కథ

మధ్యవర్తులు

నవంబర్ 2017

తెలుగు సాహిత్య ప్రపంచానికి అల్లం రాజయ్య పరిచయం అక్కరలేని పేరు… అని రాయాలనే ఉంది.

కానీ ఇవాళ ఆ అవసరం కనిపిస్తోంది. అందుకు కారణం ఇప్పటి ఇంటర్నెట్ దశకంలో తెలుగు సాహితీ సీమలోకి సృజనాత్మక రచయితలుగా ఓ కొత్త తరం రావటం (ఇది మంచి పరిణామమే), వారికి తెలుగు సాహిత్య ఉత్థాన పతనాలతో పరిచయం లేక పోవటం, ఆనాటి సామాజిక పరిణామాలతో దశాబ్దాల అంతరం పెరగటం, మరీ ముఖ్యంగా ఆయా రచనలు అందుబాటులో లేకపోవటం.

1970 ల నుంచీ 1990 ల చివరి వరకూ తెలంగాణా సమాజ ప్రతిఫలనాల్ని శక్తివంతమైన కథలుగా, నవలలుగా మలిచిన రచయిత అల్లం రాజయ్య. తనని ఎంతో ప్రభావితం చేసిన రావిశాస్త్రి, కా.రా, భూషణంల వారసత్వాన్ని అందిపుచ్చుకొని కూడా వారికి భిన్నంగా తనదైన ఓ కొత్త రచనా ధోరణితో తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయిగా నిలిచిపోయిన సృజనాత్మక శీలి.

‘ఎదురు తిరిగితే ‘ నుంచీ ‘మధ్యవర్తులు’, ‘మహదేవుని కల’, ‘మనిషి లోపలి విధ్వంసం’, ‘అతడు’, ‘ప్రత్యర్థులు’ వంటి కథలూ, ‘కొలిమంటుకున్నది’, ‘ఊరు’, ‘అగ్ని కణం’, ‘కొమరం భీం’ (సాహుతో కలిసి), ‘వసంత గీతం’ వంటి ప్రసిద్ద రచనలు పాఠకులకు పరిచయమే. చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ‘కొలిమంటుకున్నది’ వంటి అల్లం రాజయ్య నవలలకు చదివే పాఠకులకంటే నిరక్షరాస్యులయిన శ్రోతలే ఎక్కువ- ఆనాటి తెలంగాణ పల్లెల్లో.

జీవిత యధాతద చిత్రణే కథకు మూలం అన్న భావనతో రాసిన మొదటి దశ కథలకు భిన్నంగా కథారచనలో ఎంపిక, నిగూఢత, ఇంకా బలమయిన చిత్రణనూ, లోతునూ ప్రవేశపెట్టి అల్లం రాజయ్య రాసిన కథ ‘మధ్యవర్తులు’. ఆనాటి తెలంగాణ గ్రామీణ ప్రాంతపు సాంఘిక, సామాజిక వలసలనూ, సంఘర్షణలనూ మధ్యతరగతి వ్యక్తి నేపధ్యంలోంచి వివరిస్తూ అనేక వివాదాస్పద ప్రతిపాదనలను చేసిన కథ కూడా ఇది. – సురేష్బొయ్యిన గాలి వీస్తోంది. ఆ గాలికి చెట్లు ఫెళ ఫెళమంటూ, కీచుకీచుమంటూ రొద చేస్తూ ఊగుతున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తోంది. కరంటు తీగలు జంయ్యిమని మోగుతున్నాయి.

ఒక చిల్లుల గుడిసెలో చిరుగుల అంగీ పిల్లవాడు శరీరాన్ని కోత పెట్టే గాలికి కెవ్వున కేకేశాడు. చీకటి నిండిన గుడిసెలో మెరుపు మెరిసినప్పుడల్లా కప్పు నుండి కారే నీటిధారలకు ఒక పేదతల్లి మట్టి మూకుల్లు పెడుతోంది.

తలుపు రెక్క కిరకిరలాడుతూ ఊగి దబేలున పడిపోయింది.

పిల్లవాడు ఆ చిమ్మం చీకట్లో నేలంతా బురదైపోయిన ఆ గుడిసెలో, ‘‘అవ్వా… అవ్వా’’ అంటూ ఏడుస్తున్నాడు. ఎక్కడో ఫెళఫెళ చెట్లు కూలిన శబ్దం. ’అవ్వా‘ దిక్కులు పిక్కటిల్లే లాగున పిల్లవాడు అరుస్తున్నాడు.

‘‘ఇక్కన్నేరా నాగేంద్ర,’’ తల్లి ఏడుపు గొంతుతో చేతులు చాచి అరుస్తోంది. కాని ఆ అరుపు ఆ చీకట్లో, ఆ తుఫాను హోరులో పిల్లవాన్ని చేరడం లేదు.

‘‘అవ్వా… అవ్వా,’’ పిల్లవాడు గుడిసంతా వెతుకుతున్నాడు. దబెలున గుడిసె కూలిన పెద్ద శబ్దం.

డాక్టర్‌ నాగేంద్రం హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. బయటి వాతావరణం కల్లోలంగా, బీభత్సంగా వున్నది. తుఫానుగాలి రొద పెడుతోంది. బంగళా కిటికీ రెక్కలు కొట్టుకొని వాటికి అమర్చిన గాజు పలుకలు పగిలిపోయాయి.

నాగేంద్రం ఇంకా కల నుండి తేరుకోనేలేదు. అతను ముందు గదిలో ఒక బల్ల మీద శద్దరు మాత్రమే పరుచుకొని పడుకున్నాడు. కిటికీల నుంచి వచ్చిన జల్లుకు పక్కంతా అప్పటికే తడిసిపోయింది.

బయట గాలి రొద పెడుతోంది. చిమ్మ చీకటిలో నేషనల్‌ హైవే మీద కాబోలు చెట్లు కూలుతున్న చప్పుళ్లు. కరంటు ఎప్పుడు పోయిందో తెలియదు. ఉండీ ఉండీ ఫెళ ఫెళ ఉరుముతోంది. ఆ వెనువెంటనే తళుక్కున మెరుపు. వర్షం కుండపోతగా కురుస్తున్న మోత- కిటికీలో నుండి చూస్తే తెల్లగా నీటి ప్రవాహం. ఆ తుఫాను గాలిలో వేనవేల గుడిసెలు నేలమట్టమై లక్షలాది గొంతులు రోదిస్తున్నటుగా వున్నది. కల నుండి తేరుకొని, ‘నా జన్మలో చూడనంత తుఫాను,’ అనుకున్నాడు నాగేంద్ర. ‘ఈ పాటికి ఇస్లాంపురా, స్పిన్నింగ్‌ మిల్స్‌ ఏరియా జలమయమైపోయి వుంటుంది,’ అనుకున్నాడు. ఆ వర్షంలో… ఆ తుఫాను గాలిలో తడిసి ముద్దైపోయిన రెండేండ్ల కొడుకును చంక నేసుకొని, నల్లగా, బీద బీదగా వున్న ఒక తల్లి చేతులు చాచి తన్ను పిలుస్తున్నట్లుగా అన్పించింది. తను పూర్తిగా చిక్కని చీకటిలో, తుఫాను గాలిలో చిక్కుకుపోయాడు.

కీటికీ రెక్కలు ఇంకా కొట్టుకుంటూనే వున్నాయి. నాగేంద్రం లేచి వాటిని మూయడానికి తంటాలుపడ్డాడు. ఇంకా వార్నీసు వాసన పోని తలుపులను మూయడం కూడా తనకింకా అలవాటు కాలేదు. ఇల్లు కట్టి అందులోకి ప్రవేశించి ఇంకా మూడు నేలలన్నా కాలేదు. తను ఇంతకుముందు ఇలాంటి ఇంట్లో నివసించినవాడు కాదు. మూయని కిటికీ రెక్కలు నాగేంద్రంను అపహాస్యం చేస్తున్నట్లుగా కొట్టుకుంటున్నాయి.

లేచి తడుముకుంటూ హాలులోకి వచ్చాడు. హాలులో ఫర్నీచర్‌. చీకట్లో ఈ ఫర్నీచర్‌ అరణ్యాన్ని ఛేదించడం కష్టమే. రెండు అడుగులు వేసేసరికి ఫ్రిజ్‌ తాకింది. దాని పక్క డైనింగ్‌ టేబుల్‌. గోడకు చెయ్యానిస్తే శాంపుల్‌ మందు సీసాలు ఒకదానికొకటి తాకి శబ్దం చేశాయి.

టార్చిలైటు ఎక్కడున్నదో? ఇలాంటి వస్తువుల మీద పూర్తిగా తన కంట్రోల్‌ పోయింది. ఏ వస్తువు ఎందుకు వచ్చిందో? అవసరమా కాదా అన్న విషయం అట్లా వుంచి- ఆ వస్తువులన్నిటినీ ఎట్లా ఉపయోగించాలో నేర్చుకొనే ఓపికా, తీరికా లేని బతుకు. వస్తువులు పెరిగిన కొద్దీ తను వాటి మధ్య చిక్కుకుపోతున్నాడు.

గుడ్డివానిలాగా గోడలు తడిమాడు. ‘కొడుకా నాగేంద్రా,’ బయట గాలి ముద్ద ముద్దగా పిలుస్తున్నట్టునిపించింది. కిటికీలు ఇంకా కొట్టుకుంటూనే వున్నాయి.

వెతకగా వెతకగా ఎట్టకేలకు నాగేంద్రంకు అగ్గిపెట్టె దొరికింది. అదీ మెత్తబడి రెండు పుల్లలు గీకినా వెలుగలేదు. మూడో పుల్ల వెలిగింది. ఆ గుడ్డి వెలుతురులో చిందర వందరగా వున్న వస్తువులన్నీ కాలుతున్నట్టుగా కనిపించాయి. కొవ్వొత్తైనా దొరికితే బావుండును. మరో పుల్ల గీకి తనెక్కడున్నాడనేది చూశాడు. బెడ్రూం గుమ్మంలో. విశాలమైన పక్క, దాని మీద కర్లాన్‌ పరుపులు బోసిగా వున్నాయి. ఆ పక్క మీద తనకు నిద్ర పట్టదు. కిటికీల నుంచి జల్లు కొట్టి పక్క తడిసినట్లుగానే వున్నది. కిటికీలు మూయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.

అన్ని గదుల్లో గోడ గడియారాలున్నాయి. టైం చూశాడు. ఒంటి గంట ఏడు నిమిషాలయ్యింది.

గాలి రొద ఇంకా హెచ్చినట్లున్నది. బొయ్యిమని శబ్దం. కొమ్మలు రాచుకునే శబ్దం. కరెంటు తీగల మోత- వాన నేల మీద బాదే శబ్దం. భూమి ఆకాశం హోరాహోరీ యుద్ధం చేస్తున్నట్లుగా వున్నది. ఉరుములు-మెరుపులు. ఈ శబ్దాలన్నింటిలో కరెంటు తీగల మోత గొంతు పొలమారి ఏడుస్తున్న చిన్న పిల్లవాని ఏడుపులాగా వున్నది.

కిటికీలు తపా తపా కొట్టుకుంటూనే వున్నాయి. కాలెండర్లు పరపర చిరిగిపోతున్నాయి. గాలి విసురుతో తోసుక వచ్చిన జల్లు ఇల్లంతా తడిపేలాగునున్నది.

నాగేంద్రంకు కడుపులో నుండి వనుకు తన్నుకు వచ్చింది. తను తడిసి ముద్దైపోయినట్లుగానే అన్పిస్తున్నది.

ఈ తుఫాను ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైనదో? ఎప్పుడు ఆఖరవుతుందో తెలియదు.

నాగేంద్రం అగ్గిపుల్ల గీకి ముందు రూంలోకి వచ్చాడు. కిటికీ నుంచి బయటకు చూశాడు. చీకట్లో అంత తుఫాను గాలిలో కూడా కప్పలు చిత్ర విచిత్రమైన గొంతులతో బెక బెక లాడుతున్నాయి. మెరుపు వెలుగులో ట్రంకు రోడ్డుకావల ఇంకా కట్టడంలో వున్న సినిమా టాకీసు ఒక పెద్ద రాకాసిలా నిలుచున్నది. అది బిల బిల కూలిపోతుందేమోనని నాగేంద్రం భయపడ్డాడు.

అప్పుడు నర్సింగ్‌ హోం జ్ఞాపకం వచ్చింది. పేషెంట్లు ఎంత గాభరా పడుతున్నారో? డాక్టర్‌ సూర్యారావు రాత్రి డ్యూటీకి వచ్చాడో లేదో? ఆపరేషన్‌ జరిగిన రోగి పరిస్థితి ఎట్లా వుందో? అతని స్మృతిపథంలో ఒక్కొక్క పేషెంటూ మెదిలాడు. అక్కడికి నర్సింగ్‌ హోం రెండు వందల గజాలే. కాని తుఫానులో అక్కడికి తరలడం కష్టమే. కడుపులో నుండి ‘దవ’ తన్నుక వస్తోంది. తను సాయంత్రం భోజనం చేయలేదని జ్ఞాపకం వచ్చింది. ఉదయం తను లేచేసరికి ఇంటిముందు పేషెంట్లు తయారు. వాళ్లను పొమ్మనలేడు. అప్పటినుండీ నటన మొదలౌతుంది. వాస్తవం డాక్టరు చెప్పజాలడు. అందరికీ నమ్మకం కలిగించాలి. తగ్గినా, తగ్గకపోయినా తగ్గుతుందనే చెప్పాలి.

గాలి రొద అంతకంతకూ హెచ్చుతోంది. ప్రకృతి పిచ్చెత్తినట్టుగా వున్నది.

ముందుగదిలో పడకకుర్చీలో కూలబడ్డాడు. కండ్లు మండుతున్నాయి. మనసులో ఎక్కడో తుఫాను రేగుతోంది. కళ్లు మూసుకున్నా నిదుర రాదు. చిరచిరలాడే ముఖంతో నాగేంద్రం భార్య సులోచన రూపుకట్టింది. కొడుకు జ్ఞాపకం వచ్చాడు.

అన్నయ్యలిద్దరూ వేరు కాపరాలు పెడుతున్నారని, తల్లి నగల్లో తనకు వాటా రావాలని తల్లిగారింటికి వెళ్లింది సులోచన.

పోయే ముందు జరిగిన గొడవ జ్ఞాపకం వచ్చింది. ‘ఓ అచ్చటా. ముచ్చటా- జన్మకో శివరాత్రంట. కలసి సినిమా అయినా…’
నాగేంద్రం ఈ రొటీన్‌ మాటలను జ్ఞాపకం తెచ్చుకోదలుచుకోలేదు. లాభం లేదు. ఈ కుర్చీలో కూర్చుండి కళ్లు మూసుకుంటే ఇలాంటి జ్ఞాపకాలే వస్తాయి. లేచి నిలబడి పచార్లు చేయసాగాడు.

రానురానూ తను ఒంటరివాడైపోతున్నాడు. తుఫాను గాలిలో చిక్కుకున్న ఒంటరిపక్షిలాగా తడిసి ముద్దైన రెక్కలు. చేతి నిండా డబ్బు- చుట్టుపక్కల గల వంద గ్రామాల్లో నుండి పేషెంట్లు.ఈ టౌన్లోనే ఏ డాక్టరుకు లేని ప్రాక్టీసు. అనేకమంది ప్రముఖుల మధ్య కూడా తను ఎడంగా ఒంటరిగా ఎందుకు వుంటున్నాడో తెలియడం లేదు.

మరొకమారు గాలి వీచి కిటికీలు కొట్టుకొని పగలకుండా మిగిలిన ఒకటి రెండు గాజుపలకలూ పగిలిపోయాయి. ఈ బిల్డింగ్‌ సాంతం దిగబడిపోయినా తనేం చేయజాలడు. ఈ వస్తువులను తను కొనగలడే గాని వాటి మీద అధికారం సంపాదించలేకపోయాడు.

తన తోటి డాక్టర్లంతా డబ్బుతో, హోదాతో చాలా సంతోషంగా బతుకుతున్నట్లుగానే తోస్తున్నది. టౌనంతా ఇళ్ల స్థలాలు కొంటున్నారు. నర్సింగ్‌ హోంలు కడుతున్నారు. అందరి నర్సింగ్‌ హోముల్లోకి ఏ పెద్ద కేసు వచ్చినా తను వెళ్లవల్సిందే. అందరికన్నా ప్రాక్టీసు తనకే ఎక్కువ.

అయినా తనకు రోజురోజుకూ మనసులో ఖాళీ పెరుగుతోంది! ఎందుచేత?

ఈ ఇంట్లో ఇలాంటి ఆలోచనలకన్నా, ఏ ఆలోచనలూ లేకుండా తుఫాను గాలిలో బయట తిరగడమే సుఖంలా తోచింది. స్పష్టం కాని వేదనలు, వెతుకులాటలు చాలా వున్నాయి. తుఫాను గాలిలో కూలిపోయిన గుడిసె శకలాలను తీసిన విధంగా, కాలి కూలిపోయిన గ్రామంలో అమూల్య వస్తువులను వెతికిన విధంగా- తన ముప్పయ్యారు సంవత్సరాల బతుకులోని కావలసిన వాటిని ఒక క్రమపద్ధతిలో పెట్టడం సాధ్యం కావడం లేదు. అయినా కమురు వాసనల పొగలో అవి శకలాలు శకలాలుగా మనసులో రూపు కడుతూనే వుంటాయి.

ఆ జ్ఞాపకాలను, శకలాలను అందరిలాగా తనూ ఎందుకు దూరం చేయలేడు? ఏ రకమైన ఫీలింగ్స్‌ లేకుండా డబ్బు, వస్తువులు, ఆస్తులు కొనడమనే పరుగు పందెంలో ఊపిరి సలపకుండా తనెందుకు లీనం కాలేడు? ఏ నిషా లేకుండా తను బొత్తిగా ఎడారిలా ఎందుకు తయారవుతున్నట్లు? ఇలాంటి ప్రశ్నలనేకం అతని మెదడులో ఉరుముల్లా మెరుపుల్లా రేగుతున్నాయి.

నాగేంద్రంకు ప్రతి ప్రశ్నకూ ప్రతిసారీ జవాబు కూడా తెలుస్తున్నట్లుగానే వుంటుంది. కానీ ఆ జవాబుల్ని తను ఆమోదించలేడు.
ఆమోదించడమంటే ద్వంద్వంలో దేన్నో ఒకదాన్ని సమర్థించడమన్నమాట. దేన్నో ఒకదాన్ని సమర్థించడమంటే ఇంకోదాని ఉనికిని తిరస్కరించడమన్నమాట.

ఇంట్లో భార్య, బయట మిత్రులూ, చదివిన చదువు, చేపట్టిన వృత్తి తన మీద గోబెల్‌లా దాడిచేసి పదేపదే చెప్పుతుంటాయి. ‘నువ్వు డాక్టరువి! నువ్వు డాక్టరువు కావడానికి నీ నిరంతర శ్రమ, పట్టుదలే కారణం. నీ స్వయంకృషి, స్వంత తెలివి. కనుక నీ కష్టానికి ప్రతిఫలంగా సంపాదించు, విలాసంగా జీవించు, మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించు. నువ్వు ఏ భయంకర పరిస్థితుల నుండి వచ్చావన్నది కాదు. నువ్వు ఎంత సుఖంగా బతుకుతున్నావనేదే ముఖ్యం.’ ఎన్ని విధాల తిప్పి చెప్పినా సారాంశం ఇదే. పైగా ఈ దారిలో నాగేంద్రం వెనుకబడి కూడా లేడు. ప్రాక్టీసు చేయకుండా వుండలేని, సంపాదించకుండా వుండలేని, డబ్బు, వస్తువుల ముట్టడిలో చిక్కుకుపోకుండా వుండలేని ఊపిరి సలుపని హోదాలో నాగేంద్రం బతుకుతూనే వున్నాడు. ఈ పరుగుపందెం సాంతం తన కృషి ఫలితమేనా? స్వయంకృషి పేర జరిగిన విధ్వంసమా ఇది?
నాగేంద్రంకు రాత్రి నిదుర పట్టదు. అతనికి తీయని కలలు రావు. వచ్చే కలలన్నీ పీడకలలే. ఒకసారి ఇసుక తుఫానులో చిక్కుకున్నట్టు, మరొకమారు ఎలు గడిపడిన అడవిలో దిక్కు తోచక పరుగెత్తుతున్నట్టు. మెత్తటి పరుపు అంపశయ్యలాగా తోస్తుంది. భార్య సరసన పడుకున్నప్పుడు చెప్పరాని దుర్మార్గమేదో కొండచిలువలాగా చుట్టుకున్నట్లు… రూపాయి నోట్లను కావలించుకున్నట్లు భావనలు.

