కథాకథనం

కాలానికి నిలిచిన కథ పాలగుమ్మి పద్మరాజు ‘చీకట్లో మెరుపులు’

మే 2017

క మిత్రుడు, మా ఇద్దరికీ బాగా తెలిసిన వ్యక్తి, మేమిద్దరమూ పెళ్ళి చేసుకున్నామని తెలిసి అప్యాయంగా ఇంటికి భోజనానికి పిలిచాడు. నలభై ఏళ్ళు అతనికి. భార్య, ఇద్దరు పిల్లలు. ఆ సాయంత్రం నవ్వులు, సరదా, అందం, ఆనందం అన్నీ. కబుర్లు, కొత్త ఆశలు మావి. పాత ఆనందం వాళ్ళది. ముచ్చటయిన సంసారం. మధ్యలో ఊళ్ళు మారి, చిరునామాలు పోయి, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ చిరునామా దొరికి పిల్లలతో వెళ్ళాము.

అదే ఇల్లు. సుఖ సామ్రాజ్యాలు ధ్వంసమయి మిగిలిన కోటగోడలా ఉంది ఇప్పుడా ఇల్లు. 15 ఏళ్ళ క్రితం ఆమె కాన్సర్ తో చనిపోయింది. పిల్లలకి రెక్కలొచ్చాయి. అతనికి రిటైర్ అయ్యే వయసు వచ్చింది. పెద్ద హోదా. డబ్బుకి కొదవ లేదు. షుగర్, గుండె జబ్బు. ఇంట్లో ఇంత ఎత్తున దుమ్ము. డంపింగ్ యార్డ్లోలా కుప్పలకొద్దీ గదుల్లో సామాన్లు. అన్నిచోట్లా, సోఫాలతో సహా నిండిపోయిన విడిచిన, మాసిన బట్టలు. ఎక్కడ కూచోవాలో అర్థం కాక మా పిల్లలు బిక్కచచ్చిపోయారు. పొద్దుణ్ణుంచే తాగుడు మొదలు. సాయంత్రం ఎప్పుడో వండుకుంటాడు.

ఎవరికి అవసరం? ఎవరికి ఆసక్తి ఉంటుంది అతనిమీద? అతనికే లేనప్పుడు.

మాటలు సాగించాలని “పదిహేనేళ్ళయింది కదా? మళ్ళీ పెళ్ళి చేసుకొంటే బావుండేది నువ్వు” అన్నాను. “నీలా పెళ్ళి చేసుకో అని ఎవరూ గట్టిగా సలహా ఇవ్వలేదు పద్మా” అన్నాడు నవ్వుతూ.

ఇంటికొచ్చాక దిగులుగా…

అప్పటినించీ 1941లో పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘చీకట్లో మెరుపులు ‘ కథ నాలో సుళ్ళు తిరుగుతూ గుర్తుకొస్తూనే ఉంది. ఒకసారి చదివి మర్చిపోయే కథ కాదు ఇది. ఒకసారి చదివితే అర్థమయ్యే కథ కూడా కాదు. ప్రతి వాక్యం మందుగుండు దట్టించిన తుపాకీ లాగా ఉంటుంది. ప్రతి మాటా లేపనం పూసినట్టు గానూ ఉంటుంది. దిగులూ, విచారం రేకెత్తిస్తుంది. ఆశ, ఆనందం ఉన్నాయని భరోసా ఇస్తుంది.

అది పాలగుమ్మి పద్మరాజు తప్పితే వేరే వాళ్ళు రాయగలిగే కథ కాదు. పద్మరాజు గారి ‘గాలివాన’ కు పేరొచ్చింది, ‘పడవ ప్రయాణా’నికి పేరొచ్చింది. ఈ కథను కథా సంపుటంలో చదివేదాకా ఎవరూ ప్రస్తావించలేదు. చెహోవ్ మాత్రమే రాయగలడనిపించే కథ.


చీకట్లో మెరుపులు (ప్రతిభ పత్రిక – 1941)

ఆ వూళ్ళో అతను ఫలానివారి అబ్బాయి. అతను తన వయసులో ఉండగా తిరుగుబోతు, రెబెల్, కవి.
ఇప్పుడతను రోకలిబండ. మేకపిల్లలాగా సాధువు. నిరపాయకరమైన ప్రాణి. అతని ప్రతి అంగంలో నుండి చటుక్కున కనపడేది ఏదో లోపించింది. అతని ముఖంలోని లోతుకళ్ళు ఎదురుగా ఉన్న వస్తువుల్ని చూడటం మర్చిపోయాయి. అతనికి ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు. మర్చిపోయాడు అంతే.

సంవత్సరాల తరబడి అతను ‘ఆ ఇంటికి’ వెళ్తున్నాడు. అతను ‘ఆ ఇంటికి’ వెళ్ళటం గురించి అందరూ చెప్పుకోవటం పాతబడి పోయింది. అతను సుఖం కోసమే పందెం పరిచాడు ఇన్నాళ్ళూనూ. అది దొరికిందో లేదో.

