శ్రీశ్రీ తన సినీ గేయాల సంపుటి “పాడవోయి భారతీయుడా” మల్లాదిరామకృష్ణశాస్త్రిగారికి అంకితమిస్తూ ఆయన ‘తెలుగు సినీమా పాటకు సాహిత్య ప్రకాస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు‘ అన్నారు.
ఇక్కడ రెండు విశేషాలున్నాయి. ఒకటి మల్లాదిగారి విశిష్టత, రెండవది అసలు సినీమాపాటకు సాహిత్యవిశిష్టత.
సినీ సాహిత్యం సీరియస్ సాహిత్యం కానేకాదన్న వాదన మనకు అక్కడక్కడా అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది. ఇది ఎప్పటినుండో నాకు వున్న ఒక ధర్మసందేహం కూడాను.
పైవాక్యాలలో మహాకవి శ్రీశ్రీ సినీమా పాటకు సాహిత్య ప్రకాస్తి వుందనే అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ళ క్రితం సినీమహాకవి వేటూరి సుందరరామమూర్తి ఒక టీవీఇంటర్వ్యూ లో ‘సినీ గీతం సామాన్యంకాదు. కావ్య గౌరవాన్ని సంతరించుకున్న ఒక ప్రక్రియ’ అన్నారు.
సినిమాపాటలను అమితంగా ప్రేమించే అసంఖ్యాక అభిమానులు ఎందరో ఈ ఇద్దరు పెద్దల సుద్దులతో ఏకీభవిస్తారని అనుకుంటాను. ఆలోచనామృతంగా, అపాతమధురంగా కాలపరీక్షను తట్టుకొని నిలబడ్డ ఎన్నో పాటలు వీరి నమ్మకానికి బలాన్నిస్తాయి.
అయితే ఇది నిజంకాదని, సినీగీతం సాహిత్యంకాదని నమ్మేవారి ఆలోచనలను కొట్టి పారేయలేం. వీరిలో కొందరు అసలు సినిమాపాటంటేనే పడని వారుఉంటారు. వీరికి కొండంత అండగా లెఖ్ఖలేనన్ని చెత్తపాటలు కూడా మన సినిమాలలో వచ్చాయి.
ఇదికాక సినిమాపాటలను అమితంగా ప్రేమించేవారిలో కూడా వాటిలో కవిత్వవిలువలను శంకించేవారు వుంటారు.
ఈ అభ్యంతరాలకు మనం కారణాలు కొన్ని ఇలా చెప్పుకోవచ్చు.
1 సినీగేయం నిబధ్ధతతో వ్రాసిన సాహిత్యంకాదు. వృత్తిగా, భుక్తికోసం, విత్తం మీద ధ్యాసతో వ్రాసింది. సినిమా పాట వ్రాసేటప్పుడు ఏమాలోచిస్తారని అడిగితే ‘పాట ఎప్పుడవుతుందా, నిర్మాత డబ్బులెప్పుడిస్తాడా’ అని ఆలోచిస్తానని మళ్ళీ శ్రీశ్రీయే చెప్పారు ఒక సందర్భంలో.
2 నిర్మాత, దర్శకుడు, కథానాయకుడు మొదలైన వారు చెప్పిన ప్రకారం తయారు చేయబడ్డ అంగడి సరుకేగాని, ఆ కవి స్వంత బాధ కాదు. ‘బయట కవి నిరంకుశుడు, సినీకవి పరాంకుశుడు’ అని వేటూరే అనుకుంటాను ఒకసారి అన్నారు.
3 సన్నివేశం, లొకేషన్లు, తారాబలం, సంగీతం, వాద్య గోష్టి, గాయనం ఇవన్నీ కలిస్తే సినిమాపాట. ఈ హంగులు తీసేస్తే దాని విలువ ???
