తోంది. ఆమె పర్సంటైల్ బాగా వస్తోంది. టీనా తన తల్లిదండ్రుల్ని పరిచయం చేయలేదు ,కనీసం వాళ్ళు అర్నవ్ కు ఎక్కువ కనపడలేదు కూడాను. కనపడ్డప్పుడుకూడా ఒక చిరునవ్వుతో పలకరించేవారు అంతే. అర్నవ్ కు టీనా అందం,ఆమె ముద్దు మాటలు మత్తెక్కిస్తున్నాయి. ఇద్దరికీ క్యాట్ లో మంచి పర్సంటైల్ వచ్చినట్లూ,ఇద్దరూ ఒకే కాలేజ్ లో చదివినట్లూ, చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగినట్లూ, ఆతర్వాత టీనాని పెళ్లి చేసుకున్నట్లు, ఆమెతో ఆనందమయ జీవితం గురించి కలలు కంటున్నాడు.

ఒకరోజు అకస్మాత్తుగా టీనా
” మీ ఇంట్లో కూడా రోజూ పాత హిందీ పాటలు వినపడుతుంటాయి ….మీకు ఇష్టమా ?”అంది

“యా… యా ” అన్నాడు కానీ ఆమె పాటల గురించి అడిగితే కష్టమని వెంటనే

” మా తాతయ్య పెడుతుంటారు ,నేను వింటుంటాను “అన్నాడు

రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. మోడల్ టెస్ట్ లలో అర్నవ్ పర్సంటైల్ పడిపోతోంది … టీనా పర్సంటైల్ బాగా వస్తోంది. అర్నవ్ దాని గురించి పెద్ద బాధపడలేదు. మళ్ళీ కొంచం శ్రమపడితే ముందులా స్కోర్ చెయ్యొచ్చులే అనుకున్నాడు. రాత్రి ఎక్కువ చదివి ఉదయం పది వరకు లేవకుండా వుండే అర్నవ్ ఉదయమే లేవడం ,లేవగానే ఎదురింటికి పరిగెత్తడం, ఇంట్లో వున్నా పాటలు డౌన్ లోడ్ చేయడం ,తాతయ్య తో కానీ నానమ్మ తో కానీ అసలు మాట్లాడకుండా వుండడం, వాళ్ళ అమ్మకు కూడా అసలు ఫోన్ చేయడం లేదని, చేసినా బిజీ గా వున్నానని చెబుతున్నాడని అనడం, తాతయ్య దృష్టిలో పడింది.

అర్నవ్ ప్రవర్తనలో వచ్చిన తేడాను తాతయ్య గమనించాడు.అర్నవ్ నాన్నకు ట్రాన్స్ఫర్ అయితే ..అర్నవ్ అమ్మానాన్న వెళ్ళిపోయినా, అర్నవ్ కోసం హైదరాబాద్ లోనే ఉండిపోయారు అర్నవ్ తాతయ్య,నానమ్మ. కానీ అర్నవ్ మునుపటిలా చదవడం లేదని, చదువే లోకంలా లేడని తాతయ్యకు అర్థమైంది.కానీ తాతయ్య గ్రహించాడని అర్నవ్ గ్రహించలేదు.

రోజులా అర్నవ్ టీనా దగ్గరకు వెళ్ళాడు, అప్పటికే టీనా ఏదో సీరియస్ గా చదువుతోంది.

“రేపు పరీక్షకి ఒక సారి మళ్ళీ చదువుదాం “అన్నాడు

“అర్నవ్ ఇప్పుడు నాకు మాత్స్ భయం లేదు బాగా చేస్తున్నా.. మీ కారణంగానే … నిజంగా మీకు నేను చాలా రుణపడి వున్నాను…. దగ్గరగా వచ్చి అతని భుజం పై చెయ్యి వేసి అంది. అర్నవ్ నరాలలో విద్యుత్ ప్రవహించింది , టీనాను అమాంతం దగ్గరకు లాక్కోవాలనే కోర్కెను అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. ఆమె అందం అతన్ని చాలా సార్లు కవ్వించేది… ఆమె వేసుకునే బట్టలు ఆమెను మరింత ఆకర్షణీయంగా కన్పించేలా చేస్తాయి. ఏదో ఫోన్ రావడంతో టీనా అర్నవ్ తో ఒక్క నిముషం అని లోపలి వెళ్ళింది. అర్నవ్ చాలా సేపు ఎదురు చూశాడు.ఇంక వెళ్లి పోదాం అనుకున్నప్పుడు బయటికి వచ్చింది.

