కథ

ప్రేమలో జయం?

అక్టోబర్ 2017

లసటా, దుఃఖం, ఆందోళనా నిండి ఉన్నా, సితార ముఖంలో అందం ఏ మాత్రం తరగలేదు. అసలు తనని అందంగా తప్ప వేరే రకంగా చూసే సామర్థ్యం నా కళ్లకి లేదేమో. స్టీరింగ్ వీల్ పైన ఉన్న నా చేతులు ఆమెని దగ్గరకు తీసుకొని ఊరడించటానికి ఉవ్విళ్లూరుతున్నాయి. తాను మాత్రం, బాహ్య ప్రపంచం పట్టని స్థితిలో కారు విండోకి తలానిచ్చి, నా వైపే చూస్తున్నట్లుగా, కూర్చుని ఉంది. సరిగ్గా ఆరు నెలల క్రితం ఇద్దరం అపరిచితులం. “యే కహా ఆ గయే హమ్?”

నేను ఒక సిలికాన్ వేలీ సక్సెస్ స్టోరీ. నా కంపెనీని అమెజాన్ కొనెయ్యటంతో, చిన్న వయస్సులోనే చాలా సంపాదించాను. నలభై అయిదేళ్ల ఎలిజిబుల్ సింగల్! అమెరికన్లు ముద్దుగా హేండ్సమ్ ప్లేబాయ్ అంటే, నేను తెలిసిన మనదేశం వాళ్లు నన్ను వర్ణించడానికి విరివిగా వాడే పదం, “తిరుగుబోతు”! అంటే అది వాళ్ల తప్పు కాదు, పాపం కప్పలు!

నేను సాధించిన ఆర్ధిక విజయాలు ఒక ఎత్తైతే, ప్రేమ విషయంలో నా జయాలు, అనేకం! పలుమార్లు ప్రేమలో పడ్డాను, ఒక సారి పెళ్లిలో కూడా! తెలుపూ, నలుపూ వర్ణ భేదాలూ, కుల మతాల భేదాలు లేకుండా అందరితోనూ ప్రేమలో పడ్డాను. పెళ్లిలో పడిన పిల్లతో గడిపిన నాలుగేళ్లు తప్ప, మిగిలిన రిలేషన్షిప్స్ ఏడాది మించలేదు. కొన్ని ఒక్క పగలు కూడా చూడలేదు. అయినా ప్రేమకీ, అందులో గడిపే సమయానికి లంకె పెట్టి జడ్జ్ చేసే సమాజం అంటే నాకు పిచ్చ చిరాకు. అంటే చచ్చేవరకూ ఒకళ్లతో ఉంటేనే ప్రేమా? అస్సలు ప్రేమ అంటే ఏమిటో క్లారిటీ లేకపోవటం మనోళ్లకున్న పెద్ద రోగం!

ప్రేమనేది, సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఎమోషన్ పుట్టాలంటే, మన హృదయంలో ఒక రకమైన స్పందన కలగాలి. అలా కలిగించగలిగే మనిషి తారసపడాలి. ఇంతవరకూ జరిగితే, ప్రేమ టేకాఫ్ అయినట్లే! కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ కి సరైన రిటర్న్ వచ్చినప్పుడే ఆ ప్రేమ హిట్టా, ఫట్టా అని తేలేది. నేను ప్రేమలో పడిన ప్రతి సారీ నాకు మాంచి రిటర్న్స్ వచ్చాయి! “మన్సే మన్ కా మిలన్ కోయి కమ్ తో నహీ!” లాంటి కాన్సెప్ట్ అంటే నాకు ఎలర్జీ. ప్రేమంటే, హద్దులు గీసుకోకుండా, లోతులు చూసుకోకుండా, దూకేసి మునిగిపోవటమే! అలాగే ఏ ఇన్వెస్టుమెంటుకైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది చూసుకోకుండా ముందుకు సాగితే, అనారోగ్యమే తప్ప ఇంకేమీ మిగలదు. సరైన సమయంలో రిటర్న్స్ రాని ఇన్వెస్ట్మెంట్ ని మూసేసి మరో వైపు ఇన్వెస్ట్ చెయ్యగలిగే వాడే, బిజినెస్ లో అయినా ప్రేమలో అయినా ఎప్పుడూ జయం పొందుతాడు!

మరి ప్రేమలో పడ్డాక త్యాగాలు చేసుకొనే బాపతులను చూస్తే నాకు మరీ నవ్వొస్తుంది. దేవదాసు నుంచీ ఇదే వరస. ప్రేమించటం – ప్రేయసి ఎవడినో పెళ్లి చేసుకుంటే, “బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” అంటూ సెల్ఫ్ పిటీతో కన్నీళ్లు కార్చటం. “ఐ హేట్ టియర్స్!” ఇటువంటి వాళ్లు ప్రేమించకూడదు – అసలది ప్రేమా కాదు.

ఒక పెళ్లి, అరడజను పైగా ప్రేమ విజయాల తరవాత నేను సంపాదించిన నా అనుభవం పైన నాలో కించిత్ గర్వం ఎక్కడో చేరుండచ్చు. “తిరుగుబోతు” అనని వాళ్లు నన్ను “పొగరుబోతు” అనటం నాకు తెలుసు. కప్పలు, కప్పలు!

***

ఆరు నెలల క్రితం..

ఆఫీసులో ఒక రోజు మీటింగ్ కి ఆలస్యం అవుతోంది అన్న తొందరలో ఎలివేటర్ వైపు పరిగెత్తా. అప్పటికే మూసుకుంటున్న ఆ రెండు తలుపుల మధ్యనున్న ఖాళీ లోంచి తొలిసారి చూశా తనని. పసుపుపచ్చని చుడీదార్ లో కళ్లు తిప్పుకోలేనంత అందంగా నవ్వుతూ క్షణమాత్రంలో మాయమయ్యి అలా పైకి వెళ్లిపోయింది. ఎవరీ దేవకన్య? పునర్దర్శనం ఎప్పుడో!

నాకు సమాధానం చెప్పాలనేమో ఎలివేటర్ తిన్నగా వెళ్లి ఎనిమిదో అంతస్థులో ఆగింది. అదే ఆఖరిది కూడా. నేను కూర్చొనే ఆఫీసు కూడా అక్కడే ఉన్నా ఎప్పుడూ చూడలేదే!

