కథ

దత్తుడు

ఫిబ్రవరి 2017

త్తుడు మట్టిలో కలిసిపోయాడు. భూమి మీద పడి మట్టి మీద బ్రతికినంత నిశబ్దంగానే. తరాల వారి కంగా ఒక్కటంటే ఒక్క శిలా విగ్రహం కూడా ప్రతిష్టించబడలేదు. తన గుడిసెలో ఉన్న ఆ రెండు పంచెలు, గొడ్డలి మాత్రేమే అతను మిగుల్చుకున్న జ్ఞాపకాలు.ఆరేళ్ళ వయస్సులో పోలేటి వెంకట్రావు ఇంటికి దత్తుడు కింద వచ్చాడు. పక్కూరులో ఎవడో ఎర్రోడి ఆఖరి కొడుకు. అతనికి పెంచే దిక్కులేకపోతే పోలేటి వెంకట్రావు, పోస్ట్ మాస్టారుని వెంటబెట్టుకెళ్ళి ఎంతకో కొన్నుక్కు తెచ్చుకున్నాడు. వెంకట్రావు కూడా ఏమి కలిగినోడు కాదు. నలుగురు ఆడపిల్లల తండ్రి. అతనిదీ కూలి పనే. వాళ్ళావిడ మేకల్ని మేపేది. మా ఊల్లోకి దత్తుడిని  కరణం గారి ఎద్దుల బండిలో తిస్కోచ్చారు. మా గుడి రోడ్డు దాటి వెళ్తుంటే చూసాను. ఊరి చివరి ఎక్కడో ఉండేది వాళ్ళ ఇల్లు. వెంకట్రావుని పన్లోకి పిలవడానికి మా నాన్నతో కలిసి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచుంటే వాళ్ళని ఎవడో ఒకడు కేకేసుకు వచ్చేవాడు. అందుకే దత్తుడు ఇల్లు ఎక్కడో సరిగ్గా తెలిదు. మా బడికి ఆనుకుని ఉండే చేనులో వాళ్ళ అమ్మతో కలిసి ఎన్నెలు ఏరుకుంటుంటే మొదటిసారి చూసాను. మాటలు సరిగ్గా తిరగవు. మందబుద్ధని తోటోళ్ళు బాగా ఆటపట్టించేవారు.

వెంకట్రావుది పెద్ద వయసు. తులింపు మనిషి, తాగుబోతు. ఎప్పుడైనా పక్కూరు పనికెళ్ళి, రావడానికి  చీకటి పడిపోతే లాంతరు ఇచ్చి దత్తుడుని మా గుడిదాక ఎదురు పంపించేది వాళ్ళ అమ్మ. మా గుడి దగ్గర పెద్దోళ్ళు ఎవరు లేకపోతె మాతో కలిసి కాసేపు అడుకునేవాడు. ఎవరైనా వస్తే మాత్రం ఓ మూలకి పోయి నుంచునేవాడు. వాళ్ళ నాన్న వచ్చేంతవరకు అక్కడే తచ్చాడుతూ ఉండేవాడు. “ ఏం పెర్రా అంటే ఏ..ఏ..స్స్” అనే వాడు చీముడు  కార్చుకుంటు. నాకు భలే నవ్వొచ్చేది. వాళ్ల పిల్లలతో అస్సలు అడుకునేవాడు కాదు. వెంకట్రావ్ కొడుకు కాదు నువ్వు అని ఎడిపిస్తున్నారని. తర్వాత ఎప్పుడో చెప్పాడు.

అన్ని మర్చిపోయే వీడికి ఇది మాత్రం గుర్తుండిపోయిందే అనుకునేవాడిని. ఎప్పుడు ఏమి అనేవాడిని కాదేమో నేనంటే వాడికి చాలా ఇష్టం.