ముందు చెప్పినట్టుగా ఈ అభ్యంతరాలన్నీ సహేతుకమైనవే అనిపిస్తాయి. అయితే ఈకారణాలు చూపించి సినీగీతం కవిత్వంకాదని అనగలమా? మీరేమంటారు??
—————————————————————————–
ఈ అంశం మీద చర్చకి మా ఆహ్వానం.
చంద్రహాస్ గారూ,
కవిత్వం పాలు ఉండాలిగాని,సినిమాపాట కవిత్వం కాకపోదు. ఇది కవిత్వంగా చలామణీ అవుతూ పత్రికలలో ప్రవహించే చాలా సరుకుకి వర్తిస్తుంది. పాత్రల పెర్లూ, పాత్రధారులపేర్లూ తేడాతప్ప, మీరు ఉటంకించిన 1,2, అభ్యంతరాలు ఇతర సాహిత్యానికి కూడా వర్తిస్తాయి. అక్కడ డబ్బూ, నిర్మాతా, దర్శకుడూ,నిర్బంధిస్తే, ఇక్కడ కీర్తికాంక్షా,సంపాదకుడూ, పాఠకలోకమూ నియంత్రిస్తాయి. ఇక 3వ అభ్యంతరానికి వస్తే, ఒకతరం ప్రేక్షకులని రంజింపజేసిన పాటలు తర్వాత తరాలు వచ్చేసరికి నీరుగారిపోవడం ఎరిగినదే. పాతలో సాహిత్యం ఉంటే సంగీతంతో సంబంధంలేకుండా దాని ప్రస్తావన సాహిత్యకారుల సంభాషణలలో కొనసాగుతుంది. ఒక అతిసామాన్యమైన గుండమ్మకథ వంటి సినిమాలో “ఎంతహాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి” అన్న పింగళి వారి రచననే తీసుకొండి. నాయకీ నాయకుల చతుర ప్రశ్న సమాధానాల పరంపరగా సాగే ఈ కవితలో సాహిత్యపువిలువలు లేవని నేనలేను.
అలాగని, సినిమా పాటలనిండా సాహిత్యం ఉందని నేనడం లేదు. సినిమా ఒక అంగడి సరుకు. కొనుక్కునే వాళ్లను ఆకర్షించడానికి వేసే ఎత్తుగడలలో పాట ఒకటి. దానికి సాహిత్యంతో నిమిత్తం లేదు. అలాగే, ప్రచురింపబడిన పుస్తకాలనిండా కవిత్వం ఉందని అనలేము గదా. కాలం గీటురాయికి నిలబడినదే కవిత్వం. కొంచెం జీర్ణించుకోడానికి కష్టంగా కనిపించినా, అది తిరుగులేని సత్యం. చెత్తని కవిత్వంగా ఎవరు ప్రచారం చెయ్యగలిగినా, అది కొంతకాలమే, కొన్ని తరాలవరకే. తర్వాతి తరాలకి మన అభిప్రాయాలని గౌరవించడానికి ఏ రకమైన మొహమాటాలూ, అవసరమూ ఉండవు కదా.
మంచి విషయానికి తెరతీసినందుకు చంద్రహాస్ గారూ,మీకు అభినందనలు.