“యు ఆర్ రన్నింగ్ లేట్” అంటూ నా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గుర్తుచేసింది. ఎదో స్పేస్ ప్లానింగ్ మీటింగ్. ఆగస్టులో కొత్త గ్రాడ్యుయేట్స్ చాలామంది చేరతారు, వాళ్లకి క్యూబ్స్ కేటాయింపు, ఒకే గ్రూపుకి సంబంధించిన వాళ్లందరినీ ఒక చోట కూర్చునేలా చెయ్యటానికి చేసిన సర్దుబాట్లు , ఇదీ ఎజెండా. బోరింగ్! ముగించుకొని నా కార్నర్ ఆఫీసుకి చేరా. గాజుగోడ లోంచి ఎదురుగా ఉన్న క్యూబ్ బయట తగిలించి ఉన్న నేమ్ ప్లేట్ పైకి నా దృష్టి సోకింది – “సితార”. చాలా అరుదైన పేరు. తను కాదు కదా! వెళ్లి, చూసి, పరిచయం చేసుకొందామా అంటే, ఈ గాజు గోడ ఒకటీ… అడ్డం! కార్పోరేట్ ల్యాడర్ పైపైకి ఎక్కడం వల్ల నేను చెల్లించాల్సి వచ్చిన పెనాల్టీ.

పనిలో మునిగిపోయున్నప్పుడు, “ఎక్స్క్యూజ్ మీ” అన్న అంతరాయంతో, తల ఎత్తి చూద్దును కదా, అదే చిరునవ్వు. “కెన్ యు హెల్ప్ మీ ఫైండ్ ది ప్రింటర్ ఆన్ దిస్ ఫ్లోర్?” – ఏ మేకప్ లేకుండానే, ఏమిటీ కళ్ళు చెదిరిపోయే అందం! ఇంత బాగుందంటే తెలుగమ్మాయేమో? ఛీ, మరీ టీనేజర్లా, ఏంటిది?

“ష్యూర్” అంటూ డైరక్షన్స్ చెప్పబోయి, “ఇట్ ఈజ్ ఈజియర్ టు వాక్ యు దేర్” అని లేచి చెయ్యి చాచి “విజయ్” అన్నాను. “సితార… మీరు తెలుగు వారు కదా? మీ ఇంటి పేరు నేమ్ ప్లేట్ పైన చూసాను.”

ప్రింటర్ కి వెళ్లే దోవలో పరిచయాలు అయిపోయాయి. విజయవాడ అమ్మాయి. బర్కెలీ లో ఎం.ఎస్. చేసి, క్యాంపస్లో వచ్చిన జాబ్ ఇది. నా టీమ్ కాదు. మాటల్లో తెలిసింది, ఈ రోజు శ్రావణ శుక్రవారం, అందుకనే ఆ చూడీదార్ అని. వయస్సు ఇరవై మూడు ఉండొచ్చు, అంటే నా కంటే ఇరవై రెండేళ్లు చిన్నది. నా నాన్నకూ, నాకూ మధ్య కూడా వయస్సులో అంతే తేడాలాంటి చెడ్డ ఆలోచనలని బలవంతంగా పక్కకు తోసేశాను.

తరువాతి నెల రోజుల్లో తన గురించి చాలా విషయాలు రాబట్టాను, నా గురించి అట్టే తెలియకుండా జాగర్త పడ్డాను. మధ్యతరగతి కుటుంబం, చదువే పెట్టుబడని, అమ్మా, నాన్నా కష్టపడి చదివించి అమెరికా దాకా పంపించారు. ఇప్పుడే ఉద్యోగం మొదలు పెట్టటంతో, ఇంకా కారూ, ఇల్లూ లాంటి ఏర్పాట్లు జరగక పోవటం వల్ల తను పడే ఇక్కట్లు, ఇలా చాలా షేర్ చేసుకొంది. ఒకసారి మాటల సందర్భంలో తన ఏంబిషన్ ఏమిటని అడిగా. “నేను సగటు మధ్యతరగతి ఆడపిల్లని. జాబ్ చేసుకొంటూ, నాకు నచ్చినవాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవటమే. అంతకు మించి పెద్దేముంటుంది?”

“ఆర్ యు కిడ్డింగ్”? సగటు ఆడపిల్లా? నాలాంటి నడివయస్కుడికే మతి చలింపజేసే అందం, బర్కెలీలో చదువు, అమెజాన్లో ఉద్యోగం చేసేంత తెలివితేటలూ – ఇవి ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఎరగనట్లుగా ఉండే ప్రవర్తనా.. నాకెందుకో ఆ సమయంలో ఆమె చాలా సెక్సీగా అనిపించింది. నేను తన గురించి ఎలా ఆలోచిస్తున్నానో ఆమెకి తెలిసుంటుందా? మరీ తెలియనంత అమాయకురాలా?

***

ఒక రోజు సితార నా దగ్గరకు వచ్చి ఆ వీకెండ్లో జరగబోయే తెలుగు సంఘం వారి భువన విజయం నాటకానికి నన్ను ఆహ్వానించింది. కులాలు, ప్రాంతాల వారీగా చీలిపోయిన ఈ సంఘాలకి నేను దూరంగా ఉంటున్నా, తన పక్కన ఒక రెండు గంటల పాటు గడిపే అవకాశాన్ని త్రోసిపుచ్చలేక, వెళ్లాను. తెర తీయంగానే రాయల వారి ఆస్థాన ప్రవేశం. ఆ పాత్రధారి రూపం అన్నగారిని మరపించేదిలా ఉంది. ఆ ముఖవర్చస్సూ, ఆ గాత్ర గాంభీర్యం, వెరసి ఒక మహారాజే స్వయంగా వచ్చినట్లుగా ఉంది. రెండు గంటల పాటు చాలా చక్కగా సాగిందా నాటకం. పూర్తవ్వంగానే, మీకో సర్ప్రైజ్ అంటూ నా చెయ్యి పట్టుకుకొని బ్యాక్ స్టేజ్ కి తీసుకెళ్లింది సితార.

రాయలవారు ఇంకా మేకప్ తియ్యకుండా తనని కలవటానికి వచ్చిన అతిథులతో సెల్ఫీలు దిగుతున్నాడు. మమ్మల్ని చూడంగానే, మిగిలిన వారిని వదిలేసి వచ్చి, సితారకి ఒక హగ్ తో స్వాగతం పలికాడు. తనని “అజయ్” అని సితార పరిచయం చెయ్యగానే, “మీ గురించి చాలా విన్నాను” అంటూ కలుపుగోలుగా పలకరించాడు అజయ్.

