కథ

చక్రవేణు – ‘కువైట్ సావిత్రమ్మ’

డిసెంబర్ 2017

కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన చక్రవేణు 1990 లో రాసిన ‘కువైట్ సావిత్రమ్మ’ అప్పట్లో ఒక సంచలనం.

పల్లెల పచ్చదనం గురించీ, పల్లెవాసుల మానవ సంబంధాల జీవన సౌందర్యం గురించీ సాహిత్యంలో కలల ప్రపంచాన్ని సృష్టించే మధ్యతరగతి మిథ్యాజీవుల రచనా ధోరణికి భిన్నంగా – ఓ కర్కశ జీవిత వాస్తవాన్ని మరింత నిర్దాక్షిణ్యంగా కథలోకి తెచ్చిన అరుదైన రచయిత చక్రవేణు.

పిల్లల పెళ్ళిళ్ళుచేయటానికి కోవేటి (కువైట్) నుంచీ తన ఊరు వచ్చింది సావిత్రమ్మ. భర్త చనిపొయాక తన మీద అత్యాచారం చేసిన సొంత మరిది చిన్నబ్బ ఆమే వ్యభిచారం చేస్తోందని ఒకప్పుడు పెట్టించిన పంచాయితీ, భర్త పోయాక ఆదుకోవాల్సిన బంధువుల ఊరిజనాల వెలివేత, ఫలితంగా ఊరొదిలి రహెమాన్ సాహెబ్ అండదండలతో కువైట్ వెళ్ళి డబ్బు సంపాదించి వచ్చాక తిరిగి వాళ్ళే నెత్తిన పెట్టుకోవటం, తమ భార్యల్నీ కూడా కువైట్కి పంపమని తరలివచ్చిన అదే మగప్రపంచం…

కథా చిత్రణలో flashback ను ప్రతిభావంతంగా వాడుకోవటం, పాఠకుడికి ఊపిరాడనంత వేగంగా కథను పరిగెత్తించిన తీరు, సూటిగా క్లుప్తంగా మామూలు మాటల్లో జీవితపు కాఠిన్యాన్ని చిత్రించటం ఈ కథలో కొట్టొచ్చినట్టు కనపడే రచనా శైలి. కడప ప్రాంతం నుంచీ బొంబాయి వెళ్ళే కిక్కిరిసిపోయిన ఆనాటి రైళ్ళూ, ఊళ్ళూ ఈ కథా నేపద్యం.

ఈ కథ గురించి “వలస అన్నది మనిషిని ఆదుకుంటూనే ఉంది. ఒక చోట తిండి దొరకకపోతే మరో చోటకి వెళ్ళి తిండి వెతుక్కుంటాడు మనిషి. ఆ మనిషి మగ వాడైతే శ్రమ దోపిడి మాత్రమే ఎదుర్కోవాలి. ఆడది ఐతే శరీర దోపిడీని కూడా భరించాలి. ఒక వైపు స్త్రీకి కట్టడి విధించే సమాజమే అదే స్త్రీని సంతలో నిలబెట్టి బానిసను చేసి అమ్మేస్తుంది.” అన్నాడట రచయిత.

1985 నుంచీ 1993 వరకూ ఏడెనిమిదేళ్ళలోపే ‘కొత్త చదువు’, ‘కసాయి కరువు’, ‘తెగిన పేగు’, ‘మృత్యుహక్కు’ వంటి గుర్తుండి పోయే కథలు రాసిన చక్రవేణు ఒక యాక్సిడెంట్లో తన మూడు పదుల వయసులోనే మరణించటం తెలుగు కథకు ఎంత నష్టమో ఈ కథ చదివితే మనకు అర్ధమవుతుంది.

- సురేష్


కువైట్ సావిత్రమ్మ

చక్రవేణు

సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్లూ ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకూ ఆవైపు అంత గొప్పగా పెండ్లి జరిపినవారే లేరని కీర్తించారు.

‘ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా,’ అని పెదవి విరచి మాట్లాడిన ఇల్లాళ్లు వున్నారు!

‘కడుపు నిండా కూడుపెట్టి లడ్డూ కారాలూ, చేసుకున్న పలారాలన్నీ కొరవ లేకుండా పెట్టించింది సాయిత్రమ్మ. పనీ పాటోళ్లను మరిసిపోకుండా చూసింది, నా తల్లి. ఈ చుట్టుపక్కల ఏ పెద్ద రైతన్నా ఇట్టా పెండ్లి కూడుపెట్టినోళ్లుండారంటమ్మే! పొద్దిట్నించీ మాయిటాల్దాకా పెండ్లింటి ముందు కూకోపెట్టి ఆకిరికి అంతా అయిపోనిచ్చి అడుగుబుడుగు ఊడిచేసింది సిలుం కూడు- చారునీళ్లు మన మొకాన పోస్తారు. ఇట్టా మన సాయిత్రమ్మలాగా ఎవురన్నా మంచి కూడుగానీ, పలారాలుగానీ పెట్టినోల్లుండారా!’ అని మాలపల్లి ఆడోళ్లు సాయిత్రమ్మను గురించి మరీ మరి పొగుడుకుంటూ చర్చించుకుంటున్నారు.

సావిత్రమ్మను అందరూ ‘కువైట్‌ సావిత్రమ్మ’ అని పిలుస్తారు. ‘కువైట్‌’ అనేది ఇంటి పేరుగా మారడానికీ, ఆమె ఆ ప్రాంతానికంతటికి మొదటిసారిగా డబ్బులు సంపాదించుకోవడానికి కువైట్‌ వెళ్లడమే కారణం. అప్పటి నుండీ ఆమెను ‘కువైట్‌ సావిత్రమ్మా!’ అని పిలవడం అలవాటయింది.