ఇద్దరూ కూర్చుని మాత్స్ చేశారు, అర్నవ్ మనస్సు మనస్సు లో లేదు. అతని లోని మగవాడు పదేపదే బయటికి రాసాగాడు . అక్కడే వుంటే ఎలా ప్రవర్తిస్తానో అని భయం వేసి తొందరగా బయటికి వచ్చాడు.

ఇంటికి వచ్చాక అతని కి మరింత అలజడిగా అనిపించింది . ఇంతలో టీనా దగ్గర నుండి ఫోన్ వచ్చింది . “ఎందుకలా తొందరగా వెళ్ళిపోయారు?”

నా భావాల్ని ఈ పాటలో వినండి అంటూ “భూల్ గయా సబ్ కుచ్, యాద్ నహీ అబ్ కుచ్… ఏక్ ఎహీ బాత్ న భూలీ.. .. జూలీ ఐ లవ్ యూ ” పాట పెట్టాడు .

ఆ ప్రక్కనుండి గట్టిగా నవ్వు వినపడింది. తర్వాత “అయితే జూలీని లవ్ చేస్తున్నారా !”అని మళ్ళీ నవ్వ సాగింది . ఛ ఛ అనుకుని తనూ నవ్వాడు.

“ఐ లవ్ యూ టూ అర్నవ్ … ఇప్పుడు ప్రేమ పాఠాలు కాదు, క్యాట్ పరీక్ష అయే వరకు కేవలం చదువు మాత్రమే…రైట్ … ప్లీజ్ మీరు డిస్టబ్ కావద్దు నన్ను డిస్టబ్ చెయ్యద్దు . మన ద్యేయం చదువు కదా …!” అంది టీనా

అర్నవ్ కు కాస్త సిగ్గేసింది.” సారీ …నా ప్రేమ చెప్పకుండా ఉండలేకపోయాను.నా మనసంతా నువ్వే వున్నావు టీనా.. ఓకే … చదువు అయిపోయేదాకా ఆ ప్రసక్తి తేను.” బుద్ధిగా అన్నాడు.

తర్వాత అర్నవ్ మామూలుగా టీనాకు మాత్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నా అతని తలపులు ఆమె మీదికే పోతున్నాయి. చదువు పై ఆమె కున్న ఏకాగ్రత తనకు లేదని అతనికి అర్థమవుతోంది . ఈ సారి మోడల్ టెస్ట్ లో మాత్స్ లో అర్నవ్ కంటే టీనాకే ఎక్కువ మార్కులు రావడంతో అతనికేమవుతోందో అతనికే అర్థం కాలేదు. టీనాను తను ప్రేమించాడు, ఆమె కూడా ప్రేమిస్తున్నట్లు ఒప్పుకుంది కానీ ఆమె ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ఆమె ఆలోచనల నుండి మనసును మరలించడానికి అతను ప్రయత్నం చేసేకొద్దీ మనసు ఆమె వైపే పోతోంది. క్యాట్ పరీక్ష ఇంక వారం ఉందనగా ఆఖరి మోడల్ పరీక్షకు ఇద్దరూ చాలా శ్రద్దగా కూర్చున్నారు, అర్నవ్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే టీనా కళ్ళు మూత పడుతున్నాయి, నిద్రను బలవంతంగా ఆపుకుంటోంది కానీ కాసేపటికి నిద్రే ఆమెను జయించింది, అలాగే కుర్చీ లోనే వెనక్కి వాలిపోయి నిద్ర పోయింది. ఆమె లేస్తుందేమోనని కాసేపు చూశాడు, కానీ ఆమె లేవలేదు. కిటికీ లోనుండి వస్తున్న చల్లగాలికి ఆమె జుట్టు చెదిరి ఆమె ముఖం పై పడుతో౦ది . అతనికి ఆమెను చూస్తుంటే చౌదవీకా చాంద్ హో పాట గుర్తొచ్చింది.గురు దత్ వహిదా రహమాన్ అందాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు తన పాటలో ! వావ్ వాట్ ఎ బ్యూటి! అనుకున్నాడు.

