తెరమీద రాజేంద్ర ప్రసాద్ “ఏమిటీ వెధవ గోల” అనగానే సంగీత దర్శకుడి పేరు పడుతుంది. చివరికి “ఎవరిదీ చెత్త డైరెక్షన్ ‘ అనగానే ‘జంధ్యాల ‘ అన్న టైటిల్‌తో సినిమా మొదలవుతుంది. అలా తన మీద తనే జోక్ వెసుకోగలిగిన ధైర్యం కొద్దిమందికే ఉంటుంది.
“నా కథ చెత్తగా ఉంటే అదే పేరుమీద ప్రచురించి అదెందుకు బాగోలేదో , ఇంకా ఎలా బాగా రాయవచ్చో పాఠకులని అడగాలని నాకోరిక” అని ఓ రచయిత తన కథను పంపారు. రచయిత పేరు మార్చి వాకిలి పాఠకుల కోసం ఈ కథను ప్రచురిస్తున్నాం.
ఈ కథలో ఏఏ అంశాలు బాగున్నాయో, బాగోలెదో, అలాగే దాన్ని ఎలా మార్చి రాస్తే మంచి కథవుతుందో మీరు మీ అభిప్రాయాలనూ, సలహాలనూ కామెంట్‌ల రూపంలో పోస్ట్ చెయ్యవచ్చు. అవి రచయితను వ్యక్తిగతంగా కించపరచకండా ఉండాలన్నది గమనించండి.
అలాగే తమ కథలతో పాఠకుల పరీక్ష నెగ్గాలనుకొనే ధైర్యవంతులయిన రచయితలకు కూడా ఇదే మా అహ్వానం…
చెత్త కథ -పి.యస్. రాజు
తలుపు తట్టబోయి ఆగాను . .వెనక్కి వెళ్ళాలో లేక తలుపు తట్టాలో లేక తలుపు తట్టకుండా ఆగి అక్కడే ఉండాలో తెగని సంశయం, తెలియని సంకోచం.
***
ఆ క్షణం వెంకట్ కి తానేం విన్నదీ అర్ధం కాలేదు . నిజంగానే తను ఆ మాట విన్నాడా ? తన భార్య అలా అందా? అసలు అలా అనగలదా ? ఏమో ! అయోమయంలో పడ్డాడు . హఠాత్తుగా కుంచించుకుపోయిన అనుభూతి . ఒక్కసారిగా రక్తం మొత్తం ధమనుల్లోకి ఉధృతంగా ప్రవహించి హృదయం ఖాళీ అయిన భావన.
ఆమె అన్న మాట మెదడు గోడను బలంగా తాకి వెనక్కి వెళ్ళిపోయిన బంతిలా అనిపించింది. అసలు ఆ మాటేంటి ? …………
ఓ పది క్షణాలపాటు మెదడులోని కణాల మధ్య ఏకత లోపించి భార్యవైపు వెర్రిగా చూశాడు.
మాటలు కూడబలుక్కుంటున్నట్లుగా నెమ్మదైన స్వరంతో అడిగాడు ” ఇప్పుడు నువ్వేదో అన్నట్లున్నావ్ ? ”
” మీరు విన్నదే నేనన్నది ”
” ఆ – గుర్తొచ్చింది . మరీ నువ్వంత దారుణంగా మాట్లాడుతావనుకోలేదు ”
“అంత దారుణం ఏమిటో?”
“దారుణం కాకపోవచ్చు.నువ్వనాల్సిన మాట మాత్రం కాదది”
” సరే మన పెళ్ళైన మొదట్లో మీరేం చెప్పారు ? ”
” ఏం చెప్పాను ? ”
” నన్ను ఉద్యోగం మానెయ్యమన్నారా లేదా ? ”
” అన్నాను.” దానికీ, ప్రస్తుతానికీ వున్న సంబంధమేమిటో అంతుబట్టని అయోమయంతో అన్నాడు.
