కథ

పునర్నిర్మాణం

జనవరి 2016

‘ప్రళయభీకరమైన తుఫానొచ్చి వెళ్లేక మీ విశాఖ ఎలా ఉందో చూడాలనుంది…’ అంటూ ఫోన్చేసింది సుశీలా నాయర్.ఈవిడకీ వైజాగు పిచ్చి ఏమిటో నాకర్థం కాదు. ఆ మాటే ఆమెతో అంటే, బొంగురు గొంతుతో గలగలా నవ్వింది.’నీకు లేదా నీలి సముద్రం పిచ్చి? పిచ్చివాళ్లకు తమ సంగతి తమకు తెలియదుట. అలాగే ఉంది నీ వ్యవహారం కూడా…’ అంది. ఆవిడ మాటల్లో నిజమెంతో తెలుసు కనుక నేనూ నవ్వేశాను.

‘ఎవరైనా అందమైన ప్రదేశాలను మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు చూద్దామనుకుంటారు. మీరేంటండి బాబూ… తుఫాన్లు, భూకంపాల తర్వాత, ఉగ్రవాద దాడుల తర్వాత… అంటూ చూడ్డానికి వెళుతుంటారు.. ఇది మాత్రం కచ్చితంగా పిచ్చిపనే… దానికేమంటారు?’ అనడిగాను.

‘ప్రకృతిని, పచ్చటి పరిసరాలను గమనించడం, అందమైన దృశ్యాలను, స్థలాలను నా కెమెరాలో బంధించడం… ఇంకా ఎంతోమందిలో చూడాలన్న తపన కలిగేలా వాటి గురించి రాయడం.. ఇదంతా నా వృత్తి. కాదనను. కాని గిరికా, నువ్వెప్పుడైనా ఆలోచించావా…. భూమ్మీద పుట్టినప్పటి నుంచి మనుషులు ఎంత పని చేస్తున్నారో… ఎంత శ్రమిస్తున్నారో? భౌతిక సదుపాయాలను కల్పించుకోవడం కోసం, జీవితాన్ని సుఖవంతం చేసుకోవడం కోసం, తెలియని విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ప్రయాణాన్ని గమనిస్తుంటే నాకు గొప్ప ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా?’

ఈ మాటలంటున్నప్పుడు కళ్లు సగం మూసుకుని, తృప్తి అనే మాటకు పర్యాయపదంగా నిలబడే ఆవిడ ముఖం ఎలా ఉంటుందో ఊహించగలిగాన్నేను.

‘ఏదైనా విధ్వంసం – అది ప్రకృతి సృష్టించిందా, మనుషులు చేసిందా అని కాదు.. ఏదైనా సరే, దానితర్వాత మనుషులు, ప్రకృతి – ఒక్క మాటలో చెప్పాలంటే తమనుతాము మళ్లీ నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు చూడు.. దాన్ని నా కళ్లతో చూడాలి, నా మనస్సుతో అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలోని జీవనకాంక్ష, క్రియేటివిటీ నాకు అత్యద్భుతమైన ఏదో సత్యాన్ని తెలియచెపుతున్నట్టు ఉంటాయి…’ అందావిడ.

‘అబ్బా.. అంత పెద్ద విషయాలను నేను ఆలోచించలేనండి. మనిషి ప్రయాణం ముందుకెళుతోందో, వెనక్కెళుతోందో, దానికి వాళ్లను పురిగొల్పేవేమిటో, అందులో వాళ్లు చూపించే క్రియేటివిటీ… ఇవన్నీ నాకెందుకు? మీ ప్రయాణం సంగతి చెప్పండి ముందు. ఎప్పుడొస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తారు? ఇవి చెప్పండి చాలు…’ అన్నాను.

అంత విసుక్కున్నా, ఆవిడ పరిశీలనలో నేనూ భాగమవుతానని ఆవిడకీ తెలుసు. అందుకే తేలిగ్గా నవ్వి ఆ వివరాలన్నిటినీ చెప్పింది.