సినిమాపాట మొత్తం ఒకటే కాదు. దాని రేంజి – పాతకాలపు లెక్కల్లో చూస్తేనే – ఓలమ్మీ తిక్కరేగిందా దగ్గర్నించీ సడిసేయకోగాలి వరకూ ఉంది. డబ్బుచ్చుకుని రాశారా, సినిమా పాట రాయడం కష్టమా, అన్నీ అందరికీ నచ్చాలా – ఇవన్నీ మాట్లడ్డం లేదు మనం. సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం – సినిమా పాట కవిత్వమా కాదా? ఎవరు నిర్ణయించేది? కవిత్వమంటే ఏవిటి అన్న నిర్వచనాలే మారిపోవటం లేదా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి? నా మట్టుకి నాకు కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి కవిత్వాన్ని నిర్వచించడానికి – చిక్కదనం, గూఢత, సంపూర్ణత, మనసునో మెదడునో తాకే గుణం. ఇవన్నీ కొంతవరకూ సబ్జెక్టివ్ యే. కాలానికి నిలబడ్డం ఒక కొలమానంగా నేనొప్పుకోను. కొన్ని కొన్ని ఆ క్షణంలో మెరుస్తాయి, ఆ సందర్భంలో రాణిస్తాయి. ఆ సమయం దాటిపోయినాక వాటికి విలువ ఉండకపోవచ్చు. మరి కొన్ని కాలం మారిపోయాక anachronisticగా కనిపిస్తాయి. అంతమాత్రం చేత వాటి సమయసందర్భాల్లో వాటి విలువను కాదనలేము. కచ్చితంగా గొప్ప కవిత్వం అనదగిన పాటలు తెలుగులో ఉన్నాయి, ఏ సానరాతి మీద పరీక్షచేసి చూసినా.
మూర్తి గారు, కృతజ్ఞతలు. వాకిట్లో అడుగు పెట్టగానే మంచి కాఫీ లాంటి కామెంటునందించారు.
మీరు చెప్పిన విషయాలు వేటితోనూ నాకు పేచీ లేదు,ఒక్క ‘అతిసామాన్యమైన గుండమ్మ కథ’ అన్న మాటతో తప్ప . సినీ జీవులు (వారిలో నన్ను కూడా కలుపుకుంటున్నాను) చాలామంది ఈ సినిమాని అసామాన్యమైనది గా భావిస్తారు.
పైన వ్రాసిన మూడో అభ్యంతరం గురించి రెండు మాటలు. సినిమా ఉత్కృష్ట స్థాయి లొ రూపొందినప్పుడు అది అనేక కళల సమాహారం. ఇది గొప్ప సినిమా పాటకు కూడా మనం వర్తింపజేయ వచ్చు. మిగతా కళలని పరిగణించకుండా కేవలం కవిత్వపు నిగ్గును తేల్చినప్పుడు దాని సాహిత్య విశిష్టత బయటపడుతుంది. అయితే ఈ హంగులప్రభావం వల్ల, స్థూలదృష్టికి మామూలుపాట కూడా మంచి సాహిత్యం అనిపించే ప్రమాదం వుంది. ఈ ఎడ్వాంటేజి మామూలు సాహిత్యానికి ఉండదు.
మనకు సాహిత్యంలొ వున్న అనేక ప్రక్రియల్లొ సినిమా సాహిత్యాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియగా గుర్తించి అధునిక లాక్షణికులు పూనుకొని లక్షణం వ్రాస్తే బాగుంటుదేమో.
చంద్రహాస్ గారితో పూర్తిగా ఏకీభవిస్తూ ఒక విషయం మనవి చేయాలనుకుంటున్నాను. అన్ని ప్రక్రియలలో సినిమా పాట కూడా ఒక ప్రక్రియే. ఏ ప్రక్రియ తీసుకున్నా అందులో సాహిత్య విలువలు ఉన్నవీ లేనివీ రెండూ ఉన్నాయి. గణాలు యతులు ప్రాసలూ సర్పోయినన్త మాత్రాన అర్థం పర్థం లేకుండా పద్యం రాస్తే ఎట్లా కవిత్వంగా పరిగణించబడదో ఇదీ అంతే.కేవలం సినిమా పాటఅయినంత మాత్రాన సాహిత్యవిలువలు కలిగి ఉంటె దానిని కవిత్వంగా భావించకపోవడం సబబు కాదు.
మన సినీ సాహిత్యంలో కవిత్వమనదగిన ఆణిముత్యాలు కోకొల్లలు.అలాగంటే ఇప్పుడు వస్తున్నా వచన కవిత్వం( కవిత్వంఅనక తప్పడం లేదు) అంతా కవిత్వంగా భావించ వచ్చా? స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అచ్చు వేసుకుంటున్నారు. కాదనే హక్కు మనకెక్కడిది. అలాగే కొన్ని సినిమా పాటలవల్ల మొత్తం సినిమా పాటలకే దెబ్బ వస్తుంది. వస్తుడొశమే గాని ప్రక్రియ దోషం కాదని నా అభిప్రాయం
.
