కథ

అందరాని కొమ్మ

జనవరి 2018

శ్రావణమాసం.

బెంగళూరు వర్షాల్లో తడిసి మెరిసిపోతోంది.

లేత బూడిద వర్ణపు ఆకాశం కింద పచ్చాపచ్చటి చెట్లు ఆకాశం నుంచి జలదారుల జలతారులా కురిసి ఆగిన వానలో తలారా నీళ్ళోసేసుకుని ఎర్ర తురాయి పూల చీర కట్టేసుకుని, వచ్చే పోయే వారిమీద వాననీటి జల్లులు చిలకరిస్తున్నాయి.

అప్పుడే ఆగిన బెంగళూరు నగర సారిగె సంస్థ వాహనంలోంచి దిగి చెంగున ఎగిరే జింకపిల్ల పాదాలతో తలపున మెదిలిన ఏ పాటకో తలాడిస్తూ, దానికి తనదైన పేరడీ కట్టేసుకుని పాడుకుంటూ తనలో తనే మురుస్తూ చిన్ని చిన్ని వాన చినుకుల సందడికి తన మువ్వల అలికిడి తాళం వేస్తూ భుజం మీది సంచీ సర్దుకుంటూ ఇంటి ముఖం పట్టింది మందహాసముఖి అమ్మాయి.

ఏ చినుకు నీపై కురిసి, తాను మెరిసి పోయిందో…
ఏ తళుకు నీకే అద్ది, మేను మురిసిపోయిందో…
చిలిపిగా… చెలిమిగా…
తనువునే… తడపగా…
నా మది పులకించెనో…

ఆడుకుంటూ, పేరడీలు పాడుకుంటూ ఇల్లు చేరి గేటు తెరిచీ తెరవగానే ఎదురుగా వరండాలో కుర్చీలు వేసుకుని ఎదురెదురుగా కూర్చుని కమలాఫలాలు ఒలుచుకుని తొనలు పంచుకుంటున్న అమ్మానాన్నలు, వీరి పైనుంచి చూపు నెక్కుపెట్టి చూస్తే తెరిచి ఉన్న తలుపు అవతల కొమ్మపైని జంటపూవుల్లా, గూటిలోని రెండు గువ్వల్లా కువకువలాడుతూ కబుర్లలో మునిగిన కొత్తజంట అన్నావదినలు. ఇదీ అమ్మాయి కనులబడ్డ దృశ్యం.

అమ్మాయిని చూడగానే అమ్మ ఒకసారి నవ్వి, “ఇప్పుడే అనుకుంటున్నాను, ఏదీ మా ఏడు మల్లెపూలెత్తూ అని! వచ్చావూ! దా. నీకిష్టమని ఎర్ర గోధుమనూక ఉప్మా, మాగాయ పెరుగు పచ్చడి చేశాను. పద, తిందువు గానీ” అంటూ లేచి ఇంట్లోకి నడిచింది.

నాన్న అమ్మాయిని చూసి చిరునవ్వుతోనే పలకరిస్తూ అమ్మ వెనక వెళ్ళు అన్నట్లుగా తలాడించారు, కళ్ళెగరేస్తూ.

పలకరింపులూ ఫలహారానికి పిలుపులూ అందుకుని దాటి వెళ్తూ వెళ్తూ అన్నావదినలకి “హాయ్” చెప్పి సరదాగా అమ్మ కొంగునందుకుని, అమ్మ వెనకే వెళ్ళి భోజనాల బల్ల దగ్గర కూర్చుంది అమ్మాయి.

అమ్మ ఫలహారపు పళ్ళెం తెచ్చి, “ఆయ్! చేతులు కడుక్కోకుండానే?” అనగానే అమ్మాయి కుడి చేత్తో తల మీద “అయ్యో! మళ్ళీ మర్చిపోయానే” అన్నట్టుగా తనకు తానే చిన్నగా కొట్టుకుని, లేచి వెళ్ళి పక్కనే ఉన్న సింక్ లో చేతులు కడుక్కుని వచ్చి, ఎర్రుప్మా తినడంమొదలుపెట్టింది, ఎప్పట్లాగే ఆఫీసూ, ప్రాజెక్ట్ వర్కూ అంటూ కబుర్లేవో చెప్తూ.

