కథ

సందర్శనం

మార్చి 2016

నస్థలి నుండి వరగల వరకు వెళ్లిరావాలి పిల్లల్తో. సరస్వతిని కలుస్తానని మాటిచ్చినందుకు… చిన్నప్పట్నుంచీ స్కూల్లో వున్నప్పట్నుంచీ సరస్వతంటే యెంత ఆహ్లాదాభిమాన ఆరాధనాత్మీయతలో! సరస్వతాంటీని మేమూ చూస్తాం నాన్నా… వాణీ వేణుల విన్నపాలు. అర్ధాంగి శ్రీలక్ష్మి యెట్లాగూ వస్తుంది. ఆమె లేకుండా ప్రయాణమెట్లా?!.. కార్లో పెట్రోలు పోయించటానికి వుండాలి కదా ఆమె….

బయల్దేరేసరికే పది. మనసంతా చికాకు. చిక్కుకుంటామేమో ట్రాఫిక్ లో అన్న చిరాకు. పూరీ కూరా పులిహోరా ఖారా బగారా వగైరా వగైరా… ఆలస్యమందుకే … చికాకూ చిరాకూ పరాకులు కలిసిన ప్రయాణంలో పరారై పరాస్తమైంది స్తిమితం. కొత్తపేటలో మత్తిల్లుతూ స్టార్టు చేసిన కారు మెత్తగా సాగుతున్నట్టు చిత్తభ్రమ… కానీ ఎల్బీనగర్లో ప్రజాప్రవాహ పన్నగపు పన్నుల నడుమ చిక్కుకుని కన్నుకూ మన్నుకూ ఏకధారగా తన్నుకుంటూ మన్ను తిన్న పాముల్లా మేం. క్రానికల్ పేజీ చూస్తే పైన కాంగో కింద ర్యాంబో… కాంగోలో ర్యాంబో… వాంగో కోసుకున్న చెవి మ్యాంగో. రాంగోపాల్వర్మ యిచ్చిన సత్య దయ్యం కౌన్?.. బనేగా కరోడ్! పతిని మించిన దైవం సతికి వుందా?… డావించీ గ్రేటనీ భావించీ తలవంచీ మాంచినీని ముంచీ…. అనవిని వ్రేటువడ్డ నిహితాహిత వీరుడు వాని ముక్కునన్ శిరస్సరజ్ఝరీ ముహుర్ముహుర్లుఠద భంగ జలదాంత చంద్రరేఖా సదృశాంగి. నువ్వు లేవు నీ పాట వుంది.. పువ్వులోనే ఓ తోట వుంది… యెవ్వరని యెంతురో నన్ను శోకభీకర తిమిర… ఇదీరా స్థాయంటే. అచ్చుయతి హల్లుయతి స్వరయతి వ్యంజన యతి ప్రాసయతి ఏ యతీ నియతీ తెలియకున్నా రాశాను పద్యమదేమంత చోద్యం?!… మరో భాష రాకున్నా కరో అనువాదం!… అనువాదం అను నాదం పిడివాదం… కాదు కదా రసవాదం.. కడు భేదం. నాన్నా ట్రాఫిక్ లైటు పడింది పోనీ. పోనీ టెయిల్తో వెళ్తున్న ఆ పిల్ల అటు పోనీరా. అప్పుడు పోనిస్తానీ కారునీ. కానీ అలా చేస్తే మళ్లీ ట్రాఫిక్లైటు పడ్తుందప్పుడెలా అనీ పజిలౌతున్నా. పజిలే జీవితం జీవితమే పజిల్రా కన్నా. క్లూల ఆధారాల ద్వారాల ద్వారా దారాల ద్వారా చేరు దూరతీరాలు. కోరు జవాబులు. క్రాస్ వర్డులో వర్డ్సువర్తు. వర్తున్న వర్డ్సు. భాషా నీ కాల్గుంజేషా గుంజేశా నువ్విక వుత్త శూన్య వొట్టి కేవల ఖాళీ రిక్త ‘భా’వేగా.