Sent from http://bit.ly/f02wSy
రామ్మోహన్ రావుగారు, కృతజ్ఞతలు. మొన్న మీరు ముఖ్యప్రసంగం చేసిన మా సాహిత్యకార్యక్రమానికి ఊళ్ళో లేక రాలేక పోయాను.
నారాయణస్వామి గారు, సినిమాపాట లక్షణం గురించి అలోచిస్తూ ఏదో వ్రాసానో లేదో మీ వ్యాఖ్య కనబడింది కొన్ని కావలసిన లక్షణాలను వివరిస్తూ. కృతజ్ఞతలు. సినిమాకవిత్వం నుండి అసలు కవిత్వమంటే ఏమిటి అన్న ప్రశ్నకు తీసుకెళ్ళారు. ఈ ప్రశ్న ఉదయించక తప్పదేమో ఈ చర్చలో. సార్వకాలీనత ఒక గీటురాయిక్రింద వాడవచ్చాఅనేది కూడా అలోచించాల్సిందే. నీటిలొ అలలా ఈ లక్షణం లేని కళకు సార్ధకత ఒక కాలానికి పరిమితం. కాని ఉన్నంతసేపులో ఆకాలపు మనుషుల్లో అది కలిగించే అనుభూతి నిస్సందేహంగా విలువైనదే.
ఒక సినిమాపాట సినిమాలోని సిట్యువేషన్, లొకేషన్, హీరో-హీరోయిన్ తో నిమిత్తం లేకుండా గుర్తుందంటే అందులోని సాహితీసంగీతపు విలువలు సినిమాని మీరిన యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉన్నాయనే అర్థం. అలాంటి పాటలు అప్పటికీ ఇప్పటికీ ఉన్నాయి. అప్పుడు చాలా ఉంటే ఇప్పుడు అడపాదడపా ఉంటున్నాయి. అంతే తేడా.
సినిమా పాటలో కవిత్వాన్ని వెతకటమంటే..నీళ్ళతొట్టిలో ముత్యాలకోసం వెతికినట్లే! సినిమాకు పాట ఎలా తయారవుతుందో..ఎంత మంది..ఎంగిలి పెదాలు..ఒక సినిమా పాటకు పదాలు సమకూరుస్తాయో..5 ఏళ్ళు ఆ రంగంలో పనిచేసిన నాకు ప్రత్యక్షానుభవం.చిత్రగీతాన్ని పల్చన చేయడం కాదు కానీ అది తయారయ్యే విధానమే..కవిత్వవాతావరణానికి పూర్తిగా విరుద్ధమైనది.బయటికి వచ్చి జనంలో నలిగి పాప్యులర్ ఐన పాటలక్కూడా ఆపాదింపబడే కవిత్వపు విలువలు సందేహాస్పదమైనవే.’వినగ వినగ రాగమతిశయిల్లుచునుండు’అనే సూత్రం సినిమా పాటలకు బాగా వర్తిస్తుంది.ఒక పాట పాప్యులర్ అవడానికి..సంగీతం..గాయకుని స్వరం..సందర్భం..ప్రచారం..లాంటివెన్నో సవాలక్ష కారణాలున్నా కాని..ఆ జాబితాలో కవిత్వం మాత్రం ఉండే అవకాశం అస్సలు లేదు.కవిత్వం బాగుందని పాటకు పేరొచ్చిన సందర్భం ప్రపంచ చిత్రరంగం మొత్తంలో ఒక్కటికూడా లేదు. పాట నలిగిన తరువాత సాహిత్యాభిరుచిగల వాళ్ళు వాటిలో వెతికి పట్టుకునేవే మనం మెచ్చుకొనే కొన్ని పాటల్లోని కవిత్వం పాళ్ళు.నిజానికి వేటూరి సుందరరామ్ముర్తి లాంటి మహామేధావులు కూడా తమ పాండిత్యంలోని కనీసం ఒకటో వంతును కూడా సినిమా పాటలలో ఉపయోగించి ఉండలేదు.అంతమాత్రానికే మనం ఆ పాటల కవిత్వానికి తెగ మురిసిపోతుంటాం.సినిమా సామాన్య జనాన్ని లక్ష్యించి తయారయ్యే ఓ పచ్చి వ్యాపార సరుకు.కవిత్వం మేథస్సు ఒక పొరను చీల్చుకుని అందుకోవాల్సిన మధుర ఫలం.ఒకటి నేల..రెండోది నింగి.నేల మీద నుంచి ఒక పది అడుగులు పైకి ఎగరగలదేమో కాని..ఏకంగా..వాయువిహారం చేయలేని పక్షి సినిమా పాట.దాని రెక్కలకు అంత శక్తి లేదు.
