మా సత్తిగాడు
బొత్తిలకిసం లేనోడు
కుడుముంటె పండుగంటడు
ఎదురైనోళ్ళనల్లా
కపటం లేకుంట మందలిత్తడు
ఏం పనిజెప్పిన జేత్తడు
గుణంల వానంత
సీమంతుడు లేడు.
పక్కింట్ల పభోజనమైతె..
వానింట్లైనట్టే
నెత్తినేసుకొని
పుట్టెడు కట్టం జేత్తడు
ఆఖర్నింత బువ్వేత్తెసాలు
కడ్పునిండ తింటడు.
కాని నోరుదెర్శి అడ్గడు
ఆత్మాభిమానం దండిగున్నోడు మరి.
ఊరేగింపో, భరాత్ లనో
సూడాలె ఆని సందడి
ఒళ్ళుమర్శి ఎగుర్తడు.
సాగనంపే యాళ్ళ
సంటిపొల్లగాడై
ఎక్కెక్కేడ్తడు.
ఎవలకన్న
ఆపదొత్తె సాలు
అంబులెన్సోలె
ఆజరైతడు.
పానం నిమ్మలపడేదాక
కడ్పుల బెట్టుకొని
సూస్కుంటడు.
మొఖంల శిర్నవ్వు
శెద్రనియ్యడు.
బుడ్డపోరేడ్సితె
నవ్వియ్యందే ఆడికేలిపోడు
అందుకనె పొల్లగాండ్లకు
సత్తిగాడంటె సంబ్రం.
వాడెమ్మటుంటె సాలు
ఇగం పట్టిన శేతులకు
శెగ తల్గినంత హాయిగుంటది.
ఎడార్లె ఊట శెలిమె
దొర్కినంత కమ్మగుంటది.
మండుటెండల
మర్రి శెట్టు కిందున్నంత
సల్లగుంటది.
ఈ మద్దె తర్గతి
బత్కుల మీద మన్నుబడ
సత్తిగాడింత మంచోడైనందుకు
వాని శేతులిన్ని ‘కొత్తలుంటె ‘
ఎంత మంచిగుండు,
వాడెందర్నాదుకును.
* కొత్తలు = డబ్బులు
* పభోజనం = పండగ భోజనం
Painting: Annavaram Srinivas
అన్నా
పలుకుబడుల పభోజనం మస్తుకుదిరింది
కృతజ్ఞతలు అన్నా..
కవిత ప్రచురించినందుకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
Special thanks to annavaram srinivas
అయ్యా..ఏమి చెప్పిందీ కపిత లేదా తవిక..? ఇది సిసలైన కవి (అనుకుంటున్న) బాసలో లేదు. పనిగట్టుకుని బలవంతంగా రాసినది గా ఉన్నది. మొదలు..భాషకీ వ్యక్తీకరణకీ తేడా తెలియాలే.ఏదో చెప్పడమే కాదు ఏం చెప్పినాడన్నదీ, ఎట్లా చెప్పినాడన్నదీ ముఖ్యం.
ఈ తవికలో కొన్ని వాక్యములు కవి భాషకు సరిపడడం లేదు. వాటిని ఇక్కడ ప్రస్తావించి కవి సంబురాన్ని చులకన చేయడం ధర్మము కాదని తలచి కవిని తారీఫ్ చేస్తున్నోల్లని జరా సొంచాయించామని….
కవిత చాలా బాగుంది సర్.మంచి అభివ్యక్తి.ఇలాంటి సత్తన్నలు వాడ వాడనా తారస పడుతూనే ఉంటరు
సత్తెన్నకు,రచియతకు, సంపాదకులకు కృతజ్ఞతలు
బొత్తిలకిసం అంటే అర్ధం అవలేదండి.
‘ఆత్మాభిమానం’ స్వచ్ఛమైన తెలుగు పదం. కాని తెలంగాణలో అంతగా వాడుకలో వుండే పదం కాదనుకుంటాను.
తెలంగాణా మాండలికంలో ఆత్మాభిమానం కు సరైన పదం వాడుంటే బావుండేదేమో.
తెలంగాణా అదీ ఉత్తర తెలంగాణా అయిననూ దక్షిణ తెలంగాణా అయిననూ భాషా తెలుగు ఉర్దూ పదాలా కలబోతగా ఉంటుంది. అది మిస్సైంది. సహజత్వం లోపించింది అనిపించిందండి.
బొత్తిల = బొత్తిగా
కిసం లేనోడు అంటే స్వార్థం లేనోడు అనుకుంటున్నా.
బొత్తిలకు+ఇసం లేనోడు అంటే బొత్తిగా విషం/ కపటం లేని వాడు అనండీ.