పుస్తక పరిచయం

బబ్లూ గాడి బుక్ రివ్యూ

సెప్టెంబర్ 2017

చెప్పింది: బబ్లూ
రాసింది: వాళ్ళ డాడీ

పెద్దోళ్ళకన్నీ తెలుసని వాళ్ళనుకొంటారు. కానీ వాళ్ళకేమీ తెలీదని నాకు మాత్రమే తెలుసు. అ విషయం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళింకా నమ్మలేదు.

లేపోతే చూడూ!

నేను పుట్టానో లేదో గొల్లపూడి వాళ్ళేసిన కాశీ మజిలీ కథలు పేద్ద పేద్దవి ఆరు పుస్తకాలూ, కథా సరిత్సాగరం, రంగుల ఎన్‌సైక్లోపీడీయాలూ, ఈసఫ్ , జాతక , భేతాళ, ప్రపంచ కథలూ, రామయణ, మహా భారతాలూ , ఇంకా టాం సాయర్ లాంటి బండెడు పుస్తకాలు ఓ బీరువా నిండా పేర్చిపెట్టాడు మా నాన్న.

నాకప్పటికి ఏబీసీడీ లు రావు. అందుకే “నాన్న” అనేవాడిని. మూడేళ్ళప్పుడు ఇంట్లో శుబ్బరంగా ఆడుకొంటుంటే ప్లే స్కూల్లో వేసేశారు – అక్కడ బోలెడన్ని ఆటలు ఆడుకోవచ్చని మోసం చేసి. ఇక అప్పటినించీ వాళ్ళని నమ్మటం మానేశాను. వాడిని డాడీ అనటం కూడా మొదలెట్టాను. తప్పు ‘వాడు ‘ అనకూడదు అని క్వీనీ టీచర్ పెద్ద క్లాసు పీకిందిలే. మరి స్కూల్లో ఫ్రెండ్స్‌ను వాడు అనటల్లా? ఆ టీచర్‌కీ బుర్రలేదు.

పెద్దోళ్ళకు ఏమీ తెలీదన్నాను కదూ.

ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఏముందో నాకే కాదు, మా డాడీకి అసలే తెలీదు. అసలు చదవటానికి వాడు ఇంట్లో ఉంటేగా! మళ్ళీ ఆఫీసు నుంచి గంటకో ఫోను – బబ్బు గాడేం చేస్తున్నాడని. వాటినెవడు చదూతాడని తెచ్చిపెట్టాడో మరి? నేనన్నా నయం- అప్పుడప్పుడు వాటిలో బొమ్మలు చూస్తుండేవాడిని. కొన్ని పేజీలయితే చింపి పోగులు పెట్టేవాడిని.

ఓ సారేమయిందో తెలుసా?

అర్ధరాత్రి లాప్‌టాప్ బాగ్ పట్టుకొని దొంగలాగా ఇంట్లో దూరబోతున్నాడు ఎప్పట్లాగే! నేను అప్పుడే బాత్రూం నుంచి రెండు బకెట్లు హాల్లోకి లాక్కొచ్చి ఆ నీళ్ళతో స్నానం చేస్తున్నా. వాడికి గుండాగిపోయి కేకలు పెట్టి అందర్నీ నిద్ర లేపాడు- అందుకే ఈ పెద్దోళ్ళకి ఎమీ తెలీదంది – బజ్జున్న వాళ్ళని లేపకూడదన్న విషయం నాకు తెలుసు, కానీ అంత వయసొచ్చినా వాళ్ళకి తెలీదు.

పాపం మా మమ్మీ కొన్ని పుస్తకాలు చదివి ఆ కథలు చెప్పబోయింది గానీ, మనం వింటేగా? వాళ్ళు విని చచ్చారు గనకనా వాళ్ళ పెద్దోళ్ళ మాటలు? కావాలంటే మా అమ్మమ్మనీ , నాయనమ్మనీ అడగండి. అంచేత మనమూ వినక్కర్లేదు.

ఇంతకీ వాళ్ళ పుస్తకాల గోల. వాటిని చదివి గ్యానం పెంచుకోవాలని నాకు పదేళ్ళొచ్చేదాకా ఒకటే నస. ఇంగ్లీషు స్కూల్లో వేసి మళ్ళీ ఇంట్లో మాత్రం తెలుగు పుస్తకాలు చదవాలంట! అసలు వీళ్ళకి బుర్రుందా అని ?