” నామీద నమ్మకం లేకే కదా ! ”
” నాకు అర్ధం కాలేదు , అంటే?.. ”
” అంటే .. నలుగురిలోకి వెళ్ళి పనిచేస్తూ నేను లిమిట్స్ దాటుతాననే అనుమానంతోనే కదా ఆరోజు ఆ నిర్ణయం తీసుకుంది . ”
” ఛ ఛ కానేకాదు అప్పుడు నువ్వు చేస్తున్నది ప్రైవేటు వుద్యోగం . జీతం తక్కువ చాకిరీ ఎక్కువ . అప్పటికి మనకి పాప కూడా పుట్టలేదు. నాన్నకూడా అంతో ఇంతో సంపాదిస్తూనే వున్నాడు. ఖర్చులు పెద్దగా లేవు. నీకు విశ్రాంతిగా వుంటుందనే మానెయ్యమన్నాను. ఇంతకాలం ఈ విషయాన్ని నువ్వు ఆ కోణంతో చూశావా ?అయినా ఆ రోజే దాని గురించి అడిగుండొచ్చుగా ”
” ఏమని అడగమంటారు ? మీకు నామీద అనుమానమా అనా ? పెళ్ళైన కొత్తలో ఎలా అడగ్గలను .”
” కనీసం ఎందుకు అని అడగొచ్చుగా ? ”
” భార్యలు ప్రశ్నిస్తే భర్తలు ఎంత సహనాన్ని ప్రదర్శిస్తారో మాకు తెలియదా ! ”
” నామీద నీకలాంటి అభిప్రాయముందని ఇప్పటివరకూ నాకు తెలియదు మోహితా.. నిజం . ”
” స్త్రీలపట్ల మీకున్న చులకనభావం అర్ధమవుతోంది. ”
” చులకన భావమా ? ” విభ్రాంతిగా చూస్తుండి పోయాడు.
” కాదామరి . సంతానం మీద భార్యాభర్తలిద్దరికీ హక్కుంది . ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి ? నామీద అధికారం చెలాయిస్తున్నారు. తల్లిగా నాకున్న హక్కుల్ని కాలరాస్తున్నారు . స్వరూప పుట్టాక ఉద్యోగం చెయ్యమన్నారు. సరేనన్నాను. ఎందుకంటే పెరిగే ఖర్చులు , చీటికీ మాటికీ పిల్లకి అనారోగ్యం. మీనాన్న ఆరోగ్యం సరిగా లేకపోవడం వగైరా కారణాల వల్ల . ”
” ఉద్యోగం చెయ్యమనడంలో తప్పేంటో? ”
” మీ స్నేహితుడు పెట్టిన స్కూలులో చేరమని నన్ను ప్రోత్సహించలేదూ ! అది మీకు నామీదున్న అపనమ్మకం కాదంటారా ? మీ మితృడి దగ్గరైతే నా శీలానికి రక్షణుంటుందని .”
” ఇహ చాల్లే ఆపు . విషయాన్ని వక్రంగా అర్ధం చేసుకోవడం మీకు మాత్రమే చెల్లిన విద్య . నాలుగేళ్ళ తర్వాత ఉద్యోగానికెళ్తున్నావ్ కనుక నీ టీచింగ్ ఎబిలిటీ ఎలావుంటుందో , ఆ విషయం బయటివాళ్ళు గమనించి సానుకూలంగా స్పందించకపోతే అది ఎక్కడ నిన్ను గాయపరుస్తుందోనన్న ఆలోచన తప్ప మరేమీ లేదు . ఇంకెప్పుడూ నిన్ను నువ్వు కించపరుచుకోకు . ”
” సరె సరే , నాకూ అహం, అబిమానాలుంటాయనీ , కనీసం ముఖ్యమైన విషయాల్లోనైనా నన్ను సంప్రదించాలని మీరెందుకనుకోరు ? ”
” ఇది అంత తీవ్రంగా చర్చించాల్సిన విషయమా ! ”
“ఓహొ ! రూపాయి విలువ పతనం , అమరావతిలో రాజధాని నిర్మాణం , .., ఇవేనా మీ దృష్టిలో తీవ్రంగా చర్చించదగ్గ విషయాలు ? ”
” అదికాదు మోహితా నా ఉద్దేశ్యం ఏమిటంటే కొన్ని విషయాలు పరిణతి చెందిన వారికి నేరుగా తెలియక పోయినా గ్రాహ్యమవుతాయని . ”
” కావచ్చేమో కానీ , పితృస్వామిక భావజాలంతో ఊరేగుతున్న సమాజంలో స్త్రీలు ఎంత ఇన్ ఫీరియారిటీతో , ఎంత ఇన్ సెక్యూరిటీతో బతుకెళ్ళదీస్తారో మీకు తెలుసా ? ”
” కొద్ది కొద్దిగా నాకు అర్ధమవుతూనే వుందిలే . ” అని పెద్దగా నిట్టూర్పు విడిచి ” ఇప్పుడు కాస్త దగ్గరగా వచ్చావ్ . నా బాధా అదే . మరి నేను చెప్పిన విషయమేమంటావ్ ? ” అడిగాడు వెంకట్ .
