అమెరికా. ఒల్వేరా స్ట్రీట్. శిథిలావస్థలో ఉన్న మెట్రో ప్లాజా లాడ్జ్. గది నెంబర్ 404. పగిలిన అద్దాల కిటికీ. కొన్ని వందల సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అతను దాని గుండా చూసాడు. అలసిపోవడం తెలీని “సన్ డయల్” అతనికి బాగా తెలుసు. చిరువ్యాపారిగా జీవితం మొదలుపెట్టి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి వచ్చిన వారినీ అతడెరుగును. ఆనందంతో ఆ వీధి గుండా చక్కర్లు కొట్టే యువతీయువకులు అతనికి తెలుసు. విషాదంతో ఆ వీధి చీకటిని పంచుకునేవాళ్ళు అతనికి తెలుసు. మౌనం అతని భాష.ఎవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాడు? – లాంటి వివరాలు (ఖచ్చితంగా) చెదపురుగులు తినగా మిగిలిన రిజిస్టర్లకే తెలుసు. ఆ వీధిలో ఎవరికీ అతను తెలియదు.పగలంతా ఆ గదిలోనే ఏదో రాసుకుంటూ గడుపుతాడు. చీకటి పుట్టి, యవ్వనంలోకి వచ్చే సమయంలో అతను ఆ గది విడిచి ఆ వీధిలోకి వస్తాడు. రాత్రంతా అ వీధిలోనే అటూఇటూ తిరుగుతూ ఉంటాడు. అతని ఉనికి ఎరిగిన కొంతమంది, “పిచ్చికవి” అంటారు. కుతూహలంతో కొందరు అతను ఎవరని తెలసుకొనే ప్రయత్నం చేసారు, కాని అ యత్నాలేవీ ఫలించలేదు. కొంతమంది మాట కలిపే యత్నం చేసినా, ఒంటరితనాన్ని ఎంతగా ఆరాధిస్తాడో తెలుసుకుని వెనక్కి తగ్గారు. తర్వతర్వగా అతను ఆ వీధికి పాతవాడైపోయాడు.
అతను గొప్ప కవిత్వం రాస్తాడు. మనిషి జీవితమంతా ఒక నాటకీయ వ్యవహారం అంటాడు. మనిషి ప్రస్థానం అంతా నటనే అంటాడు. పాత్ర మీద పాత్ర పోషించుకుంటూ పోతూ అద్దుకున్న రంగులు వెలిసేలోపే, ప్రస్తానపు చివరి అంకం చేరుకుంటాడు అంటాడు. భూమ్మీద అసలు ఒక్కడే మనిషి అంటాడు. కనిపించే వైవిధ్యం అంతా తొడుగుల వల్లే అంటాడు. కొన్నేళ్ళ క్రితం దాకా ఆ లాడ్జిలో పని చేసివాళ్ళకు తను రాసిన కవిత్వం వినిపించేవాడట. ఇతని అలికిడికి “పిచ్చికవి గాడు వస్తున్నాడు” అని వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకోనే వారట. ఈ సంగతి ఎలా తెలిందో, అప్పట్నుంచి ఎవరితో మాట్లాడేవాడు కాదు. అతని కవిత్వం నచ్చిన కొందరు మాత్రం గొప్ప కవి అని అక్కడా ఇక్కడా అనేవారు. ప్రస్తుతానికైతే “పిచ్చికవి” ఊసులేవీ ఒల్వేరా వీధిలో అంతగా వినిపించట్లేదు.