తన దగ్గరికి వచ్చే రోగుల ముఖాలలో, మరీ ముఖ్యంగా కళ్లలో బీద బీదగా మృత్యువు దోబూచులాడుతూ వుంటే తనకెక్కడో కలుక్కుమంటుంది. తన చిన్నతనం, పల్లె బతుకు, తండ్రి ముఖం చుట్టుముడతాయి.

ద్వంద్వంలో ఒకటి చదువు- అడుగడుగునా మనిషిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టే పరీక్షలు. రెండవది బీదతనపు అవశేషాల నుండి స్వచ్చమైన పల్లె జ్ఞాపకాల నుండి వచ్చిన నాగేంద్రం బతుకు. రెండూ ఎదురు బొదురుగా నిలబడి యుద్ధం చేయడం భరించవచ్చు. కానీ… కానీ ఇవి సమాంతరంగా సాగి సాగి నిరంతరం సంఘర్షించడమే భరింపరానిది.

స్కాలర్‌షిప్పులతోనే ఎం.డి. జనరల్ మెడిసిన్ పాసయ్యాడు. చదువు కసితో మాత్రమే చదివాడు. బీదతనం మీద కసి- తనకు లేకుండా చాలామందికి వున్న సౌకర్యాల మీద కసి. అయితే బుల్‌ను రెచ్చగొట్టి ఆహ్వానించే ఎర్రదస్తీలాగా తనను రెచ్చగొట్టి ఆహ్వానించింది. సాలీడు ఈగను తన ఉచ్చులోకి ఆకర్షించినంత నేర్పుగా రెచ్చగొట్టి ఆకర్షించి కొద్దికొద్దిగా మొత్తంగా చదువు తనను చప్పరించింది… తను డాక్టరయ్యాడు. సంపాదిస్తున్నాడు. కసితోనే పరుగెత్తాడు. ఇప్పుడిక్కడ తను దిక్కుతోచని ఒంటరి. మనుషులు, వారి సామూహిక సుఖదుఃఖాలు, ప్రేమలు లేని కీకారణ్యంలో చిక్కుకుపోయాడు.

తన అందమైన కలల ప్రపంచం ఏది? తనతోపాటు రక్తం పంచుకు పుట్టిన తనవాళ్లు ఏరి? ఈ సుదీర్ఘ భయంకర ప్రయాణపు మజిలీల్లో తనలాగే వచ్చి చేరిన డాక్టర్లు, ఇంజనీర్లు, జడ్జీలు, లాయర్లు, పోలీసాఫీసర్లు వగైరా వగైరా చాలామంది తన చుట్టూ వున్నారు. కానీ కన్నతల్లి, అన్నయ్య, తమ్ముడు, ఊరు, ఊర్లోని మనుషులు, చెట్లు, పక్షులు, గాలి, వాన, ఎండ… ఇంకా చాలా లేవు.

నాగేంద్రం ముఖం రుద్దుకున్నాడు. వెచ్చని టీ తాగుతే బావుండును. వర్షంలో తడిస్తే బావుండును. అరుస్తూ పరుగెత్తితే- పాట పాడితే… కనీసం ఏడవనన్నా ఏడిస్తే తన బరువు దిగిపోవును.

మళ్లీ కల జ్ఞాపకం వచ్చింది. పిల్లవాడి ఏడుపూ బయట కురిసే వర్షంలా, తుఫాను గాలి రొదలాగా విచిత్రమైన, భయంకరమైన, ఇలాంటివేవీ కాని విషాదం కన్నా విషాదంలాగా మారుమోగుతోంది. తనకు పెళ్లయిన కొత్తలో- సులోచనా తనూ బెంగుళూరు వెళ్లారు. తాము దిగిన హోటల్‌ కింది నుండో, వీధిలో నుండో రేడియోలోనో, టేప్‌ రికార్డర్లోనే ఒక పాట వినిపించింది. ఆ పాట కోసం లుంగీతోనే హోటల్‌ పై అంతస్తు నుండి కిందికి పరుగెత్తుకొచ్చాడు. ఫలానా అని చెప్పలేడు గాని ఆ సంగీతం అర్ధరాతి అందరూ నిదుర పోయినప్పడు కుటుంబాన్ని ఒక్కతీ భరించలేక తన తల్లి ఏడ్చినట్లుగానే వున్నది. ఆ పాట తన్ను నిరంతరం వెంటాడుతూనే వున్నది.

నాగేంద్రం పడకకుర్చీలో కూర్చున్నాడు. ఈ ఆలోచనలు ఇట్లాగే కొనసాగితే తనకు పిచ్చెక్కేది ఖాయం. కణతలు రెండు చేతులతో ఒత్తుకుంటూ వర్షాన్నీ, తుఫానునూ తప్ప ఏదీ వినకూడదనుకున్నాడు. నిద్రా, మెలుకువ కాని స్థితిలో నాగేంద్రం తుఫానును వింటూ కూర్చున్నాడు.

***

దబదబ తలుపు చప్పుడు. ఉలిక్కిపడి లేచాడు నాగేంద్రం. తలుపు తీశాడు. తెల్లారిపోయింది. వాన వెలిసింది. ఆకాశంలో మబ్బులు ఉరుకులు పరుగుల మీదున్నాయి. ఎదురుగా కాపౌండర్‌ గోపాల్‌.

‘‘నర్సింగ్‌ హోం నిండా ఎమర్జెన్సీ రోగులే సార్‌. రాత్రి తుఫానులో గుడిసెలు కూలి కాళ్లు చేతులు విరిగిన వాళ్లే సార్‌,’’ గోపాల్‌ తన కాంపౌండర్‌ భాషలో చెప్పుకుపోతున్నాడు.

నాగేంద్రం బట్టలు వేసుకుని స్కూటర్‌ బయటకు తీశాడు. ‘‘గోపాల్‌ తలుపులు వేసేయి. కిటికీల తలుపులు చూడు. కార్పెంటర్‌ దగ్గరికి అటెండర్‌ను పంపు.’’

నాగేంద్రం నర్సింగ్‌ హోం ముందు స్కూటర్‌ ఆపాడు. అప్పటికే చాలామంది రోగులున్నారు. డాక్టర్లు, నర్సులు హడావుడి పడుతున్నారు. సీదా ఆపరేషన్‌ జరిగిన రోగి దగ్గరికి వెళ్లి కేస్‌ షీట్‌ చూశాడు. ఇంకా సెలైన్‌ ఎక్కిస్తున్నారు. రోగికి పర్వాలేదు. తర్వాత కన్సల్టింగ్‌ రూం కేసి నడిచాడు. ఇద్దరు డాక్టర్లూ రోగులను చూస్తున్నారు.

‘‘ఎనీ ఎమర్జెన్సీ,’’ నాగేంద్రం అడిగాడు.

‘‘అంతా తుఫాను తాకిడే- ఒక పిల్లవాడికి ఎముక ఛాతీలో దిగిపోయింది. సునీల్‌ ఆపరేషన్‌ రూంలో వున్నాడు,’’ డాక్టర్‌ సూర్యారావు.

నాగేంద్రం ఆపరేషన్‌ థియేటర్‌ కేసి వెళ్లబోయాడు.

‘‘హి కెన్‌ మానేజ్‌,’’ మళ్లీ సూర్యారావే.

ఇక్కడ తనకేమీ పని లేదు. ‘‘ఒ.కె., నేను టౌన్‌లోని మిగతా నర్సింగ్‌ హోంలు చూసొస్తాను. వెంకటేశ్వరలో ఒక హార్టు పేషెంట్‌ సీరియస్‌గా వున్నాడు. ఈరోజు మీరు మానేజ్‌ చేయండి. ఎనీ అర్జెన్సీ,, ఐ షల్‌ కమ్. ఈరోజు నాకోసం చూడవద్దు.’’ నాగేంద్రం జవాబు వినకుండానే బయటపడ్డాడు.

హార్టు పేషెంటును చూశాడు. నాగేంద్రం కోసమే ఆ పేషెంటు ముగ్గురు కొడుకులూ ఎదురుచూస్తున్నారు. బాగా డబ్బున్నవాళ్లు, టౌనుకు పది కిలోమీటర్ల దూరంలో భూస్వామి- అతని ఇంటి మీద ఎనిమిది రోజుల క్రితం గిరిజనులు కరువు దాడిచేసి ధాన్యం ఎత్తుకపోయారు. ఆ తతంగం చూసి ‘ఎటాక్‌’ వచ్చింది. పోలీస్‌ కేసు. ప్రమాదం దాటింది. సరైన సమయానికి ట్రీట్‌మెంట్‌.

‘‘సార్‌,’’ భూస్వామి పెద్దకొడుకు సారా కాంట్రాక్టరు.

డాక్టరుకు వుండకూడదని చదువులో నేర్చుకున్నదేదో ఎదురు తిరుగుతోంది. ఎంతమందిని చంపుకు తిన్నాడో? చావు దగ్గరికి వచ్చేసరికి విచిత్రం తను, తన సేవలు, చదువుకున్న జ్ఞానం ఇలాంటి వాళ్లకే ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. తను అంత కసిగా చదివింది వీళ్లకు సేవలు చేయడానికేనా? చాలా గమ్మత్తైన సంగతి.

‘‘సార్‌ మా బాపుకు…’’ ఇంకో కొడుకు.

తన ముఖంలో ఇలాంటి నీడలు బయటి వాళ్లకు తెలియరాదు.

‘‘సో, ప్రమాదం దాటినట్టే. పేషెంటును మాట్లాడనీయవద్దు, ముఖ్యంగా రెండు రోజుల దాకా పోలీసులు కనపడకుండా వుంటే మంచిది,’’ అంటూనే నర్సింగ్‌ హోం అధిపతి డాక్టర్‌ రెడ్డికి నిలబడే ప్రిస్క్రిప్షన్‌ రాసి ఇచ్చాడు.

నాగేంద్రం బయటపడేసరికి నంగనాచిలా ఎండ కాస్తోంది. ‘ఔరా నాగేంద్ర, డాక్టరీ సదువుతున్నవట,’ తమ ఊళ్లో దొర అపహాస్యం చేస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి.

మృత్యుముఖం నుండి బయటపడిన రోగి ముఖం లాగున్నది ఆకాశం. ఎడతెరిపి లేని ముసురులో ఆకలితో మగ్గిపోయి- ఉరిసిన గుడిసెలో వనుకుబట్టి- ఒక్కసారి ఎండను చూసి పిచ్చెత్తి పరుగులు పెట్టిన బరిబాత పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆ పిల్లల్లో తను వున్నాడు. బొబ్బలు పెట్టే వాగు, మురికినీటి ప్రవాహంలో కొట్టుక వచ్చే అడవిలోని కర్ర దుంగలు- వాటికోసం పోటీలు పడి ఈదులాడే మనుషులు జ్ఞాపకం వచ్చారు.
ఆ జ్ఞాపకాలను పొడిగించే ఇష్టంలేక, సాహసం లేక స్కూటర్‌ స్టార్టు చేశాడు. హైవే మీద కొంతదూరం పోయేసరికి రోడ్డుకు ఆ పక్క, ఈ పక్కన గల పచ్చిరిక చెట్లు వేళ్లతో సహా పెకలించబడి రోడ్డు కడ్డంగా పడి వున్నాయి. బారులు తీరి లారీలు ఆగిపోయి వున్నాయి. డ్రైవర్లు, క్లీనర్లు ఆ చెట్ల చుట్టూ కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నారు.

ఎటు చూస్తే అటు నీళ్లు తెల్లగా ఇంకా పారుతూనే వున్నాయి.

స్కూటర్‌ వెనక్కు తిప్పుకుని సందుల గుండా ఇస్లాంపురా వెళ్లాడు. అక్కడ ఏడుపులు సుళ్లు తిరుగుతున్నాయి. అట్టలతో, రేకులతో కట్టిన చాలా గుడిసెలు కూలిపోయి అక్కడ బుల్డోజర్‌ తొక్కినట్లుగా అయిపోయింది.

‘‘యా ఆల్లా! పూరా సత్తెనాశ్‌ హోగయా!’’ స్త్రీలు ఏడుస్తూ కూలిన గుడిసెల మరమ్మత్తుల్లో పడిపోయారు. సాయెబులు మురికి లాగులు తడిసీ తపాతపా కొట్టుకుంటుండగా దిక్కుతోచక అక్కడికక్కడికి తిరుగుతున్నారు.

నాగేంద్రంను దాదాపు అందరూ గుర్తుపట్టి చుట్టూ మూగారు.

‘‘దేఖో సాబ్‌! హమారా పాస్‌ కోయీ నయీ ఆయా! హిందూ మొహల్లేమే సానామంది సాయం చేస్తుండ్లు. ఇక్కడికి ఎవలు…’’ ఏమనుకున్నాడో ఏమో- అతను చెప్పేది విన్పించకుండా అతని చంకలోగల నల్లటి అమ్మాయి ఆకలికి తాళలేక ఏడుస్తోంది. ‘‘ఆప్‌ దేఖో సాబ్‌ ఇన్సాఫ్ (న్యాయం మీరే చూడండి)’’ ఆఖరి మాట అనేశాడు.

ఎటు చూసినా మురికి పిల్లలే. వారి ఏడుపులు, తొక్కిసలాట, వీళ్ల బతుకు చిన్నాభిన్నం కావడానికి పెద్ద వర్షం చాలు. ఆ ఏడుపులు తనను చుట్టుముడుతున్నాయి. అక్కడ తను ఒక్కడూ చేయగలిగిందేమీ లేదు. అనంతమైన దరిద్రం సహాయాలకు లొంగేది కాదు.

‘ఏదైనా ఇంతెజాం చేయాలి. కనీసం ఈ పూట తిండైనా,’ అనుకుంటూ ఆక్కడి నుండి బయలుదేరాడు.

దారిలోనే స్పిన్నింగ్‌ మిల్‌ కాలనీ.

అక్కడ యమ సందడిగా వున్నది. చాలామంది వలంటీర్లు తమ తమ సంస్థల బ్యాడ్జీలు ధరించి వున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలూ వాటి అనుబంధ సంస్థలూ రంగంలో వున్నాయి. ఎవరి గ్రూపు నాయకులు వారికే పనులు పురమాయిస్తున్నారు. లారీలు వచ్చి నిలుస్తున్నాయి. స్త్రీలు, పిల్లలు, ముసలీ ముతకనూ స్కూళ్లు, సత్రాల్లోకి తరలిస్తున్నారు. నాయకులు నాగేంద్రంను గుర్తుపట్టారు.

‘‘ఇస్లాంపురాలో ఇంకా భారీ నష్టం జరిగింది. అక్కడి పరిస్థితి ఘోరంగా వున్నది. అక్కడ ఒక్క కార్యకర్త కూడా లేడు,’’ నాగేంద్రం మాట పూర్తి కాకుండానే,

‘‘అంతమందిని పోటీ మీద ఎందుకు కనాలె సార్‌,’’ అన్నారెవరో.

ఒక చోటాలీడరు ఈ గొడవేం పట్టకుండా దిక్కులు చూస్తున్నాడు. అతనికి ఈ సహాయ కార్యక్రమాలకన్నా రాని విలేకరుల మీదే వున్నది కన్ను. తన మనుషులను ఫోటోగ్రాఫర్ల కోసం పంపాడు కూడా.

అక్కడా, తను చేసేదేమీ లేదు. తను అక్కడి ఏదో పార్టీకి చెందకుండా ఏదీ చెయ్యనియ్యరని తేలిపోయింది.

నాగేంద్రం ఆక్కడి నుండి తమ క్లబ్బు ప్రెసిడెంటు ఇంటికేసి స్కూటరు పరుగెత్తించాడు.

ఒక అందమైన ఆధునాతనమైన బిల్డింగు ముందు స్కూటర్‌ ఆపి హారన్‌ మోగించాడు. హారన్‌ విని నౌకరు పరుగెత్తుకొచ్చి గేటు తీశాడు. పాలమీగడలా తెల్లగా వున్న పామెరిన్‌ జాతి బొచ్చుకుక్క పరుగెత్తుకొచ్చి నాగేంద్రం కాళ్లు నాకింది. దాని వీపు మీద ప్రేమగా రాసి ఇంటి ముందు గల గార్డెన్‌లోకి అడుగుపెట్టాడు.

పూలతోట గాలివానకు చిందరవందర అయినందుకు ఎర్రగా, బొద్దుగా వున్న ఆ ఇంటి ఇల్లాలు నౌకర్ల మీద చిరాకు పడుతూ కన్పించింది. నాగేంద్రంను చూడగానే చిరునవ్వు పులుముకొని, ‘‘రండి అన్నయ్యగారు,’’ అని వెళ్లిపోయింది.

నాగేంద్రం వరండాలోగల కేన్‌ కుర్చీలో కూర్చుండి వరండా గ్రిల్స్‌కు అల్లుకుపోయిన మనీప్లాంటు ఆకుల మీద మెరిసే నీటి బిందువులు చూస్తున్నాడు.

కాసేపటికి ఆవులిస్తూ నిద్ర మొహంతో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శాస్త్రి వచ్చాడు. నాగేంద్రం పక్క తనో కేన్‌ కుర్చీలో కూలబడి ‘‘నిన్నటి దాక ‘చీఫ్‌’ టూర్‌. వేపుక తిన్నాడనుకో,’’ అంటుండగానే పది సంవత్సరాల వయసుగల పనిపిల్ల ఇద్దరికీ కాఫీ తీసుకు వచ్చింది.

ఆ ఇంటి ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చగా పూలతోట, దర్జాగా కేన్‌ కుర్చీలో కూర్చున్న బొచ్చుకుక్క, ఇంటావిడ పచ్చటి ముఖం, మనీప్లాంటు పచ్చదనం అన్నీ కలిసి ఇక్కడ బురదా, బొచ్చూ, కూలిన గుడిసెలూ, ఏడుపులూ పెడబొబ్బల ప్రస్తావన తేవద్దని చెప్పకనే చెప్పుతున్నట్టున్నాయి.

‘‘రాత్రి ఏం తుఫాను. నా జన్మలో ఇలాంటి తుఫాను చూళ్లేదు డాక్టర్‌! మీరు పాలగుమ్మి పద్మరాజుగారి ‘గాలివాన’ కథ చదివారా? మార్వలెస్‌ స్టోరీ, మొత్తం జలమయమై పోగలదేమోననిపించింది డాక్టర్‌!’’ శాస్త్రి కాఫీ కప్పు కింద పెడుతూ అన్నాడు.

శాస్త్రికి దేనినీ వర్ణించే భాషలేదు. అతను ఆఫీసు భాషలో తప్ప ఇతరత్రా నాలుగు మాటలు మాట్లాడలేడు.

నాగేంద్రంకు ‘గాలివాన’ కథ జ్ఞాపకం వచ్చింది. ఆ కథ మీద నాగేంద్రంకు అనేక సందేహాలున్నాయి. ముఖ్యంగా బీభత్సంలో రొమాన్సు, క్వయిట్‌ అన్నాచురల్‌- ఎనీ హౌ? ఊళ్లో రాత్రి సంభవించిన తుఫాను బీభత్సం గురించి శాస్త్రికి చెప్పాలనుకున్నాడు.

శాస్త్రి సిగరెట్టు ముట్టించి నోటిలో నుండి పొగలు కక్కుతూ, ‘‘డాక్టర్‌ నువ్వు కారెప్పుడు కొంటావ్‌? ఎంబాసిడర్‌, ఫియట్‌ ఓల్డు ప్యాషన్‌- మారుతి ఈజ్‌ సూపర్బ్‌,’’ తుఫానుతో తమకేమిటి పనన్నట్లుగా అన్నాడు.

