కబుర్లు

మా కళ్ళజోడు మాస్టారు పెద్దిభొట్ల!

ఫిబ్రవరి 2013

సాహిత్య ఎకాడమీ అవార్డు ప్రకటించిన  రెండ్రోజులకి మాష్టార్ ని కలిసే అవకాశం వచ్చింది. మద్దాళి నిర్మల గారి కథల సంపుటం మాష్టారు ఆవిష్కరించారు, నేను ఆ పుస్తకాన్ని విశ్లేషించిన వక్తల్లో ఒకణ్ణి.  చాలా రోజుల తర్వాత చూశాను మాష్టార్ ని.  నడవడానికి, మెట్లెక్కడానికి చెయ్యి అందిచాల్సి వస్తోంది.

“గుర్తుపట్టి ఉండరు. నేను కూడా లొయోలా కాలేజి లోనే చదివాను మాష్టారూ” అని ప్రవర చెప్పేసుకున్నాను ముందుగానే.  వేదిక మీద ఆయనకి అవకాశం రాగానే “అక్కిరాజు నా శిష్యుడేట నాకిప్పుడే తిలిసింది” అని ఆనంద పడ్డారు. నా బోటి శిష్యులు ఆయనకి కొన్ని వేలమంది ఉండి ఉంటారు. నా స్థాయి రచయితలు కూడా ఎందరో ఆయనకి ఏకలవ్య శిష్యులు.

 

 

(అక్కిరాజు భట్టిప్రోలు)

1986 కి 1989 కి మధ్య లొయోలా కాలేజీ లో BSc చదివాను నేను. మాకు తెలుగు ఒక్క సంవత్సరమే ఉండేది. నేను Maths main. మాకు మెట్టా వెంకటేశ్వరరావు మాష్టారు చెప్పేవారు తెలుగు.  ఆయన లేని సందర్భాల్లో సుబ్బరామయ్యగారు కాసుకు వచ్చేవారు.  పద్యాలు చెప్పాలంటే వెంకటేశ్వరరావు గారు, వచనం చెప్పాలంటే సుబ్బరామయ్యగారు అని అప్పుడే నిర్ణయించేసుకున్నాను.

అయితే సుబ్బయ్య మాష్టారు గొప్ప రచయిత అని నాకు ఆలస్యంగా తెలిసింది.  ఓ రోజు కాలేజీలో ఏదో పెద్ద మీటింగు నడిచింది.  ఫాదర్ ప్రిన్సిపల్ లాంటి వాళ్ళు మాట్లాడాక సుబ్బరామయ్య గారు మాట్లాడారు.  ఆయనకి ఓ మానరిజం ఉండేది. ఊరికూరికే జారిపోయే కళ్ళజోడు పైకి నెట్టుకోవడం.  మా కోతి గాంగ్ లో కూర్చుని నెను ఆయన ఎన్నిసార్లు పైకి తోస్తారో చూద్దాం అని లెక్క గట్టడం మొదలు పెట్టాను.

మా క్లాస్ మేట్ ఒకడు “ఒరే మాష్టారు కథలు రాస్తారు తెలుసా. ఆ కళ్ళజోడు మీద రాసిన కథ వేరే భాషల్లోకి అనువాద మయింది తెలుసా” అన్నాడు.

నేను స్కూలు నించే సాహిత్యం చదువుతూ ఉన్న వాణ్ణి.  చందమామ, మధుబాబు దాటి శ్రీశ్రీ వెర్రిలో పడి విద్యార్థి సంఘంలో పని చేసి, రావిశాస్త్రి తుఫాన్  తట్టుకుని, చలం మాయలో వెర్రెత్తిపోయి,   గొర్కీ  అమ్మ, షేక్స్పియర్ ఒథెల్లో, డికెన్స్ జంటనగరాలు లాటి తెలుగు  అనువాదాలు మిగిల్చిన వేదన భరించి అప్పుడప్పుడే కొడవటిగంటి ని చదువుతున్న రోజులు.  యండమూరి, కొమ్మనాపల్లి సీరియల్ సాహిత్యం కూడా ఇంకా వస్తూనే ఉండింది.  కానీ అప్పటిదాకా మాష్టారి పేరు నాకు తెలీదు.

మొదటిసారి అలా లొయోలా కాలేజీ లైబ్రరీ లోంచి ఆయన కథలు సంపాదించి చదివాను.  ఎక్కువసేపు పట్టలేదు, ఇంతకుముందు చదివిన కథలకీ వీటికీ ఏదో తేడా ఉందనిపించింది. ఏ ఇతర రచయితతో పోల్చాలా అని మధన పడ్డా. కాసేపు చాసో ఏమో అనిపించింది. కాదు చెకోవ్ మరింత దగ్గర అనిపించింది.