మహేష్, కృతజ్ఞతలు.
పాట కూడా ఒక సాహిత్య ప్రక్రియ అయినప్పుడు అది సినిమాకా , మామూలుగా లలితా సంగీతానికా అనేది అనవసరం. కవి కానివాడు కవితాత్మలేనివాడు ఎంత డబ్బుకోసం అయినా ఏం రాయగలడు? నిజమే పాట ట్యూన్ సంగీత దర్శకుడు , సీన్ రచయిత, కావలసిన డిమాండ్స్ నిర్మాత ఇస్తుండవచ్చు, కాని పాటలు జాగ్రత్తగా వింటే ఎక్కడో అక్కడ కవి కన్పిస్తాడు. కాకపొతే వాళ్ళే రాసుకోవచ్చుగా పాటల రచయిత ఎందుకు? అసలు నిజానికి నాబాధ లోకం బాధ అంటూఅందరినీ ఏడిపిమ్చిన కృష్ణ శాస్త్రి గారి పాటల మాటేమిటి? నా కు నచ్చింది నేను రాసుకుమ్ట ననడమే సులువేమో నలుగురికీ నచ్చేలా రాసేకంటే, చెత్తపాటలు ఉత్తిపాటల్లో కూడా సాహిత్యాన్ని చూడ గలిగే అభిరుచి ఉండాలి
చెత్తపాటలు ఉత్తిపాటల్లో కూడా సాహిత్యాన్ని చూడ గలిగే అభిరుచి ఎందుకు వుండాలి మ్యాడం? ఇక్కడ చర్చనీయాంశం సినిమా పాటల్లో కవిత్వం వుంటుందా? అని కదా! వెతికితే వుంటుందా అని కాదు కదా! అంత శ్రమపడి వెతుక్కోవాలసిన అవసరం మాత్రం ఏముంది? మానసికానందానికి ..మరో దానికి ..పాటలు వింటున్నాం అనండి..ఒప్పుకోవచ్చు. కవిత్వం ఎంజాయ్ చెయడానికి వింటున్నాం అంటే మాత్రం..!!!
సినిమా పాట కూడా నిస్సందేహంగా సాహిత్య ప్రక్రియే! కథల్లోనూ, కవిత్వంలోనూ, నవలా సాహిత్యంలోనూ తాలు సరుకు ఉన్నట్లే సినిమా పాటల సాహిత్యంలోనూ చెత్త పాటలు ఉండొచ్చు. పైగా సినిమా పాట పుట్టే వైనంలో, సినిమా కథకు, సిచ్యుయేషన్ కి, కొండొకచో నిర్మాత అభిరుచికి కూడా భాగం ఉంటుంది కాబట్టి ఉత్తమ సాహిత్యం అవుతుందా కాదా అనేది ఈ పరిస్థితులన్నింటి మీదా ఆధార పడి ఉండే అవకాశం ఉంది .