వచ్చిన రోజు మధ్యాహ్నం రెండు గంటల వేళ.. విమానం దిగుతూనే తుఫానుకు ఛిన్నాభిన్నమైన ఎయిర్‌పోర్టును చూసి ఆశ్చర్యపోవడం మొదలెట్టింది.

‘వైజాగ్‌ని స్లీపింగ్ సిటీ అని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమవుతోంది సుమా…. ఇంత చిన్నదాన్ని మళ్లీ కట్టడానికి ఆర్నెల్లా….’ అంటూ నోరు తెరిచేసింది.

‘కూలిపోయినవాటిని బాగుచేసుకోవడంలో మనుషుల ఆశ, క్రియేటివిటీ బయటపడతాయి… వాటిని నేను చూడాలీ… అన్నారుగా. అసలు ఇక్కడి వాళ్లకు అలాంటి లక్షణాలుంటే కదా బయటపడేవి. మా ఊరు స్లీపింగ్ సిటీ, మా జనాలు స్లీపింగ్ బ్యూటీలు.. వాళ్లు నిద్దర్లేచి ఇవన్నీ సర్దుకునేదాకా ఇక్కడే ఉండండి…’ అని ఆటపట్టిస్తూ పార్కింగ్ వైపు కదిలాను.

అక్కణ్నుంచి ఇంటికెళ్లేదాకా దారికిరువైపులా కూకటివేళ్లతో పెకలించుకుపోయి కూలిపోయిన మహా వృక్షాలనీ, నేలకు జీరాడేలా వంగిపోయిన చెట్లనీ, ఆకన్నదే లేకుండా మోడువారి పోయినవాటినీ చూస్తూ నిశ్శబ్దమయిపోయింది సుశీలా నాయర్.

నేనేం కదిలించలేదు. కారు ఎన్ఏడీ జంక్షన్ దాటి, ఎన్ఎస్‌టీఎల్ గేటు దగ్గరకు రాగానే ‘కారాపు కారాపు’ అని గోలచేసింది.

ఆపగానే కెమెరా తీసుకుని దిగింది. ఎన్ఎస్‌టీఎల్ ప్రహరీగోడకు అటువైపు భవనాలున్నట్టే తెలియనివ్వకుండా అంతెత్తున పెరిగిన చె ట్లు తుఫానుకు నేలకూలిపోయాయి. దాంతో బట్టల్లేకపోతే బిడియపడుతున్న చిన్నపిల్లల్లా కనిపిస్తోంది లోపలి భవనం. ఈవిడ కెమెరా అటు తిప్పుతుంటే నాకు భయమేసింది. అసలే అది నేవీ వాళ్ల ప్రయోగశాల. ఇలా ఫోటోలు తీస్తున్నట్టు తెలిసిందంటే అక్కడే పట్టుకుని చితగ్గొడతారు. కాని సుశీలగారి కెమెరా గోడకు ఇటువైపునే, పేవ్‌మెంట్ పక్కకే, నేల మీదకు ఫోకస్ అవడం చూసి హమ్మయ్య అనుకున్నాను.

చూస్తే… అక్కడ పడిపోయిన ఒక పెద్ద రావిచెట్టుకు చిన్నచిన్న లేత చిగుళ్లొస్తున్నాయి. వాటి పచ్చదనం ఎంతందంగా ఉందో మాటల్లో చెప్పలేను. కాండం నుంచి చిన్నగా వస్తున్న వాటిని తన కెమెరాలో బంధించడం పూర్తయ్యాక ఆమె మొహంలో మొదటిసారి నవ్వు మొలిచింది.

‘ఇదే ప్రకృతి. ఇదే జీవితం… చెబితే విన్నావా? ఈ లేత చిగురును చూసిన ఆనందం ముందు మరేదీ సాటిరాదు కదా…’ అని గెంతినట్టుగా కార్లోకి దూకి కూర్చుందావిడ.

నవ్వి కారును ముందుకు పోనిచ్చాను.

