కాదేదీ కవిత కనర్హం అన్నారు కాని నిజానికి కాదేదీ కవికి అసాధ్యం అనాలి. చటుక్కున ఒక తెల్లమేఘపు తునకలా మారి గగన సీమల్లో సాగిపోడమో, ఒక నదిలా ప్రవహి౦చి ఎన్ని హృదయ సీమలనో సారవంతం చెయ్యడమో, ఒక హరిత వనమై సేద దీర్చడమో, ఒక అక్షరమై సాధికారంగా దేన్నయినా చెప్పడమో ఒక కవికే సాధ్యం.
ఒకమేఘాన్ని భుజానవేసుకుని వెళ్ళడం, రాత్రి ఏరుకున్న చుక్కలను కొప్పుని౦డా తురుముకుని ఇంద్ర ధనుస్సుల కొ౦గుల్ని బొడ్లో దోపుకుని పొల౦లో అక్షరాల నాటు వెయ్యడం, ఆకాశమూ నెమలీ ఏరువాక పాట అందుకోడమూ.. చేనుగట్టును పియానోగా మార్చుకోడం ప్రసాద మూర్తి ఊహకు పతాకస్థాయి. చేనుగట్టు పియానో మీద అక్షరాలు ప్రసాదమూర్తిగారి ఇచ్చానుసారం పిట్టలై నర్తిస్తాయి.
రసానుభూతి అనుభవైక వేద్యం. అనుభవం వ్యక్తిగతం. వ్యక్తిగత అనుభవం సార్వజనీనం చెయ్యడం, వ్యక్తే సమాజమూ సమాజమే వ్యక్తీ అనే అక్షర సత్యాని మరో సారి ప్రవచి౦చడమే. అలాటిదే ఇదీ –
నాటిన ప్రతి అక్షరానికీ
నన్ను ఎరువుగా వాడుకు౦టాను.. ను౦డి
మొలిచిన వాక్యాల చివర
దేశం చిరునవ్వుని చిగురిస్తాను ..అనడం.
మరోసారి అనుకోమూ మహాకవి మాటలు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అందుకే వ్యక్తీ చిరునవ్వే దేశం చిరునవ్వు. జీవనమూ కాలమూ అనాది మానవ స్వప్నం పడుగుపేకల్లా అనవరతం సాగుతూనే ఉంటాయి. రుణాల మాఫీలు, పురుగు మందులు, ఉరితాడు ఒక బాధామయ ప్రపంచాన్ని కూడా చల్లని జల్లులా అనిపించడం అంత సులభం కాదు. చివరికి ఒక్కమాటతో రైతు పలవరింతలు అంటూ మాటరాని వారిని చేసారు. ఇది ఒక మచ్చు తునక.
పియానో మెట్లమీద ఎగురుతున్నపక్షులు అనేకానేకం. కవికి ఎలాటి ఊగిసలాటలూ లేవు, ఎలాటి నిషేధాలూ లేవు.
”ఎవరున్నారు వాళ్లకి?” అని జాలిపడుతూ అసహాయులకు, తలబాదుకు౦టున్న ఆత్మలకు, అనాధ బాలలకూ , అభాగ్య శిశువులకూ, ఖాళీ సాయంత్రాలకూ నెత్తుటి సంతకమై వేలాడే మట్టిమనుషులకు, కన్నీటి కా౦దశీకులకు చివరికి పిట్టలకు, సముద్రాలకూ ఇంకెవరున్నారు కవులు తప్ప? అవును కదా ఈ విశ్వంలో సమస్త బాధా తప్త హృదయాలకూ, సర్ప దష్టలకూ ఆలంబన ఒక్క కవే. కవి ఒక ఇంటి పెద్దా అక్కున జేర్చుకునే ఒక అమ్మ, వెన్నుతట్టి ధైర్యాన్నిచ్చే నాన్న, కొండంత అండగా నిలబడే ఒక పెద్ద అన్నయ్య/ అక్కయ్య. కవి ప్రతి వారికీ బంధువే, ఆపద్భా౦ధవుడే.
అందుకే ప్రసాదమూర్తిగారు తొలి కవితలోనే హామీ ఇచ్చేసారు నేనున్నాను మీకంటూ, ఆమాటే ము౦దుమాట లోనూ చెప్పుకున్నారు. ’కవి తన సామాజిక బాధ్యతను కలలో కూడా విస్మరి౦చరాదన్న తన వాదన. సామాజిక అంశాలను ఎంత కళాత్మకంగా కవిత్వీకరి౦చ వచ్చో పియానో మెట్లమీద అక్షరాలతో అందంగా గీసి మనసు మెత్తనఎలా వినిపించి తమ నేర్పరితనం నిరూపించుకున్నారు. కవిత్వం ఒక మాయగా చెప్పుకున్నారు.
కవిత్వం ఒక మాయ వంతెన, మాయ దీపం, మాయ రూపం, మాయ చూపు, మాయ నవ్వు, మాయ కౌగిలి, మాయ ఊయల, మాయ శవపేటిక. కాని కవిత్వపు చూపు సవరించుకుని, స్పష్టంగా ఏంచూడాలో ఎంత చూడాలో ఏది రాయాలో ఎంత రాయాలో ఎలా రాయాలో ప్రసాద మూర్తికి తెలిసినంత మరొకరికి తెలియదు. మనిషి నీడలే ప్రసాదమూర్తి కవిత్వం.
అనుభవాలను వ్యక్తిగతం చేసుకుని వాటిని చిలికి చిలికి మళ్ళీ మదనపడి విశ్వైక భావంతో విశ్వజనీనం చెయ్యగల నేర్పరి కవి. అందుకే ప్రతికవితా ఒక అమూర్త భావనగా వ్యక్తితో ఆరంభమై పోను పోనూ విస్తృతమై వినీల గగనాన్ని మించి విశ్వదర్శనం కలిగిస్తుంది.
***
సంకలనం: చేనుగట్టు పియానో
రచయిత: ప్రసాదమూర్తి
కాపీలకు: pramubandaru at gmail.com
సూక్ష్మం లో మోక్షం లా చక్కగా తెలియజేశారు…కవిత్వం గురించిన నిర్వచనాన్నిస్తూ ఆ మాయని స్పష్టంగా చూసి రాసిన కవి ప్రసాద మూర్తి గారు అనడం బాగుంది… అభినందనలు…