అలా వాళ్ళు ఏడిచీ, గోల పెట్టీ, పానీ పూరీ కొనిస్తామని ఊరించీ, తంతామని బెదిరించీ ఎలాగో మొదటిసారిగా టింకిల్ చదివించి తెగ సంతోషించారు. నేను బొమ్మలు మాత్రమే చూస్తూ పేజీలు స్పీడుగా తిప్పుతున్నానని వాళ్లకు తెలిసి చస్తేగా…

ఆ తర్వాత నేనే పేపరంకుల్ తో చెప్పి టింకిల్ తెప్పించుకొని, చదివిందే మళ్ళీ మళ్ళీ చదివి స్కూల్లో తక్కువ మార్కులు తెచ్చుకొన్నా వాళ్ళు ఇంకేం అన్లేకపోయారు- వయసు పెరిగిందిగా కొంచెం బుద్దొచ్చిందనుకొంటా.

టింకిల్ వాళ్ళ మహాభారతం తర్వాత సి. రాజగోపాలాచారి రాసిన ‘మహాభారతం’ అడిగి తెప్పించుకొన్నా. రాజగోపాలాచారి తాత అప్పటి మద్రాసు ముఖ్యమంత్రీ, చివరి గవర్నర్ జనరల్ కూడా అంట.

అది చదివి , బోలెడు రీసెర్చ్ చేసి, కౌరవులు వందమంది కాదు 102 మంది అనీ, అందరూ మగవాళ్ళు కాదు- నూట ఒకటో ఆమె దుశ్శల అనీ కనిపెట్టి, అ పేర్లన్నీ వరసగా రాసి చూపించేసరికి మా వాళ్ళకి మతి పోయింది. ఇంకానేమో కౌరవులు అందరూ చెడ్డవాళ్ళు కాదు- వికర్ణ, యుయుత్సు ఇద్దరూ మంచి వాళ్ళని చెప్పే సరికి – ఇక దిమ్మ తిరిగి మైండు బ్లాకయిందనుకో! (అందుకే మరి మహేష్ బాబు సినిమా మొదటిరొజే చూడాలి నాలాగా).

వీడికీ పేర్ల గోల ఎంటో అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నవ్వుతూ ఏడుస్తూ చెప్పుకొన్నారని అక్కడి ఆంటీలు చెప్తే తర్వాత తెలిసింది. వాటినే ఆనంద బాష్పాలు అంటారని వాళ్ళే చెప్పారు. నాలాగే ఆ ఆంటీలకీ వీళ్ళ పుస్తకాల గోలంటే వళ్ళు మంట. అందుకే వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ముందు గదుల్లో పుస్తకాల గోల చేస్తుంటే నేను వంటగదిలో దూరి వాళ్ళతో కబుర్లు చెపుతూ ఉంటాను- తినటానికేమున్నాయా అని వెతుక్కుంటూ.

బయట అందరికంటే చెవులు పగిలేట్టు పుస్తకాల గోల చేసేవాళ్ళలో ఎప్పుడూ ఫష్ట్ వచ్చేది అనిల్ అంకులే.

ఆయన ఓ సారి ‘ఉక్రేనియన్ ష్టోరీస్ ‘ అని ఓ బండ పుస్తకం గిఫ్ట్‌గా ఇచ్చి చదివారా? చదివారా? అని కనిపించిన చోటల్లా కొన్ని వందల సార్లు అడిగే సరికి, మా చిన్నారికి జాలేసి రెండు రోజుల్లో ఆ 550 పేజీల పుస్తకం చదివి పారేసింది. అది ఫోన్‌లో చెప్పేసరికి మొహమంతా వెలిగిపోతూ “మీలాంటి వాళ్ళకోసమే ఇవి డబ్బింగ్ చేశాను ” అని వచ్చి ఇంకో రెండు పుస్తకాలు తెచ్చిచ్చాడు.

అవే ‘రష్యన్ జానపద కథలు ‘.

వాటిని చూసేసరికి భయమేసి చచ్చాను. ఎందుకంటే అవి తెలుగు పుస్తకాలు.

చిన్నప్పుడెప్పుడో మా అమ్మ కష్టపడి తెలుగు నేర్పింది. అప్పుడు పేపర్ చూసి సినిమాల వివరాలు చదివేంత బాగా తెలుగు వచ్చింది. కానీ ఇంకా బాగా రావాలని మా వాళ్ళు ఓ ట్యూషన్ లో చేర్పించారు. ఆ టీచర్ దెబ్బలకి తెలుగు మీద విరక్తి పుట్టి వచ్చినదంతా మరిచిపోయాను.

రెండోదేమో, ఆ పుస్తకాలు చదివి, మళ్ళీ వాటి గురించి మీటింగులో మాట్లాడాల్సింది కూడా మీరే అని కూడా చెప్పి పోయాడు అనిల్ అంకుల్.

