ఓ ఆశలోకి జారడం ఎంత తేలికో ఓ లోతైన నిరాశలో మునగడమూ అంతే తేలిక
ఇక్కడ ఎవరూ లేరు, నేనూ నీ తలపూ… అంతే… అంతే… నా లోకమంతా ఇంతే!
ఒక ఊహ సంతోషమైతే మరో ఊహ దుఃఖం, నిజాలేవీ ఉండవురా
నేనూ, నీ తలపూ… అంతే.
ఒక తలపులో ఏదో విడిపోతుంది, ప్రాణం అల్లాడి పోతుంది,
మరొక తలపులో ఏదో ముడిపడుతుంది మనసు ఉప్పొంగుతుంది
అన్నీ తలపులే, నాకు నేను చెప్పుకొనే నీ కథలే.
ఈ సాయంత్రం నది ఒడ్డున కూర్చొని
పొడి ఇసుకని గుప్పిళ్ళ నుంచి జార విడుస్తుంటే ఎదో దిగులు
నిను చూస్తూ గడిచిపోయిన కాలమొకటి ఇక్కడే ఉండింది కదా, ఏమైపోయింది?
ఏ దిక్కులోకి క్రుంగిపోయింది?
ఇలాగే ఈ ఇసుకలాగే ఈ గుప్పిళ్ళ నుంచి
గుండె అంచుల నుంచి జ్ఞాపకాల్లోకి ఎప్పుడు జారిపోయింది?
పొద్దంతా చీకట్లోకి వెళ్ళి పోతోంది, కళ్ళలోకి వెచ్చని కన్నీరొచ్చి చేరుతోంది
నిశ్శబ్దం అని అందరూ సంబోధించే ఇక్కడే, నాకు మాత్రం
నీ గొంతులో మొదటిసారి విన్న ఆ పాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంది
చీకటని అందరూ వెలివేసిన శూన్యమొక్కటే తోడుగా ఉంది.
నీకొకటి చెప్పనా
నా ఇప్పటి సంతోషమంతా నా దుఖంలోనే ఉందిరా
మరికాసేపు, ఊహ ఉన్నంతసేపు, ఊహు… కాదు, ఊపిరున్నంతసేపు
నీ కోసం దుఃఖపడగల అపూర్వ క్షణాలు దొరికాయి చూడు
ఇదే ఇప్పటి నా సంతోషమంతా!
ఇది ఇలానే ఉండిపోతుందని
రాబోయే కాలమంతా వేదనే అని నాకేం నమ్మకం లేదు
భూమి తిరుగుతోందటగా
రాత్రి తరువాత పగలు
వేసవి తరువాత వర్షం
ఇలానే
ఇలానే ఈ చీకటంతా ఒకనాటికి వెన్నెలవుతుంది
అవుతుందిలేరా
నీకూ నాకూ మధ్య తెర పట్టుకొని కూర్చున్న కాలం అలసిపోతుందిలే
ఇవాళ కాకపోతే రేపు
దూరాలలో అల్లుకున్న దిగులు కావ్యాలు అప్పుడు కలిసి కూర్చొని చదువుకుందాం, సరేనా.
చూస్తున్నావుగా
తలపులో నుంచి తలపులోకి ఎలా ప్రవహిస్తున్నానో!
Pic. Credit: https://www.pinterest.com/pin/304555993535390396/
అవును. ఇవాళ కాకపోతే రేపు. సరిగా చెప్పారు రేఖా.
మీరే అన్నట్టు “.. ఆశా , దాని వైఫల్యమూ రెండూ నీ కోసమే ” థాంక్యూ Mam
“ఒక తలపులో ఏదో విడిపోతుంది, ప్రాణం అల్లాడి పోతుంది,
మరొక తలపులో ఏదో ముడిపడుతుంది మనసు ఉప్పొంగుతుంది
అన్నీ తలపులే, నాకు నేను చెప్పుకొనే నీ కథలే.”
“చూస్తున్నావుగా
తలపులో నుంచి తలపులోకి ఎలా ప్రవహిస్తున్నానో!”
“నీ కోసం దుఃఖపడగల అపూర్వ క్షణాలు దొరికాయి చూడు
ఇదే ఇప్పటి నా సంతోషమంతా!”
ఇంత తేలిక పదాల్లో పట్టనంత ఆర్థ్రత ఎలా వంపేస్తారు రేఖా మీరు. మీరు నాలుగే మాటలు రాసినా చదవటం మహా ఆనందం.
చాలా చాలా ధైర్యమూ సంతోషమూ మీ స్పందనతో !! థాంక్యూ సునీత గారూ
వెరీ నైస్
థాంక్యూ సర్ !
Asal ilanti padalu meeke sadhyam…akka …konnisarlu naa manasulo unnavi mee padallo onchipostaaru
స్రవంతీ … ఒక గూటి పక్షులం కదా ! థాంక్యూ
చాలా బాగా రాశారు
థాంక్యూ సునీ!
చీకట్లోంచి వెన్నెల్లోకి చూడగలిగిన, నమ్మకపు నిరీక్షణ బాగుంది. దుఖంలోనే సంతోషాన్ని నిలుపుకునే స్థైర్యం, ఆశ నిరాశల అలల ప్రవాహం నిశ్చింతల తీరానికేనని కొంతలో కొంత ఆశ. కవితలో కొత్తదనం వుంది.
“.. నమ్మకపు నిరీక్షణ ..” Thank you so much for your beautiful comment Sir ! TQ
చాలా చాలా బాగా రాశారు… అభినందనలు
థాంక్యూ సురేష్ గారూ !!
బాగుంది.. చాలా బాగుంది కవిత.. ట్రూ ఎమోషన్ ని పట్టుకుంది కవిత.. కవితలోని లోతు, ఆర్ద్రత మళ్లీ మళ్లీ చదివిస్తాయి.. అభినందనలు.
గుండెల్లో గుచ్చుకొన్న పూలబంతి మీ కవిత స్రవంతి