‘ఇప్పుడు గనక తన భర్త వుండి వుంటే, కొడుకూ, కూతురికీ ఇంత ఘనంగా పెండ్లి జరిగినందుకు ఎంత సంతోషపడునో… అయినా నా పిచ్చిగాని, ఆయన వుంటే నేను కువైట్‌కు ఎందుకు పోదును, కష్టమో- సుఖమో ఇక్కడే అందరితోనూ నేనూ వుండేదాన్ని కదా,’ అనుకొంటూ భర్తను గుర్తుకు తెచ్చుకొని బాధపడింది.

కొత్తగా కట్టించిన యింటిని తేరిపార చూసింది. ఊరి వాతావరణం మనసులో మెదిలింది. తన భర్తతో కలిసి జీవించిన రోజులు గుర్తుకొచ్చాయి, కన్నీళ్లు కొంగుతో ఒత్తుకుంది. భర్తలేని ఒంటరితనం, ఆయనతో కలసి వుండిన ఈ ఊరులో, ఇంటిలో ఎక్కువకాలం వుండలేననుకొంది. అందుకే తిరిగి కువైట్‌కు వెళ్లాలని నిర్ణయించుకొంది. అయితే ఈసారి కొడుకు లేకుండా తాను ఒక్కతే పోవాలనుకుంది. తన దగ్గర ‘ఆజా వీసా’ వుంది కాబట్టి సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చి కొడుకు కోడల్ని, కూతురు అల్లుడిని చూసుకొని వెళ్తూ వుంటే సరిపోతుంది. సావిత్రమ్మ అట్లా ఆలోచిస్తూ నిట్టూర్పు విడిచింది.

కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చుకొన్నందుకు, బరువు దించుకొన్నట్లుగా ఊపిరి పీల్చుకొంది.

ఇప్పుడైతే తనను అందరూ ఎంతో మర్యాదగా పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సహాయం చేయమని కోరుతున్నారు. తమ పిల్లలకు ‘వీసా’లు పంపమనీ, పరపతిచ్చి ఆదుకొమ్మని కొందరూ!

‘నీ రుణం వుంచుకోములే సాయిత్రమ్మా! మమ్మల్ని కూడా ఒక కంటి కనిపెట్టి చూడు, ఆదుకో పుణ్యముంటుందిలే,’ అని ప్రాధేయపడుతున్నారు.

‘వీళ్ల మాటలు, పలకరింపులు అంతా మనస్పూర్తిగానే చేస్తున్నారా, లేకుంటే నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి గౌరవిస్తున్నారా! మరి వీళ్లంతా ఒకప్పుడు నన్ను ఎంత కించిత్తుగా చూసేవాళ్లు!’

సావిత్రమ్మ అట్లా ఆలోచిస్తూ వుంటే, వెనకటి రోజుల్లో, తన బతుకులో మర్చిపోలేని సంఘటన గుర్తు కొచ్చింది.

ఆ రోజు గురించి తలుచుకుంటే పీడకలలాగా అనిపిస్తుంది. అందుకే ఆ రోజును ఎప్పటికీ మర్చిపోదు సావిత్రమ్మ.

***

ఆ రాత్రి బాగా పొద్దుపోయింది. అందరూ అన్నాలు తినడం పూర్తయింది. రాత్రి పండుకోవడానికి సిద్ధమయ్యే సమయంలో, యింటి ముందు ఎవరో నిలబడి పిలిస్తే సావిత్రమ్మ బయటకొచ్చి చూసింది.

‘‘సాయిత్రమ్మా! పెద్దబ్బోల్లింటికాడ మద్దిచ్చ మంట నిన్ను రమ్మంటన్నారమ్మో,’’ అని ఊరి పెద్ద చాకలి వెంకటయ్య వచ్చి చెప్పినాడు.

‘‘నేనెప్పుడన్నా మద్దిచ్చాల కాడకు వచ్చినానా ఎంగటన్నా? కాదు కూడదంటే మా యింటాయన పోతా వుండె, ఇంక ఆయన చచ్చిపోయినాక ఎవరుండారు మా యింట్లో మద్దిచ్చాం కాడకు రాను?’’ సావిత్రమ్మ చెప్పింది.

‘‘మద్దిచ్చంకాడకు ఇనే దానిక్కాదు సాయిత్రమ్మ, ఆడ మీ ఓల్లే నీ మీద మద్దిచ్చం పెడతన్నారమ్మా, అందుకని గబాన పోయి పిల్చుకోని రాపోరా! అంటే వచ్చినాను తల్లీ,’’ వెంకటన్న వివరించినాడు.

‘‘నాపైన మద్దిచ్చమా…దేనికంట, నేనెవుర్నన్నా పొడిసినానా…లేకుంటే ఎవరి కొంపన్నా ముంచినానంటనా… సరేగాని ఆడెవురూరు వచ్చినారు ఎంగటన్నా,’’ సావిత్రమ్మ అడిగింది.

‘‘అంతా మీ చుట్టాలే వుండారమ్మా…పెద్దబ్బి గోరి రామయ్య వుండాడు. మీ మరిది చిన్నబ్బ వుండాడు. సావుకారి నాగయ్యను పిలిపించినారు. ఇంకా మీ ఓల్లు ఆడోల్లంతా వుండారమ్మ,’’ చాకలి వెంకటయ్య పేర్లన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఎవరు వచ్చిందీ చెప్పాడు.

ఆ మద్దిస్తం తనపైన ఎందుకు పెడుతున్నారో సావిత్రమ్మ మనసుకు అర్థమైపోయింది. అయినా పోయి తీరాలి. ఏదైతే అది అవుతుంది, వెళ్లక తప్పదు అనుకొనింది.