రెండో కూతురు భారతమ్మ పెళ్లి తర్వాత దత్తుడుని భాస్కర్రాజు గారి ఇంట్లో పాలేరు పనిలో కుదిర్చేసాడు వెంకట్రావు. నా పదో పుట్టినరోజునాడు గుడి దగ్గర కనిపించి చెప్పాడు. ఒకటో రెండో చాక్లెట్లు ఇస్తే తిసుకున్నాడు. ఆ తర్వాత దత్తుడు అడపాదడపా కనిపించేవాడు. భాస్కర్రాజు గారి ఇంట్లో ఎవడు ఏడాది మించి పనిచెయ్యలేడు. రాజు గారి పెళ్ళాం ఓ నిమిషం కూడా కుర్చోనివ్వదు. పనివాళ్ళని సరిగ్గా  చూడను కూడా చూడదు. మా నాన్నకి ఆవిడ గురించి బాగా తెలుసు. ఎప్పుడైనా సెలవు పెడితే తర్వాత రోజు ఇంకా ఎక్కువ పని చెప్తుంది. దత్తుడు అమాయికుడు అయ్యేసరికి ఇంకా ఎక్కువ పని చెప్పేది. మా దేవుడు మాన్యం కూడా రాజుగారి అధీనంలోనే ఉండేది. ఇంటి దగ్గర పని అయిపోయాక దేవుడు తోట పని చెయ్యాలి. కొబ్బరి కాయల దింపేనాడు అయితే చీకటి పడేదాకా దత్తుడికి పనేపని. తీసిన కాయలన్నీ గుడి దగ్గరకి మోసుకు రావాలి. ఎందుకంటే తోట దారి అంతా బురదగా ఉండి మోకాల్లోతు దిగేది. నా పదవ తరగతిలో అనుకుంటా, కొబ్బరికాయలు మోసుకొచ్చేందుకు దత్తుడికి రిక్షా ఇచ్చారు. గుడిదాకా మోసుకొచ్చిన కొబ్బరికాయలు అక్కడ నుంచి రిక్షాలో వేస్కుని వెళ్ళేవాడు. ఒక్కోసారి రిక్షా లోడు ఎక్కువైతే తేలిపోయేది. ఆళ్ళోడిని ఎవడో ఒకడిని ముందు ఎక్కించుకుని రాజుగారి ఇంటికి లాక్కేళ్ళేవాడు. అదే టైములో నేను ఎప్పుడైనా కనిపిస్తే నవ్వేవాడు అమాయకంగా. ఆదివారంనాడు దింపు తీస్తే నేను కూడా ఓ చెయ్యి వేసేవాడిని. ఎవరికంటా పడకుండా దొంగచాటుగా తాగమని నాకు బోండాలు కొట్టి ఇచ్చేవాడు. వాడు మాత్రం తాగేవాడు కాదు.

ఇంటరులో పక్కూరు వెళ్ళాల్సి వచ్చేది. ఆ రోడ్డు పొడవునా వరిచేలు ఉండేవి. వాటి కోతలప్పుడు దత్తుడు చేలో పనికి వచ్చి, సాయంత్రపేళ గుడ్డోడి తూము దగ్గర కలిసేవాడు. వచ్చేదారిలో, ఎప్పుడైనా డబ్బులుంటే వాడికోసం గాంధీ బొమ్మ సెంటర్లో బజ్జీలు కొని తెచ్చేవాడిని. వాటిని తీసుకుంటూ ఎంతో ఆనంద పడిపోయేవాడు. రోడ్డు మీద చిన్నకార్లు ఏమైనా వెళ్ళడం చూసినప్పుడు వాడి మొఖం వెలిగిపోయేది. “ఒకటి కొని అవతల పడేయి” అంటే “అయ్” అనేవాడు. చిన్నప్పుడు కూడా మాతో ఆడుకోనేటప్పుడు “నా కోరు వచ్చింది, ఎక్కకపోతే ఎల్లిపోతుంది” అనేవాడు. ఇప్పటికి మావోళ్ళలో చాలామంది వీడిని కారోడు అంటారు.

సెకండు ఇయర్ లోనో ఫస్ట్ ఇయర్ చివరిలోనో పోలేటి వెంకట్రావ్ చచ్చిపోయాడు. దాంతో కుటుంబ భారమంతా దత్తుడి మీద పడిపోయింది. మరో ఆరు నెల్లు తిరగక ముందే దత్తుడి చిన్న చెల్లి, మా ఊరు పెద్ద కాలవలో పడి చచ్చిపోయింది. అదంటే వాడికి చాలా ఇష్టం. చేలో పని ఉంటే అదే ముంత కట్టుకు వచ్చేది. దిబ్బమీద కుర్చుని చెరికొంత తినేవాళ్ళు. దత్తుడు ఎప్పుడైనా చెరువు దగ్గర కనిపిస్తే సైకిల్ మీద ఎక్కించుకొనేవాడిని. వరాలమ్మ కొట్టు దగ్గరకు రాగానే ఆపమనేవాడు. దాస్కున్నచిల్లర తీసి చెల్లికి ఏదోటి కొన్నుక్కు వెళ్ళేవాడు. తర్వాత గుబ్బలోళ్ళ రామాలయం దగ్గర దించేసి నేను వెళ్ళిపోయే వాడిని, మావోళ్ళు చూస్తే ఎదవ గొడవని. చాల బాధపడి ఉంటాడు అది చచ్చిపోయిందని.