“అబ్బా, కబుర్లతోనే కడుపు నింపేసుకునేలా వున్నావు. ముందు తినేసి ఆ తర్వాత చెప్పు”, అమ్మ ముద్దుగా విసుక్కుంది.

అబ్బే! వాగ్ధార సాగేదే కానీ ఆగేదా? ఆపగలిగేదా?

ఆగదూ… ఆగదూ…
ఆగితే తోచదూ…
ఆగదు ఈ వాగుడు నీ కోసమూ…
ఆగితే సాగదు ఫలహారము…
ఒంటికి పట్టదు ఉప్మా-హారము…
ఖళ్… ఖళ్… ఖళ్…

దగ్గుతో సహా పాడేసింది అమ్మాయి.

“అబ్బా, నీకు వసెక్కువ పోసినట్టున్నాము చిన్నపుడు. ఇంతకీ రేపు సెలవు పెట్టావా?” అమ్మ ప్రశ్నలో అది ఆరానో- ఆరాటమో కనిపెట్టే తీరుబాటేది అమ్మాయికీ?

“ఊ …ఊ” స్పూనెడు ఉప్మా బుగ్గలో ఉంచుకుని అమ్మాయి తీసిన ఊ రాగం

“ఊ..నా? ఉ..ఊ…నా? సరిగ్గా చెప్పు” తప్పకుండా అమ్మది ఆరాటమే.

ఒక్క నిముషం అమ్మాయి నెమరువేత ఆగింది. ఏదో తలపు నెమరేసుకోవాలన్నట్టు.

ఒక్క గుటకలో ఉప్మా మింగి “ఊ…నే తల్లీ! లేకపోతె నువ్వూరుకుంటావా? మా కృష్ణన్ గారికి చెప్పే వచ్చా”

“నే చెప్పలే, నా బంగారుతల్లి! తొందరగా తినేసి లే ఇంక. వదినతో బజారెళ్ళొద్దాం”

“బజారంటే నాకు బేజారని నీకు తెలీదా మాతా? నన్ను రమ్మని అడుగవలదు. రానంటే రానని నాచేత పలికించవలదు” మాయాబజారులో శశిరేఖ పూనింది అమ్మాయిని.

“సర్లే, ఈ రోజుకి నీ మాట చెల్లించాల్సిందే. మేమిద్దరం వెళ్ళొస్తాం ” వలసిన వరమిచ్చినట్టు వదిలేసింది అమ్మ.

అమ్మావదినకి తోడు నాన్న అన్నా కూడా అడుగులోన అడుగు కలిపి వెళ్ళగానే సోఫాలో వాలింది – Wodehouse గారితో పేజీ కలుపుతూ Carry On, Jeeves! అనుకుంటూ.

***

రెండో రోజు మళ్ళీ ఆకాశం ముందు రోజుకన్నా ఎక్కువ కాటుక పూసుకొచ్చింది మబ్బుకన్నెలకి.

మరి కర్పూరం ఎక్కువయిందో ఏమో, మబ్బుకన్నెల కాటుక కన్నుల ఊరిన నీరు నేలకు జారి చిరుచిందుల మేలమాడింది.

నల్లమబ్బుని చూస్తూ వేడివేడి తెల్లపాలు ఊదుకుంటూ తాగుతోంది తనవారిలో తానెరుపైన అమ్మాయి.

ఇంతలోనే అమ్మొచ్చి తలకి నువ్వుల నూనె పెట్టి, అదే చేత్తో చెంపకి పసుపురాసి, నలుగుగిన్నె, శీకాయ గిన్నె రెండు చేతుల్లో పెట్టింది.

