కవిత్వం

అ, ఆ = ఆఁ !

ఆగస్ట్ 2017

వెళుతూ కొంత, వెళ్లకుండా కొంత
వెదజల్లుకుంటూపోవడం సులభమేనేమో
ఏరుకుంటూపోవడం ఎంత కష్టం

ముఖాలనడ్డుపెట్టుకుంటాం సరే
ఏకాంతాల్ని పగలగొట్టుకున్నప్పుడైనా
కొత్త గాలులు కొన్నైనా కొండమలుపు దాటి రావాలిగా

నవ్వుకుంటూ కొంత, నటించుకుంటూ కొంత
ఇంకా కట్టుకోని ఇష్టసమాధిలోకి
ప్రవేశం బహుశా ఒక ప్రయాస

అచ్చొత్తించుకుంటూ పోతాం సరే
ప్రశ్నార్థకాలు కొన్నైనా ఆశ్చర్యపోవడానికి
గోరింట పొదలేవో చిత్రకవితలై పండాలిగా

వికర్షణలో కొంత, విరోధాబాసగా కొంత
వర్ణాలు పూలబాంబులా విచ్చుకోవడం
అచ్చంగా ఒక యాదృచ్ఛికం

అక్షాంశ రేఖాంశాల మీద పందిళ్ళేసుకుంటాం సరే
నడిమింట్లో వీరి వీరి గుమ్మడిపండు
మాటేమిటో తేలాల్సిందేగా

బెట్టుగా కొంత, బేరమాడుతూ కొంత
తెలియని నేలల్లోకి చాటుగా తొంగి చూసే ఆకాశం
విప్పే ముచ్చట ఎప్పుడూ ఎక్కువే

ఆయాచితాలనేరుకుంటాం సరే
రహస్య పరావర్తనాలేవో సంతకాల బారులవ్వడానికి
విషయసూచికకు మొదలు దిద్దుకోవాలిగా

నిర్వచనంగా కొంత, ఎండమావుల ముసురుగా కొంత
నిర్మానసం మీద నయగరాలు సభ తీరడానికి
ఎన్ని పొదుగుల్ని ఉగ్గుపాలుగా పట్టాలో

ఏకాంకికల్ని కాగితప్పడవలకెత్తుకోవడం సరే
సిరల్ని ఒరుసుకుంటున్న మర్మలిపుల్ని చంకనేసుకోవడానికి
కొత్త పుట్టుకలేవో అసంకల్పిత ప్రసారాలు కావల్సిందేగా

అభావంగా కొంత, అలల తవ్వకంగా కొంత
తీరాన్ని కాదనుకుంటూ జారిపోయే
నీటి చెంగుల అంతర్వేదాల్ని వెతుక్కుంటున్న విడిదిళ్లెన్నో

అల్పపీడనాలు పొడుపుకథలవుతుంటాయి సరే
సంభావనలై వాలిన వాయుగుండాన్ని
మూరెడుమూరెడు సౌందర్య ప్రకటనలుగా తీర్చిదిద్దాలిగా

***

బైస్కోప్‌లో చిత్రం పండటానికి –
సంధి కుదరనిదేదో పొదల్లో పిట్టలా
దాగుడుమూతల సందడి చేస్తుండాలిగా
చెల్లాచెదురుల్లో దేవుకుని దేవుకుని
ఒక దీపపటం ఎగరేసుకున్నట్లు
యుద్ధం లాంటి… ఒక విజయం
ఎప్పుడూ ఒక నిజమై తడమాలిగా!

 
 
Painting: Abstract art by Yuan Zuoమీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)