అతనికి ఆమెను లేపడం ఇష్టం లేకపోయింది అలాగని వుండటం కూడా ఇబ్బందిగా అనిపించసాగింది.ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి …. వెళ్ళిపోదామని లేచాడు , అడుగుల శబ్దం వినపడకుండా నెమ్మదిగా రాబోతూ తిరిగి చూశాడు. ఇర్రెసిస్టిబుల్ అనుకున్నాడు, ఆమెకు దగ్గరగా వెళ్లి ఆమె జుట్టును సవరించాలనే కోర్కెను అతను ఆపుకోలేక పోయాడు. రెండు అడుగులు ఆమె కేసి వేశాడు. అంతలోనే ఆమె అన్నమాటలు గుర్తొచ్చాయి, వెనక్కి తిరిగాడు. మళ్ళీ ఆమెను చూశాడు .ఇంకేం ఆలోచించకుండా వెళ్లి ఆమె ముఖం పై పడ్డ జుట్టును సవరించి ఆమె బుగ్గపై ముద్దుపెట్టుకున్నాడు. ఆమె లేవ లేదు, వణుకుతున్న గుండెతో బయటికి పరుగులా వచ్చాడు. అతనికి మొదటి సారి హత్య చేసినప్పుడు హంతకుని లో రేగిన ఘర్షణ లాంటిది జరిగింది. తప్పు చేశానన్న భావన అతన్ని క్రుంగ దీసింది. వచ్చి తాతయ్య కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.

చిన్నప్పటినుండి మంచి చెడు బోధించిన ఆ తాతయ్య అర్నవ్ కు తొలి గురువు. అర్నవ్ అశాంతితో రగిలిపోతున్నాడు,అతనికి టీనా పై వున్నది ప్రేమా, వ్యామోహమా అర్థం కాలేదు, అతనికి తాను చేసింది ఘోరమైన తప్పని అనిపించసాగింది …ఒక పక్క ప్రేమించిన ప్రియురాల్ని ముద్దు పెట్టుకుంటే తప్పేమిటని మనసు సమాధాన పరుస్తోంది. మరొక ప్రక్క మనసు వివేకాన్నినిద్రలేపి, చేసింది సరైనది కాదని చెబుతోంది.

“… ఏంటి కన్నా.. ఏమైంది ?” తాతయ్య అనునయంగా అడిగాడు అర్నవ్ ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ,

అర్నవ్ తాతయ్య కళ్ళలోకి చూడలేక పోయాడు.తలవంచుకుని అలాగే తలని తాతయ్య ఒడిలోకి పెట్టాడు.

“ఏమీ లేదు తాతయ్యా… మీకు దగ్గరగా వుండాలని వుంది ”

“నీకు పరీక్ష దగ్గర కొస్తోంది …నీ మనసును ఏకాగ్రత ప్రక్క కు మళ్ళించు…టెన్షను పడకు…అయినా నీకెప్పుడూ లేదు కదా టెన్షను”.
సెల్ మ్రోగేప్పటికి తీసి చూశాడు,టీనా కాల్ అది. తాతయ్యను విడిచి పెట్టి బయటికి వచ్చి “హలో” అన్నాడు అదురుతున్న గుండెతో.

“సారీ నిద్రపోయా… ఏంటి అలా వెళ్లి పోయారు, సోజా రాజకుమారి సోజా అని, నన్ను లేపాల్సింది ”

“సారీ ఫర్ ఎవ్రితింగ్… కొంచం కంట్రోల్ తప్పాను ”

“నో సారి, నో థాంక్స్ బిట్వీన్ అజ్, ఇప్పుడు వస్తారా ఆ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. ”

“లేదు టీనా ఇప్పుడు రాలేను ప్లీజ్ మరోలా అనుకోకండి .. కొంచం బాగాలేదు, ”

‘ఏమి బాగాలేదు … ? నా దగ్గరకు రండి ఐ విల్ సెట్ యువర్ మైండ్ … ప్లీజ్ డు కం ! మనకు టైం తక్కువుంది.. ”

“వస్తున్నా … ” అర్నవ్ కీ ఇచ్చిన బొమ్మ లాగా ఎదురింటికి పోవడం చూస్తూ అతని అలజడికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ వుండిపోయారు తాతయ్య .

