కథ

గరుగు చెప్పిన కథ

మే 2017

రికి ఉత్తరాన హద్దు గీసినట్టు తాడిచెట్లు. వాటికి పర్లాంగు దూరంలో గరుగు. దాని తర్వాత నక్కలబోడు. దానికి పైన దోసకాయలబోడు. ముందుకుబోతే పీసెర్లకొండ. ఆ కొండలో కానీ, ఈ పక్క మాలకొండ అడివిలో కానీ, మా ఊరికి దిగవనున్న మల్లప్పగొందిలో కానీ లేని సక్కదనమేందో.. గరుగులో ఉన్నట్టనిపిచ్చేది. మహాకాయుడెవుడో రొమ్మిర్సుకుని పడుకున్నట్టు ఉంటదా గుట్ట. దాన్నిండా యాడచూసినా తెల్లటి కన్నెరాళ్లే. గుట్టకాడికి ఎప్పుడు పొయినా ఎవురో గుసగుసలాడుతున్నట్టనిపిచ్చేది. ఆ ఏపు పెద్దగా మనుషులు పొయ్యేది కూడా లేదు. నాకు మాత్రం అటొచ్చినప్పుడల్లా తెలిసిన మనిసెవురో తిరుగుతున్నట్టనిపిచ్చేది. అక్కి దాసరోడి గురించి ఇన్న కతలన్నీ గుర్తుకు వచ్చేయి.

అక్కి దాసరోడు, అక్కిపిచ్చోడు…

రెండు పేర్లు, రెండు రకాల కతలు. మనిసొకడే.

సిన్నప్పుడు బడికిపోతుంటే పెద్దూరు పిల్లోల్లు అక్కిపిచ్చోడి గురించి కతలుకతలుగా చెప్పేవోళ్లు. వాడు ఉచ్చ పోస్తే రాతిమీద కూడా పెచ్చులు ఎగిరి పొయ్యేయంట. పిగిలీ కొడితే రెండు మైళ్లదూరం ఇనిపిచ్చేదంట. మా ఊరడివిలో ముగ్గురు దొంగోళ్లతో రోజంతా యుద్ధం చేసి సంపిండంట. అక్కోడి గురించి ఇట్టాంటి కతలెన్నో.

‘ఆరున్నర అడుగల ఎత్తు మనిషి. ఈపు మీదికి జారిన జుట్టు, నాపరాయిలాంటి నల్లని నుదురు, పెద్దపెద్ద కనుగుడ్లు, పొడుగ్గా బండలాంటి ముక్కు, మెలితిరిగిన మీసాలు, మోకాళ్లు తాకే చేతులు, కొండలాంటి గుండె. ఈయన్నీ మామూలు విషయాలే. అక్కోడి తొడల్లో ఉంది అసలైన మర్మం’.

అదే ‘సంజీవి’. మనిషికి సావులేకుండా చేసే సంజీవి.

అక్కోడంటే ఇప్పుటి మనిషి కాదు. అరవై డెబ్బయ్యేళ్ల కిందటిమాట. మాయత్త, మానాయన బుడ్డబుడ్డ పిల్లోళ్లుగా ఉన్నప్పటి సంగతి. అడివే వాడికి గూడు. అప్పుడప్పుడూ చేతిలో సితార పట్టుకుని అడుక్కోడానికి ఊర్లమీదికి వచ్చేవోడంట. వాడికి బిచ్చమెయ్యడానికి మాత్రం ఆడోళ్లు బైటకొచ్చేవోళ్లు కాదంట. ఆడమనిసిని చూస్తే శివాలెత్తి పోతాడనేవోళ్లు. కన్నారా చూసిండా, ఆ మనిసిని వదిలేవోడు కాదంట. కొంతమంది మటుకు ‘అసలు అక్కిదాసరోడి పాట, వాటం చూసి ఆడోళ్లే వాడినెతుక్కుంటా పొయ్యేవోళ్లు’ అన్నరు. వాడెప్పుడూ ఎవుర్నీ ఏదీ చేసినట్టు చూసినోళ్లే లేరంటరు. వాడు సితార మీటుతూ, పాడుతుంటే ఏ జీవైనా ఒళ్లుమరిచిపోవాల్సిందే అంట. వాడి గురించి ఇన్న కతలన్నీ గుర్తొస్తా ఉంటే గరుగు మీద కాసేపు కూర్చోవాలనిపిచ్చింది. అప్పుడు మల్లప్పగొంది మీదికి దిగతా ఉంది పొద్దు. ఆడ కూచ్చుని చూస్తా ఉంటే.. డెబ్బయ్యేళ్ల కిందికి పొయింది ఊరు. మిద్దెలన్నీ మాయమయినయి. అడివితో అల్లుకుపోయిన గుడిసెలతో.. చిన్నపల్లె కళ్లముందుకొచ్చింది.

