ఇనార్బిట్ మాల్ పార్కింగ్ లాట్లో బైక్ యెక్కడ పార్క్ చేసానో జ్ఞాపకం లేదు. సినిమా హడావిడిలో లెవల్ 1 లో పార్క్ చేసానో, లెవల్ 2 లో పార్క్ చేసానో, వ్యాలే పార్కింగ్ ఇచ్చానో అసలు పార్క్ చేసానో లేదోనని నా సబ్కాన్షస్ డేటాబేస్ ని క్వేరీ చేస్తుండగా ఫోన్ రింగ్ అయ్యింది.
“హలో!…” అన్నాను.
“క్రిష్ణా, ఆదివారం ఇంటికి రారా. ఓ పెళ్లిసంబంధం వచ్చింది. పిల్ల మేనమామ నిన్ను చూస్తడట.”
ఫోన్లో అమ్మ చెప్పటం పూర్తి కాలేదు. “సండేనా? కుదర్దమ్మా. క్రికెట్ మ్యాచుంది. అయినా మేనమామతో పెళ్లి చూపులేమిటమ్మా?
నేనా టైప్ కాదు.” అన్నాను.
“ఊకో పోడా. పని మీద మన ఊరు వస్తుండట. చూసిపోతా అన్నడు. క్రికెట్ మ్యాచ్ తర్వాత ఆడుకో. నువ్వైతే సండే రా.”
“పెళ్లి చూపులా? ఇబ్బందమ్మా. అమ్మాయి ఫోన్ నంబరుంటే యివ్వు. మాటాడతాను.”
“మీ కంప్యూటర్ జెనరేషన్కి అన్నీ కష్టమే. తెలుగు మ్యాట్రిమోనీలో యెప్పుడో రాయిస్తే ఇప్పుడో సంబంధం వచ్చింది. పేరు నిశీథి. గూగుల్లో పని చేస్తదట. ఫోన్జెసి మాట్లాడు. ఈ సంబంధం కుదిరేలా ఉంది. తొందరపడి నచ్చలే అనకు. ఫోన్ నెంబరు బాపు యిస్తడు.”
నేను బైక్ కోసం వెతుకుతూ ఫోన్ వింటున్నాను.
నాన్న గొంతు సవరించుకుని…
“హలో…”
“హా, నాన్న…”
“ఒక్క నిమిషంరా క్రిష్ణా.”
ఏయ్ గా కళ్లద్దాలియ్.
నాన్న కళ్లజోడు పెట్టుకోవటం హాలీవుడ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరులా వినపడింది ఫోన్లో.
“నెంబరు రాసుకోరా.”
“చెప్పు నాన్నా.”
నెంబరు చెప్పాడు నాన్న. ఫోన్లో నెంబరు ఫీడ్ చేసుకున్నాను.
“పది నెంబర్లు వచ్చినయారా?”
నెంబర్లు యెన్నొచ్చాయో ముందు అడిగి నెంబరు కరెక్టా కాదా అడుగుతారు నాన్న. అకౌంటెంట్ కదా. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం అలవాటు.
వన్ టూ త్రీ … నైన్ టెన్. ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్లా లెక్కెట్టుకుని…
సరిపోయాయి నాన్న… అని ఫోన్ కట్ చేసి, బైక్ కోసం వెతుకుతున్నాను. సెక్యూరిటి బూత్ పక్కన పార్క్ చేసినట్టు గుర్తొచ్చి వెళ్లి చూసాను. నేనేమైపోయానో తెలియక సెక్యూరిటికి కంప్లేయింట్ చేయాలా వద్దా అన్నట్టు నాకోసం డల్ గా చూస్తుంది బైక్.
***
మరుసటి రోజు ఈవినింగ్ ఏడవుతుంది. నిశీథికి ఫోన్ చేద్దామనుకుని ఆగిపోయాను. చేయాలా వద్దా అన్న డైలామాలో ఉన్నాను. ముందు ఫేస్ బుక్ లో సర్చ్ చేద్దాం అనుకుని గూగుల్ ఎంప్లాయీస్ గ్రూప్ కోసం సర్చ్ చేసాను. దొరికింది. టూ తౌజండ్ మెంబర్స్ ఉన్నారు. డాటా మైనింగ్ చేస్తే నిశీథి పేరుతో పదిమంది ఉన్నారు. అందులో తెలుగమ్మాయిలు ఐదుగురు. ఈ ఐదుగురిలో అమ్మ చెప్పిన నిశీథి ఉందా? ఉండి ఉంటే యెవరు? అప్పుడే వచ్చింది వాట్సాప్ ఐడియా.