చచ్చాం రా బాబూ! అంది చిన్నారి.

తప్పించు కొందామని ఎన్నో ఎత్తులేసాం. అయితే అంతకంటే ఎక్కువ ఎత్తులేసి మా అమ్మా నాన్నా వాటిని చిత్తు చేశారు. ఇక చిప్స్ కొనమనీ , మహేష్ బాబు నానీ సినిమాలు బందనీ మా వీక్నెస్ మీద దెబ్బ కొట్టారు. అలా వాళ్ళకి మాకంటే కొంచెం తెలివి ఎక్కువే ఉందని తెలిసొచ్చింది మొదటిసారిగా.

ఇక్కడో సీక్రెట్ చెప్పాలి. కథలు చదవటం కష్టమే, కానీ వాటి మీద మాట్టాడటం మాత్రం ఇష్టం, మీకు లాగే. చాలా మంది లాగా నాకూ మైకు పిచ్చి ఉందని మా అమ్మ చిన్నప్పుడే కనిపెట్టేసింది. అందుకే చిన్నారి(చిన్నారి అంటే మా చెల్లెలు రాక్షసి) కంటే నేను మాత్రం హాపీ…

పొన్లే, మా టైం ఇంకా రాలేదని కాంప్రమైజ్ అయి ఆ పుస్తకం కొంచెం తెరిచి చూశాం.

ఆసమ్! ఒక్కో కథకూ ఓ రంగుల బొమ్మ. మెరిసే ఆయిల్ పేపర్‌ల మీద పాతిక దాకా అలాంటి బొమ్మలే. ఆ రంగుల బొమ్మలు చూశాక ఇంక కథ చదవాలనిపించింది. ఎలాగో కష్టపడి వచ్చీ రాని తెలుగులో చదవటం మొదలెట్టా. రెండు మూడు కథలు చదివాక మిగతా కథలు చదవటం ఈజీ అయ్యింది.

మీకు నచ్చినా నచ్చకపోయినా అదే చెప్పండి అని అనిల్ అంకుల్ చెప్పటం ఇంకా నచ్చింది. అందుకని కథలన్నీ చదవకముందే కొన్ని పాయింట్‌లు రాసేసుకొన్నా.

ఈ పుస్తకం ఎందుకు నచ్చిందంటే:

- రంగు రంగుల బొమ్మలు. మనం ఓ రంగుల తోటలో నడిచినట్టు ఉంటుంది.

- తెలుగు అంతగా రాకపోయినా నేను చదవటం. ఇంకో సీక్రెట్! మా అమ్మా నాన్నలు తెలుగులో ఏం రాశారో ఇంతవరకూ నేను చదవలేదు. కానీ ఈ పుస్తకం చదవ గలిగాను. “తెలుగు రానట్టు భలే యాక్షన్ చేశావురా ఇన్నాళ్ళూ” అని కుళ్ళుకున్నారు వాళ్ళు.
- రాసిన వాక్యాలన్నీ సింపుల్ గా ఉన్నాయి. అర్ధం కాని కథంటూ ఏమీ లేదు.

- నాకు ప్రేమ్‌చంద్ కథలు రెండు తెగ నచ్చాయి. ఒక మనవడు అమ్మమ్మ కోసం అట్లకాడ కొనే కథ, రెండు ఎద్దులు కలిసి ఓ ఆంబోతుని ఓడించే కథ. ఎందుకో ఈ కథలు చదూతుంటే ఆ కథలు గుర్తొచ్చాయి.

- నాకు కలలంటే ఇష్టం. ఎందుకంటే వాటిలో మనకిష్టమొచ్చినట్టు కలలు కనేయొచ్చు. ఈ కథలు కూడా ఆ కలల్లానే ఉన్నాయి. ఒకో బొమ్మకూ ఒక్కో కల.

- అక్కడెక్కడో రష్యా అనే దేశంలో కూడా మనలాంటి పిల్లలు మనలాగే ఇవీ చదూతారని తెలుసుకోటం.

- చీపురు కట్టల మీద ఎగిరే హారీ పోటర్ ఏడు బండ పుస్తకాల కంటే ఈ కథలు బాగా ఉన్నాయనిపించటం (చిన్నారికి హారీ పోటర్ అంటే ఇష్టమని ఇది రాశానని చెప్పకండి. తెలిస్తే నన్ను గిచ్చి గిచ్చి పెడుతుంది).

ఇంకా ఇలాంటివే నేను ఇంగ్లీషు తెలుగులో రాశాను. అవి చూసి మా డాడీ “నువ్వు చెప్పు, నేను తెలుగు తెలుగులో రాసి పెడతాను” అన్నాడు.

