కవిత్వం

కుడుముంటె పండుగంటడు

మే 2017

మా సత్తిగాడు
బొత్తిలకిసం లేనోడు
కుడుముంటె పండుగంటడు

ఎదురైనోళ్ళనల్లా
కపటం లేకుంట మందలిత్తడు
ఏం పనిజెప్పిన జేత్తడు
గుణంల వానంత
సీమంతుడు లేడు.

పక్కింట్ల పభోజనమైతె..
వానింట్లైనట్టే
నెత్తినేసుకొని
పుట్టెడు కట్టం జేత్తడు
ఆఖర్నింత బువ్వేత్తెసాలు
కడ్పునిండ తింటడు.
కాని నోరుదెర్శి అడ్గడు
ఆత్మాభిమానం దండిగున్నోడు మరి.

ఊరేగింపో, భరాత్ లనో
సూడాలె ఆని సందడి
ఒళ్ళుమర్శి ఎగుర్తడు.
సాగనంపే యాళ్ళ
సంటిపొల్లగాడై
ఎక్కెక్కేడ్తడు.

ఎవలకన్న
ఆపదొత్తె సాలు
అంబులెన్సోలె
ఆజరైతడు.
పానం నిమ్మలపడేదాక
కడ్పుల బెట్టుకొని
సూస్కుంటడు.

మొఖంల శిర్నవ్వు
శెద్రనియ్యడు.
బుడ్డపోరేడ్సితె
నవ్వియ్యందే ఆడికేలిపోడు
అందుకనె పొల్లగాండ్లకు
సత్తిగాడంటె సంబ్రం.

వాడెమ్మటుంటె సాలు
ఇగం పట్టిన శేతులకు
శెగ తల్గినంత హాయిగుంటది.
ఎడార్లె ఊట శెలిమె
దొర్కినంత కమ్మగుంటది.
మండుటెండల
మర్రి శెట్టు కిందున్నంత
సల్లగుంటది.

ఈ మద్దె  తర్గతి
బత్కుల మీద మన్నుబడ
సత్తిగాడింత మంచోడైనందుకు
వాని శేతులిన్ని ‘కొత్తలుంటె ‘
ఎంత మంచిగుండు,
వాడెందర్నాదుకును.

 

* కొత్తలు = డబ్బులు
* పభోజనం = పండగ భోజనం

Painting: Annavaram Srinivas