సవ్యంగా పెళ్ళిచేసుకొన్నవాళ్ళంతా సుఖంగా ఉన్నారా? చిన్న చిన్న విషయాల్లో కూడా మాటా మాటా అనుకోవడం చూశాడు. ఆ మాటకొస్తే ఉంచుకున్నా పెళ్ళిచేసుకొన్నా ఒకటే. కానీ పెళ్ళి అంటే ఇంకా స్థిరమయినది. ఉంచుకోవటం వేరు. ఇందులోకూడా మనుషులకి క్రమంగా ఒకరంటే ఒకరికి విసుగు పుడుతుంది. కానీ పెళ్ళి అంటే చచ్చినా బ్రతికినా ఒకరికి ఒకరు కట్టు బడి ఉండవలసిందే. అతనికి పెళ్ళి అంటే అమితమయిన భయం.

ఆ ఇంటికొచ్చిన అతనికి ఆమె ఎక్కడో భోగం మేళానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అతనికోసం ఉంచిన కల్లురొట్టి ఫలహారం, కాఫీ. ఆ గది, ఆ ఫలహారం, ఆ దీపం అన్నీ చితికి కొరడుబారిపోయినట్టు ఉంటాయి. వేడిమి ఎక్కడా దొరకదు. ఆ గదిలో, అతనిలో.

విసుగుపుట్టి రిక్షా ఎక్కుతాడు బయటకువచ్చి.

అతని ఉద్దేశ్యంలో ఆ పోలీసువాడు రాక మునుపు సరిగ్గానే నడిచింది. అయినా అసలు మనుష్యులలో ఒకరిమీద ఒకరికి విసుగుపుట్టింతర్వాత విచ్ఛిన్నం చెయ్యటానికి ఎవడయినా చాలు. ‘ఆమె ‘ ప్రస్తుత పరిస్థితిలో ఎవడితో పడితే వాడితో స్నేహం కలిసి ఉండును.

ఆ బయలు ప్రదేశమంతా ఒక రంగ స్థలం. దానిమీద మనిషి దౌర్భ్యాగ్యపు బ్రతుకు నాటకమాడబడుతోంది. ఎదో విషాదం, దుఖం. చిరునవ్వు కూడా బరువుగా, విచారంగా, కనబడుతోంది. వెలుగు చల్లగా చచ్చిపోయినంత చల్లగా ఉంది. లోకం మృతలోకమయింది ఆ వెలుగులో.

అంతలో తమాషాగా అతని పాత స్నేహితుడు అతని రిక్షాని ఆపి, జీవితమంత ఉత్సాహంతో అతని రిక్షాలోకి ఎగిరి దూకాడు.
స్నేహితుడు పెరగటమే ప్రయోజనంగా పుట్టిన వ్యక్తి. ఉత్సాహం బలం అతనిలో. స్నేహితునికి అతని పెళ్ళిలో జీవితం సరియైన మార్గానికి తిరిగిపోయింది.

“ఇప్పుడేమిటి, ఈ టైం లో రోడ్లమీద తిరుగుతున్నావు? ఈ పాటికసలు వెచ్చగా పక్కలో దూరి ఇంకో గుండెకాయకి గట్టిగా అదుముకొని ” అని అంటూ… “నీకు కాబట్టి చెబుతున్నాను. పగలంతా నాకు ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఉంటుంది” అంటాడు.

ఆ స్నేహితుడు ఇతనే రాసిన పంక్తులు ఇతనికి తిరిగి వినిపిస్తూ …

ఎద బిగువున జవ్వనమున చలించినపుడు
రేయి ఇంద్రజాలములల్ల మాయ కలదు

కానీ అది రాసిన మితృడు ఇప్పుడు మృతుడు. ఏ ఆశా, వెలుగూ, వెచ్చదనం లేదు అతని జీవితంలో.

ఆ స్నేహితున్ని చూస్తే బతుక్కి బలం అవసరమని అతనికి అనిపించింది. ఎంత సుఖం అది – అలా దిట్టంగా, నిర్లక్ష్యంగా ఉండటం? ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఉండటం. ఆ స్నేహితుడు ఎంత ఆనందంగా ఉన్నాడు.

ఆ స్నేహితునికి రాత్రి తనకొక అపూర్వమయిన అనుభవం రాబోతుందని నమ్మకం ఉంది. ఆ స్నేహితుడు రాబోయే రాత్రిని గురించో, క్రితం రాత్రి జరిగిన తమాషాలను గురించో, జీవితానికి అర్థం ఇచ్చే చిన్న చిన్న సుఖాల గురించో ఆలోచిస్తున్నాడు. ఇతనికి వాటన్నిటి మీదా నమ్మకం పోయింది.

పిల్లలు లేరన్నదే ఆ స్నేహితుని కుటుంబానికి దిగులు.

వాళ్ళిద్దరూ కలిసి ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళారు. ఇతన్ని చూసి స్నేహితుని భార్య చాలా ఆనందించింది. స్నేహితుని భార్య భర్తతో వేళాకోళమాడుతోంది. అతనికి సుఖమూ, సిగ్గూ కలిగాయి. అతను ఉంచుకున్న ఆమె ఎప్పుడూ ఇట్లా వేళాకోళమాడలేదు.