” మళ్ళీ మొదటికే వచ్చారా ? ఇదేదో బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం లాగుంది .”
” మోహి… మన దరిద్రాన్ని చూస్తూనే వున్నావుగా . చూస్తూ చూస్తూ ఇందులోకి మరోప్రాణిని లాగడం ఎంతవరకూ సబబు ? ”
” ఈ భయం , వితరణ ముందుండాలి ”
” అంటే నేను చెప్పిన విషయాన్ని అంగీకరించనంటావ్ ? ”
” అవును ! లక్ష సార్లు మీరు ఆ విషయాన్ని లాగినా లక్షన్నొక్కసారి నేను కాదనే అంటాను . ”
” ఎందుకింత మొండిపట్టు ? ”
” ఎందుకంటే ఒక ప్రాణిని చంపడం పాపంకనుక . ”
” ఎంత జాలో నీకు ”
” మనిషన్నాక అది ఎంతో కొంత వుండాలి ”
” ఫిలాసఫి చెప్పకు ? ”
” మీరేమైనా అనుకోండి . నేను చెప్పాల్సింది చెప్పాను . ”
” నాకంటే కాస్త ఎక్కువ చదివావని పొగరే నీకు ? ”
” అదే నిజమయితే నా సంభోధన ఎప్పుడో మారేది . ”
” అవును ! మీరు బానిస మనస్తత్వం చేత బందీలు . ”
” ఆ విషయానికొస్తే సమాజతత్వంలోనే ఆ లిమిటేషన్ ఉంది. ప్రతివ్యక్తీ మరోవ్యక్తికి ఏదో ఒక రూపంలో బానిసే . ”
” మరి నేనెవరికి బానిసనంటావ్ ? ”
” మీ యజమానికి . ఆయన మిమ్మల్ని నువ్వు అని సంభోదిస్తాడు గానీ మీరెప్పటికీ అతనితో నువ్వు అని మాట్లాడలేరు. అతని దగ్గర ఉద్యోగం మానేసిన తర్వాతైనా సరే ! ”
“ఎందుకు అన్నీ ఇలా మాట్లాడుతుంటావ్?”
“నేనేమన్నాను మీ మగబుధ్ధి ఇంతే అంటున్నాను”
” సరే గానీ ! రాజారావ్ మీద నీకు మనసైనట్లుంది కదూ ! దీనికేమంటావ్ ? ”
” నేనేమంటాను ! మగబుద్ధికీ , కుక్కతోకకీ వంకర తీయలేమంటాను . ”
” ఇలాగయితే మనిద్దరికీ పొసగదు మోహితా ! ”
” మరీ మంచిది . బానిసత్వం నుంచి విముక్తి కలిగిందనుకుంటాను . ”
” ఇంత తెలివైన దానివి ఈ ఒక్క విషయంలో ఎందుకింత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావో నాకర్ధం కావడం లేదు.” ” చూడండి ! ఇంతకుముందే చెప్పాను . X Y క్రోమోజోములూ , వాటి పనితీరూ తెలియని మీకు నేను తెలివి తక్కువ దానిగానే కనిపిస్తాను . కనేది స్త్రీ కనుక తప్పంతా ఆమెకే అంటగట్టడం ఆనవాయితీ అయింది.”