నిశీథి వాట్సాప్ చెక్ చేసాను. ప్రొఫైల్ ఉంది. కాని ప్రొఫైల్ పిక్చర్ లేదు. వాట్ టు డూ నౌ? అనుకుంటుండగా పబ్బుకి వెళ్దామని మా డ్రంకెన్ మంకీస్ వాట్సాప్ గ్రూప్ నించి మెసేజ్ వచ్చింది.
రాత్రి తొమ్మిదవుతోంది. జనాల్ని తోసుకుంటూ పబ్బులోకి ఎంటర్ అయ్యాం. యో యో హనీ సింగ్ ‘బ్లూ ఐస్ సాంగ్’ ప్లే అవుతోంది. ఫ్రెండ్స్ డాన్స్ ఫ్లోర్ మీద జాయిన్ అయ్యారు. నేను బార్ టేబుల్ ముందు కూచున్నాను. డ్రింక్ అలవాటు లేదు కాని యేదోటి తాగాలి. అమ్మాయిల ముందు మాక్టేల్ తాగటం బాగోదనుకుని…
“వన్ బ్రీజర్ లైట్” అన్నాను.
బార్ టెండర్ వెటకారంగా చూసి మాక్టేల్ ఇచ్చాడు.
తాగుతున్నాను.
దూరంగా ఓ గ్రూప్, టేబుల్ చుట్టు చేరి గోల చేస్తోంది.
చూసాను.
ఇద్దరు పోటీపడి షాట్స్ కొడుతున్నారు.
వన్ మోర్… వన్ మోర్… వన్ మోర్… సపోర్టర్స్ అరుస్తున్నారు.
షాట్ గ్లాస్ ఎత్తి పట్టుకుంది. క్షణంలో తాగి షాట్ గ్లాసుని టేబుల్ మీద బలంగా కొట్టి అతడ్ని చూసింది.
అతడు తూలుతున్నాడు.
షాట్ గ్లాస్ ఎత్తడానికి ట్రై చేసి పడిపోయాడు.
విన్నర్… విన్నర్… గట్టిగా అరిచారు సపోర్టర్స్.
వాళ్లకు హైఫయ్ కొట్టి స్పీడుగా వాష్రూమ్ వైపు పరిగెత్తింది. డాన్స్ ఫ్లోర్ బిజీగా ఉంది. కిక్కులో సాంగ్ కి సంబంధం లేకుండా డాన్స్ చేస్తున్నారు.
“ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్…” లేడి వాయిస్.
ఎవరీ మై కైండా గర్ల్ అని తిరిగి చూసాను.
తను 2017 డ్రింకింగ్ చాంపియన్.
ఇప్పుడేగా అంత తాగింది. ఆరెంజ్ జ్యూస్ కూడానా? అనుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ హ్యాంగోవర్ కి యాంటిడోట్ అయ్యుంటుంది. సర్వర్ జ్యూస్ ఇచ్చాడు.
తాగుతోంది.
అలాగే చూస్తున్నాను.
చూసింది.
“హాయ్. ఐయామ్ నిశీథి,” అంది షేక్ హ్యాండ్ ఇస్తూ.
తాగిన మాక్టేల్ కూడా దిగిపోయింది నాకు.
అమ్మ చెప్పిన నిశీథి తనే అయ్యుంటుందా? ఏమో.
తేరుకుని…
“హాయ్! క్రిష్ణా,” అన్నాను షేక్ హ్యాండ్ ఇస్తూ.
కళ్లతో నిశీథిని స్కానింగ్ చేస్తున్నాను.
జ్యూస్ గ్లాస్ కిందపెడుతూ నన్ను చూసి ఐబ్రోస్ ఎగరేసి ‘వాట్’ అన్నట్టు చూసింది.