‘సిటీ దర్శనం అయ్యాక ఈసారి బొజ్జన్నకొండకు మరోసారి వెళ్లాలి గిరికా….’ అన్నది.

సాయంత్రం విషయం చెబితే ‘ఎన్నాళ్లబట్టీ అనుకుంటున్నానో బొజ్జన్నకొండ చూడాలని… నేనూ వస్తానువోయ్ గిరికమ్మతల్లీ..’ అంటూ రామినాయుడు కూడా ఉత్సాహపడ్డారు.

‘మా మళయాళీ మేడమ్‌కి వచ్చిన తెలుగే అంతంత మాత్రం. మీ శ్రీకాకుళం వెటకారం ఆవిడకి అర్థమవదు… అయితే బాగుండదు..’ అని జాగ్రత్త చెప్పాన్నేను.

‘అచ్చిచ్చీ… నేనెంత బుద్దిమంతుణ్నో నీకు తెల్సుగదేటి. ఎక్కణ్నుంచో ఒచ్చినోళ్లతో మనకేటి ఎటకారాలు చెప్మీ…’ అన్నాడు. ఆయన మాటల్లో శ్రీకాకుళపు యాసా, వ్యంగ్యమూ గొప్ప అందంగా అమరుతాయి. కిందటిసారి వచ్చినప్పుడు సుశీలగారు ‘విధ్వంసాల తర్వాత మానవ జీవితం..’ అని ఏదేదో సీరియస్‌గా ఒక ప్రసంగంలా చెప్పుకుంటూ పోతుంటే ఈయన నా చెవిలో ‘ఏటీవిడ గోల. మనిసివాల పోతే రేపటికి రొండు.. బతికున్నప్పుడు లెక్కలేదంటగాని పడిలేచాక చూస్తదట… ఆవిడకి బుద్దిలేప్పోతే నీకైన ఉండొద్దా సెప్మీ’ అని వెటకరించాడు. ఆవిడకు అర్థమై గొడవ పడుతుందేమోనని నాకు భయం.

మర్నాడుద యాన్నే బొజ్జన్నకొండకు మా ప్రయాణం మొదలైంది.

దారి పొడుగునా ఆవిడా రామినాయుడూ విశాఖ చుట్టుపక్కల బౌద్ధం విలసిల్లిన తొట్లకొండ, పావురాళ్లకొండ, బావికొండ వంటి ప్రదేశాల గురించి, అక్కడ దొరికిన ఆనవాళ్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేరు.

నేను ఆ చరిత్రనంతా పెద్దగా చెవినేసుకోకుండా… రోడ్డుకిరువైపులా కోతకొచ్చిన వరి పొలాలను, అక్కడక్కడా ఉన్న చెరుకు పంటనూ చూస్తూ ఊ కొడుతున్నాను.

చుట్టూ మావిడి చెట్లు, అశోక చెట్లతో ఉన్న ఒక తోట వంటి ప్రదేశం వచ్చింది. అక్కణ్నుంచి బొజ్జన్నకొండ పైకి మెట్లున్నాయి. కారు దిగిన సుశీలా నాయర్ మౌనంగా కొండ ముందు నిలబడింది.

‘స్తూపాలు సూడాలంతె మెట్లెక్కి ఎల్లవలిసిందే. టిక్కెట్టుగిక్కెట్టు ఏటీనేదు…’ అంటూ అక్కడ చీపురుతో ఎండుటాకులను శుభ్రం చేస్తున్న ఒకామె చెప్పింది.

ఆమె తప్పితే అక్కడ మరో మనిషి అలికిడి లేదు.

‘ఇక్కడ అప్పన్న ఉండాలి కదా.. ఆమె ఏదీ?’ అడిగాన్నేను కుతూహలంగా.

‘అప్పన్నా, అది మా అప్పే. మా గుంటణ్ని స్కూలుకి పంపీసి ఒస్తాది. అప్పన్నొచ్చేక నానెలిపోతాను. మీకది తెలుసేటి?’ అడిగిందామె అంతే ఆసక్తిగా మమ్మల్ని చూస్తూ.