‘‘సరేలే నువ్వు పో ఎంగటన్నా, మా యమ్మ కోమిటోల్లింటి కాడికి వక్కల కోసం పోయింది. ఇంట్లో పిల్లోల్లంతా నిద్దరపోతున్నారు. ఆమె రాంగానే చెప్పొస్తాను నువ్వు పదా.’’

‘‘ఎందుకులే సాయిత్రమ్మా పెద్దామెను రానిచ్చే పోదాములే! బాగా పొద్ది పోయింది ఒక్కదానివే రాలేవులే అమ్మా!’’ వెంకటయ్య సౌమ్యంగా చెప్పాడు.

వెంకటయ్య మాట్లాడుతూ వుండగానే, సావిత్రమ్మ తల్లి లక్షమ్మ అంగడి నుండి వచ్చింది.

‘‘ఏం ఎంగటా ఊర్లో అన్నం పెట్టిచ్చుకునేదయిపోయిందా,’’ లక్ష్మమ్మ వెంకటయ్యను పలకరించింది.

వెంకటయ్య ఔనని తల వూపి, వచ్చిన సంగతి చెప్పాడు.

సావిత్రమ్మ మద్దిచ్చం సంగతి వినగానే దిగులుగా నిలబడిపోయింది. అప్పటికే తన భర్త మీద మద్దిస్తాలు ఎన్నోసార్లు జరిగాయి. ఈరోజు మల్లా ఏది మాట్లాడతారో, చుట్టాలు పగపట్టినట్టుండారు కదా అనుకొని బాధపడింది.

సావిత్రమ్మ తల్లికి చెప్పేసి వెంకటయ్యతో పాటు పెద్దబ్బగారింటి కాడికి బయలుదేరింది….

పెద్దబ్బగారిల్లంటె తన భర్త పుట్టి పెరిగిన ఇల్లు. తన భర్త తాతగారి పేరు. పెద్దబ్బ పెత్తనం వచ్చేటప్పటికి ఐశ్వర్యం బాగా తగ్గిపోయింది. కొడుకు రాజయ్యగానీ, కోడలు సావిత్రమ్మగానీ అతని మాటను కాదనకుండా నడుచుకున్నారు.

తండ్రి వ్యాపారం చేస్తానంటే కొడుకు రాజయ్య ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఎట్లా ఇష్టముంటె, అట్లా చేయమన్నాడు. తండ్రి వ్యాపారం చేస్తూ వుంటే రాజయ్య శ్రద్ధగా వ్యవసాయం చేయడం సాగించాడు. నాలుగైదేళ్లకు బాకీలన్నీ తీరిపోతాయి కదా అనుకున్నారు. కాని అనుకున్నది తారుమారై తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో అప్పుల వాళ్లంతా రాజయ్య మీదకు రావడం, విధిలేక భూములమ్మి తండ్రి చేసిన బాకీలు తీర్చడం, దాయాదుల దగ్గర తక్కువచూపుగా బతకడం ఇష్టం లేక ఇంటి జాగాతో సహా అన్నగార్లకే ఇచ్చేసి, ప్రక్కనే ఆనుకొని వున్న దిగవపల్లెలో ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు. తండ్రి పోయాక సంవత్సరం కూడా తిరగకుండానే ‘రాజయ్య’ కూడా గుండెనొప్పితో హఠాత్తుగా చనిపోవడం అంతా ఒక కలలాగా జరిగిపోయింది. భర్త రాజయ్య చనిపోయాక, సావిత్రమ్మ కుటుంబానికి ఎవరి ఆదరణ లేక ఒంటరిదయింది. చివరికి ఇల్లు కూడా జరగని పరిస్థితిలో దిక్కులేనిదైపోయింది.

దిగవ పల్లెకూ- పెద్దూరికి మధ్యన చిన్న ఒంక మాత్రమే అడ్డముంది. ఒంక దాటుకొని ఊర్లోకి పోయేటప్పటికి పెద్దబ్బగారింటి కాడ వీధి కరెంటు లైటు కింద జనమంతా గుంపు కూడి, సావిత్రమ్మ కోసమే ఎదురుచూస్తున్నారు.

పెద్దబ్బగారింటి పందిరి కింద వేసిన పట్టెమంచంపై సావిత్రమ్మ బావగారు రామయ్య ఒక వైపు, షావుకారి నాగయ్య మరొక వైపు కూర్చున్నారు. వాళ్లకు ఎదురుగా వీధిలో తూర్పుదిక్కు కరెంటు స్తంభం దగ్గర రాతి బండలపైన సావిత్రమ్మ మరిది చిన్నబ్బ, ఆయనతో పాటు ఇంకా కొంతమంది మగవాళ్లు పెద్దలు కూర్చున్నారు.

వీధికి వారగా ఉత్తరం దిక్కున కొందరు, దక్షిణం దిక్కున కొందరు ఆడవాళ్లు కూర్చొని ఉత్సాహంగా చర్చించుకుంటూ గుసగుసలాడుకున్నారు. కొందరేమో ఎవరి వాకిళ్లలో వాళ్లు కూర్చొని జరగబోయే దానికోసం ఎదురు చూస్తున్నారు. సావిత్రమ్మ అక్కడికి రాగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడ్డం ఆపారు. సావిత్రమ్మ నేరుగా వెళ్లి తన తోడుకోడళ్లు కూర్చున్న చోటకు వెళ్లింది. సావిత్రమ్మ కూర్చోగానే తోడికోడళ్లు ఇద్దరూ దూరంగా జరిగిపోయారు. సావిత్రమ్మ ఒక్కతే నేరం చేసిన దానిలాగా బోనులో వున్న తీరుగా కూర్చుంది.

షావుకారు నాగయ్య సావిత్రమ్మను కళ్లద్దాల్లోంచి తేరిపార చూసి, ‘‘ఒరే చిన్నబ్బా…మరి మీ వదిన వచ్చింది,’’ అన్నాడు.