***

మాలకొండ అడివిలోంచి మా ఊళ్లోకొచ్చే సన్నని బాటమీద.. ఆరున్నరడుగుల మనిషి. మోకాళ్లకి కాస్త కిందకి కట్టిన పంచె, మెడమీద పాత కండవ తప్ప ఒంటిపై మరే గుడ్డా లేదు. మిట్టమధ్యాన్నం. గాలికి ఎర్రమట్టి ఎగిరిపోతా ఉంది. చేతిలో ఉన్న సితారని మీటుతూ మెల్లగా నడుస్తుండు. అక్కిదాసరోడు ఊళ్లోకి వచ్చేసరికి.. ఎండ సెగకి తట్టుకోలేని చంటోళ్లు గుక్కపట్టి ఏడుస్తా ఉన్నరు. సిత్రంగా వాళ్లంతా గాలి జోలపాడినట్టు నిద్రలోకి జారుకున్నరు. వాడు అట్టనే సితార వాయిస్తూ ఇళ్లన్నీ తిరిగి రెండు సంగటి ముద్దలు, ఇంత గోగాకు పచ్చడి సంపాయించి బడికొట్టం ముందుకి చేరిండు. ఆడ్నే ఉన్న రావిచెట్టు కింద కూర్చోని సితార తీగల్నిసరిచేసుకుంటుంటే.. కొట్టంలోంచి అయివోరు, అక్కోడ్ని చూసి పలకరించినట్టు నవ్విండు. బదులుగా తను సితార తీగల్ని మీటిండు. బళ్లో పిల్లోళ్లంతా బైటకొచ్చి నిలబడ్డరు. పదినిమిషాల పాటు ఏకబిగిన సితార వాయించి ఆపిండు అక్కోడు. పిల్లోళ్లంతా మాటలు మర్సిపోయి మిటుకూమిటుకూ చూస్తా ఉన్నరు.

అప్పుడే బడికొట్టానికి తూరుపుపక్క వీధిలో ఉన్న ఇంట్లోంచి కడవెత్తుకుని బైటకొచ్చిందొకామె. పెదకాపు చెల్లెలు. భర్త చచ్చిపోడంతో అందమ్ముల ఎదానే ఉంటా ఉంది. పేరు కొండమ్మ. నడిసొత్తున్న నల్లతాసులా ఉంది మనిషి. నెలవంకతో చెక్కిన గెనేటి రాయి బొమ్మలా ఉంది. కడవ తీసుకుని బడికొట్టానికి పడమటి పక్క ఉన్న బాయి దగ్గరికిపొయింది. అటే చూస్తున్న అక్కోడు సితార పట్టుకునే పైకి లేసి, బాయికాడికి నడిచిండు. పిల్లోల్ని మధ్నాన్నం కూటికి ఇంటికి పంపిన అయివోరు.. అడనే కూచ్చోని బాయి దిక్కుకే చూస్తాఉండు.

కొండమ్మ నీళ్లు తోడి కడవకి పోసుకుని ఎత్తుకోబోయేసరికి.. ఆడికి చేరిండు అక్కోడు. దోసిలి పట్టి మంచినీళ్లు పొయ్యమన్నడు. వాడినట్టాగే చూస్తా.. చేదని మళ్లీ బాయిలోకి ఇడిచి నీళ్లు తోడింది. కొండమ్మ కళ్లలోకి అక్కోడి చూపులు గుచ్చుతుంటే.. వాడి చేతివేళ్లని మీటతా ఉన్నయి ఆయమ్మి చూపులు. అట్టనే చూస్తా చేదడు నీళ్లు తాగిండు. నీళ్ల కడవతో తను పోతాఉంటే.. సితార అందుకున్నడు.