క్యాట్ పరీక్ష రానే వచ్చింది. ఆఖరి నిముషంవరకు అర్నవ్ టీనా కష్టపడి చదివారు, పరీక్ష అయాక అర్నవ్ కు అర్థమైంది తాను సరిగ్గా చేయలేదని, ఏ “ఐ ఐ ఎమ్” నుండి కాల్ వచ్చే అవకాశం లేదని, కానీ తన ప్రేమ పరీక్షలో నెగ్గానని, టీనా ప్రేమ పొందడమే తన విజయంగా భావించాడు. సెంటర్ నుండే టీనాకు ఫోన్ చేశాడు. “ఎలా చేశావు పరీక్ష ? ”

“బాగా చేశా… అన్ని కాల్స్ వస్తాయి అనుకుంటున్నా…నీవు ఎలా చేశావు ? ”

“సరిగ్గా చేయలేదు, పోయింది.. కానీ నాకు నీవున్నావు, నీ ప్రేమ వుంది, నీవు బాగా చేశావు చాలు… ఇంక … నేను .. ”

“సరే, అర్నవ్ వుంటాను, టాక్ టు యు లేటర్” ఫోన్ పెట్టేసింది.

అర్నవ్ కు కొంచం బాధ కలిగింది. ఇంటికి వచ్చాడు . తాతయ్య గేట్ దగ్గరే వున్నాడు అర్నవ్ కోసం ఎదురు చూస్తూ, “ఎలా రాశావు కన్నా?”
బాగా రాశానని చెప్పలేకపోయాడు అర్నవ్…” పరీక్ష పోయినట్లే తాతయ్యా … ”

తాతయ్య పలకలేదు … అర్నవ్ మూడు నెలల క్రిందటి వరకు ఎంత ఏకాగ్రత తో చదివేవాడో .. మోడల్ టెస్టుల్లో ఎంత మంచి రిజల్టు వచ్చేదో ఆయనకు తెలుసు .. తర్వాతి పరిణామాల్ని ఆయన గమనించాడు ,కానీ చేయగలిగింది ఏమీలేదని ఆయనకు తెలుసు .

టీనా ఇంటికి వచ్చి వుంటే తనతో కాసేపు మాట్లాడితే కొంచం బావుంటుంది అనిపించి ఫోన్ చేశాడుఅర్నవ్.

“నేను చాలా బిజీ గా వున్నా, బంధువులు వచ్చారు ఫ్రీ అయాక కాల్ చేస్తాను ప్లీజ్…. “అంది
పరీక్ష ఎలా చేశారో అని ఫ్రెండ్స్ ను ఫోన్ చేసి అడిగాడు, అతని క్లాస్మేట్ లాస్య ను కూడా అడిగాడు.

లాస్య “కోజికోడ్ ఇండోర్ కాల్స్ రావచ్చు… కోచింగ్ తీసుకున్న మన ఫ్రెండ్స్ లో ఎవరికీ అన్ని కాల్స్ వస్తాయనే పెద్ద హోప్ లేదు, నీకు అన్నీ వస్తాయనుకుంటా … ” అంది

“లేదు లాస్యా..పోయింది. నేను బాగా చేయలేక పోయాను.”అర్నవ్ కు బుర్ర మొద్దుబారి పోయింది .

టీనా అర్నవ్ ఫోన్ కు జవాబివ్వడం లేదు , అతనికి ఆమెందుకు అలా చేస్తుందో అర్థం కాలేదు మెసేజ్లు ,మెయిల్సు ఎన్ని పెట్టినా ప్రయోజనం లేదు. అతనికి పిచ్చి పిచ్చిగా వుంది. కనిపించినవన్నీ పగలగొట్టాలని వుంది. టీనా ను ఆమె తల్లిదండ్రులు కట్టడి చేస్తున్నారేమో అన్న అనుమానం వచ్చింది . ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను దండించారేమో అని కూడా అనుకున్నాడు . వెంటనే వాళ్ళింటికి వెళ్లాలని గబ గబా బట్టలు మార్చుకుని బయటికి పోతుంటే నానమ్మ అడిగింది. “భోజనం సమయానికి ఎక్కడికి నాన్నా?”