‘‘శాస్త్రిగారూ రాతి తుఫానుకు మన టౌన్‌లో ఫిప్టీ పర్సెంటు గుడిసెలు కుప్పకూలిపోయినయ్‌. అన్నిరకాల పార్టీలవాళ్లూ తమకు తోచిన సహాయం చేస్తున్నారు. తిండిలేక నిర్వాసితులు గగ్గోలైపోతున్నారు. మన క్లబ్బు తరపున నిర్వాసితులకు భోజనం ఎల్లా వుంటుంది?’’ నాగేంద్రం అర్ధాంతరంగా అతుకు లేసినట్లుగా చెప్పుకొచ్చాడు.

శాస్త్రి బొచ్చుకుక్కను చేతుల్లోకి తీసుకొని, ‘‘యూనో డాక్టర్‌ అవర్‌ క్లబ్ ఈజ్‌ ప్యూర్లీ నాన్‌ పొలిటకల్‌. మున్సిపాలిటీ వున్నది. ఓట్ల కోసం వెంపర్లాడే పాలిటికల్‌ పార్టీలున్నాయి. ఇంకా చాలారకాల ఆర్గనైజేషన్స్‌ వున్నాయి. మనకు అంత పెద్ద పని సాధ్యం కాగలదా? డబ్బు ప్రాబ్లమ్ కాదు. మనకు కార్యకర్తలు ఏరీ? మనం డబ్బు ఇచ్చామనుకోండి. పేరు ఇతర ఆర్గనైజేషన్స్‌కు పోతుంది. అయివా ఐ క్యాంపులు, డెంటల్‌ క్యాంపులంటే మనం మానేజు చేయవచ్చు,’’ అన్నాడు.

‘‘అంతకన్నా ఇది ముఖ్యం కాదా?’’ నాగేంద్రం క్లబ్బుకు వైస్‌ ప్రెసిడెంటు అయినా ఓటమి గొంతుతో.

‘‘ఓకే- హఠాత్తుగా జరిగిందిది. మనిద్దరమే డెసిషన్‌ తీసుకోలేము కదా! పైగా బిగ్‌ జాబ్‌- కనీసం బాడీనన్నా పిలవాలి,’’ శాస్త్రి.

‘‘కానీ ఈ సమయంలో మనం కూడా ఏదైనా చేయకపోతే బావుండదు శాస్త్రీ సాబ్‌, ఎనీ హౌ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.’’

‘‘ఓకే… ఐ విల్‌ ట్రై,’’ శాస్త్రి.

నాగేంద్రం ఇంక అక్కడ చేసేదేమీ లేక బయటపడ్డాడు.

‘తను డాక్టర్‌ కనుక, తనతో పని కావలసే తనకు పదవి ఇచ్చారనిపించింది. బీద ప్రజానీకం తన పేషంట్లు కాకపోతే ఈ ప్రపోజల్‌ శాస్త్రే పెట్టేవాడు. చదువులు నేర్చిన తెలివితేటలు కదా,’ అనుకున్నాడు నాగేంద్రం.

***

రెండు రోజులు డాక్టర్‌ నాగేంద్రం తుఫాను బాధితులతోనే గడిపాడు. స్కూళ్లల్లో చేర్చినవారికి భోజన సదుపాయాలు చేశాడు. వర్షంలో తడిసి తుఫానులో గాయపడ్డవారికి మరో ఇద్దరు ఎంబిబిఎస్‌ డాక్టర్లను వెంటేసుకొని చికిత్సలు చేశాడు.

అయినా నాగేంద్రం మనుసులో తుఫాను చల్లారలేదు. తన మనసులోని తుఫాను స్వరూప స్వభావాలేమిటో స్పష్టంగా తెలియడం లేదు. అన్ని జబ్బులకు కారణాలు, మందులు తెలిసిన నాగేంద్రంకు తన మానసిక ఆందోళనకు కారణాలూ, మందూ తెలియవు. ప్రశ్నలు లేకుండా ప్రపంచం ఎట్లా వడి తిరిగితే అట్లా వడి తిరిగిపోవాలని, అందిన కాడికి స్వంతం చేసుకోవాలని దైనందిన జీవితం, వృత్తి శాసిస్తాయి. కాని మనసు అందుకు సిద్ధం కాదు. ఈ ద్వంద్వం తను డాక్టర్‌ కోర్సులో చేరిన దగ్గరి నుండీ పెరుగుతూ వచ్చిందే కాని తరుగలేదు. ఈ తుఫాను తగ్గేదెప్పుడో తెలియడం లేదు.

తన స్వంత క్లినిక్‌లో కూర్చుండి ఇలాంటి ఆలోచనలు చేస్తున్న నాగేంద్రం క్లినిక్‌ ముందు మారుతికారు ఆగింది.

చిల్డ్రెన్‌ స్పెషలిస్టు నందకుమార్‌ ఆదరాబాదరాగా ‘‘డాక్టర్‌ సాబ్‌ మీరింకా ఇక్కడే వున్నారా? టౌన్‌ హాల్లో మీటింగ్‌. మంత్రిగారు వచ్చారు. మీరు మన క్లబ్బు తరఫున మాట్లాడాలని మరిచిపోయారా?’’ అన్నాడు.

‘‘నేనా, దేన్ని గురించి?’’ నాగేంద్రం కుర్చీలో నుండి లేస్తూ అడిగాడు.

‘‘అదంతా దారిలో మాట్లాడుకుందాం. ముందు కారెక్కు,’’ తొందరచేశాడు నందకుమార్‌. నాగేంద్రం క్లినిక్‌లో పేషెంట్లు లేరు. అయిష్టంగానే కారెక్కాడు.

‘‘తుపాను తాకిడికి మన టౌను సగం అతలాకుతలం అయ్యింది. ఆస్తి నష్టం అట్లా వుంచు. ఆరుగురు చనిపోయారు. రెండు రోజుల నుండి నువ్వు అవన్నీ చూస్తున్నావు. నిర్వాసితులకు ఏదన్నా సహాయం అందేలా సిఫార్సు చేయాలి,’’ నందకుమార్‌.

నాగేంద్రంకు ఆశ్చర్యంగా వున్నది. మొన్న వీళ్లందరి చుట్టూ తను తిరిగాడు. ఎవరూ ముందుకు రాలేదు. మంత్రి రాకతో వీళ్లే హడావిడి పడుతున్నారు. గవర్నమెంటు కన్నీటి తుడుపుగా ఏమన్నా చేస్తుందో లేదో తెలియదు. ఆ చేసేది తమ అభ్యర్థన మేరకే చేసినట్లుగా వీళ్లకు పేరు కావాలి. అభ్యర్థన తను చేయాలి.

నాగేంద్రంకు ఊళ్లో దొర జ్ఞాపకం వచ్చాడు. దొర గ్రామాన్ని అందిన కాడికి దోచేసి ఏడాదికోమారు పురాణం చెప్పించి గుళ్లో పూజలు చేసేవాడు. ఆ దెబ్బతో దొర పుణ్యాత్ముడు. ఊళ్లో దొర కాళ్ల కింద నలిగిపోయిన వాళ్లు దొర ధర్మబుద్దికీ, అన్నసంతర్పణకూ పొంగిపోతారు. అధికార్లు, డాక్టర్లూ తమకు అందిన మేరకు ప్రజల నుండి పిండుకొని కష్టకాలంలో ఆదుకున్న పేరుతో బతికేస్తారు.

నందకుమార్‌ ఇంకా ఏదో చెప్పుతున్నాడు. మంత్రిగారికి స్వాగత తోరణాలు దారి పొడుగునా కట్టారు. రోడ్డుకు ఆ పక్క ఈ పక్క అలిసిపోయిన ముఖాలతో పోలీసులు నిలుచున్నారు.

కారు టౌనుహాలు చేరుకునేసరికి టౌను పెద్దలూ వ్యాపారస్తులూ అన్నిరకాల అధికారులూ పార్టీ కార్యకర్తలూ హడావిడి పడుతున్నారు.

తమ క్లబ్బు ప్రెసిడెంటు శాస్త్రి ఎదురొచ్చి, ‘‘ఇంతాలస్యమా?’’ అన్నాడు.

మంత్రి ఇంకా రాలేదు. మంత్రి సహాయక శిబిరాలను సందర్శించి వస్తున్నారట.

నందకుమార్‌, నాగేంద్రం వేదిక ముందుభాగంలో గల విఐపీ సీట్లలో కూర్చున్నారు.

మరో అరగంట తరువాత మంత్రిగారు మందీ మార్బలంతో వచ్చారు. ఆయన వెంటు కలెక్టరూ, ఎస్‌.పి. వచ్చారు.

వేదిక మీద మునిసిపల్‌ చైర్మన్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడూ, వర్తక సంఘం అధ్యక్షుడూ వగైరా చాలామంది కూర్చున్నారు.

అందులో ఒకరు బొంగురు గొంతుతో మంత్రిగారికి స్వాగత వచనాలు పలికారు.

మంతి చేతులు జోడించి అలవాటుగా చిరునవ్వు నవ్వి వేదిక మీదికి ఎక్కారు.

మంత్రిగారిని అన్ని సంఫూల వాళ్లు పోటీపడి పూలమాలలతో ముంచెత్తారు. మంత్రిగారికి సన్మానం జరుగుతున్నదో, తుఫాను నిర్వాసితుల పరామర్శ జరుగుతున్నదో నాగేంద్రంకు అర్థం కాలేదు.

హాలంతా కలియచూశాడు. ఆ సభలో మురికి బట్టలవాళ్లు, తుపాను బాధితులు ఒక్కరన్నా లేరు. అందరూ అంతో ఇంతో చదువుకున్న వాళ్లలాగే కనిపిస్తున్నారు.

మీటింగు ఆరంభమయ్యింది. ఎమ్మెల్లే మంత్రిగారిని తను నేర్చుకున్న భాషలో పొగిడాడు. మంత్రిగారు బీద కుటుంబం నుండి వచ్చినట్లుగా గుర్తు చేశాడు. మంత్రి హరిజనుడని చెప్పకనే చెప్పాడు. చదువు ద్వారా నేర్చుకున్న భాష ఎంత దగుల్బాజీ భాషో నాగేంద్రంకు అర్థమయ్యింది.
మంత్రికి ఇంకా నలభై సంవత్సరాలు నిండలేదు. ఇంకా మంత్రి పదవికి అలవాటు పడినట్లుగా లేడు. ఆ పొగడ్తలకే మంత్రి ముఖంలో దరహాసం.

ఆ తరువాత మునిసిపల్‌ చైర్మన్‌ తన సుదీర్ఘ ప్రసంగంలో తన కులంవాళ్లు నివసించే ప్రాంతాలల్లో తుపాను తాకిడి గురించి చెప్పుకొచ్చాడు.
నాగేంద్రం పక్కనే కూర్చున్న నందకుమార్‌, ‘‘మీట్‌ అవర్‌ ఎస్‌.పి.’’ అన్నాడు హఠాత్తుగా,

నాగేంద్రంకు ఎడమపక్కన సివిల్‌ డ్రెస్సులో గల ముప్పయి రెండు సంవత్సరాల యువకున్ని చూపిస్తూ, ‘‘హీ ఈజ్‌ అవర్‌ కొలీగ్‌ మిస్టర్‌ నాగేంద్ర. ఎం.డి. ఫిజీషియన్‌,’’ నందకుమార్‌.

నాగేంద్రం ఎస్‌.పి.తో చేయి కలిపాడు.

‘‘ఐసీ…’’ ఎస్‌.పి. పోలీసు నవ్వుతో.

‘‘థాంక్యూ సర్‌,’’ నాగేంద్రం.

ఉపన్యాసాలు జోరుగా సాగుతున్నాయి.

ఉపన్యాసంలో ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. పొడిమాటలు. ఒకరినొకరు మోసం చేసుకోవడానికి విఫల ప్రయత్నాలు- ఆ మాటల్లో తుఫాను వారికి దొరికిన ఒక మంచి అవకాశంగా నాగేంద్రంకు తోస్తున్నది. తుఫాను బీభత్సం గురించి రవ్వంత ఆర్తి ఆ మాటల్లో లేదు. ఎవరి కక్కుర్తి వాళ్లదే.

తుఫాను భీభత్సంలో గుడిసెలు కూలి గొడ్లలాగా నిర్వాసితుల క్యాంపుల్లో రోదిస్తున్న దురదృష్టవంతుల ఏడుపు ఇక్కడి వాళ్లకెవరికీ పట్టదు. వీళ్లు చదువు మాయాజాలంలో తప్పిపోయినవాళ్లు.

‘ఇంతమంది చదువుకున్నవాళ్లు?’ నాగేంద్రంకు ఏదో స్పష్టమైనట్టనిపించింది. వీరందరి మాటలూ, సంస్కారం ఒక్కటే. సారూప్యం ఎక్కడ? ముక్క ముక్కలుగా తెగిపోయి- పోటీ ప్రపంచంలో ఎవరికి అందినది వారు ఒడుపుతో చేజిక్కించుకోవడమే. అద్భుతమైన, శక్తివంతమైన మాటల్లో చెప్పవీలుగాని సామూహిక మానవ సంఘ జీవితం నుండి వీళ్లంతా ఎందుకిల్లా స్వార్థపరులుగా ఒకొక్కరుగా- ఒక్కరు మళ్లీ అనేక చిన్నచిన్న ముక్కలుగా విడిపోయారు? ఇంత పకడ్బందీగా వీరికి శిక్షణ ఇచ్చిన శక్తేది? తన దగ్గరికి చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులూ, ఫూట్ల నుండి గిరిజనులూ వస్తారు. అక్కడ ఎవరికన్నా ప్రమాదం జరిగితే గ్రామం, ఫూట్‌ యావత్తు తల్లడిల్లిపోతుంది. ఇక్కడ ఒకని కాళ్ల కింద భూమి మరొకడు తొలిచే కుయుక్తి ఎట్లా వచ్చింది?

ఉపవ్యాసాలు నడుస్తున్నాయి. నాగేంద్రం అప్పుడే మనుషులను చూస్తున్నటుగా తనకు కన్పించిన ముఖాన్నల్లా పరిశీలనగా చూశాడు.
మైకులో, ‘‘ఫలానా క్లబ్బు తరపున డాక్టర్‌ నాగేంద్రం మాట్లాడతాడు,’’ అని విన్పించింది.

నాగేంద్రం వేదిక ఎక్కుతుంటే తుఫాను రాత్రి వచ్చిన కల. తల్లి, తమ్ముడు, ఆక్సిడెంట్‌లో చనిపోయిన అన్నయ్య, కుటుంబం గడవక ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌ పని చేస్తున్న వదిన- పెళ్లీడుకొచ్చిన అన్నయ్య కూతురూ- జ్ఞాపకం వచ్చారు. మైకు ముందు నిలబడినప్పుడు,
జొన్నకళ్లం దగ్గర పాము కరిచి నురుగులు కక్కుతూ చనిపోయిన తండ్రి ముఖం అస్పష్టంగా మెదిలింది.

రెండు నిమిషాలు పూర్తిగా మాటలు మరిచిపోయినవానిలాగా అసలు మాటలేవీ నేర్చుకోనివానిలాగా నిలుచున్నాడు.

సభలో అలజడి కొద్దిగా- నాగేంద్రం వెనుక కుర్చీలో కూర్చున్న మునిసిపల్‌ చైర్మన్‌, ‘‘డాక్టర్‌ సాబ్‌!’’ అన్నాడు గుసగుసగా.

నాగేంద్రం ఉలిక్కిపడి అప్పుడే అక్కడికి పరుగెత్తుకొచ్చిన వానిలాగా అందరి ముఖాలూ చూసి- ‘‘గౌరవనీయులైన మంత్రిగారికీ, పెద్దలు, పుర ప్రముఖులు, అధికారులూ అందరికీ నా వందనాలు. ఈ సభ తుఫాను బాధితుల గురించి మంత్రిగారి పరామర్శ సందర్భంలో ఏర్పాటు చేసుకున్నాం. మొన్న రాత్రి సంభవించిన ఘోరమైన తుఫానులో మన పట్టణంలో దాదాపు సగభాగం దెబ్బతిన్నది. వేలాదిమంది దిక్కుతోచక నిర్వాసితులుగా వున్నారు. నిర్వాసితులకు అందవల్సిన సహాయం గురించి అధికారులూ పురప్రముఖులూ ఇక్కడ ఇంతదాకా తర్జన భర్జన పడుతున్నట్లుగా నాకు ఆర్థమయ్యింది.

‘‘నిర్వాసితులకు ఏం కావాలో నిర్ణయించడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. గమ్మత్తేమిటంటే, తుపాను బాధితులు తమకేం సహాయం కావాలో పెద్దలకు చెప్పుకోవడానికి ఒక్కరన్నా ఈ సభకు వచ్చారేమోనని సభంతా కలియచూశాను. కానీ వాళ్లు ఇంతదాకా రాగలిగిన స్థితిలో లేరనుకుంటాను.

‘‘తుఫానులకూ దరిద్రానికీ చిక్కే ప్రజలు- మనకు పాలూ పెరుగుతో ఆరోగ్యం, తెలివితేటల చదువు, ఓట్లతో మంత్రిగారికి మంత్రిపదవి, నాబోటి వానికి డాక్టరు వృత్తి ఇప్పించి తాము మాత్రం నిత్యం దరిద్రంలో మగ్గిపోయే పేదప్రజలు- ఇక్కడ కూర్చున్న వాళ్లమందరం మన దేశంలోని ప్రజల తరఫున చదువుకొని జ్ఞానవంతులమయ్యాం. ప్రతిఫలంగా మన జ్ఞానంతో వాళ్ల కష్టసుఖాలు చూస్తారనుకున్నారు.’’ ఈ మాటతో నాగేంద్రం కంఠం వొణికింది. తల్లి జ్ఞాపకం వచ్చింది. చిత్రంగా వేన వేల మాటలు పోటెత్తుతున్నాయి. డాక్టర్‌ సంస్కారం గొంతు నొక్కుతోంది.
‘‘టౌను సగం శిథిలమయింది. అధికారులూ, మంత్రిగారూ చూసి వచ్చారు. మనం మన గొప్ప పనుల్లో, బాధ్యత కలిగిన బతుకుల్లో తలమునకలై ఉన్నాం. నిజమే! కనీసం తుఫాను బాధితులు కోలుకోవడానికి మన వంతు బాధ్యతగా కాకున్నా సహాయంగానైనా ఎంతోకొంత చేయాలని నేను అనుకొంటున్నాను. నాకీ అవకాశం కలిగించిన పెద్దలకు మారోమారు నమస్కారాలు తెలుపుకుంటున్నాను.’’

నాగేంద్రం వేదిక దిగి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు.

అక్కడ కూర్చున్న చాలామందికి అర్థం అయిందో, అర్థమైనా పట్టించుకోకూడదనో మొత్తానికి ఎవరూ ప్రతిస్పందించలేదు.

మరో నాయకుడు తన సహజ ధోరణిలో మాట్లాడాడు.

టౌనుహాలు బయట వర్షం పెద్దపెట్టున వచ్చింది. బయట నిలబడిన వాళ్లు హాల్లోకి తోసుకవచ్చారు.

పక్క సీట్లోంచి ఎస్‌.పి. లేచి వెళ్లాడు.

ఈ ఉపన్యాసాలు నాగేంద్రం భరించలేకపోయాడు. ఎట్లాగో సందు చూసుకొని బయటపడ్డాడు.

వరండాలో ఎస్‌.పి. అడిషనల్‌ ఎస్‌.పి.తో, ఇద్దరు డి.ఎస్పీలతో ఏదో మాట్లాడుతున్నాడు. వర్షం కురుస్తోంది.

డియస్పీలిద్దరూ కింది కులం నుండి డక్కా మొక్కీలు తిని పైకి వచ్చిన వాళ్లలాగా వున్నారు.

కొంచెం వయసు మళ్లిన డియస్పీ, ‘‘చదువుకున్న వాళ్లంతా ప్రజలకు ద్రోహం చేస్తున్నారని డాక్టరు సాబ్‌ కోప్పడ్డారు,’’ అని ఇంగ్లీషులో ఎస్‌.పి.కి చెప్పాడు.

