కవిత్వం

సాయంకాలమయింది

08-ఫిబ్రవరి-2013

సాయంకాలమయింది
ఇంటి బెంగ మరీ మరీ వేధిస్తోంది
దుఖాగ్ని  హృదయంలో ఉండ లాగా చుట్టుకుని
ఉండుండి సలపరిస్తోంది

వెన్నెల నవ్వు వినకుండానే
వేకువ పువ్వు చూడకుండానే
వెళ్లి పోవాలనుంది

ఏ  అమ్మ తన ప్రాణాన్ని  ఫణంగా పెడితే
ఈ లోకం లోకి వచ్చానో
ఏ తనూ లతిక తన శరీరా ణ్యం  లో
నన్ను కస్తూరీ మృగం  చేసిందో

ఏ సెలయేటి గలగలలు
ఏ  విరితేటి  పరిమళ ఝరులు
ఏ పసిపాప తప్పటడుగుల నాట్య విన్యాసాలు
ఏ ప్రియురాలి లేత కనుదోయి సాంద్ర ప్రకంపనలు
నన్నొక అనుభవం గా మలిచాయో….

ఎలా వచ్చాను ఇక్కడికి ?
మూసుకున్న లేత లేత పిడికిళ్ళ  మాటున
మూట గట్టుకుని ఇంత జీవనోత్శాహాన్ని  తెచ్చానా
మార్మిక యోగ నిద్రా ముద్రాంకి త మైన కనురెప్పలను
బలహీనమైన బలంతో  బలవంతంగా తెరచి చూస్తూ
ఇంత దయనూ, అంత ధైర్యాన్నీ
రవ్వంత కరుణనూ, గోరంత  అనుకంపనూ
ఈ ప్రపంచం మీదకు వెద జల్లానా …?

ఎలా వచ్చాను ఇక్కడికి …?
ఈ భ్రమాన్విత  లోకం లోకి
సౌందర్య హింసాత్మక చందన అగరు ధూప దీప ధ్యానం లోకి

వస్తూ , వస్తూ నేనేం  తెచ్చాను ?
ఒక కొత్త సూర్యోదయాన్నా  …?
అప్పటి వరకు ఎవరూ ఎరుగని చంద్ర శీతల జలపాతాన్నా …?
సాంద్ర తిమిరారణ్యం లో చక్ర వాక సంగీతాన్నా …?

వస్తూ , వస్తూ నేనేం  తెచ్చాను … ?

నిరలంకారం గా వచ్చాను
నిర్మోహం గా వచ్చాను
నేను అనే ఎరుక లేకుండానే వచ్చాను
జీవితం అంటే ఏమిటో తర్జని తో చూపించాను

జీవితం అనుభవం లోకి వచ్చింది
తర్జని రద్దై పోవాలి కదా
ఎలా వచ్చానో, అలాగే వెళుతున్నాను
ఏం  తెచ్చానో, అది ఇచ్చేశాను

సాయంకాలమైంది
ఇంటి బెంగ మరీ మరీ వేధిస్తోంది