“ఏ వికటకవికి వరమివ్వడానికి నాకీ అవతారం?” అమ్మాయి బుంగమూతి పెట్టి అడిగింది, రెండు చేతులూ పైకి ఎత్తి చూపిస్తూ.

“చాల్లే నీ అల్లరి. వెళ్ళి సుబ్బరంగా నలుగు పెట్టుకుని తలంటుకు రా. గుడికెళ్ళొద్దాం” అమ్మ కసిరింది.

“గుడికా? ఏ గుడి? ఎక్కడా గుడి? ఇప్పుడెందుకా గుడి? ఇది నా ఎజెండాలో లేదే?” ప్రశ్నావళే ఈ వేళ అమ్మాయి.

“ఎజెండాలో, ఏ జెండాలో తర్వాత చెప్తాను. ముందు వెళ్ళి రా. ఈలోగా మొన్న అన్న పెళ్ళికి కొన్న నీలిపువ్వుల తెల్ల చీర తీసుంచుతాను, కట్టుకుందువుగాని. అసలే సాయంత్రం వాళ్ళొస్తున్నారు కూడాను.” అప్పటికి రాబోయే పంచ గంట ప్రణాళిక చెప్పేసింది అమ్మ.

అమ్మాయికి అర్థమయిపోయింది అమ్మ చేస్తున్న కుట్ర.

“హన్నా! ఎంత వద్దని చెప్పినా తాననుకున్నది చేసేస్తోందన్నమాట! ఇప్పుడే వాళ్ళూ వీళ్ళూ వద్దూ రావద్దూ, ఓ రెండేళ్ళాగాలందా తనూ? అయినా అమ్మకి నా మాటంటే లెక్కలేదు. చెప్తా వుండు ఈ అమ్మ పని” అని కాళ్ళ పట్టీలు ఎప్పటికన్నా ఎక్కువగా మోగిస్తూ అమ్మ చెప్పిన అభ్యంగన స్నానం కానిచ్చి నైటీ వేసుకుని వచ్చింది అమ్మాయి.

వస్తూనే తలారబెట్టుకుని జడ వేయించుకుని ఏరి కోరి బాందినీ చుక్కల మెంతి, వంగ, గులాబీ మువ్వన్నె రంగుల జెండాలాంటి చీర కట్టుకుని గదిలోంచి బయటికి రాగానే అమ్మ “అదేం చీర?” అనడగబోయి ఆగింది. “ఏదో ఒకటి చీర కట్టుకుంది అంటే చాలు. ఏ కుచ్చుల స్కర్టో వేసుకోకుండా అసలే చండిక” అనుకుని.

అమ్మ కళ్ళలో మనసు చదివిందో ఏమో, అమ్మాయి పెదవి ఒంపుల పల్లకిలో పాటని మోసేసింది.

మొండీ చండిక తలదన్నే చండీ కాళిక ఎవరీమె? కాదనగానే కయ్యము చేసే కన్నె చండికే కాబోలు…

అమ్మాయి కూనిరాగాల్లో మునుగుతూ తేలుతూ గుడికి వెళ్ళారు అమ్మ, అమ్మాయి.

ఇంకెవ్వరూ తమతో రాకుండా తామిద్దరమే గుడికి వచ్చే ఏర్పాటుతో ఏదో గూడుపుఠాని జరుగుతోందని అమ్మాయికి ఏదో inkling.

అమ్మ బయటపడదు, అమ్మాయి భయపడదు. ఇద్దరూ ఇద్దరే.

గుళ్ళో విరాజిల్లుతున్న రాజరాజేశ్వరి అమ్మవారు నవ్వుతూ పలకరించింది. నల్లనిదేవి చల్లనిచూపులతో.

దండం పెట్టుకుని, ప్రసాదం పుచ్చుకుని చేతిలోని పువ్వును తల్లో తురుముకుంటూ ఇవతలకి వస్తూ అమ్మ ప్రశ్న, “ఏమని దండం పెట్టుకున్నావ్?” అంటూ.