‘‘ఐ సీ… ఆసక్తిగా వుందే,’’ ఎస్‌.పి. ఇంగ్లీషులోనే.

‘‘ఇది నా అనుభవం సార్‌- ఎవరిని నేను వేలెత్తి చూపలేదు సార్‌,’’ నాగేంద్రం.

‘‘నిజమే. కానీ మీ పరిశీలన కొత్తగా వున్నది,’’ అడిషనల్‌ ఎస్‌.పి.

‘‘ప్రజల డాక్టరు కదా!’’ ఆ టౌను డియస్పీ.

‘‘ఓ ఐ సీ,’’ ఎన్‌.పి.

నాగేంద్రంకు వాళ్ల మనసుల్లో గల భావం అర్థమయ్యింది. ఎస్‌.పి.కి అర్థం కాదు. కాని డియస్పీలు కింది నుండి వచ్చినవాళ్లు- బీదతనపు తల్లి పేగు తెంచుకొని వచ్చినవాళ్లు- వాళ్ల బంధువులకూ తల్లిదండ్రులకూ వ్యతిరేకంగా పాలితుల తరపున అధికారులుగా మారే క్రమం ఎక్కడున్నది? ఇది ఒక క్రమపద్దతిలో జరిగిన తంతేనా? వాన తగ్గింది. తుంపర పడుతున్నది. పోలీసు అధికారులు లోపలికి నడిచారు. నాగేంద్రం తుంపరలో తడుస్తూ బయటకు నడిచాడు.

***

ఉదయం పదకొండు గంటలయ్యింది. నలుగురు కొడుకులూ ఒక కూతురుండి కూడా ఒక్కర్తే డయాబెటిస్‌ పేషెంటు వచ్చింది. పాత పేషంటే. ఆమెకు రోగతీవ్రత కన్నా తన కన్నకొడుకులు తనను పట్టించుకోవడం లేదనే బాధ ఎక్కువ.

ఆ మాట చెప్పకోవడానికి ఆమెకు మనిషి లేడు. బాగా ధనవంతులు. గొణుగుతుంది తనలో తానే.

నాగేంద్రం యాంత్రికంగా మాట్లాడుతూ మందులు రాస్తున్నాడు.

‘‘డాక్టర్‌ సాబ్‌ మీకు అమ్మ వున్నదా?’’ పేషెంటు.

నాగేంద్రం పేషెంటు ముఖంలోకి చూశాడు. ఆవిడ కళ్లనిండా నీళ్లు.

‘‘ఉందమ్మా…’’ నాగేంద్రం.

ఆమె మాట్లాడకుండా లేచి వెళ్లిపోయింది. ఆమెకు ప్రేమ కావాలి. మందుల కాగితం కాంపౌండర్‌కిచ్చి పంపాడు.

గడియారం చూసుకున్నాడు. పదకొండూ అయిదు నిమిషాలు. నర్సింగ్‌ హోంకు ఒక రౌండు వెళ్లాలి. నర్సింగ్‌ హోం నలుగురు కలిసిపెట్టారు. సర్జన్‌ వర్కింగ్‌ పార్టనర్‌. మిగతా ముగ్గురికీ వారి వారి స్వంత క్లినిక్‌లున్నాయి.

లేద్దామనుకునేసరికే ఫోను మోగింది.

‘‘హలో జడ్జి శంకర్రావును మాట్లాడుతున్నా, మొన్న అదే వారంరోజుల క్రితం టౌన్‌హాల్లో మీటింగు జరిగింది కదా! కాంట్రవర్షియల్‌గా మాట్లాడారు. డాక్టర్‌ మీరనుకున్నట్టు ప్రజలు తెలివితక్కువవాళ్లు కాదు. చాలా తెలివైనవాళ్లు,’’ జడ్జిగారు తన భాషలో చెప్పుతున్నాడు.

అతనికి ఉద్యమాలంటే కోపం. ప్రతి ఉద్యమం ఉన్నత కులాల సృష్టి అంటాడు. ఉన్నత కులాలవాళ్లు ఉద్యమాలను లేవనెత్తి హరిజనులను బలి పశువులను చేస్తారంటాడు. ఏయే ఉద్యమంలో ఎంతెంతమంది హరిజనులు చనిపోయారో లెక్కలు చెపుతాడు. ప్రజలంటే అతని భాషలో పై కులాలవాళ్లు.

‘‘నేను సిన్సియర్‌గా ఫీలయింది చెప్పాను సార్‌!’’

’’ఉత్త అబద్ధం. మొన్నటి తుపానులో హరిజనవాడను ఏ పోలిటికల్‌ పార్టీ, గవర్నమెంటూ కూడా పట్టించుకోలేదు. యూ నో.’’ జడ్జిగారు చెప్పదలుచుకున్న పాయింటు,

‘‘అసలు ఎవరిని కూడా పట్టించుకోలేదు సార్‌!’’ నాగేంద్రం శాంతంగా.

‘‘అబద్దం. హిందువులను హిందువులూ, ముస్లింలను ముస్లింలూ,’’ జడ్జిగారు వాదనలోకి దిగారు.

పోనీ హరిజనుల బతకులు బాగుపడాలంటే ఏమి చేయాలి? అనే మాట అడుగకముందే జడ్జిగారు చెప్పుకొస్తారు.

‘‘హరిజనులు చదువుకోవాలి. చైతన్యం పొందాలి.’’ ఇదే ధోరణి.

హరిజనుడైన జడ్జిగారు హరిజనులకు చేస్తున్నదేమిటి? ఎవరి తరపున ఎవరికి శిక్షలు ఏ కారణంగా వేస్తున్నాడు? తను రైతు కుటుంబం నుండి వచ్చినవాడే- తను డాక్టరుగా ఎవరికి సేవలు చేస్తున్నాడు? తను తీసుకునే ఫీజు, రాసే మందులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి? తనెక్కడ ప్రాక్టీసు పెట్టాడు?

నాగేంద్రం ఇట్లా ఆలోచిస్తుండగానే జడ్జిగారు తన గ్యాస్ట్రిక్ ట్రబుల్‌ గురించి చెప్పి ఫోను పెట్టేశాడు.

మనసంతా అతలాకుతలం అయింది. నర్సింగ్‌ హోంకు పోదామనుకున్నాడు కానీ లేవలేదు. వారంరోజుల్లో శారీరకంగానే కాక మానసికంగా కూడా బాగా అలసిపోయాడు.

తను కసితో మెడిసిన్ చదివాడు. ఎవరి మీద కసితో? పల్లెలో చదువుకుంటున్నప్పుడు తన మురికిగుడ్డల మీద కసి, తనకన్నా మంచి గుడ్డలు కట్టినవాళ్ల మీద కసి, తండ్రి ఉన్నవారి మీద కసి, దొరల మీద కసి, దొరల పిల్లల మీద కసి. ఆ కసిలో పరీక్షలు పాసయ్యాడు. స్కాలర్‌షిప్‌తో చదివాడు. తను తన క్లాసు విద్యార్థులకన్నా ఎక్కువ చదవాలి. తండ్రి గల పిల్లలకన్నా ఎక్కువ చదవాలి. ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్నకొద్దీ తనలో పట్టుదల పెరిగింది. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. ఒక్కొక్క ఎదురుదెబ్బా తనను రెచ్చగొట్టింది. తనిప్పుడు హోదా పొందగలిగాడు. ఒకప్పుడు ఈ టౌనులో ప్రాక్టీసు పెట్టినప్పుడు చింకి చాపా, అర్ధాకలి! ఎవరు పిలిస్తే వారి వద్దకు వెళ్లి వైద్యం చేశాడు. ఇప్పుడు తనకన్నీ ఉన్నాయి. కాని, దేనికోసమైతే పరుగెత్తాడో అది ఒక గాజుభవనంలాగా తోస్తున్నది. రానురానూ తనకు తక్కువమంది దగ్గరైతే ఎక్కువమంది దూరమౌతున్నట్లుగా తోస్తున్నది.

ఒక యాభయ్యేండ్ల ముస్లిం పేషంటు దగ్గుతూ వచ్చాడు. అతను తనతో పాటు తెచ్చిన రెకమండేషన్‌ లెటర్‌ యిచ్చాడు. దాని ప్రకారం అతను యాబై కిలోమీటర్ల దూరంలో గల ఒక మండలాఫీసులో ప్యూను.

పేషంటు దగ్గుతూ నిలబడలేకున్నాడు. తెల్లగా పాలిపోయి వున్నాడు.

నాగేంద్రం అతన్ని కూర్చుండమని సైగ చేశాడు. అతను బొల బొల ఏడుస్తూ నాగేంద్రం కాళ్ల మీద పడిపోయాడు.

‘‘ఎట్లనన్న బత్కియ్యాలె సార్‌ అయిదుగురు పిల్లలు. చిన్న పిల్లలు సార్‌,’’ ఉర్దూలో చెప్పాడు.

అతన్ని లేవనెత్తి కూర్చుండబెట్టి పల్సు చూశాడు.

ఎక్స్‌రే, రక్త పరీక్ష, తెమడ పరీక్షలకు చిట్టి రాసి చేతికిచ్చాడు.

‘‘సార్‌ ఇవ్వన్నిటికీ ఎంతవుతుంది సార్‌.’’

‘‘యాభై రూపాయలు,’’ నాగేంద్రం.

ఆ పేషెంటు లేవలేదు. ముఖంలో చెప్పరాని దైన్యం. బీదతనాన్ని తను గుర్తుపట్టగలడు.

కాంపౌండరును పిలిచి అతనితో పేషెంటును పొమ్మన్నాడు.

‘‘పైసే సాబ్‌?’’ పేషంటు.

‘‘తర్వాత చూద్దాం. పరీక్షలు తీసుకొనిరా,’’ నాగేంద్రం.

ఎదురుగా పోస్టుమన్‌. మెడికల్‌ జర్నల్స్‌, మందుల క్యాటలాగులు, అందులో ఒక ఉత్తరం.

ఉత్తరం విప్పి చూశాడు. ఊరి నుండి తమ్ముడు రాసింది.

‘ఈసారీ వానలు ముంచిపోయినయ్‌. మన గోడ ఒకపక్క పడిపోయింది. చెరువు తెగిపోయి మన పొలంలో అర ఎకరందాకా ఇసుక మేట వేసింది. ఇయ్యేడు ఎట్లా గట్టెక్కుతామో తెలువదు. అవ్వ, వదిన, పిల్లలు బాగానే ఉన్నారు. అవ్వ నీకు ఈ సంగతులు రాయకుమన్నది.’ ఉత్తరం సారాంశం.

నాగేంద్రం గత మూడు సంవత్సరాలుగా ఊరికి పోలేదు. తల్లిని చూడలేదు. అదే కోపం. తల్లి బీదగా ఉంటుంది. తల్లిని తన దగ్గరికీ ఎప్పుడూ తీసుకురాలేదు. తనుండేది పోష్‌ లొకాలిటీ. తిరిగేది పై అంతస్తు వాళ్లతో. తన బీదతల్లిని చూసి తనను అంచనా కడుతారేమోనని సందేహం. ఎవరైనా వచ్చినప్పుడు తల్లికి కొత్తబట్టలు కొని పంపిస్తూ తృప్తిపడతాడు. కాని నాగేంద్రం తల్లి లసుమవ్వ నాగేంద్రం పంపిన ఒక్క చీర కట్టలేదని నాగేంద్రంకు తెలియదు.

తన లోపల పేరుకుపోతున్న అసంతృప్తి ఇలా విడివడటం వల్ల వచ్చిందేమో?

నాగేంద్రం ఆ జ్ఞాపకాల నుండీ అసంతృప్తి నుండీ బయటపడడానికి స్కూటరెక్కి నర్సింగ్‌ హోంకు వెళ్లాడు. అక్కడ పేషెంట్లను చూసేసరికి పావు తక్కువ పన్నెండు అయ్యింది. భోజనానికి బయలుదేరుదామనుకునేసరికి పదిహేను కిలోమీటర్ల దూరం నుండి ఒక పేషెంటును ఎడ్లబండి మీద తీసుకువచ్చారు.

పేషెంటు ఒక గిరిజన స్త్రీ- ముప్పయి సంవత్సరాల వయస్సు ఉంటుందేమో.

పేషెంటు స్పృహలో లేదు. పేషెంటుతో పాటు ఒక ముసలివాడు, ఒక నడివయస్సు మనిషి, ఏడాది దాటని పసిపిల్ల, ఆ పిల్లను ఎత్తుకొని ఇంకో స్త్రీ వచ్చారు. పసిపిల్ల తల్లిపాల కోసం పెడబొబ్బలు పెడుతున్నది. డాక్టర్‌ సునీల్‌ వాళ్లనేదో అడిగాడు. వాళ్లకు గోండీ భాష తప్ప సరిగా తెలుగురాదు. వచ్చీరాని తెలుగులో ముసలివాడు ఏదో చెప్పాడు. నిన్న పగలు కడుపులో నొప్పని పడిపోయిందట. ఆమె భర్త లూటీ కేసో మరేదో కేసు వల్లో జైల్లో ఉన్నాడట. వాళ్లిద్దరు బంధువులట. వాళ్ల దగ్గర అంతా కలుపుతే నూరు రూపాయిలు లేవట. ఆ కాళ్ల కడియాలు వెండివి, మరేవో చూపుతున్నారు.

‘‘ఇది ప్రైవేటు నర్సింగ్‌ హోం, గవర్నమెంటుది కాదు,’’ సునీల్‌.

సర్కారు దవాఖానలో ఈ కేసు తీసుకోలేదన్నారు వాళ్లు.

‘‘సునీల్‌! డబ్బు సంగతి తరువాత. అల్సర్‌ కేసులాగున్నది,’’ మౌనంగా కూర్చున్న నాగేంద్రం.

‘‘డాక్టర్‌ సాబ్‌…’’ సునీల్‌ చేతిలో పెన్ను గిరగిర తిప్పుతూ, ఆ గొంతులో ‘ఇట్లా చేస్తే మన నర్సింగ్‌ హోం మూతపడగల,’దనే ధ్వని నాగేంద్రంకు విన్పించింది.

నాగేంద్రం నిట్టూర్చి పేషెంటును లోపలికి తీసుకు రమ్మన్నాడు.

కడుపు బాగా ఉబ్బి ఉన్నది. కళ్లు కళ తప్పాయి. పరీక్షలు అన్నీ జరిగేసరికి ఒంటిగంటయ్యింది. సర్జన్‌ అయిష్టంగా ఆపరేషన్‌ థియేటర్లోకి నడిచాడు. పేషేంటుకు రక్తం కావాలి. వెంట వచ్చినవాళ్లల్లో ఎవరి గ్రూపు రక్తం కలువలేదు. రెండు వందలిచ్చి కాంపౌండర్‌ను తరిమాడు. ఒక్క బాటిల్‌ మాత్రమే దొరికింది. ఆపరేషన్‌ ప్రారంభమయ్యింది.

ఆ రక్తం సరిపోదు. కడుపులో పేగు తెగిపోయింది.

నాగేంద్రం ఆపరేషన్‌ థియేటర్‌ బయటకు వచ్చి ఎటూతోచక మళ్లీ లోపలికి నడిచాడు. ఇంకా ఒక బాటిల్‌ రక్తమైనా కొనాలి. నాగేంద్రం గ్రూపు కలుస్తుంది. నాగేంద్రం బల్ల మీద పడుకున్నాడు. ఒక బాటిల్‌ రక్తం తీశారు.

ఆపరేషన్‌ అయిపోయేసరికీ మూడు గంటలయ్యింది. ఆపరేషన్‌ చేయగల్గారు కాని పేషెంటు పరిస్థితి ప్రమాదంగానే వున్నది.
నాగేంద్రం థియేటర్‌ నుండి బయటపడేసరికి ఇంటి దగ్గరి నుండి పక్కింటి పిల్లవాడు, ‘సులోచన పిల్లలు వచ్చారని,’ తాళంచెవి కోసం వచ్చాడు.

నాగేంద్రంకు నీరసంగా ఉన్నది. ఇంటికి వచ్చి సులోచనతో ఒకటి రెండు పొడి మాటలు మాట్లాడి ముందు గదిలో బల్ల మీద నిదురపోయాడు.
ఎంతసేపు పడుకున్నాడో తెలియదు. ఫోను అదే పనిగా మోగుతోంది.

సులోచన ఫోనెత్తింది.

నర్సింగ్‌ హోం నుండి సునీల్‌ చేస్తున్నాడు. నాగేంద్రంను లేపింది. ఆపరేషనయిన పేషెంటు చనిపోయిందన్న వార్త. నాగేంద్రం నిద్రమత్తు వదిలిపోయింది. నాగేంద్రం ఫోను పెట్టడం కూడా మరిచిపోయాడు.

***

నాగేంద్రంకు రెండు రోజులు జ్వరం పట్టుకున్నది. కళ్లు మూస్తే, తెరిస్తే ఊరు కళ్లల్లో కన్పిస్తున్నది. బాల్యానికి సంబంధించిన కలలు వెంటాడుతున్నాయి.

తను ఊరికి ఆఖరిసారి వెళ్లింది తన పెద్దన్న ఆక్సిడెంటులో చనిపోయినప్పడు, దినకర్మలకు మాత్రమే.

మూడోనాడు సాయంత్రం ఏడు గంటలు కావస్తున్నది. నాగేంద్రం టీ.వీ. రొద భరించలేక ముందుగదిలో ఒంటరిగా కూర్చున్నాడు. జ్వరం తగ్గింది కాని ఒంట్లో నలత తగ్గలేదు.

నాగేంద్రం కొడుకు అంబాడుతూ వచ్చి కాళ్ల దగ్గర తండ్రి ముఖం విచిత్రంగా చూస్తూ కూర్చున్నాడు. నాగేంద్రం కళ్లు మూసుకున్నాడు. పరామర్శల కోసం వచ్చిపోయేవాళ్లు దాదాపుగా విసిగించారు.

తండ్రి తనకేసి చూడకపోయేసరికి పిల్లవాడు ఏడుపు లంకించుకున్నాడు. ఏడుపు విని సులోచన ముందు గదిలోకి వచ్చి,

‘‘వాడు ఏడుస్తున్నా తీసుకోరేమండీ! మీ ధ్యాస మీదేగాని మమ్ముల్ని ఏనాడు పట్టించుకోరైతిరి. అందరనుకుంటరు, సులోచనకేంది పెద్ద డాక్టరు భార్య అని! అన్నీ ఉన్నా…’’ సులోచన నోరు విప్పిందంటే మాటలకు అంతు వుండదు. నాగేంద్రం కొడుకును ఎత్తుకోబోయాడు. సులోచన విసురుగా పిల్లవాన్ని తీసుకొని లోపలికి పోయింది.

‘‘రోగులు, క్లినిక్‌, నర్సింగ్‌ హోం. ఇంటి దగ్గరున్నప్పుడు నోరు మెదపరు. ఇలాంటివాళ్లు పెళ్లి చేసుకోకుండా వుండవలసింది,’’ లోపలి నుండి సులోచన గొంతులో గురగుర. ఒకే కప్పు కింద బతుకుతున్నా రానురాను ఇద్దరి ప్రపంచాలు వేరవుతున్నాయి. బహుశా తనకు నటించడం రాదు, మాట్లాడడం కూడా రాదేమో.

‘‘ఈ ఊళ్లో డాక్టర్లు లేరు. వాళ్లకు పెళ్లాం పిల్లలు లేరు! సినిమాలా? షికార్లా! అచ్చటా? ముచ్చటా?’’

‘‘సులోచనా?’’ నాగేంద్రం నిస్సత్తువగా పిలిచాడు.

టి.వి. హోరులో ఆ పిలుపు ఆమెను చేరనేలేదు. ఈ మాటలన్నిటికన్నా మిన్నగా పిల్లవాడు బెదిరిపోయి ఏడుస్తున్నాడు.

