జిందగీ

దునియా…

మార్చి 2013

“ఆలోచించేది ఏమీ లేదు  అబ్బాజాన్, మమ్మల్ని ఆ “దోజఖ్” నుండి  బైట పడెయ్యండి”. ఖచ్చితంగా చెప్పింది తండ్రితో  కూతురు రజియా సుల్తానా.

“మరొక్కసారి  ఆలోచించు  బేటీ..రహీమ్ నీకు ససుర్ మాత్రమే కాదు, నాకు స్నేహితుడు కూడా ” నెమ్మదిగా సరిదిద్దే  ధోరణిలో  చెప్పాడు. రజియా తండ్రి  సలీం బాషా.

కూతురూ, అల్లుడూ వేరు కాపురానికి అన్నీ సిద్దం చేసుకొని తనను కేవలం  మాటవరసకు అడుగుతున్నారని గ్రహించ గలిగాడు, కానీ పెద్దమనిషిగా తన స్నేహితుని  మనసు ఎరిగిన వాడిగా అది తన భాద్యత అనుకున్నాడు సలీం బాషా.

“లతీఫ్ బేటా  నువ్వన్నా ఆలోచించు  అబ్బా, అమ్మీ ఎంత బాధపడతారో ” అల్లుడివైపు  తిరిగి  అన్నాడు సలీం బాషా.(అటునుండి నరుక్కొచ్చే  పద్దతిలో)

“వద్దు అబ్బాజాన్ ఆ ఇంట్లో వాళ్లకు  మేము బాగుపడటం  ఇష్టం లేదు ముఖ్యంగా మీ దోస్త్ కు, ” లాస్ట్   పదం వొత్తి  పలికింది   రజియా.

“రజియా మాటలు జారకు, నీకు పెళ్లి చేయలేని  స్థితిలో  ఉంటె తానే ముందుకొచ్చి  నీ బిడ్డ నా బిడ్డ కాదా, మా లతీఫ్ కు చేసుకొంటాను , అని  ఒక్క పైసా  ఆశించకుండా నిన్ను తన కోడలిని చేసుకున్న్నాడు, తల్లి లేని నిన్ను తల్లి కంటే ఎక్కువగా  చూసుకుంటున్నారు , వాళ్ళనా  నువ్వు తూలనాడేది.. ”  కోపంతో గట్ట్టిగా  అరిచాడు సలీంబాషా.

” బంధువులతో తెగతెంపులు చేసుకున్న వాడికి జన్నత్ లో ప్రవేశం లేదు” అని ప్రవచించారు మహుమ్మాద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నరకం వైపు వెళ్ళే దారిలో వేళ్ళకు నాయనా, చివరి ప్రయత్నంగా అన్నాడు సలీం.

“పదండి మామూజాన్, నమాజ్ టైం  అవుతుంది నడవండి” , అంటూ బయలదేరదీసాడు లతీఫ్.

***

“అల్తాఫ్ రాలేదా” , రాత్రి  పదకొండు  అవుతుండగా  అన్నం ముందు కూర్చుంటూ   అడిగారు అల్తాఫ్ తండ్రి జహంగీర్.

“రాలేదు,” భార్య జవాబు.

“నవాబుకి పెత్తనాలు ఎక్కువయ్యాయి.”పెళ్లి  చేస్తే బాగుపడతాడని అనుకొన్నాం, ఆ పిల్ల గొంతు కోసామో ఏమో..చిరాగ్గా  ఉంది ఆయన గొంతు.

” కనీసం  రజియా ఇంట్లో  ఉన్నా తొందరగా  తగలడే వాడేమో..” కోపం పెరుగుతుంది ఆయన గొంతులో.

“మీతో ఒకవిషయం చెప్పాలి.” నసిగింది భార్య  సలీమా.

“ఏంటది,” సందేహంగా  అడిగాడు  భర్త.

“అల్తాఫ్  గురించి..” మాట పెగలటం లేదు. తనకు తెలుసు భర్త  యెంత ఖచ్చితంగా ఉంటాడో.. తప్పు చేస్తే ఎవరినీ క్షమించడు.

“అమ్మీ ..” వారించాడు పెద్ద కొడుకు  లతీఫ్ .

” ఏమైంది, ఈ సారి ఏం చేసాడు, సెల్లు ఫోన్లు దొంగతనం, ఇంకేదో  రౌడీఇజం .. చేసి ఉంటాడు ఈ సారి కూడా..”

గట్టిగా అరుస్తూ దస్తర్ ఖాన్ ముందు నుంచి లేచిపోయాడు జహంగీర్ భాషా.

“అవన్నీ వాడు చేయలేదు, ఎవరో దోస్తులు  చేస్తే వీడి మీద పడి  ఏడిచారు పోలీసులు…” అయినా ఇంట్లో వాళ్ళే  అర్ధం చేసుకోక పొతే  వాడి బతుకేమి కాను .. అల్లా.. నా కడుపునా ఎందుకు  పడేశావయ్య్యా ..” శోకాలు  మొదలెట్టింది  సలీమా.