కోటే నన్నిడనాడకే
ఓ చిలకల కోటే.. చిట్టెపు రైక
గోటిరైకా.. కొబ్బిరిపొడుమా
కోటే నన్నిడనాడకే…
సేను కాడికి నువ్వే రాయే
శనగపీకను నేనే వస్తా..
నా సాయ నువ్ చూడకపొయినా
శనగమండతో చతురులు ఆడే
కోటే నన్నిడనాడకే
ఓ చిలకల కోటే.. చిట్టెపు రైక
గోటిరైకా.. కొబ్బిరిపొడుమా
కోటే నన్నిడనాడకే
బాయి కాడికి నువ్వే రాయే
నీళ్లు తోడను నేనే వస్తా
నా సాయ నువ్ చూడకపొయినా
నీళ్ల కడవతో చతురులు ఆడే…

కొండమ్మ నీళ్ల కడవతో ఇంట్లోకి పోడంతో.. పాట ఆపి మళ్లీ రావిచెట్టుకిందకొచ్చిండు.

సంగటి ముద్దలు మింగతా ఉంటే..

‘ఆడమనిషి మీద అతిగా బెమలు పెంచుకున్నోళ్లంతా చరిత్రలో రాక్షసులు, పిచ్చోళ్లుగా మిగిలిపొయిన్రురా’

అయ్యవోరి మాటకి తలెత్తి.. ఎర్రినవ్వొకటి నవ్విండు.

‘నీకాడ సంజీవిని ఉందంట గదరా.. తల బద్దలుకొట్టినా ఏంగాదంట..?’

సంగటి ముద్ద గోగాకు పచ్చడిలో తిప్పుతా.. ‘ఊరుకో అయివోరా.. నాకాడ యాముంది’ అంటూ ముద్ద నోట్లో పెట్టుకున్నడు.

‘ఒరేయ్ దరిద్రుడికి సంజీవి కాదు, అమృతం దొరికినా ఈ బూమ్మీద బతకడం కష్టమే గుర్తుబెట్టుకో’

అయివోరొంక అట్నే చూస్తా సంగటి తిన్నడు అక్కోడు.

‘అయినా మంచి వయసులో ఉన్నవు. ఏదొక పనిచేసుకుని బతక్క ఈ అడువులెమ్మట తిరగడమెందుకు..?’

కాసేపాగి ఓ వెర్రినవ్వు నవ్విండు అక్కోడు. సంగటి తినడం పూర్తిచేసి పైకి లేసిండు.

ఇందాక వచ్చిన దిక్కుకి కాక.. మంచినీళ్ల బాయి మీదగా, గరుగు కింద ఉన్న చెరువుకట్ట పక్కకి నడుచుకుంటా పొయిండు. పెదకాపోళ్ల చేను దిక్కుకి పొయి చెట్లలో కలిసిండు. కూటికి పొయిన పిల్లోళ్లు మళ్లీ రావడంతో బడికొట్టంలోకి పొయిండు అయివోరు.

పొద్దుగూకే యాలకి పల్లెంతా గుబట్లాడతా ఉంది. అక్కోడు కొండమ్మని పట్టుకున్నడంట. చేలో గడ్డికిపోతే మీదపడ్డడంట. కొండమ్మ, వాళ్ల ఒదిన.. తప్పించుకుని పరిగెత్తుకుంటా ఒచ్చిన్రంట. ఇదీ వార్త. చెరువుకట్టకి పై ఎత్తున ఉంది పెదకాపు చేను. చేను మధ్యలో ఆరు మట్ల లోతున్న బాయి. బాయొడ్డున ఉన్న గుట్ట పక్కనుంచి మీదకొచ్చిండంట వాడు. కొండమ్మోళ్ల వదినే ఇదంతా చెప్పిందంట. వాడ్నించి అంత దూరం నుంచి తప్పించుకుని వచ్చిన్రంటేనే, అదేదో సాహసం లాగా చెప్పుకుంటా ఉన్నరు ఊళ్లో.

రాత్రికి బడికొట్టం దగ్గిర పంచాయతి పెట్టిండు పెదకాపు. అక్కిదాసరోడు ఊళ్లోకి వస్తే నరికెయ్యడమేనని తీర్మానం చేసిండు. పెదకాపుకి అయినోళ్లు, కొంతమంది కుర్రోళ్లు ఆ మాటకే ఓటేసిన్రు.