శాంటీ విలే స్ట్రీట్. ఒల్వేరా స్ట్రీట్ కు ఆనుకొని ఉండే ఒక ఖరీదైన రోడ్డు. ఈ “ఖరీదు” కొందరికి కీర్తి, ఇంకొందరికి భారం. విలియమ్స్ కు మాత్రం ఉద్యోగరీత్యా తప్పని భారం. ఆ ఖరీదైన వీధి చుట్టూ ఉండే ఖరీదైన స్కూళ్ళ లో “వరల్డ్ అట్లాస్”లు అమ్ముతుంటాడు. వంద అట్లాసులు అమ్మితే నాలుగు డాలర్లు అతని లాభం. అతని భార్య కూడా అదే పనిలో ఉంది. ఏమి అమ్ముడు కాని రోజుల్లో రాత్రంతా దిగులుతో వీధుల గూండా తిరుగుతూ ఉంటాడు. విలియమ్స్ ను కొందరు కష్టజీవి అంటారు. మరికొందరు ఆశాజీవి అంటారు. ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయిన చరిత్ర అతనికి ఉంది. ముప్పైనాలుగేళ్ళ జీవితంలో ఎన్నో డక్కామొక్కీలు తిన్నా, రేపు మీద ఏదో తెలియని ఆశ ఉంది. చిన్నప్పుడు తండ్రి చదివించిన కథల్లో పాత్రలే అతనికి ఆదర్శం. “నీ చివరి చెమట బొట్టు రాలిన తర్వాత కూడా నువ్వు ఓడి పోయినట్టు కాదు” అని తండ్రి చెప్పిన మాటలు అతనిలో ఇంకా సజీవంగానే ఉన్నాయి. రోజు అవే స్కూళ్ళ చుట్టూ తిరగడం వలన యాజమాన్యాలు అతన్ని ఒక న్యూసెన్స్ కింద భావించడం మొదలుపెట్టాయి. కొన్ని స్కూల్స్ అతన్ని పూర్తిగా బహిష్కరించేశాయి. దాంతో రోజుకు పది అట్లాసులు అమ్మడం కూడా అతనికి భారం అయింది. నిద్ర లేని రాత్రులు మరిన్ని ఎక్కువయ్యాయి. అలా ఓరోజు అర్ధరాత్రి ఒల్వేరా వీధిలో తిరుగుతూ ఉండగా అతనికి పిచ్చికవి కనిపించాడు. మొదట భయపడ్డా తర్వాత తేరుకొని అతన్ని వెంబడించాడు. వేగంగా కదిలే పిచ్చికవి విలియమ్స్ చూపులకి అందకుండా చీకట్లో మాయమయ్యాడు. అటూఇటూ చూసి అతను కనబడకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు విలియమ్స్.
తర్వాత రోజు ఉదయం పిచ్చికవి గురించి చాలమందిని అడిగి చూసాడు. సరైన వివరాలు ఎవరూ చెప్పలేకపోయారు. తర్వాత వారం రోజులు ఒల్వేరా వీధిలో పిచ్చికవి కనిపించలేదు. కాని అతను పగిలిన అద్దాల కిటికి లోంచి వారం రోజులుగా విలియమ్స్ ను గమనిస్తున్నాడు, ఆ వీధి గుండా ఏదో వెతుక్కుంటూ తిరిగే చాలామందిలో ఒకడిలా. పిచ్చికవి గురించి తెలుసుకోవాలన్న కుతుహలంతో స్కూల్స్ కు వెళ్ళడం కూడా మానేసాడు విలియమ్స్. ఒకరోజు రాత్రి పిచ్చికవిని వెతుకుతూ ఉండగా చెత్త ఏరుకుంటున్న ఒక వ్యక్తి పిచ్చికవి గురించి తనకి తెలుసనీ, మెట్రో ప్లాజా లాడ్జిలో ఉంటాడనీ, కేవలం రాత్రి మాత్రమే బయటకు వస్తాడనీ, ఎవరితోనూ మాట్లాడడు అనీ, అందరూ “పిచ్చికవి” అంటారనీ చెప్పడంతో మెట్రో ప్లాజా వైపు వెళ్ళాడు. అప్పుడే బయటకు వెళ్తున్న పిచ్చికవిని చూసి చీకట్లో నక్కి అతను వీధి చివరి వరకు వెళ్ళిన తర్వాత పగిలిన అద్దాలకిటికి గుండా పిచ్చికవి గదిలోనికి ప్రవేశించాడు. ఆ గది నిండా ఎక్కడ చూసినా పుస్తకాలు పేపర్లే. అది శిథిలావస్థలో ఉన్న లైబ్రరీ ఏమో అనిపించింది అతనికి . పిచ్చికవికి సంబంధించిన వివరాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతున్న విలియమ్స్ కు పిచ్చికవి రాసిన కొన్ని రాతలు కనిపించాయి.