తన బాధేమిటో? తనెక్కడ తచ్చాడుతున్నాడో సులోచనకు తెలియదు. తెలిసే అవకాశం కన్పించడం లేదు. ఆమె ప్రపంచం నాలుగు గోడల మధ్య, ఆ నాలుగు గోడల మధ్యకు టి.వి. తెచ్చే తలక్రిందుల సంస్కృతి. ఐ లవ్‌ యూ, యూ లవ్‌ మీ అంటే తప్ప ప్రేమ తెలియదు. రానురానూ మానవ జీవితాలు గాలిలో ఎందుకు వేలాడుతున్నాయి? తను మాత్రమే ఎందుకు క్షోభ పడుతున్నాడు? అందరి దాంపత్యాలూ ఇంచుమించు ఇంతేనా?

బట్టలు వేసుకుని మాట్లాడకుండా బయటకు నడిచాడు. స్కూటరు తియ్యలేదు. ఎటు? ఎక్కడికీ పోయినా, ఏ మిత్రుడి దగ్గరికి వెళ్లివా డబ్బు, హోదా వాసన వేసే మాటలు. అసలు తనకు నిజమైన మిత్రులంటూ ఉన్నారా?

తనెప్పుడో మెడికల్‌ కాన్పరెన్సుకి కలకత్తా వెళ్లినప్పుడు అక్కడ ఒక హిందీ నాటకం చూశాడు. ఆందులో ఒక పాటను తనిప్పటికీ మరిచిపోలేడు. ఆ పాట చరణాలు జ్ఞాపకం వచ్చాయి.

ఒక పల్లె. పల్లెలో మర్రి నీడలో ఆశల ఇల్లు… వాగుపక్క గెంతిన బాల్యం, చేలల్లో మొగ్గ తొడిగిన యవ్వనం. అప్పుడు ఏది చేసినా అది ఒక కథ. కాని, పట్టణంలో మందిలో తప్పిపోయానిప్పుడు.

బీహారీ జానపద బాణీలో తంబూరా లాంటిదేదో వాయిద్యం మీటుతూ కంఠనరాలు ఉబ్బుతుండగా ఒక బక్కపలుచని వ్యక్తి అదోవిధమైన మైమరిపించే కంఠస్వరంతో పాడాడు. అది పాటగా కాకుండా తన జీవనసారం పిండిన అనుభవంగా, దురదృష్టం కొద్దీ ఒక మహా తుఫానులో చిక్కుకుపోయిన కోయిల్లా పాడాడు. పాట అయిపోయేసరికి తను కన్నీళ్లతో తడిసి ముద్దైపోయాడు.

పాట మైకంలో డాక్టరు నాగేంద్రం ఎరిగిన మనుషులను, వాళ్ల నమస్తేలను తప్పించుకుంటూ చాలాసేపు ఒంటరిగా తిరిగాడు. నేషనల్‌ హైవే పక్కనే ఊరు చివరన గల ఒక హోటల్‌ గుడిసెలో టీ తాగాడు. హోటల్‌ యజమాని తాగి వున్నాడు. పైగా చాలా లారీలు ఆగివుండి సందడిగా ఉండటం వల్ల నాగేంద్రంను గుర్తుపట్టలేదు. గుడ్లు, మాంసం వేపుడు వాసనల మధ్య పంజాబీ లారీ డ్రైవర్లు నులక మంచాల మీద కూర్చుండి లోకంలో ఏ చీకూ చింతా లేనట్లు తింటూ, లొడలొడ మాట్లాడుతున్నారు.

నాగేంద్రంకు ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టున్నది.

ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయ్యింది. విశాలమైన డైనింగ్‌ టేబులు మీద కురియనున్న మేఘంలాటి ముఖంతో సులోచన వడ్డించింది.
‘‘సులోచనా? నేను నాలుగు రోజులు మా ఇంటికి పోయి వస్తా,’’ ఆత్మీయమైన గొంతుతో నాగేంద్రం.

సులోచన మాట్లాడలేదు.

‘‘మన ఇల్లు కూలిపోయిందట- చెరువు తెగి పొలంలో ఇసుక మేట వేసిందట.’’

‘‘మీరు ఇసుక తొలగిస్తారా? ఇంటికి గోడలు కడతారా?’’

నాగేంద్రం జవాబు చెప్పకుండా సులోచన ముఖంలోకి చూశాడు.

‘‘నేను వద్దంటే మాత్రం ఊరుకుంటారా? మీ ఇల్లు, మీ ఊరు, మీ యిష్టం. నా మాట ఎప్పుడన్నా విన్నారు గనుకనా? ఇల్లు కట్టి మనకు చాలా డబ్బు ఖర్చు అయింది. నేను మా అమ్మ వాళ్లింటికి పోతనంటే నా వెంట రావడానికి మీకు తీరికలేదు. ఒక్కదాన్ని పంపించారు, అప్పుడు మీ రోగులు, క్లినిక్కు అడ్డొచ్చారు. నా వెంటన ఎక్కడికి మీరు రాలేరు. నామోషీ కద. నేను డాక్టరును కాదుగదా! ఎండాకాలం మీ తమ్ముడు వచ్చి వ్యవసాయానికి కావాలని రెండు వేలు తీసుకుపోయాడు. మొత్తం భూమి తనే దున్నుకొని పంట ఆనుభవిస్తున్నాడు.’’

‘‘సులోచనా! వాడు మట్టిలో మన్నై నన్ను చదివించాడు. నేను మోయవలసిన ఇంటి బాధ్యతను ఎప్పటినుంచో వాడు మోస్తున్నాడు. మా అన్న తినీ తినక నా చదువుకు డబ్బు పంపి. ఇవ్వాళ మనం ఇట్లా బతుకుతున్నామంటే… నీకు అర్థంకాదు సులోచనా…’’

‘‘నాకెందుకు అర్థమౌతుందండీ. మీ సంపాదన మొత్తం తీసుకువెళ్లి వాళ్లకే పెట్టండి.’’

‘‘సులోచనా?’’ నాగేంద్రం దాదాపు అరిచాడు.

సులోచన ఏడుస్తూ పడక గదిలోకి వెళ్లిపోయింది. నాగేంద్రం అన్నంలో చెయ్యి కడిగి ముందుగదిలో బల్లమీద వెల్లకిలా పడుకున్నాడు. బెడ్రూంలో నుండి వెక్కిళ్లు విన్పిస్తూనే ఉన్నాయి. తను ఎవరి దు:ఖాలు మాత్రం తీర్చగలిగాడని. రాను రానూ తను ఇంత చేతకానివాడిలాగా ఎందుకు తయారవుతున్నట్టు? తన పల్లె నుండీ, కన్నతల్లి నుండీ తనను దూరం చేసిందెవరు? సులోచనకూ, తనకు మధ్య నిలిచిన అడ్డుగోడేమిటి? తలపోటు ప్రారంభమయ్యింది.

నర్సింగ్‌ హోంకు ఫోన్‌ చేసి, ‘‘అర్జెంటు పని మీద నేను ఊరు వెడుతున్నాను. నాలుగు రోజులు మానేజ్‌ చెయ్యండి,’’ అని డ్యూటీలో ఉన్న డాక్టరుకు చెప్పాడు.

రాత్రి గడుస్తోంది. నాగేంద్రం నిద్రరాక పొర్లుతున్నాడు.

***

ఇద్దరు పిల్లలు చీమిడి ఎగపీలుస్తూ గాలాలు వేస్తున్నారు. ఒక పిల్లవాడు తండ్రిదో మరెవ్వరిదోగానీ మోకాళ్ల దాకా వేలాడే అంగీ వేసుకున్నాడు. ఇంకో పిల్లవానికి నిక్కరు తప్ప అంగీ లేదు.

నాగేంద్రం నడక అలవాటు లేక అలిసిపోయాడు. రోడ్డు దిగి మూడు కిలోమీటర్లు నడవాలి.

పడమటివేపు కొండమీద పొద్దు వేలాడుతోంది. కొండవాలులో ఎక్కడిదాకనో వ్యాపించిన తాటిచెట్ల కొసలు ఎర్రడౌలులో మెరుస్తున్నాయి. తన ఇల్లు చేరుకోవాలంటే కనీసం ఇంకా మైలు దూరం నడవాలి.

రోడ్డుకు ఆపక్క, ఈపక్క పెసరు చెలుకలు పచ్చగా నవనవలాడుతున్నాయి.

ఆ ఇద్దరు పిల్లలనూ వాళ్ల గాలాలనూ చూస్తే మరిచిపోయిన బాల్యం గుర్తొచ్చింది. కాసేపు పిల్లల దగ్గర ఆగాడు. పిల్లలిద్దరూ అనుమానంగా నాగేంద్రంను చూశారు.

‘‘ఎందుకట్లా చూస్తున్నారు?’’ నాగేంద్రం.

ఈసారి పిల్లలు ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు.

నాగేంద్రం కల్వర్డు మీదికెక్కి తుంగతో నిండి ఉన్న నీళ్ల మడుగులో గాలం బెండు మునగా తేలి సయ్యాటలాడటం చూశాడు.

‘‘ఔగని గాలం చేపలు ఎండపూట పడుతాయి గదా!’’ నాగేంద్రం నీళ్ల మీద ఎగిరే కొడిపె చేపలు చూస్తూ అడిగాడు.

‘‘మాల పంకిడి గాళ్లు, మార్పులు (ఒక రకమైన చేపలు) ఎండపూట చిత్తుబొత్తు కాంగ పడుతాయి. జెల్లకొయ్యలు, కొడిపెలు మాపటి పూటనే పడ్తాయి,’’ ఒక పిల్లవాడు ఓస్‌ గంత గీ సంగతి తెలియదా? అన్నట్టు చెప్పి గాలం లాగాడు. లివ్వర లివ్వర కొట్టుకుంటూ తెల్లగా మెరిసే జెల్లకొయ్య గాలంతోపాటు బయటకు వచ్చింది. ఆ చేపను గాలం నుండి ఊడదీసి సంచీలో వేసుకుని, ఎర సరిచేసి దాని మీద ఉమ్మి గాలం మళ్లీ నీళ్లలో వేశాడు.

‘‘మీరెవలు?’’ రెండో పిల్లవాడు.

‘ఎవరని చెప్పాలి?’ నాగేంద్రం తికమకపడ్డాడు.

‘‘నాగేంద్రంను,’’ నాగేంద్రం తడబడుతూ.

పిల్లలిద్దరికీ తెలియలేదు. వాళ్లకెట్లా చెప్పాలో నాగేంద్రంకు తెలియలేదు. ఆ ఊరికి, తనకున్న సంబంధం ఎట్లా చెప్పాలి?

‘‘లసుమవ్వ నడిపి కొడుకును. లచ్చింరాజు అన్నను,’’ నాగేంద్రం.

‘‘ఓహో డాకుతారివంటే నువ్వేనా?’’ లొడలొడ అంగీ పిల్లవాడు.

‘‘దెహి మన ఊల్లె శంకరయ్య డాకుతాననుకుంటున్నవా? పేద్ద డాకుతారి,’’ రెండోవాడు.

నాగేంద్రం ముందుకు నడిచాడు. మనసులో అనేక రకాల చేపలు మెదిలాయి. బొమ్మెలు, గండెలు, బురద మొట్టలు, పాపెర్లు, సాలెకొర్రమట్టలు, వాలుగలు, తీగదారు పొదల్లో కూర్చుండి తన గుండె కొట్టుకోవడం తనకే విన్పించగా చెరువు అలుగుల్లో గాలాలు వేయడం, ఆ ఏకాగ్రత… వంద గజాల దూరం నడిస్తే అడ్డదారి. అడ్డదారి కటూ ఇటూ వావిలి పొదలు బాగా పెరిగి వున్నాయి. వావిలి పొదల మీదుగా తూర్పున చెరువుకట్ట. దూరంగా ముస్లిం సమాధులు తెల్లగా కనిపిస్తున్నాయి. సమాధుల కావల మామిడితోట. తోట పై భాగంలో ‘లాల్చావుల’ గుట్టబోరు. పీరీల పండుగకు ఆ గుట్టమీది నుండి తల్లి పీరిని తెస్తారు. అగ్గిగుండం, ‘ఆశన్న ఊశన్న అన్నదమ్ములు’ పదాలు. వావిలాకు వాసన గుప్పుమన్నది. ‘వావిలి కట్టెకు వంగది గుర్రం, తుంగ పోసకు దూగది గుర్రం.’ ఎండాకాలం కాముని పున్నానికి ఆడే జాజిరాట. వావిలి చెట్ల కావల అందరూ పొలాలు నాట్లేశారు. మిట్టలు బీడుపడే వున్నాయి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, తమ్ముడు చెరువు తెగిపోయినట్టు రాసిన సంగతి.

మరికొంత దూరం నడిచేసరికి కర్ర ఇరుసు కుయ్యో మొర్రో అంటుండగా పెద్ద బండి ఎదురయింది. బండ్లబాట ఇరుగ్గా వున్నది. నాగేంద్రం వాయిలి పొదలకు వొదిగాడు.

బండిలో ఇంకా పదహారు సంవత్సరాల వయసు నిండని యువతి పురిటినొప్పులు పడుతోంది. ఆమెపక్క ఆ యువతి తల్లి కూర్చుండి ‘ఓర్సుకో’ మంటున్నది. నొగల మీద మాగిన కుండలాంటి శరీరం గల మొండయ్య కూర్చున్నాడు.

‘‘ఎవలాల్లు’’ మొండయ్య.

‘‘నేనేనే మామా,’’ నాగేంద్రం.

మొండయ్య ఎగాదిగా చూసి, ‘‘నువ్వా, ఎవలో అనుకున్న,’’ అని, నాలిక కరుచుకొని, ‘‘ఎప్పుడు బస్సు దిగినవయ్యా,’’ అన్నాడు. అంతకన్నా, ‘ఎప్పడు దిగినవుర నాగయ్య,’ అంటేనే బావుండుననిపించింది నాగేంద్రంకు.

‘‘తొలుసూరు కానుపు డాకుతరి కాడికి తీసుకుపోతన్న,’’ మొండయ్య ఏమనాలో తోచక.

‘‘జెర బండాపవయ్యా,’’ బండిలో స్త్రీ.

బండాగింది. ‘‘జెర మరదలి సెయ్యి సూడు,’’ అన్నది.

నాగేంద్రంను చూసి ఆ పిల్ల సిగ్గుపడ్డది. కొండిజెడ, చీమిడి ముక్కుతో వూరంతా తనేనన్నట్టు ఎగిరే పద్మ. వయసు చాలా చిన్నది. ఒంట్లో బలం లేనట్లున్నది. నాగేంద్రం చెయ్యి పట్టి నాడి చూశాడు.

‘‘నొప్పులు ఎప్పుడు మొదలైనయ్‌?’’

‘‘ఇయ్యల్ల వద్దనంగ సెరువు గండి కాడికి మట్టిపనికి బోయింది ఎసలాల్లకు కుసకుసమన్నది.’’

ఇంకా నెలలు నిండనట్లే ఉన్నది. బలహీనంగా ఉన్నది. చెంపల మీద ఎముకలు తేలాయి. మాల్‌ న్యూట్రిషన్‌, ముఖంలో గాభరా తప్ప ఇంకా నొప్పులు ప్రారంభం కాలేదు. తన దగ్గరేమీ లేదు.

‘‘ఏమీకాదు. రెస్టు కావాలె. మందులు వాడాలె. డాక్టరు దగ్గరికి తీసుకపొండి,’’ నాగేంద్రం.

‘నువ్వే పెద్ద డాక్టరువైతివి,’ అన్నట్టున్నాయి పద్మ చూపులు.

‘‘నేను అనుకోకుండా బయలెల్లిన. నా దగ్గర ఏమీలేవు.’’ చిన్న కాగితం వెతికీ మందులు రాసి యిచ్చి నాగేంద్రం తల వంచుకొని ముందుకు నడిచాడు. బండి ఇరుసు రాగం దూరమైపోతున్నది.

పద్మ ముఖంలోని సిగ్గు కొత్తగా, వింతగా ఉన్నది. నాగేంద్రంకు స్పష్టంకాని ఎప్పటివో జ్ఞాపకాలు బుసబుస పొంగాయి. దారికి రెండు పక్కలా ఈత పొదలు వచ్చాయి. ఈత పొదల్లో అప్పుడే చిమ్మెట్లు పలుకుతున్నాయి. ఎక్కడో పూరేడుపిట్ట కుర్రుమంటోంది. పొలాల మీదుగా బురద వాసనతో వెచ్చటి గాలి. తనకు సరిగ్గా జ్ఞాపకం రావడంలేదుగాని యవ్వనం, చెమట కలిపిన ఆడవాసన. పద్మ ముఖంలాంటి ముఖమే. నవ్వితే సొట్టలు పడే పచ్చటి ముఖం. గాలిలో పరుగెత్తే చురుకుదనం, పైరగాలి మోతలాంటి కంఠం… గంగ…

నాగేంద్రంకు గంగ జ్ఞాపకం శరీరమంతా పాకింది. గుండె దడదడ కొట్టుకున్నది. గంగ మొండయ్య అన్న కూతురు.

పడమటి తాడిచెట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బురద వాసనతో వెచ్చటి గాలి. సూర్యుడు కుంకాడు.

ఊరి చివర హరిజనవాడ, హరిజనవాడలో చాలా ఇండ్లు గూనపెంకలేశారు. రంగు రంగుల గుడ్డలవాళ్లు ఆదరబాదరగా తిరుగుతున్నారు. పిల్లలు గిలేటి పెళ్లేలు దప్పులు కొడుతున్నారు. ఎవరో వేగంగా తాడు పేనుతున్నారు.

నాగేంద్రం ఊరు జోరడం పశువుల మంద రావడం ఒక్కసారే జరిగాయి. పశువుల కాలిగిట్టల చప్పుడు, గొడ్లవాసన, అరుపులు, తల్లి ఆవుకోసం తల్లడిల్లుతూ ఒర్లే లేగలు. గొడ్ల మంద వెనుక అలసిపోయి కాళ్లీడుస్తూ గొడ్లబోయిల్లు. ‘తిరుమని’ చేతి కట్టలు, సుట్టల కోసం ఆకులడిగేవాళ్లు. అడవిల దొరికన నెమలి ఈకల కోసం వెంటబడుతున్న పిల్లలు. గొడ్లమంద పోయేదాకా ఒక చూరు కింద నిలబడ్డాడు నాగేంద్రం. తన బట్టలు జూసి గొడ్లు బెదిరి బెదిరి పక్కగా పోయినయ్‌.

చింతల కింద పనులకు పోయి వచ్చినవాళ్ల బరిబాత పెయ్యిలను చారికలుబడ గోక్కుంటూ ముచ్చట బెడుతున్నారు. స్త్రీలు నిప్పు కోసం గూనపెంకలు తీసుకొని తిరుగుతున్నారు. కొన్ని ఇండ్ల మీదుగా పొగ బద్దకంగా లేస్తోంది. పిల్లలు ‘మొలక వడ్లు’ దంచిన అటుకులు బుక్కుతూ పరుగెత్తుతున్నారు.

సగంమంది గుర్తుపట్టనే లేదు. చాలామంది తాగి వున్నట్టుగానే కనిపిస్తున్నారు. గాలివాటం మాటలు, కళలేని నవ్వులు చూస్తే నాగేంద్రంకు అట్లా అన్పించింది.

గుర్తుపట్టిన వాళ్లు ‘‘నువ్వా పిలడా?’’ అలవాటు ప్రకారంగా వరుసలుగట్టి ఏదో అనబోయి- అలవాటుగాని గౌరవం అడ్డురాగా తికమకపడుతున్నారు.

చాకలివాడలో కాబోలు, కుక్కలు అదేపనిగ మొరుగుతున్నాయి. గొడ్ల మెడల్లోని బొనుగలు ఇంకా ఊగుతున్నాయి.

నాగేంద్రం వేషం జూసి ఊరికేదో ఉపద్రవం రాబోతున్నదన్నంత కోపంగా నల్లకుక్క ఒకటి జంయిన లేచింది.