యెట్లాగో కదిలింది కారు. కొత్తపేట దాటాక చైతన్యపురిలో పడిపోయాం పైతాన్లాంటి సైతాన్లాంటి పెద్ద గోతాంలాంటి ప్రజాప్రవాహపు నోట్లో. ఎంత చిరాకు సరస్వతికి ఈ రద్దీ అంటే! పుస్తకాలు చదువుకుంటూనో కాస్త రేడియోలో వీణావాదనం వింటూనో ఇంట్లో కూర్చోక ఎందుకు ఒంట్లోని సత్తువంతా కరిగేలా రోడ్లమీద పడి తిరగడం అంటుంది. నిజంగా ఎంత మంచిది సరస్వతి. కాలేజీలో కూడా కలిసే చదూకున్నాం. వరగలలో స్థిరపడింది కాని తరగలమీద పరుగెత్త గలిగే వడిగల గుర్రమే ఆమె చదువులో. తప్పక వస్తానని ఎప్పుడో చెప్పాను కనుక తప్పదు ఇప్పుడీ జర్నీ. వెనక సీట్లో స్పెల్లింగుల గురించి వాణీవేణుల హోరాహోరీ. వాణి తెలుగు ఎమ్మే ఫస్టియర్. వేణు ఇంగ్లీష్ ఎమ్మే ఫస్టియర్. వాళ్లిద్దరూ మొగుడూ పెళ్లాలు. నిజానికి వేణుకు ఎమ్ కామ్ చేసి ఎమ్బీయే చదవాలని యిష్టం. నేను బతిమాల్తే ఎమ్మేలో చేరాడు సగమిష్టంతో. ఐయన్డీఐసీటీ, క్యూయూఏవై, పీవోఐజీఎన్ ఏయన్టి. రాసేదొకటి చదివేదొకటి. పాపియా మాషే షాంజేలీజే ఫ్రాంస్వా మీతరాఁ హోర్హె బోర్హెస్ జువాంగి మారనీష్ హాజ్ సెవెరియానో బాలెస్తరాస్ చదివేదొకటి రాసేదొకటి అని పోట్లాట. పోవోయ్ పో..రావోయ్ రా.. పోపో.. రారా.. పో…రా అంటూ కాట్లాట. సంగీత సాహిత్య చర్చల సంపూర్ణ సంగమ సంకుల సంగ్రామ సంరంభం. షడ్జామాడ్జ కరాడ్జ వీడ్జ వసుధడ్జాలాంచితడ్జా… కరే కంకణం చేత వెన్నముద్ద కస్తూరీ తిలకం బంగారు మొలతాడు కరతలే వేణుమ్ పట్టుదట్టి. మొట్జార్ట్ బాఖ్ బ్రామ్స్ స్కూబర్ట్ సెమ్మంగుడి జీయన్బీ మురళిబాల సరస్వతెమ్మెస్ ఎమ్మెల్వీ డీకేపీ జయశ్రీబాంబే లాల్గుడి మాంశ్రీ ద్వారం కద్రి శశాంకున్ని హరిహరన్. హోరాహోరీ జారీయే జారీ.