“నీ సంగజ్జెప్పు ముందు” అంటూ నదురూ బెదురూ లేని అమ్మాయి దబాయింపు.

“ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అడిగిందానికి సవ్యంగా జవాబు చెప్పు” అమ్మకి అప్పటిదాకా దాచుకున్న విసుగు కొంచెంకొంచెంగా బయటికి వస్తోంది.

“సరే విను. నువ్వేం కోరుకున్నావో అదవ్వకూడదని నే కోరుకున్నాను” అమ్మాయి బిగించిన పెదవుల్లోంచి ఒక్కొక్క అక్షరం నొక్కి పలుకుతూ చెప్పిన బదులు.

“ఎందుకెందుకని ఊరుకుంటుంటే నీ వ్యవహారం శృతి మించుతోంది. మిగిలిన విషయాల్లో మీ నాన్నా, నువ్వూ ఒకటే అయినా ఈ విషయంలో నాదీ నాన్నదీ ఒకే మాట. ఏంటనుకున్నావో?!” అమ్మ బెదిరింపు.

“మాట మీది, మనువు నాదీ. నేను కాదన్నానా?” అమ్మాయి బెదురే లేని సవాలు.

“ముద్దు చేసినందుకు బానే బుద్ధి చెప్పావు. నువ్వసలూ … ” మాటలు వెతుక్కుంది అమ్మ.

“…..” చిరునవ్వే అతికింది అమ్మాయి మొహాన.

” ఆ … అదీ నువ్వసలూ… వయోముఖవిషకుంభానివి. చూడ్డానికి అమాయకంగా ఉంటావు కానీ నీ పంతం నీదే”. అమ్మ మాటలు కోపంతో తడబడుతున్నాయి.

“హహ్హహ్హ” ఆపుకోలేని నవ్వు అమ్మాయికి.

“సిగ్గు లేనమ్మకి చిరునవ్వే సింగారం. ఎందుకా నవ్వు?”

“అదీ, పయోముఖవిషకుంభమమ్మా, వయోముఖ కాదు. పయః అంటే సంస్కృతంలో పాలు” పకపకా నవ్వుతూ అమ్మని సరిదిద్దింది అమ్మాయి.

“నీ తెలివితేటలన్నీ నాదగ్గరే. పద ఇంక ఇంటికి “, దారితప్పుతున్న దూడని కొమ్ముతో మందలిస్తూ దారిలో పెడుతున్న ఆవులా అమ్మ. అమ్మ కొమ్ము కందక గంతులు వేసే తువ్వాయిలా కిలకిలలాడుతూ అమ్మాయి. ఎలాగైతేనేం ఇల్లు చేరారు.

***

సాయంత్రం ఇంటి ముందు అప్పటిదాకా కురిసి ఆగిన వానతో పాటు ఇంటి ముందు ఆగిందో కారు. అందులోంచి దిగిన ముగ్గురికీ ఇంట్లోని నలుగురు ఎదురెళ్ళారు. పుస్తకంలో తలదూర్చి తన లోకంలో తనున్న అమ్మాయి మినహా.

Wodehouse గారి రాతకి లోపల్లోపలే నవ్వుతూ దొర్లేస్తున్నఅమ్మాయి లోపలికి వస్తున్నవాళ్ళని చూసి ఏం చేయాలో తోచక చటుక్కున లేచి నించుంది. కుడిచేతి చూపుడు వేలు చదువుతున్న పేజీ దగ్గర మడిచి పట్టుకుని.

“అరె! కూర్చో, పరాయి వాళ్ళమా ఏంటి?” అంటూ వచ్చినావిడ, వరసైన ఆవిడ, సరదాగా అమ్మాయి భుజం మీద చెయ్యేసి మెరిసే ఆ బుగ్గల నునుపుని ముచ్చటగా చూస్తున్నారు.