“తనకి ఇంత మంచి నటుడైన ఫ్రెండ్ ఉన్నాడని నాకెప్పుడూ చెప్పలేదు సితార!”

“వెల్… ఉత్త నటుడైన ఫ్రెండ్ మాత్రమే కాదు.. అజయ్ నా బాయ్ ఫ్రెండ్!”

ఒక్క నిమిషం నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. హఠాత్తుగా కడుపులో మంట. తేరుకొని, “వావ్! వాటే లక్కీ ఫెలో!”

“ఐ నో” అంటూ సితారని దగ్గరకి హత్తుకున్నాడు.

“నైస్ మీటింగ్ యూ… మరి వస్తాను” అని నేను అక్కడి నుంచి బయలుదేరాను.

***

ఒక సారి కారు అద్దంలో మొహం చూసుకున్నాను. ఒకప్పుడు, లేతగా, అందంగా వుండేవాడినే, ఇప్పుడు మాత్రం అజయ్ ముందర ముదురుగానే ఉన్నాను. నెలకో ఫేషియల్ చేయించుకున్నా కనుల చివర దాచలేని ముడతలు, కనుల క్రింద కొంచెం బరువులు, ఎంత ఊపిరి బిగబట్టి లోపలికి లాక్కున్నా బయటకి త్రోసుకొచ్చే చిరు బొజ్జ, రంగుతో నిగనిగలాడుతున్నా పలచబడిపోతున్న జుట్టు – ఈ మధ్య జిమ్ కి వెళ్లటంలో అశ్రద్ధ చేస్తున్నాను. వెయిట్స్, కార్డియో, రోజూ చేస్తే, నెల రోజుల్లో మళ్లీ షేప్ కి వచ్చెయ్యనూ!

ఏమైనా, జీవితంలో మొదటి సారి ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను. నాలో సితార పట్ల ప్రేమ అనే ఎమోషన్ పుట్టేసింది. ఇప్పటి వరకూ ఈ విషయంలో అపజయం అన్నది ఎరుగని నాకు ఇది ఊహించని ట్విస్టు. అయినా వెనుదిరిగే ప్రసక్తే లేదు.

ఇవే ఆలోచనలతో ఇంటికి చేరాను.

***

మర్నాడు సితారని కాఫీ కోసం తీసుకెళ్లాను.

“అజయ్ చాలా అందంగా ఉన్నాడు. యూ మేక్ ఏ గ్రేట్ కపుల్! ఎన్నాళ్ల నుంచీ పరిచయం?”

“ఇండియాలో ఇంజనీరింగ్ లాస్టియర్ లో పరిచయం. నేను కంప్యూటర్స్, ఆతను సివిల్. కాలేజీలో తను పెద్ద స్టార్! స్పోర్ట్స్, నాటకాలూ, ఉద్యమాలూ, అన్నిట్లో ముందుండేవాడు. ఎంతో మంది అమ్మాయిలు తన వెంటపడేవారు. నన్ను మూడేళ్ళుగా గమనించాడట. ఫైనలియర్లో ప్రపోస్ చేసాడు.”

“అజయ్ ఎక్కడ పని చేస్తున్నాడు? పెళ్లెప్పుడనుకుంటున్నారు?”

“ఇంకా అనుకోలేదు. అందరి ప్రేమికుల లాగానే, చిన్నా, పెద్దా, బోలెడు ప్రోబ్లెంస్. అజయ్ మా కులం కాదు. అతడికి ఇంకా జాబ్ రాలేదు. స్టూడెంట్ వీసా మీద వచ్చి ఇక్కడ కిరాణా కొట్లలో, రెస్టారెంట్లలో పని చేస్తున్నాడు.”

నాకు ఆపుకోలేనంత ఆనందం! ప్రతి రిలేషన్షిప్ లో ఒక వీక్ పాయింట్ ఉంటుంది – అది బ్రేక్ పాయింట్ గా మారాలంటే పెద్ద కష్టమేంకాదు – స్వానుభవం!

“ఇందులో పెద్ద ప్రోబ్లెం ఏముంది? కులం – ఈ రోజుల్లో? నాన్సెన్స్. మీ పేరెంట్సే దోవలోకొస్తారు. ఉద్యోగందేముంది? ఈ రోజు రాకపోతే, రేపు.”

“ఉద్యోగమే పెద్ద ప్రాబ్లెమ్. అజయ్ కి కెరీర్ పట్ల శ్రద్ధ లేదు. సివిల్ కి జాబ్స్ రావు, కంప్యూటర్స్ కి మారమంటే వినడు. ఇప్పుడు కొత్త చదువులంటే భయమంటాడు. ఖాళీ సమయం దొరికితే కళలంటాడు. ఈ విషయంలో మా ఇద్దరికీ చాలా ఆర్గ్యుమెంట్స్.”

“ఆడపిల్ల ఒక మంచి హౌస్ వైఫ్ లా మారి తను నేర్చుకున్న కళలను కొనసాగిస్తే, ఆ అమ్మాయిని తెగ పొగుడుతాం, ఆ మొగుడినీ అభినందిస్తాం. అదే అవకాశం ఒక అబ్బాయికి మాత్రం ఇవ్వం. ఇకనైనా మేము కళ్లు తెరచి మగాళ్ల సమాన హక్కుల కోసం పోరాటం మొదలెట్టాలి.”

ఒక్క క్షణం నివ్వెర పోయి చూసి, తరవాత చక్కగా నవ్వేసింది సితార.

***

ప్రతి రోజూ అవసరమున్నా, లేకపోయినా ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే, ఎన్నో పర్సనల్ విషయాలు దొర్లిపోతూ ఉంటాయి. జడ్జ్ చెయ్యకుండా వినే వాళ్లు ఉంటే మరీనూ. ఇదే జరిగింది సితార విషయంలో కూడా. తనకీ అజయ్ కీ మధ్య జరిగే చిన్న చిన్న గొడవలూ, అమ్మా నాన్నలతో ఈ విషయంలో పుడుతున్న చికాకులూ, ఇలా ఎన్నెన్నో నాతో చెప్పుకొనేది. మరి నా గురించి అజయ్ కి ఏమి చెప్పిందో తెలియదు. మొదట్లో ఫ్రెండ్లీ గా ఉన్నా, తరవాత కలిసినప్పుడల్లా మా ఇద్దరి మధ్యా ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఉండేది. బహుశా, అజయ్ కి, సితార పైన నేను చూపిస్తున్న ఆసక్తి, తనకు నాతో ఏర్పడిన చనువు చూసి, నా మీద అనుమానం ఏర్పడిందేమో.

