‘ శేషభట్టర్ రఘు ’ రచనలు

నీ నీలి కళ్ళు

08-మార్చి-2013


ఓ వెన్నెలరేయి స్వప్నాల ద్రాక్షతోటలో
మత్తుగా నిద్రిస్తున్న నన్ను
ఒక అదృశ్యహస్తం తలుపు తట్టి లేపింది

నీలికళ్ళ తెరచాపలెత్తి చూశాను
తొలిపొద్దు వేళలో నా నగ్న ఋషిత్వాన్ని
దగ్దంచేస్తున్న రంగుల కిరణంలా
నువ్వు ప్రత్యక్షమయ్యావు

చూపుల జలతారునుంచి
ఒక గీతం మంద్రంగా జారుతుంటే
గంధర్వలోకంలో ఉల్కలా
నాముందు వాలినట్టయింది

గతాల జల్లుల్లో తడిసి తడిసి
హృదయ కిటికీ ఊచల అంచుల్లో
ఖైదీ అయ్యింది

ఎండలో దీపం పెట్టినట్టు
నిన్ను విడిచి వాంఛలన్నీ
ఉనికిని కోల్పోయాయి

ఇప్పుడు నా నరాల రహదారుల నిండా
నీ నులివెచ్చని ఊపిరి పరిమళాలే!పూర్తిగా »