కోలంక దాక సైకిల్ మీద వచ్చి అక్కడ బస్సు ఎక్కాల్సివచ్చేది. డిగ్రీ కాలేజీ రామచంద్రాపురం లో ఉండేది. కోలంక నుంచి సుమారు ఓ పది మైళ్ళ దూరం. భాస్కర్ రాజు గారిదగ్గరే నోటు కాగితం మీద ఎంతో అప్పుతెచ్చి చివరక్క పెళ్ళికూడా చేసేసాడు దత్తుడు. కొన్నాళ్ళకు పాలేరు పని మానేసి తాపీ పనిలో కుదురుకున్నాడు. కోలంక గాంధీ బొమ్మ సెంటేర్లోనే జట్లు ఉంటాయి. ఏ జట్లో పని ఉంటే ఆ జట్టు వాళ్ళతో పనికి పోయేవాడు. రోజు సరిగ్గా అదే టైముకు నేను బస్సు ఎక్కాల్సి రావడంతో కలిసి వెళ్ళేవాళ్ళం. ఎవడు ముందు బయలుదేరితే వాడు వరాలమ్మ కొట్టుదగ్గర ఉండేవాళ్ళం. అక్కడనుంచి కలిసి పోయేవాళ్ళం. ఎందుకో ఓసారి మాటల్లో వాళ్ళ చెల్లి ఊసొచ్చే సరికి చిన్నపిల్లాడైపోయాడు. మాటల్ని మింగేసేంత ఏడుపు.

సిమెంట్ దెబ్బకి చేతులు పుండ్లు అయిపోతుంటే కొంత కాలానికి తాపీ పని మానేసాడు. కోతలు పడితే ఆ పన్లోకి వెళ్ళిపోయేవాడు. ఆ పనిలేనప్పుడు తాటి చెట్లు, కొబ్బరి చెట్లు నరికే పనికి పోయేవాడు. ఎండాకాలం వస్తే గోదారొడ్డు మీద వారగా ఉన్న తాటిచెట్లు ఎక్కి నాకోసం ముంజ కాయలు కోసుకొచ్చేవాడు. నా బి.ఎడ్. అయిపోయి మేము వేరే ఊరు కాపురం వెళ్లి పోయేవరకు చాల ఏళ్ళు ముంజకాయలను పట్టుకువచ్చాడు.

నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే దత్తుడికి పెళ్లి కుదిర్చేసారు. ఫలానా రోజు పెళ్లండి అన్నాడు తప్ప రమ్మని పిలిచే ధైర్యం చెయ్యలేక పోయాడు. నాకు తెలుసు, మనుసులో ఉండే ఉంటుంది. పెళ్లిరోజు ఓ పావుగంట ఉండి వచ్చేసాను. భోజనం మాత్రం చేయలేకపోయాను. నన్ను చూడగానే చాలా ఆనందపడ్డాడు. ఓ యాబై రూపాయలు చేతిలో పెట్టబోతుంటే ఎంతకీ తిస్కోలేదు. పక్కకి పిలిచి వాళ్ళమ్మ తీసుకుంది. సాయంత్రానికి సారాడబ్బులు కిట్టుబాటు అయి ఉంటాయి ఆవిడికి.