అసలు సితార నా గురించి ఏమనుకుంటోందో నాకు అవగాహన రాలా. నా గురించి తాను ఎప్పుడూ వివరంగా తెలుసుకోవాలని ప్రయత్నించలా – అంటే నేను తనని ఇష్టపడుతున్నానన్న అనుమానం కూడా తనకి రాలేదేమో? మరీ “ఫ్రెండ్ జోన్” లోకి వెళ్లిపోతే బయటపడటం కష్టం. మనసు విప్పి చెప్పే అవకాశం ఎప్పుడో!

మాటల సందర్భంలో తెలిసింది, రెండు రోజుల తరవాత సితార పుట్టిన రోజనీ, అజయ్ ఆ రోజు కూడా తనతో గడపకుండా, శాక్రమెంటోలో నాటకం వేసి, రాత్రికెప్పుడో కలుస్తాడనీ.

నా మనసులో పథకం సిద్ధమైపోయింది.

***

పుట్టినరోజు ఉదయాన్నే, సితారకి మెసేజ్ పంపించా, తనకి బ్రేక్ఫాస్ట్ పార్టీ ఇస్తున్నాను, సిద్ధంగా ఉండమని.

నా లాంబోర్గినీ కారుని తీసుకెళ్లి తన అపార్ట్మెంట్ ముందు ఆపి బయటకు రమ్మని కాల్ చేశా. ఒక అయిదు నిమిషాల తరవాత తాను బయటకు వచ్చి తనకి తెలిసిన లెక్సస్ కారు కోసం చూస్తూ , ఆ రోడ్డు పైన రెండు మూడు పచార్లు చేసింది. నేను కారు రెండు డోర్లను పైకి లేపి తనని లోపలికి రమ్మని ఆహ్వానిస్తే, సితార తన ఆశ్చర్యాన్ని దాచుకోలేదు.

“మీరు రిచ్ అని తెలుసు గానీ, మరీ లాంబోర్గినీ రిచ్ అనుకోలేదు.”

“నా గురించి నీకు చాలా తెలియదు. కానీ ఈ రోజు, నీ రోజు. లెట్స్ సెలెబ్రేట్!”

పాలో ఆల్టోలో ఉన్న ప్రైవేట్ విమానాశ్రయం దగ్గర కారాపాను.

“బ్రేక్ఫాస్ట్ అని ఈ చిన్ని ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చారే! ఇలా వచ్చే పోయే విమానాల్ని చూస్తూ తిందామనా?”

“దాదాపు అలాంటి ప్లానే!”

రన్వే మీద ఆరు సీట్ల ప్రయివేట్ జెట్ విమానం ఒకటి మా కోసం సిద్ధంగా ఉంది. సితారకి ఏమి జరుగుతోందో అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టింది.

“విజయ్… నా కోసం ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఈ ప్లేన్ బుక్ చేశావు?”

“నీ కోసం ప్రత్యేకంగా కాదు కానీ… ఇది నా ప్రైవేట్ ప్లేన్. నా కోసం, నా కిష్టమైన వాళ్ల కోసం!”

లోపలికి వెళ్లి ఎదురెదురు సీట్లలో కూర్చున్నాం. వేడి వేడి బ్రేక్ఫాస్ట్ తెచ్చి వడ్డించాడు, స్టూవర్డ్. క్షణక్షణానికీ సితార కళ్లల్లో విస్మయం పెరిగిపోతోంది. తినటం పూర్తవ్వగానే,

“థ్యాంక్ యూ సో మచ్! ఇక వెళదామా?”

నా సౌంజ్ఞ కోసం ఎదురు చూస్తున్న పైలట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందిగా గుర్తు చేశాడు. నేనే వంగి సితారకి బెల్ట్ పెట్టాను.

“ఏంటిది? ఎక్కడికెళ్తున్నాం?”

“సిన్ సిటీ – వేగస్!”

“నిజంగానా… నేను, అజయ్ ఎప్పటినించో వెళదామనుకున్నాం! తాను కూడా ఉంటే ఎంత బాగుండేదో.”

ఎక్కడో కలుక్కుమంది. నెప్పి బయటకి రాకుండా కప్పేశాను.
గంటన్నర తరవాత వేగాస్ లో దిగాం. సీజర్స్ ప్యాలెస్ లో “హ్యాపీ బర్త్ డే సితార!” బెలూన్లు మాకు స్వాగతం పలికాయి.

సితార కళ్లు ఏమి చెబుతున్నాయో నేను చదవలేకపోయాను – కృతజ్ఞతా? కన్ఫ్యూషన్? లేక నేనేమాశించి ఇదంతా చేస్తున్నానోనన్న ఆందోళనా?

తన చెయ్యి పట్టుకుని ఆ కెసినో లో ఉన్న థియేటర్ లోకి తీసుకెళ్లాను. “మై హార్ట్ విల్ గో ఆన్….”, టైటానిక్ పాటతో సెలీన్ డియాన్ స్టేజి పైకి వచ్చి తన కాన్సర్ట్ మొదలెట్టింది. రెండున్నర గంటల పాటు సాగిన ఆ కార్యక్రమంలో – సితార నా మొహం లోకి ఒక్క సారి కూడా చూడలేదు. కానీ నా చేతిని మొదట సున్నితంగా పట్టుకొని, ఆ తరవాత చాలా గట్టిగా నొక్కటం మొదలెట్టింది. బహుశా తన మస్తిష్కంలో ఆలోచనల నడుమన జరుగుతున్న సంఘర్షణ ప్రభావమేమో.

తిరుగు ప్రయాణంలో, ఫ్లైట్లో ఏవేవో సరదాగా మాట్లాడదామని నేను ప్రయత్నించినా, సితార కొంచెం ముభావంగానే ఉంది. కొంచెం ఎక్కువ చేశానేమోనన్న అనుమానం పట్టుకుంది. ఫ్లైట్ లాండ్ అవ్వబోయేముందు సితార నోరు విప్పింది.