తెలిస్తే ఎలాగ తెలుసో చెప్పాలి. అది నాకిష్టం లేదు.

‘సరేలే, కొండమీదికెళ్లొస్తాం…’ అని పైకి దారి తీశాను. సుశీలనాయర్, రామినాయుడు నన్ను అనుసరించారు.

బుద్ధుడి శరీరంలోని ఎముకనొకదాన్ని భరిణలో పెట్టి బొజ్జన్నకొండ స్తూపంలో భద్రపరిచారని, దాంతో పాటు ఎన్నో ఏళ్ల కిందటి మట్టిపాత్రలు దొరికాయని చెబుతోంది అక్కడ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెచ్చులూడుతున్న బోర్డు. అంతకుమించి ఆసక్తికరమైన వివరాలేమీ లేవక్కడ.

మెట్లెక్కేసరికి ఆయాసమొచ్చేసింది. సుశీలానాయర్ మాత్రం తన గున్న శరీరాన్ని పిచికలాగా గెంతులేయించి చకచకా తిరుగుతూ ఫోటోలు తీసుకోవడంలో ములిగిపోయింది.

అక్కడ ఒక గుహలో బుద్ధుడి విగ్రహం ఉంది, దాని ముందు మట్టి ప్రమిదల్లో నూనె పోసి ఎవరో వెలిగించిన దీపాలు రెండు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. విగ్రహానికి పసుపూకుంకుమా పూసి ఉన్నాయి.

‘ఈ విచిత్రం చూసేవా? ఏ బుద్ధుడైతే విగ్రహారాధన వద్దని చెప్పాడో, జీవితమంతా పూజలను నిరసించాడో ఆ బుద్ధుడికే విగ్రహం ఉండటం? పైగా దానికి పూజలు…’ అంటూ గలగల్లాడింది సుశీల.

‘అదేదో మా వైజాగువాళ్లొక్కళ్లే చేసినట్టు నవ్వుతారేంటి? అప్ఘనిస్తాన్ మొదలుకొని అన్నిచోట్లా బుద్ధుడికి నిలువెత్తు విగ్రహాలున్నాయి. పైగా రకరకాల భంగిమల్లో. చైనా బుద్ధుడికి చిన్న కళ్లుంటాయి, జపాన్‌లో బుద్ధుడు పొట్టిగా ఉంటాడు… ఏ దేశానికా బుద్ధుడన్నమాట…’ ఉడుక్కున్నాడు రామినాయుడు.

ఆవిడ కయ్యిమంటుందేమో అనుకున్నానుగాని ఏదో ఆలోచనలో పడింది.

‘బుద్ధుడే కాదు, ఏ గొప్ప వ్యక్తికైనా ఇది తప్పదనుకుంటాను. వాళ్లు చెప్పిన మార్గంలో నడవడానికి మనకెన్నో అడ్డంకులుగాని, బొమ్మ పెట్టి పూజచేసి, అవతలివాళ్లను భగవంతుణ్ని చేసెయ్యడానికి మనం సిద్ధంగా ఉంటామనుకుంటా…’ అన్నదావిడ.

కొండనంతా చుట్టొస్తూ ఉంటే రామినాయుడు దేన్నో చిన్నగొంతుతో పాడుకుంటూ ఉండటం వినిపిస్తోంది.

బొజ్జన్నకొండ పైనుంచి చూస్తే చుట్టూ ఎన్నో ఎకరాల మేర విస్తరించిన పంట పొలాలు కనిపించాయి. చాలావాటిలో కోతలు జరుగుతున్నాయి. కూలీల కోలాహలం, ట్రాక్టరు చప్పుళ్లు కొండ మీది నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడూ పగలగొడుతున్నాయి.

పౌష్యమాసపు ఉదయం పదిగంటల వేళ ఎండ, గొడుగులాంటి ఆకాశం, చుట్టూ ఆవరించిన వరిచేలు, దూరాన నల్లగా కనిపిస్తున్న కొండలు, ఎదురుగా స్తూప శిధిలాలు…. పెద్ద రంగుల చిత్రంలో నేనొక పిక్సెల్‌నయిపోయినట్టు అనిపించింది!