ఆ మధ్యొకసారి విశాలాంధ్ర షాపులో కనిపించినప్పుడు సరస్వతేమంత అందంగా వున్నట్టనిపించలేదు. ఈ రూపంలోనా సరస్వతిని చూడాలనుకున్నది అని కలిగింది నిరాశ. లోకేశ్ ను పెళ్లాడాక నిజానికి సరస్వతిలో హుందాతనం పెరిగింది. కానీ ఆ రోజెందుకో నన్ను చూస్తూ ఆమే విరగబడి నవ్వింది. నేనే బఫూన్లాగా వున్నానా అనుకున్నా. నవ్విన నవ్వును నవ్వకుండా నవ్వుతూనే ఆమె. అలా నవ్వినప్పుడల్లా ఆమె నవ్విన నవ్వును చూసి నవ్వుతున్నారక్కడి వాళ్లందరూ. ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ… సితతామర సామర వాహినీ శుభాకారతనొప్పు నిన్ను మది బైటా లోపలా తీరిగ్గా పూజిస్తానంటూ వేడుకున్నాక గాని ఆపలేదామె నవ్వును. చచ్చేంత సిగ్గనిపించింది. చావకముందే చచ్చేవాళ్లంటే చచ్చేంత కోపం నాకు. చచ్చేంత యిష్టం చావకముందు బతికేవాళ్లంటే. పుట్టకముందే చచ్చి చచ్చింతర్వాత కూడా పుట్టక… నన్ను చంపేస్తున్నార్రా వీళ్లంతా అనుకున్నా . వెనక సీట్లో కలవరాన్ని తుడుస్తూ కళకళల్ని కురుస్తూ కలకలాన్ని కలిగిస్తూ కళా కలాపం జారీ. పక్కసీట్లో పరవశంలో మునిగిన శ్రీలక్ష్మి వారిస్తున్నా వాదిస్తూ విభేదిస్తూ వివేచిస్తూ విలోకిస్తూ విచారిస్తూ వినోదిస్తున్నారు వాళ్లిద్దరూ. స్పీకర్లోంచి కల్యాణీ కళావతీ వచ్చి వాటేసుకున్నారు. కిషోరీ అమోన్కర్ విసిరిన మధువంతి వచ్చిపడింది దభీమని నా మీద. ఆపైన ఆజ్ సహియోనా జాయ్ బిరహా. తర్వాతేమో పాలించు కామాక్షీ పావనీ. వెనక చర్చల్లో కేదార్ ఛాయానట్భూప్దేశ్కార్ భటియార్ కోమల్రిషభాసావరీ అలీఖాన్ బడేగులాం కరీమ్నిసారమీర్ అమానతమ్జదలీలు దొర్లుతున్నారు. జన్మ సార్థకం వాళ్లను వింటే. కొందరు కారణజన్ముల జన్మల కారణం కోసం జన్మంతా ఆలోచించాలి. ముంబైలో చెంబై చెన్నైలో డంగై మదురైలో మదురై ఎదురై స్వరాల వరదై… సంగీతంలోకి పోనందుకు సంఘాతం తగిలిన బెంగ తాలూకు కంగాళీతో అంగలార్చుతూ నేను. గంధర్వ బాల ఛోటా సవై కుమార్ వ్యాసెన్నార్ సీఆర్ ఠాకూర్ నాథోంకార్ మన్సూర్ మల్లికార్జున్లు మనసారా గేలి చేస్తుంటే వసంతాల్ని దొర్లించుకుంటూ వసంతరావు వస్తుంటే విన్నారా భృంగ కురంగ విహంగాల హృదయంగమ చెంగనాలైన మృదంగ నాదాలను అన్నది శ్రీలక్ష్మి. ఆఁ విన్నా విన్నా అన్నా శాంతార్ద్ర కోపప్రేమాక్రోశ దుఃఖార్తితో ఇష్టబాధాతప్త పశ్తాత్తాప వ్యాకుల శోకచిరాకుతో.

ఆబిడ్సు దాటామా మామయ్యా అన్నది వాణి. యెక్కడ్రా ఇంకా దిల్సుక్నగరే రాకపోతే అన్నా. అబ్బా ఇది జనగణముల సముద్రం మనం మునగలేని సముద్రం వాహనముల సముద్రం అన్నది శ్రీలక్ష్మి. అవునిది తరగని జన జలధార తరగల రగలగల గరగరల గరళ సముద్రం అన్నా. రమ ఆంటీ ఎప్పుడొస్తుంది నాన్నా మనింటికి అన్నాడు వేణు. ఏమోరా కన్నా ఇంకా యెన్ని సంవత్సరాలకో అన్నా. ఇన్ని పుస్తకాల్రాశావ్ కదా నాన్నా ఎందరో కవిరచయిత సమీక్షక పండిత విమర్శక పాఠక సంపాదక స్నేహితులొస్తారు కాని రమ ఆంటీ ఏంటీ మనింటికి రాదు అంటే నేన్చెప్పగలిగేదేంటీ. రమ రాకపోయాక ఎన్ని పుస్తకాల్రాసినా దండగే అంటే దానర్థమేంటీ? పైగా యీ ట్రాఫికర్లో నేనుండగా శతవారము నుద్ధత చండవాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండనగుచు గండాల గుండాలలో తిరుగుచుండ పడున్ నా నెత్తిమీద బండ అన్నా లోలోపల అసహనం రగులుచుండ. కానీ రమ కన్న ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార తుందిలురాలైన సరస్వతంటేనే యెక్కువిష్టం నాకు.