నాగయ్య మాట పూర్తిగాక ముందే చిన్నబ్బ అభ్యంతరం చెప్పాడు. ‘‘మామా ఇంకోసారి ఆ మాటనగాకు, అది నాకు వదిన కాదు! మా అన్న చచ్చిన రోజే అది నాకు వదిన కాకుండా పోయింది.’’

‘అవును నిజమేకదా! వాడన్న వుండి వుంటే నేను వదిన. అన్న చచ్చినాడు కాబట్టే, నెల కూడా తిరగక ముందే నన్ను బెదిరించి బలవంతంగా చెడిచినోడికి నేను వదిన వరస ఎట్టవుతానులే!’ సావిత్రమ్మ మనసులోనే గొనిగింది.

‘‘నువ్వు అనకున్నా, మేము అట్లా అనాల్సిందే కదరా!… సరేలే ఆమె వచ్చింది మరి…నువ్వేదో చెప్పాలంటివి కాదా చెప్పు,’’ నాగయ్య మద్దిస్తం ప్రారంభించాడు.

నాగయ్య మద్దిస్తం జరుపుతున్నాడంటే, ‘జిత్తులమారి నక్క పంచాయితీ పెట్టింది,’ అనేది ఆ  గ్రామంలో ప్రతీతి. అందుకే జనంలో నుండి, ‘‘చెప్పు నాయనా – నక్క తీర్పు చెప్పు,’’ అన్నారు.

‘‘ఏమిరా చిన్నబ్బా. కానీ మరి,’’ నాగయ్య అన్నాడు.

‘‘నన్నడిగేదేముండాది మామా! అది చేసే పని, మమ్మల్ని నలుగుర్లో తలెత్తుకోకుండా చేస్తోంది. ఊర్లో ఎవురు పట్టినా దీని మాటే చెపుతా మమ్మల్నీ, మా కుటుంబాన్నీ నవ్వులపాలు చేస్తన్నాది. ఆ సంగతి అందరికీ తెలుసుకదా!’’

చిన్నబ్బ ఆవేశంతో రొప్పుతూ అరిచాడు.

‘‘ఓరి చిన్నబ్బా అరిస్తే పొయ్యేది మన పరువేరా! దానికేమి సిగ్గూ మానం అనేది వుండేది కదా!’’ సావిత్రమ్మ బావగారు రామయ్య ఎత్తిపొడుపుగా అన్నాడు.

‘‘ఏమిరా చిన్నబ్బా, ఆయమ్మి సంగతి ఏం చెబుతావో చెప్పేసెయ్‌, ఈ పొద్దు ఏదో ఒకటి తేలాల.’’

రామయ్య గట్టిగా అరిచాడు.

‘‘నేను చెప్పాల్నా నువ్వు చెప్పకూడదా!’’ అంటూ చిన్నబ్బ, అన్ననే చెప్పమన్నాడు.

‘‘కడుపు చించుకుంటే కాళ్ల కాడ పడ్తాదని, ఆ పాడు మాటలన్నీ పెద్దోడు, దరమాత్తుడు నోటి బడీతా ఎందుకులే, నువ్వే చెప్పరా అబ్బా.’’

ముందుగానే అనుకున్న పథకాన్ని గుర్తుచేశాడు నాగయ్య.

అనుకున్న పథకం ప్రకారం ఏదో ఒకటి తొందరగా తేల్చాలి లేకుంటే మద్దిస్తం తారుమారవుతుందని చిన్నబ్బ గ్రహించి చెప్పడం ప్రారంభించాడు.

‘‘మామా, ఊర్లో యిన్ని రోజులా ఇది, ఎవురెవురితోనో వ్యభిచారం చేసింది. ఎన్నిసార్లో కొట్టినాం, తిట్టినాం. అయినా మానుకోలా. నలుగుర్లో మా పరువు తీసింది. ఇప్పుడు అక్కడెక్కడి నుంచో కువైట్‌కు పోయి ఒక నా కొడుకు వచ్చి వున్నాడు. ఈళ్లమ్మగారి వూరంట. రహిమాన్‌ అంట, ఆడితో కులకతా వుండింది. మా వంశాన్ని నాశనం చేయడానికే ఇది మా యింటికొచ్చింది.’’ చిన్నబ్బ ఆవేశంతో రొప్పుతూ అసలు విషయం బయటపెట్టాడు.

‘‘ఏమమ్మే, వాడు చిన్నబ్బ చెప్పేది నిజమేనా!’’ నాగయ్య సావిత్రమ్మను విచారించాడు.

‘‘ఏందయ్యా, దాన్నిచారించేది. అది ఈ వూళ్లో వుంటే మా పిల్లోళ్లకు పెండ్లిళ్లు కూడా కాకుండా, దాని బతుకును ఏలెత్తి చూపుతారు. ఉంటే వూర్లో అదన్నా వుండాల, లేకుంటే మేమన్నా వూరొదిలి పోవాల. అంతే ఏదో వొకటి తేల్చాలి ఈ రోజు,’’ రామయ్య తమ్ముని మాటలకు జత కలిపి అరిచాడు.

సావిత్రమ్మకు కళ్లల్లో నీళ్లు ఉబికి జలజలా రాలిపోతుంటే మౌనంగా రోదిస్తూ కూర్చుంది. జనంలో మరలా శబ్దం మొదలైంది.

‘‘ఏం సాయిత్రమ్మా తలొంచుకొని ఏడిసేదెందుకు. ఈడందరూ పతివర్తలైపోయి లోకానికి విరుద్ధంగా నువ్వు ఒక్కదానివే వ్యభిచారం చెయిలేదులే. ముసుగులో కనపడకుండా చేస్తే అందరూ పతివర్తలే, ముసుగు తీసితే అందరి గుట్టు ఎత్తిపోసినంతుంటాది. నీకేం భయంలేదు. నువ్వు చెప్పాలనుకొనేదేదో తెగేసి చెప్పేయ్‌.’’