నేనేది చెప్తే అదే రాయాలి, దాన్ని మార్చ కూడదు అని కండిషన్ పెట్టాను. అలా అన్ని కథలూ చదవక ముందే ఇది తయారయ్యింది. దీన్నే బుక్ రివ్యూ అంటారని కూడా అన్నాడు మా డాడీ.

మీకు నచ్చితే- నచ్చినట్టు కామెంట్లు పెడితేనే- ఇలాంటివి ఇంకొన్ని చెప్పి రాయిస్తాను (ఎవరూ చదవక పోయినా రాస్తూ పబ్లిష్ చేస్తూ ఉండటానికి నేనేం పెద్దోడిని కాదు).

మీకు నచ్చకపోయినా పెద్దోడినయ్యాక తెలుగు రాయటం నేర్చుకొని ఎలాగూ నా ఇష్టమొచ్చినట్టు రాస్తాను.

అప్పుడు మీరు చచ్చినట్టు చదవక తప్పదు.

ఎందుకంటే మీరేది రాసినా ఇప్పుడు మేం చచ్చినట్టు చదవటంలా? మాకూ ఉంటాయి హక్కులు – కావాలంటే మా సివిక్స్ టెక్స్ట్ బుక్ చదవండి.

**** (*) ****


బబ్లూ ఇంట్రో:

చదవటం కంటే చూడటం, చూడటం కోసం తిరగటం, తిరగటం కంటే తినటం ఇష్టం.

తినటంలో నా స్పెషాలిటీ : పుట్టకొక్కులు, ముల్లంగి, కాబేజీ, బీట్‌రూట్, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, ఇంకా బోలెడు సూపులు, నూడుల్స్.

చిన్నప్పుడు ముప్పయ్యేళ్ళ కాలెండర్, ప్రపంచ దేశాలు, ఇండియాలో అన్ని రాష్ట్రాల వివరాలూ చెప్పి , రెండు నిమిషాల్లో రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేసరికి, అది తెలిసి ఇద్దరు డాక్టరంకుల్స్ నన్ను వెతుక్కొంటూ వచ్చి మా మమ్మీ డాడీలకు ఫ్రెండ్సయిపోయారు.

ఇంకో సారేమో “మీ ముత్తాత మేనల్లుడి మూడో తమ్ముడి నాలుగో మేనల్లుడి రెండో చెల్లెలుంది. బంగారబ్బొమ్మ. చేసుకొంటావురా?” అంది మా చినమ్మమ్మ పెద్ద కోడలు – నేను అయిదో క్లాసులో ఉన్నప్పుడు. “అదెలా కుదురుద్ది? అది నాకు చెల్లి వరస కదా అత్తా!” అనేసరికి, పళ్ళూడిన చుట్టాలందరూ ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కొని నేనే కరెక్టని తేల్చి – ఇక అప్పట్నించీ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో తెలుసుకొనేందుకు అమెరికానుంచీ కూడా ఫోన్లు చెయ్యటం మొదలెట్టారు.

ఇంకా తబలా , పియానో, కీ బోర్డు , డ్రమ్‌స్ కొట్టటమంటే ఇష్టం. చదవటం కంటే కథలు రాయటం ఎక్కువ ఇష్టం.

ఎప్పటికయినా పేద్ద ఆటో మొబైల్ ఇంజనీర్నీ, బిజినెస్ మాన్ నీ , చెఫ్ నీ , ప్రైం మినిష్టర్నీ అవుతాను. మా పిల్లల బండెడు పుస్తకాల బరువునీ, పరీక్షల బాధనీ బ్యాన్ చేస్తా. ఈ పెద్దోళ్ళకి కొంచెమన్నా బుద్ది రాకపోతే స్కూల్లో చేర్పించి నాతో పాటు మళ్ళీ 8th క్లాసు పరీక్షలు పెట్టిస్తాను.



22 Responses to బబ్లూ గాడి బుక్ రివ్యూ

  1. Krishna Prasad
    September 1, 2017 at 2:31 pm

    శుభమధ్యాహ్నం బబ్లూ,
    చాలా మంచిపని చేశావు.నువ్వు చాలా రుచికరమైన ఛెప్ వి.మంచి సమీక్షని వండావు.నిఝంగా నిఝం నువ్వు చెప్పిన మాట.బుర్ర్రున్న వాడెవడూ పుస్తకాలు చదవడు.నీ రివ్యూ మైండ్ బ్లోయింగ్ అండ్ గ్లోయింగ్.
    మరిన్ని సమీక్షలూ,మరిన్ని ఉద్గ్రంధాలూ నీనుండీ ఆశిస్తూ సెలవుతీసుకుంటున్నాను. ఇట్లు,…..KP.