ఇంకోసారి కవిసమ్మేళనంలో కనిపించినప్పుడు కూడా కనుల ముందున్నా కనువిందు చేయలేదెందుకో సరస్వతి. ఆమె మరింత అందంగా కనపడాలనుకున్నా. అసలైన అందంతో వసివాడని బంధంతో కుసుమించిన గంధంతో ఎప్పుడగుపిస్తుందీమె అనుకున్నా. నాకిష్టమైన ఆ ప్రశస్తతరుణం చూస్తుండగానే వస్తుందిలే నేను విస్తుపోయేలా అని వేచి చూస్తున్నానిష్టంతో. ఇష్టాన్ని ఇష్టపడే నన్నెందరో ఇష్టపడటం నాకిష్టమైన విషయం. ఔదార్యమున్న సౌదామినికి ఇష్టమే ఇష్టం భర్తంటే. భర్తకిష్టం సౌదామినంటే. ఐనా నువ్వా నేనా అనీ నేనంటే నేనే అనీ నేను నేనే అనీ పోట్లాట. నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే, నీ నూనె నా నూనని నేనన్నానా అంటూ కాట్లాట. సౌదామిని ఏమన్నదోసారి? నా భర్త ప్రియురాలి భర్తతో నా భర్తకు వైరం. ఆ భర్త భార్యకూ నా భర్త భార్యకూ మధ్య భర్తల మధ్య వుండే ఖాళీని భర్తీ చేసేంత స్నేహం. ప్రాణం వున్న నన్ను నా ప్రాణనాధుడు ప్రాణంలా చూస్కుంటాడు కాని ప్రాణం లేని ప్రాణుల ప్రాణాలంటే ఆయనకెంత ప్రాణమో. నేస్తాలు సైతం విస్తుపోయేలా ఆయన మస్తకానికి పుస్తకాలే సమస్తం. సరస్వతికి కవిత్వమంటే ఎంత ప్రాణమో. ఏమైంది నీ ఆ వ్యాసం? దీపం పత్రికలో పాపం అది పడలేదా? అన్నది. పడలేదు పడకపోతే పడకపోనీ. రాక కల్వక దండం పెట్టక జాబు రాయక ఫోన్చెయ్యక దేబ్రించనివాడి రచనెందుకు వేస్కుంటాన్నేనూ అనుకున్నాడేమో ఎడిటర్ అన్నాను. ఇప్పటిదాకా వ్యాసరచనలో ప్రైజే రాలేదు కదా నీకు అన్నది. గమ్మునున్నాన్నేను. వాక్యం బాగా రాయరానివాళ్లకే బాగా ప్రైజులిస్తారు బహుశా. ఇదే సరైన సహీ సవ్యమైన రియల్ నిజసత్య కచ్చితమైన కరెక్టు వాస్తవం అన్నది సరస్వతి తనే మళ్లీ.

