మాట్లాడుకుందాం

సినిమా పాట కవిత్వమేనా? చర్చకి మా ఆహ్వానం.

మార్చి 2013

శ్రీశ్రీ తన సినీ గేయాల సంపుటి “పాడవోయి భారతీయుడా” మల్లాదిరామకృష్ణశాస్త్రిగారికి అంకితమిస్తూ ఆయన ‘తెలుగు సినీమా పాటకు సాహిత్య ప్రకాస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు‘ అన్నారు.
ఇక్కడ రెండు విశేషాలున్నాయి.  ఒకటి మల్లాదిగారి విశిష్టత, రెండవది అసలు సినీమాపాటకు సాహిత్యవిశిష్టత.

సినీ సాహిత్యం సీరియస్ సాహిత్యం కానేకాదన్న వాదన మనకు అక్కడక్కడా అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది. ఇది ఎప్పటినుండో నాకు వున్న ఒక ధర్మసందేహం కూడాను.

పైవాక్యాలలో మహాకవి శ్రీశ్రీ సినీమా పాటకు సాహిత్య ప్రకాస్తి వుందనే అభిప్రాయపడ్డారు.  కొన్నేళ్ళ క్రితం సినీమహాకవి వేటూరి సుందరరామమూర్తి ఒక టీవీఇంటర్వ్యూ లో ‘సినీ గీతం సామాన్యంకాదు. కావ్య గౌరవాన్ని సంతరించుకున్న ఒక ప్రక్రియ’ అన్నారు.

సినిమాపాటలను అమితంగా ప్రేమించే అసంఖ్యాక అభిమానులు ఎందరో ఈ ఇద్దరు పెద్దల సుద్దులతో ఏకీభవిస్తారని  అనుకుంటాను. ఆలోచనామృతంగా, అపాతమధురంగా కాలపరీక్షను తట్టుకొని నిలబడ్డ ఎన్నో పాటలు వీరి నమ్మకానికి బలాన్నిస్తాయి.

అయితే ఇది నిజంకాదని, సినీగీతం సాహిత్యంకాదని నమ్మేవారి ఆలోచనలను కొట్టి పారేయలేం. వీరిలో కొందరు అసలు సినిమాపాటంటేనే పడని వారుఉంటారు.  వీరికి కొండంత అండగా లెఖ్ఖలేనన్ని చెత్తపాటలు కూడా మన సినిమాలలో వచ్చాయి.

ఇదికాక సినిమాపాటలను అమితంగా ప్రేమించేవారిలో కూడా వాటిలో కవిత్వవిలువలను శంకించేవారు వుంటారు.

ఈ అభ్యంతరాలకు మనం కారణాలు కొన్ని ఇలా చెప్పుకోవచ్చు.

1        సినీగేయం నిబధ్ధతతో వ్రాసిన సాహిత్యంకాదు.  వృత్తిగా, భుక్తికోసం, విత్తం మీద ధ్యాసతో వ్రాసింది.  సినిమా పాట వ్రాసేటప్పుడు ఏమాలోచిస్తారని అడిగితే ‘పాట ఎప్పుడవుతుందా, నిర్మాత డబ్బులెప్పుడిస్తాడా’ అని ఆలోచిస్తానని మళ్ళీ శ్రీశ్రీయే చెప్పారు ఒక సందర్భంలో.

2        నిర్మాత, దర్శకుడు, కథానాయకుడు మొదలైన వారు చెప్పిన ప్రకారం తయారు చేయబడ్డ అంగడి సరుకేగాని, ఆ కవి స్వంత బాధ కాదు.  ‘బయట కవి నిరంకుశుడు, సినీకవి పరాంకుశుడు’ అని వేటూరే అనుకుంటాను ఒకసారి అన్నారు.

3        సన్నివేశం, లొకేషన్లు, తారాబలం, సంగీతం, వాద్య గోష్టి, గాయనం  ఇవన్నీ కలిస్తే సినిమాపాట.  ఈ హంగులు తీసేస్తే దాని విలువ  ???

ముందు చెప్పినట్టుగా ఈ అభ్యంతరాలన్నీ సహేతుకమైనవే అనిపిస్తాయి. అయితే ఈకారణాలు చూపించి సినీగీతం కవిత్వంకాదని అనగలమా? మీరేమంటారు??

 —————————————————————————–

ఈ అంశం మీద చర్చకి మా ఆహ్వానం.