నేను చ్ఛందో బద్ధ కవిత్వం అనే పదం వాడను.ఛందోయుక్త కవిత్వం అంటాను.ఈ వ్యాసం యొక్క ఉద్దేశం చందస్సు తెలియని వారికి కొంత పరిచయం ఇవ్వటం, తెలిసినా వ్రాయటానికి జంకే వారికి కొన్ని సులభోపాయాలు ఇవ్వటం.
ఛందస్సు అంటే ఏమిటి? ఛందస్సు కూడా ఒక సంగీతం వంటిది.ఒక లయ.అక్షరాలని ఒకవిధమైన అమరిక లో ఉంచటం ద్వారా ఆ అక్షరాలు అసంకల్పితంగా ఒక లయని తయారు చేస్తాయి.అదే ఛందస్సు. ఇంతకీ ఛందస్సు కష్టమా? తేలికా? అంటే-”ఇది చాలా ఈజీ అనటం అహంకారమే అవుతుంది. నిర్లక్ష్యము అవుతుంది.”చాలా కష్టం” అంటే నేర్చుకొనే వారిని నిరుత్సాహ పరచటం అవుతుంది.కాస్తా కూస్తా కష్ట పడకుండా ఏ విద్యా రాదు. మన మొహం , మన శరీరం కాస్త అందం గా కనపడాలన్నా కాస్త కష్ట పడాలి.అలాంటిది మన కవిత్వం కాస్త అందం గా కనపడటానికి కాస్త కష్ట పడకుండా చాలా తెలిక , ఉఫ్ అని ఊదెయ్యటం మోసమే అవుతుంది.
“అక్షరాల లయ బద్ధమైన అమరిక ఛందస్సు” అని పైన పేర్కొన్నాము.అక్షరాలని శాస్త్రం గురు లఘువులుగ విభజించింది. ఒక లిప్త కాలం పట్టే అక్షరం లఘువు (మరో పరిభాషలో దీనినే మాత్ర అంటారు).దీనికి రెట్టింపు కాలం పట్టే అక్షరాలని గురువులు అంటారు.
గురులఘువులకి ఉదాహరణలు
లఘువులు= అ , ఇ, ఉ, క , ఖ, గ
గురువులు= ఆ, ఈ,ఊ, ఐ, ఔ, కా, ఖా, గా మొదలైనవి.
క్లుప్తంగా చెప్పాలంటే హ్రస్వాక్షరాలు లఘువులు. దీర్ఘాక్షరాలు గురువులు.
వీనితో పాటు హలంత అక్షరాలు గురువులు.. ఉదా= నన్ , నిన్, లన్, భుక్, సత్, చిత్ మొదలైనవి.
ఒక పదంలో ఉన్న సమ్యుక్తాక్షరానికి పూర్వం ఉన్న లఘువు గురువు అవుతుంది.
ఉదా= స్వస్థానము, వర్గము, పల్లవి . ఈ పదాలలోని మొదటి అక్షరాలు తమకి తాము లఘువులే అయినా ప్రక్కన సమ్యుక్తాక్షరాలు ఉండటం వలన మొదటి అక్షరాలైన స్వ, వ, ప అనే అక్షరాలు గురువులౌతాయి.ఇక్కడికి చందో
పరిజ్ఞానం లో మొదటి దశ అయ్యింది.
రెండవ దశ (గణాలు)
ఈ గురులఘువుల కూటమి లోని భేదాల వలన గణములు ఏర్పడతాయి.ఆ గణాలని గుర్తిణటానికి శాస్త్రకారులు ఒక సులభోపాయం చెప్పారు.అదే “యమాతారాజభానస ” అనే చక్రం.ఈ చక్రం లోని ఏదైనా ఒక అక్షరాన్ని తీసికొని ప్రక్కన ఉన్న రెండక్షరాలని కలిపితే ఆ మొదటి అక్షరమే ఆ గణం యొక్క పేరు. ఈ విధంగా చూస్తే
యమాతా వలే అమరిన మూడు అక్షరాల సమూహం యగణం
మాతారా = మగణం
రాజభా= రగణం
ఈ చక్రాన్నే సూత్రంగా చెపితే – సర్వగురువు మగణము. సర్వ లఘువు నగణము. ఆది మధ్యాంత గురువులు భ జ స లు.