మేమందరం నీకు మద్దతుగా వున్నాము, ఫరవాలేదన్నట్లు, చెంగవ్వ ధైర్యం చెప్పి, సావిత్రమ్మను మాట్లాడమనింది.

‘‘ఏమమ్మే! వాళ్లు చెబుతా వుండేది యినపడతా వుండాది కదా! గమ్మున మూగెద్దులాగా వుంటే ఎట్ట. ఏం చెబుతావో చెప్పు,’’ నాగయ్య గట్టిగా దబాయించినట్టు అన్నాడు.

‘‘ఏముండాదని చెప్పేదన్నా! బలమున్నోళ్లది, నోరున్నోళ్లది చెల్లుబాటవుతాది. మీరంతా వాళ్ల దిక్కు మాట్లాడేదానికి వచ్చినారేగాని, నా మాట కూడ పట్టించుకోని న్యాయం చెప్పాలనుండారా!’’

సావిత్రమ్మ ఏడుస్తూనే మాట్లాడతా వుండాది. కొద్దిసేపు అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు. సావిత్రమ్మ చెప్పడం మొదలుపెట్టింది. అందరూ సావిత్రమ్మను సానుభూతితో చూస్తూ వింటున్నారు.

‘‘ఈళ్ల కందరికీ నేనేదో తల తీసేసినట్టు, లోకానికి విరుద్ధంగా నేనొక్కదాన్నే కాని పని చేస్తావున్నట్లు మాట్లాడతన్నారే. ఇన్ని రోజులూ ఈళ్లవురన్నా మమ్మల్ని ఆదుకున్నారా? మా యింటాయన పోయినాక, పాపం బిడ్డల గల్లదే అని విచారించి, ఒకపూటకు అన్నానికి సేరు గింజలుగానీ, రూపాయి డబ్బుగానీ ఇచ్చినోళ్లున్నారా? చెప్పమనండి చూద్దాం? సిగ్గు, మానం లేని బతుకంటున్నారే. అది నా పిల్లోళ్లను కాపాడుకొనేదానికే చేస్తున్నాగాని, ఒళ్లు బలిసి కొవ్వెక్కి చెయ్యలేదు. కూలికి పోయో, నాలికి పోయో నా బిడ్డలూ, నేనూ పస్తులుంటున్నామో, తింటున్నామో నా కొంపలో నేను పడున్నాను. ఎట్లనో నా బతుకు నేను బతికితే వీళ్లకేం బాధ. ఇప్పుడు ఆ కొంప కూడా లేకుండా తరిమికొట్టాలంటున్నారు. సరే అట్లనే కానీండి. నా బిడ్డలూ, నేనూ వూరొదిలి పోతాము, వాళ్లనే నా బతుకు కూడా బతికి రాజ్యమేలుకోమనండి.’’

సావిత్రమ్మ గబగబ ఆ మాటలనేసి, ఏడుస్తూనే తిరిగి వెనక్కి చూడకుండా పరుగెత్తుకొని ఇంటికొచ్చింది.

తల్లికి జరిగినదంతా చెప్పింది. అదే రోజు తెల్లవారుఝామున పాసింజరు రైలులో తల్లితోపాటు బిడ్డల్ని తీసుకొని పుట్టినూరుకు చేరుకొనింది.

పుట్టినింటి తరపున బంధువుల సహాయంతో రహిమాన్‌ సాహెబ్‌ అండదండలతో అతనితో కలసి కువైట్‌కి బయలుదేరిపోయింది. డబ్బులు బాగా సంపాదించి, ఇన్నాళ్లకు మరలా ఒక ఆస్తిపరురాలుగా భర్త వూరిలో కాలుపెట్టడం, పోయిన ప్రతిష్ట మరలా రావడం, అంతా విచిత్రంగా వుంది సావిత్రమ్మకు.

***

సావిత్రమ్మ మిద్దె వరండాలో మంచంపైన మేను వాల్చి గతాన్ని ఆలోచిస్తా వుంటే, అంతా ఆశ్చర్యంగానే వుంది. తనను ఈసడించి తరిమికొట్టిన బంధువులంతా ఇప్పుడు గౌరవించడం చూస్తే, వాళ్లది నటనే కానీ గౌరవం కాదని తెలుసుకొంది…ఎవరో వస్తున్నట్లు అలికిడైతే తలతిప్పి చూసింది.

మరిది చిన్నబ్బ, చిన్నబ్బ భార్య రామలక్ష్మమ్మ వచ్చి పిల్చేటప్పటికి, ఆలోచనల నుండి తేరుకొని లేచి కూర్చుంది.

‘‘భోజనానికి రమ్మని చెప్పి పంపితే రాకుండా, ఏడుస్తా కూకున్నావా! అక్కా!…అయినా ఆడబిడ్డను ఎన్ని రోజులు సాకినా అత్తగారింటికి పోయేవాళ్లేగాని, మనింట్లో వుంటారా,’’ రామలక్ష్మమ్మ అక్కకు ఓదార్పు చెబుతున్నట్టు చెప్పింది.

సావిత్రమ్మ దుఃఖించేది బిడ్డను అత్తగారింటికి సాగనంపినందుక్కాదని, సాటి బంధువులైన తనవాళ్లే తనను అవమానపరచి, వూరెళ్లగొట్టారని, గతాన్ని తల్చుకొని కళ్లల్లో నీరు కార్చిందని తోడికోడలు రామలక్ష్మమ్మ వూహించలేకపోయింది.