అప్పుడే మొదలైంది ఆకలి. పగటి బ్రేక్ఫాస్టులో ప్రాతఃకాల డిన్నర్నూ సాయంకాలపు లంచినీ కలిపి లాగించెయ్యాలనుకున్నాను. వాచీ చూస్తే వాచిపోయింది మెదడు. వార్నాయనో ఇక్కడే పదకొండున్నర దాటింది. కానీ ఇంకా అమీర్ పేటలోనే. ఇక్కడ కలిస్తే మస్తాన్ రావనే దోస్తు ఇస్తానన్నాడెన్నో ప్రశస్తమైన పుస్తకాల్ని. ‘పెద్దంగడి’ ముందుంటానన్నాడు. వాడేడీ? ఆఁ అదిగో. అక్కడున్నాడు. ఆపాను కారు. తీస్కున్నా పుస్తకాలు. నాన్నా యిదేం పిచ్చి. ఈ పుస్తకాల కోసం యింత చుట్టూరా తిరిగిపోవటమా. ఉప్పల్ మెట్టుగూడా పికెట్ ఆల్వాల్ల మీదుగా పోయుంటే ఇప్పటికే వరగల చేరేవాళ్లం కదా అని వేణు. కన్నా! పుస్తకాల విలువ నీకేం తెలుసురా అన్నా. ఎమ్మే తర్వాత ఎంబీయే చేసి బిజినెస్ లో చేరేవాడివి కదరా నువ్వు అనుకున్నా. మంచిపనే చేశారు మామయ్య అన్నది వాణి. శ్రీలక్ష్మి ఇంట్లో పాతుకుపోలేదు బాగా. చాలావరకు వాణి హవాయే కాని శ్రీలక్ష్మి అంటే ఇంట్లో అందరికీ గౌరవమే. వేణుకు శ్రీలక్ష్మంటే ప్రాణం. సరస్వతాంటీకన్న రమ ఆంటీ అంటేనే ఎక్కువిష్టం వాడికి. ఏం బాగుంటుంది నాన్నా మీ ఫ్రెండు సరస్వతి. మీ ఇంకో ఫ్రెండు రమ ఆంటీనే బావుంటుంది. మొన్నో సారి తనిష్క్ లో కనిపించింది. అబ్బ ఎంత దివ్యంగా వుందో అంటాడు వాడు.

అమీర్ పేట నుండి బేగంపేట మీదుగా పికెట్ వైపు పరుగులు తీస్తూ కారు. ఆల్వాల్ దాటాక ఆకలి పదింతలైంది. ముదిరిన మధుమేహ రోగ ఫలితం. అదే అన్నా శ్రీలక్ష్మితో మెల్లగా సిగ్గుగా. వాణీ! అంకుల్ కడుపులో ఆకలి దూరి అల్లరి చేస్తోందట. ఆ బిస్కెట్ల సంచీ ఇటివ్వు అన్నది అర్ధాంగి. రెండు నిమిషాలయ్యక గండం ఎదురైనట్టుగా గుండెలు బాదుకోకుండా ఉండలేనట్టుగా ఆ సంచీని కార్లో పెట్టడం మర్చిపోయాం అని ఆర్తి నిండిన నోటిగుండా ఆగకుండా చెప్పింది వాణి. తల తిరిగినట్టనిపిస్తుంటే నేనూ అర్ధాంగీ వెనక సీట్లోకీ వేణూ వాణీ ముందరి సీట్లలోకీ తారుమారు. ఆక్సీజన్ తక్కువైన మెదడును అల్లల్లాడగొడ్తూ అలజడి నిండిన అస్తవ్యస్త అయోమయ అడ్డదిడ్డ అల్లకల్లోలాల భయోత్పాతం. ఆకలికి తోడు ఎంత తాగినా తీరని దాహం. పొద్దున్న ఒక్క ముద్ద కాఫీ తిన్నప్పట్నుంచి ఇప్పటిదాకా నాలుగు చుక్కల అన్నం కూడా తాగలేదు. రేప్పొద్దున పెందరాళే పదకొండున్నరకు లేచి మధ్యాహ్నం ఎనిమిది గంటలకు టిఫిన్చేసి రాత్రి ఆరు గంటలకు నిద్ర పోవాలి. పడుకునే ముందు రెండు మీటర్ల డికాక్షన్లో నాలుగు మిల్లీ లీటర్ల చక్కెరా చిటికెడు పాలూ పోసి చేసిన టీ. ఆమ్లజని అందని మెదడులో అల్లరితో సుళ్లు తిరుగుతూ మళ్లీమళ్లీ వెల్లువెత్తుతున్న ఆలోచనల అల్లకల్లోలం.