“ఇప్పుడే వస్తా… నాన్నమ్మా టీనా దగ్గరకు వెళ్ళొస్తా అయిదే నిముషాలు.”

“వాళ్ళు లేరు…నాన్నా! టీనా నీకు చెప్పలేదా ఉదయమే టీనా నాన్నగారు మాకు చెప్పి ముంబై వెళ్ళారు టీనా నిశ్చితార్థం అట ! “తాతయ్య అన్నాడు.

అర్నవ్ అక్కడున్న సోఫాలో కుప్ప కూలిపోయాడు. తాతయ్య కు అర్నవ్ పరిస్థితి అర్థమవుతోంది. వారం రోజులుగా మనవడు పడుతున్న ఘర్షణ చూస్తున్నాడు. కానీ ఎదిగిన మనవడ్నినిలదీసి అడగలేకపోయాడు. తానై బయటపడితే చూద్దాం అనుకున్నాడు.పరీక్ష సరిగ్గా చేయలేదని అతను వేదన పడడం లేదని అర్థమయింది …. టీనాతో పరీక్ష అయినప్పటినుండి కలవలేదని కూడా తెలుస్తోంది. మెల్లిగా అర్నవ్ ను లేపి అతని నానమ్మగమనించకుండా గదిలోకి తీసికెళ్ళాడు .

“ఏమయ్యింది కన్నా? పరీక్ష గురించా….పోతే…. పోనీలే! ఓటమి విజయానికి మెదటి మెట్టుకదా !”

“పరీక్ష గురించి కాదు తాతయ్యా… టీనాను నేను చాలా ఇష్టపడ్డా … ప్రేమించా, తను కూడా నన్ను ప్రేమించాననింది, ఇప్పుడు ఇంకెవర్నో పెళ్లి చేసుకోబోతోంది … ఎలా సాధ్యం తాతయ్యా … ప్రేమ అంత విలువ లేనిదా? అంత అవలీలగా ఇంకొకర్నిఎలా స్వీకరిస్తారు తాతయ్యా ?” అర్నవ్ కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు జారిపోతున్నాయి. తాతయ్య గుండె ద్రవించింది. తన చిన్నారి మనవడి కంట్లో కన్నీటి చుక్క అతనేనాడు చూడలేదు. అర్నవ్ మనసులోని గాయం మాటలతో మాన్పేది కాదని,కాల మొక్కటే దానికి మందని తెలిసినా, చెప్పాల్సిన మాటలు చెప్పడానికే నిర్ణయించుకున్నాడు .

“టీనా కు నీ పట్ల అంత నిబద్ధత లేదేమో అర్నవ్ …అ అమ్మాయికి నీ సహాయం అవసరం ఉండింది కాబట్టి నీతో స్నేహంగా ఉండిందేమో ….లేక నిన్ను ఆ అమ్మాయి కేవలం స్నేహితుడిగా చూసిందేమో! నీవు ఆ అమ్మాయి స్నేహాన్ని మరోలా అర్థం చేసుకున్నావేమో? ”

“లేదు తాతయ్యా తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, పరీక్షలయే దాకా ప్రేమ సంగతి వద్దు .పరీక్షల తర్వాత అవన్నీ అని, నాలో ఆశలు రేపింది తాతయ్యా …ప్రేమంటే ఇంతేనా తాతయ్యా … టీనా ఎందుకలా చేసింది తాతయ్యా?” ముఖం చేతుల్లో దాచుకున్నాడు

“జీవితం లో ఆటుపోట్లు సహజమే …కదా! విలువలకు విలువనివ్వని ఆ అమ్మాయి గురించి నీవు వేదన పడకు . నీ ప్రేమ అనే నిచ్చెన సహాయం తో ఆ అమ్మాయి తన జీవిత ధ్యేయాన్ని అధిరోహించింది. నీవు ఆకర్షణ అనే పాము నోట్లో పడి క్రిందికి జారి పోయావు. ఇది నీవు సృష్టించుకున్న అశాంతి. పగిలి ముక్కలైన నిన్నటి నీ విశ్వాసం గురించి బాధపడుతుంటే అందమైన ఈ రోజును, ఆశను రేపే రేపును కూడా పోగొట్టుకుంటావు. మార్చలేని గతంతో పోరాటం చేయకు ,శాంతి ఒప్పందం చేసుకో…. భవిష్యత్తును నీ చేతుల్లోకి తీసుకో… మొగలిపొద లాంటిది ప్రేమ, ఆకర్షణ, ఆ మత్తులో మునిగామా ….మిన్నాగుల కాటుకూడా తప్పవు…. ”