“ఎందుకు ఇంత చేశారు, నా కోసం? నా కిష్టమైన వాళ్ల కోసం అని తప్పించుకోకండి.”

“మరి అర్థం అయ్యింది కదా… ఎందుకు అడుగుతున్నావు?”

“అయ్యో.. మీ కలాంటి ఉద్దేశం కలిగిందంటే అదే నా తప్పే. మనిద్దరి మధ్య ఏమీ జరగదన్న నమ్మకంతో నేను మీతో క్లోజ్ గా మూవ్ అయ్యాను. ఐ లవ్ అజయ్..”

“నీ పైన నాకు కలిగిన ప్రేమ నీ తప్పెలా అవుతుంది? కానీ నీలో నా పైన ఆ భావం పుట్టదన్న నీ నమ్మకం తప్పు అనుకుంటున్నాను. మతాలూ, కులాలూ, అంతస్తులూ ఇవేవీ ప్రేమకి అడ్డురావని నీకూ బాగా తెలుసు. మరి ఏ ధైర్యం తో ఆ నమ్మకం పెట్టుకున్నావు?”

“బట్ ఐ లవ్ అజయ్… ఆ విషయం మన పరిచయం అయిన మొదట్లోనే మీకు చెప్పాను. ఆ విషయమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది.”

“అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకున్నావు. అందువలన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు కానీ, నేనంటే ఇష్టం లేదని చెప్పగలవా? ఆ ఇష్టం ప్రేమగా మారటానికి టైం పట్టచ్చేమో గానీ, అసలు మారదన్న విషయం నువ్వు చెప్పలేవు. నేను నమ్మలేను.”

“ఇష్టమే… ఒక మెంటర్ లాగా. కానీ అది ప్రేమ కాదు… అవ్వలేదు కూడా”

ప్లేన్ లాండ్ అయ్యింది.

***

పవర్ ఆఫ్ చేసి ఉంచిన సెల్ ఫోన్ ఆన్ చెయ్యంగానే, అజయ్ నుంచి బోలెడు మిస్డ్ కాల్స్ చూసుకుంది సితార. తన నాటకం కాన్సిల్ చేసుకొన్నాననీ, సితార కోసం ఎదురు చూస్తూ ఉన్నాననీ సారాంశం. అప్పటికే చాలా గంటలు గడిచిపోయింది. అజయ్ అపార్ట్మెంట్ దగ్గర నేనే డ్రాప్ చేస్తానని సితారకి చెప్పాను. త్రోవ పొడుగునా సితార అజయ్ కి కాల్ చేద్దామని ప్రయత్నిస్తూనే ఉంది కానీ, అజయ్ మాత్రం ఫోన్ ఎత్తలేదు. మధ్యలో కార్ ఆపి అజయ్ కి ఇష్టమని వడా పావ్, బ్రెడ్ పకోడా ప్యాక్ చేయించింది సితార.

అజయ్ ఇంకా ఫోన్ తియ్యక పోవటంతో, సితార నన్ను కూడా తోడు కోసం అపార్ట్మెంట్ లోకి రమ్మంది. డోర్ లాక్ చేసి లేదు. నెమ్మదిగా తోసుకొని లోపలికి వెళ్లాము. కిటికీకి కట్టిన రెండు “హ్యాపీ బర్త్ డే” బెలూన్లు రెపరెపమంటున్నాయి. ఎదురుగా కార్పెట్ మీద డబ్బాలో ఒక చిన్న కేకు, పక్కనే కొవ్వొత్తి పెట్టున్నాయి. గోడకి వాలి కూర్చొని మగతగా కళ్లు మూసుకొని ఉన్నాడు అజయ్. సితార తన దగ్గరకి వెళ్లి కదిలించి చూసింది. తనలో తానే “హ్యాపీ బర్త్ డే సితారా” అంటూ ముద్ద ముద్దగా మాట్లాడుతున్నాడు. పక్కనే పడి ఉన్న బీరు బాటిల్సు చెప్తున్నాయి, అతడు ఎన్నో గంటలుగా తాగుతున్నాడని.

సితార నా మొహంలోకి చాలా ఇబ్బందికరంగా, అపరాధభావంతో చూసింది. నేను దానిని పట్టించుకోకుండా, అజయ్ దగ్గరకు వెళ్లి అతడి భుజం పట్టుకొని పైకి లేపే ప్రయత్నం చేస్తుంటే, సితార కూడా సహాయం చెయ్యటానికి ముందుకి వచ్చింది. నాలుగు అడుగులు వేసి బాత్రూం వైపు వెళ్లంగానే, ఒక్క సారిగా వాంతి చేసుకున్నాడు అజయ్. బహుశా తన జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదేమో సితార, ఒక్క ఉదుటున తనని వదిలేసి బాత్రూం బయటకి వచ్చేసింది. నేను అజయ్ ని టాయిలెట్ కమోడ్ దగ్గర కూర్చోబెట్టి, వాంతి తగ్గే వరకూ అలాగే పట్టుకుని ఉన్నాను. తరవాత అతని అతని చొక్కాని తీసేసి, ఒక తడిపిన టవల్ తో అతని మొహాన్ని తుడిచి, బయటకి తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఇంకా పూర్తిగా తెలివిలోకి రాని అజయ్ “థాంక్ యూ బ్రదర్…హ్యాపీ బర్త్ డే” అంటూ పిచ్చిగా పలవరిస్తున్నాడు.

సితార అందమైన కళ్లలో ముసుర్లు కమ్మి కన్నీటి వాన కురుస్తోంది. నేను మళ్లీ బాత్రూం లోకి వెళ్లి, అక్కడ ఫ్లోరింగ్ కొంచెం శుభ్రం చేసి బయటకి వచ్చాను. అజయ్ మాటలాపేసి నిద్రలోకి జారుకున్నాడు. నేను సితార దగ్గరకు వెళ్లి “భయపడకు… కొంచెం ఎక్కువైనట్టుయింది. ఒక నాలుగైదు గంటలు నిద్రపోయి లేస్తే సర్దుకుంటాడు” అని చెప్పాను.