అంతా తిరిగి వచ్చాక సుశీలానాయర్ నిశ్శబ్దంగా నా పక్కన కూర్చుంది.

‘గిరికా, ఇలాంటి ప్రదేశాలకు ఎందుకు వెళ్లాలో ఎప్పుడైనా ఆలోచించావా?

నేనేం మాట్లాడలేదు. సమాధానం ఆవిడే చెబుతుందని తెలుసు.

‘చిన్న ప్రదేశాల్లో, ఇరుకిరుకు ఆలోచనల్లో పడి కొట్టుకుపోతుంటాం మనం నిత్యం. అప్పుడప్పుడూ ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మన మేథ గొప్ప విషయాల గురించి ఆలోచిస్తుంది. విశాల విశ్వంలో మనమూ ఒక భాగమన్న ఎరుక కలుగుతుంది. సముద్రం ముందు నిల్చున్నప్పుడు నీకిది అనుభవానికి రాలేదూ? శాశ్వతమైన వి ఏవో, కానివేవో మనకిలాంటి సందర్భాల్లో బోధ పడుతుంది కదా…’

అవునన్నట్టు తలూపాను నేను.

రెండు గంటల తర్వాత మేం కిందకొచ్చేసరికి ఇదివరకు ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న ఆడమనిషి మరో మూల ఇంకా తుడుస్తూనే ఉంది.

‘నీల్లుగాని కావాలేటమ్మ తాగనానికి?’ అనడిగింది పక్కనున్న కుండని చూపిస్తూ. వద్దన్నాన్నేను. ‘అయితేవూరునించి ఒచ్చినారమ్మ…’ అని మరో ప్రశ్న వేసింది.

‘నేనిక్కడే వైజాగునించి. ఆ సంచి పట్టుకున్నాయనది శ్రీకాకుళం. అదిగో ఫోటోలు తీస్తోంది చూడు.. ఆవిడది మాత్రం బెంగుళూరు… ఫోటోలు తీసి, ఈ ఊరు గురించి పెద్దపెద్ద పత్రికల్లో రాస్తుందావిడ…’ అని చెబుతూ ఉండగా అప్పన్న రావడం కనిపించింది.

‘ఎవలితో మాట్లాడుతున్నవే ఓలమ్మి…’ అంటూ వచ్చిన అప్పన్న మమ్మల్ని చూసి ఒక్క క్షణం అలా నిలబడిపోయింది. అంతలోనే తేరుకుని ‘బాగున్నారా అమ్మగోరూ…’ అంటూ పలకరించింది.
ఆమెని చూసి సుశీల చెంగుమని ముందుకు గెంతింది.

అంతగా ప్రసిద్ధికెక్కని బౌద్ధక్షేత్రాల గురించి పరిచయం చెయ్యాలన్న తలంపుతో తిరుగుతూ కిందటి వేసవిలో సుశీలానాయర్ ఇక్కడికీ వచ్చింది.

ఆరోజు నాకింకా గుర్తుంది.

అప్పుడు మేం వచ్చేప్పటికి అప్పన్న ఆ తోటను శుభ్రం చేస్తోంది, పద్నాలుగేళ్ల పిల్ల ఒకత్తి ఎగిరెగిరి దూకుతూ మావిడికాయలు తెంపడంలో బిజీగా ఉంది. అప్పుడు మేం వచ్చినప్పుడు మంచినీళ్లిచ్చి, ఆ పిల్ల మావిడికాయలిచ్చింది.

‘పైకెల్లాలంటే మెట్లున్నాయి. ఇక్కడ గేటు తాలాలు తియ్యడానికి మరో పదినిమిసాలు పడుతుంది. అందాకా ఇక్కడ కూచోండి.. అదయ్యాక శివుడి గుడికీ ఎల్లాలి… కావాలంటే నేనూ ఒచ్చి చూపిస్తా…’ అని చెప్పింది.
సుశీలానాయర్ ‘చదువుకుంటున్నావా’ అనడిగితే అవునంది.