కిటికీలోంచి పక్కకు చూస్తే వెక్కిరిస్తూ వెనక్కి పోతూ ఓ పొడవాటి గోడ. గోడ మీద గోదావరి. బాటిల్లో బంగాళాఖాతం. మందుసీసాలో హిందూసాగరం. తృష్ణ తీర్చని కవోష్ణ కృష్ణా. ఛీత్కారాల చిలక్కొయ్యల మీంచి కింద పడ్డ పరిష్కారాల పంచెలు. నదీజలాల వివాదాల ప్రమాదాల ప్రమోదాలు. కొంత సేపయ్యాక రోడ్డు మీద నల్లా. నల్లాలోంచి నల్లని ఖడ్గమృగం మెల్లగా బయటికి వస్తూ. సూదిబెజ్జం లోంచి చాంతాడును లాగటానికి ప్రయత్నిస్తూ నేను. రాత్రి నిద్ర రాలేదు. బోలెడు సార్లు బొక్కబోర్లా బొక్క , బోర్లా బొక్క బోర్ల పడితే గాని రాదు నిద్ర. డ్యాష్ బోర్డు మీది అగరొత్తుల ధూమసర్పం ర్యాష్ గా మీద పడి కాటేసింది నన్ను. ఇప్పుడే వస్తా పది సంవత్సరాలయ్యాక అని వెళ్లిపోయిన చిన్నప్పటి ఫ్రెండు చిన్నారి జిగ్రీ బాలుగాడేడీ? వెనకాల అల్జీమర్స్ గురించి వాణీ వేణూల మాటలు. అల్జీరియాలో ప్రొజీరియా నైజీరియాలో జీరోయా? అల్ జజీర్లో అస్టీరియా హిస్టీరియాలో జీరా రైస్తో కరోమజా. జిగ్రీ బాలుగాడు డిగ్రీలో కూడా రాలేదు. జిగ్రీ పెద్దింటితో మాట్లాడాలి మనసారా. పెద్దింటి వేముగంటి మరింగంటి శొంఠి గంటి. రావికంటి యింటి పక్కింటిలో నేనుంటి. ఈ రోజంతా యిలానేనా? ఆగాలనుకుని తాగాలనుకుని తినాలనుకుని ఆగలేదు తాగలేదు తినలేదు.

షామీర్ పేట దాటాం. సరస్వతి వూరు దగ్గర పడుతోంది. యెంతిష్టం సరస్వతికి కథలంటే కవిత్వమంటే సంగీతమంటే. చింతాకారా శ్రీసుశాచలంచాసో రావిశా నైవేద్యం సమర్పించితే, శ్రీశ్రీ కృశా బాగంతి బైరాగీయజంతా శేషేంద్ర మోలుంచితే, ఫ్లూట్వైలిన్మృదంగ ఘటవీణా తంబురా మోర్సింగులన్ నిన్పాడితే, సారంగీ సరోద్గిటార సంతూరతబ్లా సితార్జలతరంగమై నిన్వేడితే సంతుష్టినొందుతావా సరస్వతీ. వొంటిమామిడొచ్చింది. సరస్వతి వూరు దగ్గర పడింది. రోడ్డు పక్కన ఆకుకూరల తోటలు. మార్కెట్ కు పోయి వెజిటెబుల్స్ తేవాలండీ అంటోంది అర్ధాంగి. ఏమేం తేవాలో చెప్పవోయ్ అంటున్నాన్నేను. పాలబచ్చలి తోటగోం చుక్క మెంతి, గంగవాయిలి సోయిలో కొయ్యతోట, కొత్తిమిర కరివేపాకులో పుదీన, కలిపి తేవోయి నాధుడా కలుగు సుఖము అంటోందామె. పేపర్లో సూక్ష్మ రుణాల గురించి రాసారు. రుణతరుణ మరణాలకన్న వ్రణతరుణ మరణాలకన్న రణతరుణ మరణాలే అధికం. కరుణార్థులు శరణార్థులు శుభతోరణ తరుణార్థులు మరా తరుణ మరణావరణ వాతావరణంలో మనరు. కారణాలనేకం అని కనరు.