నథింగ్ అన్నట్టు తల అడ్డదిడ్డంగా తిప్పాను.
“బేసిగ్గా నేను అంత తాగను. కాని, గెలవాలి. తప్పలేదు,” అంది.
అవునా అన్నట్టు చూసి ఆలోచనలో పడ్డాను.
ఈ నిశీథి అమ్మ చెప్పిన నిశీథి ఒకటేనా?
ఎందుకీ ఫైట్ అండర్ బ్లాంకెట్. కాల్ నిశీథి లైఫ్ లైన్ వాడుకుంటే? అనుకుని, పబ్బులో కొంచెం సైలెంట్ గా ఉన్న ప్లేస్ నించి కాల్ చేసాను. ఫోన్ రింగ్ అవుతోంది. డ్రింకింగ్ చాంపియన్ని గమనిస్తున్నాను. తను ఆరెంజ్ యాంటిడోట్ తాగుతోంది. ఫోన్ తర్డ్ టైమ్ రింగ్ అయ్యింది. వినిపించినట్టుంది.
హలో అంది. చలో అన్నాను ఫోన్ కట్ చేసి బయటకెళ్తూ.
బాధగా బయట పిట్టగొడ మీద కూచొని ఆలోచిస్తున్నాను. నచ్చలేదని చెప్పనా? నిశీథి తాగతుందని నాకు తెలిసింది. తన పేరెంట్స్ కి తెలుసా?
మరి మా పేరెంట్స్ కి తెలుసా? ఈ రోజుల్లో అందరూ తాగుతున్నారు. అమ్మాయిలు తాగడం తప్పు. అందులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి తాగడం మహాపాపం అనుకోవటం కరెక్టా? తాగుబోతు అమ్మాయిని వైఫ్ గా నేను యాక్సెప్ట్ చేయగలనా? అంత బ్రాడ్ మైండ్ నాకుందా? ఇంకా ఏ హాబిట్స్ ఉన్నాయో? బాయ్ ఫ్రెండ్స్? స్మోకింగ్? డ్రగ్స్? వాట్ నాట్? అలోచిస్తున్నాను.
ఫ్రెండ్ తో బయటకు వచ్చింది నిశీథి. అందరూ అమ్మాయిలే. కారుని డ్రైవ్ చేయాలని పోటీ పడుతున్నారు. వీళ్లలో ఎవరు డ్రైవ్ చేసినా కోర్టులో మెగా బ్లాక్బస్టర్ రోడ్ సేఫ్టి సినిమాకి ఇంకో టికెట్ తెగటం గ్యారంటీ. నిశీథి గురించి ఇంకా తెలుసుకుంటే నా గురించి నాకు తెలుస్తుందేమోననుకుని దగ్గరకు వెళ్లి…
“హాయ్” అన్నాను.
“హాయ్” అంది డౌట్ఫుల్ గా చూస్తూ.
క్రిష్ణ మళ్లీ పరిచయం చేసుకున్నాను.
“యా యా. గుర్తొచ్చారు. మాక్టేల్ తాగారు.”
“యెస్. నాకు లిఫ్ట్ ఇస్తారా? ఆన్ ది వేలో బఫెల్లో చికెన్ వింగ్స్ బ్యాక్సైడ్ ఉంటాను.”
“ష్యూర్. బట్ యూ హావ్ టు డ్రైవ్. వీకెండ్లో పోలీస్ డ్రంక్ & డ్రైవ్ బ్లోయింగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. దొరికితే లక్ష్మి మంచుతో కౌన్సిలింగ్ తప్పదు. కెన్ యూ డ్రైవ్?” అంది.
“బెస్ట్ డ్రైవర్ని,” అని డ్రైవర్ సీట్లో కూచున్నాను. తను నా పక్క సీట్లో కూచుంది. తన ఫ్రెండ్స్ బ్యాక్ సీట్లో కూచున్నారు.
బయల్దేరాం.