‘అయితే నీ గురించి నువ్వు ఇంగ్లీషులో చెప్పు…’ అనగానే తడుముకోకుండా ‘మై నేమీజ్ కొండతల్లి. ఐయామ్ స్టడీయింగ్ టెంత్ క్లాసిన్ గవర్నమెంట్ హైస్కూల్. నౌ కమింగ్ టు ఇంటర్మీడియెట్. మై మదర్స్ నేమీజ్ అప్పన్న, మై ఫాదర్స్ నే మీజ్ చెల్లయ్య. దే ఆర్ కూలీస్….’ అని గడగడా చెప్పేసింది.

‘హౌ స్మార్ట్ షీ ఈజ్…’ అని నాతో అంటూ ఇంకా సుశీల ఏదో అడగబోతోంది, పైకి వెళదామని చప్టా మీద నుంచి లేచాం… అంతే… చెట్టు పైనుంచి సరిగ్గా కొండతల్లి మీదకు ఒక పెద్ద పాము పడింది!
పామని తెలుసుకుని విదిలించేలోపే ఆ పిల్ల తల మీదా, నుదుటి మీదా రెండుసార్లు కాటేసి జరజరా పాకి కిందకొచ్చి మాయమైపోయింది.

నేనూ సుశీలా కీచుగా అరిచాం. కొండతల్లి ‘అమ్మా… ఓలమ్మా… పాము కరిసీసినాదే అమ్మా….’ అంటూ విరుచుకు పడిపోయింది. అప్పన్న చీపురు పారేసి వచ్చింది, ముగ్గురం సాయం పట్టి పిల్లను కార్లోకెక్కించి దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాం.

బొజ్జన్నకొండ కిందున్న శంకరం గ్రామం దాటితే అనకాపల్లి ఊళ్లోకి పది నిమిషాల ప్రయాణం… కొండతల్లి గొంతులోంచి వెలువడుతున్న గురక లాంటి శబ్దం, అప్పన్న భయంకరమైన ఏడుపు, సుశీల చెమట్లతో కారు నిండిపోయి ఊపిరాడనట్టనిపించింది.

డాక్టరు చూసి పెదవి విరిచేశాడు. ఆ కాస్త సమయంలోనే ఆ పాప శరీరం రంగు విరిగిపోయింది, వేడి చల్లబడిపోయింది…!

కాస్త సమయమంటే ఎంత? గడియారం లెక్క ప్రకారం పట్టుమని పది నిమిషాలు. కాని మాకది షాకులాగా జీవితమంతా నిలిచిపోయిన సమయం. అప్పన్న జీవితం రెండు ముక్కలుగా విరిగిపోయిన సమయం.

కబురు తెలిసిన వెంటనే వాళ్ల బంధువులు, వీధిలోని ఇరుగూపొరుగూ ఓ యాభైమంది వరకూ పరుగులు పెడుతూ వచ్చేశారు… వాళ్ల ఏడుపులూపెడబొబ్బలతో దద్దరిల్లిపోయింది ఆస్పత్రి.

మా మెదళ్లు మొద్దుబారిపోయాయి. ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేం. మా ప్రమేయం ఏమీ లేని స్థితిలో విశాఖ ఎలా వచ్చిపడ్డామో మాకే తెలియలేదు. మర్నాడు సుశీలానాయర్ ప్రయాణమై వెళ్లిపోయింది.

మళ్లీ ఇదిగో… ఇప్పుడొచ్చింది!

మమ్మల్ని చూడగానే ఏడాది కిందటి విషాద సంఘటన అప్పుడే జరిగిందన్నట్టుగా అప్పన్న మొహంలో ఒక దుఃఖప్రవాహం పొంగింది. ఇక నిలబడలేనన్నట్టుగా ఆమె నేల మీద గొంతుకిలా కూర్చుండిపోయింది.