కొంతకాలం బాగానే సాగింది కానీ, తర్వత దత్తుడి అమ్మకి, పెళ్ళానికి మధ్య అస్సలు పోసిగేది కాదు. సొంతకొడుకు పెళ్ళాన్నికాదు  కాబట్టే నన్ను మాట అంటుంది. లేకపోతే అనేదా అని మా గుమ్మం దగ్గర మా అమ్మతో మొరపెట్టుకునేది. ఎప్పుడైనా మాణిక్యం కాపు కొట్టుకి కిరానా సామానం కొనుక్కోడానికి వచ్చినప్పుడు. ఒకట్రెండ్రు సార్లు నేను కలగజేసుకుని సద్దిచెప్పాను కానీ, కొంత కాలం పోయినాకా మళ్ళీ అదే బాగోతం  మొదలు పెట్టేది. చాల ఏళ్ళు తల్లి పెళ్ళాం గొడవల్ల వేదన పడ్డాడు దత్తుడు. ఎప్పుడు కనబడ్డా బాగా దిగాలుగా ఉండేవాడు. నా డిగ్రీ పూర్తి అయ్యేనాటికి ఇద్దరు ఆడపిల్లలు దత్తుడికి.

డిగ్రీ అయిపోయిన తర్వాత మాచవరంలో బి.ఎడ్.లో సీట్ వస్తే జాయిన్ అయ్యాను. మా ఊరికి చాలా దూరం అవ్వడం మూలాన స్నేహితులతో కలిసి అక్కడే రూము తీస్కుని ఉండేవాడిని. ఎప్పుడైనా కాలేజీకీ సెలవలోస్తే ఇంటికి వెళ్ళేవాడిని. నేనొచ్చానని తెలియగానే ఇంటికి వచ్చేసేవాడు దత్తుడు. కొబ్బరి బొండలో, పనసకాయో ఏదోటి పట్టుకొచ్చేవాడు. వెళ్ళిపోయే రోజు బస్సుదాక వచ్చి సాగనంపేవాడు. మా గుడి దాటే దాక సైకిల్ మీద బ్యాగు పెట్టుకుని ముందు వాడు వెళ్తుంటే వెనక నేను అందరకి ‘వెళ్తున్నా’ అని చెప్పుకుంటూ కోమటోళ్ళ కొట్టు దాటాక వాడి సైకిల్ ఎక్కి రాజుగారి సెంటర్ లో బస్సు ఎక్కేవాడిని. “మళ్ళీ ఎప్పుడండి?’’ అనేదే ఎప్పుడూ వాడి చివరి మాట.

డి.యస్సీ లో మాచవరం పరిసరాల్లోనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయిన రెండు ఏళ్ళకి నాకు పెళ్లి కుదిరింది. తను కూడా నాలాగే టీచర్. నా స్కూలుకీ ఓ ఐదు మైళ్ళ దూరం లో ఆమె స్కూలు ఉండేది. దత్తుడు ఇటుకబట్టి పనులకు ఏటో వెళ్ళిపోయాడు అని తెలియడంతో పెళ్ళికి పిలవలేకపోయాను. వాడు ఉంటే బావుణ్ణు అనిపించింది కాని పెళ్ళాం పిల్లలతో మొత్తం మకాం మార్చేయడంతో అడ్రస్ కనుక్కోవడం కుదరలేదప్పుడు.

