కథ

వ్యాపకం

డిసెంబర్ 2017

BB.R.Cell Point… ఆ బోర్డుని చూడగానే ప్రసాద్‌ అడుగులు నెమ్మదించాయి. నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అటువైపు నడవటం మొదలుపెట్టాడు. ఈ పూట తను తిరిగిన సెల్‌ఫోన్‌ షాపుల్లో అది పదవదో, పన్నెండవదో అయి ఉంటుంది. ఇక్కడైనా తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందో లేదో తెలియదు. దొరకదు అని విచక్షణ చెబుతోంది. దొరుకుతుందేమో అన్న ఆశ, విచక్షణకి అడ్డుపడుతోంది. ప్రసాద్‌ షాప్‌ దగ్గరికి చేరుకునేసరికి ఎవరెవరో నిల్చొని ఉన్నారు. వాళ్లంతా వెళ్లిపోయేదాకా ఓపికపట్టాడు. ఈలోగా, షాపునిండా వేళ్లాడదీసి ఉన్న ఫోన్ కవర్లూ, మెమరీ కార్డులూ, సెల్‌ఫోన్‌ డొప్పలని చూస్తూ నిల్చొన్నాడు. తన దగ్గర ఉన్న ఫోన్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? దాన్ని ఎలా అలంకరించాలి? అన్న బాదరబందీ ఎప్పుడూ ప్రసాద్‌కి లేకపోయింది. తన ఫోన్‌తో అతనికి ఉన్న అనుబంధం వేరు. ఇప్పుడు తనకి వచ్చిన సమస్యా వేరు!

“చెప్పండి!” అన్నాడు షాపతను ఒకింత చిరునవ్వుతో ప్రసాద్‌ వంక చూస్తూ.

ప్రసాద్‌, నిదానంగా తన జేబులోంచి ఒక మాసిపోయిన ఫోన్‌ని బయటకు తీశాడు, ‘ఇందులో బాల్ ఫాల్‌ అనే గేమ్ ఉంది’ అని చెబుతుండగానే షాపతను చనువుగా ఆ ఫోన్‌ని చేతిలోకి తీసుకుని అందులో ఆప్షన్లన్నీ చకచకా చూసేసి “అవును! బాగానే పనిచేస్తోందిగా,” అనేశాడు.

“అది కాదు! మొన్న ఒకసారి అనుకోకుండా రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ అన్న ఆప్షన్‌ నొక్కాను. దాంతో ఇంతవరకూ బాల్‌ ఫాల్‌ గేమ్‌లో నేను చేసిన స్కోర్లన్నీ పోయాయి,” ఆ విషయాన్ని ఎంత నిదానంగా చెబుదామన్నా అతని శ్వాస ఎగిసిపడుతోంది. కళ్లు మసకబారుతున్నాయి.

అప్పటివరకూ ఫోన్లో ఆప్షన్లన్నీ ఎడాపెడా నొక్కుతున్న షాపతను ఒక్కసారిగా తలెత్తి చూశాడు. గేమ్‌లో స్కోర్లు పోయాయని బాధపడుతున్న సదరు కస్టమరు చిన్నపిల్లవాడేం కాదు. కుర్రవాడు అంతకన్నా కాదు. నుదుటినుంచి చెంపల దాకా జుత్తు నెరిసిన యాభై ఏళ్ల పెద్దాయన. వెన్ను వంగిపోయి, భుజాలు జారిపోయిన పెద్దమనిషి. షాపతనికి అర్థమైపోయింది…వచ్చినవాడు రోజువారీ కస్టమరు కాదని! తన చిన్నపాటి జీవితంలో ఇలాంటి చిత్రమైన కస్టమర్లు అరుదుగా తగుల్తారు. ఊళ్లో పదిమందికీ చెప్పుకోవడానికీ, పదికాలాల పాటు నవ్వుకోవడానికీ తగిన సందర్భం ఇది. తనలోని కుతూహలాన్నీ, వెటకారాన్నీ బలవంతంగా అణచుకుంటూ ‘‘మీరు నొక్కిన ఆప్షన్‌ వల్ల టెంపరరీ డేటా అంతా డిలీట్‌ అయిపోయింది సర్‌! అది తిరిగి రావడం కష్టం,’’ అన్నాడు.