  2. Sunitha
    September 1, 2017 at 3:29 pm

    నేను తెలుగు తెలుగులో కామెంట్ రాస్తున్నా.
    ఈజీ తెలుగులో రాస్తా, నువ్వే చదువుకో.
    నీ రివ్యూ బాగుంది. పెద్దోళ్ళు అయ్యాక బుర్ర సైజ్ పెరిగి అందులో గుజ్జు కొంచెం తగ్గుతుందిలే. మహేష్ సినిమా చూడట్లే ఎలా ఉన్నా, ఇదీ భరించు

    • మల్లి
      September 1, 2017 at 4:05 pm

      చాల బాగా ఉంది నేను చూసిన బబుల్లి ఏన ?

  3. Sunitha
    September 1, 2017 at 3:31 pm

    నేను తెలుగు తెలుగులో కామెంట్ రాస్తున్నా.
    ఈజీ తెలుగులో రాస్తా, నువ్వే చదువుకో.
    నీ రివ్యూ బాగుంది. పెద్దోళ్ళు అయ్యాక బుర్ర సైజ్ పెరిగి అందులో గుజ్జు కొంచెం తగ్గుతుందిలే. మహేష్ సినిమా చూడట్లే ఎలా ఉన్నా, ఇదీ భరించు

  4. చందు తులసి
    September 1, 2017 at 3:37 pm

    గుడ్. సురేశ్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు సాహిత్యం అందుబాటులో ఉంచడం. వారిని సాహిత్య కారులు గా తీర్చిదిద్దటం .. మీలాగే తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించే రోజు రావాలి.

  5. amarendra dasari
    September 1, 2017 at 6:05 pm

    లగే రహో బబ్లూ..బావుంది బావుంది ..రివ్యూ సరేసరి , పెద్దవాళ్ళని ఉతికి ఆరేసావు చూడూ – అది ఇంకా బావుంది

  6. Babloo
    September 2, 2017 at 10:29 am

    థాంక్ యు సునితాంటీ,

    పెద్దోళ్ళ విషయం నాలాగే మీకూ తెలిసిపోయింది. ఫ్రెండ్స్!

    కానీ, మహేష్ బాబు సినిమాల సంగతి మనం ఇంకొంచెం re-think చెయ్యాలి.

    చిన్నప్పుడు పోకిరీ వంద సార్లు చూసుంటా. కానీ ఇప్పుడు మళ్ళీ చూడాలంటే చిరాకు.

    ఇంకానేమో నెంబర్ 1 నేనొక్కడినే, బ్రహ్మోత్సవం సినిమాలప్పుడు మొదటిరోజు అందరూ హల్లోంచి పారిపోయినా, నేనొక్కడినే చివరిదాకా చూశా. శ్రీమంతుడు తెగ నచ్చింది.

    స్పైడర్ వచ్చాక మొదటిరొజే అంటే Sept 27 చూసి చెప్తా బాగుందో లేదో.

    - బబ్లూ

  7. రమణమూర్తి
    September 2, 2017 at 10:57 am

    సూపర్, బబ్లూ! బ్రహ్మాండంగా పేలింది, ఫో!

    (అన్నట్టు- పూర్తిగా చదవకుండానే రాసేవాటిని కొన్ని సందర్భాల్లో ‘కామెంట్స్’ అని కూడా అంటూ ఉంటారు… :) )

  8. vv narasimha murthy
    September 2, 2017 at 1:00 pm

    మా మనవడేం చెప్పాడో మా అల్లుడికేం అర్ధమయిందో గాని రాసింది ఎంచక్కా ఉంది. చదూతూంటే యింకా యింకా చదివెయ్యాలనేసి చదివేసా. తప్పులుంటే మా మనవడి మీదకి నెట్టెయ్యాలన్న ఒప్పులంటే తనకి అట్టిపెట్టేసుకోవాలన్న కుళ్లు బుద్ది కనిపించిందబ్బాయా..
    కౌరవులు వందమంది కాదు 102 మంది అనీ, అందరూ మగవాళ్ళు కాదు- నూట ఒకటో ఆమె దుశ్శల అనీ కనిపెట్టి, అ పేర్లన్నీ వరసగా రాసి చూపించేసరికి మా వాళ్ళకి మతి పోయింది. ఇంకానేమో కౌరవులు అందరూ చెడ్డవాళ్ళు కాదు- వికర్ణ, యుయుత్సు ఇద్దరూ మంచి వాళ్ళని చెప్పే సరికి – ఇక దిమ్మ తిరిగి మైండు బ్లాకయిందనుకో! (అందుకే మరి మహేష్ బాబు సినిమా మొదటిరొజే చూడాలి నాలాగా). .. ఇది చదివేకా
    చిన్నప్పుడు ముప్పయ్యేళ్ళ కాలెండర్, ప్రపంచ దేశాలు, ఇండియాలో అన్ని రాష్ట్రాల వివరాలూ చెప్పి , రెండు నిమిషాల్లో రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేసరికి, అది తెలిసి ఇద్దరు డాక్టరంకుల్స్ నన్ను వెతుక్కొంటూ వచ్చి మా మమ్మీ డాడీలకు ఫ్రెండ్సయిపోయారు.