‘‘అడీ… పంటె లేవ సాతగాదు.’’ దాన్ని దూరంగొట్టి ఎంబడోల్ల వెంకటనర్సు, ‘‘నువ్వా కొడుకా? సానొద్దులాయె, సదువుకున్న మారాజులు. కానరాని దేశాలల్ల కాలు మీద కాలేసుకొని బతుకుతరు. ఎక్కడెవలు దిక్కులేకపోతే అక్క మొగడే దిక్కంట. సచ్చినా బతికినా మేం గీ ఊరొదులం. కోప్పడకు కొడుకా? లసుము వదినెది మొదటి మంచి మొదటిదాక కట్టపు పుటుకు. గీ ముసలితనానికన్న నీ ఎంట తీసుకపోరాదు,’’ అనుకుంటూ ముందుకు నడిచి మళ్లీ, ‘‘మారె అదిది బెంగటీలి సత్తది. సదువుకున్నోల్లంటే ఏడనైన ఒక్క సిత్తం జేసుకొని బతుకుతరు. మా ఆసొంటోల్లు గీ ఊరిడిసి పెడితె బెక్కన బెంగటీలి సత్తం,’’ అనుకుంటూనే మూల మలుపు తిరిగాడు.

నాగేంద్రంకు అనేక జ్ఞాపకాలు పోటెత్తుతుండగా ఎగుడు దిగుడు వీధిలో నడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి తల్లి ఎత్తుకోగానే పులకించిపోయి ఏడుపు మరిచిన పసిపిల్లవానిలాగా ఊరు నాగేంద్రంను అక్కున చేర్చుకున్నట్టుగా వున్నది. ఈ వీధుల్లో ఈ మట్టిలో తను నడక వేర్చుకున్నాడు.
ముఖాలు గుర్తుపట్టడం, ఆటపాట, మాట నేర్చుకున్నాడు. ఏడ్చాడు, నవ్వాడు. ఈ ఊరిలో తను గడిపిన ప్రతి అనుభవం ఒక కథ.
కుమ్మరి సాయిలు చింత కింద ఎవరూ లేరు. కుడిచెయ్యి కేసి వున్న కుమ్మరి సాయిలు పెంకుటిల్లు పాడుబడి వున్నది. దాని ముందు ‘ఆవం’ కూలిపోయి శిథిలమైన కోట గోడలాగా వున్నది. నాగేంద్రం తనకు తెలియకుండానే అక్కడ నిలబడిపోయాడు. గోలీలు, సిర్రగోనె, వెన్నెల రాత్రుల్లో ఈ చింత మొదట్లో ఒక జట్టు, ఆవతల అప్పని రామచంద్రం కొట్టంలో ఒక జట్టు- పూర్తిగా గుడ్డలు కప్పి చెరొక పిల్లవాన్ని తెచ్చేవాళ్లు. అచ్చం కోడిపుంజుల్లాగే కూసేవాళ్లు. కూత విని గుర్తుపట్టి ఈ గుడ్డల కింది వాళ్ల పేర్లు చెప్పాలి. గంగ తను ముందే కూడబలుక్కుని తెలిసేటట్టుగా గూసేవాళ్లు. ఇద్దరు ఒకే జటుల్లో అట్లా చేరిపోయేవాళ్లు.

ఇదే చింత కింద చిరుతల రామాయణం, అడుగులు, వేషాలు, చిందుమాదుగుల భాగోతం, గోత్రాలోల్ల అల్లిరాణి, మాట్లోల్ల పొడవల కథ, చుక్కలు జెగజెగలాడే రాతిలో బుడుగు జరిగం రాయమల్లు తీగలాంటి రాగం, ఆరుగురు మరారీÄలు, బాలనాగమ్మా- గంగ వాళ్ల చెవుడు నాయినమ్మా ఒళ్లో నుండి తప్పించుకొని తన పిర్ర గిచ్చేది. బాలనాగమ్మలో బాలవద్దిరాజు తనే అనుకునేవాడు. ‘అవ్వా అవ్వా ఏడేడు సముద్రాలు దాటి’ ఎన్నటికైనా అవ్వకు సుకం కలిగిత్తననుకునేవాడు. అవ్వ ఆ మాట చెప్పుకొని మురిసిపోయేది. ఏవీ ఆ కలలు, ఏవీ ఆ మాటలు. గంగ… చెరువులో తేటనీటిలాంటి గంగ- అడివిలో గలగలపారే పెంకలవాగులాంటి గంగ- రోజులుగా తనకు అనేక విషయాలు జ్ఞాపకం వచ్చినా గంగ మాత్రం జ్ఞాపకం రాలేదు. ఎందుచేతనో?

తనకన్నా నాలుగేండ్లు మాత్రమే చిన్న. బహుశా ఇప్పుడు ఒంట్లో మెరుపు తగ్గి ముసలిరూపం పడి వుంటుంది. తల్లిగారింటికి బతుకమ్మ పండుక్కు వస్తున్నదో లేదో? ఎందరు పిల్లలో? గంగకు నేను మతికున్నానా?

ఇలాంటి జ్ఞాపకాలతో మందలిచ్చిన వాళ్లకేదో చెప్పుతూ నాగేంద్రం ఇంటికి చేరుకున్నాడు.

ఇంటిముందు గల బొడ్డుమల్లె చెట్టు గాలివానకు వేర్లతో సహా కూలిపోయినట్లున్నది. దాని కాండం నరికేశారు. తనలాగే కొమ్మలు నరికిన మొదలు వేర్లతో సహా పడివున్నది.

పెంకుటిల్లు బజారువేపు గోడ కూలిపోయి వున్నది. కూలిన దగ్గర పాత సంచి బొంతలు కట్టారు.

ఇంటి ముందు రోటికాడ మరదలు లక్ష్మి కారం నూరుతోంది. ఇంటి ముందుగల గడ్డికొట్టంలో లసుమవ్వ ఏడిచే పసిపిల్లవాన్ని సముదాయించలేక సతమతమవుతున్నది.

భూమి పొరల్లో నుండి మొలుచుక వచ్చినవానిలాగా నాగేంద్రం వాకిట్లో నిలుచున్నాడు.

లక్ష్మి చూసి మొదట విస్తుపోయి గాభరాగా, ‘‘అత్తా బావచ్చిండు,’’ బొడ్లో దోపుకున్న కొంగు తీసి భుజం మీద కప్పుకుంటూ-
నాగేంద్రం కళ్లల్లో గుబగుబ నీళ్లు. కీకారణ్యంలో తప్పిపోయిన లేగదూడ తల్లి ఆవును చూసినట్లుగా.

‘‘ఏ బావే?’’ అన్నది లసుమవ్వ కండ్లు కన్పించక.

లక్ష్మి అత్త చేతుల్లోని పిల్లవాన్ని ఎత్తుకొని ఏదో గుసగుస చెప్పింది.

‘‘నాగన్న నువ్వార కొడుకా!’’ లసుమవ్వ లేచి నిలబడుతూ-

నాగేంద్రం మాట్లాడుతే ఏడువగలననే శంకతో తల్లికెదురు నడిచాడు. లసుమవ్వ ఆవు లేగదూడను ఒళ్లంతా నాకినట్లుగా, పేలవమైన చేతులతో నాగేంద్రం ఒళ్లంతా పునికింది. లసుమవ్య చేతులు వనుకుతున్నాయి. నాగేంద్రం ఒళ్లంతా కరిగి కరిగి భూమిలోకి ఇంకిపోయినట్లనిపించింది. మరదలున్నదనే ధ్యాస మరిచి నాగేంద్రం చప్పుడు కాకుండా కనలి కనలి ఏడ్చాడు.

‘‘కొడుకో, కొడక. మీనాయిన నిన్ను సూసుకోకపాయె కొడుక. మీ కట్టం సూడకపోయె కొడుక. మీ సుకం సూడకపోయె కొడుక…’’ లసుమవ్వ తనూ ఏడ్చింది. ఏదో మతికొచ్చినదానిలాగా ఏడుపు ఆపేసింది.

అంటే అవ్వ కూడా తనను మామూలు కొడుకులాగా చూడడం లేదన్నమాట. చదువుకున్న వానిలాగా ప్రత్యేకంగా చూస్తున్నదన్న మాట.
లక్ష్మి పెద్దకొడుకును పిలిచింది. నాగేంద్రం మెడిసిన్‌ మూడో సంవత్సరంలో వుండగానే తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తొమ్మిదేండ్ల కొడుకు. ఆ తరువాత బిడ్డ. మళ్లీ నాలుగేండ్ల ఎడం తరువాత మళ్లీ కొడుకు.

లక్ష్మిరాజం పెద్ద కొడుకు పేరు తండ్రి పేరు పోశాలు పెట్టుకున్నాడు.

‘‘ఏందే నీయవ్వ,’’ నేలకేసి కాళ్లు బాదుతూ పోశాలు పరుగెత్తుకొచ్చాడు.

‘‘పెదనాయన్న వచ్చిండురా?’’

‘‘ఏ పెదనాయిన్నే?’’

పిల్లవాడు నల్లగా వున్నాడు. తమ్ముని పోలికలే. బెదురు బెదురుగా పందిరి గుంజ పట్టుకొని నిలుచున్నాడు.

లక్ష్మి ఇంటి వెనుక నుండి కంచు ముంతలో నీళ్లు తెచ్చి పోశాలు చేతికిచ్చి, ‘‘పెదనాయిన్న కియ్యిరా,’’ ఆన్నది.
నాగేంద్రం ‘పైంటు‘ ఎత్తుకొని కాళ్లు కడుక్కున్నాడు. లక్ష్మి ఇంట్లో నుండి నవారు మంచం తెచ్చి పందిరి కింద వేసింది.
‘‘రారా నాయిన.’’ నాగేంద్రంకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. పిల్లలకేమి తేలేదని మనసంతా నీళ్లయిపోయింది.
‘‘మా నాయినవు కాదుర,’’ నాగేంద్రం గొంతు ముద్దగా.

పోశాలు బెదురు బెదురుగానే మంచం దగ్గరికి వచ్చి నిలుచున్నాడు. నాగేంద్రం ఒళ్లోకి తీసుకున్నాడు. తన కన్నతండ్రి ఒడిలాగే నాగేంద్రంకు పోశాలు శరీరం వెచ్చగా అన్పించింది.

లక్ష్మి ఇంట్లో నుండి ఉతికిన ధోవతి తెచ్చింది.

నాగేంద్రం బ్రీఫ్‌కేసులో నుండి లుంగీ తీసి కట్టుకున్నాడు.

‘‘సెల్లెటు బోయిందిరా?’’ నాగేంద్రం.

‘‘నీల వాళ్ల ఇంటికాడ ‘పరిబద్దు’లాడుతుంది పెదనాన్న,’’ పోశాలు.

‘‘ఇంటికాడ కోడలు కొడుకు మంచిగున్నారా నాగన్న,’’ లసుమవ్వ.

‘‘ఆ బాగనే వున్నరే?’’

‘‘పేరేం బెట్టిండ్లురా?’’ లసుమవ్వ.

నాగేంద్రంకు కొడుకు పుట్టినప్పుడు వీళ్లను పిలవనందుకు సిగ్గేసింది. ‘‘కార్తీక’’ అన్నాడు.

‘‘అదేం పేరుర?’’

‘‘నీకెరుక లేదత్తా,’’ లక్ష్మి,

లక్ష్మి చేతుల్లోని పిల్లవాడు నాగేంద్రం దగ్గరికి వస్తానని గింజుకుంటున్నాడు.

‘‘పోశన్న తమ్మున్ని తీసుకరార,’’ నాగేంద్రంకు పిల్లవాడి పేరు తెలియదు.

చిన్న పిల్లవాడు కేరింతలు కొడుతున్నాడు.

లక్ష్మి దీపం ముట్టించి గూట్లో పెట్టింది. ‘‘మీ బాబెక్కడున్నడో తీసుకురాపోరా! శంకరయ్య మామింటి కాడ సూడు. ఆడ లేకపోతే సారయ్య చిన్నాయినె దగ్గరుంటాడు,’’ లక్షి.

పోశాలు పరుగెత్తాడు,

‘‘గిప్పుడే సెరువు కాన్నుంచి వచ్చి తానంజేసి అట్ల ఊళ్లకుబోయిండు. సర్కారుకేమొ పట్టలేదు. ఊ ఆంటే ఊళ్ల మీదబడి కొట్టుడు. పట్టకపోయి కేసులు బెట్టుడుగని, సెరువులు కుంటలు జాసేటట్లున్నదా? నాగన్న మునుపటి తీరుగా లేడు, ఈడంత అడ్లు పెరుగు కల్పినట్టున్నది. అడుగకపోతే గతిలేదు, అడుగుతె కోపాలు. సెరువుగండి ఊరోల్లే పోసుకొనుడంటె మాటలా?’’ లసుమవ్వ.

నాగేంద్రం వింటున్నాడు. ఇంతలోనే ఆరేండ్ల నిర్మల పరుగెత్తుకొచ్చింది. చక్రాల్లాంటి కళ్లు. తల్లి పోలికలు. వాకిట్లో కొత్త వ్యక్తిని చూసి బెదిరిపోయింది.

ఆ పిల్ల పేరు నాగేంద్రంకు జ్ఞాపకం వున్నది. తనే పెట్టాడు. ‘‘నిర్మా నేనేనే- మీ పెద్దబాపును,’’ నాగేంద్రం.

తల్లి దగ్గరికురికీ కొంగు కప్పుకున్నది. ‘‘పోవే, మీ పెద్దబాపు,’’ లక్షి నిర్మలకు గౌను సరిచేసి పంపింది.

నిర్మల సంశయపడుతూనే నాగేంద్రం దగ్గరికి వచ్చింది. ‘‘ఏం చదువుతున్నవవ్వా?’’

‘‘ఒక్కటో తరగతి.’’

‘‘అన్నయ్యో?’’

‘‘మూడో తరగతి.’’

‘‘ఏం సదువులురా? పంతుల్లు ఈ ఊల్లే వుండరు. రోజు రావాలె, మనసుకత్తె వత్తరు లేకపోతే లేదు,’’ లసుమవ్వ నాగేంద్రం చదువుకున్న రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటూ.

నిర్మల నాగేంద్రం ఒడిలో ఒదిగిపోయింది.

***

పోశాలు ముందు నడుస్తున్నాడు. సూర్యకిరణాలు కళ్లల్లో గుచ్చుకుంటున్నాయి. ఆపక్క ఈపక్కనగల మైదాకుచెట్ల దళ్లు దాటి మందోట మీదికి వచ్చారు. దొరగారి బాతులను పాలేరు చెరువుకేసి తోలుతున్నాడు. బాతుల ముందు రెండు తెల్లకాసులు నడుస్తున్నాయి. పోశాలు పరిసరాలు మరిచిపోయి కాసుల వెంటబడి- వాటిలాగే అరుస్తూ- వాటి వెంట పరుగెత్తుతున్నాడు. సనాసోల్ల ఎత్తు కాలువ దాటి ఈత చెట్లల్లో నుండి చెరువుకట్ట మీదికి పరుగెత్తి తూము మీద కూర్చున్నాడు పోశాలు. నాగేంద్రం ఎక్కేసరికి పిచ్చుక గూళ్లకోసం పోశాలు తిరుగుతున్నాడు.
కట్ట కింద గల పెద్ద ఊడలమర్రి ఎండిపోయి వున్నది, మర్రి కింది నుండి వెళ్లే బండ్లబాట మీద ఎవరిదో సవారి బండి పరుగెత్తుతోంది. నాగేంద్రంకు ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. పోశాలు చాకిరేవుల కాడ తెల్లబట్టలకు చేసే నీలిమందు కోసం వెతుకుతున్నాడు.
మర్రిచెట్టు కొమ్మల్లో కూర్చుండి తను నాగార్జునుడి సూత్రాలు బట్టీ పట్టేవాడు. సుమిత్రా చౌహాన్‌ హిందీ పద్యం కంఠస్థం చేసేవాడు.
మర్రి కావలగల విస్తారమైన పంట భూముల్లో ట్రాక్టరు టుకటుక శబ్దం చేస్తూ దున్నుతోంది.

‘‘పెదనాన్న గీ మర్రి నిరుడే ఎండిపోయిందే,’’ పోశాలు.

చెరుపులో నీళ్లులేక చాకిరేవుల దగ్గర చాకలివాళ్లు బట్టలుతికిన దాఖలాలు లేవు. కుండ పొయ్యిలు చాలావరకు కూలిపోయి వున్నాయి. తూములో నీళ్ల రొదలేదు. బొమ్మేడి చెట్లల్లో నీళ్ల గలగల లేదు. తూముమీద తురక సాయెబు గాలాలు వేయడం లేదు. చెరువు ఈ కాలంలో నెలలు నిండిన నిండు చూలాలిలాగా వుండేది. చెరువులో ఆవలిపక్క అల్లిపూలు, తామరపూలు విచ్చుకొని వుండేవి. బుడువుంగలు, జిలుమలు వందలకు వందలే ఈదులాడేవి.

జిలుమ గుడ్ల కోసం తుంగలో పొద్దంతా గాలించేవాళ్లు. దొరికిన గుడ్లకు పేడరాసి కాల్చక తినేవాళ్లు. దుంప గడ్డలు పీకి వాటిని ఉడుక బెట్టుక తినేవాళ్లు.

చెరువు కట్టమీద నిటారుగా నిలుచున్న తాడిచెట్లు గాలికి చిత్రంగా మోగుతున్నాయి. చెరువుకట్ట వెంటగల ఈత పొదల్లో బొల్లికోడి కువకువ లాడుతోంది.

‘ఓ పెదనాయిన నీకు ఈతత్తదానే,’’ నాగేంద్రం ముఖంలోకి చూస్తూ పోశాలు.

‘‘రాదుర,’’ ఏమంటాడోనని.

‘‘అయ్యో- మా బాపుకు బాగత్తది, నాకు కొద్దిగనే అత్తది. రాఘవులుగాడైతే ఎల్లకల కూడ ఈతగొడ్తడు,’’ పోశాలు.

నాగేంద్రం జవాబు చెప్పకుండా ముందు నడుస్తున్నాడు.

కట్ల మధ్యలో దొంగ చింత. చింత మీద గువ్వొకటి గుగ్గూగూ అవి కూస్తోంది. పొద్దు పొలాల మీద దోబూచులాడుతోంది. ఎండపొడకు అందరు పొలాలు పచ్చగా మెరుస్తున్నాయి. పొలాలల్లో గల విప్పచెట్ల పైభాగంలో గద్దొకటి గిరికీలు కొడుతోంది. దూరంగా సాటు పెట్టని మిట్ట పొలాలల్లో పశువులు మేస్తున్నాయి. మరికొంచెం దూరం నడిచారు. కట్ట మీద రెండుపక్కల సోలుపుగా నిలుచున్న హరిజన కూలీల్లా తుమ్మచెట్లు.

కట్ట పొంట సద్దిమూటలు గట్టుకొని చాలామంది కూలీలు వచ్చారు. అందులో కొందరు కూలీలు నాగేంద్రంను గుర్తుపట్టి దండాలు చెప్పారు. కొంతమంది నాగేంద్రం రాకను ఊహించని వాళ్లు విస్తుపోయారు. ‘ఎక్కడుంటున్నావ్‌? పిల్లలెంతమంది?’ లాంటి పొడి మాటలు. తను ఈ ఊరికి కొత్తవాడు. ఈ ఊరి కష్టనష్టాలతో, సుఖదుఃఖాలతో ప్రమేయం లేనివాడు. ఈ మట్టిలో ఈ చెరువుకట్ట మీదనే తన బాల్యం గడిచింది. ఈ చెరువు ఊరివాళ్లిందరి బతుకులో ఒక భాగం. ఇప్పుడో తను ఈ చెరువుకు కొత్తవాడే, పరాయివాడే.

మరికొంత దూరం నడిచేసరికి కట్ట గండి పడిన చోటు వచ్చింది. గండి దగ్గర చాలా మందితో పాటు లక్ష్మిరాజం కూడా పని చేస్తున్నాడు.
లక్ష్మిరాజం కూలీలకు ఏదో చెప్పి నాగేంద్రం వెంటే బయలుదేరాడు. పోశాలు బడికి పోవాలని వెనుదిరిగి వెళ్లిపోయాడు.