అద్భుతమైన పాటలెన్నో సినిమా సాహిత్యంలో ఉన్నాయి.
“శృంగారం వాగైనది ఆ వాగే వైగై నది” అన్న వేటూరి పాట లో లైను కి ఎంత గొప్ప పురస్కారం చాలుతుంది? (అదే వేటూరి కథకు తగ్గట్టుగా కూడా పాటలు రాశారు)
పదాలతో ఆడుకోగలిగి అద్భుతాలు సృష్టించగలిగే వేటురి లాంటి కవులు సినిమా సాహిత్యానికి సాహితీ స్థాయి ఉత్తమ స్థాయిలోనే కల్పించారు.
నిస్సందేహంగా సినిమా పాట సాహిత్యమే
మంచి విషయం చర్చకు తీసుకు వచ్చారు. నాకెన్నాళ్ళుగానో దొలుస్తున్న సందేహమిది. సినీపాటలు ఎందుకు కవిత్వం కావు? అని.
“కలువ కనుల చల్లని సిరి
ఉల్లములో ప్రేమ లహరి” అన్నప్పుడు గానీ
“అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు” అని విన్నప్పుడు గానీ
“ఆబాలగోపాలమాబాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జుడ” అన్నప్పుడు గానీ
సినిమా పాటలు కవితలు ఎందుకు కావు? వాటిని కవితలుగా గుర్తించరెందుకని? అన్న సందేహం దొలిచేస్తుంటుంది.
“రాధనురా నీ రాధనురా!
రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!
వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!
ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!
రాధనురా నీ రాధనురా!”
ట్యూన్ లేకుండా చదివితే ఇది మంచి కవితలా లేదూ? నిగూఢార్థం స్ఫురించడం లేదూ??
సౌమ్యగారు, ఎంత మంచి పాటను (రాధనురా) జ్ఞప్తికి తెచ్చారు!
సినిమా పాటల్లో మంచి సాహిత్యమున్న మాట ఎంత వాస్తవమో ,అది సాహిత్యాన్ని దిగజార్చిన మాట అంతే వాస్తవం.అందరు రచయితలు ఒక్కటి కాదు అన్ని సందర్భాలు ఒక్కటి కాదు .హిందిలో,తెలుగు లో అద్భుత సాహిత్య సంపద ఉన్న అనేక పాటలు మనకు తెలుసు కదా
అద్దానికి అటూ ఇతూలా ఎ సాహిత్యం తీసుకున్నా రెండు వైపులు ఉంటాయి . మన గత కాలపు కవులు మాత్రం రాజు గారి కోరికపై ఆయన మెప్పుదల సంమనాల నాశించి కవిత్వం రాయలేదా ? శృంగార నైషధం , కుమార సంభవం చాలా గోప్పకావ్యాలా ముద్దుపళని రాధికా సాంత్వనం కావ్యమా ? ఆనాటి కవిత్వంలోనూ కేవలం వచనం చందస్సులో పొదిగిన ఉదాహరణలున్నాయి అందరూ అన్నివేళలా గొప్ప సాహిత్యమే రాస్తారా? వాక్యాన్ని నాలుగు వరసల్లో రాసి కవిత్వమనుకోవడం లేదా?
