గతానుగతికంగా
ఏదో రాస్తూ పోతాను
అక్షరాలని పదాలుగా అల్లి
పదాలపై కాస్తంత పరిమళాన్ని జల్లి
ఏదో…
మౌనంగా ఉండలేని క్షణాలలో
మాటల్లో మౌనాన్ని నింపే ప్రయాసలో
ఒకటో అరో జారిపడ్డ చుక్కల
సిరాతో
ఏదో రాస్తూ…
కోపం కొలిమై మండినప్పుడు
కణకణ కాలిన ఎఱ్ఱని వాక్యం ఒకటి
ఇనప కమిచీలా ఝళిపించాలనీ
ఎప్పుడైనా హఠాత్తుగా ఒక
సన్నని విద్యుజ్జ్వాల
వెన్నులోంచీ పాకినప్పుడు
తీపి మత్తులో
మురిగి
పడి ఉన్న
ప్రపంచాన్ని
గిరగిర తిరిగే గీతంతో దిర్దిరదిరమని మధించాలనీ
ఏదేదో అయిపోతాను
కానీ
కాగితం పాతకంపు కొడుతూనే ఉంటుంది
కదిలే పాళీ బరబర వినిపిస్తూనే ఉంటుంది
చచ్చిన పామే చస్తూనే ఉంటుంది
విషమొక్కటే తిరిగి తిరిగి పుడుతూనే ఉంటుంది
గతానుగతికంగా…
కాగితం పాతకంపు కొడుతూనే ఉంటుంది
కదిలే పాళీ బరబర వినిపిస్తూనే ఉంటుంది
చచ్చిన పామే చస్తూనే ఉంటుంది
విషమొక్కటే తిరిగి తిరిగి పుడుతూనే ఉంటుంది…
చాలా నచ్చింది కవిత…
బాగుంది,..