వాటిని చదవడం మొదలుపెట్టిన విలయమ్స్ తనకు తెలీకుండానే ఆ కవిత్వంలో లీనమైపోయాడు. అతని మనస్సు ఒక కొత్త అనుభూతికి లోనవ్వడం మొదలుపెట్టింది. తన అనుమతి లేకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. తన అనుమతి లేకుండానే పెదాలపై నవ్వులు పూస్తున్నాయి. అవును, ఆ క్షణంలోనే అతనికి అర్థమైంది తాను ఎంత గొప్ప ఆవిష్కరణ చేసాడో! ఈ మనిషినా వీళ్ళంతా పిచ్చికవి అంటుంది, అని బాధపడ్డాడు. ఏదో అలికిడైతే, కొన్ని పేపర్లు తీసుకుని ఆ గది లోంచి బయటపడ్డాడు విలియమ్స్. తర్వాతి రోజు తన మోటార్ సైకిల్ అమ్మేసి ఒక టైపు రైటర్ కొన్నాడు. రోజూ అదే పగిలిన అద్దాల కిటికీ గుండా లోపలికి వెళ్తూ కొన్ని నెలల్లోనే ఆ కవితల టైపింగ్ పూర్తిచేసాడు. గత కొన్ని నెలలుగా అతనికి సంపాదన ఏమి లేదు. ఆ కవితల్ని “ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి” పేరు మీద ఎన్నో ప్రచురణ సంస్థలకు పోస్ట్ చేసాడు. సామాన్య జనానికి అర్థం కాదు అనే నెపంతో కొందరూ, జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలి తప్ప ఇలాంటి విషాద కవితలు కావని కొందరూ ఇలా ఏ ఒక్క పబ్లిషర్ కూడా ముందుకురాలేదు.
మళ్ళీ నిద్రలేని రాత్రులు. రోజూ పగిలిన అద్దాల కిటికీ గుండా విలియమ్స్ ను గమనిస్తున్నాడు పిచ్చికవి. ఎంతమంది వద్దన్నా తనకు నమ్మకం ఉంది కాబట్టి తానే సొంతంగా పబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది విలియమ్స్ కు. కాని అంత డబ్బు తన దగ్గర లేదు. తన అట్లాస్ సేల్స్ డీలర్ షిప్ అమ్మేసి కొంత మొత్తం, ఇంటి ఫర్నిచర్ అమ్మేసి కొంత మొత్తం కలిపి “ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి” పేరు మీద వెయ్యి కాపీలు వేసాడు. పెద్ద పెద్ద మాల్స్ ముందు, బస్సు స్టేషన్స్ లోనూ, లోకల్ ట్రైన్స్ లోనూ కష్టపడి కేవలం వంద కాపీలు అమ్మగలిగేడు . పుస్తకాల షాపుల్లో అమ్ముడైనవి కూడా కలిపితే మొత్తం ఐదువందలు కాపీలు మాత్రమే అమ్ముడయ్యాయి. భార్య దృష్టిలో ఇప్పుడు అతనొక పిచ్చోడు. మెల్లగా అతనికి కూడా అతని మీద నమ్మకం సడలిపోతుంది. ఆ రోజు అతని మీద అతనికే అసహ్యం కూడా వేసింది. ఒక కారు వెంటపడి ఆ ఆసామీ తిట్టినా కూడా బతిమాలి కేవలం సగం రేటుకు ఆ పుస్తకాన్ని అమ్మేడు. అంతకన్నా దిగజారుడుతనం ఇంకొకటి ఉండదని అనిపించింది. రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. ఎప్పడు నిద్రపోయాడో, “విలియమ్స్” అంటూ తన భార్య అరవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆనందంతో ఆరోజు న్యూస్ పేపర్ పట్టుకుని వచ్చింది భార్య. “ఒల్వేరా స్ట్రీట్ మ్యాడ్ పొయెట్ – ఏ న్యూ ఎరా ఇన్ ఇంగ్లీష్ పోయెట్రీ” అనే పేరుతో ఆ ప్రముఖ పేపర్లో రివ్యూ వచ్చింది. ఆ పేపర్ అంతా పదిసార్లైనా చదివి ఉంటాడు విలియమ్స్. ఆ మరునాటి నుంచే పుస్తకం కాపీల కోసం ఆర్డర్లు రావటం మొదలైంది. తన నమ్మకం నిజమైనందుకు ఎంతో ఆనందపడ్డాడు.
“ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి ఎవరు?” అనే విషయం మీద ఎన్నెన్నో ఆర్టికల్స్ వచ్చాయి. కాని “పిచ్చికవి” ఎవరు అన్న విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు విలియమ్స్. అతని కొన్నేళ్ళ ఒంటరితనానికి భంగం కలిగించకూడదు అనుకున్నాడు. విలియమ్స్ ఇప్పుడు అన్నీ సంపాదించాడు. ఒల్వేరా స్ట్రీట్ లో ఇల్లు, పెద్ద కారు అన్నీ. ఆ వీధిలో ఒంటరిగా, తెలియని దేన్నో వెతుకుతూ తిరిగి, ఇప్పుడు అదే వీధిలో ఓ విలాస జీవితాన్ని సొంతం చేసుకున్న విలియమ్స్ ను గది నెంబర్ 404, పగిలిన అద్దాల కిటికీ లోంచి గమనిస్తున్నాడు పిచ్చి కవి అనబడే అతను.
**** (*) ****
సతీష్ పోలిశెట్టి గారికి నమస్తే olevela street madpoet పరిచయం బాగుంది .కవి మనోవేదన పబ్లిషేర్ విలియం కష్టాలు నా కళ్ళు తడిసాయి.ఆతని దొరికే స్తలం చెప్పగలరు
గొప్పకవిత్వం రాసేవాళ్లంతా పిచ్చివాళ్లుగానే కనిపిస్తారు.అయితే ఏకోరస:కరుణఏవ అని భవభూతి అన్నట్టు విషాదాన్ని హృద్యంగా ఆవిష్కరించని కవిత్వం గొప్పకవిత్వం కాదు.ఒల్వేరా స్ట్రీట్ పిచ్చికవి కథనం ఓ అద్భుత కథలాగుంది.
Prapancham oka nataka rangam annaru Shakespeare. Danilo AA ‘pichchi’ kavi tana patra poshinchadu. Inkokari abhyunnati ki kaaranam ayyadu. Chaala goppagaa undi ee kadhaa. Manchu kadha ku dhanyavaadalu!!
అద్భుతమైన కధ. అభినందనలు సతీష్ గారు.
అబయా సతీషా! త్రిపుర గారి ప్రియశిష్యుడు కనకప్రసాదు గారు మెచ్చిన రచయిత సతీషా!!