” సరే నీకున్నపాటి జ్ఞానం నాకులేదుకనుక అప్పుడేదో అన్నాను . ఇప్పుడు విషయం కొంచెం ముందుకి జరిగింది కదా ! కాస్త ఆలోచించు. అందరూ ఇదేపని చేస్తున్నఫ్ఫుడు మనం మాత్రమే మడిగట్టుకోవడం మూలంగా వొరిగే ప్రయోజనమేంటి ? ”
” కాదు,కుదరదు.పాపం అని కూడా అంటున్నాను.చూడండీ ! ఏ జీవి అయినా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి తమ సంతతిని వృద్ధి చేయవు. అది అంతే . ”
” అది పాక్షిక సత్యమే . మనిషి తాను చిరంజీవిగా వుండాలనే కాంక్షే అందుకు పురికొల్పుతుందని అంటారు మనోశాస్త్రవేత్తలు.”
. ” సరే ఏదోమేరకు సత్యమే కదా. చూడండి ! ఈ ఆమ్నియోసెంటసిస్ పరీక్షే లేకపోతే , పుట్టాక మనబిడ్డని తుప్పల్లోకి విసిరేవాళ్ళా మీరు ? ” కళ్ళల్లో నీరు తిరుగుతుండగా అడిగింది మోహిత.
” చ ఛ ! అదేం మాట మోహితా , నేనుమాత్రం మనిషిని కానా ? ఇప్పుడంటే టెక్నాలజీ వుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుందాం అంటున్నా”
” మీకు జీవితం అంటే వణుకు పుడుతుందా ? ”
” అవును మోహితా ! వీళ్ళ పెంపకం , చదువులు , పెళ్ళిళ్ళు , ప్రసవాలూ … ”
” మీకు స్వరూపతో సరిపెట్టుకుందామని ముందే చెప్పాను వినలేదు. ”
” ఇక నీ మనసు మార్చుకోవా? ”
మార్చుకోనన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మోహిత.
అతను నిస్సత్తువుగా కుర్చీలో కూలబడ్డాడు. మోకాళ్ళమీద మోచేతులుంచి, తలవంచి రెండు చేతుల వేళ్ళమధ్యా జుట్టు గుప్పిటపట్టి లాక్కున్నాడు క్రిందికి . ఎంతబలంగా లాగుతున్నా నొప్పి తెలియడం లేదు .
భర్తను ఆ స్థితిలో చూసిన మోహిత హృదయం నీరయింది. వెంటనే అతని తలమీద చెయ్యివేసి అంది ” చూడండి ! మీరనుకున్నదొకటి .అయిందింకొకటి . అబ్బాయి పుడతాడనుకున్నారు , కానీ మళ్ళీ అమ్మాయేనని టెస్టింగ్ లో తేలిన నిజం మీ ఆశలమీద నీళ్ళు పోసింది . ”
” పున్నామనరకం నుండీ రక్షిస్తాడని కాదు మోహితా నేను కొడుకే కావాలనుకుంది. ”
” కట్నాలిచ్చి పెళ్ళి చేయలేమనే మీ ఆలోచన నుండి ఈ నిర్ణయం పుట్టిందని తెలుసు .”
” అంతే కాదు … ”
” నన్నుకాస్త చెప్పనిస్తారా . మన ముసలితనంలో గానీ, కాలం చేసిన తర్వాత గానీ స్వరూపకి తోడుగా కనీసం ఒక్క రక్త సంభంధీకుడైనా వుంటే బాగుంటుందన్న ఆలోచన మిమ్మల్ని మరో సంతానం కోసం పురి కొల్పింది. అంతేకదా ! ”
” మనసుని చదివే యంత్రమేదైనా వుందా నీ దగ్గర ? ” విభ్రాంతిగా అడిగాడు వెంకట్ .