గతంలో వేర్లు పోకమునుపు కూడాగా వున్నప్పుడు కూడా తోడికోడలు రామలక్ష్మమ్మ తనతో వ్యతిరేకంగా వుండింది కాదు. అయితే మరిది చిన్నబ్బ చేసిన కట్టుదిట్టానికి భయపడి తనతో సన్నిహితంగా వుండేది కాదు. ఆ విషయం సావిత్రమ్మ ముందు నుంచి కూడా అర్థం చేసుకొన్నందువల్లనే, సావిత్రమ్మ; రామలక్ష్మమ్మ పట్ల అభిమానంగా వుండేది.

‘‘పోదాం పదక్కా అన్నం తినేసొద్దువు,’’ రామలక్ష్మమ్మ అక్కను బతిమాలింది.

‘‘ఎందుకులే రామలక్ష్మమ్మా నేను కూడా అన్నం చేసిపెట్టినా,’’ సావిత్రమ్మ జవాబిచ్చింది.

ఎంతసేపూ రామలక్ష్మమ్మ మాట్లాడుతుందేగాని, చిన్నబ్బ మాత్రం, సావిత్రమ్మతో ముఖాముఖి మాట్లాడలేదు. గతంలో అతని/తన ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని తల వంచుకొని నిలబడ్డాడు. సావిత్రమ్మ కూడా మరిది విషయాన్ని గమనించింది, అయినా పలకరించకుండానే వుండిపోయింది.

‘‘ఈ వారంలోనే కోవేటికి పోతన్నావన్నారు నిజమేనా అక్కా?’’

‘‘అవునమ్మే! పెళ్లికోసమని నిలబడినాగాని, లేకుంటే ఈపాటికే పోయుండాల్సింది. వచ్చే ఆదివారం జనతా ఎక్స్‌ప్రెస్‌లో బొంబాయికి పోయి, ఆడ్నించి కోవేటికి పోతాను,’’ సావిత్రమ్మ ఏమాత్రం కోపం లేకుండా మాట్లాడింది.

కొద్దిసేపు అందరి మధ్యన నిశ్శబ్దం ఏర్పడింది. వచ్చిన పని గుర్తుచేస్తూ, భార్యను అసలు విషయం మాట్లాడు అని సైగ ద్వారా చెప్పాడు చిన్నబ్బ.

‘‘మీ మరిది కూడా కోవేటికి రావాలంటున్నాడు అక్కా,’’ రామలక్ష్మమ్మ నసుగుతూ భర్త గురించి చెప్పింది.

తన దగ్గర వీసాలు ఏమన్నా వున్నాయని, వాటిని విచారించుకోవడానికే వచ్చినారని సావిత్రమ్మ గుర్తించింది.

‘‘నేను ఈసారి ఈసాలు తీసక రాలేదమ్మే, పెండ్లి విషయంలో పడి తొందరగా వచ్చేసినాను. ఒకేల రహిమాన్‌ మామ గనక తెచ్చుంటే అడిగి చెబుతాను,’’ సావిత్రమ్మ వివరించి చెప్పింది.

‘‘రహిమానన్నను అడిగితే మొగోళ్లకు తేలేదు. ఆడోళ్లకు కావాలంటే  వీసాలు తెచ్చినామని చెప్పినాడు వదినా!’’

ఎట్టకేలకు చిన్నబ్బ వదినతో మాట్లాడాడు. కాని సావిత్రమ్మ మాత్రం అతని మాటలకు జవాబివ్వకుండా వుండిపోయింది.

ఒకప్పుడు రహిమాన్‌ సాహెబ్‌ను, తనను ఇంట్లో వేసి అగ్గిపెడతానని గలాటా చేసిన చిన్నబ్బ, ఈరోజు ‘రహిమానన్న’ అని అనడం సావిత్రమ్మకు ఆశ్చర్యం అనిపించింది.

‘‘మొగోళ్లకు ఈసాలు తేలేదు కదా, అందుకని మీ మరిది నన్ను పంపించాలంటన్నాడక్కా…నువ్వు రమ్మంటే వస్తానక్కా…!’’ రామలక్ష్మమ్మ ప్రాధేయపడ్తున్నట్లుగా అడిగింది.

‘‘నాదేముండాది… రహిమాన్‌ మామ రమ్మనుంటే అట్లే రండి…కానీ అక్కడ చానా యిబ్బందులుంటాయి. వాటిని ఓర్చుకొంటామనేటుగా వుంటేనే రావాల. ఒకేల వచ్చినాక అక్కడి పనులు చేయలేమనుకుంటే మీకే నష్టం… అందుకుని ముందుగానే ఆలోచించుకోండి,’’ సావిత్రమ్మ, తోడికోడలుకే కాకుండా మరిది కూడా వినాలని గట్టిగా చెప్పింది.

‘‘నేను చేను కాడికి పోయ్యేసొస్తా,’’ చిన్నబ్బ భార్యతో అనేసి వెళ్లిపోయాడు.

సావిత్రమ్మ, రామలక్ష్మమ్మ ఇద్దరూ ఏం మాట్లాడకుండా కొద్దిసేపు వున్నారు. తర్వాత సావిత్రమ్మ మాట్లాడింది.

‘‘నేను నేరుగా బొంబాయికి పోతూనే ఎక్కువ రోజులుండకుండానే కోవేటికి పోతాను. నువ్వు నానంబడే వచ్చేదానికి వీలుపడదు రామలక్ష్మమ్మా, నీకు బొంబాయిలో డాక్టర్లు పరీచ్చలు చేసి, పాస్‌ పోటో, ఈసా తనికీ చేసేసినాక అన్నీ రెడీ అయ్యేటప్పటికి సుమారుగా ఎంత లేదన్నా రెండు, మూడునెల్లన్నా పడతాది,’’ సావిత్రమ్మ వివరించింది.