    ఇంకో సారేమో “మీ ముత్తాత మేనల్లుడి మూడో తమ్ముడి నాలుగో మేనల్లుడి రెండో చెల్లెలుంది. బంగారబ్బొమ్మ. చేసుకొంటావురా?” అంది మా చినమ్మమ్మ పెద్ద కోడలు – నేను అయిదో క్లాసులో ఉన్నప్పుడు. “అదెలా కుదురుద్ది? అది నాకు చెల్లి వరస కదా అత్తా!” అనేసరికి, పళ్ళూడిన చుట్టాలందరూ ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కొని నేనే కరెక్టని తేల్చి – ఇక అప్పట్నించీ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో తెలుసుకొనేందుకు అమెరికానుంచీ కూడా ఫోన్లు చెయ్యటం మొదలెట్టారు. .. ఇదీ చదివేకా
    చాలా చాలా సంతోషం వేసింది బబ్లూ .. నాన్నకి నాన్న అనాలని ఎపుడు చెపుతావ్?

  9. B. Rama Naidu
    September 2, 2017 at 7:37 pm

    వినూత్నమైన మంచి ప్రయత్నం. రెఫ్రెషింగ్.

  10. కె.కె. రామయ్య
    September 3, 2017 at 8:19 am

    బబ్లూ! ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు నీకు మంచి ఫ్రెండ్ కదూ.

    థాంక్యూ కె. సురేష్ గారూ … రష్యన్ జానపద కధలు బుక్ రెఫ్రెషింగ్ రివ్యూకి.
    థాంక్యూ సో మచ్ అనిల్ బత్తుల గారూ … “రష్యన్ జానపద కధలు” అనువదించినందుకు.

    “డోంట్ షూట్ ద వైట్ స్వాన్స్” బోరిస్ వాసిల్యెవ్ రష్యన్ నవలకు తెలుగు అనువాదం “హంసలను వేటాడొద్దు”
    ను కినిగె అంతర్జాల పత్రికలో రాసింది కూడా మీరే కదూ కె. సురేష్ గారూ.

    http://patrika.kinige.com/?p=1954

  11. Babloo
    September 3, 2017 at 8:41 am

    మల్లి మామా,

    బబ్లూనే!

    చిన్నప్పుడు నీ ఫెంచ్ కట్ గడ్డం చూసి భయంతో దాక్కునేవాడ్నిగా. గుర్తుంది.

    మీ మమ్మీని నాయనమ్మా అని పిలిచేవాడ్ని. నన్నెప్పుడు చూద్దామా అని పనిగట్టుకొని వచ్చేది. నిన్ను తిట్టి మా ఇంట్లో దింపమనేది. అంతా గుర్తుంది.

    సారీ మామా… నాయనమ్మ చచ్చిపోయిందని తెలిసి చిన్నారీ నేనూ డల్లయిపోయాం.

    ఎప్పుడో నాయనమ్మ మీద రాస్తా…

    -బబ్లూ

  12. Csrambabu
    September 3, 2017 at 11:47 am

    ఇంత చిన్న కుర్రాడు అంత పెద్ద రివ్యూ రాశాడంటే
    ఆనందం ఆశ్చర్యం..
    పెద్దలు పూనుకుంటేనే ఇలాంటి రివ్యూలు వస్తాయి..
    రేపటి రచయిత బబ్లూకి అభినందనలు

  13. అవినేని భాస్కర్
    September 3, 2017 at 3:31 pm

    డియర్ బబ్లూ,
    నువ్వు చెప్పిన కబుర్లు భలే ఉన్నాయి. హగ్స్ మై డియర్ బాయ్! అడుగడుగునా హాస్యంతొ నవ్వించినందుకు :-) జస్ట్ నువ్వు చెప్పినదాన్ని టైపింగ్ చేసినందుకు మీ నాన్నకి కొంత క్రెడిట్ కొట్టేశాడని కొంచం అసూయగా ఉంది :-)