విశాలంగా నవ్వింది మోహిత.
” మీరే అన్నారుగా కొన్ని విషయాలు డైరక్టుగా తెలియకపోయినా పరిణతిచెందిన వారికి ఈజీగా అర్ధమవుతాయని . జీవితం గురించి దిగులు పడకండి . అటూ ఇటూ కాని చదువు బాగా బ్రతకడానికి సరిపోదనే విషయం అర్ధమయింది . నేను పార్ట్ టైంగా పి.జి. చేస్తాను. తర్వాత లెక్చరర్ అయితే హైస్కూల్ సెక్షన్ కన్నా జీతం ఎక్కువ . ఆ జీతం మొత్తం పొదుపు చేద్దాం ! అప్పటికీ చాలలేదా మరోటేదైనా చూసుకుందాం .”
***
పదుల సంఖ్యలో కథలు రాసిన నేను కొన్నేళ్ళుగా బద్దకించి ఏ ఒక్క కథా రాయలేకపోయినా, రాయాలన్న ఆశ మాత్రం చావలేదు. ఆ ఆశకు ఊపిరి పోసింది మాత్రం నేను సంశయిస్తూ ఆగిపోయాక విన్న పై సంభాషణంతా…
నేను తలుపు తట్టాలనుకున్నది నా మిత్రుడు వెంకట్ ఇల్లు . అతనితో బీరకాయపీచు బంధుత్వమూ లేకపోలేదు . వాడి భార్య వెంకట్ తో అన్నమాటకి వాడి స్పందనెలా వుంటుందనేది నేను ఊహించగలను . సరిగ్గా అప్పుడే నాలో ఉన్న నేను మాయమైపోయి నాలోకి రచయిత ప్రవేశించాడు . వాడికి కావలసింది కధాంశం . పాత్రల్ని సృష్ఠించడం, చంపడం వాడికి మనోరంజకమైన విషయం . తప్పని తెలిసినా అయినా కొద్దిగా తెరచిన కిటికీలోంచి నేను విన్న ఆ భార్యా భర్తల సంభాషణ లో – వెంకట్ హృదయం క్షోభించిన, నన్ను ఉలికిపాటుకి గురిచేసిన – వెంకట్ తో మోహిత అన్న ఆ వాక్యం ఏమిటో తెలుసా?
” పక్కింటి రాజారావుతో వెళితే మీకేం అభ్యంతరం లేదుగా ? ”
ఆ రాజారావ్ కి ముగ్గురు మగ పిల్లలు . నాలుగోసారీ మగపిల్లాడు పుడతాడనే గ్యారంటీ లేదుగానీ తన అత్తమామలూ, భర్తా తననే నేరస్తురాల్లా చూస్తుండటంతో విసిగిపోయిన మోహిత అన్నమాటలవి . కానీ వెంకట్ కీ, బయటున్న నాకూ తెలుసు, మోహిత మేలిముత్యమని .
అంతే కాదు ఆర్ధిక ప్రణాళిక ఉన్న అర్ధాంగి తోడుంటే ఏదైనా సాధించవచ్చుననే ఆత్మవిశ్వాసం తాలూకూ మెరుపు వెంకట్ కళ్ళల్లో స్పష్టంగా చూసాను.
**** (*) ****
కధ బాగుంది.మరేం మార్చనవసరంలేదు.
వస్తువు సర్వకాలీనం, కానీ భాష పాతికేళ్ళ పాతది.
కథనంలో కొత్తదనం ఉంది…వాక్యాల్లో కాస్త గతం కనిపిస్తోంది. కానీ స్టేజ్ మీద ఒక నాటకాన్ని చూసిన ఫీల్ కలిగింది. ఫీల్ గుడ్ మూవీలాగా ఫీల్ గుడ్ కథ/కథానిక….!!!!