పెళ్లి తర్వాత మా నాన్నని అమ్మని కూడా మాచవరం తీసుకెళ్ళిపోయాను. మా అత్తగారి ఊరు కూడా అటువైపే అవ్వడంతో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప మా ఊరుకు వెళ్ళడం కుదిరేది కాదు. మెల్లగా సంసార సాగరంలో చాల ఏళ్ళు గడిచిపోయాయి. సొంతూరేది అని ఎవరైనా అడిగితే తప్ప మా ఊరు గుర్తుకు వచ్చేది కాదు. చాల ఏళ్ళ తర్వాత మా చిన్నోడి  పెళ్లి శుభలేఖలు ఇవ్వడానికి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. దత్తుడ్ని పలకరిద్దాం అనుకున్నాకాని వీలు కాలేదు. నన్ను చూస్తే చాలా సంతోషపడేవాడు. ఊర్లో నా పనులన్నీ చక్కబెట్టుకున్నాకా బయలుదేరిపోయాను. వరాలమ్మ కొట్టుదాటాకా దత్తుడికి వరసకు చుట్టం అయ్యేవాళ్ళు ఎవరో కనపడితే కారు ఆపాను. కారు దిగితున్న నన్ను కాసేపు ఎగాదిగా చూసాక, ఫలానా వాళ్ళ కొడుకుని అని పరిచయం చేస్కున్నాను. మా నాన్న పేరు వినగానే ఒక్కొక్కరి మొఖాలు వెలిగిపోయాయి. పలకరింపుల తర్వాత మాటల మధ్యలో  దత్తుడి ప్రస్తావన తీసుకురాగానే  వాళ్ళ మొఖాల్లో క్రితం ఉండిన నవ్వు నా కళ్ళముందే ఆవిరైపోయింది. ఇద్దరి కూతుర్ల పెళ్ళిళ్ళు చెయ్యడానికి చాలానే కష్టాలు పడ్డాడంట దత్తుడు. ఏదో జబ్బుచేసి రెండేళ్ళ క్రితం పెళ్ళాం కాలం చేసిందట. ముద్ద పెట్టే దిక్కు లేకపోతే పెద్దకూతురు ఇంటికి వెళ్ళిపోయాడట. అక్కడే ఏదో చిన్నాచితకా పనులు చేస్కునేవాడు. పెద్ద అల్లుడు తాగుబోతట. మందుకు డబ్బులివ్వకపోతే ముసలోడు అని కూడా చూడకుండా దత్తుణ్ణి కొట్టే వాడట. వాడి దెబ్బలు తట్టుకోలేక మళ్ళీ మా ఊరు వచ్చేసాడట. నాలుగు రోజులు నుంచి పాకలోంచి బయటకు రాలేకపోవడంతో పంచలోనే విరోచనాలు చేసేసుకుంటున్నాడట. నలుగురు పోగయ్యి కాకినాడ పెద్ద ఆసుపత్రిలో చేర్పించామని చెప్పుకొచ్చారు. వాళ్ళలో ఒకతని కొడుకుని తీసుకుని కాకినాడ ఆసుపత్రికి బయలుదేరాను. ఒక పూట భోజనానికి రోజు మొత్తం కట్టెలు కొట్టి పెట్టేవాడట. వాళ్ళింట్లో వీళ్ళింట్లో మాసిపోయిన దుప్పట్లు కాలవగట్టు కాడికి పట్టుకెళ్ళి ఉతికే వాడట. గుప్పెడు అన్నం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, చెప్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఆ బాధలోనే ఆసుపత్రి చేరుకున్నాం. కూడా వచ్చిన అబ్బాయి దారి చూపిస్తూ ఉంటే, వెనక నేను వెళ్తున్నాను. రెండు మూడు అంతస్తులు ఎక్కగానే ఇతన్ని ఎరిగిన నర్సు పక్కకు పిలిచి దత్తుడు పొద్దున్నే చచ్చిపోయాడని చెప్పింది. ఆ అబ్బాయి నా దగ్గరకు రాకముందే నాకు విషయం అర్థమైంది. బాధగా విషయం చెప్పి, వార్డుకి తీసుకువెళ్ళాడు. గుర్తు పట్టలేనంతగా చిక్కి పోయాడు దత్తుడు. నాకు తెలిసిన ముఖానికీ ఇప్పుడున్నదానికీ పొలిక లేనంతగా మారాడు.

ఆసుపత్రిలో అంతా నా ఠీవిని చూసి పెద్ద డాక్టరు అనుకున్నారేమో, కొందరు లేచి నిలబడ్డారు. సూపరింటెండెంటు గారు కలవమన్నారని నర్సు చెప్తే వెళ్లి కలిసాం. సంతకాలు ఏవో పెట్టించుకున్నాక శవాన్ని వీలైనంత తొందరగా తీసుకు వెళ్లిపొమ్మన్నారు. ఆ అబ్బాయి సహాయంతో దత్తుడి శవాన్ని కారులోకి ఎక్కించుకున్నాను. ఆరోజంతా యాంత్రికంగా చాలా పనులే చేశాను. గాంధీ బొమ్మ సెంటరు దాటిన దగ్గర నుండీ ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. మా గుడి దగ్గర పిల్లలంతా చేరి, పోతున్న నా కారుని తదేకంగా చూస్తున్నారు. అంబేద్కర్ బొమ్మదగ్గర తడబడుతుంటే దత్తుడి పాకకి దారి చూపించాడు ఆ అబ్బాయి. కారు వెనుక చాలమంది పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎవరో కొందరు సాయం వస్తే దత్తుడిని శ్మశానానికి మోసుకుపోయాము.

మొత్తానికి దత్తుడు చిన్న కారెక్కాడు.

**** (*) ****