“అంటే నేను బాల్ ఫాల్‌లో చేసిన స్కోర్స్‌ తిరిగి కనిపించే అవకాశమే లేదంటారా?” నిరాశగా అడిగాడు ప్రసాద్‌.

“లేదు! అలా డిలీట్ అయిపోయిన డేటాని ఫోరెన్సిక్‌ ల్యాబ్లో తప్ప వేరెవరూ బయటకి తీయలేరు,” అన్నాడు షాపతను. ప్రసాద్‌ని చూడగానే అతనికి ఎందుకో జాలి మొదలైంది.

ప్రసాద్ ఒక్క నిమిషం పాటు ఏమీ మాట్లాడలేదు. తను ఇవాళంతా విన్న ‘కుదరదు’ అన్న జవాబే ఇక్కడా వినిపించింది. కాకపోతే ‘ఫోరెన్సిక్‌ ల్యాబ్‌’ అన్న మాటే కాస్త కొత్త విషయం. సాలోచనగా షాపతని వంక చూస్తూ “ఫోరెన్సిక్‌ ల్యాబ్లో పని జరుగుతుందన్నమాట. అదెక్కడ ఉందో కాస్త చెబుతారా,” అన్నాడు.

ఆ మాటలకి షాపతని మనసులో తెలియని భయం మొదలైంది. మనలోని అమాయకత్వం, అజ్ఞానపు స్థాయిని చేరుకున్నప్పుడు, ఎదుటివారిలో కలిగే భయం అది. దాంతో ప్రసాద్‌ని వదిలించుకోవడానికి కిందకి వంగి ఏదో సర్దుకుంటూ ఉండిపోయాడు షాపతను. ఒక్క క్షణం అతనివంక బేలగా చూసిన ప్రసాద్ బస్టాపు దగ్గరకి కాళ్లీడ్చుకుంటూ బయల్దేరాడు. ఆ సమయానికి వచ్చిన బస్సు ఖాళీగా ఉందా, సౌకర్యంగా ఉందా అని చూసుకోలేదు. వచ్చిన బస్సుని చటుక్కున ఎక్కేసి ఓ మారుమూల సీట్లో కూలబడిపోయాడు. కళ్లు మూసుకున్నాడన్న మాటే కానీ అతని రెప్పల తెర మీద రకరకాల రంగులు. రంగురంగుల బంతులు కిందకి పడుతున్నాయి. ‘బాల్ ఫాల్‌’ ఆటతో తన అనుబంధం అంతా స్ఫురణకు వస్తోంది.

***

          పోయిన ఏడాది క్రిస్‌మస్‌నాటి రోజులివి. వరుసగా సెలవులు రావడంతో, తన భార్య బెంగళూరులో కూతురుకి సాయంగా ఉండేందుకు వెళ్లిపోయింది. ఆ రాత్రి ఏదో రోడ్డు పక్కన తినేసి తన అపార్టుమెంటుకి చేరుకున్నాడు. శనివారం రాత్రి కావడంతో అపార్టుమెంటు పైనుంచి కోలాహలంగా నవ్వులు వినిపిస్తున్నాయి. బహుశా ఏదో మందు పార్టీ పెట్టుకుని ఉంటారు. తనకా మందు తాగే అలవాటు లేదు. అందుకని అలాంటి పార్టీలలోకి వెళ్లి నాలుగు మాటలు కలిపి నాలుగు చుక్కలు పుచ్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయనే లేదు. ఉండుండి వినిపిస్తున్న నవ్వులకు ఉడుక్కుంటూ టీవీ ఆన్‌ చేసి కూర్చున్నాడు. 200 ఛానళ్లలో ఏ ఒక్కదానిలోనూ తనకు నచ్చిన ప్రోగ్రాం కనిపించలేదు. రిమోట్ నొక్కీ నొక్కీ చిరాకేసిపోయింది.