ఆది మధ్యానత లఘువులు య ర త లు.
ఈ సూత్రం మూడక్షరాల గణాల వర్గీకరణకి ఉపయోగ పడుతుంది.
ఏకాక్షర గణాలు= ఒక లఘువు లేక ఒక గురువు. ఏకలఘువు లగణము. ఏక గురువు గగణము.ఒకే అక్షరాన్ని గణము అనక్కర్లేదు కానీ సౌలభ్యం కోసం ఇలా అనుకుందాము.
లగణానికి ఉదా= ల, క , అ . గగణానికి ఉదా+ శ్రీ, ఓం, తత్, సత్.
రెండక్షరాల గణాలు: ఒక లఘువు ప్రక్కన గురువు ఉంటే “లగము లేక వగణము”. ఒక గురువు ప్రక్కన లఘువు ఉంటే అది “హగణము”
నాలుగక్షరాల గణాలు :నగణము ప్రక్కన లఘువు ఉంటే నలము. నగణము ప్రక్కన గురువు ఉంటే నగము. సగణం ప్రక్కన లఘువు ఉంటే సలము.
ఇవి కాక ఇంద్రగణాలు సూర్యగణాలు అనే మరో విధమైఅన వర్గీకరణ ఉన్నది. ఇవి తేటగీతి, ఆటవెలది మొదలైన ఉపజాతుల రచనకి ఆసరం.
ఇంద్రగణాలు= నల, నగ, సల , భ , ర, త లు.
సూర్యగనాలు= హగణము, నగణము
ఇక్కడికి గణాలగూర్చిన వివరణ పూర్తి అయ్యింది.
మూడవ దశ-గణాల గుర్తింపు
ఇప్పుడు మనం ప్రాక్టీస్ లోకి వెడదాము.మొదట గణాలని గుర్తించటం అలవాటు చేసుకోవాలి.మొదట మూడక్షరాల గణాలతో ప్రారంభిద్దాము. ఈ గణాలు వృత్తాలలో వస్తాయి.పై సూత్రాల ప్రకారం యమాతారాజభానస చక్రం అంతా గీసుకోకుండానే గ ణాలని గుర్తించటం అలవాటు చేసుకోవాలి. “రాముడు,భీముడు, దేవుడు, సూర్యుడు ఈ పదాలని చూడగానే ఇవి భగణాలు అని గుర్తు పట్టాలి.ధనము, తెలివి, పరువు మొదలైన పదాలు చూదగానే నగణం అని తట్టాలి.మీ భార్య మిమ్మల్ని ఏమండీ ఆనగానే మగణం అని వెంటనే తట్టాలి. ఛందస్సు నేర్చుకొనే ప్రాథమిక దశలో మనం వినే చూచే పదాలన్నిటికీ గణాలు గుర్తించటం అలవాటు చేసుకోవాలి.ఉకోవాలి.ఇప్పుడు అధికంగా వాడుకలో ఉన్న కొన్ని వృత్తాల గణాలు చూద్దాము.
ఉత్పలమాల= భ ర న భ భ ర వ . యతిస్థానం 10 వ అక్షరం
చంపకమాల= న జ భ జ జ జ ర ‘ 11
మత్తేభం = స భ ర న మ య వ 14
శార్దూలం = మ స జ స త త గ 13
యతిప్రాసలు: ఛందస్సు రాగం అయితే యతిప్రాసలు తాళం వంటివి.ప్రతి పద్యానికీ ఒక యతిస్థానం ఉంటుంది. మొదటి అక్షరం లేక యతి మైత్రి కలిగిన ఒక అక్షరం ఆ యతిస్థానం లో ఉండటం వలన ఆ పద్యానికి ఒక తాళం ఏర్పడుతుంది.ప్రాస అంటే రెండవ అక్షరం.ప్రతి పాదం లోను రెందవ అక్షరం గా ఒకే హల్లు ఉండటం వలన ఆ పద్యానికి ఒక అందం వస్తుంది. ఒక్కొక్క వృత్తానికి ఐదారు పద్యాలు బట్టీ వేసి వాటి లయని గమనిస్తే వాటి లయ మీకు వంట పడుతుంది.
వృత్తాలు కాక జాతులు, ఉపజాతులు అనే రెండు రకాల ఛందస్సులు వాడుకలో ఉన్నాయి.
