ఇంకో పూవు

కైవల్యం

ఫిబ్రవరి 2013

జీవితంలో కొన్ని మలుపులు మన ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేస్తాయి. ప్రాపంచిక విషయాలలోని లోటునీ, అసంపూర్ణతనీ గుర్తించడం వల్ల ఏర్పడే మలుపులు కొన్నయితే,   ఓ సంఘటనో, సద్గురువో మనకి ఎదురవడం వల్ల కలిగిన క్రొత్త  అవగాహనతో ఏర్పడేవి మరికొన్ని. బహుశా మొదటివి వైరాగ్యానికీ, రెండోవి జ్ఞానానికీ బీజాలు వేస్తాయేమో!

అలాంటి ఒక మలుపులో వ్రాసిన కవిత “కైవల్యం”. వ్యక్తిగతంగా నా జీవితాన్ని గురించీ, మనసుని గురించీ,  అలాగే ప్రపంచాన్ని గురించీ అంతకు ముందు కలిగిన భావాలు వేరు. ఆ తర్వాత కలుగుతున్న భావాలు వేరు. ఆ వ్యత్యాసాన్ని ఈ పుస్తకంలో పట్టి వుంచుదామన్న వుద్దేశ్యంతోనే బాగా పాతవైనప్పటికీ, ‘కైవల్యం‘ కి ముందు వ్రాసిన నాలుగు  కవితల్ని కూడా యిందులో చేర్చడం జరిగింది. అవికాక మరొక పాతిక కవితలు.

***

పై వాక్యాలు “కైవల్యం” కవితా సంపుటి మొదటి పేజీలలో ఈ సంపుటి యొక్క నేపథ్యాన్ని వివరిస్తూ నేను వ్రాసినవి.

నా మొదటి కవితా సంపుటి ‘రేవు చూడని నావ’ 1996 లో ప్రచురించబడింది. మళ్ళీ ఇప్పుడు పదిహేనేళ్ళ తర్వాత రెండో కవితా సంపుటి వెలువడింది. ఈ పదిహేనేళ్ళలో వ్రాసిన అన్ని కవితలూ ఈ సంపుటి లో చేర్చలేదు.

ఈ రెండు సంపుటాలలోని కవితలనీ గమనిస్తే నాకొక విషయం అర్ధమయింది.

‘రేవు చూడని నావ’ లోని కవితలు ఒక స్పందననో, భావాన్నో, ఊహనో అందరితో పంచుకుని ఆనందించిన సందర్భాలు.

‘కైవల్యం’ లోని కవితలు… ‘స్పందన’ని కాదు “ఆనందాన్నే” పంచుకునే ప్రయత్నం. భావాన్ని కాదు అనుభవాన్ని వివరించడం. ఊహని కాదు వాస్తవాన్ని చెప్పాలనుకోవడం.

ఇక్కడ కవిత రాయకముందే ఆనందం వుంది. అది గుండెలో పట్టక పొంగి పొర్లినపుడు  అక్షరాలుగా ఒలికిపోయింది.

‘కైవల్యం’ సంపుటి విడుదలయ్యాక అట్టమీద బొమ్మ చూసీ, పుస్తకం పేరు చూసీ కొందరు… భక్తిని కవిత్వంగా తాము అంగీకరించమనీ, భక్తి కవితలు వ్రాయడంలో సృజనాత్మకత లేదనీ, అది ‘ఆధునిక కవిత్వం’ నిర్వచనంలో ఇమడదనీ అన్నారు. ‘ఇలా వ్రాస్తే నిన్ను భక్తురాలు అంటాం కానీ కవయిత్రి అనము ‘ అన్నారు. ‘అంతకంటే భాగ్యమా!’  అనుకున్నాను నేను.

“నిజమైన భక్తులూ, దేవుడూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళందరూ బలవంతంగానైనా నన్ను భక్తుల జాబితాలో చేర్చేసేలా ఉన్నారు కదా!, ఇదేదో బానేవుంది” అని ఆనందపడ్డాను.

అయితే ఆ ఆనందంలో నేను స్థిరపడే లోపల… మరి కొందరు ముఖచిత్రం తోనూ, శీర్షిక తోనూ సరిపెట్టుకోక.. పుస్తకం తెరిచి లోపల ఏముందో చదివారు.  చదివి…”కవితలు బావున్నాయ”న్నారు.