అది మొయ్యనలవి కాని కృతజ్ఞతాభావమో, లేక పట్టలేని అవమానభారమో తెలియదు కానీ, ఒక్క సారిగా నన్ను పట్టుకొని, తన ముఖాన్ని నా మెడ వంపులో దాచుకొంది సితార. అప్రయత్నంగా తనని పొదివి పట్టుకున్నాను. కొన్ని సెకన్ల తరవాత తానే తేరుకొని ఇక బయల్దేరదామనీ, తన ఇంటి దగ్గర దింపెయ్యమనీ అడిగింది సితార.

బయటకి వచ్చిన తరవాత తన బర్త్ డే రోజు ఇలా ముగించటం ఏ మాత్రం నచ్చలేదని చెప్పి, సితారని నా ఇంటికి తీసుకువెళ్లి ఒక చిన్న సెలెబ్రేషన్ తో ముగిద్దామన్నాను. పెద్దగా బలవంతపెట్టకుండానే ఒప్పుకుంది.

లాస్ ఆల్టోస్ హిల్స్ లోని నా ఇంటి ముందర కార్ ఆపాను.

“ఇల్లని ఇలా ఏదో ప్యాలెస్ కి ఎందుకు తీసుకొచ్చావు? ఇలా ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు ఇస్తావు?”
“జోకులొద్దు, ఎదో ఇది నా చిన్న బొమ్మరిల్లు” అంటూ సితారని లోపలికి తీసుకెళ్లాను.
తన చిన్ని జీవితంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఇంటిని చూడలేదన్న విషయం సితార దాచుకోలేదు. నా ఇంటి వెనకనున్న గార్డెన్ ఏరియా కి తీసుకెళ్లినప్పుడు, తన ఆనందాన్ని ఆపుకోలేకపోయింది సితార. రకరకాల పూల మొక్కలూ, పళ్ల చెట్లూ, ఆ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్, మొక్కల మధ్యలో దాగి ఉన్న స్పీకర్లలో మంద్రస్థాయిలో మ్రోగుతున్న ఫ్లూటూ, అన్నీ తన కోసమే అన్నట్లుగా చక్కగా అమరిపోయి, సితారని స్వాగతించాయి. ఒక అరగంటలో మంచి భోజనం, వైన్ ఆ గార్డెన్ లోనే ఏర్పాటు చేసాడు, నా పర్సనల్ బట్లర్.

దగ్గరున్న రిమోట్ తో రెండు బటన్లు నొక్కంగానే, నాలుగు వందల అంగుళాల తెర ఒకటి నెమ్మదిగా పైనుంచి దిగింది. “లాహిరి లాహిరి” పాటతో మొదలుపెట్టి వరసగా పాత మెలోడీలు ఆ వెండి తెర మీద ఆడాయి. మా వైన్ బాటిల్ కూడా ఖాళీ అయ్యింది.

“ఇంత అద్భుతంగా నా రోజు గడిచినందుకు మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటం లేదు” పైకి లేస్తూ అంది సితార.
“ఇంత అందమైన అమ్మాయితో, ఈ అందమైన సాయంత్రం.. మై ప్లెజర్. ఈ ఆనందం ఇప్పుడే అయిపోవాలా? రాత్రికి ఇక్కడే ఉండరాదూ? నా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి నువ్వు. పొద్దున్నే దింపేస్తాను.”
వైన్ మహాత్మ్యమేమో, “ఈ రోజు మీరు అడిగిన దేనికీ నో చెప్పాలనిపించట్లేదు!”

నేను తన చేయి పట్టుకొని బెడ్రూం వైపు నడిపించాను. నాకు ఇది ఎంతో పరిచయమున్న ఘట్టం. ప్రేమలో నా జయానికి అతి చేరువగా తీసుకెళ్లే సోపానం.

***

సెల్ ఫోన్ మ్రోగటంతో మెలకువచ్చింది. టైం చూస్తే అర్ధరాత్రి ఒంటి గంట. నిద్ర మత్తులో “హలో” అన్నా.

“సితార, నేను ప్రేమించుకుంటున్నాం అని తెలిసి కూడా నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?” అన్న అజయ్ పలకరింపుతో నా మత్తు వదలి పోయింది.

“నేనేం చేశాను? తన బర్త్ డే రోజున నీ లాగా తాగి పడుకోకుండా, తనకి గుర్తుండిపోయే రోజులా సెలెబ్రేట్ చేశాను. మీ ప్రేమ, ఉందో, లేదో మీ స్వవిషయం.”

“సారూ… మీరేం చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకుడిని కాదు. మొదట మీ గురించి చెప్పినప్పుడు, ఎవరో అనుభవం ఉన్న పెద్దాయన, మాట సాయానికి పనికొస్తాడన్న ఉద్దేశంతో, సితార మీతో క్లోజ్ గా మూవ్ అయినా, నేను పట్టించుకోలేదు. మీ గురించి, గూగుల్ లో వెతికినప్పుడు, మీ ఆస్తిపాస్తులూ, మీ పర్సనల్ లైఫ్ వివరాలూ చాలా దొరికాయి. మీరు తిరుగుబోతని, తరవాత తెలిసి సితారని హెచ్చరించినా, మీ మాటల్తో ఏమ్మాయ చేశారో గానీ, మీరు చాలా మంచివారనీ, ఆ పుకార్లన్నీ నమ్మద్దనీ, సితారే నన్ను తిరుగు కన్విన్స్ చేసింది.

అదీ కాక వయస్సులోనూ, అందంలోనూ, సితారకి నేనే మంచి జోడీనని పిచ్చ కాన్ఫిడెన్స్ తో ఉండేవాడిని. కానీ రానురానూ, మీ మంచితనం గురించే కాక, మీరెంత సరదా మనిషో, మీదెంత రిచ్ లైఫ్ స్టైలో, ఇలా ఏవేవో చెప్పుకొచ్చేది సితార. అయినా కూడా నాకు అనుమానం రాలా. కానీ ఈ రోజు, మీ లాంబోర్గినీ కారూ, మీ ప్రయివేట్ జెట్టూ , మీ వేగాస్ ప్రయాణం, సెలీన్ డియాన్ కాన్సర్టూ ఇలా వరసగా నాకు సితార తన రోజు గురించి ఎప్పటికప్పుడు వాట్సాప్లో చెప్తూ ఉంటే, నేను తట్టుకోలేకపోయాను.