జాతులు ఉదా: కందము
కందపద్యానికి గణాలు గగ , నల , భ, జ , స లు.ఇవి ఇదే క్రమం లో ఉండాలని లేదు.జగణం బేసి గణం గా ఉండకూడదు. ఆరవ గణం తప్పక జగణం కానీ నలము కానీ అయి ఉండాలి. 7 వ గణం తొలి అక్షరం యతి. ప్రాస నియమం ఉన్నది. ఆరవ గణం , ఏడవ గణం అన్నప్పుడు పద్యం లోని పై పొట్టి పాదాన్ని దిగువన ఉన్న పొడుగు పాదాన్ని కలిపి లెక్కించాలి. పద్యం ఎప్పుడూ గురువుతో అంతం కావాలి. మొదటి అక్షరం నాలుగు పాదాలకీ గురువు లేక నాలుగు పాదాలకీ లఘువు అయి ఉండాలి.
ఉపజాతులు; వీటిలో ఇంద్ర గణాలు సూర్య గణాలు అనే వర్గీకరణ వస్తుంది.వీటికి ఉదాహరణలు తేటగీతి, ఆటవెలది, సీసము.
తేటగీతి: ఒక సూర్యగణము, రెండింద్ర గణాలు, రెండు సూర్యగణాలు. నాలుగవ గణపు మొదటి అక్షరం యతిస్థానం.
ఆటవెలది:ఒకటి, మూడు పాదాలలో వరుసగా మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాలు , రెండు నాలుగు పాదాలలో వరుసగా ఐదు సూర్య గణాలు.రెండు పాదాలలోనూ నాలుగవ గణపు తొలి అక్షరం యతిస్థానం.
సీసం: ఆరింద్ర గణాలు , రెండు సూర్యగణాలు ఉంటాయి కానీ దీనిని రెండు పాదాలుగా విభజించి మొదటి పాదం లో నాలుగు ఇంద్రగణాలు, రెండవ పాదం లో రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు గా వ్రాయటం సంప్రదాయం.రెండు పాదాలలోను మూడవ గణపు మొదతి అక్షరం యతిస్థానం.ఈ మూడిటిలోను ప్రాసయతి చెల్లుతుంది.ప్రాస నియమం లేదు.
ప్రాసయతి అంటే ఏమిటి?: యతి అంటే మనకి తెలుసు. ప్రాసయతి అనేది ఒక వెసులుబాటు. మొదటి అక్షరమే యతి స్థానం లో రావాలి అనే కఠిన నిబంధనకి బదులు పాదం లోని రెండవ అక్షరాన్ని యతి స్థానాని ప్రక్కనున్న రెండవ అక్షరం గా ఉంచితే సరి పోతుంది.
ఉదా: “రామ నామమ్ము పల్కుము రక్తి తోడ” అంటే యతి సరిపోయింది
“రామనామమ్ము పలుకుము ప్రేమ తోడ” అంటే ప్రాసయతి అయింది.
యతి మైత్రి అంటే ఏమిటి?:ప్రతి పద్యానికి ఒక యతిస్థానం ఉంటుంది.అయితే మొదటి అక్షరమే యతిగా ఖచ్చితంగా ఉండకపోయినా ఉచ్ఛారణలో ఆ అక్షరానికి దగ్గరగా ధ్వనించే అక్షరాన్ని వాడవచ్చు.అలా అనుమతింపబడిన అక్షరాలేవో ఈ దిగువన ఇస్తున్నాను.