“తాతయ్యా నేను తప్పు చేశానా? ఎందుకిలా అయింది ? ఆమె ఆకర్షణలో నేను … ఇలా ఎందుకు పాడయి పోయాను? ”

“నీవేమీ తప్పు చేయలేదు నాన్నా! ప్రతి వ్యక్తి జీవితoలో నీ వయసులో ఆకర్షణలు, ప్రేమలు వుంటాయి. అప్పుడు వివేకం పనిచేయదు ,ఎవరి సలహాలు చెవికెక్కవు …నీ ప్రేమను అర్థం చేసుకోని ఆ అమ్మాయిని నీ మదిలోంచి తీసివెయ్యి. ఆమెను నిందించకు, ద్రోహం చేసిందని వాపోకు …అది ఆమెకు నష్టం కలిగించదు,నీకే కష్టం కలిగిస్తుంది.ఎదుటి వ్యక్తి లోని తప్పుల్ని వాళ్ళ బలహీనతగా క్షమించు. ఆ అమ్మాయి నీకు ఒక పాఠం నేర్పిందనుకో ….అప్పుడే నీవు ప్రశాంతంగా వుండగలవ్ ”

“నన్నిప్పుడు ఏం చేయమంటావు తాతయ్యా? నేను ఐ ఐ ఎం అహమ్మదాబాదులొనే చదవాలి ”

“నీ కలలను సాకారం చేసుకో అర్నవ్ …అవధులు లేని విజయాలను సొంతం చేసుకోవడానికి ఆశ, ఆశయాలు వుంటే సరిపోదు. ఏకాగ్రతతో, చిత్త శుద్ధి తో, కృషి తోనే సాధ్యమవుతుంది. ఇంత జీవితం లో ఒక సంవత్సరం పోతే నష్టం లేదు, మళ్ళీ నీవు చేసే ప్రయత్నం నీకు విజయం తెచ్చిపెడుతుంది…. నీవు ఎప్పుడూ చదువులో నీ ప్రథమ స్థానాన్ని కోల్పోలేదు … ఈ సారి నీ విజయం తథ్యం … ఈ ఓటమి, ప్రేమ విషయo లోను చదువు విషయం లోను నిన్ను మరింత పట్టుదల, పంతం కలిగిన వ్యక్తిగా తయారు చేయాలి,చేస్తుంది కూడాను …. ‘

“మీకు నాపై విశ్వాసం ఉందా తాతయ్యా?” బేలగా అడిగాడు.

“పూర్తిగా… పద భోంచేద్దాం.ఈ విషయం మనిద్దరి మధ్యే … నాన్నమ్మ, అమ్మా నాన్నకు తెలియ రాదు…” ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు.

నెమ్మదిగా అర్నవ్ గుండెలో నుండి వారం రోజులుగా వేధిస్తున్నవేదన వీడసాగింది … ఒక్కో సారి తీవ్ర మైన నొప్పికి గురి కావడమే మంచి మార్పుకు కారణ మవుతుందేమో…!

తాతయ్య గదిలో నుండి రఫీ పాట వస్తోంది … తేరీ గలియోమ్మే న రఖేంగే కదం ఆజ్ కె బాద్… తేరే మిల్నే కో న ఆయెంగే సనమ్ ఆజ్ కె బాద్ ” ( నీవున్న వీధిలో నేను నా పాదం పెట్టను,నిన్ను కలవడానికి ఇక మీదట రాను “) మంచి జీవిత పాఠం నేర్పింది టీనా….అంతే కాదు హిందీ నేర్పింది ,పాత హిందీ పాటల మాధుర్యాన్నిఅర్థం చేసుకోవడం నేర్పింది. గుండెల నిండా ఊపిరి తీసుకుని “థాంక్ యు టీనా ” అనుకున్నాడు అర్నవ్.

**** (*) ****