“నోర్ముయ్.. నువ్వెంత మొత్తుకున్నా.. ఈ సారి వాడిని కొంపలోకి  రానిచ్చేది లేదు.” జహంగీర్  కోపం తారాస్థాయిని   అందుకొంది. దగ్గు తెర  మాటలను  మింగేసింది.

“అబ్బాజాన్  పానీ.” పెద్ద కోడలు ఆసియా  నీళ్ళు ఇచ్చింది.

” బేటీ, నువ్వాన్నా చెప్పు , అస్సలు ఏమిజరిగిందో ” కోడల్ని అడిగాడు, ఆమె కూడా  ఓ మిత్రుని కూతురే, చనిపోయిన మిత్రుని  కుటుంబాన్ని  ఆదుకోవాలని  పెద్దకొడుకు  చదువు కున్నవాడైనా  చదువులేని  ఈ పిల్లని  కట్టబెట్టాడు. కానీ తను  కోడలన్న  సంగతి  ఎప్పుడో మరచిపోయారు  ఆ దంపతులు, కూతురుకంటే  ఎక్కువే అనుకున్నారు,  అదీ ఆమె నడవడిక.

“అబ్బాజాన్ , ఈ సారి అల్తాఫ్ జాలీనోట్ల  కేసులో  ఇరుక్కున్నాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. మీరు  వెళ్లి అడిగి చూడండి..” మెల్లగా చెప్పింది  ఆసియా.

“ఎన్ని సార్లు  ఇలా…ఛీ.. ఉండనివ్వండి  జైల్లో అయినా ఉంటె బుద్ధి  వస్తుంది.” అసహనంగా  అన్నారు  జహంగీ భాషా.

***

ఈ మద్య  కాలంలో  అల్తాఫ్ లో చాలా మార్పు వచ్చింది జులాయిగా తిరగటం లేదు. ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. పల్లెల నుండి ధాన్యం  కొనుగోలు చేయటం సిటీ లో అమ్మటం  లో చాలా ప్రావీణ్యం   సంపాదించాడు. అప్పుడప్పుడూ సిటీ దాటి  వెళ్ళటం  వారం పది   రోజులకు తిరిగి  రావటం చేస్తున్నాడు,

తను చేస్తున్న వ్యాపారంలో  మంచి రాబడి ఉందనీ , అన్నని కూడా ఆ దిక్కుమాలిన నౌకరీ  వదిలేయమనీ  పోరుపెట్టాడు. తండ్రి  సుగుణాలు  పుణికి పుచ్చుకున్న పెద్ద కొడుకు ససేమిరా  అనేశాడు.

ఇంట్లో  చాలా   వస్తువులు  వచ్చి చేరాయి.  టెలివిజన్, ఫ్రిజ్, ఇంకా రజియా వంటి మీదికి  బంగారూ వగైరా వగైరా.. ఇవన్నీ  ఎక్కడివని తండ్రి అడిగిన ప్రతిసారీ  వ్యాపారంలో  చిన్నకొడుకు  ఎంతగా రాణిస్తున్నాడో.. మురిసిపోతూ చెప్పేది  తల్లి.

ఈ  నేపద్యంలో  రజియా  హోదా పెరగటం  పెద్దకోడలు కేవలం వంటింటికే  పరిమితం కావటం, పెద్దకొడుకు  సంపాదించలేని వెర్రి  వాడిగా  ముద్రపడటం లాంటి విషయాలు   జహంగీర్ బాషాని దాటిపోలేదు.

తన భర్త సంపాదన  ఉమ్మడిగా  ఖర్చు  కావటం భరించలేని రజియా  మెల్లగా  వేరింటి  ఆలోచనా పధకం  అమలుపరచటానికి  ఆయత్తమైంది.

***

పుట్టింటి నుండి వచ్చిన  రజియా  తన తట్టా,బుట్టా సర్దుకోవటం  చూసిన పెద్ద కోడలు మెల్లిగా  వచ్చి పక్కన నిల్చుంది.

“రజియా, నేను విన్నది నిజమేనా..?” సందేహంగా అడిగింది.

“ఏం విన్నావో చెప్తేగా నిజమో కాదో తెలిసేది?”   తల ఎత్తకుండానే  వ్యంగంగా  పలికింది రజియా.

” అల్తాఫ్  వేరే ఇల్లు చూశాడట కదా..”

“అవును”.

“ఎందుకు ఇక్కడ అందరమూ  బాగానే ఉన్నాం కదా..”

“ఎందుకుండమూ .. ఒక్కడు సంపాదిస్తుంటే ..అందరమూ పడి  తింటుంటే.” కటినంగా అన్నది రజియా..

“అలా కాదు  ఇద్దరూ యెంత ఇబ్బంది  పడతారో ..” ఆర్దోక్తి లో ఆపేసింది  తోటికోడలి  ముఖం చూసి ఆసియా .