చాలాసార్లు సితార ఫోన్ ట్రై చేసినా, కాన్సర్ట్ కోసం అనుకుంటా, ఆఫ్ చేసి కూర్చొంది. నేనేం చెయ్యాలి? నా నాటకం కాన్సిల్ చేసుకొని, నాకున్నంతలో రెండు బెలూన్లూ , చిన్న కేకూ, బీరూ కొని తన కాల్ కోసం కుక్కలా వేచి చూశా. మీరిద్దరూ ఏమి చేస్తున్నారోనని కొంత ఊహించీ, మరికొంత ఊహించలేక, బీరు తాగటం మొదలెట్టా. మీరిద్దరూ ఇంటికి రావటం గుర్తుంది కానీ, ఏమి జరిగిందో తెలియదు.

సితార నా నుంచి రోజు రోజుకీ దూరమయిపోతోంది అని మాత్రం తెలుస్తోంది” అని కొంచెం గాప్ ఇచ్చాడు అజయ్.

నాతో గడిపిన రోజంతా సితార అజయ్ గురించే ఆలోచిస్తూ, వాట్సాప్లో టచ్ లోనే ఉందన్న విషయం చేదుగా అనిపించినా, వెనక్కి తగ్గాలనిపించలేదు.

“ఆ మాత్రం క్లారిటీ వచ్చింది కదా… మే ది బెస్ట్ మ్యాన్ విన్!” అని రెచ్చగొట్టాలనే అన్నాను.

“మీకూ నాకూ పోటీ ఏంటి సారూ. ఎంతో జీవితాన్ని చూసిన అనుభవం, ప్రయివేట్ జెట్ మైంటైన్ చెయ్యగల స్థోమత మీది. ముందు ముందు మేము నిర్మించుకోబోయే భవిష్యత్తుకై అందమైన కలలు కంటూ, మాకున్న కొద్దిపాటి వసతుల్లోనే, చిన్ని చిన్ని ఆనందాలని పొందాలన్న తాపత్రయంలో, జీవితాన్ని ప్రారంభిస్తున్న మేము… మమ్మల్ని ప్లీజ్ వదిలెయ్యండి. పిల్లలం సార్, మేము. మీరు చూడటానికి ఎంత బాగున్నా, వికీపీడియా ప్రకారం, మీది దాదాపు మా అమ్మ వయస్సు. కనీసం అది చూసైనా సితారని వదిలెయ్యండి. ప్లీజ్….”

నాలో చెక్కుగట్టి దాగున్న పుండుని గీకి మరీ పైకి లేపాడు అజయ్. ఇక ఉపేక్షించి లాభం లేదు అనిపించింది నాకా క్షణంలో.

“నా వయస్సు సితారకి అంత ఇబ్బందిగా ఉంటుందా? ఈ రాత్రి నా బెడ్రూంలోనే గడుపుతోంది. రేపు కనుక్కుని చెప్పు” ,అని వేటు వేశాను.

ఒక నిమిషం పాటు నిశ్శబ్దం..

“ ప్లీజ్ ప్లీజ్ అంటే పసి పిల్లాడనుకున్నావురా నా కొడకా… వస్తున్నా…నీ పాడె లేపుతా, తరవాత జైలు కెళ్తా..” అని కాల్ కట్టెయ్యటంతో తెలివిలోకొచ్చాను. మళ్లీ నిద్ర పట్టలేదు.. భయంతో కాదు, ఎంతగా దిగజారిపోయానా అన్న బాధతో!

***

మూడు గంటల తరవాత తరవాత మళ్లీ ఫోన్ మోగింది. ఈ సారి పోలీసుల నుంచి. హైవే మీద బైక్ యాక్సిడెంట్లో, ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు తగిలాయనీ, స్టాన్ఫర్డ్ హాస్పిటల్ ఐ.సి.యు వార్డు లో ఉన్నాడనీ, తన సెల్ ఫోన్ లో చివరి కాల్ నా నంబర్ కి అవ్వటం వల్ల, నాకు కాల్ చేస్తున్నామని తెలిపారు.

హాయిగా నిద్ర పోతున్న సితారని హడావిడిగా లేపి, యాక్సిడెంట్ విషయం చెప్పి, నా కారులో బయల్దేరాము.

ముందురోజు రాత్రి, నాకు సితార పూర్తి అవకాశం ఇచ్చినా, నేనెందుకు హద్దు మీరలేదో, అస్సలు మీరాలని ఎందుకు అనిపించలేదో అని డ్రైవ్ చేస్తూ ఆలోచించటం మొదలెట్టా. నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ కు నాకు అలవాటైన రిటర్న్ అంది వస్తున్నా నాకెందుకు తీసుకోవాలనిపించలేదు? అనుమానించకుండా నా వెనకే వస్తున్న సితారలోని అమాయకత్వాన్ని అలాగే కాపాడటం నా కెందుకు అంత తృప్తిని ఇచ్చింది? ఆమె నిద్రపోతూ ఉంటే, ఆమె కురులను సర్ది, ఆమె మొహంలోకి చూస్తూ కూర్చొన్నానే తప్ప వేరే ఆలోచన ఎందుకు రాలేదు? నా గుండెలో ఎందుకు ఒక సన్నని కోత మొదలయ్యింది? తనని కోల్పోతానేమోనన్న భయమా? అవే ఆలోచనలతో నా కళ్లెప్పుడు మూతపడ్డాయోనన్న జ్ఞాపకం కూడా లేదు.

***

సితార బాహ్య ప్రపంచం పట్టని స్థితిలో, కారు విండోకి తలానిచ్చి, నా వైపే చూస్తున్నట్లుగా, కూర్చుని ఉంది. సరిగ్గా ఆరు నెలల క్రితం ఇద్దరం అపరిచితులం. “యే కహా ఆ గయే హమ్?”

కార్ హాస్పిటల్ ముందు ఆపంగానే సితార దిగి లోపలి పరిగెత్తింది. తనని అలా వెనక నుండి చూస్తుంటే, ఇక తిరిగి రాలేకపోయేంత దూరంలో ఉన్న తీరానికి వెళ్లిపోతోందేమో అన్న ఆలోచనతో గుండె బరువెక్కింది. పార్కింగ్ లాట్ లో కారు ఆపి, ఐ.సి.యు వైపుకి చాలా నెమ్మదిగా నడక ప్రారంభించా. బయట నర్సు, ప్రాణాపాయం ఏమీ లేదనీ, ముందు జాగర్త కోసం, కొన్ని పరీక్షల కోసం, ఐ.సి.యు లో ఉంచారని చెప్పింది. లోపలికెళ్లే ధైర్యం చాలక నేను బయటే ఉండిపోయాను.