అ ఆ ఐ ఔ
ఇ ఈ ఎ ఏ ఋ ౠ
ఉ ఊ ఒ ఓ
క ఖ గ ఘ
చ ఛ జ ఝ శ ష స
ట ఠ డ ఢ
త థ ద ధ
ప ఫ బ భ మ
న ణ జ్ఞ
ల ళ
ద డ
ర బండి ర
నాల్గవ దశ (పద్య రచన)
గణాలు, యతిస్థానాలు, ప్రాసలు గుర్తించే నేర్పు వచ్చాక పద్యం వ్రాసే ప్రయత్నం చెయ్యండి.ఇలా గుర్తించటం ఇక్కడ వ్యాసంగా వివరించటం లో వివరణ వల్ల ఏదో కష్టంగా కనిపించవచ్చు కానీ సాధనలో ఇది పెద్ద కష్టమేమీ కాదు. శాస్త్రీయ సంగీతం అభ్యసించని అనేకులు డ్రామా పద్యాలు విని ఇది కళ్యాణి, ఇది మాల్కోస్ , ఇది శ్రీ రాగం అంటూ చెపుతారు. మీలో భావనాశక్తి ఉంటే మీ భావాలని పద్యరూపం లోకి తీసుకు రండి.భావనాశక్తి కొంత మన సంస్కారం పైనా, మనం కావ్యాలు చదివిన అనుభవం పైనా ఆధారపడి ఉంటుంది.అది అలా ఉంచి ముందు పద్యం వ్రాయటం గూర్చి వివరిస్తాను.
1) మొదట ఉపజాతులైన తేటగీతి, ఆటవెలదులతో ప్రారంభించండి.ఈ చందస్సులలో వెసులుబాటు ఎక్కువ.చిన్న పద్యాలు.
2) తెలుగు వాచకం, లేక వార్తా పత్రికలోని వార్త లేక వ్యాసం తీసికొని దానిని పద్యం గా మార్చండి. పత్రికలో ఎక్కడొ “ఈ విషయం లో మన తెలుగు వాళ్ల తెలివి బయట పడింది” అనే వ్యాఖ్య ఉన్నదనుకోండి. కాస్త చమత్కారం గా ఆలోచిస్తే “తేట తెల్లమై పోయెను తెలుగు తెలివి” అన వచ్చు. ఈ పాదం తేటగీతి అయిపోయింది.
ఒకాయన ఒక పాన్ షాప్ వద్దకి వెళ్లి “ఆంధ్ర పత్రిక ఉన్నదా?” అన్నాడట.
రెండో ఆయన కాస్త ఛందస్సు నేర్చినాయన “ఆంధ్ర పత్రిక యిచ్చట అమ్మ బడును” అన్నాడు.
“అలాగా!” అన్నాడు మొదటి పెద్దమనిషి.
రెండో ఆయన మల్లీ ” ఆంధ్ర పత్రికయును నాంధ్రప్రభయు విశా
లాంధ్ర కూడ నిచట నమ్మబడును” అన్నాడు. ఈ రెండవ దైలాగ్ ఆటవెలది.
ఒక మిత్రునితో మీరు మాట్లాడటం ముగించి వెడుతున్నానని చెప్పాలి.అప్పుడు సరదాగా ఇలా అనండి- ” భోజనము చేయవలె నేను పోదు నింక”.పైకి అంటే ఎక్కిరిస్తారనుకుంటే లోపలే అనుకోండి. ఇది తేటగీతి. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చేటప్పుదు “వేడిగా నాలుగిడ్లీలు వేయవయ్య” “మంచి నీళ్ల గ్లాసొక్కటి ఉంచి పొమ్ము”, “బల్ల కాస్తంత తుడవరా పిల్లవాడ” బిల్లు తీసుకోవయ్య ఓ పెద్ద మనిషి” ఇలా తేటగీతి లో అదరగొట్టవచ్చు.
3) వేమన శతకం చదివితే ఆటవెలది వశమౌతుంది.సుమతీశతకం తో కందం కందకూర లాగా వంట పడుతుంది.దాశరధీశతకం లో అన్నీ చంప కోత్పల మాలలే.భాస్కరశతకం కూదా.
4)ఇంత సాధన చేశాక చందస్సు పై మీకు పట్టు వస్తుంది.శతకాల తరువాత భాగవతం చదవండి. తెలుగువారి అదృష్టం కొద్దీ మహానుభావుడైన పోతన ఎంతో లోతైన భక్తి, తాత్విక విషయాలని సులభమైన భాషలో వ్రాశారు.
5)సమస్యా పూరణలకి తప్పక ప్రయత్నించండి. ఛందస్సైతే తెలుసు కానీ దేనిని గూర్చి వ్రాయాలి? అనే సమస్యలో ఉన్నవారికి సమస్యా పూరణలు, దత్తపదులు ఏదో ఒక ఇతివృత్తాన్ని మెదడుకి తట్టేటట్లు చేస్తాయి.వీటి వల్ల పద్యరచనా సామర్ధ్యం పెరుగుతుంది.మీ కవితలో చక్కని చమత్కారశక్తి వస్తుంది.