నేను ఆలోచనలో పడ్డాను. దీనిని భక్తులు “కవిత్వం” గానూ, కవులు “భక్తి” గానూ భావిస్తున్నారా! అని సందేహం వచ్చింది. భక్తులు భక్తిగానూ, కవులు  కవిత్వంగానూ గుర్తిస్తే  బాగుండుననే  కోరికా పుట్టింది.

 

పున్నమి రోజునా సగం చంద్రుడే కనిపిస్తూన్నపుడూ/యుగళగీతాలలోనూ ఒక్క స్వరమే వినిపిస్తూన్నపుడు/ – వంటి వ్యక్తీకరణలనీ

రాశీభూత జ్ఞానమనుకునేవారూ తమని తాము ప్రకటించుకునేందుకు రూపనామాలనే ఆశ్రయిస్తారు/ – వంటి పరిశీలనలనీ

ప్రపంచాధిపత్యాన్ని కోరుకోమని ప్రాధేయపడతాను/నామనసు ఒప్పుకోదు/ఓ పురుషోత్తముడి పాదాలు వత్తాలని వుందని దీనంగా అడుగుతుంది/ – వంటి భావనలనీ

అలంకారప్రియుడివంటూ నిన్నూ/అమాయకురాలినంటూ నన్నూ ఆడిపోసుకుంటారు – వంటి చమత్కారాలనీ

నామనసే భ్రమరమై వెళ్ళి వాటిపై వాలిందో/అవే చిలిపిగా రసగంగను నాపైకి చిమ్మాయో/ – వంటి అనుభూతులనీ

నా చుట్టూ వెలుతురున్నంత సేపూ నాతో ఇలాగే ఆడుకుంటుంది/అది నిస్సహాయంగా చేతులెత్తినపుడే నాలోని వెలుగు నాకర్ధమవుతుంది/ – వంటి తాత్విక చింతనలనీ

ఇంకా.. ‘రెండు మార్గాలు’ వంటి కవితలలోని నిగూఢాంశాలనీ, ‘సాధన’ వంటి కవితలలోని  సందేశాన్నీ, ‘నాకు కావలసిందే’ వంటి కవితలలో శీర్షిక నుండీ ముగింపు వరకూ అంతర్లీనంగా సాగిన ధ్వనినీ,  కవులూ భక్తులూ కూడా గమనించి ఆనందించాలన్న ఒక చిన్న ఆశా కలిగింది.



One Response to కైవల్యం

  1. nsmurty
    January 26, 2013 at 6:45 am

    శ్రీవల్లీ రాధికగారూ,

    తమకే తెలియని తమ తాత్త్విక చింతనని, Ph.D. పేరుతోనో, M. Phil పేరుతోనో విద్యార్థులచే పరిశోధనా వ్యాసాలుగా ప్రకటించుకునే యూనివర్శిటీ అధ్యాపకులున్న నేపథ్యంలో, మిమ్మల్ని మీరు నిజాయితీగా అంచనా వేసుకోవటం నిజంగా ఒక గొప్ప ప్రయత్నమే. నిజానికి, రచయితకన్నా (ఇందులో రచయిత్రులుకూడా ఉన్నారు) ఇంకెవరూ వాళ్ళని కూలంకషంగా మూల్యాంకనం చేయలేరు. కాకపోతే తాత్త్వికత, సంతతాభ్యసనశీలుడైన రచయితలో కాలంతో పాటే వచ్చే పరిపక్వత. కనుకనే ప్రాథమిక రచనలకీ, కొంత మేథోపరిణతివచ్చిన తర్వాత రచనలకీ వాశిలో తేడా ఉంటుంది. కవిత్వం అంటూ రచనలో ఉండాలి గాని, అది వస్తు, పద, నిర్మాణ, పరిధుల్ని దాటి తన్నుతాను ప్రకటించుకోగలదు. గణితశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే మహా అయితే ఇవన్నీ , Necessary Conditions తప్ప Sufficient Conditions కావు.

    మీ రచన గురించి మీ అభిప్రాయాలు మన్నించదగ్గవి. సందేహం లేదు.

    హృదయపూర్వక అభినందనలు.

Leave a Reply to nsmurty Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)