కవిత్వం

ప్రమేయాలు

01-ఫిబ్రవరి-2013

1
చాలాసార్లు చిరాకనిపిస్తుంది,
తాళింపులోకి కూరలా,
ఒక్కో నిజానికి, కొన్ని అబద్దాలను
అలవోకగా కలుపుతున్నప్పుడు.

2
కొన్ని సార్లు మనసు తెల్లబోతుంది,
లోపలంతంత పెట్టుకొని,
ఎదుటోడే ప్రపంచమన్నట్లు
ముఖానికి ఓ ముసుగు తగిలించుకొని,
అదేపనిగా ముచ్చట్లాడుతున్నప్పుడు.

3
ఎప్పుడైన విచిత్రమనిపిస్తుంది
పిసురంత ఆపేక్షకు తట్టుకోలేక
దేన్నో పగలుగొట్టుకొని
మాటల ప్రవాహం దూకినప్పుడో,
కనుల కింద, ఓ పల్చటి కన్నీటి తెర
రెపరెపలాడుతున్నప్పుడో,.

4
అప్పుడప్పుడు అబ్బురమనిపిస్తుంది
మనసు లోతుల్లోకి వేసిన గాలానికి,
ఎప్పుడెప్పుడో జారిపోయిన భావాలు కొన్ని,
అనుకోకుండా గుత్తులుగా తగులుకున్నప్పుడో,
నా ప్రమేయం లేకుండానే,పేపరు తీరానికి,
ఏ మూలలనుంచో,అప్రయత్నంగా,
కొన్ని వాక్యాలు కొట్టుకొస్తున్నప్పుడో..