వరగల వచ్చింది. తరగల నురగల మీద పరుగులు పెడుతూ వెళ్లాం. తెచ్చుకున్న దాన్ని పుచ్చుకుని ఆకలి తీర్చుకున్నందుకు మమ్మల్ని మేమే మెచ్చుకుని వచ్చిన పని కోసం వడివడిగా సాగాం. సరస్వతి కొండ మీద వుంటోందట. పోయి కలిశాం. పండుగ చేస్తూ నిండుగా నవ్వింది. వాత్సల్యం నిండిన దృక్కుల్తో దువ్వింది. మాట్లాడింది చాలా సేపు. వాణిని మరీ ప్రేమగా చూసింది. చూపుల ద్వారానే వెన్నెల కురుస్తూ చెయ్యి చాపింది. అందర్నీ దగ్గరకు తీసుకుని నిమిరింది. మూడు గంటలసేపు ముచ్చట పెట్టింది తీరిగ్గా. ఎంత దివ్యంగా వెలిగిపోతోంది సరస్వతి! ఇదీ ఇట్లా ఉండాలి సరస్వతంటే అనుకున్నా.

సెలవు తీసుకుంటుంటే వచ్చినందుకు థాంక్స్ అన్నది. మీరూ రావాలి మా యింటికి ఆంటీ అన్నది వాణి. ఓ ష్యూర్ వస్తూనే వున్నానుగా మధ్యమధ్య అన్నది సరస్వతి. శ్రీలక్ష్మిని తనివి తీరా కౌగిలించుకుని గౌరవిస్తున్నట్టు ప్రణామం చేసింది. శ్రీలక్ష్మేమో దీవిస్తున్నట్టుగా కదిపింది చేతుల్ని. తిరుగు ప్రయాణం మొదలు. నేను ఆగమేఘాల్లో ఆనందంలో బాగా తేలుతూ సోలుతూ. తృప్తి కలిగింది సరస్వతిని చూసినందుకు. కవుల గురించీ రచయితల గురించీ పండితుల గురించీ ఎంత సుదీర్ఘంగా వివరించి ఎంత బాగా తెలియజెప్పింది! నా మనసులో నెనరు నెమరు. అనిసెట్టి శిరంశెట్టి మాడిశెట్టి ఉమ్మడిశెట్టి కామిశెట్టి అలిశెట్టి. అలిశెట్టి లాగా రాయటం కష్టం. కష్టజీవుల జీవితాల కష్టాలను కష్టపడి తెల్సుకుంటూ మనసును కష్టపెట్టుకునే కష్టజీవి ఐన కవి అలిశెట్టి. హనుమచ్ఛాస్త్రి కృష్ణశాస్త్రి జరుక్ శాస్త్రి ద్వానాశాస్త్రి రామశాస్త్రి రావిశాస్త్రి. ప్యాంటుజేబులో పర్వతాల్ని కుక్కుకుని అరచేతిలో అరకులోయల్ని పెట్టుకుని వీపుమీద విశాఖబీచిని నిలుపుకుని నిలకడగా నిలిచి గెలిచిన విలువల విలుకాడు రావిశాస్త్రి. కారు పోతోంది. భాషావిశేషాల వేషాల తమాషాలు గోషాలు రాల్చుకుని బయటికొచ్చినయ్. ప్యాలిండ్రోములు చూడండీ ప్యాలిండ్రోములు. టమాట పులుపు కనుక వాడవా? లోయలో తూగుతూ పైరుపై వాలావా? వారెవా వికటకవి మిసిమి విరివి. కులుకు జలజ పాపా కులుకు. కిటికీ నిశాని వేడవే. ప్యాలిండ్రోములు బాబూ ప్యాలిండ్రోములు. స్పూనరిజమును కనరో స్పూనరిజమును. జరిగిన కత కరిగిన జత. శని వారము వాని శరము. రోజాపూలు పూజా రోలు. ఊరిలో మోట మోరిలో ఊట. మేనక కడ కనక మేడ. తలవని మలుపులు మలవని తలుపులు. తాను అందరితో మేళమాడింది మేను అందరితో తాళమాడింది. చిలకలేని పేటలో పలకరాని మనిషి పలకలేని పేటలో చిలకరాని మనిషి.. స్పూనరిజమును కనరో స్పూనరిజము.