    చిన్నప్పట్నుండి మీ అమ్మా నాన్నలు నిన్నెన్నెన్ని కష్టాలు పెడుతున్నారో! పాపం నువ్వు. అయితే ఆ కష్టాలనుకూడా కామెడిగా చెప్పే స్కిల్ వచ్చేసింది నీకు. ఇంక ఆగకుండ చెప్పుకుంటూ పో. తెలుగు పుస్తకాల గురించే కాదు; ఇంగ్లీషు పుస్తకాల గురించి కూడా రాయి. ఇంగ్లీష్ చదువు చదివినా తెలుగు పుస్తకం చదివినందుకు ముచ్చట పడిపోతున్నాను. ఇంతటి మంచి పుస్తకం వేసి బబ్లు చేత చదివించి, బుక్ రివ్యూ రాయించిన అనిల్ బత్తులకి థేంక్స్.

    మెల్ల మెల్లగా కథలు రాయడం కూడా మొదలు పెట్టు. ఈ వ్యాసంలో చెప్పిన చిన్న చిన్న సంగతులనే ఇంత హాయిగా చెప్పావంటే కథలంటూ మొదలుపెడితే చక్కగా రాయగలవు. నీ హాబీల, ఆహారపు అలవాట్ల లిస్ట్ కూడ నచ్చిందబ్బా! Wish you all the best my dear boy!

    మీ నాన్నలాగే మా నాన్నకూడా! దురాశెక్కువ. స్కూల్లో అరవం చదివించి ఇంట్లో తెలుగు పుస్తకాలు కొనిపెట్టాడు :-) అవేవీ ముట్టూకోకుండ ఒకపక్క ఇతిహాస, భక్తి సాహిత్యం, మరోపక్క నాస్తికత్వం బోధించే హేతువాద సాహిత్యం చదివేవాణ్ణి! ఈ రెండు extremes మధ్యన పెండూలంలా 180 degrees ఊగిపోతున్న రోజుల్లో దొరికాయి ఈ రంగు రంగుల బొమ్మలతో మంచి వాసనతో నున్నని పేపర్ల రష్యన్ పుస్తకాలు. ఆ బొమ్మలని మించిపోయే వర్ణనలు. ఎగిరే గుర్రాలు, దానిపై స్వారీ చేసే వీరులు, అందమైన యువరాణులు – అప్పటివరకు చదివిన చందమామ కథలకంటే బాగుండేవి. ఆ రష్యన్ కథలను అరవలో చదివి తెలుగులో చెప్పేవాడిని :-) నా చిన్నతనాన్ని గుర్తుచేసినందుకు థేంక్స్.

  14. Malli
    September 3, 2017 at 3:53 pm

    Chala bagundi nenu choosina Babluena .late Aina Chala essay ga pravaham la chebutunnadi Chala anamdam ga undi. Bablu ni and chinnarini Chala Baga ranistunnaru . Happy parents.

  15. bhasker koorapati
    September 4, 2017 at 9:20 pm

    భలేగా రాసావు , బబ్లూ..
    గుడ్. కీప్ ఇట్ అప్!
    పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఇదేనేమో..
    ఎంతైనా కళలు, సాహిత్యం పరిమళిస్తున్న ఇల్లు కదా మీది!
    నీకు,చెల్లికి, అమ్మ నాన్నలకు హృదయపూర్వక అభినందనలు!!
    -భాస్కర్ కూరపాటి.

  16. S. Narayanaswamy
    September 5, 2017 at 4:19 am

    అందరు పెద్దోళ్ళల్లాగ బుడుగుతో పోల్చి నిన్ను అవమానించను. నీకు నువ్వే సాటి. ఇప్పుడు నీకో సీక్రెట్. నేను పెద్దోడిలాగా కనిపించే బుడ్డోణ్ని. అందుకనే న కథల పుస్తకం నిండాబోలెడు బొమ్మలేయించా. కాకపోతే పెద్దోడిలాగా కనిపిస్తా కాబట్టి ఈ సారి మనం కలిసినప్పుడు నీకు పుట్టగొడుగుల మసాలా కూర చేసి పెడతా.
    అన్నట్టు నీకు పేర్ల లిస్టులంటే అంత పిచ్చ ఎందుకో నాకు తెల్సు. మీ మమ్మి డేడి నీకు రెండేళ్లు వచ్చే దాక పేరు పెట్టలేదు. పీనాసోళ్లు.

  17. Babloo
    September 5, 2017 at 10:56 pm

    రామయ్య అంకుల్,

    థాంక్స్. రివ్యూ నచ్చినందుకు.

    బుడుగు కార్టూన్ల బుక్ చిన్నప్పుడు చదివాను. ఆకుపచ్చ రంగులో చిన్న సైజులో ఉందది. ఇప్పుడంత గుర్తులేదు. కానీ వాడి చిలిపితనం నచ్చింది.