‘‘రహిమాన్‌ మామ కూడా మా యింటాయనతో అదే మాట చెప్పినాడంటక్కా!’’

‘‘సరే నీ బడీతా మీ యింటాయన్ను కూడా బొంబాయిదాకా రమ్మన్నాడా, లేకుంటే వద్దులే అన్నాడా.’’

‘‘నీకు మర్లా ఖర్చు దేనికి చిన్నబ్బా… నేను బడీతా వుండి నీ భార్యను జాగర్తగా పిల్చకపోతాను కదా, అని రహిమాన్‌ మామ చెప్పినాడంటక్కా!’’

రామలక్ష్మమ్మ అమాయకంగా చెపుతాంటే సావిత్రమ్మకు ఒక విధమైన సానుభూతి కల్గింది. రామలక్ష్మమ్మకు భర్త ఏమీ చెప్పినట్టుగా లేదనుకొనింది. రహిమాన్‌ ఉపాయం ఏమిటో కూడా ఆమెకు తెలిసినట్లుగా లేదనుకొనింది.

‘‘కాని రామలక్ష్మమ్మ నీకొక సంగతి చెప్పాలమ్మే! మర్లా ఇదిగో చూడు ఆ యక్కయినా ఒక మాటన్నా చెప్పలేదు చూడు అనుకోగాకు… బొంబాయికి పోయినాక ఎట్టలేదన్నా నీవు రెండు మూడు నెలలు అక్కడే వుండొచ్చు. ఈ రెండు నెలలు, నిన్ను తీసకపోతా వుండారే ఏజెంట్లు, వాళ్లు మర్యాదగా చూస్తారనుకోగాకు. అక్కడ వాళ్లకు కావాల్సిన మొగోళ్ల దగ్గరికల్లా నిన్ను పంపిస్తారు. నేను చెప్పేది మాత్రం అచ్చరాల నిజం. నీకు ఇష్టమున్నా లేకున్నా సరే వాళ్లు చెప్పింది చేయకుండా మాత్రం కోవేటికి పోలేవు. నీమీద నాకు దయుండాది కాబట్టే నీకు ఈ సంగతి చెబుతున్నా. ఆడోల్లు కోవేటికి పోతన్నారంటె అంత సులభంగా పోతన్నారనుకోవద్దు. అందుకని బాగా ఆలోచించుకో.’’

సావిత్రమ్మ ఏజంట్ల గుట్టునూ, దళారీతనాన్నీ పూసగుచ్చినట్టు వివరించింది.

సావిత్రమ్మ చెప్పినదంతా విన్నాక, రామలక్ష్మమ్మ బోరుమని ఏడ్చింది.

‘‘మా యింటాయనకు ఆ సంగతులన్నీ తెలిసి కూడా నన్ను పంపిస్తన్నాడక్కా…! వాళ్లు ఏమి చెప్పినా నన్ను ఒప్పుకొమ్మని చెప్పినాడు, నేను ఆ మాదిరిగా చేయను, పోనంటె నన్ను పట్టుకొని కొడతన్నాడు. ఇంక ఈ దెబ్బలతో ఇక్కడ చచ్చేదానికన్నా, ఆడికిపోయి బతకడమే మేలనిపిస్తా వుంది,’’ అంటూ రామలక్ష్మమ్మ ఏడుస్తూనే వివరించింది.

‘‘నాకు ఎందనా యిదిలేక బిడ్డల్ని పస్తులు పండుకోమని చెప్పలేక, వాళ్ల తిండి కోసమని, కానికూడని పనికి కక్కుర్తిపడితే, నీ మొగుడు పంచాయతీ పెట్టి వూరెళ్లగొట్టినాడు, ఇప్పుడు నిన్నేమో తెలిసి కూడా అతనే ఎబిచారంలోకి దింపుతున్నాడు. దీన్నేమంటారో అడగలేకపోయినావా?’’

సావిత్రమ్మ మనసులో అణచుకోలేక అడిగేసింది.

‘‘అన్నీ తెలిసినదానివి, నువ్వే నన్నడిగితే నేను ఏమి చెప్పాలి అక్కా,’’ రామలక్ష్మమ్మ జవాబిచ్చింది.

‘‘అంతేనమ్మే దండిగా డబ్బులొచ్చేట్టుగా వుంటే, వాళ్లు, పాలుడ్డ పడేది కాకుండా, పెండ్లాలను కూడా అమ్మేస్తారు, నీ మొగుడులాంటోళ్లు…’’ సావిత్రమ్మ మనసులోని కోపాన్ని బయటకు వెలిబుచ్చింది.

కొద్దిసేపటికి తన కోపాన్ని అణచుకొని మనసును ప్రశాంతతలోకి తెచ్చుకొనింది.

‘‘నేను ఆదివారం రోజు రైలుకు జనతాలో బొంబాయికి వెడతాను. నువ్వు వచ్చేటుగా వుంటే ఆ రోజుకు ముందుగానే టిక్కెట్టు తీసుకోవాలి. కనీసం బొంబాయిలో నీకు తోడుగా పదిరోజులన్నా ఉంటాను.’’

సావిత్రమ్మ అన్ని విషయాలు వివరంగా చెప్పినాక రామలక్ష్మమ్మ ఆలోచిస్తూ యింటికి వెళ్లిపోయింది.

***

ఆరోజు సాయంకాలం బొంబాయికి వెళ్లే జనతా ఎక్స్‌ప్రెస్‌ కోసం, కోడూరు రైల్వేస్టేషన్‌లో జనం విపరీతంగా కిక్కిరిసి వున్నారు. సావిత్రమ్మనూ, రామలక్ష్మమ్మను ట్రైన్‌ ఎక్కించి వీడ్కోలు చెప్పడం కోసం పెద్దూరు జనమంతా కదిలి స్టేషన్‌కు వచ్చారు.