భార్య లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్లుంది. ఏదో తెలియని నిస్తేజం. అలాగని భార్యతో తను ఎన్నడూ సఖ్యంగా ఉన్నది లేదు. రోజంతా సీరియల్స్‌తో గడిపే తన భార్య ప్రవర్తన ప్రసాద్‌కి నచ్చదు. ఎప్పుడూ బుద్ధావతారంలా కూలబడి ఉండే ప్రసాద్‌ నిస్సత్తువ అతని భార్యకీ సయించదు. కుటుంబం అనే బంధం కోసం ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నారంతే! ఇద్దరూ ఒక ఇంట్లో కలిసి ఉండటం అలవాటుగా మారిపోయింది. ఉంటే ముభావంగా ఉండిపోవడం, లేదా వాదులాడుకోవడం…ఈ రెండు పరిస్థితులే వాళ్ల మధ్య ఉంటాయి. తమ మధ్య పుట్టిన కూతురిని కూడా అంతే నిర్లిప్తంగా పెంచి, పెద్ద చేసి, పెళ్లి చేసి పంపారు. తన కూతురు బాగా చదువుకుంటోందా, ఆమెకి మంచి సంబంధం కుదురుతోందా అని చూసుకోవడంతోనే సరిపోయింది ప్రసాద్‌కి. అల్లుడితో కలిసి ఎప్పుడన్నా కూతురు ఇంటికి వస్తే సందడిగానే ఉంటుంది. కానీ, ఆ సందడిలో సంతోషం కనిపించదు. కూతురితో పాటు వచ్చిన అల్లుడు తన హోదాని హుందాగా నిభాయిస్తుంటాడు. అతనికి ఏ లోటూ రాకూడదంటూ కూతురు క్షణక్షణం హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ ప్రొటోకాల్స్‌ అంటే చిరాకెత్తిపోయిన ప్రసాద్, వాళ్లున్నప్పడు నక్కినక్కి తిరుగుతూ ఉంటాడు.

అపార్టుమెంటు పై నుంచి ఒక్కసారిగా నవ్వుల తాకిడి పెరిగింది. పార్టీ మంచి రసపట్టుకు చేరుకున్నట్లుంది. నవ్వులు అలలు అలలుగా రగులుతున్నాయి. ప్రసాద్‌ దృష్టి టీపాయ్ మీద ఉన్న ఫోన్‌ మీద పడింది. ఉబుసుపోక దాన్ని చేతిలోకి తీసుకుని ఒక్కో బటన్‌నీ నొక్కడం మొదలుపెట్టాడు. తన దృష్టిలో అదో బేసిక్ ఫోన్‌. కూతురి మాటల్లో అదో డబ్బా ఫోన్. కాలక్షేపంగా దాన్నే పరిశీలించడం మొదలుపెట్టాడు ప్రసాద్‌. అప్పుడు కనిపించింది అతనికి ‘బాల్ ఫాల్‌’ ఆట. గేమ్‌ మొదలుపెట్టగానే రంగురంగుల బంతులు స్క్రీన్‌ మీదకి రావడం మొదలుపెట్టాయి. వాటినేం చేయాలో తెలియలేదు ప్రసాద్‌కి. అటో రెండు బటన్లూ, ఇటో రెండు బటన్లూ నొక్కాడే కానీ, ‘గేమ్ ఓవర్’ అంటూ ఆట ముగిసిపోయింది. అలా ఒకటి రెండుసార్లు జరిగిన తరువాత ఆట ఎలా ఆడాలో కాస్త ఒంటపట్టినట్లే ఉంది. స్క్రీన్‌ నుంచి కిందకి పడే బంతుల్లో ఒకే రంగు ఉన్న బంతులు ఐదింటిని సేకరించి పైకి విసరాలి. అలా ఐదైదు బంతులను పైకి విసరగానే కొన్ని పాయింట్లు వస్తాయి. ఈలోపల బంతులు కాస్తా స్క్రీన్‌ అడుగుకి వచ్చేస్తే ఆట ముగిసిపోతుంది. ఆటైతే ఎక్కువ సేపు సాగలేదు కానీ, అది ఎందుకనో తన జీవితంలోకి ప్రవేశించినట్లు అనిపించింది ప్రసాద్‌కి. ఆ రోజు ఎవరో కొత్త మిత్రుడితో పరిచయం అయినంత తృప్తి కలిగింది. ఆ రాత్రికి సోఫాలోనే గాఢంగా నిద్రపోయాడు.