కాసేపటి తరవాత సితారే బయటకి వచ్చింది, కన్నీళ్లు ఎండిపోయి ఎఱ్ఱబడిన కళ్లతో. “వాడి ఫోన్లో చూశాను, నిన్న సాయంత్రం నుంచీ ఎన్ని సార్లు కాల్ చేశాడో నాకు. నీకే లాస్ట్ కాల్ చేశాడు. ఏమన్నాడు? అంత అర్ధరాత్రి ఎందుకు బైక్ మీద బయల్దేరాడు?”.

తన కళ్లలో చూసే ధైర్యం లేదు నాకు. తనని దగ్గరకి తీసుకొని గుండెలకు హత్తుకున్నాను. “నిన్న మనిద్దరం అంత టైం కలవటం, నీ బర్త్ డే సెలెబ్రేషన్ లో అతడు లేకపోవటం వల్ల కొంచెం అప్సెట్ అయ్యాడు. నువ్వు మా ఇంట్లోనే ఉన్నావని తెలియటంతో నిన్ను అప్పటికప్పుడు కలవాలని బయల్దేరాడు.”

సితార అది వినంగానే మౌనంగా వెళ్లి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొంది. తన వలనే ఇది జరిగిందేమోనన్న ఆలోచన పుట్టిందేమో?

“వాడంటే నాకు ప్రాణం. వాడికి ఏమన్నా అయితే మాత్రం నన్ను నేను క్షమించుకోలేను. తన గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ల ఇంట్లో రాత్రి గడుపుతోంది అని తెలిసినప్పుడు వాడి మానసిక స్థితిని నేను ఊహించగలను. ఇది నేను ముందే ఎందుకు ఆలోచించలేకపోయాను? మీ మాటని నిన్న రాత్రి ఎందుకు కాదనలేకపోయాను? ఎందుకింత కన్ఫ్యూజన్ లో ఉన్నాను?”

తన ముఖాన్ని చేతులతో కప్పేసుకొని సితార మౌనంగా ఏడుస్తోంది.

ఏదో తడిగా తగిలింది. ఛా! నా కళ్లల్లో నీళ్లా! ఏంతో మందిని ఏడిపించాను గానీ, ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరిగిందో కూడా గుర్తులేదు. దీనికంతటికీ కారణం, నాలో సితార పట్ల ఈ ప్రేమనే ఎమోషన్ పుట్టటమే. అది సాధించుకోవటానికి నేను నడిపిన ఆటలో, తెలిసో తెలియకో, అజయ్, సితారలు పావులు. అజయ్ మేకప్ వేసుకొని స్టేజీ మీద అందంగా కనపడటం వల్ల సితారకి అతని పట్ల తొలి ఆకర్షణ కలిగుండచ్చేమో గానీ, తాను ప్రేమలో పడింది మాత్రం, మేకప్ తీసేసిన అజయ్ తో మాత్రమే. మరి నేనో? ఏరోజైనా నా డబ్బు, హోదా అనే మేకప్ లేకుండా సితారకి ఎదురుపడ్డానా? కనీసం, నా జుట్టుకి రంగు వెయ్యనప్పుడు నేనెలా ఉంటానో సితారకి తెలుసా? నోరు విప్పి చెప్పకపోయినా తనలో ప్రేమలాంటి ఇష్టం నా పైన కలగడానికి కారణం నేను. ఈ రోజు తనీ కన్ఫ్యూజన్ లో ఉండటానికి కారణం నేను!

ఏం చేయాలిప్పుడు? నా మేకప్ తియ్యకుండా ఇలాగే కొనసాగి సితారని గెలుచుకోవచ్చు. కానీ అది నా మనస్సుకి ఊరటనెందుకివ్వట్లేదు? తను సంతోషంగా ఉండాలంటే ఏమి చెయ్యాలన్న విషయం పైనే నా ధ్యాసంతా ఎందుకు పోతోంది?

నా మెదడులో సుడులు తిరుగుతున్న ఈ ఆలోచనలన్నీ మాటల రూపంలో వ్యక్తపర్చగలిగే స్వభావం కాదు నాది.

“సితారా… నువ్వలా బాధపడకు. అజయ్ ఒక వారం రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. నేను ఇక్కడి డాక్టర్ తో మాట్లాడాను, అన్నీ జాగర్తగా చూసుకుంటాడు. నీకు నిన్న పార్టీ అయిన తరువాత చెబ్దామని ఒక విషయం దాటేశా. నేను ఆరునెలల పాటు, ఈస్టు కోస్ట్ ఆఫీసుల నుండి పని చేయబోతున్నా. ఈ రోజే వెళ్తున్నా. అప్పుడప్పుడూ బే ఏరియా కి వస్తూ ఉంటా. కానీ, నీకెప్పుడూ ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటా. అజయ్ కోలుకున్న తరువాత, ఈ విషయం చెప్పు. ”

సితార నివ్వెరపోయి నాకేసి అలా చూసింది.

“మనిద్దరినీ అపార్థం చేసుకున్నందుకు మొదట్లో ఫీల్ అవుతాడు. ఆ తరువాత సరదాగా ఈ అంకుల్ మీద జోకులేసుకొని మీరే నవ్వుకుంటారు.”

త్వరగా ఒక హగ్ ఇచ్చేసి అక్కడి నుంచి బయటపడ్డాను. నా కారు కెప్పుడు చేరతానా అన్న ఆత్రుతతో పరిగెత్తాను… అలుపొచ్చేలా, ఆగకుండా. కారెక్కి రేడియో పెద్ద వాల్యూం లో పెట్టాను.

ఏడ్చాను. గొంతు విప్పి మనసారా ఏడ్చాను. కాసేపటికి కన్నీళ్లు ఆగిపోయాయి. గుండె లోపలెక్కడో బాధ. ఇది ఆగిపోవాలనిపించే బాధ కాదు..ఎందుకో ఇంకా అనుభవించాలి అనిపిస్తోంది! ఇదే తోడుగా బ్రతికిపోవాలనిపిస్తోంది! ప్రేమలో మొదటిసారి చవిచూసిన ఓటమి మహిమేమో?

లేక ప్రేమలో ఇదే నా తొలి జయమా?

**** (*) ****