ఇద్దరు కట్టదిగి పొలాలల్లో నడుస్తున్నారు. నాగేంద్రం లుంగీ ఎగగట్టి తమ్ముడి వెనుకే నడుస్తున్నాడు. నాగేంద్రంకు ఒడ్ల మీద నడవడం చేతకావడం లేదు. ఎడంవేపు ఇంకా నాట్లు వేయని మిట్ట పొలాలు. కుడివేపు అందరు పొలాలు నాట్లు వేశారుగానీ, అవి పండే నమ్మిక లేదు. సకాలంలో గండి పూడ్చగలిగితే వెనుకకు పడే వర్షాలకు చెరువులో నీళ్లు చేరితే పండినట్లే. మిట్టపొలాలల్లో నార్లు పెరిగిపోయి వున్నాయి. ఆశ చావని రైతులు చాలామంది ఇంకా పొలాలు దున్నుతున్నారు.

తమ రెండెకరాల పొలం చేరుకున్నారు. చెరువు గండికి సూటిగా వున్నది. చెరువు నీటి ప్రవాహంకు ఒడ్లు పూర్తిగా తెగిపోయాయి. చాలాభాగం కోసింది. కొంతభాగం ఇసుక మేట వేసింది. దాదాపు అరెకరం పొలం, పొలం వాలకమే లేకుండా పోయింది.

మిగతా పొలం రెండు సాల్లు దున్ని వున్నది కాని నీళ్లు లేక దుక్కి ఎండిపోయి వున్నది. నారు మోకాలు మంటి పెరిగి వున్నది.

‘‘ఇయ్యేడు అడ్ల పంటు ఆశలేదు. మేమేం దినాలె, వదినెకేం పంపాలె,’’ లక్ష్మిరాజం.

‘‘పోనీ ఇసుక తీయించి, ఒడ్లు పెట్టిస్తే, గండి మూసేస్తే ఆగస్టు ఆఖర్లో కురిసే వర్షాలకన్నా,’’ నాగేంద్రం.

‘‘ఊరోల్లమే కష్టపడుతున్నం,’’ లక్ష్మిరాజం ఏదో అన్నాడు.

‘ఇయ్యేటి పంట అట్లా వుండనియ్యి. ఈ పొలాన్ని రేవుకు తేవాలంటే కనీసం మూడు వేలన్నా కావాలి. అంత డబ్బు తన దగ్గర లేదు. రెండెకరాల పెరడు మీదే ఆశ. పునాస పెసరు. అధిక వర్షాలకు జాలు పట్టిపోయింది. ఇక మక్కపెరడు పండేది ఎంతో పండని దెంతో లక్ష్మిరాజం మనసులో. ‘‘ఇయ్యేడు అడివిలో పొద్దు గూకినట్టున్నదే?’’ పైకి.

నాగేంద్రం ఒడ్డు మీద ముంగాళ్ల మీద కూర్చున్నాడు. కలం, కాయిదం, సిరంజి పెట్టుకొని బతుకుడు కాదు రైతు బతుకు. తమ్ముని ముఖంలోకి చూశాడు. ఎముకలు తేలి తనకన్న పదేండ్లు పెద్దవాడుగా కన్పిస్తున్నాడు. వాడు పదోతరగతి చదివి ఆగిపోయాడు. తలలో వెంట్రుకలు నెరుస్తున్నాయి.
లక్ష్మిరాజం పొలం దొయ్యదొయ్య తిరిగి చూశాడు. అది కనీసం ఏ నూరోసారో? ఎన్ని రకాలుగా చూసినా ధైర్యం చాలడం లేదు.

లక్ష్మిరాజం పొలమంతా తిరిగి వచ్చి దొయ్యలో కూలబడి ఒక గరిక పోసను తెంపి నోట్లో పెట్టుకొని, ‘‘అన్నా బతికే దినాలు రాలే. పంటలు సూడవోతే గిట్ల. మీదికెల్లి ఊళ్లల్ల లొల్లులు. ఎనుకటి తీర్గలేదు ఊళ్లే బతుకు. ఎవసాయంల కర్సు పెరిగింది. మందులు మాకులు,’’ గురగురలాడే గొంతుతో.

‘‘పోనీ నా దగ్గిరికి రారాదురా, మెడికల్‌ షాపు పెట్టిత్త’’ నాగేంద్రం,

‘‘మీ మరదలు అదే అంటుంది. కానీ అన్న, మీరంత సదువుకున్నారు. బయటపడ్డరు. నేను పోదలుసుకుంటే పోదును, నేను ఎటూ పోలేను. ఈ భూమి, ఇల్లు, అవ్వ, నాయిన్న. నిలుసున్నా కూసున్నా-ఈ పొలాలల్ల నాతో నాయిన్న మాట్లాడుతున్నట్లే వుంటుంది. ఈ ఊరు నిడిసి రాలేను. అచ్చి బతుకలేనన్న…’’ లక్ష్మిరాజం ఎందుకనో వెక్కి వెక్కి ఏడిచాడు, కళ్ల నీళ్లబెట్టినాడు.

నాగేంద్రంకు గుబగుబ కళ్లల్లో నీళ్లూరినాయి. నాగేంద్రంకు గొంతు పెకలలేదు.

లక్ష్మిరాజం తేరుకొని, ‘‘ఇయ్యల్ల ఊళ్లోల్లు మండలాఫీసుకు పోయిండ్లు, ఆన్నుంచి జిల్లాదాకా సుత మండలాధ్యెచ్చన్ని, సెరువు మూపిత్తవా సత్తవా అని అడుగుతరట. నేను పోయేదే ఉండే. నువ్వు రాకరాక వత్తివని,’’ లేచి నిలబడి.

ఇద్దరూ ఎవరి ఆలోచనలు వాళ్లు చేస్తూ కట్టెక్కారు. నాగేంద్రంకు ఆయాసమొచ్చింది.

కట్టమీది నుంచి తనండ్లో తామ మాట్లాడుకుంటూ, ఎర్రగా కమిరిపోయివ మనిషిలాగా వున్న మనిషి నాగలి కొడారేసుకొని రావడం కన్పించింది.
‘‘లాలయ్యమామ…’’ లక్ష్మిరాజం.

నాగేంద్రం నిలబడిపోయాడు.

‘‘లాలుమామా, మా నాగన్ననే,’’ లక్ష్మిరాజం.

ముల్లుకర్ర భుజాలమీద పెట్టుకొని నిట్టనిలువుగా నిలబడి నాగేంద్రంను చూశాడు. లాలయ్య పీక్కపోయిన దవడలు వనికాయి. చిన్న కండ్లల్లో కోపం. ‘‘గీ దునియల సదువుకున్నోల్లంత లంగలు లేరు,’’ తుఫుక్కున ఊంచి వెళ్లిపోయాడు.

నాగేంద్రం తేరుకోలేదు. లక్ష్మిరాజం, ‘‘దా అన్నా పోదారి,’’ ముందు దారితీశాడు.

కొంత దూరం నడిచిన తరువాత, ‘‘అన్నా గంగు మతికున్నదా?’’ లక్షిరాజం అడిగాడు.

నాగేంద్రం మాట్లాడలేదు. గంగ, నాగేంద్రం అనుబంధం లక్ష్మిరాజంకు తెలుసు.

‘‘గంగ ఉరిబెట్టుక సచ్చిపోయింది,’’ లక్ష్మిరాజం.

నాగేంద్రం సలిపిడుగు మీద పడ్డటుగా వనికిపోయాడు.

లక్ష్మిరాజం వెనక్కి తిరిగి నాగేంద్రం కళ్లల్లోకి నిమిషం చూసి తల వంచుకొని, ‘‘ఔనన్నా… ఇంక ఆరం దినాలకు సనిపోతననంగ మనూరికచ్చింది. నా కోసం మనింటికచ్చిందట. నేనులేను. ఆఖరుకు కుమ్మరోల్ల సింతకింద కల్సింది. అయిదేండ్లో పదేండ్లో నాతోని ఎప్పుడూ సరిగ మాట్లాడలే. కోపం గావచ్చు ననుకున్న. ‘బాగున్నవ మరిదీ,’ అన్నది. అన్నా ఆ గొంతు ఎంత ఆప్యాయంగ వున్నదని. వా సంకలున్న చిన్నోన్ని తీసుకొని ఎత్తుకొని ముద్దులాడింది. ‘మీ అన్నకెందరు పిల్లలన్నది?’ నేను చెప్పిన. ‘ఏడున్నడు? ఎంత సంపాయిత్తండు? మీ వదినె ఏం సదువుకున్నది?’ అడిగింది. నువు వున్న ఊరు చెప్పిన. మిగతా నాకు ఎర్కలేదన్న. ‘డాక్టరంటివిగదా? బాగానే సంపాయిత్తండు. బారియ బాగుంటదా?’ అన్నది. నేను నేలసూపులు చూసుకుంట మాట్లాడలే. ‘పిల్లగా! మా ఈడోల్లందరి బతుకులు కిందికో మీదికో బాగనే వున్నయి. నేను ఏం బతుకు అడక్కొచ్చుకున్ననో?’ ఈ మాటతోపాటే బొటబొట కన్నీళ్లు కారినయ్‌. కొంగుతోని కండ్లు తుడుచుకొని, ‘అందరికి పైసలు గావాలె. మమషులక్కర లేదు. మీ అన్నకు గంతే. మీ అన్నేంది సదువుకున్నోళ్లంత గంతే.’ సానసేపు పెద్దక్క తీర్గ మాట్లాడింది. చిన్నవాటి సంగతులు చెప్పుకచ్చింది. నా ఎనుకనే ఇంటికచ్చి అవ్వ దగ్గర కూకుండి, ‘అత్తా నాకు జనుపతాడుబెట్టి జడ లెయ్యవానె,’ అన్నది. అవ్వ పక్కలో కూకుండి సానాసేపు ముచ్చెటబెట్టింది.’’

నాగేంద్రం కళ్లల్లో నీళ్లు.

‘‘గంగ మొగుడు ఏడనో పోలీసుల్ల పనిజేత్తడట. రోజు తాగుడేట, రోజు తన్నుడేనట. పోనీ కయికిలో కూలో జేసుక బతుకు దామంటె ఏడుంటది? తల్లిగారు లేమిడోల్లేనాయె.’’

లక్ష్మిరాజం చెప్పకపోతున్నాడు. కాని నాగేంద్రంలో సంపూర్ణంగా గంగ రూపం జ్ఞాపకాలు నిండిపోయి ఏమీ విన్పించడంలేదు.

***

ఎవరిదో ఎడ్లబండి మీద సాయంకాలం నాగేంద్రం వదిన సావిత్రి, పిల్లలు రమణ, రమేష్‌ వచ్చారు.

సావిత్రి రాకడతోనే లసుమవ్వ మీదపడి ఏడ్చింది. మనిషి పూర్తిగా ఎండిపోయింది. వడలిపోయి వున్నది. పిల్లల చదువుల కోసం ప్రైవేటు స్కూల్లో నెలకు అయిదు వందల జీతం మీద టీచర్‌గా పని చేస్తున్నది.

రమణ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రమేష్‌ ఎస్‌.ఎస్‌.సి. చదువుతున్నాడు. రమణకు ఎట్లాగన్నా పెళ్లి చెయ్యాలన్నదే సావిత్రి దిగులు.

‘‘చిన్నాన్న, అమ్మ చూడు. నాకేమో నీలాగ డాక్టర్‌ చదువాలని వున్నది,’’ రమణ.

‘‘మనం ముగ్గురం బతకడమే కష్టంగదే. నువ్వయివా చెప్పు డాక్టర్‌ చదవడమంటే మాటలా?’’ సావిత్రి కొంగుతో కళ్లు తుడుచుకుంటూ,
నాగేంద్రంకు తను ఇంటర్‌ ఫైనల్‌ పాసైన రోజు జ్ఞాపకం వచ్చింది. ఫస్టుక్లాసులో ప్యాసయ్యాడు. చేతిలో నయాపైస లేదు. తండ్రి లేడు. అప్పటికే లక్ష్మిరాజం చదువు మానేసి వ్యవసాయం చేస్తున్నాడు. రమణలాగే అమాయకంగా తను డాక్టర్‌ చదువుతా ననుకున్నాడు.
లసుమవ్వకు ఆ చదువేమిటో సరిగ్గా తెలియదు. తమ్మునిలాగే ఏదన్న పనిచేసుక బతుకుమంటూ తిట్టిపోసింది. ఆ రోజంతా తిండి మానేసి దాదాపు పదిహేను కిలోమీటర్లు నడిచి ఫారెస్టర్‌గా పనిచేస్తున్న అన్న దగ్గరికి పోయాడు.

అన్న ఆ దుమ్ము నిండిన కాళ్లు ముఖం చూసి కోప్పడి స్నానం చేయిమని, ‘‘అట్లాగే సదువుకునేవు లేరా!’’ అన్నాడు. తనకు నమ్మకం చిక్కలేదు. తను దిగులుగా వుంటే ఆ రాత్రి గొంతెత్తి ’చెల్లియో చెల్లకో’ అన్న పద్యం పాడాడు.

నాగేంద్రంకు అన్నయ్య ముఖం జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య తనకు తాహతుకు మించిన పనైనా తనను చదివించడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి తన మూలకంగా అన్న వదినలు కొట్టుకున్నారు.

తనకు మెడిసిన్‌లో సీటొచ్చింది. తన చదువుకు డబ్బు పంపడానికి అన్న పడని కష్టాలు లేవు.

తను డాక్టర్‌ పట్టా పుచ్చుకొని అన్న దగ్గరికి వచ్చి, ‘‘అన్న మన కష్టాలు కడతేరినయన్న,’’ అన్నాడు.

‘‘నాగన్న నువ్వు నాకు నా పిల్లలకేదో చేస్తవని నేను చదివించలేదుర. ఆ లెక్కన నేను నీకు పంపిన వందా రెండు వందలు నీ చదువుకే మూలకు సరిపోయినయ్‌. నువ్వు చాలెంజ్‌గా తీసుకొని డాక్టర్‌వైనావు,’’ అన్నాడు.

ఇప్పుడు తన అన్నకన్నా దాదాపు పది పదిహేను రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నాడు. రోగులను పీక్కొని తినదలిస్తే ఇంకా ఎక్కువే సంపాదించవచ్చు. కాని అన్నలాగా స్వచ్చంగా, నిర్మలంగా వుండలేకపోతున్నాడు. అన్న వదినతో కొట్లాడి తనను చదివించాడు. కనీసం చనిపోయిన అన్న పిల్లలిద్దరినైనా తన దగ్గరుంచుకొని చదివించలేకపోతున్నాడు. పిల్లలను చదివించడం ఆర్థికంగా తనకు పెద్ద కష్టమేమీ కాదు. కాని తన దగ్గర పిల్లలను వుంచుకోలేడు. అన్న చనిపోయేదాకా తన కిష్టమైన పద్ధతిలో బతికాడు. కాని తను తనకు నచ్చిన పద్ధతిలో బతుకలేడు.

పిల్లల బాగోగులు చూడ నోచుకోనందుకు కాసేపు భర్తను తలుచుకొని, ఇంతమందిని విడిచి పోయినందుకు పెద్దకొడుకును తలుచుకొని లసుమవ్వ ఏడ్చింది.

అందరు పడుకోవడానికి ఇంట్లో స్థలం లేక నాగేంద్రంకు వాకిట్లో పందిరి కింద మంచమేశారు. పోశాలు నాగేంద్రం పక్కలో పడుకున్నాడు.
రాత్రి ఊరులుకు మగ్గిపోయింది. ఆకాశంలో చుక్కలు. మధ్యలో చంద్రుడు. దూదిపింజల్లా చందమామతో దోబూచులాడుతూ సాగిపోయే మబ్బులు. అలవాటులేని నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నేపథ్యంగా ఎడతెగని చిమ్మెట్ల రొద. పైగా దోమలు, కప్పుకోవడానికి ఇచ్చిన శద్దరు ముక్కవాసన వేస్తోంది.
అందరు పడుకున్నారు. ఎడ్లకొట్టంలో ఎడ్లు పచ్చిగడ్డి నములుతున్నాయి.

నాగేంద్రంకు నిదుర రావడంలేదు. వెచ్చగా పోశాలు శరీరం. నిదురలోనే ‘కాసుల’ ననుకరిస్తూ ‘కార్ర్‌’ అంటున్నాడు.

పోశాలు మీద శద్దర్‌ కప్పి వాకిట్లో పచారు చేయసాగిండు. కలగాపులగమైన జ్ఞాపకాలు ఒకటొకటే విచ్చుకుంటున్నవి.

ఎండాకాలం ఇండ్లకు దూరంగా కొడార్లు, పుచ్చపువ్వులాంటి వెన్నెల రాత్రులు, కోలాటం. ‘అడుజై శివ శివ మూర్తివయ్య గణనాథా, నువ్వు శివుని కుమారుడావు గణనాథా’, నీల్లాకు బొయ్యేటి ఓ నీలవేణిరో? నిలుచుండవే గొల్లభామా? నీతోని పని గలిగేలేమా?’ ‘పని పని యాని నన్ను…’ పాట ఆగిపోయింది. కోలల చప్పుడు నిలిచిపోయింది. తెల్ల జొన్నకర్రలు పైరగాలికి ఊగుతుండగా మంచె మీద గంగ. తను నిచ్చెన మీద.
గంగ పెళ్లైపోయింది. అత్తగారింటికి తీసుకపోవడానికి మామ బండి కట్టుకొని వచ్చిండు. రేపే ప్రయాణం.

‘‘గంగా…’’ తను.

‘‘సీమ పోను బావా? నన్ను నీతోని తీసుకపోతవా?’’ గంగ వెక్కి వెక్కి ఏడుస్తూ అభ్యర్థిస్తున్నది.

‘‘ఏడువకు గంగా!’’ నాగేంద్రం మంచె మీదికి ఎక్కాడు.

గంగ నాగేంద్రం మీదబడి కుమిలి కుమిలి ఏడ్చింది.

‘‘గంగా! నాకింక రెండేండ్ల సదువున్నది. నేనే ఓ పూట తిని, తినక సదువుతున్న.’’

‘‘అప్పటికి నీ గంగ ఇద్దరు బిడ్డల తల్లైతది,’’ గంగ నాగేంద్రంను దూరంగా తోసి.

నాగేంద్రం ముఖం ముడ్చుకొని మంచె దిగి చేనులో కోపంగా నడుస్తున్నాడు.

వెనుక గంగ అడుగుల చప్పుడు. నాగేంద్రంను ఆపి, ‘‘మనిద్దరం కూడుకున్నమని ఊరు కోడైకూత్తంది.’’

తను గంగ ముఖంలోకి చూడలేదు. గంగ కన్నీళ్లు తుడవలేదు.

‘‘నీకు మమషులద్దు. నీకు సదువు గావాలె. పెద్ద పదివిగావాలె, పైసలు గావాలె,’’ ఏడుస్తూ కూలబడి.

నాగేంద్రం ఆ జ్ఞాపకాలమ తుడిచివేయడానికి మళ్లీ పచారు చేశాడు. వాకిట్లో నుంచి వీధిలోకి, వీధిలో చింతకింద నిలుచున్నాడు.
‘‘బావా?’’ చెవులో గుసగుసగా.