మర్నాడు అందరిలాగానే తను కూడా పదిన్నర దాటాక ఆఫీసుకి చేరుకున్నాడు. ఆసరికి ఎవరికి వాళ్లు తమ క్యాబిన్లలో సర్దుకుంటున్నారు. ఇప్పుడు తన ఆఫీసులో మనిషి మనిషికీ మధ్య క్యాబిన్‌ గోడలు వెలిశాయి. ఒకో క్యాబిన్లో ఒకో మనిషీ, అతనికెదురుగా ఓ కంప్యూటరూ! ఆ కంప్యూటర్‌ అంటే ఎందుకనో తనకి మొదటినుంచీ చిరాకే. తనది కాని భాగమేదో తన శరీరానికి అతుక్కుపోయిన భావన. కానీ తప్పలేదు! ప్రస్తుతానికి కంప్యూటర్‌ లేనిదే ఆఫీసు పని నడవదు. ఆ పనికి అవసరమయ్యేంత మేరకే కంప్యూటర్‌తో కాపురం చేస్తుంటాడు. అతని అదృష్టమో దురదృష్టమో కానీ నెలకి నలభైవేలు జీతం తీసుకుంటున్నా…చేయాల్సిన పని పెద్దగా ఉండదు. కొత్తగా నేర్చుకోవలసిన విషయాలూ ఉండవు. ఎలాగోలా మరో ఎనిమిదేళ్లు గడిపేస్తే ఈ ఉద్యోగపర్వాన్ని ముగించేయవచ్చు అన్నదే అతని లక్ష్యంగా మిగిలిపోయింది.

ఏడాది చివరి రోజులు కావడంతో క్యాబిన్లన్నీ సందడిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో తెలియని ఉత్సాహం. ఏదో పార్టీ కోసమో, వీడ్కోలు కోసమో ఎదురుచూస్తున్నట్లు ఉత్సుకత. తన ఆఫీసు క్యాబిన్లలో ఇలాంటి సందడి కొత్తేమీ కాదు. పండుగలనో, పుట్టినరోజులనో…నెలలో నాలుగు రోజులు ఇలాంటి హడావిడి ఉంటుంది. కాకపోతే ప్రసాదే వీటికి కాస్త దూరంగా ఉంటాడు. ఆ మాటల ఒరవడిలో తట్టుకుని నిలబడం అతనికి చేతకాదు. తనని తాను మార్కెట్‌ చేసుకునే కళ అతనికి ఎందుకనో అబ్బలేదు. కంప్యూటర్‌ని ఆన్‌ చేసి నిస్తేజంగా కూర్చున్న ప్రసాద్‌కి ఎందుకనో ‘బాల్ ఫాల్‌’ ఆట గుర్తుకు వచ్చింది. ఇవాళ ఎలాగూ పెద్దగా పనిలేదు.  ప్యాంటు జేబులోంచి నిదానంగా తన డబ్బా ఫోన్‌ని బయటకు తీశాడు. ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటివరకూ అడ్డుగోడలుగా తోచిన క్యాబిన్లు ఎందుకో ఇప్పుడు ప్రపంచం నుంచి రక్షణగా తోచాయి!