‘మొన్నామధ్యన పీసెర్లకొండకి గడ్డికి పొయిన ఆడోళ్ల ఎంట కూడా పడ్డడంట’ గుంపులోంచి ఎవురో గట్టిగా అన్నరు.

‘ఆ దాసరోడు మన ఇళ్లళ్లో అడక్కతింటా.. పాటలు పాడతడా’ నలుగురైదుగురు అక్కసు ఎళ్లగక్కిన్రు.

‘అసలింత పని చేసినోడు మళ్లీ ఊళ్లోకి వస్తడా.. వదిలెయ్యన్రా’ అన్నరు కాస్త వయసులో పెద్దోళ్లు.

‘వాడు పిచ్చినాకొడుకు.. అడక్క తినడానికి కచ్చితంగా వస్తడు. సంపితీరాల్సిందే’. పెదకాపు గట్టిగా అన్నాక ఇంకెవురూ మాట్లాడలేదు.

***

తెల్లారింది. రాత్రి పంచాయతీ సంగతి మర్సిపొయిన ఊరిజనం.. ఎవురి పనుల్లోకి వాళ్లు పోతా ఉన్రు. పొద్దు బారెడు పైకెక్కినాక.. సితార మోగింది. ఊరంతా ఉలుకూపలుకూ లేకుండా అయిపోయింది. మంచినీళ్ల బాయిదగ్గర ఎవురో పిల్లోళ్లు. నీళ్లు చేదుకుంటుంటే పొయిండు అక్కోడు. చేదిన నీళ్లు, కడవలు ఆడ్నే పడేసి పరిగెత్తిన్రు వాళ్లు. సితార పక్కనబెట్టి చేదలో నీళ్లు దోసిటతో తాగుతుంటే.. తలమీద ఠంగ్ మని దెబ్బ. ముందుకి పడబోయి తట్టుకుని నిలబడ్డడు. చేతిలో ఉన్న చేదని తీసుకుని.. సర్రున ఎనక్కి ఇసిరిండు. పెదకాపు పక్కనున్న మనిషి నాలుగడుగుల దూరంలో పడ్డడు. పెదకాపు చేతిలో ఉన్న కర్ర చూసి, తననీ లాగి ఒక్క తన్ను తన్నిండు. ముందు పడినోడి పక్కనే పెదకాపు పడ్డంతో ఇంకో ఇద్దరు గుమ్మునుండిపొయిన్రు. కిందపడ్డోళ్ల దగ్గరికి పోయి లేపి నిలబెట్టిన్రు.

‘నా కొడకా.. నువ్వియ్యాల సచ్చినవ్ ఆగు..’ అంటా చరచరా నడస్తా పొయిండు పెదకాపు. పక్కనున్న ముగ్గురు కూడా.
వాళ్ల పోతున్న దిక్కే అర్ధంకానట్టు చూస్తా బాయి కాడనే కాసేపు నిల్చుండు అక్కిదాసరోడు. నెత్తి మీద తగిలిన దెబ్బని తడుముకుంటా. తర్వాత బడికొట్టం దగ్గరికి చేరిండు. రావిచెట్టుకి ఆనుకుని కూర్చుని సితార చేతిలోకి తీసుకున్నడు. కొట్టంలో ఉన్న అయ్యవోరు, అక్కోడి పక్కకి భయంభయంగా చూస్తా ఉండు. వాడు మాత్రం ఎప్పుటిలాగే కళ్లు మూసుకుని తీగల్ని మీటుకుంటూ రాగం తీస్తున్నడు. ఇంతలో చెట్టు ఎనక చప్పుడయింది. లేచేలోపే.. పగ్గంతో అక్కోడ్ని చెట్టుకు లాగి కట్టిన్రు. పెదకాపుతో కల్సి 20మంది దాకా ఉన్నరు. చేతిలో ఉన్న కర్ర విరిగిపోయేదాకా కొట్టిండు పెదకాపు. నోటికొచ్చిన బూతులన్నీ తిడుతూ. తర్వాత వాడు తప్పించుకోకుండా జాగ్రత్తగా చెట్టునుంచి విప్పి ఎద్దులబండి ఎనక కట్టేసిన్రు అక్కోడ్ని. అప్పటికే వాడి తలపగిలి రక్తం కారతా ఉంది. సితార వైపే చూస్తా ఉండు అక్కోడు. పెద్ద బండొకటి తీసుకుని ఒక్కదెబ్బకి దాన్ని బద్దలుకొట్టిండు పెదకాపు. గింజుకుంటా ఉన్నడు అక్కోడు. చుట్టూ ఉన్న కొంతమంది ఆడోళ్లు.. వాడిపాపాన వాడు పోతడు వదిలెయ్యండని అన్నా పెదకాపు విన్లేదు. అంతకుమించి గట్టిగా అడగడానికి.. అక్కోడు ఆడున్న ఎవురికీ చుట్టం కాదు. వాడు పాడుతుంటే మైమరిచిపోయి ఓ సంగటిముద్ద పడేసినోళ్లంతా.. ఇప్పుడు జాలి చూపులు పడేయడం తప్ప ఏం చేయలేకపోయిన్రు. వాడు సితార మీటినప్పుడల్లా గుండెల్లో కోసినట్టు అనిపించినోళ్లు.. ఇప్పుడు కసి తీర్చుకుంటున్రు.