బిడియంగా నవ్వి అమ్మాయి “బావున్నారా?” అని పలకరించి చేయి పట్టి పొదువుకుంటున్న ఆవిడ పక్కనే సోఫాలో కూర్చుంది.

ఆవిడవెంట వచ్చిన ఆవిడ పతీ పుత్రులు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోగా అన్న వాళ్ళ పక్కనే సోఫాలో, ఆ పక్కనే నాన్న, ఒక కుర్చీలో అమ్మా వదినా, వంటింటి గుమ్మానికి అటూఇటూ నించుని, అమర్చిపెట్టిన చదరంగపు బల్లలో చతురంగ బలాల్లా ఎవరి స్థానాల్లో వాళ్ళు కుదురుకున్నారు.

అమ్మాయి అందరినీ చూసి మొహమాటంగా నవ్వింది.

ఓ పదినిముషాలు మాటలగలగలలు, ఫలహారపు ప్లేట్ల మార్పిడులు, మంచినీటి గ్లాసుల గుటకలు – అన్నీ అయ్యాక “దొర్బాబూ! వీధి చివర పుస్తకాల షాపులో ఏదో కొనాలన్నావు కదా, తన కూడా వెళ్ళు. తను పుస్తాలు బా చదూతుంది. నీక్కావలిసినవి ఇట్టే వెతికి పెట్టేస్తుంది. వెళ్ళి రాకూడదూ?” వచ్చినావిడ వేసిన మొదటి ఎత్తు. అమ్మాయికి అదే ఆటకట్టు అన్నట్టు అమ్మ ముసిముసినవ్వు.

కోరగా అమ్మ కేసి చూసి లేచి వెళ్ళి sandals వేసుకుని, దొర్బాబుతో కలిసి పుస్తకాలషాపుకి నడిచింది అమ్మాయి.

***

వర్షపు బరువుతో మందంగా వీస్తున్న గాలి.

నడుస్తుంటే చెట్ల మీంచి ఉండుండి రాలుతున్న చినుకుల జల ధరించి జలదరిస్తున్న మేను.

చిరుచలికి భుజం చుట్టూ కొంగును కప్పుకుని అమ్మాయి. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని కొంచెం ఒంగి నడుస్తూ దొరబాబూ. రెండుగుల ఎడంతో నిశ్సబ్దంగా నడుస్తూ పుస్తకాల షాపుకి చేరుకున్నారు ఇద్దరూ.

ఇంకెప్పుడన్నా అయితే ఆ పుస్తకపు ప్రపంచంలో ఓ నవల వెతుక్కుని ఏ మూలో కూర్చుని చదువుకుంటూ తనని తాను మరిచిపోయేది అమ్మాయి.

ఈసారలా కాదు, కాలు ముందుకి పడట్లేదు. తలపు చిక్కులు విడట్లేదు. మది గందరగోళంగా వుంది. జరగబోయే అనవసర ప్రసంగాన్ని తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తోంది.

ఇంతలో పక్కన నడుస్తున్న దొరబాబు నామధేయుడు అడిగాడు, “పుస్తకం తర్వాత కొందాం. పక్కనే ఉపహారదర్శినిలో కాఫీ తాగుదామా?” అంటూ.

“నాక్కాఫీ అలవాట్లేదు” అనబోయి అనకుండానే అనుకోకుండానే తలూపి, పక్కనే వున్న ఉపహారదర్శినిలోకి గబగబా వెళ్ళి ఎదురెదురుగా కూర్చోవడానికిమాత్రమే వీలుగా వున్న ఒక రెండు కుర్చీల టేబుల్ దగ్గర కూర్చునేసింది.

ఒక్క నిమిషం అమ్మాయి కదిలిన వేగానికి ఆశ్చర్యపోయినా, అలా ఎందుకు చేసిందో అర్థమవడానికి ఆట్టే సమయం పట్టలేదు దొరబాబుకి. అల్లాంటి టేబుల్ అదొక్కటే మిగిలింది. మిగిలినవి పక్కపక్కన కూర్చునే వీలున్న booth-tables మరి.

