కవిత్వం

నీ వెనుక నేను

జనవరి 2018

1

చేరుకోలేని దూరమేం కాదు. చెయ్యేస్తే అందేంత!
నేను నీ వెనుకే ఉన్నాననీ
ఒక పిలుపుని రబ్బరులా కొద్దిగా సాగదీస్తే చాలనీ
నాకు తెలియదా ఏమిటీ?

2

అయినా నువ్వెందుకు చూడాలనుకుంటావు
అలా చూడాలంటే
పొలంపనిచేస్తూ పల్లెతల్లి చంటిబిడ్డని కట్టుకున్నట్టు
నా వీపుకు సూర్యుణ్ణి కట్టేసుకోవాలి
చంద్రుడు నా నుదుటి మీద నిద్రపోవాలి
వందతోటల పూల పరిమళం ఏకకాలంలో
నా దేహాఛ్ఛాదన కావాలి

అవుతుందా అలా?

3

ఒక చెట్టుకీ తన కడుపులో దాగిన పిట్ట గురించి తెలియనట్టు
నీ నీడ గురించి నీకు తెలియదు చూశావా?