‘ఒక్కగానొక్క కూతురమ్మ… ఎంత ఒద్దనుకున్నా దుక్కమొచ్చేసే…’ అంది.

మళ్లీ సర్దుకుంది.

‘ఎలాగున్నావు అప్పన్నా…’ అడిగింది సుశీల గొంతు పెగుల్చుకుని.

‘ఏదో ఇలాగున్నావమ్మ. ఏటి సెయ్యగలవమ్మ మావు? మాఁవని కాదు, అసలు ఎవులైనా ఏటి సెయ్యగలరు? మృత్యుదేవత ఎవులికైన సెప్పొస్తాదేటి? దానికలగ ఒచ్చినాది. ఎంతేడిచినా నా కూతురు మల్లీ ఒస్తాదేటమ్మా. మా బొజ్జన్నకొండ మీద బుద్దుడు నేడా? ఆయన కత ఒకాయన సెప్పినాడు. నాలాగే పూర్వమొకావిడికి ఆడుతూపాడుతూ ఉండే కొడుకు అదాట్న సచ్చిపోయినాడట. ఆయమ్మ సోకాలెడుతూ కొడుకును బతికించమని ఆయన్ని అడిగిందట. సావు లేని ఇంటి నుంచి గుప్పెడు గింజలు పట్రామన్నాడట ఆ దేవుడు. అవి తెస్తే మంత్రమేసి బతికిద్దువన్నాడట. సావు లేని ఇల్లెక్కడుంటాదమ్మ. ఆయమ్మ తేలేకపోయిందట. అందరింట్లోనూ సావుంటాదని అర్థం సేసుకున్నాదట.
ఇలాంటి కతలు ఇన్నప్పుడు మనసు తేలికవుద్దమ్మ….’ అంటూ దీర్ఘంగా ఊపిరి తీసుకుంది.

తర్వాత తలెత్తి కళ్లు చిత్రంగా తిప్పింది.

‘కొండతల్లి మా ఇంట్లో పుట్టిందిగానమ్మ, అసలుకి మా దగ్గర పెరగవల్సిన పిల్ల కాదమ్మ. అందుకే దేవుడు బేగా తీసుకెలిపోయేడు. ఇంకెక్కడో, మీలాంటి పెద్ద అమ్మగార్లు, అయ్యగార్లింట్లో ఈపాటికి పుట్టించీసుంటాడు. ఆలయితే బాగా చూసుకుంతారు. మీలాగా ఇంగిలీసు మాట్లాడిపిత్తారు, మంచిమంచి గవున్లేసి కార్లల్ల తిప్పుతారు…’ అంటూ అదంతా తాను కళ్లెదురుగా చూస్తున్నట్టే చిర్నవ్వు చిందించింది.

అటువంటి అందమైన దృశ్యమేదో కనిపిస్తున్నంత భ్రాంతి కలిగింది ఆ క్షణంలో మాకూను.

‘పోయినోలకోసం పోగలవేటమ్మ. ఇదిగో ఇది మా సెల్లెలు. దీనికి మతి సరిగనేద ని చెప్పి మొగుడొగ్గీసినాడు. దీని కొడుకునిప్పుడు పెంచుతున్నను. ఆడింకా రెండో తరగతే. అయితే మాత్రం, బలే సదువుతాడమ్మ…’ అంటూ చెప్పుకుపోయింది.

రామినాయుడు అప్పన్న కథను శ్రద్ధగా, సానుభూతిగా విన్నాడు.

అప్పన్న ఎంత వద్దంటున్నా వినకుండా ఆమె చేతిలో కొన్ని నోట్లు కుక్కింది సుశీలానాయర్.

ముగ్గురం వెనక్కి బయల్దేరాం.

“….జీవితంపు చిక్కుముడులు విడవెంతగ సడలించిన

జడిగొల్పే దుఃఖంలో తడవకుండ గొడుగులేదు
మనుజునిలో మరణ భీతి, మదిలో దుఃఖానుభూతి
ఆలోచనలన్నిటికీ ఆంతర్యంలో పునాది
ఈ సృష్టికి ఏమిటర్థం, మానవునికి గమ్యమేది….”