మేయిన్ రోడ్ మీదికొచ్చాం. ట్రాఫిక్ జామ్. అనుకున్నట్టే డ్రంక్ & డ్రైవ్ బ్లోయింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. రోడ్డుకి అడ్డంగా ట్రాఫిక్ పోలీస్ బారికేడ్స్ టూ లేన్స్ సింగిల్ లేన్ గా మారింది. ఎదరనున్న పెద్ద బిల్ బోర్డు లైట్స్ లో లైట్ బగ్స్ దీపావళి జరుపుకుంటున్నాయి. పోలీసుఫోర్సంతా ఇక్కడే ఉన్నట్టుంది. కొంతదూరంలో టీవీ చానెల్ వాళ్లు ఓ సెలెబ్రిటి ఫిషైనా దొరికితే బ్రేకింగ్ న్యూసెన్సుతో సెలెబ్రిటి టీఆర్పీ పెంచేందుకు కెమెరాతో అలర్టుగా ఉన్నారు. తాగి దొరికినోళ్లు రోడ్డుసైడ్ కర్బ్ మీద కూచొని పిక్ చేసుకోమని ఫోన్లో ఫ్రెండ్సుని అడుక్కుంటున్నారు. కొందరు మత్తులో సెల్ఫీస్ తీసుకుని ఫేస్బుక్కులో అప్డేట్ చేస్తున్నారు. పక్క రోడ్డు మీద వెళ్తున్న బైకర్స్ ఫ్రీషో చూస్తూ స్లోగా డ్రైవ్ చేస్తున్నారు. కార్నివల్లా ఉంది. ఒక కానిస్టేబుల్ నన్ను ముందుకు రమ్మని సిగ్నల్ చేసాడు. నిశీథి ఎక్సైటింగ్ గా చూస్తోంది.
ముందుకెళ్లాను.
కానిస్టేబుల్ బ్రెత్ ఆనలైజర్ మెషీన్ ను నా ముందుకు తోసి ఊదమన్నాడు. చిన్నప్పుడు బుడగలు ఊదిన విషయం మైండ్ లో ఫ్లాష్ అయ్యింది. నిశీథి, బ్యాక్సీట్ బ్యూటీస్ని కానిస్టేబుల్ కళ్లల్లో నింపుకుంటున్నాడు. గట్టిగా మెషీన్లో ఊదాను. బేసిక్ రీడింగ్ వచ్చినట్టుంది.
ఇంకోసారి ఊదమన్నాడు. అంతే ఫోర్సుతో మళ్లీ ఊదాను. అదే రీడింగ్ మళ్లీ వచ్చిందనుకుంటాను. కానిస్టేబుల్ మెషీన్ ను రెండుసార్లు అటు ఇటు కొట్టాడు. మళ్లీ రీడింగ్ చెక్ చేసాడు. డిసప్పాయింట్ అయి వెళ్లమన్నాడు. కాని ఆ కానిస్టేబులుకి డౌట్ పోలేదనుకుంటాను. వెళ్తున్న మా కార్ వేపు చూస్తుండటం కార్ సైడ్ మిర్రర్లో గమనించాను. నిశీథి ఎక్సైట్మెంట్ ఆపుకోలేక కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసి కార్లో నిలబడి డాన్స్ చేస్తోంది. ఫ్రెండ్స్ సైడ్ విండోస్ లోంచి హ్యాండ్స్ ఊపుతూ అరుస్తున్నారు.
సైలెంట్ గా ఉన్న డెజర్టేడ్ రోడ్ మీద వెళ్తున్నాం.
“స్టాప్… స్టాప్… స్టాప్…” అరిచింది నిశీథి.
కంగారుగా చూసాం.
“ఈ స్ట్రీట్ ఖాళీగా ఉంది. ఇక్కడ ఓ సాంగ్ కి డాన్స్ చేద్దాం,” అంది.
“ఎస్… ఎస్… ఎస్…” అరిచారు అందరూ.
నిశీథి నవ్వింది.
అందరూ కార్ దిగారు. కార్ ను రోడ్ పక్కన పార్క్ చేసాను.
ఒక అమ్మాయి తన ఫోనుని కార్ స్టీరియోకి కనెక్ట్ చేసింది. సాంగ్ సెలెక్షన్ చేస్తున్నారు.
యోయో హనీ సింగ్…
ఫెవికాల్ సాంగ్…
నో హనీ సింగ్. నో ఫేవికాల్ సాంగ్.
