కథ

ఆఖరి శబ్దం

ఫిబ్రవరి 2016

లా రాయడం నాకే ఆశ్చర్యంగా కొత్తగా కూడా ఉంది తెలుసా. నిన్న నీ ముఖాన్ని నా దోసిట్లోకి తీసుకున్నప్పుడు కూడా అదే కొత్తదనం, అదే ఆశ్చర్యం తెలుసా? చాల మారిపోయావు నువ్వు. ఒక్కపుడు నువ్వో గొప్ప అందగత్తెవి అంటే ఇప్పుడు ఎవరూ నమ్మరు తెలుసా? అంతలా మారిపోయావు అమ్మమ్మలా. నీ ఎక్ స్ట్రా పన్ను ఏమైంది? అప్పట్లో నిన్ను తెగ ఆటపట్టించేవాడిని కదూ. నువ్వు అబ్యజౌ రాక్షసి జాతికి చెందిన దానివి అందుకే నీకు ఆ ఎక్ స్ట్రా పన్ను అంటే, ఒకసారి రాత్రి నేను మంచి నిద్రలో ఉన్నపుడు నీ ముఖానికి రంగులవీ పూసుకుని నన్ను భయపెట్టాలని చూసావ్. కోపంగా నిన్ను తిట్టేసి పడుకున్నా. అప్పుడు నువ్వు అలిగావు. అప్పట్లో నీ అలక రెండుమూడు రోజులకి కూడా పోయేదికాదు. నీకు తెలీదు కదా, సరిగ్గా అప్పుడే నా కలలో ఓ రాక్షసి నన్ను చంపుతో౦ది. అందుకే నిన్ను చూడగానే అంతలా ఉలిక్కిపడ్డాను. చాల భయపడిపోయాను. తర్వాత ఓసారి నీకు ఆ విషయం చెపుదాం అనుకున్నా కాని, చెప్పాక మళ్ళీ నువ్వు తిరిగి నన్ను ఆటపట్టిస్తావ్ అని చెప్పలేదు. చాలానే భయం వేసింది. ఈ పరుగులోపడి నీ పైపన్ను ఇపుడు లేదన్న విషయం ఇన్నేళ్ళూ గమనించను కూడా లేదు. నీ అందమంతా ఆ పన్నులోనే ఉండేది. నువ్వు నవ్వుతున్నపుడు నీ అందాన్ని అది రెట్టింపు చేసేది. ఏ క్లిమేన్స్ బ్రెంటన్ సహయమో తీసుకుని నీ అందం గురించి ఇంకో నాలుగు ముక్కలు చెప్పాలనే ఉంది. చెప్పాక ఇన్ని మాటలు మాట్లాడుతున్నది నా భర్తేనా అని నువ్వు ఆశ్చర్యపోతావేమో అని చిన్న అనుమానం కూడా ఉంది. చెప్పాను కదా నాకే ఇదంతా కొత్తగా ఉంది. ఇప్పుడు మునపటిలా భయపడడం కూడా లేదు. నిన్నట్నుంచి మన నగరం, మన వీధి అగ్ని కబంద హస్తాలను విడిపించుకోలేక పోతున్నాయి. మన జాతికి నిలువనీడ కూడా లేకుండా చెయ్యడం అతని లక్ష్యం అనుకుంటా. రేపు మన సమాధుల మీద వారి జాతికై అతను ఓ సుందర సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడేమో. కింద నీ గది కూడా దాదాపుగా తగల పడిపోయింది. నీ ఫోటోలు కొన్ని పైన గదిలో పెట్టుకున్నాను. మన పెళ్లి ఫోటోలో నీ సిగ్గు చూసి భలే అనిపిస్తుంది నాకు. ఈరోజు నీ స్నేహితురాలు వస్తానని చెప్పింది. ఇంకా రాలేదు, అంటే బహుశా చంపేసి ఉంటారు.