బాల్ ఫాల్‌ నిదానంగా ప్రసాద్‌ జీవితంలో భాగమైపోయింది. మొదట్లో రెండుమూడు వందల స్కోర్లు/స్కోరు సాధించడమే గగనంగా ఉండేది. కానీ క్రమంగా అవి వేలకి చేరుకున్నాయి. అంతకుముందుకన్నా ఎక్కువ స్కోరు సాధించిన ప్రతిసారీ… ‘మీరో కొత్త రికార్డుని సృష్టించారు. అభినందనలు’ అనే సందేశం అతనికి భలే ఉత్సాహాన్ని ఇచ్చేది. ఆట ఆడే ప్రతిసారీ ఓ కొత్త రికార్డుని సాధించాలని తెగ తపనపడిపోయేవాడు. తన గతంతో తానే పోటీపడేవాడు. మొదట్లో అతని ఖాళీ సమయాలను బాల్‌ ఫాల్ భర్తీ చేసింది. బస్సుల్లో వెళ్లేటప్పుడో, ఆఫీసులో బోర్‌ కొట్టినప్పుడో బాల్‌ ఫాల్‌ బయటకి తీసేవాడు. కానీ రాన్రానూ అది అతని జీవితంలోని ప్రతి పార్శ్వంలోనూ చొచ్చుకుపోయింది. రాత్రిపూట నిద్రపట్టకపోతే భార్యకి కనిపించకుండా అటువైపు తిరిగి ఆడేవాడు. అల్లుడు ఇంటికి వస్తే గదిలో తలుపేసుకుని ఆడేవాడు. భార్య కూతురింటికి వెళ్తే, తీరిక సమయాన్ని బాల్‌ఫాల్‌తో గడిపేసేవాడు. ఆ ఆటలో తను ఎంత నైపుణ్యాన్ని సాధించాడంటే, ఒకోసారి అతని వేగానికి ఆట మధ్యలోనే స్ట్రక్‌ అయిపోయేది. లేదా ఆటలోని రంగురంగుల బంతులు కాస్తా ఒక్కసారిగా గజిబిజి అయిపోయేవి. ఫోన్లో అలాంటి చిన్నచిన్న ఇబ్బందులు వస్తే ‘రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’ నొక్కమని ఎవరో చెప్పినట్లు గుర్తు. అందుకే ఆ పిచ్చి పని చేశాడు. దాంతో తన రికార్డులన్నీ చెదిరిపోయాయి.

***

          బస్సు తన స్టాప్ దగ్గర ఆగింది. మనిషి ఇంటివైపు నడుస్తున్నాడన్నమాటే కానీ తల తెగ తిరిగిపోతోంది. ఒళ్లంతా వేడెక్కిపోయి ఒకటే సలపరంగా ఉంది. ఇంట్లోకి అడుగుపెడుతుండగానే “ఆదివారం పూట చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయారు?” సోఫాలోనుంచే ప్రసాద్‌ వాళ్లావిడ అడిగింది.

‘‘ముందా టీవీ కట్టిపారేయ్‌!’’ కోపంగా అరిచాడతను. మనిషిలో ఏదో తెలియని ఉద్రేకం. ఎవరినో ఏదో చేయాలన్న ఉన్మాదం. అతని అరుపుకి నిశ్చేష్టురాలైన భార్య చేతిలోంచి రిమోట్‌ను లాక్కొని ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. ఆపై తూలుకుంటూ వెళ్లి మంచం మీద వాలిపోయాడు. పడుకున్నాడన్నమాటే కానీ ఒకటే కలలు! కలల నిండా రంగురంగుల బంతులు. కొన్ని మందుబాటిళ్ల మీద పడుతున్నాయి. కొన్ని టీవీలోంచి దూసుకువస్తున్నాయి. మరికొన్ని తన క్యాబిన్లో దొర్లాడుతున్నాయి. ప్రతి కలలోనూ బంతులే…సందర్భమే మారుతోంది. ఒకోసారి మనుషుల మొహాలు కూడా బంతుల్లా మారిపోతున్నాయి. వారి శరీరాలు బంతుల్లా ఊరిపోయి దొర్లిపోతున్నాయి.

బంతులు…బంతులు…ఆ బంతుల్లో తను తలమునకలై ఉంటే, ఎవరో తనని తట్టి లేపుతున్నట్లు తోచింది. కళ్లు తెరిచి చూశాడు.  ఎదురుగా ఉన్న భార్యను పోల్చుకునేందుకు కూడా కాస్త సమయం పట్టింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు. ఏదో మాట్లాడుతోంది.  కానీ అవేవీ వినిపించడం లేదు. పైపెచ్చు ఆమె చీర మీద కూడా బంతులు జీరాడుతున్నట్లు తోచి అయోమయంగా వాటి వంక చూడసాగాడు. బంతులు…రంగు బంతులు తన కళ్లని నింపేస్తున్నాయి. నేల మీద ఎగిరెగిరిపడుతున్నాయి. ఫ్యాన్‌ నుంచి రాలి పడుతున్నాయి. అన్ని బంతులని చూసి ప్రసాద్‌కి తల పగిలిపోతోంది. వగరుస్తూ మంచానికి ఓ మూలగా చేరి పడుకుండిపోయాడు. బంతుల నుంచి తప్పించుకునేందుకా అన్నట్లు కాళ్లని పొట్ట లోపలికంటూ ముడుచుకుని పడుకుండిపోయాడు.