“అయ్యో ఎంత ప్రేమో..అయినా మాకు ఇబ్బంది  ఎందుకూ, ఉంటె మీకు ఉండాలి గానీ.. ఇప్పటివరకూ మా ఆయన కొన్న  అన్ని  వస్తువులకూ అలవాటు పడ్డారు కదా  ఇకముందు ఉండబోవని.” చీదరగా ఓ చూపు విసిరి అక్కడి నుండి  వెళ్ళింది రజియా…

ఇంట్లో ఎవరికీ  చెప్పకుండానే  సామాను మొత్తం తీసుకొని వేరు కాపురం వెళ్ళారు  రజియా అల్తాఫ్ లు.

***

అప్పుడప్పుడూ  అల్తాఫ్ వచ్చి తల్లిని పలకరించి వెళ్ళేవాడు.  సొంత ఇల్లు కొన్నాననీ గృహప్రవేశమనీ  పిలిచి వెళ్ళాడు. తల్లీ వదినా  వెళ్ళారు, వారిని నిర్లక్ష్యం  చేసి  అవమాన పరచి  పంపింది రజియా.. తన దైన  ధోరణిలొ.

అలా మూడేళ్ళు  గడచి పోయింది. అల్తాఫ్ గురించి అతని సంపాదన గురించి  రకరకాలుగా వింటూనే ఉన్నాడు జహంగీర్.

ఓసారి  స్నేహితుడూ, వియ్యంకుడూ  అయిన  సలీం తో కూడా ఈ విషయమై  చర్చించాడు. తన నిర్ణయం చెప్పాడు.

స్నేహితుని  మానవతా, ఇమాందారీ  తెలిసిన సలీం, ఏమీ చెప్పలేక పోయాడు, కానీ  పిల్లల్ని  మన్నించి దారిలో పెట్టమని,  వీలుంటే తన దగ్గరికే  పిలిపించుకోమనీ.. ప్రాదేయపడ్డాడు సలీం.

***

జహంగీర్ బాషా ఇంట్లో  వాతావరణం  నిశ్సబ్దంగా  స్మశాన  వైరాగ్యాన్ని తలపిస్తుంది. అప్పుడప్పుడూ.. అల్తాఫ్ తల్లి

ఏడుపు, నిస్టూరాలూ  తప్ప ఎలాంటి చప్పుడూ లేదు. పెద్ద కొడుకు  తల్లిని సముదాయించే ప్రయతంలో ఉన్నాడు.

“అమ్మీ… ఏడవకు, ఏదో ఒకటి చేసి  అల్తాఫ్ ని తీసుకొస్తాను.” మెల్లగా అన్నాడు.

” ఇంకేమి తీసుకొస్తావ్ రా  బాబూ.., ఆ బద్మాష్  పోలీసులు, కొడుతున్నారో ఏమో,.. అయినా  ఆ పెద్దమనిషి  చూడు ఏమీ పట్టనట్లు ఎలా కూర్చున్నాడో..” భర్తని చూపిస్తూ  ముక్కు చీదేసింది.

“బెహన్, కొంచం ఆగు, ఇది మామూలు  కేసు కాదు, విదేశీయులకు, తీవ్రవాదులకూ  సహకరించాడని  నమ్ముతున్నారు పోలీసులు,” సలీం మెల్లగా చెప్పాడు.

” వాళ్ళు ఎలా అనుకున్నారో తెలీదు గానీ ఈ బడా ఆద్మీ కూడా అదే  నమ్ముతారు..” కోపంగా అసహనంగా  పెద్దగా భర్తని ఉద్దేశించి అరిచింది బార్య సలీమా.

” ఇందులో సందేహం ఎందుకూ, నిజమే కదా, నేను చెప్తూనే ఉన్నాను, వ్యాపారమూ  కాదూ  గాడిద  గుడ్డూ  కాదూ” , కోపంతో అరిచాడు జహంగీర్.

” అయితే ఏంటి చంపు కుంటారా  బిడ్డని..”గట్టిగా  అరిచింది  సలీమా.

“నోర్ముయ్యి, చంపుతారో, సాకుతారొ  అది పోలీసులే చూసుకుంటారు.” దేశద్రోహులు నా ఇంట్లో ఉండకూడదని  ముందే చెప్పాను.” నిక్కచ్చిగా చెప్పేసాడు జహంగీర్.

“అబ్బాజాన్  మేరె బచ్చేకు  దేఖో..” ఏడుస్తూ తన ఏడాది  బిడ్డని మామగారి ముందు  నిల బెట్టి  మోకాళ్ళ మీద కూర్చుంది రజియా..

కన్నీటి పొరని చీల్చుకొని  మనవడిని చూసి తల మీద చెయ్యి వేసాడు జహంగీర్.

నీ బిడ్డ భవిషత్తులో  తప్పు చేయకూడదనే నమ్మా  నా బిడ్డని  నేనే పోలీసులకు పట్టించింది అనుకున్నాడు మనస్సులో..

దోస్తు  కళ్ళలో నీళ్ళు చూసి, తనూ మౌనంగా  రోదించాడు సలీం, స్నేహితుని  ఉన్నతమైన దేశ  భక్తికీ, నిగ్రహానికీ  మనస్సులోనే  సలాం చేసాడు సలీం.

*** * ***