నిన్న వీధిలో వాళ్ళ తుపాకీ తూటా తగిలి నా చేతిలోనే కుప్ప కూలిపోయవు కదా అప్పుడే నేను ఆగిపోయాను. ఇంక పరిగెత్తాల్సిన అవసరం లేదనిపించింది. ఆ రోజు సాయంత్రం వరకు నువ్వు నాతో నేను నీతోనే ఉన్నాము. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పట్నుంచి ఎటు చూసినా వెలితే కనిపిస్తుంది. దాంతో పోలిస్తే ఈ తుపాకీ శబ్దాలు నన్నేం భయపెట్టడం లేదు. మన శాపగ్రస్త వీధిలోకి ఆ నియంత సైన్యం వచ్చేసినట్టే ఉన్నారు. నా మిత్రుడు – అదే నీ ముద్దుల అన్నయ్య మన పుట్టుకే తప్పంటాడు. కానీ మనం ఈ మతం ఎంచుకుని పుట్టలేదు కదా. అతని మతం కోసం అతను ఓ సామ్రాజ్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. మనకు చోటు లేదేమో, ఊచకోత కోసేస్తున్నాడు. మీ అన్నయ్య సురక్షితంగా ఎటో పారిపోయాడు. నన్నూ రమ్మని బలవంత పెట్టాడు. నేను రానని చెప్పాను. ప్రాణం లేని వొట్టి శవాన్ని కాచుకోవడం ఎందుకు?

వీధిలో తుపాకీ శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ వాటి పాలబడి చావటానికి పెద్దగా ఎవరూ మిగల్లేదు. నన్ను ఎవడో చూసాడు. బహుశా ఇంకొన్ని క్షణాల్లో పైకి వస్తారేమో. ఇంకా రెండు మూడు ఇళ్ళు మిగిలి ఉన్నాయి.

ఇప్పుడు చాల ధైర్యం వచ్చేసింది నాకు. కింద నుంచి వాడు నన్నే చూస్తున్నా బెదురు రావడం లేదు. నేను నీకు చాలా ఊసులు బాకీ ఉన్నాను. కాలం ఒక్కసారి వెనకకు వెళ్తే బావుండునేమో, ఈ బాకీ పడిన మాటలన్నీ నీతో చెప్పేసుకునేవాడిని. నిన్న అస్సలు ఆకలి అనిపించలేదు. ఉదయం కాసేపు కళ్ళు తిరిగాయి. అంటే రోజూ ఆ సమయానికి ఏదో ఒకటి పెట్టేదానివి కదా అందువల్లనే అనుకుంటాను. నీ పరిశుభ్రమైన వంటగదిలోకి వెళ్ళాను, కాని ఎలా వండుకోవాలో తోచ లేదు. అప్పటికీ చెయ్యి కాలింది అనుకో. ఈపాటికి నీ వంటగది తగలపడిపోయి ఉంటుంది.

నీ భర్తకు ప్రేమగా మాట్లాడటం రాదని నువ్వు ఎన్నో సార్లు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు అనగలవా ఆ మాట? ఏం చెయ్యను చెప్పు మనవి శాపగ్రప్త బ్రతుకులు. పెద్ద వర్షం వస్తున్నపుడు చెత్తకుండీ దగ్గరి కుక్క తాను కన్న పిల్లని నోటకర్చుకుని ఇంకో హాని లేని ప్రదేశానికి తీసుకుపోతుంది కదా, అంత కన్నా గొప్ప వేమీ కాదు మన బతుకులు. ఇక్కడ మనం ద్వితీయ శ్రేణి పౌరులం. చాలానే ఊసులున్నాయి నీకోసం, కాని నిన్నటి లాగానే ఇప్పుడూ అట్టే సమయం లేదనే అనిపిస్తుంది. నన్ను చూసినవాడితో పాటు ఇంకో ఇద్దరు కలిసి తలుపు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టారు. వాడు నా వైపు గురిపెట్టాడు. బహుశా రేపు తమ జాతి నుంచి విజయపతకం అందుకుంటాడు. అదిగో సరిగ్గానే గురిపెట్టాడు. ట్రిగ్గర్ శబ్ధం నాకు వినిపించింది.