తనకో కప్పు కాఫీ, కాఫీ వద్దన్నఅమ్మాయికో కప్పు పాలు తెమ్మని చెప్పి, ఈలోగా అమ్మాయితో మాటలు కలిపాడు దొరబాబు.

“ఏం చేస్తున్నారిప్పుడు?”

“ఫైనలియర్ ప్రాజెక్ట్”

“ఎందులో?”

“అంటే?”

“అదే, ఏ లాంగ్వేజ్ లో?”

“సి++”

“హి హి హి ”

“ఏం నవ్వుతున్నారు?”

“ఏం లేదూ, మా ఆఫీసులో నేను ఇంటర్వ్యూలు చేస్తూ వుంటాను. ఇదిగో ఇలాగే మీలాగే C ఒచ్చూ, ఇంకోటొచ్చూ అనుకుంటూ వస్తారు. తీరా ఓ రెండు ప్రశ్నల తర్వాత తెలుస్తుంది చెప్పినంత ఏదీ రాదనీ”

“నేను అలా ఉద్యోగాల కోసం వచ్చే రకం కాదు లెండి”

“అదేం? చదువుకుంటున్నారు. పైగా ప్రొఫెషనల్ కోర్స్. ఉద్యోగం చేయరా?”

“నాకు ఒకళ్ళు చెప్పే మాట వినడం అలవాటు లేదు. ఉద్యోగం నా ఒంటికి పడదు”

ఇంతలో కాఫీ కప్పు, పాలకప్పు పట్టుకుని సర్వరుగారు హాజరు.

కాఫీ తాగుతూ “అంటే, ఎవరి మాటా వినరా?”

“వినను”

“మీ మంచి కోసం చెప్పినా వినరా?”

“ఉహూ!”

“అంటే, ఇదిగో ఈ కాఫీ కప్పుంది. ఇలా టేబుల్ మీద పెడ్తాను. చేయి తగిలితే కాఫీ ఒలికిపోతుంది, జాగ్రత్త అని చెప్పాననుకోండి…” ఇంకా అతని మాట పూర్తి కానే లేదు-

చివాలున లేచి “చేయి తగిలించి పారబోసి, ఒలికిపోయిన కాఫీని తుడిచి శుభ్రం చేస్తాను” అంటూ విసవిసా నడిచిపోతున్న అమ్మాయిని చూస్తుంటే అతని మదిలో మెదిలిన పాట, అప్పుడెప్పుడో అమ్మాయే పేరడీ కట్టిన పాట-

మాట కరుకు గుమ్మ ఇదీ, మౌనమైతే మేలు అదీ
అందరాని కొమ్మ ఇదీ, అందమంటే ఒప్పదిదీ…

**** (*) ****4 Responses to అందరాని కొమ్మ

 1. Giri
  January 9, 2018 at 4:42 am

  A simple storyline of an incident in a young woman’s life.
  But, the detailed descriptions of background sceneries and every small expression or emotion of characters conveyed so beautifully and subtly in small and simple dialogues laced with subtle humour reminded me of a good Hollywood film or a good English novel.
  A very different and unique style in narration. Good read. Best regards.

  • March 1, 2018 at 6:38 am

   థాంక్స్ గిరి గారు !

 2. Aparna
  February 28, 2018 at 11:03 pm

  అందరాని కొమ్మ సూపర్! ఎవరికి అందుతుందో కూడ రాస్తే బాగుంటుంది.. ఎండ్ డిటెయిల్డ్ డిస్చ్రిప్షన్ నేచర్ గురించి అదిరిపోయింది .. మళ్ళీ మళ్ళీ చదివాను పిక్చరైజ్ చేసుకొని – పెయింటింగ్ వేసేయాలనిపించే మోటివేషన్ గా ఉంది.

  • March 1, 2018 at 6:40 am

   థాంక్స్ అపర్ణ

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)