ఈ క్రింది ఇసయాలు గూగిలించి తెలుసుకుని నాకు సానా కుసాలయ్యింది, నీ కత ఇచ్చిన ఆనందాన్ని రెట్టింపు చేస్తూ :
1) ఒల్వేరా స్ట్రీట్ ని “ద బర్త్ ప్లేస్ ఆఫ్ లాస్ ఏంజెల్స్” ( “the birthplace of Los Angeles” ) అని అంటారని,
2) అక్కడి మెక్సికన్ మార్కెట్ ప్లేస్ ( Mexican MarkeT place ) ప్రసిద్ది అని,
3) ఒల్వేరా స్ట్రీట్ ని టాప్ ఫైవ్ గ్రేట్ స్త్రీట్స్ ఆఫ్ అమెరికా అని అంటారని ( one of the top five “Great Streets” in the United స్టేట్స్ ):
అత్యంత ధనికులు, నిరుపేదలు, కూసింత వెర్రోళ్లు మాత్రమే అక్కడ పేవ్మెంట్ల మీద పాదచారులుగా కనిపిస్తారని,
4) మెక్సికన్ మ్యూరలిస్ట్ డేవిడ్ ఆల్ఫారో సిక్విరోస్ 1932 లో వేసిన పెయింటింగ్ ” ట్రాపికల్ అమెరికా ” (అమెరికన్ ఇంపీరియలిజం చే అణిచివేయబడి, నాశనం చెయ్యబడ్డ ” ట్రాపికల్ అమెరికా ” )
In 1932 David Alfaro Siqueiros mural titled ‘ America Tropical,: Oprimida y Destrozada por los Imperialismos — or “Tropical America: Oppressed and Destroyed by Imperialism.”
5) లాస్ ఏంజెల్స్ అంటే …. హాలివుడ్ ముద్దుగుమ్మ మార్లిన్ మన్రో గురించి కూడా ప్రస్థావించాలి గాని … చెప్పలేని సిగ్గు అడ్డవొస్తున్నదబాయా.
కె.కె. రామయ్య
March 30, 2016 at 9:56 am
అబయా సతీషా! త్రిపుర గారి ప్రియశిష్యుడు కనకప్రసాదు గారు మెచ్చిన రచయిత సతీషా!!
ఈ క్రింది ఇసయాలు గూగిలించి తెలుసుకుని నాకు సానా కుసాలయ్యింది, నీ కత ఇచ్చిన ఆనందాన్ని రెట్టింపు చేస్తూ :
1) ఒల్వేరా స్ట్రీట్ ని “ద బర్త్ ప్లేస్ ఆఫ్ లాస్ ఏంజెల్స్” ( “the birthplace of Los Angeles” ) అని అంటారని,
2) అక్కడి మెక్సికన్ మార్కెట్ ప్లేస్ ( Mexican MarkeT place ) ప్రసిద్ది అని,
3) ఒల్వేరా స్ట్రీట్ ని టాప్ ఫైవ్ గ్రేట్ స్త్రీట్స్ ఆఫ్ అమెరికా అని అంటారని ( one of the top five “Great Streets” in the United స్టేట్స్ ):
అత్యంత ధనికులు, నిరుపేదలు, కూసింత వెర్రోళ్లు మాత్రమే అక్కడ పేవ్మెంట్ల మీద పాదచారులుగా కనిపిస్తారని,
4) మెక్సికన్ మ్యూరలిస్ట్ డేవిడ్ ఆల్ఫారో సిక్విరోస్ 1932 లో వేసిన పెయింటింగ్ ” ట్రాపికల్ అమెరికా ” (అమెరికన్ ఇంపీరియలిజం చే అణిచివేయబడి, నాశనం చెయ్యబడ్డ ” ట్రాపికల్ అమెరికా ” )
In 1932 David Alfaro Siqueiros mural titled ‘ America Tropical,: Oprimida y Destrozada por los Imperialismos — or “Tropical America: Oppressed and Destroyed by Imperialism.”
5) లాస్ ఏంజెల్స్ అంటే …. హాలివుడ్ ముద్దుగుమ్మ మార్లిన్ మన్రో గురించి కూడా ప్రస్థావించాలి గాని … చెప్పలేని సిగ్గు అడ్డవొస్తున్నదబయా.
~ ఇట్లు ఓ త్రిపుర పిచ్చోడు
Thank you @ Ramayya garu thanks for your time.