బడికొట్టం దగ్గరే ఉంటే ఇబ్బందిగా ఉంటదనో ఏమో.. ‘ఈడ ఒద్దురా గరుగుమీదకి తీసకపోదాం పాండి’ అన్నడు పెదకాపు. బండిని కదిలించి అక్కోడ్ని ఈడ్చుకుంటా పొయిన్రు. గరుగుమీదకి పొయ్యేసరికి పొద్దు నెత్తిమీదకి వస్తా ఉంది. ఎద్దుల్ని కాడి ఇప్పి చేను మీదకి తోలిన్రు.

‘కొట్టన్రా నా కొడుకుని’ పెదకాపు ఆ మాటన్నడో లేదో నలుగురు ముందుకొచ్చిన్రు.

బండెనక పక్క కటేసిన్రు అక్కోడ్ని. ఊళ్లోంచి ఈడ్చుకొచ్చేటప్పుడే చేతులకి కట్టిన తాళ్లు తెంపుకోడానికి చూసిండు. ఆడోళ్ల బారు ఎంట్రుకలతో పేనిన బలమైన తాళ్లు ఇప్పుకోడం వాడి వశం కాలా. కానీ బండి ఎనకున్నకొయ్య మీద చేతలకి పట్టుచిక్కింది. అంతే బలంకొద్దీ బండిని లేపి ఒక్క ఇసురుతో చుట్టూ తిరిగిండు. అంతపెద్ద బండి కూడా పట్టెమంచం తిరిగినట్టు గాల్లో తిరిగింది. అప్పుడే ఉరుక్కుంటా వచ్చిన నలుగురిలో ఇద్దరికి బండి నొగలు తాకింది. పక్క ఎముకలు ఇరిగినట్టు ఫళక్కుమని చప్పుడొచ్చింది. ఇంకో ఇద్దరు ముందే ఎనక్కి దూకి తప్పించుకున్నరు. కిందపడ్డోళ్లని చూసి మనుషులంతా రాక్షసులైపొయిన్రు. గరుగు మీద దొరికిన రాళ్లు తీసుకుని అక్కోడి మీదకి ఇసరసాగిన్రు. బండిని చాటుచేసుకుని కాచుకున్నా ఒకటీ అరా రాళ్లు వాడి ఒంటికి తగల్తనే ఉన్నయి. అదే అదునుగా పెదకాపు, ఇంకో ఇద్దరు కర్రలు తీసుకుని వాడిమీదకి వచ్చిన్రు. తర్వాత వాడు చేసేదేం లేకుండాపోయింది. నెత్తురు పూసుకుంటా ఉన్న గరుగుని చూసి బయపడినట్టు.. పొద్దు మబ్బుల మద్దిన దాక్కుంది. దూరంగా ఉన్న ఎద్దులు మేత మానుకుని ఇటే చూస్తా నిలుచున్నయి.