వారానికి ఒకరిద్దరు తప్పకుండా, ఆ స్టేషన్‌ నుంచి కువైట్‌కు వెళ్లే ప్రయాణీకులుంటారు. ఆరోజు చాలామంది వున్నట్టు వుంది. వారి బంధువులను పట్టుకొని ఏడుస్తున్నారు. ‘పోతానే ఎట్టెట్ట చేరినావో అన్ని సంగతులూ, జాబు రాయి,’ అని కొందరు హెచ్చరిస్తున్నారు.

ఇంతలోనే పెద్దగా ఏడ్చుకుంటూ కొందరు ప్లాట్‌ ఫారం పైకి పెద్ద గుంపుగా కదిలి రావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఒక ముస్లిం అమ్మాయి, పెండ్లి కూడా కాని పదిహేడు సంవత్సరాల అమ్మాయిని వాళ్ల తల్లిదండ్రులు కువైట్‌కు పంపుతూ వుంటే, ఆ పాప దిక్కులన్నీ దద్దరిల్లేటట్లు శోకాలు తీస్తూ వుంది.

‘‘నీకేం భయం లేదులే బిడ్డా! మీ మామ వెంబడే వస్తల్లా, నీకేం దిగుల్లేకుండా అన్నీ చూసుకుంటాడులే…రెండు సంస్తరాలు గట్టిగా వుంటే సాల్‌, మల్లి వద్దు వచ్చేసెయ్‌ బాగా పెండ్లి చేస్తామ్,’’ అంటూ తల్లి బిడ్డకు నచ్చచెప్పుతూ వుంది.

‘‘పెండ్లికాని పసిబిడ్డను, కాని దేశానికి తరిమి ఆ డబ్బులూ, సంపాదన లేకుంటే ఏమి! ఛీ… దానికన్న ఇక్కడే అడుక్కోని బతికినా గౌరవమే!’’

‘‘అమ్మా, నాయిన దగ్గరుండి కసాయికి గొడ్డును తోలినట్టు తోల్తున్నారే, మనుషులేనంటయ్యా!!’’

చూస్తున్నవాళ్లు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు.

రైలుబండి స్టేషన్లోకి రాగానే జనం ఒకరినొకరు తోసుకొంటూ పెట్టెల దగ్గరకు పరుగుతీశారు.

సావిత్రమ్మ పెట్టెలోకి వెళ్లి తన రిజర్వేషన్‌ సీట్లో కూర్చుని వుంది. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, బంధువులందరూ వచ్చి వీడ్కోలు చెప్పారు.

రామలక్ష్మమ్మను బంధువులందరూ పట్టుకొని ఏడుస్తున్నారు. చిన్నబ్బ భార్యను వదలలేక వదులుతున్నట్లుగా బాధపడిపోతున్నాడు. పెద్దవాళ్లు కొందరు ధైర్యం చెబుతూ వుంటే రైలు కదిలింది.

రహిమాన్‌ సాహెబ్‌ కంపార్ట్‌మెంట్‌ డోర్‌ దగ్గర నిలబడి రామలక్ష్మమ్మను పెట్టెలోకి లాగాడు. కదిలి వెళ్తున్న రైలు శబ్దం కన్నా, ప్లాట్‌ఫారంపై నిల్చొని ఏడుస్తున్న జనం అరుపులే బిగ్గరగా వినిపిస్తా వున్నాయి.

రైలు కనుమరుగయ్యేంతవరకూ ప్లాట్‌ఫారంపై జనాలు చేయూపుతూనే వున్నారు.

రామలక్ష్మమ్మ కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ వుంటే పెట్టెలోని జనమంతా సానుభూతితో ఆమె వైపే చూస్తున్నారు. ఉన్న వూరినీ, కన్నవారినీ, బంధువుల్నీ వదలాలంటే రామలక్ష్మమ్మకు సాధ్యం కావటంలేదు. అందుకని అంతగా దుఃఖిస్తూ వుంది.

సావిత్రమ్మకు ఆశ్చర్యంకానీ, పెద్దగా బాధకానీ లేదు. తనకు అది మామూలైపోయింది. కళ్లల్లో నీళ్లు వుబికి అక్కడే ఆగిపోయాయి. మనసంతా భారంగా వుంటే సీట్లో వెనక్కి వాలి కూర్చుంది.

సావిత్రమ్మకు తాను భరించిన కష్టాల జీవితానుభవం, అవి నేర్పిన పాఠాలు, బతుకుసూత్రాన్ని వడగాచి తెలుసుకున్నట్లుంది. అందుకే కొడుకూ-కోడలు, కూతురూ-అల్లుడూ, బంధువులంతా కనుమరుగవుతున్నా కళ్లల్లో కన్నీరు మాత్రం కారలేదు. మనుషులూ మాయలూ-మర్మాల్నీ చదువుతున్నట్లుగా కళ్లు మూసుకుని, విరక్తిగా నవ్వుతూ ఆలోచిస్తా వుంది సావిత్రమ్మ.

**** (*) ****

మొదటి ముద్రణ: ఆంధ్రజ్యోతి 20 జూలై 1990, ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక 99
అచ్చుప్రతి Credit: కథానిలయం
Illustration credit: ఆంధ్రజ్యోతి



One Response to చక్రవేణు – ‘కువైట్ సావిత్రమ్మ’

  1. కె.కె. రామయ్య
    December 6, 2017 at 4:32 pm

    ‘కువైట్ సావిత్రమ్మ’, రచయిత చక్రవేణు తనకెంతో ఇష్టమైన కథ, కథకుడూ అని తలపోసుకున్నారు
    త్రిపుర గారి ఆప్త మిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)