కవిత్వం

‘డివైన్సీ’ బొమ్మ నవ్వు

సెప్టెంబర్ 2016

రెండే కొలతల రంగుల బొమ్మ-
బొమ్మలే లేని ఆ కనుల కొలనులో విరిసింది
ప్రేమ కమలమా
విషాదాగ్నికణమా?
ఆ పెదిమల కనుమల నడుమ
దృశ్యాదృశ్యంగా ద్యోతకమయ్యేది
అచ్చులు లేని చిత్రభాషా లేక
కలత నిదురలో పుట్టుమూగ స్వప్నఘోషా?
మోనాలిసా
ఓ మర్మయోగి పన్నిన
వన్నెల పన్నాగమా లేక అవ్యక్త అసుర సంధ్యారాగమా?

***

వేగ నాగరికతపై ‘ఆదిమకుట్ర’లా
రోడ్డుకడ్డంగా దిసమొల పిచ్చిది!
‘జురాసిక్ పార్క్’లో పిల్ల డైనోసార్ లా ‘క్రీకు’మని బైకు బ్రేకు!
‘నీయమ్మా’- తోకతొక్కిన నక్కలా నా అరుపు!
చీకటి మిన్నులా…
మన్ను పేరిన మోము
కళ్ళు చుక్కలు… నోరు జాబిలి
నా బూతు స్టీరింగై ఆ ‘స్త్రీ’ని నా వైపు తిప్పింది
మబ్బుల్లేని వేళ పున్నమి వెన్నెల్లా
ముఖమంతా కోపం లేని, కఠినం కాని, మెత్తని నవ్వే!
ఆ క్షణంలో ఆమెలో ఉన్నదెవరు… ఓ తల్లా? బిడ్డా? చెలియా? సఖియా?
ఆ నవ్వు భావమేమి? ఆ నవ్వు భాష్యమేమి?

***

శతాబ్దాలుగా డావిన్సీ రెండు కొలతల చిత్తరువును
శోధిస్తున్న ‘చిత్త’ పత్తేదారులారా
ఈ ‘డివైన్సీ’ ‘నాలుగు కొలతల నవ్వు’ గుట్టు విప్పి పుణ్యం కట్టుకోండ్రా బాబో!