నాగేంద్రం ఆ పిలుపు నుండి తప్పుకోవడానికి మరికొంత దూరం నడిచాడు. షావుకారిల్లు, కుమ్మరోల్ల చింతచెట్టు. కాటి పాపలోల్లు కడుపుల నుంచి గుండ్లు తియ్యడం. పెద్ద బొనుగూపడం. గారిడివాని డోలు చప్పుడు. పెద్దమ్మలది డోలు గీరడం. గంగెడ్లవాని సన్నాయి పీపా పోటెత్తాయి.
నాగేంద్రం చింత మొదట్లో కూలబడిపోయాడు. కుక్కలు ఎక్కన్నో చాలా బలహీనంగా మొరుగుతున్నాయి. మేరె ముసలవ్వ గొంతెత్తి పాడే వానదేవుని పాట వినిపిస్తున్నట్టుగానే వున్నది. నాగేంద్రం గంగ జ్ఞాపకాలు పారదోలడానికి గంగ నుంచి దూరంగా పరుగెత్తుతున్నాడు.
వానకాలం గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎండకాలం గాడుపు దుమారాలు, బండ మీద ఎరువు జారగొట్టడం, బాజా భజంత్రీలు, పెండ్లిల్లు పెండ్లి కోసం ఎడ్లబండ్లు, పై బట్టడం, జిపజిప వానలు కురుస్తుంటే తడవడం, ఆరుద్ర పురుగులు, ఊసిల్లు, మడికట్టు పొలాలు దున్నడం, వరిదొయ్యల్లో ఎండ్రికాయల వేట, డిబడిబలాడే చెరువులు, అడివిలో చిగురు టేకుటాకుల మీద వాన మోత, వానలు తగ్గగానే బీరపూల పసుపుదనం, బొడ్జెమ్మ ఆట, ఒక్కేసి పువ్వేసి సందనూరు ఒక్క జాములాయె సందమామ. అవ్వ బతుకమ్మకు దూరంగా నిలబడి పాడేది. ఆ పాటకు మొదలెక్కడో ఆఖరెక్కడో తనకు తెలిసేదికాదు. దసరా పండుగ, కొత్త బట్టలు. సద్దుల బతుకమ్మ కోసం అర్ధరాత్రి గుమ్మడి, తంగేడు పూల వేట. రెడ్డోరి కొట్టాల దగ్గర విశాలమైన మైదానంలో బతుకమ్మ ఆట.

సత్తు ముద్దులు. ‘పాపిడి కాయలు’ కంక గొట్టాల్లో వేసి ఆడోల్లను కొట్టడం, వాళ్లు ముదిగారువంగా తిట్టడం. దసురకు జంబికి పోవడం. జంబి దగ్గర మేకపిల్లను నరుకుడు. జంబాకు ఊరోల్లందరికీ పెట్టి కాళ్లు మొక్కడం. గరత్మంతుడు పాలపిట్ట, నల్ల పిట్టను చూడడం…
దీపావళికి కోమటోల్లు కాల్చే పటాసులు, చిచ్చుబుడ్లు- వాకిట్లో రోలుమీద పెట్టిన గండసిలుక దీపం. అది అటు ఇటూ ఊగుతుంటే అవ్వ కొంగు కింద దాక్కోవడం. వరికోతలు, బంతులు చల్లికాలం అరి కంట్లాలు. చలి నెగల్లు, నెగడికాడ నిదురరాని ముసలివారు చెప్పే రాజుల రాణుల కథలు, బంగారులాటి ఎండపొడ.

ఇట్లా అనేక జ్ఞాపకాలు పోటెత్తాయి. తను ఒక సామూహిక జీవన సంరంభంలో బతికిన బతుకది. ఊరందరికీ వరసలే. ఏ కులం వాళ్లయినా? ఊరి కష్టసుఖాలు అందరివి. అందరి కష్టసుఖాలు ఊరివి.

తను ఇప్పుడు నాగేంద్రం ఎం.డి. పెద్ద డాక్టరే. రోగులు, మందులు, ఆపరేషన్ల ఏడుపులు, పెడబొబ్బలు… వీటన్నిటితో తనకు ఎలాంటి సంబంధమువ్నది? తను డాక్టరు వృత్తిలో ఒంటరే- ఏ డాక్టరు ఏ రోగాన్ని తగ్గించలేడు. తగ్గించగలనన్నట్టు నటిస్తాడంతే- అనేక రోగాల మూలాలు రోగి శరీరంలో మాత్రమే లేవు. అవి చాలావరకు సామాజికమైనవి.

మొత్తంగా ఈ ఊరి శబ్ద ప్రపంచంలో నుంచి- తీగలా అల్లుకపోయిన సంబంధాల నుంచి విడిపోయాడు. ఈ ఊళ్లో పాత తరం గౌరవించినట్లు మాటవరసకు పలుకరించింది. కొత్తతరం గుర్తేపట్టలేదు. ఈ ఊరికి తను పరాయివాడు. ఎవరికి ఏమికాడు?

మళ్లీ గంగ జ్ఞాపకం వచ్చింది. గంగ తన బతుకు చెడగొట్టుకున్నది. తను చెడగొట్టలేదా? గంగను చంపింది ఎవరు? తనేనా?

నాగేంద్రం లేచి నిలుచున్నాడు. కాళ్లు వనికాయి. అవ్వకు, తమ్మునికీ, పిల్లలకు తనేమికాడు. వాళ్ల గురించి ఏ రిస్కు తీసుకోలేడు.

స్పష్టంగా ఏదో తేలిపోయినట్లనిపించింది. ఈ మట్టివాసనల నుంచి తల్లివేరు బంధాల మంచి వేరు చేసిందెవరు? చదువే.

లుకలుకలాడే పాత ఇల్లు భల్లున కూలిపోయినట్లనిపించింది. చదువు మీద కసి లేకుంటే- కసి నుంచి పుట్టిన విశ్వాసం లాంటిదేదో లేకుంటే ఇంతదాకా రాకపోవును. ఒక నిషాలాగా కమ్మేసిందది.

తను డాక్టరు కోర్సులో మూడవ సంవత్సరం చదువుతుండగానే తన కాళ్ల కింద నేల గురించి ఆలోచించడం ప్రారంభమైంది. రెండు ఎదురు బొదురు ప్రపంచాల గురించి తెలుపుకున్నదక్కడే. తమ ఉచ్చులో చిక్కుకొని పరాయీకరణ చెందుతున్నట్లుగా అస్పష్టంగా అర్థమవసాగింది. ఈ ఉచ్చు బలీయమైనదని గుర్తించినవాళ్లు చాలామంది మానవ రిలేషన్‌ వెతుక్కుంటూ వెళ్లిపోయారు. అప్పుడు ఈ ఉచ్చు అంత బలీయమైంది కాదని తను వాదించాడు. డాక్టరై సేవలు చేద్దామనుకున్నాడు. డాక్టరుకు, ప్రజలతో కలిసి పోవడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగానే అర్థమయ్యింది. డాక్టర్‌ వృత్తి వ్యాపారానికి సేన ముద్దుపేరని అర్థమయ్యింది. కాని తనలో ఇంత లోతుగా తొలుచుకపోయిందని మాత్రం తెలియదు. నిన్నటిదాకా తనింకా తనవాళ్లతో పల్లెతో మమేకమై వున్నాననుకున్నాడు. అది వాస్తవం కాదని తన్ను తాను మభ్య పెట్టుకుంటున్నాడని తేలిపోయింది.

నాగేంద్రంకు తన స్థితేమిటో సంపూర్ణంగా అర్థమైపోయింది. తిరిగి వచ్చి పోశాలు పక్కలో పడుకున్నాడు. హౌజ్‌ సర్జన్‌ చేస్తూ చుట్టుపక్కల గ్రామాలల్లో ప్రజలను కలుస్తున్నాడని, వాళ్లకు బతకడం బోధిస్తున్నాడని పట్టుకపోయి వెన్నెముక విరిగేదాక చిత్రహింసలు పెట్టినా కూడా ధైర్యంగా వున్న డేవిడ్‌- ఎం.డి.లో సీటొచ్చినా వొదిలిపెట్టి ఎటో వెళ్లిపోయిన శ్రీనివాస్‌- తను డాక్టరై వుండి గుండె జబ్బుకు వైద్యం లేక ఎక్కడో కుగ్రామంలో చవిపోయిన బాబు జ్ఞాపకం వచ్చారు.

‘చట్‌… కూరుకపోయింది వాస్తవమే. బయటపడే మార్గం లేదా? రిస్కు వుంటుంది? రిస్కు తీసుకోవాలి? జరుగబోయే బతుకులో తను నిలబడాలి?’ ఈ ఆలోచన కొత్తగా వింతగా తోచింది.

గాలి విసురుకు మబ్బులన్నీ విడిపోయినట్లుగా జ్ఞాపకాలన్నీ తొలిగిపోయినట్లుగా అన్పించింది.

తొలికోడి కూసింది. నాగేంద్రంకు హఠాత్తుగా మెలుకువ వచ్చింది, నల్లపిట్టలు పీచుపీచుమంటున్నాయి. మరదలు లేచి బరుకూ బరుకున వాకిలి ఊడ్వసాగింది.

నాగేంద్రం మంచంలో లేచి కూర్చున్నాడు. అప్పటికే లక్ష్మిరాజం వాకిట్లోకొచ్చాడు.

‘‘నేను వెళ్లిపోతరా తమ్మి!’’ నాగేంద్రం.

‘‘అప్పుడేనానే- మూడు దినాలు వుంటనంటివిగాదే?’’ లక్షిరాజం.

‘‘ఉందామనే వచ్చివరా? ఇప్పుడుండ లేను. నా మెదడంతా కోల్లు దవ్విన పెంటైపోయింది. న ఘర్‌క నా ఫూట్‌క,’’ నాగేంద్రం కంఠం పూడుకపోయింది.

మరదలు అందరిని లేపింది. రమణ కళ్లు నులుపుకుంటూ వచ్చి నాగేంద్రం పక్కనే కూర్చున్నది. సావిత్రి దూరంగా నిలుచున్నది. లసుమవ్వ మంచంకు ఎదురుగ కొట్టంలో కూర్చున్నది.

నాగేంద్రం రమణ తల నిమురుతూ, ‘‘అవ్వా! మీ నాయిన అష్టకష్టాలు పడి నను చదివిచ్చిండే రమణా! నేను నిన్ను చదివియ్యలేను. ఆ చదువు నువ్వు అనుకున్నంత గొప్పదిగాదు. నన్ను మన్నించు,’’ అన్నాడు.

‘‘అయ్యే మాటలు పిలడా!’ సావిత్రి కదిలిపోయింది.

‘‘వదినా! మీకు ఎవరికి అర్థంకాదు వదినా? మీరంతా ఒకరితో ఒకరికి అందరికి ఊరితో పిల్ల పేగు సంబంధం తెగిపోనోల్లు. ఎందుకంటే మీరు నా తీర్గ పెద్ద చదువులు చదువలేదు. తమ్మీ రమణకు మంచి సంబంధం చూడండ్లి- పెళ్లి ఖర్చు నేను పెడత.’’

పోశాలును, రమేష్‌ను చెరో చంకలోకి తీసుకొని మాటలు రాక తలలు నిమిరిండు.

బ్రీఫ్‌కేసు తెచ్చిండు. మరదలు దీపం ముట్టించింది.

నాగేంద్రం మూడు వేల రూపాయిలు తీసి, ‘మొదలు పొలం బాగు చేయించు. తర్వాత మరికొంత పంపుతా,’’ లసుమవ్వ ఆగలేకపోయింది. పునుక్కుంట నాగేంద్రం దగ్గరికి వచ్చింది.

‘‘అవ్వా! నువ్వు తయారుకా- నాతోపాటు తీసుకపోతా.’’

ఆ మాటకు లసుమవ్వ కదిలిపోయింది. లసుమవ్వకు ఎక్కడో గుర్రు వుండేది. ఆ మాటతో తల్లి మనసు కరిగిపోయింది.

‘‘నాయిన నాగేంద్ర- మా వత్తరా? నీకేం కట్టం కలుగుతందిరా నాకు సెప్పరా?’’ అన్నది ఏడుపు గొంతుతో.

నాగేంద్రంకు బుసబుస దుఃఖం పొంగింది. ఆ దుఃఖం ఎన్నేండ్ల నుండి ఘనీభవించిందో. జాతరలో తప్పిపోయిన పిల్లవాడు హఠాత్తుగా తల్లిని చూసినట్లుగా తల్లి మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు.

లసుమవ్వ తనూ ఏడుస్తూ తన జిగిసచ్చిన చేతులలో ఒళ్లంతా పునికింది. ‘కానరాని దేశంలుంటివి బిడ్డా! నీ కట్టం తెలువకపాయె సుకం తెలువక పాయె బిడ్డా!’’ లసుమవ్వ.

నాగేంద్రం చాలాసేపు ఏడ్చి బరువంతా తీరిపోయి కళ్లు తుడుచుకున్నాడు. అప్పటికి పిల్లలు, వదినె, మరదలు, తమ్ముడు ఆందరు ఏడుస్తున్నారు.

‘‘ఎందుకేడుత్తుండ్లురా? లచ్చన్నా బండి తే పో- మీఅందర్ని తీసుకపోత- సెలవులకు వచ్చేరు. అవ్వా! నువ్వు తయారుగావే,’’ అన్నాడు ఏమి ఎరుగనట్లే చిన్న పిల్లగాన్ని తీసుకొని ముద్దులాడాడు.

లసుమవ్వ తేరుకొని, ‘‘నాగన్న నువ్వు బాగుంటే అదే పదివేలు నాయినా! కోడలును ఏమనకు. మల్ల నెలకు రాండ్లి, నేను సుత మీ ఎంటత్త. ఇప్పడు పనులదెవసం- సెరువట్ల వున్నది. బిడ్డా! నాగన్న నేను నీకాడికి రాపోతే ఏడికి పోతరా!’’ అన్నది.

‘‘వదినా! మల్లచ్చినప్పుడు సెలవులు సూసుకొని అందరు రావాలె,’’ నాగేంద్రం.

‘‘మా వస్తం,’’ సావిత్రి.

‘‘నేనత్త చిన్నాయిన,’’ రమణ.

‘‘సరే నడువే.’’

‘‘వద్దే, దసరా సెలవులకు పోయేవు. నీ చదువో?’’ సావిత్రి.

‘‘సరేనమ్మా దసర సెలవులకు నేను వచ్చి తీసుక పోతకదా!’’ నాగేంద్రం.

లక్షిరాజం బండి కట్టుక వచ్చాడు.

పోశాలు అందరికన్నా ముందే బండెక్కి కూర్చువ్నాడు.

వాడి తల్లి వచ్చి, ‘‘పనులదెవసం- నాయిన్న సెరువు పనికిపోతే ఎడ్లు ఎవలు కాయాలెరా? అక్క పోయినప్పుడు పోయేవు.’’

పోశాలు కాళ్లు నేలకేసి కొడుతూ ఏడుస్తున్నాడు. నాగేంద్రం బండెక్కాడు. నడి ఊర్లెదాక అందరు సాగనంపుతూ వచ్చారు. అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు.

బండి ఊరి బయటకొచ్చింది. తూర్పు దిక్కు ఏగిలి వారుతోంది. బండి గీరెలు కరకర లాడుతున్నాయి. బండి ముందు ఎవరో పరుగెత్తుతున్నారు. కొంత దూరం పోయిన తర్వాత తెలిసింది. పరుగెత్తేది పోశాలని.

‘‘ఓరి నీ కడుపున అంబలి బొయ్య,’’ లక్షిరాజం.

‘‘పోశన్న రారా! బండెక్కు,’’ నాగేంద్రం.

పోశాలు బండి మీదకెక్కాడు. ‘‘మీ అవ్వ పరిషానైతదిరా?’’ లక్షిరాజం.

‘‘పోనీయ్‌రా! నేను బస్సు ఎక్కేకాడికి వస్తడు. ఎవరన్న కలిస్తే ఇంటికి చెప్పి పంపుదాం,’’ నాగేంద్రం.

బండి నడుస్తుండగా, ‘‘అన్నా! నేను నీకు చెప్పేటోన్ని కాదు. నువ్వు పల్లె సర్గమనుకుంటున్నవ్‌. కానిఈడ పల్లెలు మునుపటి తీర్గలేవ్‌,’’ లక్షిరాజం.

‘‘లెవ్వు నిజమే.’’

‘‘సత్తె నాశినం అయిపోయినయ్‌, నువ్వు గది చూడలే?’’

‘‘లచ్చన్నా అది సత్తె నాశినం కాదు. పెనుగులాట – పోనీ నువ్వు నా దగ్గరికి రా! మందుల దుకాణం పెడుదాం,’’ నాగేంద్రం.
లక్ష్మిరాజం తత్తరపడ్డాడు.

‘‘నువ్వు రావు. నువ్వే కాదు. ఏ రైతు మెడలు బట్టి దొబ్బేదాక ఊరు విడువలేడు. నువ్వు నాలాగా పెద్ద చదువులు చదువుకోలేదు. చదువు మంచిదని- చదువుకుంటె సర్వం తెలుస్తదని చెప్పుతరు. నాకు అర్థమైనంతవరకు నేను అనుభవించినంత వరకు చదువంటే సృష్టికర్తలైన మనుషుల నుండి కొంతమందిని వేరుచేసి శిక్షణ ఇవ్వడం. అప్పుడు రైతు బిడ్డడు, కార్మికుని కొడుకు తల్లి పేగు సంబంధం తెంపుకొని ప్రభుత్వంగ మారతాడు. తన తండ్రి మీదికే తన బంధువుల మీదికే అధికారిగా వస్తాడు. మాయ జేస్తాడు. చదువు చెప్పే పంతులుగా మందులిచ్చే డాక్టరుగా, తగువులు పెంచే వకీలుగా, జడ్జిగా, పోలీసాఫీసర్‌గా, మంత్రిగా, ఎం.ఎల్‌.ఏ.గా ఎన్నయినా అవుతాడు. మనలాంటి దేశాలల్లోనైతే సకల అధికారాలకు, దోపిడికీ ఈ చదువుకున్నవాళ్లే మధ్యవర్తులు. గవర్నమెంటు భాషలో చెప్పాలంటే వీళ్లే యంత్రాంగం,’’ నాగేంద్రంకు ఇంకా బాగా చెప్పరావడం లేదు.

బండి నడుస్తోంది. పోశాలుకు వీళ్లిద్దరేం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అతనికి పెదనాన్నతోపాటు ఊరికి పోతనని ఉత్సాహంగా వున్నది.
తూర్పున సూర్యోదయాన్ని తెలుపుతూ ఎర్ర డౌలు ఆకాశమంతా పాకుతున్నది.

**** (*) ****

మొదటి ముద్రణ: ఆంధ్రజ్యోతి 1990 ప్రమోద దీపావళి ప్రత్యేక సంచిక4 Responses to మధ్యవర్తులు

 1. జ్యోతి
  November 6, 2017 at 8:34 am

  ఎంత మంచి కథ. లసుమవ్వ బాధ, నాగేంద్రం మనసులోని సంఘర్షణ, మిగిలిన కుటుంబ సభ్యుల జీవన పోరాటం…ప్రతి ఒక్క అంశం మనసుని తాకేలా రాసిన రచయిత అల్లం రాజయ్య గారికి నిజంగా హేట్సాఫ్. చదువు జీవన ప్రమాణాలను పెంచుతుందనే నాణానికి మరోవైపు తల్లికి-బిడ్డకు, అన్నకు-తమ్మునికి, మనిషికి-మట్టికి అది ఏర్పరిచే అగాధం. ఆ అగాధంలోతును, దానిలోని చీకటి కోణాలను ఇంత విపులంగా చూపించిన కథ ఏదీ చదివిన గుర్తులేదు. ప్రచురించినందుకు ధన్యవాదాలు.

 2. November 6, 2017 at 10:13 am

  ఇలాంటి కథలు చదవగానే- మనస్సులో దిగులు– కళ్ళల్లో నీరై కురుస్తుంది– కాస్సేపు ఆగి అలోచిస్తే–నాకేందుకో — ఈ అలోచనల్లో నిజము కనిపించదు జొ–నిజంగా వ్యక్తులు – వాళ్ళ చేతగాని తనాన్ని– అసమర్థతనో– బయటికి చెప్పుకోలేక– దాన్ని డబ్బు మీద— చదువు మీద- వాల్ల జీవితాల్లో వున్న ఎదుటి వ్యక్తుల మీద వేస్తారు అనిపిస్తుంది— ఇది హిపోక్రసీ– పలాయన వాదము కాదా? ఈ కథే తీసుకుంటే నాగేంద్ర అలా అవ్వటానికి అంతగా ఫీల్ అవ్వటానికి కారణము చదువు- సులొచన ఎలా అవుతారు చెప్పు?–

  • vidyasagr
   November 6, 2017 at 4:53 pm

   సరిగ్గా చెప్పారు.

 3. ప్రసాద్ చరసాల
  November 10, 2017 at 9:22 am

  బహుశా ఈ కథను చదివిన ప్రతొక్కరూ నాగేంద్రలో తమను చూసుకుంటారు.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)