వాకిట్లోకి తొలి అడుగు…

‘వాకిలి’ తొలి సంచిక మీ చూపుల్లో వుంది. ఈ సంచికకి మేము అడిగిన వెంటనే/ అడిగిన సమయానికి రచనలు పంపిన రచయితలందరికీ ముందుగా పేరు పేరునా ధన్యవాదాలు. ఇక ముందు వెలువడబోయే సంచికలకు కూడా ఇలాంటి సహకారాన్నే రచయితల నుంచి కోరుకుంటున్నాం.‘వాకిలి’ ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ పత్రిక రూపు రేఖల గురించి, దృక్కోణాల గురించి అద్భుతమయిన ఆసక్తిని కనబరచిన పాఠకులందరికీ మా సాక్షర స్వాగతం.వర్తమాన సాహిత్యానికి సంబంధించిన వివిధ కోణాలు ప్రతిఫలించేట్టుగా ఈ ‘వాకిలి’ ని తీర్చిదిద్దుతున్నాం. ఈ ఏడాది కవిత్వంలో మూడు అవార్డులు పొందిన ముగ్గురు కవులు – బీవీవీ ప్రసాద్, మోహన తులసి, రవి వీరెల్లి-  మీతో  ‘కరచాలనం’ చేయబోతున్నారు. ప్రసిద్ధ కథా రచయిత కాళీపట్నం రామారావు గారు ‘ఫస్ట్  పర్సన్’ గా మిమ్మల్ని క్లుప్తంగా పలకరించబోతున్నారు. ప్రసిద్ధ కవీ, విమర్శకులూ అఫ్సర్ గారు దాదాపు పుష్కర కాలం తరవాత ‘వాకిలి’ కోసం ఒక కాలమ్ రాయడం మాకు సంతోషంగా వుంది. వర్తమాన సాహిత్యానికి ఓనమాలు లాంటి ‘ఆనవాలు’ శీర్షిక మా ప్రత్యేక కానుక.

ఇక అంతర్జాల పాఠకులకు సుజాత, తృష్ణ సుపరిచితులే. ఉత్తమ పఠనాభిలాషని పెంచే సుజాత గారి శీర్షిక ‘చదువు’ సంగీతంలో నిక్షిప్తమయిన సాహిత్య విలువల అన్వేషణ లక్ష్యంగా తృష్ణ గారి కాలమ్ ‘చలువ పందిరి’ ఈ సంచిక నించే మొదలవుతున్నాయి.

ప్రవాస జీవన కోణాల్ని ఆవిష్కరించే రెండు శీర్షికలు ‘వాకిలి’లో వున్నాయి. ‘ఆవలి తీరం’ శీర్షిక ప్రవాస తెలుగు రచయితలతో మాట్లాడుకునే వేదిక.  కొల్లి ప్రవీణ శీర్షిక ‘ప్రవాసీ బంధం’లో ప్రవాస జీవన కథనాలు వుంటాయి.

ప్రతి ఏడాది ఒక రచయిత మీద ఫోకస్ పెట్టాలని ‘వాకిలి’ ఆలోచన. అందులో భాగంగా ఈ సంచిక నించి ఈ ఏడాది అంతా మనం మహారచయిత చలం ని తలచుకుంటున్నాం ‘ చలం-చలనం’ శీర్షికలో – చలంతో మీ అనుభవాలూ, పఠన అనుభవాలూ రాసి పంపమని రచయితల్ని ఆహ్వానిస్తున్నాం.

‘వాకిలి’ తొలి సంచికని ప్రసిద్ధ కవి అజంతా స్మృతికి అంకితమిస్తున్నాం. తెలుగు కవిత్వంలో అజంతా ఒక అపురూపమయిన సంతకం. డిసంబర్ 25 ఆయన వర్థంతి.

***

వీటన్నిటితో పాటు కవిత్వం, కథ, సమీక్ష వంటి శీర్షికలు కూడా వున్నాయి. ‘వాకిలి’ రెండో సంచికలో మరి కొన్ని ప్రయోగాత్మకమయిన శీర్షికల్ని ప్రకటిస్తున్నాం. వాకిలికి రచనలు పంపండి. చర్చల్లో పాల్గొనండి. ఈ వాకిలి మీదే! నిస్సంకోచంగా మీ మనసు విప్పి మాట్లాడండి.

 

కృతజ్ఞతలు: 

ఈ నెలాఖరుకు ఉన్న Oxford University Press బుక్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ తో తను ఎంతో బిజీగా ఉన్నా వాకిలి అభ్యర్థనను మన్నించి రచనల సేకరణ విషయంలో వాకిలికి ఎంతో సహాయం చేసిన ప్రముఖ కవి అఫ్సర్ గారికి ధన్యవాదాలు.

 

 - వాకిలి సంపాదక బృందం