మద్దినేల నుంచి పొద్దు కొండలో పడేదాకా అక్కిదాసరోడి మీద కసితీర్చుకుంటనే ఉన్నరు. ఒంట్లో ఉన్న ఎముకల్ని గుల్ల చేసిన్రు. ముక్కూ మొకం యాకం అయిపొయినయి. ముందుకుపడిన జుట్టులోంచి నెత్తురు కారతా ఉంది. నోటిలోంచి సొంగ పడతుంది. కానీ అప్పుటిదాకా వాడి కంట్లోంచి మాత్రం నీళ్లు రాలేదు. ఊరి దిక్కుకే ఉన్నయి చూపులు. ఇంతలో ఎవురో అక్కిదాసరోడి చేతివేళ్లని విరగ్గొట్టిన్రు. ఎన్నో పాటలు, పదాలకి సొరాలు కట్టిన వేళ్లు. బాధగా మూలిగిండు. కంట్లోంచి తొలి నీటిబొట్టు రాలింది. ఎవురికోసమో చూస్తా ఉన్న ఆ కళ్లు.. చేతివేళ్లవైపు తిరిగినయి. చూపులతోనే వాటిని ఆఖరుసారి తడుముకున్నడు. కన్నీళ్లవరద మళ్లీ ఆ అవకాశం ఇయ్యలేదు. కొండలాంటి మనిషి ఇప్పుడు ఒళ్లంతా నలిగిపోయి.. బండి గానుకి అనుకుని కూర్చొని ఉన్నడు. ఒంటి మీద దెబ్బ పడ్డప్పుడల్లా.. వాడు ఒళ్లు కదులుతోందంతే. చివరికి బలమంతా కూడగట్టుకుని ‘రేయ్ ఆపండ్రా’ అని బారంగా అరిచిండు. పెదకాపు చెయ్యెత్తి అందరికీ సైగ చేసి, వాడి దగ్గరకొచ్చిండు.

కుడితొడని చీల్చమంటూ.. సగం మాటలు, సగం సైగలతో చెప్పిండు అక్కోడు. కత్తి తీసుకొచ్చిండు పెదకాపు తమ్ముడు. కుడితొడని రెండంగులాల లోతున కోసిండు. తెల్లటి నరం లాంటిదేదో ఎగిరి బైటపడింది. పెదకాపు ముందుకి వంగబోయేసరికి.. ఎందుకో ఒక్కసారిగా గింజుకున్నడు వాడు. మళ్లీ అంతా మీద పడ్డరు. కాసేపటికి అక్కోడిలో కదలిక ఆగిపొయింది.

గరుగు మీద చిమ్మిన నెత్తురు అద్దినట్టు.. కొండలో పడుతోన్న పొద్దు రక్తపు ముద్దలా ఉంది. అప్పటిదాకా కసితో వాడ్ని చంపినోళ్లలో క్రమంగా భయం కమ్ముకుంటా ఉంది. వాడెక్కడ మళ్లా లేస్తడో అన్న భయం. పెదకాపు ఇద్దరు కుర్రోళ్లని ఊళ్లోకి పంపిండు. నాలుగైదు గొడ్డళ్లు, గడ్డపారలు తీస్కరమ్మన్నడు. నిమిషాల్లో వాళ్లు వెళ్లొచ్చాక.. అందరూ ఒగపాలి ఒకరి మొగాలొకరు చూసుకున్నరు. గొడ్డళ్లు చేతులోకి తీసుకుని.. అక్కోడ్ని ముక్కలు ముక్కలుగా నరికారు. గోతులు తీసి ఒక్కో ముక్కని ఒక్కోదాంట్లో కప్పెట్టిన్రు. అంతా అయిపోయాక ఆయుధాలు తీసుకుని, ఎద్దుల్ని తోలుకుంటా తిరిగి చూడకుండా ఊళ్లోకి మళ్లిన్రు. వాడ్ని కట్టేసి తీసుకొచ్చిన బండిని, తాళ్లనీ అక్కడే ఒదిలేసిన్రు. శ్మశానమైపొయిన గరుగు వాళ్లు పొయిన దిక్కుకే చూస్తున్నట్టుంది.

***

అక్కి దాసరోడ్ని చంపినాక ఊళ్లో అందరూ సంజీవి గురించే మాట్లాడుకున్నరు. వాడి తొడ కోసినప్పుడు కింద పడింది సంజీవి పుల్ల అన్నరు. వాడ్ని చంపే ఊపులో దాన్ని పట్టించుకోకపోతిమే అనుకున్నరు.