గబ్బర్ సింగ్ కెవ్వు కేక సాంగ్ ఫిక్స్ అయ్యింది.
ఇరగదీసి స్టెప్పులేస్తున్నారు.
అదీ సంగతి. ఫుల్ మూన్ నైట్. మాస్ సాంగ్. స్ట్రీట్ డాన్స్.
తాగితే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అపరిచితుడు బయటకొస్తాడని అర్థమైంది.
వాళ్లను చూస్తూ కూర్చున్నాను. నిశీథి కాసేపు డాన్స్ చేసి నాపక్కనొచ్చి కూచుంది.
ఫ్రెండ్స్ స్టెప్పులేస్తుంటే చూస్తూ నవ్వుకుంటున్నాం.
“మీరు డాన్స్ చెయ్యట్లేదు?” అడిగింది నిశీథి.
నవ్వాను.
“సరే మనిద్దరం చేద్దాం,” అని నిలబడింది.
“ఆల్రైట్ లేడీస్. రిలాక్స్ యువర్ సెక్సీ ఆపిల్ బట్స్. మీ అండ్ క్రిష్ణ ఆర్ గోయింగ్ టు డాన్స్,” అంది.
ఇద్దరం కలిసి వై దిస్ కొలవెరి డీ సాంగుకి డాన్స్ చేసాం. నవ్వుకున్నాం. క్లోజ్ అయ్యాం.
సిగరెట్ తీసి ఆఫర్ చేసాను.
“ఐ డోన్ట్ స్మోక్” అంది.
స్మోక్, డ్రగ్స్ అలవాటు లేదనుకుంటా, అనుకున్నాను.
ఇక్ బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ తేలాలి అనుకొని సిగరెట్ వెలిగించుకున్నాను.
నిశీథి ఏదో చెబుతోంది.
“నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా?” అడిగాను.
“బాయ్ ఫ్రెండ్సా?”
“ఐ మీన్ బాయ్ ఫ్రెండ్.”
“బాయ్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ తో ఎందుకు వస్తాను?”
“లేడీస్ నైట్ అయ్యుండొచ్చుగా?”
ఎగ్జామినింగ్ గా చూసింది. నేను తల తిప్పుకున్నాను.
ఇద్దరి మధ్య సైలెన్స్. నిశీథి ఫ్రెండ్స్ డాన్స్ చేస్తున్నారు.
ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటే?
తనని చూసాను. నా రియాక్షన్ని గమనించింది.
“నీకు గర్ల్ ఫ్రెండ్, ఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్?”
“నో” అన్నాను.
“హౌ ఓల్డ్ ఆర్ యూ?” అడిగింది.
“తర్టీ వన్.”
“ప్యూబర్టీ నించి ఇప్పటివరకు ఏ అమ్మాయి మీద ఫీలింగ్ కలగలేదా? లేదా పేరెంట్స్ చూసిన అమ్మాయిని లవ్ చేద్దామని మొక్కేదైనా ఉందా?”
“అదేం కాదు.”
“ఒకప్పటి రమ్యక్రిష్ణ నించి ఇప్పటి నిత్యా మీనన్ వరకు డ్రీమ్ గర్ల్స్,” అన్నాను.
“మరి సెక్స్?” అంది.
“నెవర్ హ్యాడ్ ఇట్.”
“నో కాల్ గర్ల్స్? నో వన్ నైట్ స్టాండ్స్?”
“నోప్.”
“యు మీన్ యు ఆర్ స్టిల్ వర్జిన్?”
“ఎస్,” అన్నాను.
“సేవింగ్ ఫర్ వైఫ్? వాటిఫ్ యువర్ బ్రైడ్ హ్యాడ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ షి ఈజ్ నాట్ ఎ వర్జిన్?
వాటిఫ్?” అని చూసింది.
“అది ఆ అమ్మాయి లైఫ్ బిఫోర్ మ్యారేజ్. నాకు సంబంధంలేనిది. ఐ హ్యావ్ నో రైట్ టు క్వెశ్చన్ హర్
పాస్ట్,” అన్నాను.
“ఇంట్రెస్టింగ్…” అంది.
బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చానుగాని రియల్ గా నాకు కాబోయే భార్య వర్జిన్ కాదని తెలిస్తే నేను ఆక్సెప్ట్ చేయగలనా? ఆలోచిస్తున్నాను.
తను గమనిస్తోంది.
నర్వస్ నెస్ ను కవర్ చేయడానికి నికొటిన్ తాగుతున్నాను. అలాగే కాసేపు నన్ను గమనించింది నిశీథి. నేను సిగరెట్ తాగుతున్నాను.
“వెళ్దామా?” అంది.
“యా, లెట్స్ గో” అన్నాను.
ఫ్రెండ్స్ బ్యాక్సీట్లో ఎప్పుడు పడుకున్నారో తెలీదు. కార్ స్టార్ట్ చేసాను. ఎమ్టీ రోడ్ మీద వెళ్తున్నాం. లోవాల్యూంలో ‘చినుకు తాకే’ సాంగ్ ఫ్రమ్ పెళ్లిచూపులు ప్లే అవుతోంది.
“నెక్స్ట్ లెఫ్ట్” అంది.
టర్న్ తీసుకున్నాను. కొంచెం దూరం వెళ్లాం.
“ఇక్కడ ఆపండి” అంది.
“ఆర్ వీ హోమ్?” అన్నారు ఫ్రెండ్స్ నిద్ర మత్తులో.
అందరు దిగారు. నేనూ దిగాను.
“మీ ఫ్లాట్ నియర్ బై యే కదా?” అడిగింది.
“నెక్స్ట్ బట్వన్ స్ట్రీట్. దగ్గరే. బై… గుడ్నైట్…”
“థాంక్స్ ఫర్ డ్రైవింగ్ అజ్ హోమ్,” అని వెళ్లిపోయింది.
***
రోడ్ మీద నడుస్తున్నాను. ఫోన్ రింగ్ అయ్యింది. మా డ్రంకెన్ మంకీస్ కాల్.
వస్తున్నాను. పక్క స్ట్రీట్లో ఉన్నాన్రా, అన్నాను.
బైక్ మీద వచ్చారు ఫ్రెండ్స్.
“ఇక్కడేం చేస్తున్నారు?”
“టేకవే పార్సిల్ రా” అని ఒక బ్లాక్ కవర్ చూపించారు.
“కూర్చో ఫ్లాటుకు వెళ్దాం” అన్నాడు ఫ్రెండ్.
రూములో మళ్లీ సిట్టింగ్ వేసాం.
“ఎవరా బాబీ?” అడిగాడో ఫ్రెండ్.
“చెప్పాను కదరా, అమ్మవాళ్లు ఓ సంబంధం చూసారని. ఆ బేబియే ఈ బాబీ.”
“తీర్థం పుచ్చుకుంటుందనుకుంటాను?”
“పుచ్చుకోవడమేంట్రా?, చాంపియన్ అయితేనూ.”
“ఐయామ్ జెలస్ రా.”
“ఎందుకు రా?”
“ఓ వైపు తాగొద్దని పెళ్లాలు. తాగితే రోడ్డెక్కొద్దని పోలీసులు. ఇద్దరి మధ్య మందుకి మనసుకి మధ్య ఘర్షణ జరుగుతుంది. కాని, నీకా పరిస్థితి లేదు.”
“బాబీతో పబ్బుకి పోతావ్. నువ్వు మాక్టేల్ తాగితే బాబీ కాక్టేల్ తాగుతుంది. నువ్వు డ్రైవ్ చేస్తే బాబీ లవ్ చేస్తుంది. పార్ట్ నర్ ఇన్ క్రైమ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ లైఫ్” అన్నాడు.
నవ్వాను. నాకు పల్పీ ఆరెంజ్ ఇచ్చి చీర్స్ చెప్పారు. చీర్స్ చెప్పితాగుతూ నా థింకింగ్ మైండ్ ఫైర్ వాల్ ని క్రాక్ చేసాను.
**** (*) ****
వాకిలి సాహిత్య పత్రిక టీం అందరికి ధన్యవాదాలు.
Ikkada kuda mi frd ni taluchukokunda vunda ledu Anna