తాను తరచూ పాడే శ్రీశ్రీ కవితనొకదాన్ని రామినాయుడు తన గొంతులో శృతి చేసి పాడటం మొదలుపెట్టాడు.

‘అర్థం అయీకావడం లేదు, కొంచెం వివరంగా చెప్పు…’ అన్నది సుశీలా నాయర్.

నేను చెప్పాను. అది శ్రీశ్రీదని చెప్పకముందే ‘సృష్టికి అర్థం ఏమిటని పాడుతున్నాడా….’ అని అడిగిందావిడ.

‘అప్పన్నను, బొజ్జన్నకొండనూ, ఇప్పుడు కొత్త చిగుళ్లేస్తున్న విశాఖపట్నాన్నీ చూసేక కూడా ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉందా ఆయనకి?’ అని కూడా అడిగింది.

ముందు సీట్లో కూర్చున్న రామినాయుడు వెనక్కి తిరిగి మా ఇద్దరివైపూ చూసి నవ్వేడు.

**** (*) ****



14 Responses to పునర్నిర్మాణం

  1. Mythili Abbaraju
    January 1, 2016 at 9:04 am

    గడిచిన ఏడాది చివరన, మీదపడిన కొండనొకదాన్ని, కిమ్మనకుండా ఎత్తుకుని మోస్తున్నాను. ఇప్పటి మీ ఈ మాటలతో మరింకాస్త నిబ్బరం. థాంక్ యూ. After all, some of us are good pilots in bad weather…

    • February 3, 2016 at 5:26 pm

      మైథిలి గారు, మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది.

  2. January 2, 2016 at 2:25 pm

    ముందసలు చాలా కాలం తరువాత అరుణపప్పు పేరు చూశాక మొలకెత్తిన మర్రి మొక్క పచ్చదనాన్ని చూసిన ఆనందం లాంటిది కలిగింది. కథ చదివాక ఆ ఆనందం ఇంకా పెరిగింది. పునర్నిర్మాణం అన్న పేరు పెట్టడంలో వున్న ఆశావహ దృక్కోణం, ఫిలాసఫీ, సుశీలలో, అప్పన్నలో చాలా బాగా, అలవోకగా పలికించారు. అభినందనలు.

    • February 3, 2016 at 5:27 pm

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అరిపిరాల గారు

  3. Krishna Rao
    January 3, 2016 at 12:18 pm

    Chaala bagundi

  4. usha
    January 3, 2016 at 7:55 pm

    chalaa bagundi Aruna garu
    life aagipoindi ani anukokunda manchi positive approach
    vunnadi mee PUNAARNIRAMANAM lo

  5. Santosham
    January 5, 2016 at 12:04 am

    మనిషి, ప్రకృతి sambandham చిత్రణ సూపర్బ్.

  6. Y RAJYALAKSHMI
    January 5, 2016 at 1:56 pm

    ప్రకృతిని, మనిషిని కలిపిన పధ్ధతి చాల బావుంది.

    • February 3, 2016 at 5:33 pm

      కృతజ్ఞతలు ఉష గారు, సంతోషంగారు, మరియు రాజ్య లక్ష్మి గారు.

  7. January 13, 2016 at 3:22 pm

    పునర్నిర్మాణం… ప్రాణానికి ప్రేరణనిచ్చే ఉత్ప్రేరకంలా, అర్ధాత్ పరుసవేదిలా, చాలా బావుంది అరుణ!!

  8. Venkata T
    January 24, 2016 at 10:22 pm

    విశాఖ బుద్ద స్తూప ఫోటోని నా వాల్పేపర్ గ పెట్టుకున్నా. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. మీ కధ చదువుతుంటే నాకు కళ్ళముందు జరుగుతున్నట్లు వుంది. బుద్ద is లైట్ అఫ్ ది వరల్డ్. కధ చాల బావుంది

Leave a Reply to Aruna Pappu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)