మర్నాడు ఉదయానికల్లా కూతురూ అల్లుడూ వచ్చేసినట్లున్నారు. తను కళ్లు తెరిచి చూసేసరికి కూతురు, భార్య ఆందోళనగా మాట్లాడుకుంటున్నారు. అల్లుడి గంభీరత్వం మాత్రం ఎప్పటిలానే ఉంది.  ప్రసాద్‌కి చచ్చేంత నీరసంగా ఉంది. బయటకి మూలుగుతున్నాడేమో కూడా తెలియదు. కళ్ల ముందు బంతులు లేకపోయినా, వాటి తాలూకు రంగులు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయి. కనిపించే దృశ్యాలను అవి అస్పష్టంగా మార్చేస్తున్నాయి.

“లోకల్‌ డాక్టర్ల వల్ల లాభం లేదండీ. ఏదేదో మాట్లాడుతున్నారని అంటున్నారు కదా! అది జ్వరం వల్లా ఏంటన్నది తేల్చుకోవడం మంచిది,” అంటూ అల్లుడు ఏదేదో చెబుతున్నాడు.

ప్రసాద్‌కి హఠాత్తుగా తన ఫోన్‌ గుర్తుకువచ్చింది. ఓసారి దాన్ని చూసుకోవాలనిపించింది. నిదానంగా ప్యాంటు జేబులోంచి ఫోన్ బయటకి తీశాడు. ఎన్నడూ లేనిది అల్లుడు చనువుగా ముందుకు వచ్చి “ఇప్పుడది ఎందుకు మావయ్యగారూ! రెస్ట్ తీసుకోండి,” అంటూ ఆ ఫోన్‌ తీసుకోబోయాడు. అంతే! అతని చెంప ఛెళ్లుమంది. ఏం జరిగిందో అర్థం కావడానికి ప్రసాద్‌ చుట్టూ ఉన్నవారికి కాస్త సమయం పట్టింది. తనేం చేశాడో ప్రసాద్‌కి కూడా వెంటనే స్ఫురించలేదు. ఆపై వాళ్లనిక చూడలేనట్లు అవతలికి తిరిగి పడుకుండిపోయాడు. వాళ్లావిడ గట్టిగట్టిగా తిడుతోంది. తిట్టుకీ తిట్టుకీ మధ్య కూతురి ఏడుపు వినిపిస్తోంది. ప్రసాద్ కళ్లు గట్టిగా మూసుకున్నాడు. ఇంతలో ‘సర్దుకుపోవడం చేతకాదు’ అంటున్న భార్య మాట మాత్రం స్పష్టంగా వినిపించింది. ‘నిజంగానే తను ప్రపంచంతో సర్దుకుపోలేకపోయాడా, లేక ప్రపంచమే తనని కలుపుకోకుండా ముందుకు సాగిపోతోందా! అదీ ఇదీ కాకపోతే మధ్యేమార్గంగా ఇంకేదన్నా ఉందా!’ అన్న ఆలోచన తట్టింది ప్రసాద్‌కి. ఆలోచన రావడం మొదలు, మళ్లీ రంగురంగుల బంతులు కదలాడసాగాయి.  బంతులతో పాటు ‘రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’ అన్న పదం అస్పష్టంగా కనిపించింది. తలలో ఏదో వరద పోటెత్తిన భావన. భళ్లున వాంతి చేసుకున్నాడు. కంటి ముందు ఇక బంతులు కనిపించడం మానేశాయి. తల పక్కకి వాలిపోయింది.

**** (*) ****



2 Responses to వ్యాపకం

  1. G Krishna Mohan
    December 1, 2017 at 10:53 am

    Marutunna Yantrika jevitham lo future kallaku katinatlu undhi kadha. Prati manishini future lo ki tesuku velli alochimpa chestundhi e katha.Keep going for better stories…

  2. విశ్వనాధ్ లొల్ల
    May 30, 2018 at 10:02 am

    ఇప్పటి యువతకు, ఆమాటకొస్తే మొబైలుకు ,వాటిలో ఆటలకు బానిసలైన ప్రతి ఒక్కరికి కనువిప్పీకథ…

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)