    ఇంకా, మా నాన్న కాదు మీరు చెప్పిన పుస్తకం రాసింది. అది మంచిపుస్తకం సురేష్ అనే ఇంకో అంకుల్ చేశారట.

    - బబ్లూ

  18. కె.కె. రామయ్య
    September 6, 2017 at 10:37 am

    జొన్న రొట్టెలు, రాగి ముద్దలు యిష్టవని చెప్పిన బబ్లూ!
    నువ్వంటే తిర్పతి లోని నామిని సుబ్రహ్మణ్యం అంకుల్ కి కూడా ఇష్టం అవుతుంది.
    నండూరి రామ్మోహనరావు గారు అద్భుతంగా అనుసృజించిన మార్కెట్వైన్ నవల “టాం సాయర్” చదివే ఉంటావు కదా.

  19. Paardhasaaradhi M
    September 7, 2017 at 12:01 pm

    Babloo is more like Holden Caulfield of Catcher in the Rye.

  20. September 12, 2017 at 5:17 pm

    బబ్లూ, నీతో జాగ్రత్తగా ఉండాలని నాకెప్పణ్ణుంచో తెలుసుగానీ, నాది పెద్దోడి బుద్దికదా ఊర్కుండి చావదు. నీ చిన్నప్పట్నించీ మీ నాన్న చుట్టూ చేరి మేధస్సు ప్రదర్శించిన అమాయకపు పెద్దోళ్ళలో నేనొకణ్ణి. అమాయకంగా కనపడే నీ తికమక ప్రశ్నల్ని ఇన్నేళ్ళగా చూస్తున్న వాణ్ణి. కాస్త ఇప్పటికి నీ బుర్రలోకి దూరి చూట్టానికి ఓ తాళంచెవి దొరికీంది.
    చిన్నప్పుడు భావనకి జానపద కథలు చదివించాలని పంచతంత్రం పుస్తకాలు కొన్నా. తెలిసిన కథలే అయినా వాటిని చెప్పడానికి భయమేసింది. తొండి, మోసం, కొట్లాటలూ, చంపుకోడాలూ పిల్లలకి ఎలా చెప్పడం అని భయమేసింది. పిల్లల తెలివితేటల మీద అప్పటికి నాకేమీ తెలీదన్నమాట. ఆతర్వాత ఓ పెద్దాయన వివరించి చెప్పిందాకా నీలాంటి బబ్లూల ఆలోచనల్ని తక్కువగా అనుకోకూడదని అర్థమయింది.
    నీ ఫ్రెండ్ భావన నాకు మొదటి గురువు, పిల్లల గురించి తెలుసుకోవడానికి. నువ్వూ, మీ చెల్లీ పుస్తకాల్ చుట్టూ, లేదా వాటిని పట్టుకుని తిరుగుతున్నప్పుడు నా కప్పుడే తెలుసు, మీరు చాలాదూరం వెళ్ళగలరని. బలే సంతోషంగా ఉందిలే ఇది చదువు తుంటే…

    ఈ సారి కలిసినప్పుడు 3 scoop sundae పార్టీ చేసుకుందాం!

  21. జి. శివనాగేశ్వరరావు
    September 24, 2017 at 12:46 pm

    బబ్లూ నాకు పుట్టినప్పటినుంచీ తెలుసు. ఇందులో ప్రతి వాక్యంలో వాడి జ్ఞాపకాలూ ధైర్యం ఉన్నా ఇది పూర్తిగా బబ్లూ రాయగలిగేదీ కాదు.

    సురేష్ కొన్ని దశాబ్దాలుగా తెలుసు. సన్నిహిత మిత్రుడు కూడా. అతను UNKNOWN లాంటి ఎన్ని సార్లు చదివినా ఎవరికీ అర్ధం కాని కథల్ని సులభంగా రాసి , నా ఇష్టం పొండి అనగలడు. నాతో అన్నాడు కూడా.

    ఇది అతని శైలి కూడా కాదు. పైగా ఈ మధ్య అతను స్పానిష్ లో మాత్రమే రాస్తున్నట్టు నాకు సమాచారం.

    కానీ వీళ్ళిద్దరూ కలిసి రాసింది మాత్రం నా వరకు నాకు కె. ఎన్.వై పతంజలి ని గుర్తు తెచ్చింది.

    సాహిత్యంలో ఇలాంటి ప్రక్రియ కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.

    కొనసాగించమని బబ్లూకీ సురేష్ కీ చెప్పాను. కానీ, ఇద్దరూ వినే రకాలు కాదు .

Leave a Reply to Babloo Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)