నీ సూకు కొట్టిమీరలో నాకు సాహిత్యమే కనబడింది
చిత్రమేమంటే సినిమా పాటల్లో కవిత్వముందనే ప్రేమించే వాళ్ళందరూ పాత సినిమా పాటలనే quote చేసారు. కారణం 1. అప్పట్లో బైట సాహిత్యంలో నిష్ణాతులైన కవులు మాత్రమే సినిమా పాటలు రాసే వారు. ఆ గంధం కొంత చిత్ర గీతాలకీ సహజంగానే అంటుకుని ఉంటుంది కదా! ఇప్పుడా పరిస్థితి ఉందా!(ఎవరో ఒకరిద్దరు సుద్దాల అశోక్ తేజ..మొన్నటి దాకావేటూరి వారు మినహాయించి.సిరివెన్నెల లాంటి వాళ్ళుexception)అప్పట్లో కవికి సన్నివేశాన్నివివరించి పాటను రాయమని కొంత ఎక్కువ స్వేచ్చ ఇచ్చేవారు.ఇప్పుడు సన్నివేశం తరువాత..సినిమాకన్నా ముందే సంగీత బాణీలు తయారవుతున్నాయి.ఆ తాడు మీదే కవి కుంటాలి.అదే నృత్యమనుకుంటే నేను చెప్పేది ఏమీ లేదు.ఏదో వాదనకోసం..సినిమాల మీద సినిమాసహిత్యం మీద వుండే అవ్యాజ ప్రేమ వల్ల అంతా బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది కానీ..అదే రంగంలో చాలా ఏళ్ళూ సమీపంగా వుండి చూసిన వాడిని కనక అధిక శాతం పాశ్చాత్యసంగీత బాణీల అడుగు నూతుల్లోనుంచి అతి కష్టపడి వింటే తప్ప అసలు శబ్దమే వినపడని ఇప్పటి పాటల్లో అర్థమే సరిగ్గా బుర్రకెక్కనప్పుడు కవిత్వాని ఆస్వాదించేదేమిటి?!
హనుమంతరావుగారు, స్వాతిగారు, సుజాతగారు, లింగారెడ్డి గారు, కృతజ్ఞతలు.
“సాహిత్యం అలోచనామృతం – సంగీతం ఆపాతమధురం” అన్న నానుడి మన అందరికి సుపరిచితమే. సాహిత్యం యొక్కా పరమావధి ఏమిటి. పఠిత/శ్రోత మనసులో చొరబడి, స్పందింపచేసి పరివర్తన తీసుకురావడమే కదా. సినిమా పాట ఆ లక్ష్యాన్సాధించింది అనడం లో సందేహం లేదు. ప్రబొధాత్మకమైన గీతాలు ఎన్నో ఉన్నాయి. శ్రీ శ్రీ గారి “పాడవోయి భారతీయుడా, సి. నా. రె. గారి “ఈ నాడె బాబు నీ పుట్టిన రోజు, పుట్టినరోజు పండగె అందరికి, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి” వంటివి చెప్పుకుంటూపోతే అగణితం. “అంత కడివెడు పాలపై రవ్వంత మీగడ పేరినట్లుగా, మనకు మిగులును గతములోపలి మంచి, అదే సాంప్రదాయం” అన్నారు సి.నా.రె. అంచేత మంచి చెడుల మిశ్రమం నుంచి మంచిని సమీకరించుకొని, మనసుని సవరించుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధింపచేసే ప్రక్రియ ఏదైనా విలువైనదనే పరిగణించాలి. కవితగా వ్రాయబడిన “ఈ నల్లని రాలలో” సినిమాపాటగా రూపుదిద్దుకోక ముందు ఎంతమంది మదితలుపు తట్టింది. పాటగా ఎందరి హృదయాలలో నిలిచిపోయింది. కనుక ఏ సాహితీ విలువ లేకుండా సినిమా పాట శ్రోతలను రంజింపచేసి అజరామరంగా ఎలా చిరకాలంగా ఉండ గలుగుతోoది? అయితే మచి కధా సమంవితమైన సినిమాలు నిర్మిస్తే అద్వితీయ భావాలతో, పదజాలంతో, ప్రబోధాత్మకతతో వ్రాయగల దిట్టలు ఉన్నారు. ఉపయోగించుకోవడం మనచేతిలో ఉంది. బంగారానికి తావి అబ్బినట్లుగా, సాహింత్యానికి మంచి సంగీతం తోడైతే ఆ పాట మారినకాలానికి తగిన సాహితీవిలువులున్నదే అవుతుంది.