కథల్లో రచయిత చెప్పదల్చుకున్న దేమన్నా ఉందా? అలా పేద్ద కన్వాస్ మీద అన్నీ వివరంగా అమర్చి “నీ బాధ నువ్వు పడు” అని రచయిత తప్పుకున్నాడా అని చాలా సార్లు బుర్ర గోక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ మళ్ళీ  చదవాల్సి వస్తుంది. పదాల మధ్యలో, వాక్యాల మధ్యలో, సంఘటనల మధ్యలో, పాత్రల ప్రవర్తనల చీకటి కోణాల్లో దాక్కున్న నిగూఢ భావాల్ని అందిపుచ్చుకోవడానికి పాఠకుడు పడే కష్టం, మాష్టారు కావాలని పన్నే పన్నాగం అని నిర్థారణకి రవడానికి సమయం పట్టింది.  అదే ఆయన శైలి, దాని గొప్ప బలమూ!

నాకు ఇలాంటి అనుభవం కొన్ని సత్యజిత్ రే సినిమాలు చూసినపుడు కూడా కలిగింది. ఓ పాత్ర సామాజిక పరంగా, అన్ని లక్షణాలతో సంస్కార వంతుడిగా చలామణి అయి పోతూ ఉండొచ్చు. వాటి వెనక ఉండే చీకటి కోణాలు చూపించడం ఓ  సత్యజిత్ రే ఎంత మేధావో, మాష్టారు కూడా అంతే మేధావి.

‘కళ్ళజోడు’ కథలో కనపడే వాచ్యంగా చెప్పని అపరాధ భావన, అతి సంక్లిష్ట  పాత్రల మేళవింపు “పూర్ణాహుతి” అన్న కథ ఇందుకు చాలా చిన్న ఉదాహరణలు.

ఇలా రాయడానికి అమితమయిన పరిశీలనా శక్తి, అవగాహన అవసరం.

బ్రాహ్మడి పాత్ర జంధ్యంతో గోక్కుంటుంది. కల్లు కొట్టు గంగి పింగాణీ కంచంలో అన్నం తింటుంది. అందుకే ఆ పాత్రలకి అంత authenticity వస్తుంది.

ఏ పాత్రవైపూ వకాల్తా పుచ్చుకున్నట్టు రచయిత కనపడడు దాదాపు అన్ని కథల్లో. కానీ చిత్రంగా మన సానుభూతి ఎక్కడ వాలాలో అక్కడ వాలి, మన మేధ ఎక్కడ వ్యాయామం చెయ్యాలో అక్కడికి చేరిపోతుంది కథ అయ్యేటప్పటికి.

స్లోగనీరింగ్ లేక పోవటం మూలంగా నో ఏమో, మాష్టారుకు రావాల్సిన గుర్తింపు రాలేదని నా అనుమానం.  ఇప్పుడు అప్పాజోస్యుల అవార్డు రావడం. వెన్వెంటనే సాహిత్య ఎకాడమీ ఎవార్డు ప్రకటించడం  చాలా అనందంగా ఉంది. ఆలస్యంగా నయినా మాష్టారు సాహిత్యానికి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తాను.

 

డిసెంబర్  2012

 

 

 

 

 

 

 

.5 Responses to మా కళ్ళజోడు మాస్టారు పెద్దిభొట్ల!

 1. January 25, 2013 at 4:43 am

  నేనూ అదే బళ్ళో చదువుకున్నాను. కాకపోతే మాస్టారు ఒకట్రెండుసార్లు substitute గానే క్లాసు తీసుకున్నారు. కానీ ఆయన గొప్ప రచయితని అప్పటికే తెలుసు నాకు :)

 2. January 27, 2013 at 9:32 am

  “నీ బాధ నువ్వు పడు” అని రచయిత తప్పుకున్నాడా అని చాలా సార్లు బుర్ర గోక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుంది. పదాల మధ్యలో, వాక్యాల మధ్యలో, సంఘటనల మధ్యలో, పాత్రల ప్రవర్తనల చీకటి కోణాల్లో దాక్కున్న నిగూఢ భావాల్ని అందిపుచ్చుకోవడానికి పాఠకుడు పడే కష్టం, మాష్టారు కావాలని పన్నే పన్నాగం అని నిర్థారణకి రవడానికి సమయం పట్టింది. అదే ఆయన శైలి, దాని గొప్ప బలమూ!….ఈ వర్ణన కధ, కధనం లోని డెప్త్ ని తెలియజేస్తుంది.

 3. January 28, 2013 at 5:10 am

  మీ కళ్ళజోడు మాస్టారితో మీ అనుభవాలు బాగున్నాయి.

  ఆయన రచనలను దశాబ్దాలుగా పాఠకులు ఇష్టంగా చదువుతూనే ఉన్నారు. అంతకంటే గుర్తింపు ఏముంటుంది?

  సుబ్బరామయ్య గారి నవలల గురించి సాహితీలోకంలో ఎక్కడా ప్రస్తావనలు కనపడవు. ఆయన రాసిన నవలలను (దాదాపు 9 రాసినట్టున్నారు..) పున:ప్రచురించి పాఠకులకు అందించే మార్గం గురించి ఆయన అభిమానులందరూ పట్టించుకోవాలని నా సూచన.

 4. Wilson Sudhakar
  January 31, 2013 at 1:54 pm

  లొయోల కళాశాలలో ఆయన మాకి తెలుగు సబ్జెక్త్ చెప్పేవారు. నేనూ ఆయన శిష్యుణ్ణే

Leave a Reply to Wilson Sudhakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)