6) ఛందోయుక్త కవిత్వం వ్రాసే వారికి పర్యాయపదాలు బాగా తెలిసి ఉండాలి.ఇవి ఎంతగా తెలిస్తే అంతగా గణాలని, యతిప్రాసలని సంతృప్తి పరచే శక్తి అంతగా పెరుగుతుంది.పాండవ కౌరవుల మధ్య యుద్ధాన్ని గూర్చి ఏదో రాద్దామని చిన్న తేటగీతి అందుకున్నారు.”పాండవులకు కౌరవులకున్” అనగానే ఒక బ్రేక్ పడుతుంది . అక్కడ యుద్ధం అని అంటే యతి సరిపడదు.పర్యాయపదాలు తెలిస్తే “పాండవులకు కౌరవులకున్ పవర మయ్యె” అంటారు. అలాగే రెండవ అక్షరం కలిసే పదాలని పద్యాలు చదువుతూ ప్రాసలలో గమనించాలి.కవనము, సవనము, పవరము,వివరము ఇలా. నిఘంటువు ఉండాలి. వ్యాకరణం తెలియాలి.
కేవలం ఎలాగో అలా పద్యం వ్రాయటం అనేది ప్రాథమిక దశ మాత్రమే.భావసౌందర్యం గల పద్యాలు వ్రాయటం ఉత్తమం.కవితాత్మకసౌందర్యం మాత్రమే కాకుండా మనం సమాజం లో జీవిస్తున్నందుకు సామాజికస్పృహ కూడా కలిగిన కవిత్వం వ్రాయటం అత్యుత్తమమైన కవిత్వం అవుతుంది.
చందస్సు లో ఏమీ తెలియని వారికీ , కొంత తెలిసినా కష్టంగా భావించేవారికీ ఇద్దరికీ ఉపయోగపడే ఉద్దేశంతొ ఈ వ్యాసం వ్రాయటం వలన కొంత నిడివి ఎక్కువ అయి యుండవచ్చు. ఎవరికి అవసరమైన విషయాన్ని వారు గ్రహించ గలరని భావిస్తున్నాను.
**** (*) ****
రవి గారు
చిన్నప్పుడు చదువుకున్న పాఠాలను జ్ఞప్తికి తేవడమే కాదు, ఒక సారి చందోబద్ధం గా కూడా ప్రయత్నించ వచ్చు అన్న నమ్మకం కలిగించారు.
అభినందనలు
నిజమే. అందరూ ‘ఛందోబద్ధ’ అంటున్నారు కదా అని మనమూ అట్లానే అనాలని రూలేం లేదు. మీ స్వతంత్ర ఆలోచనా శక్తికి అభినందనలు. అయితే ‘ఛందోబద్ధ’ తప్పేం కాదని నా అభిప్రాయం. ఛందోయుక్త అంటే ఛందస్సును కలిగి ఉన్నది కాగా ఛందోబద్ధ అంటే ఛందస్సుకు బద్ధమైనది/కట్టుబడినది. రెండింటి అర్థం దాదాపు ఒకటే. ఛందస్సహిత, ఛందః పూరిత మొదలైనవి కూడా వ్యాకరణపరంగా సరైనవే కాని ఆ పదబంధాలు ‘ఛందోయుక్త’ అంత బాగాలేవు.
పద్యరచన పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు ఈ రోజుల్లో తక్కువే. కారణం దాన్ని నేర్వాలంటే బాగా కృషి చేయాలి. కాని పద్యం అందం పద్యందే, వచనకవిత అందం వచనకవితదే. ఒకదాన్ని బాగా రాయగలిగినవాళ్లు మరొకదాన్నిబాగా రాయలేకపోవచ్చును. మీ వ్యాసం కొందరిలోనైనా పద్యరచన పట్ల ఆసక్తిని కలిగిస్తుందని
ఆశిద్దాం. దీన్ని రాసిన మీకూ, ప్రచురించిన సంపాదకులకూ అభినందనలు.
ధన్యవాదం విజయ బాబు గారు !
ఎలనాగ గారు ! మీ స్పందనకి ధన్యవాదం .
