కవిత్వం

విప్పపూల వింజామర

మే 2017

డోలు పూనకంతో మోగుతోంది.
అడవి నెమలి పించెంతో
రేల పాట అందుకొని
గొలుసు చిందులేస్తంది.
కొమ్ము బూర గొంతెత్తి
సింహనాదం చేస్తూంది
పోడు మట్టి పులకరించి
చిలక పచ్చ తొడుగుతోంది.
ఒక దేవతా రూపం
ఆనపకాయ బుర్రలో
గడ్డాన పచ్చ బొట్ల పూలతో
కడయాల కాళ‍‍్ళతో
కల్లు మోసుకొస్తుంది.
తునికి పండ్ల సువాసన
పెదాలకు లత్తుకవుతంది.
మెడన తాయెత్తు
అచ్చాదనలేని దేహాలు దాల్చిన విల్లంబులు
విజయ దరహాసంతో నడిచొస్తాయి
తాటాకు గుడిసెల్లోంచి కాల్చిన ఎండుచేపల వాసన
సాంబ్రాణి ధూపంలా అడవిమొత్తం అలుముకుంటుంది.
గోదారమ్మ
అలల కురులలో జాబిల్లిని
పాపట బిళ‍్ళగా సిగారించుకుంది.
రాత్రి కురిసిన వెన్నెల రెల్లుపూలలో
పసిడి పరాగమై రేగుతుంది.
మన్నెం నేలంతా
వెదురుబొంగుల వేణువు రాగానికి
సీతాకోకల గుంపుగా మారుతుంది.
విప్పపూల మలయ మారుతానికి
అరమోడ్పు కన్నులతో
గమ్మత్తుగా తూగుతోంది.
జింకపిల్లల్లాంటి అమాయకపు
బెదురు హృదయాల ముందు
వనదేవత నిండు మనసుతో ప్రణమిల్లుతుంది.5 Responses to విప్పపూల వింజామర

 1. T.venkatesh
  May 1, 2017 at 2:27 pm

  కవిత బాగుంది. గరికపాటి మణిందర్ గారికి అభినందనలు

  • G.manikyarao
   May 2, 2017 at 9:51 am

   Thank you sir venkatesh garu

 2. T V SHARMA
  May 2, 2017 at 9:27 pm

  ఇమే’జరీ’ అంచుల్లో పడి గిలగిలా తన్నుకుంటున్నట్లుంది….విప్పపూవు దేనికి సంకేతమో ఈ కవి తెలుసుకోవాలె. మండుతున్న అడవిని తలపించే విప్పపూల (పలాశ పుష్పం వృధా అనుకున్నా) పరిమళాన్ని ఆవాహన చేయాల్సిందిపోయి … మలయమారుతంగా సంభావిస్తున్న ఈ కవి దృక్పథలోపం ఇందులో కనిపిస్తున్నది.

 3. గరికపాటి.మణీందర్
  May 3, 2017 at 9:37 pm

  శర్మ గారికి నమస్కారం. మీరు కొంచెం వివరంగా చెప్పి వుంటే బాగుండేది.
  స్పందిచినందుకు కృతజ్ఞతలు సర్

 4. సాయి.గోరంట్ల
  May 20, 2017 at 1:14 pm

  బాగుంది శర్మ గారు
  అడవి వర్ణన అద్భుతంగా

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)