ఇల్లు చేరేసరికి రాత్రి పది. వాణి కళ్లల్లో వెల్లువెత్తిన వెలుగుల పాలవెల్లి. శ్రీలక్ష్మి మనసులో సూర్యరశ్మి. నేనైతే మందమైన ఆనంద తరంగాల మందల మీద పొందిక గల అందమైన ఊహల విందులో.

సరస్వతాంటీ చాలా బాగుంది మామయ్యా ఆమె అంటే నాకెంతో ఇష్టం అన్నది వాణి.

నాకూ అంతేరా సరస్వతిని చూసినందుకు తృప్తిగా వుంది అన్నా.

నాకేం నచ్చలేదామె. రమ ఆంటీయే ఈమెకన్న చాలాచాలా బాగుంటుంది అన్నాడు వేణు.

ఇద్దరూ యిష్టమే నాకు అన్నది శ్రీలక్ష్మి.

వేణుకు సరస్వతికన్న రమే ఎక్కువగా నచ్చడం బాగా కలవరపరిచింది నన్ను.

**** (*) ****

Art credit: Lady With Veena by Riya Rathore4 Responses to సందర్శనం

 1. K SHESYU BABU
  March 22, 2016 at 7:27 pm

  ‘Etu chustey Norma Sheree .. Atu chustey kanchana Mala..
  Ata keygotayoo ardham kaaleydu oka vidhyarthi ki..”
  Sri Sri

 2. April 5, 2016 at 3:18 am

  ప్యూర్ అంత ప్యూరే ఈ స్ట్రీం. కాన్షన్స్ అంత కాన్షన్స్…కాదు కాదు కన్సెంట్రేటెడ్ డికాక్షన్…అంటే అదే చైతన్యధార . ఏ మైతేనేం … కంకరాళ్ల రోడ్డు మీద సాగింది బండి…కాదు , నల్లేరుమీద కానే కాదు;;; అయినా కంచికి చేరింది. తోవలో డ్రోమ్లు ! గిరాటేసిన స్పూన్లు. రీడబిలిటీ లేదని తెగగింజుకున్నా …అరచేతిలో స్వరం అన్ని వేళలా అబ్బదు. అబ్బ ! నేను చైతన్య స్రవంతిలో ఓలలాడుతున్నా….కాదంటే స్ట్రీం ఆఫ్ కాన్ష్యన్స్ లో .
  పండు కోసమ్ చెట్టెక్కక తప్పదు. విన్నారా రమనే సరస్వతి కన్నా బాగుందనటం కొసమెరుపు కొంటె రహస్యం…అనుకుంటా.

 3. Rammohan Rao
  April 9, 2016 at 10:08 pm

  గుట్ట మీది గుట్టు రట్టు కాకుండా పట్టుబట్టి నట్టు పడ కుండా కట్టలు కట్టలు యమకాలంకార చమకం చమక్కులతో జిమ్మిక్కులతో
  బుర్ర గోక్కుంటేగాని తట్టని తట్టలకొద్దీ పద్యాన్ని మద్యమంత ప్రియంగా రయంగా సాగని ప్రయాణంగా మార్మికంగా కళ్ళేలు లేని తురంగాభాస భావ తరంగాన్విత సకల శాకపాక సమస్త కవితతినామస్మరణాంచిత రసరమ్యరాగ స్మృతితో ఇష్టసఖీ సందర్శన సరంభ మాద్యంతమూ వదనము కదలనీయకుండా కథనము వదలనీయకుండా ప్రయోగ ప్రహేళికలా కొనసాగి వరగలగిరిశిఖరనివాసిని అనుగ్రహ పాత్రమైంది చైతన్య సమీహ రచనా స్రవంతి .

 4. April 10, 2016 at 9:49 am

  అర్థం కాకపోవటం ఆనందించటానికి అవరోధం కానవసరం లేదని అనుకున్నాను కానీ నా ఊహ తప్పు అని రుజువైంది. కామెంటు పెట్టిన ముగ్గురికీ ధన్యవాదాలు. అసలు విషయాన్ని పట్టుకోగలిగినవారు ఒకరిద్దరే అయినా అసంతృప్తి లేదు. నేను ఈ కథను రాయటం వెనుక James Joyce రాసిన Ulysses ప్రేరణ వుంది.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)