ధనికొండ రవి ప్రసాద్
వాకిలి పత్రిక లో ఈ నా వ్యాసం ప్రచురించిన సంపాదకులకి ధన్యవాదం .
బాగుంది. మీ వ్యాసములో “ప ఫ బ భ మ” లకు యతి కుదురుతుందన్నారు. అచ్చు తప్పేమో. “ప ఫ బ భ వ (మ కాదు)” లకు యతి కుదురుతుంది. కాని ఒక మినహాయింపు: “పు ఫు బు భు ము” లకు వాటి సమములైన “పొ ఫొ బొ భొ మొ” లకు యతి సరిపోతుంది.
చాలా సులువుగా చెప్పారు. చిన్నప్పుడు నేర్చుకున్నాను. మళ్ళీ మొదలపెడతాను.
ఒక చిన్న గమనిక = ఈ వ్యాసం లో ని మూడవ దశలొ యతిమైత్రి గల అక్షరాల జాబితాలో ప ఫ బ భ వ అని చదువుకోవాలి. మకారానికి సరాసరిగా దేనితోనూ యతిమైత్రి లేదు.అయితే బిందుపూర్వక మైన ప ఫ బ భ వ లతో సరిపోతుంది.
శ్రీ ధనికొండ వారికి నమస్కారము. ఛందోపరిచయం చాలా చక్కగా యున్నది. నాబోటి విద్యార్ధులకు అత్యంత ఉపయుక్తముముగా యున్నది. శైలి సరళము, మనసుకు హత్తుకొనేలా ఉన్నది. గణములను గుర్తించే సూత్రం “యమాతారాజభానసలగం” అంటే మరింత బాగుండేదని నాయభిప్రాయం. …. చొప్ప రవీంద్ర బాబు
చొప్ప రవీంద్ర బాబు గారికి నమస్కారం . మీరన్నట్లు “యమాతారాజభానసలగం” అని కూదా కొందరు ఈ సూత్రాన్ని చెపుతారు. అయితే యమాతారాజభానస అనేదానిలో ఒక సౌలభ్యం ఉన్నది. ఇది మూడక్షరాల గణాలు వృత్తాలలో వాడే గణాలవరకూ ఒక చక్రభ్రమణం గా సరిపోతుంది.”సయమా” అంటే సగణం.”స” ప్రక్కన “లగం” అనే అక్షరాలని చేర్చినప్పుడు “లగం యా ‘ అనే పదం లగణం కాదు.”గమ్యమా” అనేది గగణం కాదు. అక్కడ రెండక్షరాలనే తీసుకోవాలి అని విద్యార్ధికి మళ్లీ చెప్పలి. కాబట్టి అన్నీ మూడక్షరాల గణాలే ఉంచినట్లయితే అంతవరకూ ఈ చక్రం సరిపోతుంది.ఇక లగం, హగణము, ఇంద్ర సూర్య గణాలు వాటికి సూత్రాలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేర్చకున్నా ఇబ్బంది లేదు .మేము చందస్సు నేర్చినప్పుడు మా అధ్యాపకులు కూడా యమాతారాజభానస వరకే చెప్పి మిగిలిన సూత్రాలు వేరుగా చెప్పారు.దానిని చక్రం గా వర్ణించారు. అక్కడ లగం అని పెడితే చక్రం గా ఉండదు. సరళరేఖా గమనమే ఉంటుంది. ఆ ఉద్దేశం తోనే మా అధ్యాపకుల మార్గాన్ని ఎంచుకొన్నాను.ధన్యవాదం .
ఛందస్సు నేర్చుకోవాలి అనే వారికి మంచి విషయాలు వివరించారు. ఆటవెలది నేర్చుకోవాలి అనుకునేవారికి ఇవి చాలా ఉపయోగకరమైనవి.
నమస్కారం.
గురువు గారూ!
వ్యాసము ఆద్యంతము ఆసక్తికరంగా ఉంది.
దైనందిన జీవితంలో పనులలో…సంభాషణలలో
అప్పటికప్పుడు పద్యపాదాలను అల్లే ఉదాహరణలు నాకు నచ్చాయి.ధన్యవాదములు.
ఛందస్సు నేర్చుకోవాలి అన్న నా తపనకు దొరికిన సులభమైన మంచి అవకాశం గా భావిస్తున్నాను రవి గారు ధన్యవాదాలు.