ఇది జరిగిన తర్వాత…

సరిగ్గా పదారు రోజులకి కొండమ్మ కనిపించకుండా పోయింది. ఎటు పొయిందో ఎవ్వురికీ అంతుపట్టలా. పెదకాపు కూడా పెద్దగా వెతికించలేదు. చుట్టుపక్కల ఊళ్లలో తిరిగినా కొండమ్మ కనిపించలేదు. తర్వాత అంతా ఆ సంగతే మర్చిపొయిన్రు. కానీ అక్కిదాసరోడి కథ మాత్రం ఇప్పుటికీ చెప్పుకుంటనే ఉన్నరు. ఊళ్లో ఇప్పుడు పెదకాపు కుటుంబానికి చెందినోళ్లెవురూ లేరు. వాళ్ల చేనంతా చిల్లచెట్లు మొలిచినయి. ఆరు మట్ల బాయి సగానికి పైగా పూడిపొయింది. ఉన్న కాసిని నీళ్ల మీద పచ్చగా కప్పగుడ్లు. దానికి కప్పగుడ్డుబాయని పేరు పడింది.

***

కథంతా కళ్లముందు జరిగినట్టనిపించి.. కడుపులో దేవుకు పోతున్నట్లు అయిపోయింది నాకు. చుట్టూ చూస్తే.. నిండా చీకట్లు గమ్ముకున్నయి. కనుచూపు మేరలో మనుషులెవురూ అవుపడ్డం లేదు. ఇంటికి పోదామని లుంగీ ఎగ్గట్టుకుని గరుగుమీద నుంచి లేసినా. అంతే.. జరజర అంటా శబ్దం. ఏందా అని సూద్దునుగదా.. ఒక్కసారి గుండెలదిరిపొయినయ్. ఇప్పుటిదాకా నేను కూర్చున్న రాయి కదల్తా ఉంది. చుట్టుపక్కలంతా అదే సప్పుడు. నాకిందున్న రాయే కాదు. చుట్టూ ఉన్నపెద్ద పెద్ద రాళ్లన్నీ కదుల్తున్నయి. చీకట్లో తెల్లని రాళ్లన్నీ చిన్నచిన్న దయ్యాల్లాగ ఊగిపోతున్నై. నేను రాయిలాగా నిలబడ్డా. కాసేపటికి.. ఒక్కో రాయి కిందనుంచి ఒక్కో అకారం పైకిలేసింది. నాకు ఊపిరి ఆగినట్టనిపిచ్చింది. ఆకారాలన్నీ ఒక్కటై నా ముందు నాలుగడుగుల దూరంలో ఓ మహాకాయుడు ప్రత్యక్షమయిండు.

అంతపెద్ద ఆకారం నన్ను పట్టించుకోకుండా చెరువుకట్ట వైపు తిరిగింది. అలా నడుచుకుంటూ వెళ్తున్న దాని ఎనకనే ధైర్యం చేసి ఎళ్లా. నేరుగా పెదకాపు చేలోకి ఎళ్లిందది. దూరం నుంచి నడుస్తా అటు చూసిన నాకు.. కప్పగుడ్డు బాయి ఒడ్డున ఎవురో ఆడ మనిసి ఉన్నట్టు అనిపిచ్చింది. చీకట్లో సరిగా కనిపించకపొయినా.. నగ్నంగా ఉందని తెలస్తా ఉంది. అతను తనని చేరాక.. ఇద్దరూ ఒకేసారి తిరిగి నన్ను చూసినట్టనిపిచ్చింది. చీకట్లోంచి రెండు జతల కళ్లు.. అంత దూరం నుంచి కూడా కొట్టొచ్చినట్టు కనిపించినయి. గిరుకున్న తిరిగి పరిగెత్తుకుంటా గుట్టమీదకి వచ్చినా. ఎనక్కి తిరిగి చూడాలనుంది, కానీ దైర్యం సాల్లేదు. అదే ఊపులో కిందకి దిగినా.

గరుగు దాటి పోతాఉంటే.. పాటని వదిలి పోతున్నట్టు ఉంది.

దూరంగా చీకట్లో మా ఊరు. ఎనక నుంచి సితార సప్పుడు.

**** (*) ****2 Responses to గరుగు చెప్పిన కథ

  1. కిరణ్ తేజ
    May 3, 2017 at 8:03 am

    Very interesting.i couldn’t stop to read this untill the completion of story.

  2. sreeram velamuri
    May 8, 2017 at 8:59 pm

    చాలా బాగుంది .. నెల్లూరు యాస బాగా కుదిరింది ..అభినందనలు

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)