అతని స్నేహితుని భార్య చిరునవ్వు నవ్వుతోంది. ఆమెలో ఎదో అది యవ్వనం కాదు. అవునేమో అతనికి తెలియదు. ఆమె చిరునవ్వు నవ్వుతోంది. గట్టిగానూ నవ్వుతోంది. కొంచెం తిప్పుకొంటుందేమో కూడానూ. కానీ ఆమె చుట్టూ ఒక గిరి గీసుకొంది. అందులో భర్తకు తప్ప ప్రవేశం లేదు. “భార్య అంటే ఈమేనేమో?” అనిపించింది. ఆమె ప్రేయసి మాత్రం కాదు.

ఆమె రూపంలో ఇది చదివాననుకున్నాడు.

“నేను నీకు మాత్రం కాను. నేను నవ్వగలను. పులకించేట్టు చెయ్యగలను. సుఖించగలను. కానీ నాకు ప్రేమ అంటే తెలియదు. నా చనువు ఒకరికోసమే. నీకు చాతనయితే నన్ను చూసి ఆనందించు. నేను నీకు కాకపోవటం నీ దురదృష్టం” ఆమెని చూసి అతను ఎంతో ఆనందిస్తున్నాడు.

వాళ్ళు భోజనం చేస్తుంటే భోంచేయనని బెట్టుచేసిన అతనికి ఆశ కలిగింది. ఆ ఇంట్లో తను వదిలేసిన కల్లురొట్టె, కాఫీ
జ్ఞాపకం వచ్చాయి. ఆ పోలీసువాడు కూడా.

భోజనాలు అయిన తరువాత సావడిలోకి పోతూ ఉండగా సగం తెరిచి ఉన్న తలుపులోంచి పడకగదిలోకి ఒక్కసారి చూశాడు. ఆ గదిలో అస్పష్టంగా, పొగలాగా వెచ్చదనం అలుముకొని ఉంది. ముడుత పడని కొత్త తెల్లని దోమతెర, ఎదో దాచుకొన్నట్టు వేలాడుతోంది. పందిరి మంచం పక్కన అగరువత్తులు, పాయలుగా చీల్చిన తమలపాకులు.. ఆ దోమతెర లోపల మెత్తని పరుపూ, తెల్లని మెత్తని ఎత్తు తలగడలూ…లతలు అల్లిన దుప్పటీ… ఊహించుకున్నాడు అతను.

“ఇది నీకోసం కాదు. నీకు కావల్సివస్తే ఇల్లాంటిది ఇంకొకటి తయారు చేసుకో. ఈ తలుపు తెరచిఉన్నా ఇందులోకి నీవు రాలేవు. ఈ తెలుపు నీకు పడదు. ఈ పొగలో నీకు ఊపిరి సలపదు”

ఇంకా వారిద్దరినీ ఒకరికోసం ఒకరిని సృష్టించినట్లున్న భార్యా భర్తలని ఒకరికొకరికి ఒదిలి పోవాలనీ, వారిద్దరికోసమే సృష్టించిన ఆ గదిలో వెచ్చదనానికి వారిని వదిలిపెట్టాలనీ కూడా తెలిసింది.

శలవు తీసుకున్నాడు అతను.

‘ఆమె ‘ ఇంటికి తిరిగి వచ్చాడు అతను. ఆకలి వేసింది. అతను వదిలి వెళ్ళిన చల్లని కల్లు రొట్టె అలాగే ఉంది. అది తిని కాఫీ తాగి అన్ని నిరశన వ్రతాలూ ఇలాగే అంతమవుతాయి అనుకున్నాడు. అతను పక్కలోకి దూరి ఆమె కప్పుకొన్న దుప్పటి కప్పుకున్నాడు.

తరువాత ఆమెవైపు తిరిగి ఆమెను గట్టిగా అదుముకున్నాడు. చల్లదనం. అతనికి నిద్రలో కలలు కూడా రాలేదు.

***

(75 సంవత్సరాల క్రితం పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన కథ ఇది. అతనిలాగా పెళ్ళి ఎందుకు అని పెళ్ళి చేసుకొనేందుకు భయపడే యువకులు ఈరోజూ ఉన్నారు. కజ్జాకోరు భార్యలూ ఉన్నారు. పెళ్ళిళ్ళు అప్పుడు, ఇప్పుడూ ఒకలాగే ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం ఆడంబరంగా, ఇంకొంచెం గందరగోళంగా.

పద్మరాజు మనకి ఒక మంత్రనగరి సృష్టించి ఇచ్చారు. సమ్మోహనకరమయిన మంత్రనగరి. ఆ మంత్రనగరిలోకి దారి ఎవరికి వాళ్ళు వెతుక్కోవలసిందే. కాకపోతే జీవితం అంటే భయం ఉండకూడదు. ఒక బలం, ఆశపడే, ఆనందించే శక్తి ఉండాలి. మన జీవిత ప్రయాణానికదే చోదక శక్తి.)

**** (*) ****